Friday, December 25, 2009

తెలంగాణా, ఆంధ్ర లకూ - తూర్పు, పశ్చిమ జర్మనీ లకూ మధ్య నున్న తేడా ...



తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సమస్య గురించిన చర్చల్లో తరచూ తూర్పు పశ్చిమ జర్మనీల ప్రస్తావన విన వస్తోంది. రెండు జర్మనీల మధ్య నిర్మించిన దుర్భేధ్యమైన బెర్లిన్‌ గోడను కొన్నాళ్ల క్రిందట కూల్చేశారు. అవి రెండూ తిరిగి ఒకే దేశంగా మారిపోయాయి. దేశాలే కలసి పోతుంటే రాష్ట్రాలను విడదీయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలు మొదటి నుంచీ ఒకే (జర్మనీ) దేశంగా వుండేవి. ఇతర దేశాలను కబళించాలని ఉవ్విళ్లూరిన ఆ దేశం రెండో ప్రపంచ యుద్ధంలో తనే మట్టి కరచి నిట్టనిలువునా చీలిపోయింది. ఒక ముక్క అమెరికా ఆధిపత్యంలోకి, మరో ముక్క సోవియట్‌ రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. సొవియట్‌ రష్యా పతనం తరువాత ఆ రెండు ముక్కలూ తిరిగి ఒక్కటయ్యాయి.

జర్మనీ పరిస్థితి వేరు, ఆంధ్ర తెలంగాణాల పరిస్థితివేరు.
ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు ఆది నుంచీ వివిధ రాజుల ఏలుబడిలో... విభిన్న రాజ్యాలుగా వున్నాయే తప్ప సంపూర్ణంగా ఒకే దేశంగాగానీ, ఒకే రాష్ట్రంగా గానీ ఎన్నడూ లేవు.

మరీ ముఖ్యంగా గత మూడునాలుగు వందల సంవత్సరాలు ... ఆంధ్ర ప్రాంతం - బ్రిటీషు పరిపాలన కింద,
తెలంగాణా ప్రాంతం - మహ్మదీయ పరిపాలన కింద వుండటంతో ఈ ఇరు ప్రాంతాల భాషా సంస్కృతులు భిన్నంగా మారిపోయాయి. అభివృద్ధి, చదువు సంధ్యలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, పండుగలు పబ్బాలు, నాగరికత అన్నింటిలో ఎన్నో తేడాలు చోటుచేసుకున్నాయి.

పైకి తెలుగు భాష ఒక్కటే అయినా ఒక ప్రాంతపు యాస మరొక ప్రాంతానికి అర్థంకానంత జటిలంగా తయారైంది. పరస్పర సంబంధాలను పటిష్టపరిచేందుకు భాష ఏమాత్రం దోహదం చేయలేదు. పైగా ఒక ప్రాంతపు యాస అంటే మరొక ప్రాంతానికి ఎంతో చులకన. సినిమాల్లో తమ భాషని కేవలం విలన్లకీ, బఫూన్లకీ పరిమితం చేసి అవహేళన చేస్తుంటే తెలంగాణా ప్రజలు మండిపోవడం, లేదా ఆత్మన్యూనతతో కృంగిపోవడం తెలిసిందే.

ఈ కారణాలవల్ల భాష పేరిట ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలను బలవంతంగా ఏకం చేసినా రెండు ప్రాంతాలూ మానసికంగా ఒకటి కాలేకపోయాయి.
దానికి తోడు ఉద్యోగాలు, వనరులు, నీరు, నిధులు మొదలైన వాటి పంపిణీలో జరిగిన అన్యాయం, వివక్ష; రాజకీయ నాయకుల స్వార్థం, అవకాశవాదం, పక్షపాత ధోరణి, అట్లాగే పత్రికలూ, మీడియా, విద్యారంగం మీద ఒకే ప్రాంతపు గుత్తాధిపత్యం రెండు ప్రాంతాలు ఒక్కటి అ య్యేందుకు వీలు లేకుండా కనిపించని ఇనుప గోడల్ని నిర్మించాయి.

ఇవి ఏకమై అర్థ శతాబ్ధం గడచినా ఆంధ్ర ఆంధ్ర గానే తెలంగాణా తెలంగాణా గానే మిగిలిపోయాయి తప్ప ఒక్కటి కాలేకపోయాయి. పరస్పర అనుమానాలు, అవమానాలు, అవహేళనలు, వివక్ష అట్లాగే కొనసాగుతున్నాయి.

ఈ వాస్తవాలన్నీ విస్మరించి తెలుగు జాతి అనే భావనని ఎంత రాజేసినా ఇవాళ తెలంగాణా ప్రాంతం ఏమాత్రం స్పందించే స్థితిలో లేదు.

ఒక ప్రాంతం మాత్రమే కోరుకుంటే సమైక్యత సాకారం కాదు.
ఉభయ జర్మనీలు రెండూ కోరుకున్నాయి కాబట్టే అక్కడ బెర్లిన్‌ గోడ కూలిపోయింది.

ఇక్కడ భౌతికంగా ఏ గోడా లేకపోయినా రెండు ప్రాంతాలూ ఒకటి కాలేకపోతున్నాయి.
ఈ కనిపించని గోడను కూల్చడం ఇక సాధ్యమయ్యే పనికాదు.

తెలంగాణా తెలుగు జాతిగా కంటే తెలంగాణా జాతిగా మారిపోయింది.
తెలుగు జాతి పేరిట ఆంధ్ర ఆధిపత్యం కింద నలిగిపోవడం కంటే స్వతంత్ర జాతిగా తన ఉనికిని తను, తన అస్తిత్వాన్ని తను, తన ఆత్మగౌరవాన్ని తను కాపాడుకోవాలని తెలంగాణా తహతహలాడుతోంది.

ఈ పరిస్థితిని జర్మనీతో పోల్చడం కంటే, రష్యాలోంచి విడిపోయిన ఉజ్భెకిస్థాన్‌, తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, ఉక్రేనియా, జార్జియా వంటి దేశాలతో పోల్చడం సబబుగా వుంటుంది.
అరవై సంవత్సరాలు అవన్నీ సొవియట్‌ రష్యా పేరిట ఒకే గొడుగు కింద వున్నప్పటికీ ఒకే జాతిగా మాత్రం మారలేక పోయాయి. 60 సంవత్సరాల అనంతరం వేటికవిగా విడిపోయాయి.

జాతులు విముక్తిని కోరుకుంటాయి.
తెలంగాణా కూడా విముక్తిని కోరుకుంటోంది.

కాబట్టి ఆంధ్ర తెలంగాణాలు కూడా విడిపోయి మానసికంగా కలసి వుండేందుకు ప్రయత్నిస్తేనే రెండు ప్రాంతాలకూ మంచిది.
కలసి వుంటే ఒక ప్రాంతానికే సుఖం రెండో ప్రాంతానికి తీరని దుఃఖమే.

కేవలం ఒక్క ప్రాంతం మాత్రమే ఎంత బలంగా కోరుకున్నా అది సమైక్యత కాదు కాక కాదు.
యాసిడ్‌ సీసా చూపించి, దౌర్జన్యం చేసి ఎవరైనా ఎదుటి వ్యక్తి ప్రేమను ఎలా పొందగలరు?

కాబట్టి ఉభయ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం శాశ్వతంగా నెలకొనాలంటే ఆంధ్ర తెలంగాణాలు తక్షణమే విడిపోవాలి.
కావలిస్తే మరో వంద సంవత్సరాల తరువాత ... ఉభయ ప్రాంతాలూ సర్వతోముఖ అభివృద్ధి సాధించిన అనంతరం సంతోషంగా, సమఉజ్జీలుగా మమేకం కావొచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు.
జై తెలంగాణా! జై ఆంధ్రా!

Tuesday, December 22, 2009

తెలంగాణా : గాంధీ, నెహూృల ఆత్మఘోష !



తెలంగాణా : గాంధీ, నెహూృల ఆత్మఘోష !


(... మహాత్మా గాంధీ హఠాత్తుగా నిరాహార దీక్షకు దిగారన్న వార్తతో అంతవరకూ ప్రశాంతంగా వున్న స్వర్గలోకంలో ఒక్కసారిగా అ లజడి చెలరేగింది.
జవహర్‌లాల్‌ నెహూృ హడావిడిగా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని ఇక్కడ కూడా ఇదేం రామాయణమని గాంధీజీని మందలించబోయారు.
'నిరాహార దీక్షే' కాదు ''మౌనవ్రతం'' కూడా చేస్తున్నానని గాంధీజీ సైగ చేయడంతో చేసేదేంలేక ఆయన పక్కనే చేతులు కట్టుకుని కూర్చున్నారు.
ఇరవైనాలుగు గంటల అనంతరం ఆవేశం చల్లారి, మనసు కుదుటపడ్డ తరువాత తనంతటతానుగా దీక్ష విరమించారు గాంధీజీ.
''జవహర్‌'' అని ఆప్యాయంగా పిలుస్తూ నెహూృ భుజం మీద చేయివేశారు. ఆ చల్లని స్పర్శకు పరవశించిపోయారు నెహూృజీ. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది:)

గాంధీ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గొడవను చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది జవహర్‌.

నెహూృ: రాష్ట్ర విభజన తప్పంటారా బాపూ?

గాంధీ:
లేదు జవహర్‌. రాష్ట్ర విభజన అనే అతి చిన్న సమస్యకు - దేశ విభజన స్థాయిలో రెచ్చిపోయి ఇలా దెబ్బలాడుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే కదా!

నెహూృ:
నిజమే బాపూ.

గాంధీ:
కూర్చుని చర్చించుకుంటే - ఒక్క పూటలో తేలిపోయే చిన్న సమస్యకు ఇంత గొడవ దేనికి జవహర్‌? మూర్ఖుల్లా, మొండిగా ప్రవర్తిస్తున్నారేమిటి తెలుగువాళ్లు? ఈ నిరాహార దీక్షల తంతేమిటి? ఈ బందులూ, ఆస్తుల విధ్వంసాలూ, దహనకాండలూ దేనికోసం? ఒకరు విడిపోతామంటుంటే మరొకరు టాఠ్‌ వీల్లేదు సమైక్యంగా మా కింద పడివుండాల్సిందే అనడమేమిటి?

నెహూృ:
అవును బాపూ.

గాంధీ:
మన దేశం పరిథిలో ఎన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడితే మాత్రం ఎవరికేం నష్టం జవహర్‌? ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని సంతోషించాల్సింది పోయి ఇట్లా తన్నుకు చస్తున్నారెందుకు?

నెహూృ: నాకు కూడా అదే అర్థం కావడంలేదు బాపూ. అయితే ఇందులో నా తప్పు కూడా వుంది.

గాంధీ:
నీ తప్పా?!

నెహూృ:
అవును బాపూ! ప్రజల ఆకాంక్షలు విస్మరించి ''తెలంగాణా'' విషయంలోనూ, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోబోయి ''కశ్మీర్‌'' విషయంలోనూ నేను రెండు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. వాటి ఫలితమే ఈ రావణ కాష్టాలు!

గాంధీ: బాధపడకు జవహర్‌. ఆ మాట కొస్తే తెలంగాణా విషయంలో నీతో పాటు నేనూ తప్పు చేశాను.

నెహూృ:
?!

గాంధీ: నిజాం సంస్థానాన్ని భారత జాతీయోద్యమం నుంచి మినహాయించి మనం తెలంగాణా ప్రజలకు దూరంగా వుండటం ఘోరమైన చారిత్రక తప్పిదం కదా.

నెహూృ: నిజమే బాపూ.

గాంధీ: పాపం తెలంగాణా ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో, దొరల రజాకార్ల దుర్మార్గాలకు విలవిల లాడుతున్నా కూడా మనం ఎన్నడూ పట్టించుకోలేదు. వారికోసం ఏ పోరాటమూ చేయలేదు. కనీసం తెలంగాణాలో నేరుగా ఒక్క స్వాతంత్య్రోద్యమ సభ అయినా నిర్వహించలేదు. 1947లో మనం ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నప్పుడు కూడా పాపం తెలంగాణా ప్రజలు తమ విముక్తి కోసం తామే ఒంటరిగా జీవన్మరణ సాయుధపోరాటం చేస్తుండిపోయారు.

నెహూృ:
అవును బాపూ. తెలంగాణా ప్రజలకు మనం మొదటినుంచీ ద్రోహం చేస్తూనే వచ్చాం. వాళ్లు జాగిర్దార్లను, భూస్వాముల్ని ఊళ్లల్లోంచి తరిమేసి లక్షలాది ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుని బడుగు వర్గాలకు చక్కగా పంచిపెడితే మనం సైనిక చర్య పేరిట నిజాంను లొంగదీసుకుని ఆ భూములన్నీ తిరిగి భూస్వాములకే అప్పగించాం. తెలంగాణా ప్రజలను శాశ్వత బానిసత్వంలోకి నెట్టివేశాం.

గాంధీ: తెలంగాణా ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాం నవాబుకు మాత్రం భారత ప్రభుత్వం తరపున ''రాజ్‌ప్రముఖ్‌'' అన్న బిరుదునూ, అతని ఆస్తులకు రక్షణనూ, ఏడాదికి కోట్లాది రూపాయల రాజభరణాన్నీ ఇచ్చి సత్కరించాం. వాడు చచ్చేవరకూ ఊడిగం చేశాం.

నెహూృ: దాస్య విముక్తి అనంతరం కనీసం స్వతంత్ర భారతంలో వాళ్ల హైదరాబాద్‌ రాష్ట్రాన్ని అట్లాగే కొనసాగనివ్వకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో వాళ్లని దెబ్బతీశాం.

గాంధీ: ఇది మాత్రం నువ్వు పూర్తిగా తెలిసి చేసిన తప్పు జవహర్‌.

నెహూృ: ఒప్పుకుంటున్నాను బాపూ. అందుకు నేను కుమిలిపోని రోజంటూ లేదు. ఆంధ్ర నాయకులు చాలా చాల్‌బాజ్‌గాళ్లని నాకు మద్రాస్‌ రాష్ట్ర విభజనప్పుడే తెలిసింది. ఆంధ్ర రాష్ట్రంతో పాటు మాకు మద్రాస్‌లో కూడా భాగం కావాలంటూ పట్టుబట్టి పొట్టి శ్రీరాములును వాళ్లే బలితీసుకుని నన్ను బదనాం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమలోని కర్నూలును రాజధాని చేయడం, దానిని అభివృద్ధిపరచడం కోస్తా నేతలకు ఇష్టంలేకుండేది. వాళ్ల కన్ను అప్పటికే అన్నివిధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం మీద పడింది. దాంతో నానా హంగామా చేసి, మాయమాటలు చెప్పి తెలంగాణా నేతల్నే కాదు నన్ను కూడా బుట్టలో పడేసుకున్నారు.

గాంధీ: వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు కావాలి కదా జవహర్‌. తెలంగాణా నిజాం పాలనలో భూస్వాములు, పటేల్‌ పట్వారీలు, అగ్రకులాల దాష్టీకంలో నలిగి పోయివుంది. సామాన్య జనం సర్వభ్రష్టులై పోయి వున్నారు. చదువు సంధ్యలు లేక, ఆర్థికంగా కుంగిపోయి తెలంగాణా ప్రజలు అ ల్లాడుతున్నారు. అట్లాంటి వాళ్లకు ఎదిగేందుకు చేయూత నివ్వాల్సిందిపోయి ...

నెహూృ:
తప్పు చేశాను బాపూ, తప్పు చేశాను. ఫజల్‌ అ లీ కమిషన్‌ మొత్తుకుంటూనే వుంది. అయినా పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ రూల్స్‌, ముఖ్యమంత్రి - ఉపముఖ్యమంత్రి పదవులు అంటూ నానా నక్కవినయాలూ ప్రదర్శించి నన్నే మోసం చేశారు. ఆనాడే అన్నాను బాపూ ... ''ఒక కొంటె కుర్రాడి చేతిలో అమాయకురాలైన అమ్మాయిని పెడుతున్నాం. వాళ్ల సంసారం ఎలా సాగుతుందా అని భయంగా వుంది. ఒకవేళ పొరపొచ్చాలొస్తే సామరస్యంగా విడిపోవాలి.'' అని కానీ వింటేనా. 1969లో పెద్ద ఎత్తున గొడవ చేసినా 370 మందిని చంపి మరీ తెలంగాణా ప్రజల ఆకాంక్షని, అస్తిత్వ ఆరాటాన్ని అణిచివేశారు. తిరిగి ఇవాళా అదే పని చేస్తున్నారు.

గాంధీ:
కాంగ్రెస్‌ పార్టీ 2004 నుంచీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి మరీ తెలంగాణాకు అనుకూలంగా వాగ్దానాలు చేస్తూనే వుంది. తెలుగుదేశం కూడా తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రజారాజ్యం పార్టీ కూడా సామాజిక తెలంగాణా అంది. మీరు తీర్మానం పెట్టండి మేం బలపరుస్తాం అంది. అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలూ బాహాటంగా హామీలు గుప్పించాయి. సోనియా గాంధీకి నిర్ణయాధికారాన్ని అప్పగించాయి. తీరా నిర్ణయం ప్రకటించగానే అన్ని పార్టీలూ రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించి సమైక్య రాగాలాపన చేయడం నయవంచన కదా జవహర్‌. నేను ఆనాడు సత్యం కోసం ఎంత తపించాను.

నెహూృ: ఇప్పుడు సత్యం ఎక్కడ వుంది బాపూ. దేశం అంతా స్వార్థంతో, లంచగొండి తనంతో అన్యాయాలతో లుకలుక లాడుతోంది. రాజకీయాలు లత్తకోరు వ్యాపారంగా మారాయి. ఎవ్వడూ మాట మీద కట్టుబడి వుండడం లేదు. జెండాలు వేరైనా అందరి ఎజెండాలు ఒక్కటే అదే స్వార్థం.

గాంధీ: మరి ప్రజలు ఈ అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని ఎందుకు ఎదిరించడంలేదు? నిన్నటి వరకు తెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలు చేసి ఇప్పుడు సమైక్యత గురించి చిలుకు పలుకులు పలుకుతుంటే ఎందుకు నిలదీయడం లేదు?

నెహూృ: ఈ విష సంస్కృతికి చాలామంది బానిసలై పొయారు బాపూ. అందుకే చెడు అని తెలిసినా తమ స్వార్థానికి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు సిగ్గుఎగ్గులేకుండా సమర్థిస్తున్నారు. మొండి వాదనలు చేస్తున్నారు. గుండాయిజమే నేటి నిజంగా మారిపోతోంది. మీరు చూపిన నిరాహార దీక్షలు దుర్మార్గుల, మూర్ఖుల, అవినీతిపరుల, అక్రమార్కుల చేతుల్లో శకుని పాచికల్లా మారి అపహాస్యం పాలవుతున్నాయి.

గాంధీ:
అవును జవహర్‌. నిన్న ఖద్దరు ధరించి జాతీయ జండా పట్టుకుని విజయవాడలో హైక్లాస్‌ నిరాహారదీక్షా ప్రహసనాన్ని కొనసాగించి... ఇవాళ హఠాత్తుగా జండా లేకుండా జర్కిన్‌ ధరించి దొంగలా నిమ్స్‌లో దూరిన లావుపాటి నా అనుచరుణ్ని చూసిన తరువాత నా మనసు వికలమయ్యే నేను ఇందాక దీక్ష చేశాను. అట్లాంటి వ్యక్తులకు కూడా జనం జై కొట్టడం, అతని తరపున సిగ్గులేకుండా నిలబడటం, వాదించడం చాలా మనస్తాపం కలిగిస్తోంది.

నెహూృ: ఆనాడు మీరు హింసా మార్గం అవలంభించాడని భగత్‌ సింగ్‌ అంతటి వాణ్నే ఖండించారు. కానీ ఇప్పుడు ఎవ్వరిలోనూ అట్లాంటి నిజాయితీ, ధైర్యం లేవు బాపూ.

గాంధీ: ఇలా అయితే నా దేశం ఏమైపోతుంది జవహర్‌.

నెహూృ:
ఇంక మీరు అటు వైపు తొంగి చూడకండి బాపూ. నేను కూడా చూడను. చూస్తే అక్కడి అమాయక జనంలా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే గుండె ఆగి అర్థంతరంగా చావాల్సి వస్తుంది!

గాంధీ:
అంతేనంటావా జవహర్‌.

నెహూృ: అంతే బాపూ.

...........

ఈశ్వర్ అల్లా తేరే నామ్
సబ్ కో సన్మతి దే భగవాన్
సారా జగ తేరీ సంతాన్
ఇస్ ధర్తీ పర బస్ నే వాలే
సబ్ హై తేరీ గోద్ కే పాలే
కో ఈ నీచ కో ఈ మహాన్
సబ్ కో సన్మతి దే భగవాన్ ...



......................

Sunday, December 20, 2009

ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులంతా కలిసి పాల్గొన్న అపూర్వ ఉద్యమం!


ఒకప్పుడు సామాజిక సమస్యల పట్ల విద్యార్థిలోకం ఎంతో చురుకుగా స్పందించేది. ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించినా, పాల ధరను పెంచినా, సమాజంలో ఇంకే సమస్య తలెత్తినా ముందుగా విద్యార్థులే ఉద్యమించేవారు. 1960లలో, 1970లలో ఈ పరిస్థితి ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కనిపించేది. ఫ్రాన్స్‌లో 1968లో ప్రజా వ్యతిరేక చార్లెస్‌ డిగాల్‌ ప్రభుత్వాన్ని గద్దె దించిన ఫ్రెంచి విద్యార్థుల ఘనత అందరికీ తెలిసిందే.

ఆ తరువాత క్రమేణా ప్రైవేటీకరణ, సాఫ్ట్‌వేర్‌ రంగం, కెరీరిజం పెరుగుతూ పోవడంతో విద్యార్థులలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత స్థానంలో స్వార్థం, వ్యక్తిగత అభివృద్ధిపై ఆసక్తి పెరిగిపోయాయి. దాంతో బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, కాలేజీ ఫీజులు ఎన్నిసార్లు ఎంతగా పెరిగినా విద్యార్థుల నుంచి చెప్పుకోతగిన స్థాయిలో ప్రతిఘటనలు చోటు చేసుకోవడం లేదనే చెప్పాలి.

విచిత్రంగా ఇన్నాళ్ల తరువాత విద్యార్థులు మళ్లీ ఇప్పుడు ''ప్రత్యేక తెలంగాణా'', ''సమైక్య ఆంధ్ర'' ఉద్యమాల్లో తమ చదువులను పణంగా పెట్టి మరీ పాల్గొంటున్నారు. అనేక త్యాగాలు చేస్తున్నారు. అయితే విద్యార్థులు ప్రాంతాల వారిగా రెండు వర్గాలుగా విడిపోయి చేస్తున్న ఉద్యమాలివి.

ఉమ్మడి ఉద్యమం


1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్టం ఏర్పడిన తరువాత మొత్తం అన్ని ప్రాంతాల విద్యార్థులు కలసికట్టుగా చేసిన ఉద్యమం ఏదైనా వుందా?
వుంది.
అది 1966 లో సాగిన ''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు'' ఉద్యమం.
అందులో ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులు, వరంగల్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన తీరు అపూర్వమైనది.

ఆ తరువాత 1969లో ''ప్రత్యేక తెలంగాణా'' ఉద్యమం, 1972లో ''జై ఆంధ్ర'' ఉద్యమం వచ్చాయి. వాటిలోనూ విద్యార్థులే
కీలక పాత్ర పోషించారు... కానీ ప్రాంతాల వారిగా విడిపోయి!
ఇవాళ కూడా మళ్లీ అదే పరిస్థితి.

1966లో విద్యార్థులంతా ఉమ్మడిగా చేసిన ''విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'' ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. ఆ
తరువాత ప్రాంతాల వారిగా సాగిన పై రెండు ఉద్యమాలూ రాజకీయ నాయకుల స్వార్థం, మోసం కారణంగా విఫలమయ్యాయి.

ఇప్పుడు కూడా రెండు ప్రాంతాల ఉద్యమాల్లోనూ రాజకీయ అవకాశ వాద పోకడలు ఆదినుంచే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోతారా లేక వారికి బుద్ధి చెబుతారా వేచి చూడాల్సిందే.

ఒకే సమస్యపై సాగుతున్న రెండు భిన్న ఉద్యమాలివి.
ఒక ప్రాంత ఉద్యమ లక్ష్యం - మరో ప్రాంత ఉద్యమ లక్ష్యానికి పూర్తిగా వ్యతిరేకం!
న్యాయం ఏదో ఒక వైపే వుంటుంది!
రెండు పక్షాల వాదనలూ న్యాయమైన వయ్యేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. సెంటిమెంట్లు సమస్యను జటిలం చేస్తాయి తప్ప పరిష్కరించలేవు.
మరి ఎవరి వాదన... ఎవరి డిమాండు సరైనది?
ఎవరిది కాదు??
ఒక పక్షం వాదన న్యాయమైనదని తేలితే మరో పక్షం ఆ తీర్పును అంగీకరించి హుందాగా ఉద్యమాన్ని విరమించుకుంటుందా?

ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ఎవరు తేలుస్తారు?
నీతి నిజాయితీ లేని, నిలకడలేని, మాటకు కట్టుబడతారన్న నమ్మకంలేని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులా?
లేదు. వారి వల్ల ఏ సమస్యకూ న్యాయమైన పరిష్కారం లభించదు.
మరి ఎవరు?
ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థులే ఈ సమస్యకు స్వయంగా ఎందుకు పరిష్కారం కనుగొనకూడదు?

రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, అతీతంగా మూడు ప్రాంతాల విద్యార్థి (జెఎసి) నాయకులే ముందుకు వచ్చి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకుని లోతుగా చర్చించి న్యాయాన్యాయాలు తేల్చవచ్చు కదా.

విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మేం కేవలం వారిని అనుసరిస్తున్నాం అని దొంగ మాటలు చెబుతున్నారు కొందరు రాజకీయ నాయకులు.

వారి మాటలను నిజం చేస్తూ - అన్ని ప్రాంతాల విద్యార్థులు విజ్ఞతగా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన వచ్చు కదా?

విద్యార్థుల తలచుకుంటే ఇదేమంత అసాధ్యమైన విషయం కాదు.
రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్రాల పునర్విభజన అనేది దేశ విభజనంత జఠిలమైన సమస్య కాదు కదా!

స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి.
అవి సామరస్యంగా కలిసి ముందుకు సాగుతున్నాయి కూడా.
మన కెందుకు సాధ్యం కాదు?
తప్పకుండా సాధ్యమవుతుంది.

ఇరుపక్షాల వద్ద కావలసినంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ వుంది.
విశాల హృదయంతో, నిష్పక్షపాతంతో, విజ్ఞతతో చర్చించ గలిగితే ఒక వారంలో, లేదంటే ఒక మాసంలో ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన సమస్యను విద్యార్థులే కనుగొని చరిత్ర సృష్టించవచ్చు!
ఉద్యమాలతో, బందులతో, విద్వేషాలతో, రాజకీయ కుట్రలతో కుతకుత లాడుతున్న రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు శాంతిసౌభాగ్యాలను ప్రసాదించవచ్చు.
ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులారా ఆలోచించండి.
ఫ్రాన్స్‌ విద్యార్థుల్లా మరో చరిత్ర సృష్టించండి!

Thursday, December 17, 2009

అన్నదమ్ముల్లా కలసీ వుండలేం...అన్నదమ్ముల్లా విడిపోనూలేం! ... వహ్వా తెలుగువాడా!!

...



''మనవాళ్లు (తెలుగువాళ్లు) ఉఠ్ఠి వెధవాయిలోయ్‌...'' మహాకవి గురజాడ వందేళ్ల క్రిందట అన్నమాట యిది. అదేమాటని ఇవాళ యావద్భారతదేశం అనేలా వుంది!

కాంగ్రెస్‌, తెలుగుదేశం, ప్రజారాజ్యం తదితర పార్టీలన్నీ నిన్న మొన్నటి వరకూ ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమే అంటూ వచ్చాయి. తమ ఎన్నికల మానిఫెస్టోల్లో కూడా ఈ అంశాన్ని చేర్చాయి. ఎన్నికల ప్రచారంలో తెలంగాణా ప్రజలకు వాగ్దానాలు చేశాయి. ప్రత్యేక తీర్మానాలు చేశాయి.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్షసమావేశంలో సైతం ''మీరు అసెంబ్లీలో తెలంగాణా తీర్మానం పెట్టండి. మేం సమర్ధిస్తాం'' అని చేతిలో చెయ్యేసి మరీ చెప్పాయి. (ఎట్లాగూ వాళ్లు పెట్టేదీ లేదు-మేం సమర్థించేదీ లేదు అన్న ధీమా కాబోలు. అందుకే ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఆ తతంగం చాలాకాలంగా జరుగుతున్నా మీరు అట్లా తీర్మానాలు ఎట్లా చేస్తారు అని అడగలేదు).

ఆ మాటలు నమ్మి కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధపడిందో లేదో ఒక్కసారిగా పార్టీలన్నీ ఇన్నాళ్లుగా తాము కప్పుకున్న తెలంగాణా సానుకూల ముసుగును తీసి అవతల పారేసి సమైక్య ... తెలంగాణా వ్యతిరేక విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి.

రాజకీయమా నీ పేరు అవకాశ వాదమా?
అవకాశవాదమా నీ పేరు రాజకీయమా??
మాటతప్పే వాడే - మాట మార్చేవాడే నేటి హీరోనా???!!!

తెలంగాణా పట్ల 1956 నుంచీ ఆంధ్ర రాజకీయ నాయకులు ఇట్లాగే ''పైకి ఒకటి లోపల ఒకటి''గా వ్యవహరిస్తూ తెలంగాణా ప్రజలను వంచిస్తూ వస్తున్నారు.

''పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీనిబంధనలు, ఆరు సూత్రాల పథకం, ఎన్‌టీఆర్‌ జారీ చేసిన 610 జీవో, వైఎస్‌ఆర్‌ అట్టహాసంగా నిధులూ అధికారాలూ ఇవ్వకుండా ఉప్పునూతలకు క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చి మరీ నెలకొల్పిన ''తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలి'' ఇట్లా ఎన్నైనా ఉదాహరణలు పేర్కొనవచ్చు.

ఇప్పుడిక ఏ హామీలిచ్చినా తెలంగాణా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఆంధ్ర రాజకీయ నేతలంటేనే తెలంగాణా ప్రజలకు ఎలర్జీ ఏర్పడింది.
ఇన్నాళ్లూ అమ్ముడు పోతూ వచ్చిన తెలంగాణా నేతలు కూడా ఇప్పుడు సిగ్గుపడుతున్నట్టనిపిస్తోంది.

సామ, దాన, భేదోపాయాలన్నీ అయిపోయాయి !
ఇక మిగిలింది దండోపాయమే !!
కాబట్టి బలప్రయోగంతోనైనా సరే సమైక్యతను కాపాడాలనే మొండితనంతో .... ప్రపంచంలో ఎక్కడా లేని '' బలవంతపు సమైక్యతా '' ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు!

ఉత్తరాంధ్ర నిరుపేద బామ్మగారు కూడా ఈ ఉద్యమాన్ని అధర్మం, అన్యాయం అంటోంది.! (జాజిమల్లి బ్లాగు http://jajimalli.wordpress.com చూడండి)

... '' ఆళు...మీ తోటి ఉండమని తెగేసి సెప్పేస్తంటే... ఈళే టొలే వదలవంటున్నారు. ఈ బావులు సేస్తన్న పని నాకేటి బావులేదు ''


శకుని పాచికల మోసానికి బలై శిక్షను పూర్తిగా అనుభవించి, అన్ని రకాల వేధింపులను భరించి మరీ వచ్చి ఒప్పందం ప్రకారం మా రాజ్యం మాకివ్వండని పాండవులు మర్యాదగా అడిగినప్పుడు ధుర్యోధనుడు ఇవ్వనిరాకరించినందువల్లే నాడు కురుక్షేత్ర సంగ్రామం సంభవించిన సంగతి మనకు తెలుసు.

ఇప్పుడు తెలంగాణా ప్రజల న్యాయమైన డిమాండ్‌ కూడా ఆనాటి లాగే మరో కురుక్షేత్రం వైపే వెళ్తోందా? ఎందుకు, ఎవరికోసం, ఎంతమంది అమాయకులు బలికావాలి? ఎవరి మానాన వారు బతకడానికి అభ్యంతరం ఎందుకు? ఏ రాష్ట్రం ఏర్పడినా జరగని దిక్కుమాలిన సంత ఇక్కడే ఎందుకు జరుగుతోంది?

ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గమే లేదా ....?
ఆంధ్ర తెలంగాణాలు సామరస్యంగా విడిపోయే అవకాశమే లేదా....?
మరో కురుక్షేత్ర సంగ్రామాన్ని నివారించే ఉపాయమే లేదా.........?



.........

Monday, December 14, 2009

తెలంగాణా వద్దు - సమైఖ్య ఆంధ్ర ముద్దు : ఒక పాట ……



తెలంగాణా వద్దు - సమైఖ్య ఆంధ్ర ముద్దు : ఒక పాట ……

సమైక్యత ఆవశ్యకతను చాటుతూ నిన్న (2009 డిసెంబర్‌ 13) సాయంత్రం నుంచీ దాదాపు అన్ని ఛానెళ్లలో ఒక పాట ప్రకటన రూపం లో పదేపదే వినిపిస్తోంది.. అనేకవిధాలుగా ఆలోచింప జేసేదిగా వున్న ఆ పాట:

ఓయి తెలుగు వాడా...

ఓయి తెలుగు వాడా!
పద అదే వెలుగు వాడ
మన కలల పసిడి మేడ
తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...

ఇటురా ఓ సోదరుడా
ఓ నా చెలికాడా
ఇటురా ఓ సోదరుడా
ఓ నా చెలికాడా

మనదే ఈ పెద్ద చెట్టు
ఈ చల్లని నీడ ........ మనదే ...

ఆంధ్ర, సీమ, తెలంగాణ
ఒక్కొక్కొ టొక ఊడ
ప్రతి ఊరూ, ప్రతి పల్లె
తెలుగు చెట్టు కాడ

పట్టిచ్చా వనుకో ఇపుడూ
''వేరుపాటు చీడ''
ఇంకేమున్నది?
ఏమున్నది??
ఏమున్నది???
ఏమున్నది .... ????

ఓయి తెలుగు వాడా!
పద అదే వెలుగు వాడ
మన కలల పసిడి మేడ
తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...

జాతి మహా యాత్ర
ఇలా సాగే పోవాలి గాని
నడుమన మన అడుగులు
తడబడి పోతే
నడకలలో వడి పోతే
మనకు మనకు చెడి పోతే
గొంతుకలన్నీ విడి పోతే
కలయిక సందడి పోతే
ఒక స్నేహపు ముడి పోతే ... చెడి పోతే ...

ఏమున్నది?
ఏమున్నది?
ఏమున్నది?
ఏమున్నది?

ఓయి తెలుగు వాడా!
పద అదే వెలుగు వాడ
మన కలల పసిడి మేడ
తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...

తగదింటి నడుమ గోడ
తగదింటి నడుమ గోడ.....!

…………………………………………………………………..

వింటూ రాసుకోవడంలో ఏవైనా పొరపాట్లు దొర్లివుంటే సరిదిద్ద గలరు.
మరో మాట సమైఖ్య - సమైక్య వీటిలో ఏది సరైన పదం?



……………………………………………………………………

Sunday, December 13, 2009

ప్రత్యేక తెలంగాణా - ప్రజాకవి కాళోజీ కవితలు



ప్రత్యేక తెలంగాణా - ప్రజాకవి కాళోజీ కవితలు

ఉస్మానియా విద్యార్థులు 1969లో వీరోచితంగా సాగించిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో ప్రజాకవి కాళోజీ అనేక ఉత్తేజకరమైన కవితలు రాశారు. నలభై సంవత్సరాల అనంతరం ప్రధానంగా అదే విద్యార్థుల పోరాట స్ఫూర్తి కారణంగా ప్రత్యేక తెలంగాణా స్వప్నం సాకారం కాబోతున్న తరుణంలో ఒకసారి వాటిని స్మరించుకుందాం.

తెలంగాణ వేరైతే


తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
...............

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి
....................

నిర్వాకం


నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి
................

పోదాం పదరా!!

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా || పదరా ||

షాట్లకు బెదరక చెదరక పదరా
హిరణ్యకశిపుడు హడలగ పదరా
నర్సింహుడవై ముందుకు పదరా
పదరా పదరా … || పదరా ||

అధికృత హింసనే పాలన అంటే
ప్రహ్లాదుని హేళన చేస్తుంటే
ప్రత్యక్షంగా నర్సింహులమై
ప్రతిహింసకు పాల్పడదాం || పదరా ||

హిరణ్యకశివుల పొట్టలు చీల్చి
ఫెగుల మాలలు చేద్దాం పదరా
పదరా పదరా ….

వేర్పడదామని ఇద్దరికుంటే
కాదను వారిని కాలదన్నమా
వేరే రాజ్యం చేయబూనమా
పదరా పదరా …..

–కాళోజి
................

నాగరికుడా ‘విను’...

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
నలుబదైదు సంతకాల
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్

-కాళోజి
.............

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
............

ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం

చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు
ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.

–కాళోజి
.................

సాగిపోవుటె బ్రతుకు...

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి
...............

ప్రజా కవి కాళోజీ వెబ్ సైట్ సౌజన్యంతో . మరిన్ని కాళోజీ కవితలకు సందర్శించండి
http://kaloji.wordpress.com/
ప్రజా కవి కాళోజీ

Saturday, December 12, 2009

తెలంగాణా ప్రజల మనోభావాలకు విలువ లేదా? ...



అత్యధిక తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనీ, తమ భాషా సంస్కృతులనూ, చరిత్రనూ పదిలంగా కాపాడుకోవాలనీ తహతహలాడతారు. 1956 కు ముందు నుంచే వారిలో ఈ స్వాభిమాన భావన బలంగా వుంది.

తెలంగాణా సామాన్య ప్రజానీకం1948కి పూర్వమే నిజాం నవాబుకూ, దొరలకూ, జాగిర్దార్లకూ వ్యతిరేకంగా మహత్తరమైన సాయుధ రైతాంగ పోరాటం సాగించింది. తెలంగాణా చరిత్రలోనే కాదు ప్రపంచ భూస్వామ్య వ్యతిరేక ప్రజాపోరాటాలలో అదొక ఉజ్వల ఘట్టం.

ఆ పోరాటం విజయవంతమవుతున్న దశలో 'సైనిక చర్య' జరిగి తెలంగాణా ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు జల్లింది. తెలంగాణా ప్రజలు ఏ వ్యవస్థ వద్దని తమ ప్రాణాలకు తెగించి పోరాడారో తిరిగి ఆ దుర్మార్గపు భూస్వామ్య వ్యవస్థే వారి మీద బలవంతంగా రుద్దబడింది.

తెలంగాణా ప్రజల మనోభావాలకు తగిలిన మొదటి శరాఘాతం అది.


ఊళ్లల్లోంచి పారిపోయిన దొరలే షేర్వానీలు, రూమీ టోపీలు విసర్జించి ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలు ధరించి రాజకీయనాయకులై మళ్లీ తెలంగాణా ప్రజానీకం నెత్తి మీద కూచున్నారు. తెలంగాణా దొరలకు తమ స్వార్థమే తప్ప తెలంగాణా ప్రజల బాగోగులు ఎప్పుడూ పట్టవు. అందుకే తెలంగాణా నాయకత్వం ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రజానీకాన్ని తనే వంచిస్తూ వస్తోంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గ్రహించకుండా నాటి తెలంగాణా నాయకత్వం 1956లో తెలంగాణాను తీసుకెళ్లి ఆంధ్రాలో (గంగలో) కల్పింది. తెలంగాణాకు మరోసారి బానిస సంకెళ్లు వేసింది.

తెలంగాణా ప్రజల మనోభావాలకు తగిలిన రెండవ శరాఘాతం అది.


ఉమ్మడి రాష్ట్రంలో తొలి రోజునుంచే చేసుకున్న ఒప్పందాలనన్నింటినీ ఆంధ్ర నేతలు ఉల్లంఘించడం మొదలుపెట్టారు. అయినా తెలంగాణా నేతలు తమ పదవులు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ వుండిపోతూ వచ్చారు.1969 లో తెలంగాణా విద్యార్థులు ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమించినప్పుడు చెన్నారెడ్డి వంటి (భూస్వామ్య) నేతలు ఉద్యమాన్ని హైజాక్‌ చేసి తమ పదవులకోసం టోకున ఆంధ్ర నేతలకు అమ్మేశారు.

తెలంగాణా ప్రజల మనోభావాలకు తగిలిన మూడవ శరాఘాతం అది.

ఆంధ్ర పాలకులు తెలంగాణా సమస్య ఎప్పుడు తెరమీదకు వచ్చినా ఏవో ''ఆపద మొక్కుల'' వంటి ఒప్పందాలు, వరాలు, ఫార్మూలాలు, జీవోలు ప్రసాదించి ఆ తర్వాత ఉద్యమ వేడి చల్లారగానే వాటిని బుట్ట దాఖలు చేయడం అ లవాటుగా మారింది. ఆ మోసాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న తెలంగాణా ప్రజలు ప్రత్యేక తెలంగాణా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తీర్మానించుకున్నారు. అందుకు ఉవ్వెత్తున ఉద్యమించారు. ఎన్నాళ్లనుంచో కంటున్న తమ అస్తిత్వ కల నిజమవబోతున్న ఈ వేళ దానిని ఛిద్రం చేసేందుకు మళ్లీ ప్రతీప శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ దిశలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే తెలంగాణా ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి.

తెలంగాణా ప్రజలు తమ కష్టం తమకు దక్కాలని కోరుకునే వారే తప్ప ఇతరుల కష్టం దోచుకొవాలనుకునేవారు కాదు. వారు తమ రాష్ట్రం తమకు కావాలని వాంఛిస్తున్నారే తప్ప ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవాలనుకోవడం లేదు.

తెలంగాణా ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద ద్వేష భావం లేదు.
ఆంధ్ర ప్రజలకే తెలంగాణా ప్రజల మీదా వారి భాషా సంస్కృతుల మీదా చాలా చులకన భావం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, విద్య తదితర అన్ని రంగాలలో తెలంగాణా ప్రజలు అడుగడుగునా దారుణమైన అన్యాయానికి గురయ్యారు.
ఇందుకు కావలసిన వివరాలు అనేక తెలంగాణా వెబ్‌సైట్లలో చూడవచ్చు. వాటిని ఇక్కడ పేర్కొనడం చర్విత చర్వణమే అవుతుంది.

తెలంగాణాకు తెలుగు తల్లి మీద ద్వేషం లేదు.
పొట్టి శ్రీరాములు త్యాగం మీద ద్వేషం లేదు.
ఆంధ్ర శబ్దం మీద ద్వేషం లేదు.
ఆంధ్ర సామాన్య ప్రజల మీదా ద్వేషం లేదు.
ఇటీవల జరిగిన సంఘటనలన్నీ ఉద్యమం ఉధృతంగా సాగేప్పుడు కొందరు ఆవేశపరులు చేసినవే తప్ప మరొకటి కాదు. ఏ ఉద్యమంలోనైనా అట్లాంటి సంఘటనలు, మాటలు, పదజాలం అత్యంత సహజం. స్వప్నం సాకారమై, ఆవేశకావేశాలు తగ్గిన తరువాత ఇట్లాంటివి ఇక కనిపించనే కనిపించవు.

తెలంగాణా అంటేనే తెలుగు వాళ్లు నివసించే చోటు అని అర్థం. (ఆణెము=నివాసము). అట్లాగే ఆంధ్ర శబ్దం తెలంగాణాలోనే మొదటినుంచీ విస్తృతంగా వాడకంలో వుంది. అంతెందుకు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి బీజం వేసిన ''సంఘం'' పేరే ''ఆంధ్ర మహాసభ''. అట్లాగే " ఆంద్ర జనసంఘం " , ''ఆంధ్రోద్యమం'' " ఆంద్ర సారస్వత పరిషత్తు " వంటి ఇతర సంఘాలు ఎన్నో నిజాం సంస్థాన కాలంలో వుండేవి. గ్రంథాలయోద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో (కోఠీ సుల్తాన్‌ బజార్‌) అ లనాడు స్థాపించిన గ్రంథాలయం పేరు ''శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం ''. అట్లాగే వరంగల్లు (హన్మకొండ)లోని అ లనాటి గ్రంథాలయం పేరు ''రాజరాజ నరేంద్ర గ్రంథాలయం''. అవి ఇప్పటికీ వున్నాయి.

1956 తర్వాత సమైక్యత పేరుతో ఆంధ్ర రాజకీయ నాయకులు చేస్తూ వచ్చిన అన్యాయాలు, కుత్సితాల మూలంగానే తెలంగాణాలో తెలుగుతల్లి అన్నా,'' ఆంధ్ర '' పదమన్నా ఒకవిధమైన అ లెర్జీ ఏర్పడింది. అందుకు ఆంధ్ర రాజకీయ నేతల్నే నిందించాల్సి వుంటుంది తప్ప తెలంగాణా ప్రజల్ని కాదు. అయినా ఆంధ్ర రాష్ట్రం - తెలంగాణా రాష్ట్రం విడిపోయిన తరువాత ఇట్లాంటి చిన్న చిన్న అ ల్లరి చిల్లరి పనులేమీ మునుముందు వుండవు. అందరూ అన్న దమ్ముల్లా కలిసి మెలసి వుంటారు.

తమ రాష్ట్రం తమకు కావాలనేది తెలంగాణా ప్రజల న్యాయమైన కోరిక.
చాలా చిన్న ప్రజాస్వామిక కోరిక.
ఇందులో సామ్రాజ్యవాద దృక్పథంలేదు.
ఏ దోపిడీ కుతంత్రమూ లేదు.
ఇది మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల 40 సంవత్సరాల పోరాట దీక్ష.

తెలంగాణా ప్రజల తరతరాల స్వప్నం నిజం కానివ్వండి.
తెలంగాణా సంకెళ్లు తెగిపోనివ్వండి.
తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించండి.

జై తెలంగాణా!
జై ఆంధ్రా!
జై రాయలసీమ!

Thursday, December 10, 2009

తెలంగాణా అమర వీరులకు జోహార్లు



1969లో ప్రత్యేక తెలంగాణా కోసం విద్యార్థులు పోరాటం ప్రారంభిస్తే ఆ తరువాత ఆ పోరాటాన్ని రాజకీయ నాయకులు తమ చేతుల్లోకి తీసుకుని ఆ తరువాత దానికి ద్రోహం చేశారు. ఆనాటి పోరాటంలో దాదాపు 370 మంది పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. వారిలో కొందరి వివరాలను ఈ కింది లింకులో చూడవచ్చు.

1969 ప్రత్యేక తెలంగాణా పోరాట అమర వీరులు: http://telangana1969.com/martyrs1.html

ప్రస్తుత ప్రత్యేక తెలంగాణా పోరాటం రాజకీయంగా ప్రారంభమై విద్యార్తుల చేతుల్లోకి వెళ్లింది. కె.సి.ఆర్‌. 2009 నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తరువాత డిసెంబర్‌ 9న దీక్ష విరమించేనాటి వరకు ఈ ఉద్యమంలో మొత్తం 37 మంది అసువులు బాశారు. వీరిలో 23 మంది ఆత్మహత్య చేసుకోగా, 13 మంది గుండె ఆగి మరణించారు. ఒకరు పోలీసుల లాఠీ దెబ్బలకు చనిపోయారు. వారి వివారాలు ఈ కింది విధంగా వున్నాయి: (ఆంధ్ర జ్యోతి 10-12-2009 సౌజన్యంతో)

వరంగల్‌ జిల్లా (11మంది)
1. 2009 నవంబర్‌ 30 భూక్యా ప్రవీణ్‌ (24), గోపాతండా - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 3 మల్లవేవి రాజ్‌కుమార్‌ (16), కేశవాపురం - ఆత్మహత్య
3. డిసెంబర్‌ 5 చెరుకు అంజయ్య (32), వల్మిడి - ఆత్మహత్య
4. డిసెంబర్‌ 6 ముక్కెర జనార్థన్‌ (45), వరంగల్‌ - ఆత్మహత్య
5. డిసెంబర్‌ 6 నాగరాజు (25), కురవి, - ఆత్మహత్య
6. డిసెంబర్‌ 7 వాకిడి బుచ్చయ్య (47), జగ్గయ్యపేట - గుండెపోటు
7. డిసెంబర్‌ 7 దేవులపల్లి శాంత (36), రేగొండ - గుండెపోటు
8. డిసెంబర్‌ 7 గుండెబోయిన బొందయ్య (80), రేగొండ - గుండెపోటు
9. డిసెంబర్‌ 8 మోరె పుల్లారెడ్డి (50), మొట్లపల్లి - గుండెపోటు
10. డిసెంబర్‌ 9 రవి (30), పాలంపేట - గుండెపోటు
11. డిసెంబర్‌ 9 రంగాన రాజు (23), వెల్ది గ్రామం - ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లా (8 మంది):
1. డిసెంబర్‌ 2, దండిక పృథ్వీరాజ్‌ (22), వాల్గొండ - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 6 నాలుక రాజయ్య (50), తిమ్మాపూర్‌ - గుండెపోటు
3. డిసెంబర్‌ 6 బరిగెల అశోక్‌ (22), నారాయణపూర్‌ - ఆత్మహత్య
4. డిసెంబర్‌ 6 ఆరెల్లి కృష్ణ (18), రాచపల్లి - ఆత్మహత్య
5. డిసెంబర్‌ 7 బొల్లి సారయ్య (40), బస్వాపూర్‌ - ఆత్మహత్య
6. డిసెంబర్‌ 7 కడారి ఎల్లమ్మ (36), ఉప్పల్‌ - ఆత్మహత్య
7. డిసెంబర్‌ 8 బైరి సుదర్శన్‌, నిట్టూరు - ఆత్మహత్య
8. డిసెంబర్‌ 8 కోల రవి (25), మల్లారెడ్డిపల్లి – ఆత్మహత్య

మెదక్‌ జిల్లా (8 మంది):
1. నవంబర్‌ 30 బొల్లి లక్ష్మీనారాయణ (50), కమ్మర్లపల్లి - గుండెపోటు
2. నవంబర్‌ 30 శ్రీకాంత్‌ (18), దుద్దెడ - ఆత్మహత్య
3. డిసెంబర్‌ 2 లక్ష్మి (35), కొండపాక - గుండెపోటు
4. డిసెంబర్‌ 5 గురువయ్య (48), మగ్దుంపూర్‌ - ఆత్మహత్య
5. డిసెంబర్‌ 6 నర్సింలు (32), భూంపల్లి - గుండెపోటు
6. డిసెంబర్‌ 6 నర్సింగ్‌నాయక్‌ (54), తునికిల్లా తండా - ఆత్మహత్య
7. డిసెంబర్‌ 6 నరేందర్‌ గౌడ్‌ (32), గౌతాపూర్‌ - గుండెపోటు
8. డిసెంబర్‌ 7 వరాల వెంకటేశం (32), అందె – ఆత్మహత్య

నల్లగొండ జిల్లా (4):
1. డిసెంబర్‌ 3 కాసోజు శ్రీకాంత్‌ (23), పొడిచేడు - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 6 సుధాకర్‌ నాయక్‌ (20), గోగులగుట్ట తండా - ఆత్మహత్య
3. డిసెంబర్‌ 6 వీరనాగులు (26), పాలారం - ఆత్మహత్య
4. డిసెంబర్‌ 7 సతీశ్‌ యాదవ్‌ (29), రాయగిరి – ఆత్మహత్య

ఆదిలాబాద్‌ జిల్లా (2):
1. డిసెంబర్‌ 4 చిన్న బాపన్న, సూర్జాపూర్‌ - గుండెపోటు
2. డిసెంబర్‌ 4 భాస్కరాచారి, భైంసా - ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లా (2):
1. డిసెంబర్‌ 1 కిష్టయ్య (38), కానిస్టేబుల్‌, శివయ్యపల్లి - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 7 అయిండ్ల లింగయ్య (45), ఇస్సాయిపేట - గుండెపోటు

హైదరాబాద్‌లో (2)

1. నరసింహ - లాఠీచార్జిలో గాయపడి
2. ఈదయ్య - ఆత్మహత్య

తెలంగాణా తల్లి ముద్దుబిడ్డలైన అమరవీరులకు జోహార్లు.
మీ త్యాగం తెలంగాణా ప్రజలకు సదా స్ఫూర్తినిస్తూనే వుంటుంది.

Wednesday, December 9, 2009

హైదరాబాదేం ఖర్మ- మొత్తం తెలంగాణాను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని అరవొచ్చుకదా!

....

...........

Present Telangana:

చర్విత చర్వణం

1948 నుంచి 1956 వరకూ తెలంగాణా ప్రాంతం ''హైదరాబాద్‌ రాష్ట్రం'' గా విడిగా వుండేది. హైదరాబాద్‌ రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరమే రాజధానిగా వుండేది. అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాలు కలిసి వుండేవి. అంతకు ముందు నాలుగు వందల సంవత్సరాల నుంచీ నైజాం రాష్ట్రం ఇంచుమించు ఇట్లాగే వుండేది. కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం కూడా కొంత కాలం నైజాం సంస్థానంలో వున్నప్పటికీ వాటిని నిజాం రాజు ఉదారంగా బ్రిటీష్‌ వారికి భరణంగా ఇచ్చేశాడు. వాటిని సీడెడ్‌, సర్కారు జిల్లాలుగా వ్యవహరించేవారు. ఇప్పటికీ చాలామంది సినీ డిస్ట్రిబ్యూటర్లు ఆనాటి నైజాం, సీడెడ్‌, సర్కారు అనే పదాలనే వాడుతుండటం మనం గమనించవచ్చు.

1953 వరకు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్‌ ప్రావిన్స్‌ క్రింద వుండేవి. తెలుగువాళ్ల పట్ల తమిళులు వివక్ష చూపుతున్నారని, మద్రాసీలన్న ముద్ర తప్ప తెలుగు వాళ్లకు సొంత అస్తిత్వం లేకుండా పోయిందని, ఉద్యోగాలు తదితర విషయాల్లో తీవ్ర వివక్ష ఎదురవుతోందని ఆక్రోశిస్తూ , ఆవేదన చెందుతూ, ఆవేశపడుతూ ఆంధ్ర, రాయలసీమ ప్రజలు మద్రాసు నుంచి విడిపోవాలని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. ''మా తెలుగు తల్లికీ మల్లె పూదండ'' పాట ఆ ఆత్మగౌరవ పోరాటంలోంచి పుట్టిందే. చివరికి అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ''కర్నూలు'' రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

అయితే కర్నూలులో రాజధానికి కావలసిన సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ఆంధ్ర నేతల కన్ను అప్పటికే అన్నివిధాలా అభివృద్ధి చెందిన ''హైదరాబాద''్‌ నగరం మీద పడింది. దరిమిలా ఆంధ్ర నేతలు '' మీది తెలుగే ... మాది తెలుగే '' అంటూ కలిసుందాం రా అంటూ సమైక్య గీతం మొదలుపెట్టారు.

1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే సరికొత్త వాదన లేవదీశారు. ఆ కుట్రలో అమాయకంగా చిక్కుకుని, పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ఉప ముఖ్యమంత్రి పదవి వంటి హామీలను నమ్మి ''హైదరాబాద్‌ రాష్ట్రం'' ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై తన అస్తిత్వాన్ని కోల్పోయింది. దాంతో పాటు కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకకు, మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహరాష్ట్రకు వదిలేయాల్సి వచ్చింది. దానివల్ల కూడా ఎంతో నష్టపోయింది.

మొదటినుంచీ ఆంధ్రాలో విద్యావకాశాలు విస్తృతంగా అందుబాటులో వుండడం వల్ల, ఇంగ్లీషు మీడియం చదువుల వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో వున్నారు. నైజాం నిరంకుశ పాలనలో, ఉర్దూ మీడియం చదువుల వల్ల, ఉర్దూలో పరిపాలన వల్ల, అరకొర విద్యావకాశాల మూలంగా ఇక్కడి ప్రజలు అన్నిరంగాలలో వెనుకబడిపోయివున్నారు.

వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలు కావాలంటారు.


ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు ఏవిధంగానూ సమ ఉజ్జీలు కావు.
ఆంధ్ర ప్రదేశ్‌ అనే బండికి ఒక పక్క ఒంగోలు గిత్తను, మరో పక్క తెలంగాణా బక్కెద్దును కట్టినట్టయింది. అందుకే ఆ బండి నడక అవకతవకగా సాగుతూ వచ్చింది. ఒక ప్రాంత ప్రజలు విపరీతంగా లబ్ది పొందుతుంటే మరో ప్రాంత ప్రజలు అడిగేవాడు లేక అన్నివిధాలా నష్టపోతూ వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం నుంచే ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణాకు ఆంధ్ర ప్రాంత వాసుల వలస ఉప్పెనలా మొదలయింది.
అక్కడ ఒక ఎకరం అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు లభించే పరిస్థితి వుండటంతో రైతులు కూడా ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఊరూరా భూములు సొంతం చేసుకుంటూ చవ్చారు. ఎన్ని ఒప్పందాలు ఎన్ని నియమ నిబంధనలు వున్నా తెలంగాణాలో వాటిని పట్టించుకునే, వలసలను అడ్డుకునే నాధుడే లేకుండా పోయాడు.

ఇట్లా జరుగుతుందనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహూృ ఆంధ్ర - హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనాన్ని మొదట్లో అంగీకరించలేదు. చివరికి ఒత్తిళ్లకు తలొగ్గి బలవంతంగా రెండు రాష్ట్రాలనూ విలీనం చేస్తూ ''ఒక గడుసు అబ్బాయికి - ఒక అభం శుభం తెలియని అమాయక అమ్మాయిని కట్టబెడ్తున్నాం. ఈ కాపురం ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు. ఒకవేళ ఇద్దరికీ కుదరకపోతే ఎప్పుడైనా సామరస్యంగా విడిపోవచ్చు '' అంటూ పెళ్లినాడే పెటాకుల మంత్రం జపించాడు.

నెహూృ అన్నట్టే అయింది.

పూలదండలు మార్చుకునే వరకు బుద్ధిగా వున్న పెళ్లికొడుకు ఆ మరుక్షణం నుంచే తన స్వార్థ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఉపముఖ్యమంత్రి పదవి, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, తెలంగాణా అభివృద్ధి మండలి అనుమతి లేకుండా ఇతర్లు ఇక్కడి భూములు కొనకూడదన్న నిబంధనలు వగైరా వగైరా అన్నీ గాలికి కొట్టుకు పోయాయి.

ఒక్క హైదరాబాదుకే కాదు తెలంగాణా లోని అన్ని (10) జిల్లాలకు ఆంధ్ర, రాయలసీమ వాసుల వరదలా వెల్లు వెత్తారు. తెలంగాణా నుంచి ఆంధ్రరాయలసీమ జిల్లాలకు మాత్రం ఆవిధమైన వలసలు లేవు. అందుకు ఆస్కారం కూడా లేదు. ఉద్యోగాలు, నిధులు, నదీజలాలు అన్నింటా తెలంగాణాకు అన్యాయమే జరుగుతూ వచ్చింది. దాంతో 1969లో ఒకసారి పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. దానిని రాష్ట్రంలోని బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం పాశవికంగా అణిచేశాయి. దాదాపు 370 మందిని చంపి, అప్పటి ఉద్యమ నాయకుడైన చెన్నారెడ్డినీ ప్రజాప్రతినిధుల్నీ టోకున కొనుగోలు చేసి, వారికి కొన్ని మంత్రి పదవులిచ్చి మరీ ఈ బలవంతపు సమైక్యతా కాపురాన్ని యధాప్రకారం బలవంతంగా కొనసాగేట్టు చేశారు.

2001 లో ప్రత్యేక తెలంగాణా వాదం మళ్లీ ఫీనిక్స్‌ పక్షిలా ప్రాణం పోసుకుంది. తెలంగాణా ఉద్యమం కెసిఆర్‌ ఆమరణ నిరాహార దీక్షతో 1969 కంటే మరింత పెద్ద ఎత్తున ప్రజా ప్రభంజనంలా మారింది. పైకి అన్ని పార్టీలూ మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు, మేం తెలంగాణాకు అనుకూలం అనే పాట పాడుతున్నప్పటికీ లోపాయికారిగా ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌కు తూట్లు పొడిచేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.

ఒకే పార్టీకి నాలుగు నాలికలు

ఒకే పార్టీలో కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ సమైక్యంగా వుండాలంటారు.
మరికొందరు విభజిస్తే ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు రాష్ట్రాలుగా విభజించాలంటారు.
ఇంకొందరు ఉత్తరాంధ్రను వేరే రాష్ట్రం చేయాలంటారు.

మరీ విచిత్రంగా తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ప్రజానాయకమ్మణ్యులు గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు..

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోని అనేక మున్సిపాలిటీలను, పంచాయితీలను లాక్కుని ఈమధ్యనే గ్రేటర్‌ హైదరాబాద్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ని ఏర్పాటు జరిగింది.

ఇప్పుడేమో ఇక్కడి సెటిలర్స్‌కి తెలంగాణా రాష్ట్రంలో భద్రత వుండదట. కేంద్ర పాలిత ప్రాంతమైతేనే వారికి రక్షణ వుంటుందట.
వారికి ఎవరి నుంచి భద్రత వుండదు.
హైదరాబాద్‌లోని తెలంగాణా వాసుల నుంచేనా?
అదే నిజమైతే హైదరాబాద్‌ కేంద్ర ప్రాంత పాలితమైతే వారి నుంచి ముప్పు ఎలా వుండకుండా పోతుంది.
హైదారాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయగానే తెలంగాణా వాసుల్ని హైదరాబాద్‌ నుంచి మిగతా తెలంగాణా రాష్ట్రంలోకి తరిమేసి హైదరాబాద్‌లో కేవలం సెటిలర్స్‌నే వుంచుతారా?
హైదరాబాద్‌ మీద ఇక్కడి మూలవాసులకు ఎట్లాంటి హక్కూ లేదా?
వారి భద్రతకు ఎవరు హామీ ఇస్తారు? ఎట్లా... ఏ ప్రాతిపదికన ఇస్తారు?

మిగతా జిల్లాల్లోని సెటిలర్స్‌ మాటేమిటి?


సెటిలర్స్‌ ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే లేరు.
తెలంగాణా లోని ప్రతి జిల్లాలో వున్నారు.
ఒక్కరో ఇద్దరో కాదు వేలు, లక్షల సంఖ్యలో వున్నారు.
మరి వారి భద్రత మాటేమిటి?
సెటిలర్స్‌ పాలిటి హీరోలు, మూలవాసుల పాలిటి విలన్లుగా మారుతున్న మూలవాస నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

కేంద్ర పాలిత ప్రాంతమైతేనే ప్రభుత్వం సెటిలర్స్‌కి రక్షణ కల్పించగలుగుతుంది, ప్రత్యేక రాష్ట్ర మైతే ప్రభుత్వం సెటిలర్స్‌కి రక్షణ కల్పించలేదు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు.?
ఒకవేళ అదే వాస్తవమైతే మొత్తం తెలంగాణాలోని సెటిలర్స్‌ రక్షణ కోసం మొత్తం తెలంగాణాని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేయకుండా కేవలం హైదరాబాద్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు.

మద్రాస్‌లో గానీ, బెంగుళూరులో గానీ ఆంధ్ర సెటిలర్స్‌కి ఎప్పుడైనా భద్రత సమస్య ఎదురయిందా? అప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అసలు ఈ వాదనే ఒక జిత్తుల మారి వాదన తప్ప న్యాయబద్ధమైన వాదన కాదు.

మద్రాస్‌ ప్రావిన్స్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఇట్లాగే మద్రాస్‌ నగరంలో భాగం కావాలని నానా యాగీ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష మొదలైన ఐదో రోజే నెహూృ ప్రత్యేక ఆంధ్ర డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్టు పార్లమెంట్‌లో సూత్రప్రాయంగా ప్రకటించాడట. కానీ మద్రాస్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలన్న గొడవ వల్లే విపరీతమైన కాలయాపన జరిగి పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ముంబాయి విషయంలోనూ ఇట్లాంటి గొడవే జరిగింది.
కానీ వాస్తవాన్ని గ్రహించి గుజరాతీలు తమ వాదనను కట్టిపెట్టి ముంబాయిని వదిలి వెళ్లి అహమ్మదాబాద్‌ను రాజధానిగా అభివృద్ధి చేసుకున్నారు.

చివరికి ఇక్కడా అదే పునరావృతమవుతుంది.
హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణా రాష్ట్రమే . తెలంగాణా రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రమే. ఈ రెంటినీ విడదీయడం అసంభవం.
అధర్మం అంతరిస్తుంది. న్యాయం గెలుస్తుంది.
తెలంగాణా స్వప్నం త్వరలోనే నిజమవుతుంది!





..........

Monday, December 7, 2009

తెలంగాణా ఎవరి చేతుల్లో వుంది?


ఇవాళ్టి (07-12-2009) ఆంధ్రజ్యోతి లో '' తెలంగాణా ఎవరి చేతుల్లో వుంది? '' అనే శీర్షికతో సినీ రచయిత, దర్శకుడు పోసాని మురళీ కృష్ణ '' ప్రకటన '' ఒకటి వెలువడింది. అందులోని అనేక ప్రశ్నలు ఆలోచింప జేసేలా వున్నాయి. సోదర బ్లాగర్లు చదివి చర్చించేందుకు వీలుగా పోసాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానిని ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాను:
.....................................................................................

తెలంగాణా ఎవరి చేతుల్లో ఉంది ?

ఎలక్షన్స్‌ ముందు:
తెలంగాణాకు మేము అనుకూలం అని, తెలంగాణా ప్రజల ఓట్లతో ఎంఎల్‌ఎ అయినవాళ్లు, మంత్రులయినవాళ్లు, ముఖ్యమంత్రులయినవాళ్లు దర్జాగా పదవులు అనుభవిస్తూ, ఇప్పుడేమో తెలంగాణా రాష్ట్రం మా చేతుల్లో లేదంటున్నారు.

మరి మీ చేతుల్లో ఏముంది ?

కోట్లాది రూపాయల ఖరీదు చేసే తెలంగాణా భూముల్ని అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలకే అమ్ముకోవడం మాత్రం మీ చేతుల్లో వుంది !
మంత్రుల స్థాయి పెద్దలు జూబ్లీ హిల్స్‌ లాంటి ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే స్థలాల్ని ఆక్రమించుకుంటే చాలా తక్కువ రేటుకే ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించడం మాత్రం మీ చేతుల్లో వుంది !
కానీ, ఇళ్లు లేని తెలంగాణా ప్రజలు 40, 50 ఏళ్ల క్రిందట ప్రభుత్వ స్థలల్లో ఇళ్లు కట్టుకుని బతుకుతుంటే ఇప్పుడొచ్చి ఆ స్థలం ప్రభుత్వానిది అని పోలీసులతో ఆ ప్రజల్ని కొట్టించి, బుల్డోజర్స్‌తో ఆ ఇళ్లు కూలగొట్టించి, ప్రజలను రోడ్డుమీద పడవేయడం మాత్రం మీ చేతుల్లో వుందా ??

మీ కళ్ల ముందే తెలంగాణా గడ్డమీద భూ కబ్జాలు జరిగాయి. కానీ, దాన్ని ఆపడం మీ చేతుల్లో లేదు!
అసైన్డ్‌ భూములను కొనగూడదని తెల్సినా చాలామంది పెద్దలు కొనుక్కొని కోటీశ్వరులయ్యారు అది మీకు తెలుసు...కానీ దానిని ఆపడం మాత్రం మీ చేతుల్లో లేదు !
ఇది అన్యాయం అంటూ ఆందోళన చేస్తున్నవారిని లాఠీలతో కొట్టించడం మాత్రం మీ చేతుల్లో వుంది !!

తెలంగాణాకు అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు చెబుతున్నాయి.
కానీ, దోపిడీ మాత్రం ఆగదు!
తెలంగాణాకి మేము అనుకూలమని అన్ని పార్టీలు చెబుతాయి.
కానీ, తెలంగాణా రాష్ట్రం మాత్రం రావడం లేదు !!
ఎందుకంటే ఇప్పుడున్న అసెంబ్లీలో ప్రజల కోసమే బతికే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ప్రజా సేవకులు లేరు.... వున్నారా?

సారాతో, డబ్బులతో ఓట్లు కొంటూ అసెంబ్లీ కొస్తున్న ఎమ్‌ఎల్‌ఏలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నంతకాలం తెలంగాణా సమస్యనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ ప్రజా సమస్యనూ చిత్తశుద్ధితో పరిష్కరించలేరు !!

మీరు ఓట్లు కొంటూ అడ్డదారిలో అధికారంలో కొస్తున్నా, అవినీతి పనులు చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని క్షమిస్తున్నారు !
కాబట్టి తెలంగాణా ప్రజలు అడుగుతున్న ప్రత్యేక రాష్ట్రం విషయంలో అయినా గారడీ మాటలు మానేసి, రాజకీయ వ్యాపారం మానేసి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తెలంగాణా వస్తుంది !

అ లా కాకుండా ఏదీ మా చేతుల్లో లేదంటే ప్రతీదీ ప్రజల చేతుల్లోకి వెళ్తుంది !!

ప్రత్యేక తెలంగాణా న్యాయమైన కోరిక :
ప్రజా ఉద్యమం, విద్యార్థి పోరాటం -సమర్థనీయం !
కె.సి.ఆర్‌.దీక్ష - అభినందనీయం !
ఆంధ్రప్రజానీకానికి ఏ మాత్రం నష్టం జరగకుండా శాంతియుతపోరాటంతో, అహింసా మార్గంలో తెలంగాణా రాష్ట్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

పోసాని కృష్ణ మురళి,

సినీ రచయిత, దర్శకుడు

.....................................................................................
ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో ...

Saturday, December 5, 2009

ప్రత్యేక తెలంగాణ : ఒక సమైక్యవాది ''ఆత్మవిమర్శ'' ...



నిన్న మొన్నటి వరకూ ''ప్రత్యేక తెలంగాణా'' అనేది కొంతమంది ''రాజకీయ నిరుద్యోగులు'' చేస్తున్న ఆర్భాటంగా 'లైట్‌' తీసుకున్నాను. గుప్పెడు మంది స్వార్థపరులు ఆడుతున్న నాటకంగా పెదవి విరిచాను. దుర్మార్గమైన ''వేర్పాటు వాదం'' గా ఈసడించుకున్నాను.

రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఇస్తే దేశం ముక్క చెక్కలైపోతుందని ఆవేశపడ్డాను. భారత పాకిస్థాన్‌ల మాదిరి వైషమ్యాలు తలెత్తి తెలుగు ప్రజల ''సమైక్యత'' సర్వనాశనమై పోతుందని ఆవేదన చెందాను.

కె.సి.ఆర్‌. అనే వ్యక్తికి (2000 సంవత్సరంలో) చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వక పోవడం వల్లనే ఈ గొడవ తలెత్తిందనీ, ఆయనకు గనక అప్పుడు ఓ మంత్రి పదవి పడేస్తే మిగతా తెలంగాణా నాయకమ్మణ్యుల్లా ఈయనా కిక్కురుమనకుండా పడివుండేవాడు కదా అని నమ్మాను.

అతను ఈ తెలంగాణా వాదాన్ని తీసుకురాకపోతే-
ఆంధ్రావాళ్లు, రాయల సీమవాళ్లు, అట్లాగే హైదరాబాద్‌లోనూ, ఇతర తెలంగాణా జిల్లాల్లోనూ లక్షలాదిగా స్థిరపడిన ''సెటిలర్లు'' అందరూ ... ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో వుండేవారు కదా ...అని అనేకానేకసార్లు మదనపడ్డాను.

పిల్ల నిచ్చిన మామ నుంచి ''అదనపు కట్నం'' గా ముఖ్యమంత్రి పదవినే లాక్కున్న బాబు, ఈ అర్భకుడి మొహాన ఓ మంత్రి పదవి కొడితే ఏం పోయేదని చాలా సార్లు తెగ బాధపడిపోయాను. కె.సి.ఆర్‌. మీద కంటే అతనికి మంత్రిపదవి నిరాకరించి తప్పు చేసిన బాబు మీదే నాకు ఎక్కువ మంటగా వుండేది.

ఒక మంత్రి పదవి పడేస్తే కే సి ఆర్ తెలంగాణా జపం చేసేవాడే కాదని అందరిలా నేను కూడా భావించినప్పటికీ, ఆయనకు ఏకంగా కేద్ర మంత్రి పదవి వచ్చినా తెలంగాణా వాదాన్ని ఇంకా ఎందుకు అంటి పెట్టుకుని వుండి పోయాడో అర్ధం అయ్యేది కాదు. అంత స్వార్ధ పరుడు, రాజ కీయ నిరుద్యోగి అన్న ముద్ర పడ్డ వ్యక్తీ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర మంత్రి పదవి లభించినా దానిని గడ్డి పోచలా ఎట్లా విసిరి కొట్ట గలిగాడో, అన్ని సార్లు ఎం పీ సీటుకు రాజీనామా చేసి వేరు వేరు నియోజక వర్గాల్లో ఎట్లా విజయం సాధించ గలిగాడో ఆయనకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చేదో అని నేను ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోలేదు. కే సి ఆర్ రాజకీయ నిరుద్యోగి అన్న పాత పాటనే అరిగిపోయిన రికార్డులా పాడుకుంటూ, నిందిస్తూ, అసహ్యంగా వితండ వాదం చేస్తూ కూచుంది పోయాను.

సరే మేం పుట్టిందే తెలంగాణా సాధన కోసం అనే తె. రా. స. తెలంగాణా జపం చేయడంలో పెద్దగా ఆశ్యర్య పోవాల్సిందేమీ లేదు. కానీ రాష్ట్రం విడిపోకూడదని కోరుకునే (!) కాంగ్రెస్‌ పార్టీ 2004 ఎన్నికలలో తెరాసతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి రావడం తెరాస వాళ్లకి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిపదవులివ్వడం, తెలంగాణా అంశాన్ని కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో పెట్టి ప్రధాన మంత్రి చేత, రాష్ట్రపతిచేత పార్లమెంట్‌లో చెప్పించడం, ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేసి నాటకమాడటం మాత్రం నాకు ఒక పట్టాన జీర్ణమయ్యేది కాదు.

అట్లాగే సమైక్యవాదం జపిస్తూ, తన హయాంలో ''తెలంగాణా'' అన్న పదాన్ని కూడా ఉచ్ఛరించనివ్వని నికార్సయిన సమైక్య తెలుగుదేశం పార్టీ - తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేయడం, తెరాసతో పొత్తు పెట్టుకుని 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం నన్ను మరింత గందరగోళానికి గురిచేసింది.

సీపీఐ, బిజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కూడా తెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలు చేయడంతో బెంబేలెత్తి పోయాను. ఈ పార్టీలన్నీ ఉత్తిత్తిగానే, ఒల్లెక్కలకు తెలంగాణా పాట పాడాయి కానీ లోపల వాటి ధ్యేయం సమైక్యతే అని ఆత్మవంచన చేసుకోవడం నా వల్ల కాలేదు.

తెలంగాణాకు ప్రజల్లో మద్దతు లేకపోతే ఇన్ని ప్రధాన పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ఎట్లా తీర్మానం చేస్తాయి. ఒకవేళ ఓట్ల కోసం అట్లా ''బడాయి'' తీర్మానాలు చేసినా అవి సమైక్యతనే కోరుకుంటున్నాయని అనుకున్నా అది తెలంగాణా ప్రజల్ని మోసం చేయడమే కదా?
ఇట్లా చూసినా మెజారిటీ తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటున్నట్టు రూఢి అవుతోంది కదా?

అయినా నేను ఇన్నాళ్లూ ఈ విషయాలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించకుండా అందరిలాగే మెజారిటీ ప్రజల ఆకాంక్షను పక్కనపెట్టి, అసలు సమస్యను గాలికి వదిలేసి తెరాస పార్టీ కుప్పిగంతులమీద, అది వేసే డ్రామాల మీద, ''బక్కోడు'' (ఈ మాట నాది కాదు, నికార్సైన సమైక్యవాదులది) ఉపయోగించే భాష మీద, తెరాసకు వచ్చే ఓట్ల మీద, సీట్ల మీద,తెలుగు తల్లి మీద, తెలంగాణా తల్లి మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి వాదోపవాదాలు చేస్తూ వచ్చాను.

తెరాస టికెట్‌తో గెలిచిన 26 మంది ఎంఎల్‌ఎలలో 10 మందిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బుట్టలో వేసుకున్నప్పుడు, తెరాసలో నెంబర్‌ టూ టైగర్‌ నరేంద్రను కూడా చాకచక్యంగా లోబరచుకున్నప్పుడు, విజయశాంతి మీదకు కూడా గేలం విసిరినప్పుడు, తెలంగాణా వాళ్ల మీదకు తెలంగాణా వాళ్లనే ఉసి కొల్పుతున్నప్పుడు లోలోపల అట్లాంటి పనులు చేయడం ధర్మం కాదని అంతరాత్మ ఘోషిస్తున్నా .... ఏదో ఒక విధంగా సమైక్యత నిలబడుతోంది కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను అందరిలా శాడిస్టిక్‌గా ఆనందించానే తప్ప అది లత్తకోరు, ఫాక్షనిస్టు రాజకీయం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాదని గట్టిగా ఎవరితోనూ అనలేకపోయాను.. దానివల్ల మన సమాజంలో, రాజకీయాలలో విలువలు మరింత పతన మవుతాయన్న భావన నాకు అప్పుడు ఏ కోశానా రాలేదు. వచ్చినా ''తెలంగాణాను వ్యతిరేకించే మైకం''లో దానిని ఏమాత్రం పట్టించుకోలేదు.

మొన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో తెరాస పోటీ చేయాడానికి కూడా భయపడి తోక ముడిచి మొహం చాటేసినప్పుడు ఇక తెలంగాణా వాదం పని అయిపోయినట్టే ... ప్రజల్లో తెరాసకి పలుకుబడి పూర్తిగా తగ్గి పోయినట్టే అని సంబరపడ్డాను. ఒకవేళ తెరాస పోటీ చేసి ఓ పదో పాతికో కార్పొరేటర్‌ సీట్లు గెలిచినా మన ఘనత వహించిన నూరేళ్ల చరిత్ర వున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఆ తెరాస కార్పొరేటర్లని అవలీలగా కొనిపారేసిది. గొడవ వొదిలిపోయేది. అయితే అది వేరే విషయం.

కెసిఆర్‌ ''ఆమరణ'' దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు ''ఉత్తర కుమారుని'' ప్రగల్భంగా ఎంత నవ్వుకున్నానో. 24 గంటల్లో దీక్ష తుస్సవుతుంది, తెలంగాణా ఫట్టవుతుంది అని చంకలు గుద్దుకున్నాను. ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కెసీఆర్‌ను అనవసరంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టడం, ఆయనేమో జైల్లోనే దీక్ష కొనసాగించడం నన్ను మళ్లీ కొంత ఆందోళనకు గురి చేసింది. అయితే రెండో రోజు బలవంతంగా సెలైన్‌ ఎక్కించగానే కెేసీఆర్‌ దీక్ష విరమించినట్టు ప్రకటించగానే ఫినిష్‌ ప్రత్యేక తెలంగాణా వాదానికి శాశ్వతంగా నూకలు చెల్లినట్టే అని ఎగిరి గంతులేశాను.

కానీ ఆ మరుక్షణమే తెలంగాణాలోని విద్యార్థులు తిరగబడి కేసీఆర్‌ని తెలంగాణా ద్రోహిగా ప్రకటించి ఇక నుంచి తెలంగాణా ఉద్యమాన్ని తామే నడుపుతామని చాటడంతో షాక్‌కు గురయ్యాను. విద్యార్థుల వార్నింగ్‌కి జడిసిన కెసిఆర్‌ నేను దీక్ష విరమించలేదు, అదంతా పోలీసుల కుట్ర అనడం, దీక్ష కొనసాగించడం దరిమిలా పరిస్థితి అంతా ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా మారిపోవడం నన్ను మళ్లీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలంగాణా లోని అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు రోడ్ల మీదకు వచ్చి జై తెలంగాణా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటే
ఇంకా నేను కెసిఆర్‌ భాష గురించి,
టిఆర్‌ఎస్‌కు వచ్చిన అసెంబ్లీ సీట్ల గురించి
చర్చించుకుంటూ
తెలంగాణాలో మెజారిటీ ప్రజలు తెలంగాణాను కోరుకోవడం లేదని బుకాయిస్తూ ఆత్మవంచన చేసుకోలేకపోతున్నాను.
అందుకే ఈ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను.

ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కెసిఆర్‌ ఒక్కడి ఉద్యమం కాదు.
నాలుగుకోట్ల తెలంగాణా ప్రజల ఉద్యమంగా మారిపోయింది. తెలంగాణా ప్రజల బలమైన ఆకాంక్షలో నిజాయితీ వుంది, నిబద్ధత వుంది, న్యాయం వుంది.

1956లో తెలంగాణాను ఆంధ్రాలో విలీనం చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రజలు విడిపోవాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపే నిజాయితీ మన ప్రజాస్వామ్యానికి ఎలాగూ లేదు.

అన్ని పార్టీలూ తాము తెలంగాణాకు అనుకూలమే అంటూ తీర్మానాలు చేసి ప్రజలను వంచించి ఓట్లు దండుకుంటున్నాయి.
ఒక్క పార్టీ కూడా మేం సమైక్యవాదులం.
ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులం అని ధైర్యంగా ప్రకటించిన పాపానపోలేదు.
అంత ధైర్యం ఏ ప్రధాన పార్టీకీ లేదు.
అట్లాంటప్పుడు తెరాసకి వచ్చినవి మాత్రమే తెలంగాణా కోరుకునే వారి ఓట్లు
మిగతా పార్టీలకు వచ్చినవన్నీ సమైక్యతను కోరుకునే వారి ఓట్లు అని ఎట్లా అంటారు?
దానంత పచ్చి అవకాశ వాదం, దుర్మార్గం మరొకటి వుంటుందా?

ఇవాళ తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్రంకోసం ఎంతో మంది ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజిస్తున్నా కూడా స్వార్థపరులైన రాజకీయ నాయకుల్లాగా ఉష్ట్రపక్షుల్లా వ్యవహరించడం నా వల్ల కాదనిపించింది.

1956లో ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల ఎత్తులకు, జిత్తులకు మోసపోయే తెలంగాణా ఆంధ్రాలో విలీనమయింది. అప్పటి పెద్ద మనుషుల ఒప్పందాలను, ముల్కీ నిబంధనలను, ఫజల్‌ అ లీ మిషన్‌, గిర్‌గ్లాని కమిషన్‌ నివేదికలను, 610 జీవో మొదలైనవాటన్నింటినీ తుంగలో తొక్కడం వల్లనే, విలీనమప్పుడు చేసుకున్న ఒప్పందాలకు నిజాయితీగా కట్టుబడి వుండకపోవడం వల్లనే... నిధులూ, నీళ్లు, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరగడం వల్లనే .... తెలంగాణా ప్రజల్లో విడిపోతే తప్ప బాగుపడమన్న భావన బలంగా ఏర్పడింది. ఇప్పుడు ఏ పైపూతలు, లేపనాలు, లేహ్యాలు, ఒప్పందాలు, ఏ అభివృద్ధి లెక్కలూ పత్రాలూ చైతన్యవంతులైన తెలంగాణా ప్రజలను ఏమార్చలేవు. అవన్నీ ఇక వృధా ప్రయాసే!

నిన్నమొన్నటి పొత్తులు, ప్రణబ్‌ కమిటీ, రోశయ్య కమిటీ నాటకాలు, తెలంగాణా అనుకూల తీర్మానాలు, నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరించే రాజకీయ అవకాశవాదం తెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొడుతున్నాయి.

కడపులో లేంది కావలించుకుంటే రాదంటారు.
మేడిపండులాంటి సమైక్యత వల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ వుండదు.
మన సమైక్యతని రాజకీయ అవకాశవాదులు, పెట్టుబడిదార్లు, భూస్వాములు, కాంట్రాక్టర్లు ఎప్పుడో మలినం చేశారు. ఇప్పుడది సెప్టిక్‌ అయివుంది. ఇంకా తాత్సారం చేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఎన్నో నిండు ప్రాణాలు బలవుతాయి.
తెలంగాణా ఆంధ్ర విడిపోవడం వల్ల సామాన్యులకు, నిజాయితీపరులకు ఒనగూడే నష్టం ఏమీ వుండదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడ్తున్నది ఇరుప్రాంతాల స్వార్థపరులూ, అవకాశవాదులే.

తెలుగువాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది వున్నారు. తెలంగాణా ఆంధ్రాల్లో వున్నవాళ్ల సంఖ్య కేవలం 8 కోట్లే. ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినంత మాత్రాన తెలుగు ప్రజల ఐక్యతకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. హిందీ వాళ్లకు ఆరేడు రాష్ట్రాలు వుండగా లేనిది మనకు రెండో మూడో రాష్ట్రాలు వుంటే తప్పేమిటి? బలవంతపు కాపురం వల్లనే మన సమైక్యత, మన సహృద్భావం దెబ్బతింటాయి. కాబట్టి నేను నా సమైక్యవాదానికి తిలోదకాలిస్తూ, ఆంధ్ర - తెలంగాణా రాష్ట్రాలు సామరస్యంగా, అన్నదమ్ముల్లా విడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

(గల్పిక)

తెలంగాణా చరిత్ర గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే వారి కోసం కొన్ని లింకులు:


video.google.com/videoplay?docid=7730660376611492753#


http://www.telangana.org/TelanganaFAQ.asp


http://discover-telangana.org/wp/2002/08/06/gentlemens_agreement_andhra_telangana_1956/


http://discover-telangana.org/wp/2007/06/14/6point_formula_girglani_report_vol2/

http://telangana1969.com/martyrs1.html

http://telanganamedia.wordpress.com/

http://discover-telangana.org/

http://www.telangana.org/Home.asp


JAI TELANGANA ! JAI ANDHRA !! JAI RAYALA SEEMA !!!



,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,