Saturday, October 18, 2014

ఆసక్తి రేపే పుస్తకం “ఇండియాలో దాగిన హిందుస్తాన్” - సాక్షి సమీక్ష

గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని పుస్తక రచయిత పెరి అండర్సన్ అంటారు. పెరి అండర్సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలోఇండియన్ ఐడియాలజీపేరుతో ఇంగ్లిష్లో రాసిన పుస్తకమే ఇప్పుడుఇండియాలో దాగిన హిందుస్తాన్పేరుతో అనువాదమై వెలువడింది. పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి.

 ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు.

 లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది.

 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన  అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు.

 అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు.

 నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశంపుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు)

 మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది.
 
............................................................................................................. -
జి.ఆర్.మహర్షి

 ఇండియాలో దాగిన హిందుస్తాన్-
పెరి అండర్సన్;
హెచ్.బి.టి ప్రచురణ;
వెల: రూ.150;
ప్రతులకు: 040- 23521849

( సాక్షి 17-10-2014 ఫామిలీ   పేజ్ సౌజన్యంతో )
Pl Visit Hyderabad Book Trust Blog:
 

.

Friday, October 10, 2014

''ఇండియాలో దాగిన హిందుస్థాన్‌'' ('ది ఇండియన్‌ ఐడియాలజీ') - పెరి ఆండర్‌సన్‌


''ఇండియాలో దాగిన హిందుస్థాన్‌'' 
('ది ఇండియన్‌ ఐడియాలజీ') - పెరి ఆండర్‌సన్‌

    హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారికోసం నేను అనువాదం చేసిన పెరి ఆండర్‌సన్‌ రచన ''ఇండియాలో దాగిన హిందుస్థాన్‌'' ('ది ఇండియన్‌ ఐడియాలజీ') ఈమధ్యనే మార్కెట్‌లోకి విడుదలయింది.  ఈ పుస్తకంపై కొందరు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు:

    ''భారత గణతంత్ర రాజ్య వ్యవస్థ ఘనతను వేనోళ్ల కొనియాడుతూ.. దీన్ని మిక్కిలి శ్రేష్ఠమైనదిగా, అన్నింటికన్నా  ఉత్కృష్టమైనదిగా నమ్మిస్తుండే మేధావులూ, సిద్ధాంత కర్తలూ అందరినీ ఇబ్బంది పెట్టే .. ఇంకా చెప్పాలంటే కాస్త గట్టిగానే ఇరుకునబెట్టే వాదనలు చాలానే ప్రతిపాదించారు ఈ పుస్తకంలో పెరీ ఆండర్‌సన్‌.

    మన సమాజంలోని చెప్పనలవి గానంతటి హింస, దిగ్భ్రాంతికర అన్యాయాలన్నీ ఎక్కడో చెదురుమదురుగా తారసపడే పెడధోరణులే తప్పించి వాస్తవానికి మనది విజయవంతమైన నమూనానే అని గుడ్డిగా కొట్టిపారెయ్యకుండా ఆండర్‌సన్‌ వీటి మూలాలను లోతుగా పరిశీలించారు.

    మన వ్యవస్థలో ఉన్న తీవ్రమైన నిర్మాణాత్మక లోపాలతో పాటు స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచీ దశాబ్దాలుగా వ్యవస్థలను నడుపుతున్నవాళ్లు అనుసరించిన సామాజిక పక్షపాత ధోరణులను, మూలాల్లోనే వేళ్లూనుకుపోయిన ఆ వివక్షతలను స్పష్టంగా ఎత్తిచూపారు.

     ముందుగానే మూతి ముడుచుకుని ముఖం తిప్పేసుకోకుండా, మనసులో దురభిప్రాయాలేవీ పెట్టుకోకుండా .. మనం ఈ పుస్తకాన్ని సౌమనస్యంతో, శ్రద్ధాసక్తులతో చదవటం చాలా అవసరం.''

..................................................................................................................  - అరుంధతీ రాయ్‌

''కశ్మీర్‌లో భారత సైనిక జోక్యం, దాని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, చిత్రహింసలు, నిర్బంధాల విషయంలో భారత దేశపు మౌనాన్నీ, తప్పించుకోవడాన్నీ, వక్రీకరణలనూ పెరీ ఆండర్‌సన్‌ ఎత్తి చూపితే ఎవరూ సమాధానం చెప్పలేదు.

భారతదేశ సామాజిక, రాజకీయ జీవనరంగాలన్నింటిలో అగ్రవర్ణ హిందువుల పెత్తనం, వంచన - అవి బంధుప్రీతితో, వంశపారంపర్య పాలనతో పితృస్వామిక రాజ్యాన్ని నిర్మిస్తున్న తీరును ఆయన సవివరంగా వివరిస్తుంటే చాలామంది పాఠకులు నిర్ఘాంతపోతారు. ప్రత్యేకించి దేశ విభజనకు బ్రిటిష్‌ వలసవాద పాలకులూ, భారత ముస్లిం నేతలే కారణమనే దుష్ప్రచారాన్ని ఖండిస్తూ దేశ విభజనలో గాంధీ, నెహ్రూల పాత్రను సోదాహరణంగా వివరించడం వారి అభిమానులకు ఇబ్బంది కలిగిస్తుంది.'' 

........................... - పంకజ్‌ మిశ్రా, ఫారిన్‌ అఫైర్స్‌, న్యూయార్క్‌, నవంబర్‌-డిసెంబర్‌ 2012

''పెరీ ఆండర్‌సన్‌ భారతీయ భావజాలాన్ని ఎండగడుతూ 2012లో లండన్‌ రివ్యూ ఆఫ్‌ బుక్స్‌లో వరుసగా వ్యాసాలు రాస్తున్నప్పుడే భారతదేశంలోని వామపక్ష మేధోవర్గం తీవ్ర అసహనాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేసింది. చాలామంది ఈ పుస్తకాన్ని చదివి కూడా స్పందించకుండా మౌనం పాటించారు. మిగతా కొద్దిమంది దీనిని మొరటుగా ఖండించారు. తన పుస్తకం వర్తమాన భారతదేశంలో సంప్రదాయ జ్ఞానాన్ని సవాలు చేస్తూ ఐదు ప్రధాన వాదనలు ముందుకు తెచ్చిందని ఆండర్‌సన్‌్‌ అంటారు:

మొదటిది, ఆరువేల ఏళ్లుగా భారత ఉపఖండం అఖండంగా వుందనడమనేది ఒక అభూత కల్పన. రెండవది, గాంధీ జాతీయోద్యమంలోకి మతాన్ని తీసుకురావడం భారతదేశానికి ఒక విపత్తుగా మారింది. మూడోది, దేశ విభజనకు కాంగ్రెస్‌ పార్టీయే తప్ప బ్రిటష్‌ ప్రభుత్వం ప్రధాన కారణం కాదు. నాలుగోది, నెహ్రూ వారసత్వ పాలన భారత గణతంత్రానికి ఆయన అభిమానులు అంగీకరించిన దానికంటే ఎక్కువ నష్టం చేసింది. చివరగా, భారత ప్రజాస్వామ్యం కుల అసమానతలతో విభేదించడం లేదు, పైగా కుల అసమానతల వల్లే అది బతుకీడుస్తోంది. (ఇంటర్వ్యూ, అవుట్‌లుక్‌, నవంబర్‌ 12, 2012).

ఈ పుస్తకంలో విశ్లేషించిన ముఖ్యమైన విషయాలు స్వాతంత్య్రం, దేశవిభజన, గణతంత్రం. భారతదేశం మీద, భారతీయ భావజాలం మీద వీటి ప్రభావాలనూ, హిందూ అగ్రవర్ణ జాతీయవాదాన్నీ సవివరంగా చర్చించారు.''

          ........................  - ప్రొ. ఇనుకొండ తిరుమలి, హాన్స్‌ ఇండియా, 27 జనవరి 2013

ఈ పుస్తకంలో రచయిత వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు:

'' ఇండియాలో హిందుస్థాన్‌ అనే అర్థం దాగి వుంది. రాజ్యం రూపురేఖలనీ, స్వేచ్ఛకూ అణచివేతకూ మధ్యనున్న సరిహద్దులనీ, దేని అనుమతించాలి- దేన్ని నిషేధించాలి వంటి అంశాలనన్నింటినీ చాప కింద నీరులా ఇండియాలో దాగివున్న ఈ హిందూ అంశే నిర్దేశిస్తోంది.''

''స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలో చీలిక మతపరంగా వచ్చినదే అయినా అసలు మతపర పదజాలాన్నీ, భావజాలాన్నీ జాతీయోద్యమంలో ప్రవేశపెట్టినవాడు జిన్నా కాదు గాంధీ!''

''మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ విధానం తిరుగులేని లౌకికవాదం. అయితే గాంధీ పార్టీ పగ్గాలను చేపట్టిన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి ఆయన అంతకు మందు ఎప్పుడూ లేనంత అపారమైన ప్రజాభిమానాన్ని సమకూర్చడంతో పాటు - పార్టీలో పెద్ద ఎత్తున మతతత్వాన్నీ; జాతీయోద్యమంలో పురణాలనూ, ప్రతీకాత్మక వాదాన్నీ, మతధర్మ శాస్త్రాలనీ జొప్పించారు.''

''కులం అనేది ఒక పంజరం లాంటిది. భారత ప్రజాస్వామ్యం ఆ పంజరంలో భద్రంగానే వుంది. కానీ అది అందులోంచి తప్పించుకుని బయటపడవలసి వుంది.''

..................................................................................................................... - పెరి ఆండర్‌సన్‌

ఇండియాలో దాగిన హిందుస్థాన్‌
('ది ఇండియన్‌ ఐడియాలజీ') 
పెరి ఆండర్ సన్

ఆంగ్లమూలం : The Indian Ideology, Perry Anderson, Three Essays Collective, Gurgaon, Hyaryana
175 పేజీలు, ధర: రూ. 150/-

ప్రతులకు, వివరాలకు సందర్శించండి:
http://hyderabadbooktrust.blogspot.in/2014/10/indian-ideology.html