Thursday, October 6, 2016

నయాగరా !

నయాగరా !
ప్రపంచంలోనే అతిపెద్దదైన నయాగరా జలపాతాన్ని చూసేందుకు ఆరోజు బాల్టిమోర్‌ నుంచి ప్రొద్దున్నే కారులో బయలుదేరాం.
'నయాగరా సిటీ' చేరుకునేసరికి మధ్యాహ్నం రెండయింది.
నగర పొలిమేరలోనే 'నయాగరా నది' మమ్మల్ని పలకరించింది.
రోడ్డుకు సమాంతరంగా చాలాదూరం మాతోపాటే పరవళ్లు తొక్కుతూ వచ్చింది.
ఆన్‌లైన్‌లో ముందే బుక్‌ చేసుకున్న హోటల్‌కి నేరుగా వెళ్లాం.
కాసేపు నడుం వాల్చాలనుకుంటూనే యదాలాపంగా విండో కర్టెన్స్‌ని పక్కకు జరిపాం.
అంతే, నయాగరా నది మళ్లీ ప్రత్యక్షమయింది.
మధ్యాహ్నపు ఎండకు మిలమిల మెరిసిపోతూ, ప్రశాంతంగా, గంభీరంగా ప్రవహిస్తోంది.
మేం దిగిన హోటల్‌ నయాగరా నది ఒడ్డున్నే వుందన్న సంగతి అప్పటివరకు మాకు తెలియదు.
చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది.

మర్నాడు ఉదయం జలపాతం చూసేందుకు వెళ్దామనుకున్నవాళ్లం కాస్తా ఆ నయనమనోహర దృశ్యాన్ని చూశాక మనసు మార్చుకుని గబగబా ఫ్రెషప్‌ అయి వెంటనే జలపాతం వద్దకు వెళ్లిపోయాం.
ఆరోజు వర్కింగ్‌ డే కాబట్టి పర్యాటకుల రద్దీ తక్కువగా వుంది.

వీకెండ్‌లో, సెలవురోజుల్లో అయితే క్యూ లైన్లలోనే గంటలకు గంటలు గడపాల్సి వస్తుంది.
''మేడ్‌ ఇన్‌ అమెరికా'' స్టోర్‌ పక్కన వివిధ టూరిస్ట్‌ ఏజెన్సీలవాళ్లు టికెట్లు అమ్ముతూ కనిపించారు. నయాగరాను పూర్తిగా కవర్‌ చేసే మూడున్నర గంటల టూరిస్ట్‌ ప్యాకేజీ వుందని, ఆరోజు అదే చివరి ట్రిప్‌ అని చెప్పారు. సరే అని ''ఓవర్‌ ది ఫాల్స్‌ టూర్స్‌'' అనే ఏజెన్సీ వద్ద టికెట్లు తీసుకున్నాం.

ప్యాకేజీ టూర్‌లో సౌకర్యాలూ- అసౌకర్యాలూ రెండూ సరిసమంగా వుంటాయి. అన్నింటినీ కవర్‌ చేయగలగడం ఒక అడ్వాంటేజ్‌ అయితే - అడుగడుగునా టైమ్‌ రిస్ట్రిక్షన్‌ వల్ల దేనినీ పూర్తిగా ఆస్వాదించలేకపోవడం ఒక డిజడ్వాంటేజ్‌. ఖర్చు కూడా ఎక్కువే. అయినా ఒకోసారి తప్పదు.

కాసేపట్లోనే టూరిస్టు బస్సు వచ్చింది. అందరినీ ఎక్కించుకుని కొంత దూరం వెళ్లాక ఒకచోట ఆపి ''డ్రైవర్‌ కమ్‌ గైడ్‌'' తనని తాను పరిచయం చేసుకున్నాడు. అందరికీ ఆహ్వానం పలికాడు. ఆ పరిచయాలప్పుడు తెలిసింది బస్సులో మా ముగ్గురితోపాటు మొరాకో, సిరియా, ఇటలీ, చైనా, జర్మనీ దేశాలనుంచి వచ్చిన ఫామిలీస్‌ వున్నాయి. గైడ్‌ను మినహాయిస్తే అమెరికాకు చెందినవాళ్లు ఒక్కరు కూడా లేరు.

రిచర్డ్‌ అనే ఆ గైడ్‌ సరదాగా నవ్విస్తూ నయాగరా గురించి బోలెడు విశేషాలు చెప్పాడు. మధ్య మధ్య ఇలాగే చెప్తుంటానని అందరూ శ్రద్ధగా వినాలన్నాడు. పర్యటన ముగిసాక అందరూ ఒక పరీక్షను ఫేస్‌ చేయాల్సి వుంటుందన్నాడు. ఆ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి వెయ్యి డాలర్ల నజరానా ఇవ్వడం జరుగుతుందని ఊరించాడు.

అతని ఇంగ్లీష్‌ యాక్సెంట్‌ నాకు మాత్రం సంక్లిష్టంగా అనిపించింది. అందువల్ల సగం సగమే అర్థమయ్యేది.
నయాగరా జలపాతం నిజానికి మూడు జలపాతాల సమాహారం. 170 నుంచి 190 అడుగుల లోతైన లోయలో పడే ముందు నయాగరా నది రెండుగా చీలిపోయింది. మధ్యలో పెద్ద భూభాగం వుంటుంది. దానిని 'గోట్‌ ఐలాండ్‌' అంటారు.

అమెరికావైపు వున్న జలపాతాలను 1) ''అమెరికన్‌ ఫాల్స్‌'', 2) ''బ్రైడల్‌ వీల్‌ ఫాల్స్‌'' గా వ్యవహరిస్తారు. కెనడా వైపు జలపాతాన్ని ''హార్స్‌ షూ ఫాల్స్‌'' అంటారు.
అమెరికన్‌ ఫాల్స్‌ వెడల్పు 1060 అడుగులైతే, కెనడావైపు వున్న హార్స్‌ షూ ఫాల్స్‌ వెడల్పు 2600 అడుగులు.
అమెరికావైపు నుంచి హార్స్‌ షూ పాల్స్‌ పూర్తిగా కనిపించదు. అదే కెనడా వైపు నుంచైతే మొత్తం నయాగరా జలపాతపు విశ్వరూపాన్ని వీక్షించవచ్చు. ఆ దృశ్యం చాలా అద్భుతంగా వుంటుందట. అయితే కెనడావైపు వెళ్లాంటే తాత్కాలిక వీసా తీసుకోవాలి. అమెరికన్‌ పౌరసత్వం వున్నవాళ్లైతే గుర్తింపు కార్డుతో వెళ్లొచ్చట.

ఒకప్పుడు నయాగరా జలపాతం దాదాపు 11 కిలో మీటర్ల దిగువన ఎక్కడో వుండేదట. భూమిని కోత కోస్తూ, దిశను మార్చుకుంటూ ప్రస్తుత రాతి ప్రదేశంలో స్థిరపడిందట. అయితే ఇప్పటికీ ప్రతి సంవత్సరం అతి స్వల్పంగానైనా ఇంకా కోతకు గురవుతూనే వుందంటారు.

నయాగరా నది లోయ మీద నిర్మించిన ''రైన్‌బో బ్రిడ్జ్‌'' అమెరికా కెనడా దేశాలను కలుపుతోంది. దాని పొడవు కేవలం 1400 అడుగులే. అమెరికా ఒడ్డున నిలబడి ఈల వేస్తే కెనడా ఒడ్డుకు వినపడుతుంది. అంత దగ్గర.

కెనడా వైపు నయాగరా తీర ప్రాంతంలో ''ఆంటారియో'' నగరం వుంది. అనేక ఆకాశ హర్మ్యాలు, కేసినో, స్కైలాన్‌ టవర్‌ మొదలైన వాటితో ఆ నగరం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. అమెరికావైపు ఒక్క ''అమెరికన్‌ అబ్జర్వేషన్‌ టవర్‌'' తప్ప ఎలాంటి భారీ నిర్మాణాలూ లేకపోవడం వల్ల వెలవెలబోతున్నట్టుగా అనిపిస్తుంది.

బస్సు దిగి లిఫ్ట్‌లో దాదాపు 18 అంతస్తుల కిందకు నది ఒడ్డుకు వెళ్లాం. అక్కడ అందరికీ బ్లూ కలర్‌ రెయిన్‌ కోట్లు ఇచ్చారు. వాటిని ధరించి 'మెయిడ్‌ ఆఫ్‌ ది మిస్ట్‌' బోట్‌ ఎక్కాం. కెనడా వైపు నుంచి వచ్చే ప్రయాణికులు రెడ్‌ కలర్‌ రెయిన్‌ కోట్‌లు ధరించి తమ బోట్‌లో మన పక్కనుంచే వెళ్తూ కనిపిస్తారు.

బోట్‌ డెక్‌పై నుంచుని నయాగరా నదిలో ముందుకు సాగుతూ అమెరికన్‌ ఫాల్స్‌నీ, హార్స్‌ షూ ఫాల్స్‌నీ దర్శించడం ఎంతో అద్భుతమైన, అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది. హార్స్‌ షూఫాల్స్‌ బేసిన్‌ వరకు బోట్‌ వెళ్తుంది. అక్కడ 188 అడుగుల ఎత్తు మీద నుంచి ప్రతి సెకండ్‌కి ఆరు లక్షల గ్యాలన్‌ల చొప్పున నీళ్లు కిందకు దూకుతుంటాయి. ఒకటే హోరు.

లోయలోంచి నీటి తుంపరలు పెద్ద ఆవిరి మేఘంలా తయారై ఆకాశాన్ని తాకుతుంటాయి. ఎటు చూసినా నీళ్లే నీళ్లు.
మా గ్రూపులో చైనా యువతి చొరవగా మమ్మల్ని అడిగి మరీ మా సెల్‌ తీసుకుని ఫొటోలు తీసింది. అలాగా తమ జంటనూ మా చేత ఫొటోలు తీయించుకుంది. ఫాల్స్‌కి దగ్గరవుతున్నా కొద్ది మన మీద నీటి తుంపర్లు పడటం ఎక్కువై ఇంక ఫొటోలు తీసుకునేందుకు వీలు కాదు. మంచి కెమరా తీసుకుని, తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకుని వెళ్తే బాగుండేది.

ఆ తరువాత బ్రైడల్‌ వీల్‌ ఫాల్స్‌ వద్ద ''కేవ్‌ ఆఫ్‌ది విండ్‌ '' లోకి వెళ్లడం మరో అపూర్వ అనుభవం. అక్కడ మనకి యెల్లో కలర్‌ రెయిన్‌ కోట్లతో పాటు ప్లాస్టిక్‌ శాండిల్స్‌ కూడా ఇస్తారు. ''మీ చెప్పులని పాలిథిన్‌ కవర్లలో పెట్టివ్వండి నేను బస్సులో భద్రపరుస్తాను'' అంటూ గైడ్‌ స్వయంగా అందరి చెప్పులను ఎలాంటి భేషజం లేకుండా తీసుకెళ్లడం కదిలించింది.

చెక్కలతో నిర్మించిన అనేక మెట్లు దిగుతూ, ఎక్కుతూ నీటి గుహలోకి వెళ్లాలి. జలపాతం మన నెత్తిమీదే పడుతుందేమో అనిపిస్తుంది. హోరుమనే గాలివానలో నిలబడ్డట్టుగా వుంటుంది. ఎంత రెయిన్‌ కోట్లు ధరించినప్పటికీ చాలావరకు తడిచిపోతాం. ఆ నీటి హోరు మధ్య ఫోటోలు తీసుకోడానికి వీలుండదు.
నయాగరా సందర్శనానికి వెళ్లినప్పుడు మంచి కెమెరాలు తీసుకెళ్లడం, అవి నీటిలో తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం అనిపించింది.

ఐదు దశాబ్దాల క్రితం వరంగల్‌ ఎవి హైస్కూల్‌లో చదువుకున్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. మా స్కూలు భద్రకాళి చెరువు పక్కనే వుండేది. భారీ వర్షాలు పడ్డప్పుడల్లా ఆ చెరువు ''మత్తడి'' పారేది. మేం అక్కడికి కేరింతలు కొడుతూ పరుగెత్తుకెళ్లేవాళ్లం. పుస్తకాలను చెరువు కట్టమీద పెట్టి ఆ మత్తడి మీదుగా ఒక చివరి నుంచి మరో చివరికి వెళ్లే వాళ్లం. అప్పుడు అదో పెద్ద సాహస కార్యం. భద్రకాళి చెరువు మత్తడే మాకు పరిచయమైన తొలి మినీ నయాగరా! ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు అసలు నయాగరా నా చేత వయసును మరచిపోయి ఆనాటిలాగా మళ్లీ కేరింతలు కొట్టించింది .
వాహ్‌ నయాగరా!





























Tuesday, September 27, 2016

వాషింగ్టన్‌ డీ.సీ.ని చూడటానికి రెండు ''కాళ్లు'' చాలవు !

వాషింగ్టన్‌ డీ.సీ.ని చూడటానికి రెండు ''కాళ్లు'' చాలవు !
..................................................................................

అవును.
వాషింగ్టన్‌ డీ.సీ.ని చూడటానికి రెండు కళ్ళే కాదు రెండు 'కాళ్లు'' చాలవు అనే అనిపించింది.
వైట్‌ హౌస్‌కు ఎదురుగా రెండు మైళ్ల ఓ సరళ రేఖ గీచి-
దానికి ఒక చివరన 'లింకన్‌ మెమోరియల్‌' మరో చివరన 'కాపిటల్‌ బిల్డింగ్‌' నిర్మించినట్టుగా వుంటుంది.
మధ్యలో ''వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌''.
అంతే.
ఆ కాస్త ప్రదేశాన్ని చుట్ట బెడితే వాషింగ్టన్‌ డీసీని దాదాపు పూర్తిగా చూసినట్టే.
అయినా పైవిధంగా అనిపించడానికి కారణం-
సుప్రసిద్ధమైన, అద్భుతమైన మ్యూజియంలూ, పర్యాటక ప్రదేశాలు అన్నీ పోతపోసినట్టు ఆ రెండు మైళ్ల పరిధిలోనే వుండటం.

నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ, నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ అమెరికన్‌ హిస్టరీ, నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియం, నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌, ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియం, వాషింగ్టన్‌్‌ నేషనల్‌ కాథడ్రల్‌ మొదలైనవెన్నో!

అనేక టూరిస్ట్ బస్సులూ, ప్యాకేజీ టూర్లూ అందుబాటులో వుంటాయి. కావాలంటే సైకిళ్లు కూడా అద్దెకు దొరుకుతాయి. అయినప్పటికీ నడక తప్పదు. ఒక్కరోజులో వాటన్నింటి కవర్‌ చేయడం అసాధ్యమనే చెప్పాలి.

మేం ఉదయం తొమ్మిదికల్లా వాషింగ్టన్‌ డీసీ చేరుకున్నాం.
ఆరోజు ఆదివారం కావడం వల్ల పార్కింగ్‌ ప్లేస్‌ వెతుక్కుని కారుని పార్క్ చేయడానికే చాలా సమయం పట్టింది. ఇక అక్కడి నుంచి పాదయాత్రని మొదలుపెట్టాం.

వాషింగ్టన్‌‌ డీ.సీ. ప్లాన్డ్‌ సిటీ.
మేరీలాండ్‌ - వర్జీనియా రాష్ట్రాల మధ్యన వుంటుంది.
1790లో జార్జి వాషింగ్టనే స్వయంగా రాజధాని నిర్మాణం కోసం పది మైళ్ల పొడవు, పదిమైళ్ల వెడల్పుతో చతురస్రాకారంలో వున్న ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశాడట. చివరికి ఈ నగరానికి ఆయన పేరే పెట్టారు. అన్నట్టు డీ.సీ. అంటే ''డిస్త్రిక్ట్ ఆఫ్‌ కొలంబియా'' అట. వాషింగ్టన్‌ పేరిట మరో నగరం వుంది కాబట్టి దీనిని వాషింగ్టన్‌ డీ.సీ. అంటున్నారు.

నగరం నిండా ప్రభుత్వ భవనాలు, దేశ దేశాల రాయబార కార్యాలయాలు, మాన్యుమెంట్స్‌, మ్యూజియమ్సే ఎక్కువ. వ్యాపార హంగులు, ఆకాశ హర్మ్యాలు ఏమీ కనిపించవు. ఇప్పటికీ ఈ నగర జనాభా ఏడు లక్షల లోపే.
సుందరమైన నగర వీధుల గుండా నడుస్తూ, పచ్చని చెట్లూ, పార్కులూ, విగ్రహాలూ చూస్తూ వైట్‌ హౌస్‌ చేరుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివాసం వుండే భవనం కాబట్టి సెక్యూరిటీ చాలా ఎక్కువగా వుంది.
ఆమధ్య ఒక ఆగంతకుడు అందరి కళ్లు గప్పి వైట్‌ హౌస్‌ లోపలి వరకు వెళ్లిపోయాడట. అప్పటి నుంచి సందర్శకులను దూరం నుంచే పంపించేస్తున్నారు. వైట్‌ హౌస్‌ చుట్టూ ఎక్కడ చూసినా వస్తాదుల్లాంటి సాయుధ రక్షక భటులు ట్రిగ్గర్‌ మీద వేళ్లతో కనిపించారు.

నల్లజాతికి చెందిన తొలి అధ్యక్షుడిగా ఒబామా ఈ తెల్ల భవనంలో జెండా ఎగరేసి చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా వచ్చే సంవత్సరం తొలి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్‌ ఈ భవనంలో కొలువు తీరుతుందా? అని ఆలోచిస్తూ ముందుకు కదిలాం.

వైట్‌ హౌస్‌ చుట్టూ తిరిగి వెళ్లి కొంచెం దూరంలో ఎత్తైన దిబ్బ మీద వున్న ''వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌''కు చేరుకున్నాం. ఆ మాన్యుమెంట్‌ చుట్టూ వృత్తాకారంలో అమెరికా లోని 50 రాష్ట్రాలకు ప్రతీకగా 50 జెండాలు ఎగురుతున్నాయి.

నగరం మొత్తంలో బహుశ అన్నింటి కంటే ఎత్తైన కట్టడం అదే అనుకుంటా.
1885 లో నిర్మాణం పూర్తయింది. నలుపలకలుగా నిర్మించిన ఆ ఆకాశ స్తంభం ఎత్తు 555 అడుగులు.
పై వరకు వెళ్లడానికి లోపల ఎలివేటర్‌ సౌకర్యం వుంది.
అయితే రోజూ చాలా పరిమిత సంఖ్యలో పర్యాటకులను అనుమతిస్తారు. నామమాత్రపు సర్వీస్‌ చార్జి తప్ప ప్రవేశం ఉచితమే. కాకపోతే ముందే వచ్చి ఆ టికెట్లు పొందాల్సి వుంటుంది. అందువల్ల ఆ సౌకర్యాన్ని మేం వినియోగించుకోలేకపోయాం.

''వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌'' నుంచి అటు "లింకన్‌ మెమోరియల్‌" వైపు చూసినా, ఇటు "కాపిటల్‌ బిల్డింగ్‌" వైపు చూచినా పచ్చని తివాచీ పరచినట్టుగా వుంటుంది.
గడ్డి మైదానాలు, పార్కులు, ఫౌంటెన్లు, చెట్లు ... వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
ఒక విధంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కూ ఇండియా గేట్‌కూ మధ్యనున్న వాతావరణాన్ని తలపింపజేస్తుంది.
నడుస్తుంటే అలసట తెలియదు.

అసలు ఆకుపచ్చదనమే అమెరికా ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఫుట్‌పాత్‌ల పక్కన, ఇళ్ల ముందు ఎక్కడ చూసినా పచ్చని గడ్డి కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముందు విధిగా లాన్‌ను పెంచాలట. ఎక్కడా మట్టి నేల కనిపించదు. రోడ్ల కిరువైపులా దట్టమైన చెట్లు. అందుకే దుమ్మూ ధూళీ వుండదు.

ఇంకొక విశేషం ఏమిటంటే ఏచెట్టు మీద చూసినా ఉడతలే ఉడతలు.
అమెరికా ఉడతలు చాలా లావుగా, గుబురుగా వుంటాయి.
'రామ సేతు' నిర్మాణంలో పాలుపంచుకోక పోవడంవల్లనో ఏమో మన దేశంలోలాగా వాటి వీపుల మీద చారలు వుండవు.

వాషింగ్‌టన్‌ మాన్యుమెంట్‌ నుంచి ముందుకు కదిలి 'లింకన్‌ మెమోరియల్‌'కు చేరుకున్నాం.
అబ్రహామ్‌ లింకన్‌ స్మారకార్థం ఆ భవనాన్ని 1922లో నిర్మించారు.
లోపల కుర్చీలో ఠీవిగా కూర్చుని వున్న 19 అడుగుల అబ్రహాం లింకన్‌ పాలరాతి విగ్రహం వుంది.
అమెరికాలో బానిస విధానానికి సమాధి కట్టిన అబ్రహాం లింకన్‌ అంటే అదొ అభిమానం.
తొలినాళ్లలో ఆయన ఎదుర్కొన్న అనేక అపజయాలు, గడ్డం పెంచమని ఒక బాలిక ఇచ్చిన సలహా, తన కొడుక్కు ఎలాంటి చదువును నేర్పాలో ఉపాధ్యాయునికి ఆయన రాసిన లేఖ, ఆయన అధ్యక్షుడయ్యే నాటికి అమెరికాలో వున్న జాతివివక్ష, బానిస వ్యాపారం, అలెక్స్ హేలీ 'ఏడుతరాలు' నవల (రూట్స్‌)లో
అభివర్ణించిన నాటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి.

లింకన్‌ మెమోరియల్‌ ఎదురుగా 'నేషనల్‌ వరల్డ్ వార్‌-2 మెమోరియల్‌' వుంది. 2004లో జార్జిబుష్‌ ప్రారంభించారట. అలాగే వియత్నాం వార్‌ వెటరన్‌ మెమోరియల్‌, కొరియా వార్‌ వెటరన్‌ మెమోరియల్‌లు కూడా వున్నాయి.
నెత్తుటి అధ్యాయానికి ప్రతీకలు.

లింకన్‌ మెమోరియల్‌ భవనం మెట్ల మీద నిలబడే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ 1963లో లక్షలాది మంది నల్లజాతి ప్రజలను ఉద్దేశించి ''ఐ హావ్‌ ఏ డ్రీమ్‌....'' అనే గొప్ప ప్రసంగం చేశాడు.
అద్భుతమైన ఆ ప్రసంగాన్ని యూ ట్యూబ్‌లో నేను చాలాసార్లు వినివున్నాను.
ఆరోజు లింకన్‌ మెమోరియల్‌ మొదలుకుని కాపిటల్‌ బిల్డింగ్‌ దాకా గుమికూడిన ఇసుక వేస్తే రాలనంతమంది నల్లజాతి ప్రజలు ఆ ప్రసంగానికి ఉర్రూత లూగిపోయారు.

ఆతర్వాత లింకన్‌ మెమోరియల్‌ సమీపంలో వున్న చిన్న క్యాంటిన్‌లో అమెరికన్‌ ఫుడ్డుతో ఆకలి తీర్చుకుని మళ్లీ వాషింగ్టన్‌ మాన్యుమెంట్‌కు అక్కడి నుంచి కాపిటల్‌ బిల్డింగ్‌కు మినీ లాంగ్‌ మార్చ్‌.

కాపిటల్‌ బిల్డింగ్‌ను దూరం నుంచే చూశాం.
లోపలికి వెళ్లడానికి ముందస్తు పర్మిషన్లు తీసుకోవాల్సి వుంటుంది.
ఆ బిల్డింగ్‌లోనే సెనెట్‌ సమావేశాలు జరుగుతుంటాయి. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం కూడా అందులోనే జరుగుతుందట. మేం వెళ్లినప్పుడు పైన డోమ్‌కు ఏవో మరమ్మత్తులు అవుతున్నాయి.

మాకు అప్పటికే మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. చూడవలసిన మ్యూజియంలు, ఆర్ట్‌ గ్యాలరీలు ఇంకా బోలెడున్నాయి. అయినా ఓపికలేక ఒక్క ''నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ'' మాత్రం చూశాం.

నిజానికి ఆ ఒక్క మ్యూజియం చూడటానికే ఒక రోజంతా పడుతుంది. అంట పెద్దద్ది. అక్కడ ప్రిజర్వ్ చేసిన ప్రతి జంతువు కళేబరంలోనూ జీవకళ వుట్టిపడుతుంటుంది. చప్పుడు చేస్తే మీదపడతాయేమో అన్నట్టుగా వున్నాయి.
ఆ మ్యూజియం ప్రవేశం పూర్తిగా ఉచితం.

ఇదే కాదు ఏ మ్యూజియంకూ టికట్లు వుండవట.
వాషింగ్టన్‌ డీసీ షాన్‌ అదే.
(FB 15-9-2016)







Tuesday, September 20, 2016

పాతాళ లోకం !

 పాతాళ లోకం !
..................................

వర్జీనియా లోని ల్యురే కావెర్న్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అదేదో చిన్న థియేటర్ లాగా , షాపింగ్ మాల్ లాగా అనిపించింది.
టికెట్స్ మాత్రమే అక్కడ ఇస్తారు - అసలు కేవ్స్ మరెక్కోడో దూరంగా వుండొచ్చని అనుకున్నాం.
కానీ ఉదయం 9 కాగానే ఒక డోర్ ని ఓపెన్ చేసి లైన్ లో రమ్మన్నపుడు తెలిసింది - ఆ గుహల ప్రవేశ ద్వారం అక్కడే వుందని!

మాదే ఫస్ట్ బాచ్.
ప్రొద్దున్నే వెళ్ళడం మంచిదయింది.
ఆ తర్వాత సందర్సకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

మసక వెలుతురులో ఒక్కో మెట్టు దిగుతుంటే నిజంగా ఏదో పాతాళ లోకం లోకి వెళ్తున్నట్టే అనిపించింది.
'బాహుబలి', 'అవతార్' వంటి సినిమాలలోని అద్భుత మైన సెట్టింగ్స్ లాంటి ఆ నిర్మాణాలు వాటికవే ప్రకృతి సహజంగా ఏర్పడ్డాయంటే నమ్మబుద్ది కాదు.

బయలు దేరే చోటు నుంచి తిరిగి వెనక్కి రావడానికి రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి వుంటుంది.

లోపల ఒక అద్భుతమైన "డ్రీమ్ లేక్ "వుంది.
అందులో అద్దంలో కంటే చాలా స్పష్టంగా పై కప్పు ప్రతిబింబిస్తూ వుంటుంది.
ఆ చెరువు ఎంతో లోతుగా వున్నట్టు అనిపిస్తుంది కానీ జానెడు కంటే ఎక్కువ లోతు వుండదట.
కొన్ని చోట్ల మాత్రం అడుగున్నర లోతు వుండవచ్చట. అంతే.
చాలా ఆశ్చర్యం వేసింది.

అక్కడి అపురూప దృశ్యాలు చూస్తుంటే నాకు అరకు లోయలోని 'బొర్రా గుహలు' గుర్తుకొచ్చాయి.
ల్యురే కేవ్స్ కీ - బొర్రా కేవ్స్ కీ మధ్య చాలా సారూప్యతలున్నాయి.
రెండు గుహలూ అనేక లక్షల సంవత్సరాల క్రితం సున్నపు రాయి, ఇసుక, వివిధ రసాయనాలు, నీళ్ళు కలగలసి రూపు దిద్దుకున్నాయి.

అక్కడి ఒక క్యూబిక్ అంగుళం పదార్ధం ఏర్పడి గట్టిపడటానికి దాదాపు 120 సంవత్సరాలు పడుతుందట.
దానిని బట్టి ఆ గుహలు ప్రస్తుత రూపంలోకి రావడానికి ఎంత సుదీర్ఘ కాలం పట్టి వుంటుందో ఊహించు కోవలసిందే.
బొర్రా గుహలు అనంతగిరి కొండల మీద వుంటే, ల్యురే గుహలు అపలచియాన్ కొండల మీద వున్నాయి.
ల్యురే గుహలను 1878 లో కనుగొంటే, బొర్రా గుహలను 1807 లో కనుగొన్నారు.

ల్యురే కేవర్న్స్ పక్కనే రంగురాళ్ళ షాపింగ్ సెంటర్ వుంది.
'కార్ అండ్ కారేజ్ కారవాన్ మ్యూజియం', పిల్లలు విశేషంగా ఆకట్టుకునే 'ది గార్డెన్ మేజ్', 'రోప్ అడ్వెంచర్ పార్క్', 'సింగింగ్ టవర్' కాస్త దూరంలో జూ వంటి పర్యాటక ప్రదేశాలు విశేషాలు ఎన్నో వున్నాయి.

(ఫేస్ బుక్ పోస్ట్ 10 సెప్టెంబర్ 2016)







చెట్టంత మనిషి !

చెట్టంత మనిషి !
........................

బాల్టిమోర్ ఇన్నర్ హార్బర్ లోని "రిప్లేయిస్ బిలివ్ ఇట్ ఆర్ నాట్ " ఆడిటోరియంలో చూశాం ఈ చెట్టంత మనిషిని.

పేరు 'రాబర్ట్ వాడ్లో'.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో నమోదయ్యాడు.

ఎత్తు 8 అడుగుల 11 అంగుళాలు.
బరువు 439 పౌండ్లు (199 కిలోలు).
1918 లో ఇల్లినాయిస్ లో పుట్టిన ఇతను 22 ఏళ్ల వయసులోనే (1940) చనిపోయాడు.

"రిప్లేయిస్ బిలివ్ ఇట్ ఆర్ నాట్ " ఆడిటోరియంలో ఇంకా ఇలాంటి ప్రత్యేకతలున్న వ్యక్తుల లైఫ్ సైజ్ విగ్రహాలు, విశేషాలు చాలా వున్నాయి.
అన్నింటికంటే ఎక్కువమంది సందర్శకులను ఆకట్టుకుంటున్నది మాత్రం 'రాబర్ట్ వాడ్లో' యే.
అందరితోపాటు మేమూ జీవకళ ఉట్టిపడుతున్న అతని స్టాచ్యూ పక్కన నిలబడి ఇదిగో ఇలా ఫోటోలు దిగాం.

రాబర్ట్ వాడ్లో పేరుని, రూపాన్ని, విశేషాలని అమెరికాలో శాశ్వతంగా పదిల పరచుకున్నారు.
అతను అందరు శిశువుల్లా సాధారణ ఎత్తు బరువుతోనే పుట్టినా
ఏడాది తిరిగేసరికి మూడున్నర అడుగులకు ,
ఐదేళ్ళ వయసు వచ్చేసరికి ఐదున్నర అడుగుల ఎత్తుకు ,
ఎనిమిదేళ్ళ వయసు వచ్చేసరికి తన తండ్రికంటే పొడుగ్గా ఆరడుగులకు పెరిగిపోయాడట.

చనిపోయే రోజు వరకూ ఇలా ఆగకుండా పెరుగుతూనే ఉన్నాడట. మరి కొన్నేళ్ళు బతికి వుంటే మరింత పొడుగు పెరిగివుండే వాడంటారు.
పిట్యుటరీ గ్లాండ్ లో హైపర్ ప్లాసియా వల్ల ఇలాంటి పెరుగుదల చోటుచేసుకుంటుందట.
మనకు విశేషంగా అనిపిస్తుంది కానీ ఈ అసాధారణ ఎదుగుదల వల్ల వాళ్ళు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

రాబర్ట్ వాడ్లో విగ్రహాన్ని చూస్తున్నప్పుడు నాకు ఇటీవలే చనిపోయిన మన' ఏడున్నర అడుగుల ' కరీంనగర్ 'గట్టయ్య' గుర్తుకువచ్చాడు. మనం కూడా గట్టయ్య విగ్రహాన్ని, వివరాలని ఎక్కడైనా పదిలపరచుకుంటే బాగుటుంది కదా అనిపించింది.
(ఫేస్ బుక్ 8 సెప్టెంబర్ 2016)





Wednesday, July 6, 2016

చలో అమెరికా !

చలో అమెరికా !
2 జులై 2016
మొట్టమొదటిసారి విమానం ఎక్కబోతున్నాం.
ఏకంగా 18 గంటలు మేఘాల మీద గాలిలో తేలియాడబోతున్నాం. చాలా థ్రిల్లింగ్ గా వుంది.
గాలిలో తేలాలన్న కోరిక ఈనాటిది కాదు. చిన్నప్పుడు 'కీలుగుర్రం' సినిమా చూసినప్పటి నుంచీ మనసులో గూడు కట్టుకుని ఊరిస్తూనే వుంది.
అక్కినేని నాగేశ్వరరావుని రిక్వెస్ట్‌ చేసి ఆయన కీలుగుర్రం తీసుకుని ఆకాశంలో వరంగల్‌, హన్మకొండ చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టేవాణ్నో ఆరోజుల్లో.
విచిత్రం ఏమిటంటే ఆనాటి ఊహల్లో కూడా నేను ఎప్పుడూ వరంగల్‌ దాటి వెళ్లలేదు. ఎంతసేపూ ఆజంజాహీ మిల్లు పొగగొట్టం, వరంగల్‌ కోట, భద్రకాళి చెరువు, వేయిస్థంభాల గుడి వీటి మీదుగానే తిరిగేవాణ్ని. ఆ కీలుగుర్రం మీద కనీసం ఒక్కసారైనా హైదరాబాద్‌ చుట్టి వచ్చిన గుర్తులేదు. బహుశ నాకు అప్పుడు వరంగల్‌ తప్ప మరో ప్రపంచం ఏదీ తెలియకపోవడమే అందుకు కారణం కావచ్చు.
ఆతరువాత గత సంవత్సరం ఇవేరోజుల్లో బంధుమిత్రులతో కలిసి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లినప్పుడు బాల్టాల్‌లో కనీసం హెలీకాప్టర్‌ అయినా ఎక్కాలని ఎంతో తహతహలాడాను. కానీ వాతావరణం బాగాలేకపోవడంతో ఆరోజు హెలీకాప్టర్‌ సర్వీసును రద్దు చేశారు.
గత్యంతరం లేక డోలీలో వెళ్లాల్సి వచ్చింది. డోలీ అంటే చచ్చిన తరువాత నలుగురు మనుషులు శవాన్ని మోసుకెళ్లినట్టు మోసుకెళ్లడం. కాకపోతే అక్కడ పాడె మీద శవాన్ని పడుకో బెడతారు. ఇక్కడ మనం ఇంకా ప్రాణమున్న మనుషులం కాబట్టి పాడె మీద ఓ కుర్చీ వేసి కూర్చోబెడతారు. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. సరే అది వేరే కథ.
2010లో కూడా నాకు అనుకోకుండా విమానంలో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. 'ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర' అనువాదానికి గాను నాకు అప్పుడు అనూహ్యంగా కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాదక బహుమతిని ప్రకటించారు.
బహుమతి ప్రదానోత్సవం గోవా రాజధాని పనాజీలో. విమానంలో కూడా రావచ్చన్నారు కానీ ఒక్కరికే రాను పోను ఛార్జీలు చెల్లిస్తామన్నారు. శ్రీమతిని వెంట తీసుకొస్తే మాత్రం ఆ టికెట్‌ ఖర్చును మీరే భరించాల్సి వుంటుందన్నారు. టూ టైర్‌ ఎసి ట్రైన్‌లో అయితే ఇద్దరి ఫేర్‌ మేమే భరిస్తామన్నారు. దాంతో ఎంతో తర్జన బర్జన పడి చివరికి ఇద్దరం ట్రైన్‌లోనే గోవాకు వెళ్లాం.
ఇన్నాళ్ల తరువాత ఇవాళ ఏకంగా 18 గంటల పాటు మేఘాలలో తేలిపోయే అదృష్టం వచ్చింది. ఇది ఊహించని ప్రయాణం. అనవసరపు ఖర్చెందుకు, మీ పెళ్లిల్లయిన తరువాత వస్తామన్నా వినకండా పిల్లలు టికెట్లు పంపించారు.
అమెరికాలో మూడు నెలలు మకాం. నలభై ఐదు రోజులు న్యూయార్క్‌ దగ్గరి బాల్టిమోర్‌లో, నలభై ఐదు రోజులు డల్లస్‌లో.
ప్రయాణ ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడం వల్ల హడావిడిలో నా మనసులో వున్న ఆలోచనలను సరిగా పంచుకోలేకపోతున్నాను. మరో సారి వివరంగా రాస్తాను. అంతవరకు సెలవు.
(Dt.02-07-2016)

Wednesday, June 29, 2016

ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ జ్ఞాపకం


స్థలం: ఆదర్శ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, జమ్మికుంట, కరీంనగర్‌
కాలం: 1968- 69 మధ్య.
ఫొటోలో వున్న వారు వరుసగా ఎడమ నుండి కుడికి: శ్రీ యం.వి తిరుపతయ్య (తెలుగు లెక్చరర్‌), శ్రీ రంగనాథ (వైస్‌ ప్రిన్సిపాల్‌), శ్రీ లక్ష్మారెడ్డి (ప్రిన్సిపాల్‌), శ్రీ కృష్ణ (ఇంగ్లీష్‌ లెక్చరర్‌), చివరగా మొండి ప్యాంట్‌, హవాయి చెప్పులతో బెరుకు బెరుకుగా నేను.
సందర్భం: కాలేజ్‌ మ్యాగజైన్‌ ఎడిటోరియల్‌ బోర్డు.

ఇక్కడ బ్లాక్‌ విచారానికీ, వైట్‌ సంతోషానికీ ప్రతీకలు. ఏకకాలంలో ఆ రెండు అనుభూతులను గుర్తుచేసే ఫొటో ఇది.
ముందుగా విచారం గురించి చెప్పుకోవాలి:

మల్టీపర్పస్‌ హెచ్‌ఎస్‌సి పూర్తయిన తరువాత బీఎస్‌సి చదివి సైన్స్‌ టీచర్‌ని అవాలన్నది అప్పటి నా రంగుల కల.
కానీ, 'ఇంక చదివిచ్చుడు నా వల్ల కాదు. మిల్లులో కార్మికుడిగా చేరి ఇంటికి ఆసరాగా వుండు' అంటాడు మా నాయిన. ఆరోజుల్లో ఆయన పనిచేసే ఆజంజాహి మిల్లులో 'బదిలి పాటీలు' (టెంపరరీ కార్మికుల కార్డులు) సులువుగా ఇచ్చేవారు. పర్మినెంట్‌ కార్మికులెవరైనా పనికి డుమ్మా కొడితే వారి స్థానంలో పనిచేయాలి.
కార్మికుల పిల్లలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు.
నాతో పాటు చదువుకున్న కొందరు పేద కార్మికుల పిల్లలు అప్పటికే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి కార్మికులుగా మారిపోయారు.

అయితే నేను మాత్రం చదువుకుంటాను తప్ప పనిలో చేరను అని భీష్మించుకుని కూర్చున్నాను.
ఆనాడు వరంగల్‌ జిల్లా మొత్తానికి ఒకే ఒక్క ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ వుండేది.
అక్కడ సీటు దొరకని వాళ్లంతా పొలో మంటూ వరంగల్‌ సమీపంలోని జమ్మికుంటకు వెళ్లేవారు. అప్పటికే ఏవీ హైస్కూల్‌ లోని నా క్లాస్‌మేట్స్‌ చాలా మంది అక్కడ చేరిపోయారు. అది ప్రైవేటు కాలేజి.

నా ఏడుపులు, అలకలు, భూక్‌హర్తాళ్‌లు ఏవీ మా నాయన ముందు పనిచేయలేదు. చూస్తుండగానే కాలేజీలు తెరిచి మూడు నెలలు గడచిపోయాయి.

చివరికి మా అమ్మ మనసే కరిగింది (ఎంతైనా అమ్మ అమ్మే కదా). తన వద్ద కొన్ని నల్లపూసల గుండ్లు, రెండు వెండి కడియాలు వుండేవి. తను ఎనిమిదేళ్ల వయసులో వుండగా వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు ఆమె ఒంటిమీద నుంచి తీసిచ్చారట. వాటిని చాలా అపురూపంగా చూసుకునేది. అలాంటి వాటిని అమ్మో కుదువబెట్టో మొత్తం మీద రెండు వందల రూపాయలు తెచ్చి ''ఎట్లైతె అట్లైంది మంచిగ సదువుకో కొడుకా'' అంటూ నా చేతిలో పెట్టింది.
ప్రాణం లేచొచ్చినట్టయింది. ఎక్కడలేని సంతోషంతో రయ్యిమని జమ్మికుంటకు వెళ్లిపోయాను.

తీరా చూస్తే అక్కడ బిఎస్‌సిలో చేరాలంటే 300 రూపాయలు కట్టాలన్నారు. బిఎ, బికాంలకు మాత్రం 200 రూపాయలు.
నా ఉత్సాహమంతా నీరుకారిపోయింది.
ఏం చేయాలో పాలుపోలేదు.
ఇంటికి వెళ్లి మరో వంద రూపాయలు తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదు. వున్న రెండు వందలూ పోతాయి.
ఆలోచించి ఆలోచించి చివరికి బిఏలో చేరాలని నిర్ణయించుకున్నాను.

ఫాం నింపి ఫీజు కట్టబోతుంటే అకౌంటెంట్‌ ''బీఏలో చేరితే ఏం ఫ్యూచర్‌ వుంటుంది బాబూ. బీకామ్‌లో చేరు. బ్యాంకు ఉద్యోగం దొరుకుతుంది'' అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు. పెద్దాయన అనుభవంతో, నా మేలు కోరి చెబుతున్నాడు, సైన్స్‌ టీచర్‌ కంటే బ్యాంకు ఉద్యోగం ఏం తీసిపోదు కదా అనుకుని అప్లికేషన్‌లో బీఏను కొట్టేసి బికామ్‌ అని రాసి ఫీజు కట్టేశాను.

అక్కడ నా తోటి ఏవీ హైస్కూల్‌ విద్యార్థులంతా బీఎస్సీలో వున్నారు, నేనొక్కణ్నే ''భీ ఖాం !''
కాలేజీలో చేరానన్న ఆనందం ఆవిరైపోయింది.

రశీదు జేబులో పెట్టుకుని భారమైన మససుతో కాసేపు కాలేజీలోనే అటూ ఇటూ తిరిగాను.
క్లాసులు జోరుగా జరుగుతున్నాయి.
హఠాత్తుగా నోటీసు బోర్డు మీదున్న ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది.
కాలేజీ మ్యాగజైన్‌ ఎడిటర్‌ సెలక్షన్‌ కోసం ఆరోజు సాయంత్రం 5 గంటలకు వ్యాస రచన పోటీ వుందన్నది దాని సారాంశం.

ఇప్పుడే ఫీజు కట్టాను. ఇంకా క్లాసులో అడుగుపెట్టనే లేదు. అప్పుడే పోటీలో పాల్గొనొచ్చో లేదో అని సంశయిస్తూ అకౌంటెంట్‌ని అడిగితే పోయి ప్రిన్సిపాల్‌ని కలవమన్నారు. అంతకు కొంత సేపటి క్రితమే ఆయనను కలిశాను కాబట్టి పెద్దగా జంకు అనిపించలేదు.
''ఎందుకా డౌట్‌. ఫీజు కట్టావంటే నువ్వు మా కాలేజ్‌ స్టుడెంట్‌ అయిపోయినట్టే కదా. శుభ్రంగా వెళ్లి పాల్గో'' అన్నారాయన.

సరే చూద్దాం అని సాయంత్రం ఐదయ్యే వరకు కాలేజీ ఆవరణలోని ఓ చెట్టు కింద కాలక్షేపం చేశాను. కాలేజీలో చేరిన ఆనందం కంటే బీఎస్సీ మిస్‌ అయిందే అన్న దిగులే ఎక్కువయింది. ఆగి ఆగి లోపలినుంచి ఏడుపు తన్నుకొచ్చింది.
వ్యాస రచన పోటీలో ఏం టాపిక్‌ ఇచ్చారో, ఎలా రాశానో ఇప్పుడేమీ గుర్తులేదు.

కానీ వారం రోజుల తరువాత నేను ట్రంకుపెట్టె, బియ్యం మూట పట్టుకుని జమ్మికుంట బస్టాండ్‌లో దిగుతుంటే నలుగురైదుగురు పాత ఫ్రండ్స్‌ దగ్గరకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పడం మొదలుపెట్టారు.
నా వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చిందట, కాలేజి మ్యాగజైన్‌కు తెలుగు ఎడిటర్‌గా సెలక్ట్‌ అయినట్టు నా పేరు నోటీసు బోర్డు మీద పెట్టారట.
ఇంకా క్లాసులో అడుగుపెట్టక ముందే కాలేజీ మ్యాగజైన్‌కు ఎడిటర్‌ని కావడం నిజంగా ఒక థ్రిల్లింగ్‌ అనుభవం.
భీకర బీకాం బాధకి అదొక విరుగుడన్నమాట.

అప్పటికే తెలుగు లెక్చరర్‌ యం.వి.తిరుపతయ్యగారు రెండు మూడు సార్లు నాకోసం వాకబు చేశారట. మర్నాడే స్టాఫ్‌ రూంకి వెళ్లి ఆయనను కలిశాను. షేక్‌ హాండిచ్చి ''చాలా బాగా రాశావయ్యా'' అని మెచ్చుకున్నారు. ''నీ వ్యాసం మా వాళ్లు ఎవరైనా చదివితే అది నేనే నీకు రాసిచ్చాననుకుంటారు'' అన్నారు. ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు.
''ప్రతి సంవత్సరం ఎడిటర్‌ సెలక్షన్‌ జరుగుతోంది కానీ ఇంత వరకు మ్యాగజైన్‌ మాత్రం బయటికి రాలేదు. ఈసారి అట్లా కాకూడదు. కష్టపడి ఎలాగైనా మ్యాగజైన్‌ని తీసుకురావాలి మనం'' అన్నారు.
''తప్పకుండా సర్‌'' అన్నాను.
కాలేజీలో చేరిన మరుక్షణం నుంచీ మ్యాగజైన్‌ వర్కే నాకు ప్రథానమైపోయింది.

చదువు విషయానికి వస్తే ఒక్క తెలుగు, ఇంగ్లీషు క్లాసులు తప్ప ఏవీ ఇంట్రెస్టుగా వుండేవి కాదు. ఆ లయబిలిటీసేమిటో, అసెట్సేమిటో, ఆ బ్యాలెన్స్‌ షీట్లేమిటో ఏ పాఠమూ కొరుకుడు పడేది కాదు. అమ్మడమూ కొనడమూ ఏదీ రాని నాకు ఆ వ్యాపార పాఠాల వల్ల ఏం ఉపయోగమో ఏమీ అర్థమయ్యేది కాదు. వింటుంటే పిచ్చెత్తినట్టుగా వుండేది.

నా రూంమేట్స్‌ ఇద్దరూ బీఎస్సీనే. వాళ్ల టెక్ట్స్‌ట్‌ బుక్స్‌ పట్టుకుంటే ఎంత ముచ్చటగా అనిపించేదో. అదే నా టెక్స్ట్‌ బుక్స్‌ పట్టుకురటే అరచేతుల మీద తేళ్లు, జెర్రులు పాకుతున్నట్టనిపించేది.

నా జీవితంలో అప్పుడే డిప్రెషన్‌ మొదలయింది.

అయితే అది ముదిరి పాకాన పడకుండా కాలేజి మ్యాగజైన్‌ వర్క్‌, సాహితీ సేవ అడ్డుకున్నాయి.
''వరంగల్‌లో లాగా మనం కూడా ఇక్కడ చిన్నగా ఒక సాహితీ మిత్రమండలిని మొదలుపెడదాం'' అన్నారు తిరుపతయ్య గారు.
ప్రారంభంలో నన్నే దానికి కన్వీనర్‌గా వుంచారు. పేరుకు కన్వీనర్నే గానీ అన్ని తనే చూసుకునేవారు. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట అన్నట్టుగా వుండేది.
మొదట్లో మిత్రమండలి సమావేశాలకి పట్టుమని పదిమంది కూడా వచ్చేవారు కాదు. కానీ రాను రాను ఆ సంఖ్య నలభై యాభైకి పెరిగింది. విద్యార్థులతోపాటు లెక్చరర్లు, స్థానిక టీచర్లు, ఒకోసారి మా ప్రిన్సిపాల్‌ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేవారు.

ఒకసారి నేను కరువు మీద రాసిన కవితకి మంచి అప్లాజ్‌ వచ్చింది. దానిని 'సృజన' కు పంపించమన్నారు సార్‌. తనే ఆ కవిత మీద రెండు వాక్యాలేవో రాశారు. నేను సృజనకు పోస్ట్‌ చేశాను. వారం రోజులలోపలే వరవరరావు గారి దగ్గర నుంచి నాకు ఒక పోస్ట్‌ కార్డ్‌ వచ్చింది.
'డియర్‌ ప్రభాకర్‌, నీ కవిత అందింది. బాగుంది. మంచి కవితకు సిఫారసు అక్కరలేదు. ఈ నెల సంచికలోనే ప్రచురిస్తున్నాం' అని వుంది.
చాలా సంతోషంగా దానిని తీసుకుని తిరుపతయ్య గారి ఇంటికి వెళ్లాను. చూసి నాది సిఫారసు ఎట్లవుతుంది. సృజన నిర్వాహకుల్లో నేనూ ఒకణ్ని కదా. అది నా అభిప్రాయం, నా సెలక్షన్‌. అంతే. ఆ విషయమే వరవరరావుకు రిప్లై రాయమన్నారు.
నేను బెంబేలు పడిపోయాను. వద్దు సార్‌ బాగుండదు సార్‌ అంటూ నసిగాను.

మరోసారి 'అరుణవర్ణం' అనే కవితను రాసి మిత్రమండలిలో చదివి వినిపించకుండానే 'విద్యుల్లత'కు పంపించాను. 'రక్తంలో ముంచి తీసినట్టుండే మందార పుష్పం, రుధిరంతో అలికనట్టుండే సంధ్యాకాశం నాకు ఎంతో ఎంతో ఇష్టం' అంటూ ఏదో రాసినట్టు గుర్తు.
రెండు రోజుల్లోనే తిరుపతయ్యగారు పిలిచి విద్యుల్లతకు పంపిన కవిత బాగుంది. కొంచెం ముందుగా కవితల పోటీకి పంపితే ప్రైజు వచ్చివుండేది. వచ్చేనెలలో ప్రింట్‌ అవుతుంది. కాకపోతే కవిత శీర్షికను 'ఎరుపు రంగు' అని మార్చాను'' అన్నారు. సార్‌కు విద్యుల్లత పత్రికతో వున్న అనుబంధం గురించి నాకు అంతవరకు తెలియదు.

కాలేజీ అనుభవాలు ఇంకా చాలా వున్నాయి.
కానీ ఇది ఫొటోకు పరిమితమైన కథనం కాబట్టి వాటినేమీ ఇక్కడ ప్రస్తావించడం లేదు.

''మరో రెండేళ్లు కష్టపడి తెలుగు ఎంఏ చేయి. డబ్బులు నేనిస్తాను. నీకు ఉద్యోగం దొరికినతరువాత తీరుద్దువుగానీ'' అనేవారాయన. కానీ ఇంటి పరిస్థితులు సహకరించక వారి చేయూతని ఉపయోగించుకోలేకపోయాను.
మొత్తం మీద బీకాం పాసయ్యాను.
ఆజంజాహీ మిల్లులో ఉద్యోగం రెడీగా వుంది.
అయితే ఈసారి టెంపరరీ కార్మికుడి ఉద్యోగం కాదు. టెంపరరీ క్లర్కు ఉద్యోగం.
రిజల్ట్స్‌ రాకముందే ఆ ఉద్యోగంలో చేరిపోయాను. అదో ప్రహసనం.
ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో చూసినప్పుడల్లా ఇలా ఏదో అలజడి కలుగుతూనే వుంటుంది.

Saturday, April 16, 2016

బుద్ధుడూ - బౌద్ధమత భవిష్యత్తూ , రచన : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌

బుద్ధుడూ - బౌద్ధమత భవిష్యత్తూ

మత ప్రవక్తలు ఎంతోమంది వున్నప్పటికీ ఈ ప్రపంచాన్ని నలుగురు మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేశారంటారు అంబేడ్కర్‌ ఈ రచనలో.

వాళ్లు బుద్ధుడు, జీసస్‌, మహమ్మద్‌, కృష్ణుడు.
జీసస్‌ తనని తాను దేవుని కుమారుడిగా చాటుకుంటే,
మహమ్మద్‌ తాను  దేవదూతగా వచ్చినట్టు చెప్పుకున్నాడు. ఇంకో అడుగు ముందుకువేసి తానే 'చిట్టచివరి దేవదూతను' తన తదనంతరం మరే దేవదూతా వుండరని ప్రకటించాడు.
ఇక కృష్ణుడైతే తాను సాక్షాత్తు దేవుడిగా, దేవాధిదేవుడిగా చాటుకున్నాడు.

కానీ బుద్ధుడు మాత్రం ఎప్పుడూ తనకు తాను అలాంటి హోదాను ఏదీ ఆపాదించుకోలేదు. ఆయన సామాన్య మానవుడిగా వుండేందుకే ఇష్టపడ్డాడు. తన శిష్యులకు ఒక సామాన్య మానవుడిగానే ప్రబోధించాడు. తనకు తాను ఎన్నడూ మానవాతీత నేపథ్యాన్ని గానీ, మానవాతీత శక్తులను గానీ ఆపాదించుకోలేదు. ఎలాంటి అద్భుతాలను ప్రదర్శించలేదు.

మిగతా ముగ్గురి ప్రబోధాలు ప్రశ్నించడానికి వీలులేనివి. తిరుగులేనివి. దివ్యమైనవి. కానీ బుద్దుడి ప్రబోధాలు "కారణం-అనుభవం" అనే సూత్రాల మీద ఆధారపడినవి. తన శిష్యులెవరూ ''తాను చెప్పాను కాబట్టి'' అనే దృష్టితో తన ప్రబోధాలను ఆమోదించవద్దంటాడు బుద్ధుడు. "కారణం, అనుభవం" ఆధారంగా పేర్కొనబడినవి కాబట్టి వాటిని సవరించవచ్చు లేదా ఆయా పరిస్థితులకు వర్తించకపోతే విసర్జించవచ్చు అంటాడు.
మరే ఇతర ప్రవక్తా ఇలా అనుమతించేందుకు సాహసించలేదు.

హిందూమతం చాతుర్వర్ణ వ్యవస్థతో సమాజంలో దారుణమైన అసమానతలను సృష్టించి, పెంచి పోషిస్తే - బుద్ధుడు వర్ణ వ్యవస్థను గట్టిగా ఖండించాడు. హింసను, జంతుబలులను తీవ్రంగా నిరసించాడు. శాంతి, అహింస, సర్వమానవ సమానత్వంను ప్రబోధించాడు.
ఈనాటి ప్రపంచానికి సరైన మతం బౌద్ధమతం ఒక్కటే అంటారు అంబేడ్కర్‌.
చివరగా ఆయన ఇలా చెప్తారు:

.. బౌద్ధ మత వ్యాప్తికి పరిస్థితులు ఎంతో అనుకూలంగా వున్నాయి.
ఒకప్పుడు మతం అనేది వ్యక్తులకు వారసత్వంగా సంక్రమించేవాటిలో ఒకటిగా వుండేది. ...
ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తమకు వారసత్వంగా సంక్రమించిన మతాన్ని ధిక్కరించేందుకు సాహసిస్తున్నారు.
ఎంతోమంది శాస్త్రీయ పరిజ్ఞానం ప్రభావంతో అసలు మతమనేదే తప్పు, దానిని వదిలివేయాలని భావిస్తున్నారు.

మర్క్సిస్టు ప్రబోధాల ప్రభావంతో మరికొందరు మతం మత్తు మందు అనే నిశ్చయానికొచ్చారు. పేద ప్రజలు ధనికుల పెత్తనానికి లోబడి వుండేట్టు చేస్తుంది కాబట్టి మతాన్ని విసర్జించాలంటారు వాళ్ళు.
కారణాలు ఎమైనా కావచ్చు కానీ కానీ ప్రజల్లో మతాన్ని ప్రశ్నించే ధోరణి పెరుగుతోంది.
ఈ అంశాల గురించి లోతుగా ఆలోచించేందుకు సాహసిస్తున్నవారికి అసలు మతాన్ని కలిగి వుండటం అవసరమేనా , అయితే ఏ మతం సరైనది అనే ప్రశ్న ఎదురవుతోంది.

కాలం మారింది. ఇప్పుడు కావలసింది సంకల్పం.
బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్న దేశాలు గనక బౌద్ధమతాన్ని విస్తరింపజేయాలని సంకల్పిస్తే  బౌద్ధ మత వ్యాప్తి అంత కష్తమేమీ కాదు.
బౌద్ధ మతస్తుడు కేవలం మంచి బుద్ధిస్టుగా వుండటమే తన కర్తవ్యంగా భావించకూడదు. బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడమే అతని కర్తవ్యం.
బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడం అంటే మానవాళికి సేవ చేయడమే నని బౌద్ధ మతస్థులంతా గ్రహించాలి "
...
ఇది చిరు పుస్తకమే అయినా మతాలపట్ల శాస్త్రీయ అవగాహనను కలిగిస్తుంది. బుద్ధుడిపట్లా బౌద్ధమతం పట్లా ఆసక్తిని, ఆలోచనలను రేకెత్తిస్తుంది


" బుద్ధుడూ - బౌద్ధ మత భవిష్యత్తూ " 
రచన : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌
ఆంగ్ల మూలం : Buddha And The Future Of His Religion 
తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార 

సమాంతర ప్రచురణలు 
ప్రథమ ముద్రణ: 14 ఏప్రిల్‌ 2008

వెల రూ. 10 మాత్రమే
ప్రతులకు :
Samaantara Dalit Book Centre
11-6-868/10,
1st Floor, Red Hills Road,
Lakdi-ka-pool, Hyderabad
Phone: 040-2330397
Cell: 92465 86254