Monday, December 7, 2009

తెలంగాణా ఎవరి చేతుల్లో వుంది?


ఇవాళ్టి (07-12-2009) ఆంధ్రజ్యోతి లో '' తెలంగాణా ఎవరి చేతుల్లో వుంది? '' అనే శీర్షికతో సినీ రచయిత, దర్శకుడు పోసాని మురళీ కృష్ణ '' ప్రకటన '' ఒకటి వెలువడింది. అందులోని అనేక ప్రశ్నలు ఆలోచింప జేసేలా వున్నాయి. సోదర బ్లాగర్లు చదివి చర్చించేందుకు వీలుగా పోసాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానిని ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాను:
.....................................................................................

తెలంగాణా ఎవరి చేతుల్లో ఉంది ?

ఎలక్షన్స్‌ ముందు:
తెలంగాణాకు మేము అనుకూలం అని, తెలంగాణా ప్రజల ఓట్లతో ఎంఎల్‌ఎ అయినవాళ్లు, మంత్రులయినవాళ్లు, ముఖ్యమంత్రులయినవాళ్లు దర్జాగా పదవులు అనుభవిస్తూ, ఇప్పుడేమో తెలంగాణా రాష్ట్రం మా చేతుల్లో లేదంటున్నారు.

మరి మీ చేతుల్లో ఏముంది ?

కోట్లాది రూపాయల ఖరీదు చేసే తెలంగాణా భూముల్ని అభివృద్ధి పేరుతో లక్షల రూపాయలకే అమ్ముకోవడం మాత్రం మీ చేతుల్లో వుంది !
మంత్రుల స్థాయి పెద్దలు జూబ్లీ హిల్స్‌ లాంటి ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే స్థలాల్ని ఆక్రమించుకుంటే చాలా తక్కువ రేటుకే ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించడం మాత్రం మీ చేతుల్లో వుంది !
కానీ, ఇళ్లు లేని తెలంగాణా ప్రజలు 40, 50 ఏళ్ల క్రిందట ప్రభుత్వ స్థలల్లో ఇళ్లు కట్టుకుని బతుకుతుంటే ఇప్పుడొచ్చి ఆ స్థలం ప్రభుత్వానిది అని పోలీసులతో ఆ ప్రజల్ని కొట్టించి, బుల్డోజర్స్‌తో ఆ ఇళ్లు కూలగొట్టించి, ప్రజలను రోడ్డుమీద పడవేయడం మాత్రం మీ చేతుల్లో వుందా ??

మీ కళ్ల ముందే తెలంగాణా గడ్డమీద భూ కబ్జాలు జరిగాయి. కానీ, దాన్ని ఆపడం మీ చేతుల్లో లేదు!
అసైన్డ్‌ భూములను కొనగూడదని తెల్సినా చాలామంది పెద్దలు కొనుక్కొని కోటీశ్వరులయ్యారు అది మీకు తెలుసు...కానీ దానిని ఆపడం మాత్రం మీ చేతుల్లో లేదు !
ఇది అన్యాయం అంటూ ఆందోళన చేస్తున్నవారిని లాఠీలతో కొట్టించడం మాత్రం మీ చేతుల్లో వుంది !!

తెలంగాణాకు అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు చెబుతున్నాయి.
కానీ, దోపిడీ మాత్రం ఆగదు!
తెలంగాణాకి మేము అనుకూలమని అన్ని పార్టీలు చెబుతాయి.
కానీ, తెలంగాణా రాష్ట్రం మాత్రం రావడం లేదు !!
ఎందుకంటే ఇప్పుడున్న అసెంబ్లీలో ప్రజల కోసమే బతికే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ప్రజా సేవకులు లేరు.... వున్నారా?

సారాతో, డబ్బులతో ఓట్లు కొంటూ అసెంబ్లీ కొస్తున్న ఎమ్‌ఎల్‌ఏలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నంతకాలం తెలంగాణా సమస్యనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ ప్రజా సమస్యనూ చిత్తశుద్ధితో పరిష్కరించలేరు !!

మీరు ఓట్లు కొంటూ అడ్డదారిలో అధికారంలో కొస్తున్నా, అవినీతి పనులు చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని క్షమిస్తున్నారు !
కాబట్టి తెలంగాణా ప్రజలు అడుగుతున్న ప్రత్యేక రాష్ట్రం విషయంలో అయినా గారడీ మాటలు మానేసి, రాజకీయ వ్యాపారం మానేసి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తెలంగాణా వస్తుంది !

అ లా కాకుండా ఏదీ మా చేతుల్లో లేదంటే ప్రతీదీ ప్రజల చేతుల్లోకి వెళ్తుంది !!

ప్రత్యేక తెలంగాణా న్యాయమైన కోరిక :
ప్రజా ఉద్యమం, విద్యార్థి పోరాటం -సమర్థనీయం !
కె.సి.ఆర్‌.దీక్ష - అభినందనీయం !
ఆంధ్రప్రజానీకానికి ఏ మాత్రం నష్టం జరగకుండా శాంతియుతపోరాటంతో, అహింసా మార్గంలో తెలంగాణా రాష్ట్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

పోసాని కృష్ణ మురళి,

సినీ రచయిత, దర్శకుడు

.....................................................................................
ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో ...

2 comments:

  1. పోసాని గారు,
    చాలా చాలా థంక్స్.

    మీలాంటి వారు బయటకు వచ్చి మీ మీ అభిప్రాయాలు తెలియజేసే సమయం ఆసన్నమయింది.

    ReplyDelete
  2. ఈ దుర్మార్గాలు తెల౦గాణలో మాత్రమే జరిగాయా? రాష్త్ర౦ మొత్త౦ అలాగే తగలడి౦ది. అ౦దరూ కలసి నాయకులను నిలదీయాల్సి౦ది పోయి, మనలో మన౦ ప్రా౦తీయ విభేధాలతో కొట్టుకు౦టున్నా౦. వాళ్ళేమో దర్జాగా మ౦దు కొట్టుకు౦టూ వినోద౦ చూస్తున్నారు.

    ReplyDelete