Saturday, November 16, 2019

ప్రజా రవాణా రక్షకులే ప్రజా పాలకులు చాడ వెంకట రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి


ప్రజా రవాణా రక్షకులే ప్రజా పాలకులు
చాడ వెంకట రెడ్డి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
(ఆంధ్ర జ్యోతి దినపత్రిక 16-11-2019)

---------------------------
వేల మంది ఆర్‌టిసి కార్మికులుతమ కుటుంబాలను పణంగా పెట్టి ఎందుకు సమ్మె చేస్తున్నారుస్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు బెదిరింపులకు దిగినా మొక్కవోని ధైర్యంతో ఎందుకు సమ్మె సాగిస్తున్నారుఎందుకు... అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం.ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ప్రశ్నార్థకంగా మారనున్నప్రజారవాణాకు సంబంధించింది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె గత 42 రోజులుగా కొనసాగుతోంది. ఈ సమ్మె ప్రధానంగా ప్రజా రవాణాకు సంబంధించినది. మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు రాష్ట్ర వ్యాపితంగా రోజుకు 97 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసే విశ్వసనీయ సంస్థ ఆర్‌టిసి.
తెలంగాణలో తొమ్మిది దశాబ్దాలుగా సామాన్యునికి సేవలు అందిస్తున్న ఘన చరిత్ర కలిగిన ప్రజాసేవా సంస్థ ఆర్‌టిసి. తెలంగాణ కోసం ఉద్యమించడంలో ఆర్‌టిసి కార్మికులది కూడా కీలక పాత్రే.
అలాంటిది స్వరాష్ట్రంలో సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక రోజులు సమ్మె చేయాల్సి రావడం దురదృష్టకరం. కార్మికుల కంటే ప్రభుత్వానికే ఆర్‌టిసి సమ్మె జరగాలనే వైఖరి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆర్‌టిసిని పరిరక్షించేందుకు ఉన్న అవకాశాలను కాదని మూసి వేసేందుకు లేని మార్గాలను కూడా ప్రభుత్వం వెతికి వెతికి భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తోంది. సమ్మెను పరిష్కరించే దిశగా అడుగులేయడం లేదు.
ఆర్‌టిసి సమ్మె పట్ల ముఖ్యమంత్రి కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. సమ్మె ప్రారంభంలోనే కేసీఆర్‌ కఠినమైన మాటలు మాట్లాడారు. ఒక్క మాటతోనే 48 వేల మంది కార్మికులను ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరకపోతే సెల్ఫ్ డిస్మిస్‌అని భయబ్రాంతులకు గురి చేశాడు.
అంతేగాకుండా మరో సందర్భంలో యూనియన్‌లో చేరబోమని రాతపూర్వకంగా హామీ లేఖలు ఇస్తే మీ ఉద్యోగాలు మీకు ఉంటాయని చెప్పడం జరిగింది.
మరొకసారి అసలు ఆర్‌టిసి సంస్థ అనేదే లేదన్నారు. అ తదుపరి నవంబర్‌ 2న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నవంబర్‌ 5వ తేదీ అర్థరాత్రి లోపు కార్మికులు తమతమ విధుల్లో చేరాలని డెడ్‌లైన్‌ విధిస్తేకేవలం 300 మంది కార్మికులు మాత్రమే చేరారు. అందులో ఎక్కువ మంది బస్‌ భవన్‌లో ఉద్యోగం చేసేవారు.
దాదాపు 5100 రూట్లను ప్రైవేట్‌ పరం చేసామని ప్రకటించారురు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండాచర్చలకు ఆహ్వానించకుండా ఇలాంటి నిర్ణయాలు చేయడం మూర్ఖపు ధోరణికి అద్దం పడుతుంది.
దాదాపు 14 సార్లు ఆర్‌టిసి సమ్మెపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి కొండను తవ్వి ఎలుకను కూడ పట్ట లేకపోయారు.
కేసీఆర్‌ సెల్ఫ్ డిస్మిస్‌అనే పదం ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేయాల్సి వస్తుందనే సామెతను గుర్తు చేసుకోవాల్సివస్తుంది.
తప్పును సవరించుకోవడం మానవ ధర్మం. కానీ అహంభావంతో తప్పుల మీద తప్పులు చేస్తుండటం సరైంది కాదు. రాజ్యాంగం పౌరహక్కులు అందరికీ సమానంగానే ప్రసాదించింది. కాకపోతే పదవిలో వున్న వారికి ఆ పదవికి ఉన్న ప్రతిష్ఠ కారణంగా వ్యక్తిగత గౌరవం ఉండటం సహజం. కొన్ని సందర్భాలలో త్యాగాలను బట్టి కూడా వ్యక్తులకు గౌరవం వుంటుంది. కానీ కేసిఆర్‌ ఇప్పుడు ఏ కోవకు వస్తాడనేది ప్రధాన ప్రశ్న.
ఇబ్బందులు లేని జీవితమైనప్పటికీ సంస్థఅందులో పని చేసే వేలాది మంది కార్మికుల భవితవ్యంప్రభుత్వ వితండవాదంతో కలత చెంది డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి నిప్పు పెట్టుకొని చనిపోయాడు.
అలాగే రాణిగంజ్‌ డిపోకు చెందిన సురేందర్‌ గౌడ్‌ ఉరి వేసుకొని మృతి చెందాడు.
నీరజ అనే కండక్టర్‌ కూడా ఉరి వేసుకొని చనిపోయింది.
అంతేగాకుండా నిరసన సభలుసమావేశాలలో పాల్గొన్న కార్మికులు ఉద్రేకానికి లోనై గుండె ఆగిచని పోయినవారు కూడా అనేక మంది వున్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఆత్మహత్యలు వుండవని తెలంగాణ సమాజం అనుకున్న తరుణంలో ఇప్పుడు ఇంత మంది కార్మికుల చావుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంటి అద్దెలు కట్టుకోకుండాపిల్లల ఫీజులు సకాలంలో చెల్లించకపోవడం వలన కార్మికుల కుటుంబాలు అల్లాడుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా కనికరం చూపాలి.
హైకోర్టులో ఆర్‌టిసి సమ్మెపై జరుగుతున్న విచారణను చూస్తుంటే తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యమా అని ఈ దౌర్భాగ్యం వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నడూ లేనివిధంగా నలుగురు సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లు స్వయంగా వారి తప్పులేకున్నా పాలకుల వైఖరి కారణంగా బోనులో నిలబడాల్సి వచ్చింది. అంతేగాకుండా ప్రధాన న్యాయమూర్తి , న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అధికారులు సమాధానం చెప్పలేక తెల్లమొహాలు వేయాల్సి వచ్చింది. న్యాయస్థానంలో కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండా క్షమించండి అని చెప్పడంతో ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి ఇచ్చిన నివేదికకు హైకోర్టులో ఆర్థిక కార్యదర్శి ఆర్‌టిసి ఇన్‌చార్జ్‌ ఎండీలు కోర్టు ఇచ్చిన అఫిడవిట్లకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఐఎఎస్‌ ఆఫీసర్లు కూడా ఇలాంటి తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారని ప్రధాన న్యాయమూర్తి మందలించడంతోపాటు ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించారు.
ఫిలిప్పీన్స్‌ దేశంలో ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వం పడిపోయిందని తెలంగాణలో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా అని కోర్టు ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను తక్కువ అంచనా వేసి కించపరుస్తున్నాడు.
ఆర్‌టిసి సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ వాహనాలే శరణ్యంగా మారాయి. డైలీ వేజ్‌ డ్రైవర్లు కండక్టర్లతో బస్సులు నడుస్తున్నా సమయ పాలన పాటించడం లేదు. ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది వివిధ ప్రాంతాలలో ఆర్‌టిసి బస్సులు ఢీ కొట్టడంతో మరణించడం జరిగింది.
సమ్మె కాలంలో ఎంత ఆదాయం ఆర్‌టిసిఇకి వచ్చింది ఎంత ఖర్చు చేశారో ఆర్‌టిసి యాజమాన్యం గానీ లేదా ప్రభుత్వం గానీ ప్రజలకు తెలియజేయాలి.
49 వేల మంది ఆర్‌టిసి కార్మికులు తమ కుటుంబాలను పణంగా పెట్టి ఎందుకు సమ్మె చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు బెదిరింపులకు దిగినా మొక్కవోని ధైర్యంతో ఎందుకు సమ్మె సాగిస్తున్నారు.. ఎందుకు అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం. ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ప్రశ్నార్థకంగా మారనున్న ప్రజారవాణా గురించి.
ఇప్పటికే ప్రభుత్వ వైఖరితో సమ్మె కొనసాగుతూండడంతో 24 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు మతిస్థిమితం కూడా కోల్పోతున్నారు.
కార్మికులు డ్యూటీ చేసిన సెప్టెంబర్‌ నెల జీతాలు రెండు నెలలు గడిచినాకోర్టు ఆదేశించినా ఇవ్వకుండా ప్రభుత్వం పైశాచికానందం పొందుతోంది.
ముఖ్యమంత్రిగా వున్నవారు ఒక తండ్రిలా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఒకవైపు వారూ నా బిడ్డలేనంటూమరోవైపు చర్చలకు ముందుకు రాకపోవడం తొడపాశం పెట్టి జోల పాట పాడినట్లుంది. ఆర్‌టిసి వాళ్ళు తెలంగాణ బిడ్డలైనప్పుడు తెలంగాణలో పెద్ద పండుగైన దసరాదీపావళికి చేసిన పనికి కూడా జీతాలివ్వకుండా ఉపవాసం ఉంచుతారా
బాధ్యతాయుత స్థానంలో ఉన్న క్యాబినెట్‌ మంత్రులు కూడా ఆర్‌టిసి సమ్మె విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ పాలన మంత్రుల సమిష్టి బాధ్యత కాదా ముఖ్యమంత్రిని కనీసం కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేయకపోతే జరుగుతున్న తప్పు వారిని భవిష్యత్తులో వెంటాడుతుంది.
సంపద ఉన్న రాష్ట్రం కాబట్టి అప్పులు వస్తున్నాయని పలుమార్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆర్‌టిసికి ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులు ఏ మాత్రం ఎక్కువ కాదు.
పైగా సంస్థ లాభాల్లోకి వచ్చేందుకు ఏమి చేయాలనే సూచనలు ఇవ్వడంతో పాటు మోటు కష్టం చేసేందుకు ఆర్‌టిసి కార్మికులు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే పలుమార్లు ఆర్‌టిసి కార్మికులు కాకితో కబురంపినా చర్చలకు సిద్ధమని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ఆలోచించి పట్టుదలకు పోకుండా తక్షణమే కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమ్మె విరమింపజేయాలి. భేషజాలకు పోతే నష్టపోయేది తెలంగాణ బిడ్డలే. ఆర్‌టిసి మూతపడితే ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలే.
చాడ వెంకటరెడ్డి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Thursday, November 14, 2019

ఆర్టీసీ సమ్మెపై కొన్ని ప్రశ్నలు – టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ పత్రిక 14 11 2019)


ఆలోకన :
ఆర్టీసీ సమ్మెపై కొన్ని ప్రశ్నలు –
టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ పత్రిక 14 11 2019)
------------------------------------
ఆర్టీసీ సమ్మెలో సామాన్యులకు అర్థం కాకుండా మిగిలిన ప్రశ్నలు కొన్నున్నాయి. ఉదాహరణకు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటం. విలీనమే ప్రధానమని, అది జరుగనిదే మరి దేనికీ ఒప్పుకోబోమన్న యూనియన్లు అదే పట్టుదలతో ఉన్నాయి.
విలీనం వల్ల పడే ఆర్థికభారాన్ని మోయలేమని ప్రభుత్వం అంటున్నది. కొద్దిపాటి అవగాహన గలవారు, ఇతరత్రా కార్మికులపై సానుభూతి గలవారు కూడా విలీనం డిమాండ్ సరైనది కాదంటున్నారు.
హైకోర్టుసైతం సమస్య పరిష్కారానికి ఈ డిమాండు ప్రతిష్టంభనగా మారేట్లున్నదని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ యూనియన్లకు ఈ పట్టుదల దేనికన్నది ప్రశ్న.
విలీనం వల్ల రాగల ఆర్థిక సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు వివరించారు. ఆర్టీసీ సిబ్బంది సుమా రు 50 వేల మంది. అంతమందికి ప్రభుత్వ సిబ్బందితో సమానంగా జీతభత్యాలు, ఇతర సదుపాయాలు, ఉద్యోగ విరమణాంతరం జీవితాంతం పింఛన్లు, ఇతర సదుపాయాలు అంటే మామూలు విషయం కాదు.
ఇవి అన్నీ తమకు కావాలని ఆర్టీసీ సిబ్బంది తమ దృక్కోణం నుంచి కోరుకోవచ్చు. ఇటువంటి ప్రయోజనాలు వారికి గొప్ప ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే యూనియన్ నాయకులు, ప్రతిపక్షాలు ఈ విషయమై చెప్పిన డిమాండ్లు సిబ్బంది మనసులో తేలికగా, బాగా నాటుకుపోయాయి.
కానీ కోరికలు ఎంత ఆకర్షణీయమైనవి అయినా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఆ పని చేయనప్పు డు విషయం ప్రతిష్టంభనకు గురికావటం, దీర్ఘకాలం పాటు సాగటం, చివరికి ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది.
విలీనాన్ని అంగీకరించకపోవటానికి ముఖ్యమంత్రి రెండు కారణాలు చెప్పారు. ఒకటి, అందువల్ల పడే రకరకాల ఆర్థిక భారాలు. రెండు, ఇతర కార్పోరేషన్లు కూడా విలీనాన్ని కోరే అవకాశం. అప్పుడు పడగల భారం తో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ నిజంగానే కుప్పగూలేంత పనవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ప్రస్తుతం మూడున్నర లక్షల మంది ఉన్నారు. వారికి రేపోమాపో వేతన సవరణ జరుగుతుంది. ఇటువంటి స్థితిలో కార్పొరేష న్ల విలీనంతో మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షలు అయితే పరిస్థితి ఏమిటి?
ఇదిగాక, వేలాది ఖాళీల భర్తీలు, కొన్నిరకాల ఉద్యోగాల్లో అదనపు నియామకాలు క్రమక్రమంగా చేపడుతున్నారు. దీనంతటి మధ్య రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఒకేమారు 50 వేల మంది విలీనాన్ని మోయగలదా? ఒకవేళ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నా ఆచరణాత్మకంగా సాధ్యమయేదేనా?
ఇప్పటికే 67 శాతం వేతనాలు పెంచిన స్థితిలో?
ఇదంతా సామాన్య ఆర్టీసీ సిబ్బందికి తెలియకపోవచ్చు. వారు తమకు కలిగే ప్రయోజనాల గురించి అమాయకంగా ఆలోచిస్తారు. కానీ యూనియన్ల నాయకులకు అర్థం కానిదా?
యథాతథంగా ప్రభుత్వ సిబ్బందికి, కార్పొరేషన్లకు మధ్య నిర్మాణపరమైన, స్వభావపరమైన తేడాలుంటాయి. అందువల్లనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేయలేదు. తెలంగాణలో విలీనమంటున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు తామెందుకు చేయలేదంటూ కేసీఆర్ పలుమార్లు వేసిన సూటి ప్రశ్నకు వారెవరు సమాధానం ఇవ్వలేకపోవటానికి కారణం ఇదే.
వారి ఇవ్వలేని స్థితిని తప్పుపట్టడం లేదు. కానీ వారి ద్వంద్వ ప్రమాణాలు, కపటనీతి మాత్రం తప్పు పట్టదగ్గవే. ఆ కపటనీతి వల్లనే వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీసీ యూనియన్ నేతలను రెచ్చగొడుతున్నారు. ఆ నేతలు ముందు వెనుకలు ఆలోచించకుండా అమాయకులైన కార్మికులను రెచ్చగొడుతున్నారు.
ఇటువంటి క్రమంలోనే ఇటీవల బీజేపీ వారు కొత్త వాదన తెచ్చారు. తెలంగాణ ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందని, ఏమి చేయాలన్నా కేంద్రం అనుమతి కావాలని, కేంద్రంలోని ప్రభుత్వం తమది గనుక తాము విషయాలను నిర్దేశించగలమనే అభిప్రాయాన్ని సృష్టించారు.
దీన్ని నమ్మిన యూనియన్ నాయకులు కూడా అదే వాదనలు చేస్తూ కార్మికులను నమ్మించారు.
చివరికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో, తమకు ఏ వాటా లేదని స్పష్టం చేశా రు.
దానితో బీజేపీ మౌనంలోకి జారుకుంది.
ఈ సందర్భంలో వీరంతా ఏపీలో విలీన ప్రతిపాదనలను ప్రస్తావిస్తున్నారు. ఆ పని నిజంగా జరిగి తే అది దేశంలో ఒక మినహాయింపు అవుతుంది. వారి పరిస్థితులను బట్టి, మ్యానిఫెస్టో హామీ ప్రకారం వారు చేశారనుకోవాలి.
మరి అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అదే ప్రేరణతో తమ రాష్ర్టాల్లో చేయగలమని ప్రకటిస్తాయా?
విలీనం డిమాండ్‌లోని నిర్హేతుకత యూనియన్లకు ఒక దశలో అర్థమైనట్లే తోచింది. వారి న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ, విలీనం ముం దస్తు షరతు కాదన్నట్లు నర్మగర్భంగా సూచించారు.
దానితో ఇక చర్చల కు, సమ్మె పరిష్కారానికి మార్గం సుగమం కాగలదనే అభిప్రాయం సామాన్య జనంలో ఏర్పడింది. ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా సానుకూల స్పందన చూపారు.
కానీ అంతలోనే ఏమైందో గాని యూనియన్ నేతలు విలీనమే ముందస్తు షరతు అంటూ మళ్లీ గట్టిగా వాదించారు.
దానితో అంతా బిగుసుకుపోయింది.
లేనట్లయితే బహుశా చర్చలు ఎప్పుడో జరిగి సమ్మె ముగిసేది.
ప్రభుత్వం నియమించిన కార్యదర్శుల కమిటీ చర్చల్లోనూ యూనియన్లు విలీనాన్ని ముందస్తు షరతుగా మార్చకుంటే విషయం తేలిపోయేదేమో.
ఆర్టీసీ ప్రస్తుత సమ్మెకు రాడికల్ ట్రేడ్ యూనియనిజం లక్షణాలున్నా యి. యథాతథంగా ఇవి రాడికల్ యూనియన్లు కావు. వాటిలోని వామపక్ష సంఘాలను మినహాయిస్తే తక్కినవాటికి ఆ సిద్ధాంతం, స్వభావం, రికార్డు లేవు. ఒకప్పటి బెంగాల్ యూనియన్లు, ఫరీదాబాద్-ఘాజియాబాద్ యూనియన్ల మాట అట్లుంచి, బొంబాయిలోని దత్తా సామంత్ తరహా రాడికలిజమైనా లేదు వారికి. విలీనం డిమాండ్ కేవలం ఒక అం శానికి పరిమితమైన రాడికలిజం. అది నెరవేరితే రాడికల్ యూనియని జం ఆర్టీసీలో అయినా, తెలంగాణలో ఇతరత్రా అయినా విస్తరించి తీరుతుందనలేముగాని అందుకు కొద్దిపాటి అవకాశాలుంటాయి.
ఈ మాట అనటం ఎందుకంటే, దేశంలో ఒక సంచలన దశగా సాగిన రాడికల్ ట్రేడ్ యూనియనిజం ముగిసిపోయి పాతికేళ్లు దాటింది. దాన్ని నడిపిన పార్టీ లు, సంస్థలు బలహీనపడ్డాయి.
ఆర్థికసంస్కరణలు, ఆటోమేషన్, న్యూ ఎకానమీ తెచ్చిన పెను మార్పులతో స్వయంగా కార్మికుల స్వభావాలు కూడా మారినట్లు, వారిలో అత్యధికులు అసలు యూనియన్ల వైపు చూడటం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్లు విలీనం అనే రాడికల్ డిమాండ్‌ను ముందుకుతెచ్చాయి. అదొక పులి వంటి డిమాండ్. వారు ఆ పులిని సృష్టించారు. దానిపై సవారీ చేస్తున్నారు. కార్మికులను ఆ పులి వెంట పరిగెత్తిస్తున్నారు. పరిస్థితులు క్రమంగా ఎట్లా తయారవుతున్నాయంటే వారు ఆ పులిపై సవారీ చేయలేరు. కిందకు దిగలేరు.
రాడికల్ యూనియనిజంలో ఇటువంటి పరిస్థితులు తరచు ఎదురవుతుంటాయి. అయితే, వెనుక మద్దతుగా సొంత పార్టీలు ఉండి (కమ్యూనిస్టుల వలె), తమ స్వరూప స్వభావాలే రాడికల్ అయిన యూనియన్ల పరిస్థితి వేరు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ఆ కోవలోకి రావు. కనుక అవి దిక్కుతోచని స్థితిలో పడుతాయి. ఏపీఎస్‌ఆర్టీసీ అసలు విభజన కాలేదని, టీఎస్‌ఆర్టీసీలో తమకు వాటా లేదని కేంద్ర న్యాయవాది ప్రకటించటం వారికి కొత్త సమస్యలు సృష్టించనున్నది.
ఆర్టీసీలో అనేక బస్సులు కండీషన్ కోల్పోవటం, కొత్త బస్సుల ఖరీదుకు డబ్బు లేకపోవటం, ఇచ్చేందుకు ప్రభుత్వానికి గల ఆర్థికఇబ్బందులు మరొక సమస్య. ఆర్టీసీపై ఇప్పటికి గల మొత్తం బకాయిల భారం రూ.2209 కోట్లని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
వీటిమధ్య రూట్ల ప్రైవేటీకరణ (సంస్థగా ఆర్టీసీ కాదు), అందుకు అనుకూలంగా వచ్చిన కేంద్ర చట్టం మరొక తరహా ప్రశ్న. మొత్తమ్మీద ఏ ఒక్కటీ యూనియన్ నాయకులకు అనుకూలంగా సాగ టం లేదు. చివరికి సమస్య సాధారణ, అమాయక కార్మికులకు చుట్టుకుంటున్నది.
ఈ సందర్భంగా అందరూ గుర్తించవలసిన విషయం ఒకటున్నది. స్వాతంత్య్రానికి ముందులేని ప్రభుత్వరంగ సంస్థలు నెహ్రూ అభివృద్ధి నమూనా వల్ల ప్రముఖంగా ముందుకువచ్చాయి. కానీ అవి వివిధ కారణాల వల్ల విఫలమవుతుండటం వల్ల కొంత, దేశంలో ఆర్థికసంస్కరణలు మొదలుకావడంతో కొంత, ప్రైవేటీకరణ దశ అంతటా వచ్చివేసింది.
ఈ పరిణామక్రమం ఇండియాలోనే కాదు. వలసపాలన నుంచి బయటపడి సోషలిజం అంటూ మాట్లాడిన తృతీయ ప్రపంచదేశాలు అంతటా సాగిం ది. చివరికి రష్యాలోనూ పెరిస్ట్రోయికాలో భాగంగా ఇదే పని చేశారు. సరైనదా కాదా అనే చర్చ ఎట్లున్నా ఇది ప్రపంచవ్యాప్తమైన చేదునిజాల చరి త్ర. పరిస్థితులు ఇట్లా పరిణమించటానికి గల కారణాల్లో రాడికల్ ట్రేడ్ యూనియనిజం కూడా ఒకటి.
ఇవన్నీ చాలవన్నట్లు యూనియన్ నాయకులు సాధారణ ప్రజల సానుభూతిని పోగొట్టుకునే పొరపాటు ఒకటి మొదటిలోనే చేశారు. అది, పండుగకు ముందు సమ్మెను ఆరంభించటం. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకునే ఎత్తుగడలో ఆలోచన లోపించిందని, దాని ఖరీదు ప్రజల సానుభూతి అని తేలేందుకు ఎక్కువరోజులు పట్టలేదు.
ఆ విధంగా ఇప్పటికి 40 రోజులు గడిచినా సమ్మె పట్ల ప్రజల్లో ఉత్సుకత మినహా సానుభూతి కన్పించటం లేదు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యామ్నాయ రవాణా పెరిగినా కొద్దీ ప్రజలు సమ్మెను పట్టించుకోవటం కూడా తగ్గిపోయింది.
ఎవరైనా కార్మికుడు చనిపోయినపుడు అయ్యోపాపం అనటానికి మించి స్పందనలు కన్పించటం లేదు. యూనియన్ల చుట్టూ చేరి అంతా నిర్దేశిస్తున్న పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవటం ఇందుకు తోడవుతున్నది. ఈ పరిస్థితుల్లో పులి సవారీ నుంచి దిగటమెట్లా అన్నది యూనియన్ నేతలు తమలో తాము, జాగ్రత్త గా, భేషజాలకు పోకుండా, భవిష్యత్తును, కార్మికుల జీవితాలను దృష్టిలో ఉంచుకుంటూ చేయవలసిన ఆలోచన

Thursday, November 7, 2019

తిండి సరిపోక చేసేది సమ్మె! ‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !! - రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019)


తిండి సరిపోక చేసేది సమ్మె!
‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !!
- రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019)

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు, 4 వారాలకు పైగా సమ్మెలో ఉన్నారు. ‘ఆర్టీసీకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని అడుగుతున్నాం’ అన్నారు, ఆ కార్మికులు. 26 సమస్యల్ని చెప్పారు. కార్మికులు ఒక్క సమస్యని చెప్పినా, పాలకులు ఒక్క గంటలో, శ్రద్ధ పెడితే, అరగంటలో కదలాలి. కానీ ఇక్కడ 26 సమస్యలకు కూడా, పాలకులకు ఆ కదలిక ఎన్ని రోజులైనా లేదు.

ఆర్టీసీ సమస్యలేమిటో కొన్నైనా చూద్దాం. ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యకూడదని. ప్రభుత్వ సంస్తగా మార్చాలని. జీతాల సవరణ చెయ్యాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని. ఖాళీగా వున్న ఉద్యోగాలని నింపాలని. కాలం చెల్లిన పాత బస్సుల్ని తీసివేసి, కొత్త బస్సుల్ని పెట్టి, ప్రయాణీకులకూ, డ్రైవర్లకూ రక్షణ కల్పించాలని.

ఏ శాఖలో అయినా, సమస్యలు తలెత్తుతోంటే, వాటిని పాలకులు తక్షణం చూసుకోవాలా లేదా? కానీ, ఈ పాలకులు, ‘అటువంటి పాలకులం కాము’ అని రుజువు చేసుకుంటున్నారు. ఆర్టీసీలో 26 సమస్యలు పేరుకు పోయి వున్నాయంటే, అదేనా పరిపాలన?

రవాణా కార్మికులు తమ సమస్యలన్నిటినీ, పాలకులకు మొదట చూపించి, జవాబు రాకే, సమ్మె ప్రారంభించారు. కార్మికులకు సమస్యలు వుంటే, వాటి కోసం పాలకులు కదలక పోతే, శ్రమల్ని ఆపివేయ్యడమే, కార్మికులకు ఆత్మగౌరవం.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రధానంగా, ‘తెలంగాణా మజ్దూర్ యూనియన్’ నాయకత్వాన సాగుతోంది. ఇదే యూనియన్, గతంలో, తెలంగాణా రాష్ట్రం రాక ముందు, పెద్ద మెజారిటీతో గెలిస్తే, ఈ యూనియన్ని, ఆ నాడు, ఇంకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్, తను ఎంతెంత మెచ్చుకోలు మాటలు అన్నదీ మర్చిపోయి వుండవచ్చు గానీ, ఆర్టీసీ కార్మికులకూ, ఆ మాటల్ని తెరమీద చూసిన టీవీ ప్రేక్షకులకూ గుర్తే!
కార్మికుల కాలిలో ముల్లు దిగితే, తన పంటితో తీస్తానని ఆ నాటి వాగ్దానం. ఆ నాడు, అలా ప్రకటించిన ఆ పెద్దమనిషి, ఈ నాడు పాలకుడిగా మారి, ఆ అధికార దర్పంతో, ఆ రవాణా కార్మికుల గురించే అన్న మాటలేమిటో కొన్నిటిని చూడాలి.

మొన్నటి విలేఖరుల సమావేశంలో, పాలకుడు అన్నది: ‘‘తిన్నది అరగక చేసే సమ్మె ఇది!’’
ఈ ఒక్క మాటే కాదు, ఇంకా ఎన్నో!
‘‘పనికి మాలిన సమ్మె’’,
‘‘లవి కానీ కోరికలు’’,
యూనియన్ చిల్లర రాజకీయాలు’’;
‘‘సింగరేణి కార్మికులకు బోనసులు ఇచ్చాను’’,
‘‘ఆర్టీసీ కార్మికులు యూనియన్లు లేకుండా పని చేస్తే వాళ్ళకి కూడా బోనస్ వచ్చేది!’’,
‘‘విలీనం అనేది వివేకం లేని, తెలివితక్కువ నినాదం’’,
‘‘పనికి మాలిన రాజకీయ నాయకులు...
తలకాయలు మాసిపోయినోడు... వీళ్ళా మాట్లాడేది?’’
–ఇలా సాగాయి పాలకుడి అహంకారీ, పెత్తందారీ మాటలు!

రాత్రింబవళ్ళూ శ్రమలు చేస్తూ, వాళ్ళ శ్రమ విలువ అంతా వాళ్ళూ పొందకుండా, కేవలం బళ్ళు నడుపుతూ, జీవించే అమాయకుల మీద అలాంటి మాటలా!
వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా ఈ పాలకుడు అధికార పీఠం ఎక్కింది?
అంత నమ్మారు వాళ్ళు!
ఈ పాలకుడు, ఆ పీఠం ఎక్కక ముందు, ఆ కార్మిక సంస్త గురించి మాట్లాడిందేమిటీ, ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటీ?

అప్పుడు కార్మికుల కాళ్ళలో ముళ్ళని తన పంటితో తీస్తానని!
ఇప్పుడు మాట్లాడేది, ఆ ముళ్ళని తెచ్చి తనే గుచ్చుతానని!
ఒక నాడు శక్తివంతురాలైన కార్మిక యూనియనూ, ఆ నాయకులూ, ఈ నాడు పనికి మాలిన సంస్తా, తలలు మాసిన వాళ్ళూ అయ్యారు ఈయన దృష్టిలో.
ఆనాడు, ఈ యూనియన్ నాయకుల్ని పక్కన నిలబెట్టుకుని, వాళ్ళని కీర్తించిన పాలకుడికి, అదే నాయకులు ఈ నాడు తలలు మాసిన వాళ్ళయ్యారు.
కార్మికుల సమస్యల్ని పరిష్కరించే దృష్టి లేనప్పుడు, కార్మికుల సమ్మెలు పనికి మాలినివిగా కనపడతాయి.

సమ్మెచేసే కార్మికులకు వ్యతిరేకంగా కొత్త కార్మికులు పనుల్లోకి రాకూడదు. ఈ విషయాన్ని, కార్మిక సంఘాలు చాలా కాలం నించి ప్రచారం చేస్తూ, కార్మికులకు నేర్పితే, ఆ కొత్త కార్మికులు రాకపోతే, పాలకుల నిరంకుశత్వం, ఒక్క రోజు కూడా సాగదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనుకూలంగా, అనేక మంది వ్యక్తులూ, సంస్తలూ రకరకాలుగా సంఘీభావం చూపించారు. రోజూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి స్పందనలు వారు చూపవలిసిందే.
ఈ సమస్యని, మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ సిద్ధాంత కోణం’ నించీ పరిశీలిస్తే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలలో ఉన్న కార్మిక వ్యతిరేక ధోరణిని ప్రజలందరూ, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సరిగా అర్ధం చేసుకోవడానికి వీలవుతుంది.

అలా గాక, ‘మనం కొన్ని సమస్యల్ని పరిష్కరించమని అడిగాం; ముఖ్య మంత్రి ఒప్పుకోవడం లేదు’ అని, మామూలు లోక గ్న్యాన దృష్టితో మాత్రమే అర్ధం చేసుకుంటే, కార్మికుల చైతన్యం ఒక దగ్గిర ఆగిపోతుంది.
అదనపు విలువ సిద్ధాంతం ప్రకారం, రవాణా కార్మికులు, తాము పొందే జీతాలకన్నా, అదనంగా ఎంతో విలువని (డబ్బుని) తెచ్చిపెడతారు సంస్తకి.

ఆ సంస్త ప్రైవేటు పెట్టుబడి దారుడిది అయినా, ప్రభుత్వ ఆధీనంలో నడిచేది అయినా. రవాణా అనేది ఒక పరిశ్రమ. దానిలో తయారయ్యే సరుకు ‘రవాణా’ అనే సౌకర్యం. ప్రయాణీకుల్నీ, వారి సామాన్లనీ ఒక చోటు (ఊరు) నించి ఇంకో చోటుకి (ఊరుకి) తీసికెళ్ళే పని జరుగుతుంది. అక్కడ బస్సులు వున్నంత మాత్రాన సరిపోదు గదా?

దాన్ని నడిపే డ్రైవర్లు వుండాలి. దాన్ని ఎప్పటికప్పుడు పనిచేసే స్తితిలో ఉందో లేదో చూసే మెకానిక్కులూ, క్లీనర్లూ ఉండాలి. వీళ్ళు తమకు వచ్చే జీతలకన్నా ఎక్కువ అదనంగా విలువని ఎలా సృష్టిస్తారో ఒక ఉదాహరణ ద్వారా అతి క్లుప్తంగా చూద్దాం.

ఒక బస్సు ఒక ఊరు నించి ఒక ఊరికి వెళ్తోంది అనుకుందాం. ఆ బస్సులో 50 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క టిక్కట్టు ధర 40 అనుకుందాం. ఒక ట్రిప్పులో ఆ ప్రయాణం వల్ల వసూలైన మొత్తం 50X40 = 2,000.
ఇందులో, డీజిలూ, బస్సు అరుగుదలా, రోడ్డు అరుగుదలా వగైరాల మీద పెట్టిన ‘పెట్టుబడి’ ఖర్చంతా 500 అనుకుందాం. 2000 లోంచి 500 తీసివెయ్యగా మిగిలేది 1500. ఇది ఆ బస్సుని నడపడం అనే శ్రమ చేసిన డ్రైవరిది. (మన ఉదాహరణలో ఒక్క డ్రైవరే అనుకుందాం.)
అంటే, ఆ బస్సుని నడిపిన డ్రైవరూ, అవసరమైనప్పుడల్లా బస్సుని శుభ్రం చేసే క్లీనర్లూ, మెకానిక్కులూ వగైరా శ్రామికులు కలిపి ఇచ్చిన శ్రమ విలువ అది. ఆ ప్రయాణంలో ఒక్క డ్రైవరే, ఒక్క మెకానిక్కే, ఒక్క క్లీనరే పనిచేశారు –అనుకుంటే, ఆ 1500, ఆ ౩గ్గురు శ్రామికులకే చెందాలి. ఆ ప్రయాణం, 6 గంటల కాలం పట్టిందనుకుందాం. ఆ 6 గంటల డ్యూటీలో పని చేసినందుకు ఆ 3గ్గురు శ్రామికులకూ జీతాలుగా, ఆ బస్సు యజమాని (అతను ప్రైవేటు వ్యక్తి కావొచ్చు, ప్రభుత్వమే కావొచ్చు. ప్రభుత్వం కూడా ఒక యజమానే, ఆర్టీసీ వంటి సంస్తల విషయంలో) 300 ఇచ్చి, మిగిలిన 1200ని ‘లాభం’ పేరుతో తనే తీసుకుంటాడు. ఈ 1200, ఆ 3గ్గురు కార్మికుల నించి వచ్చిన ‘అదనపు విలువ’.

అయితే, బస్సు పెట్టుబడిదారుడికి (ఇక్కడ ఆర్టీసీకి), అదనపు విలువని ఇవ్వని కార్మికులు కూడా ఉంటారు. అయినా వారు చేసేది కూడా శ్రమే.
వాళ్ళూ వేతన శ్రామికులే. ఉదా: టిక్కట్లు అమ్మే శ్రమ అనుత్పాదక శ్రమ. ‘టిక్కెట్ల అమ్మకం’ అనేది, ఏ ప్రయాణానికి అయినా ‘సహజ అవసరం’ కాదు. టిక్కెట్ల అమ్మకం లేకపోయినా, బస్సు కదులుతుంది.

బస్సుని నడిపే శ్రమ లేకపోతేనో, బస్సుకి డీజిల్ లేకపోతేనో బస్సు ఆగిపోయినట్టుగా, టిక్కెట్ల అమ్మకం లేకపోతే బస్సు ఆగిపోదు. కాబట్టి, టిక్కెట్ల పుస్తకాలఖర్చూ, టిక్కెట్లు అమ్మే ఉద్యోగి జీతమూ వంటిఖర్చులు, ఆ ప్రయాణానికి అవసరమయ్యే ‘శ్రమ మొత్తం’లోకి చేరవు.

కానీ, ఆర్టీసీ, ఈ అంశాల మీద కూడా ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చుల్ని 100 అనుకుంటే, డ్రైవరూ వగైరా కార్మికుల ద్వారా వచ్చిన ‘1200 అదనపు విలువ’ నించే ఈ 100ని ఖర్చు పెట్టాలి. ఇంకా 1100 మిగులుతుంది. మన ఉదాహరణలో ఉన్న బస్సు ప్రయాణం 6 గంటలే. ఆ బస్సు రాత్రింబవళ్ళూ పనిలోనే ఉంటుంది. రోజుకి 3, 4 ప్రయాణాలు! ఒక ఊరు నించి ఇంకో ఊరుకి వెళ్ళేప్పుడు ఒక లాభమూ, మళ్ళీ ఆ ఊరు నించి ఈ ఊరికి వచ్చేటప్పుడు ఒక లాభమూ! అలాగ ఒక ట్రిప్పు తర్వాత ఒక ట్రిప్పు తిరుగుతూనే ఉంటుంది. కార్మికులు పగలూ, రాత్రీ పని చేస్తూనే వుంటారు.
ఇప్పుడు చెప్పండి, నిరంతరం శ్రమిస్తూ, సంస్తకి అదనపు విలువ ఇచ్చే కార్మికులు, తమ సమస్యల మీద సమ్మె చేస్తే తిన్నది అరక్క చెయ్యడమా? ఆర్టీసీ కార్మికుల అదనపు విలువనే కాక, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్తల కార్మికుల అదనపు విలువల్ని పన్నుల రూపంలో తన అధీనంలో పెట్టుకునే ప్రభుత్వం చేసే వాదనలన్నీ ‘అదనపు విలువ’ అరక్క చేసే దూషణలే!

‘సింగరేణి కార్మికులకు రెండు లక్షలు బోనసు ఇచ్చాను,
మీరు సమ్మే- గిమ్మే, యూనియన్- గీనియన్ అనకపోతే మీకు కూడా బోనస్ ఇచ్చే వాణ్ణి’ అనడం.
ఆ బోనసుల డబ్బు పాలకుల శ్రమలా?
ఎక్కనుంచి తెచ్చి ఇస్తున్నారు?
ముఖ్య మంత్రీ, ఇతర మంత్రులూ, ఆర్టీసీ అధికారులూ, శారీరక శ్రమో, మేధా శ్రమో చేసి ఆ బోనసులూ, పెంచామంటున్న జీతాలూ ఇస్తున్నారా?
కార్మికులు ఇచ్చిన అదనపు విలువలోనించే కదా తీసి ఇచ్చేది?
పైగా, నిర్జీవమైన గుళ్ళకీ, గోపురాలకీ లక్షల నిధులు. సజీవులైన కార్మిక మానవులకి తిట్లు,
‘అన్నం అరక్క’;
‘బుద్ధిలేని’,
‘పనికి మాలిన’ అంటూ!
అమ్మ వారికీ, శ్రీవారికీ ముక్కు పుడకలూ, కిరీటాలూ. అన్నీ పన్నుల రూపంలో వచ్చిన కార్మికుల అదనపు విలువే.

ఆర్టీసీ కార్మికులూ!
నిరుత్సాహ పడకండి!
కొందరు ఆత్మహత్యల ఆలోచనలు చేశారు. అది సరి కాదు.
ఎందుకంటే, ఈ సమ్మెలో పెట్టిన డిమాండ్లు వ్యక్తిగతమైనవి కావు.
కార్మికులందరికీ సంబంధించినవి.

అందరితో కలిసి పొరాడి సాధించుకోవడానికి ప్రయత్నించాలి.
వ్యక్తులు పోతే ఉద్యమాలు బలహీన పడి పోతాయి.
ఆత్మహత్యలు పాలకుల్ని కదిలించవు.
అలా మనం చేస్తే, వాళ్ళ పెత్తనానికి లొంగిపోయిన వాళ్ళం అవుతాం.

- రంగనాయకమ్మ

Thursday, September 26, 2019

1970 లలో దేశంలో పెను తుఫాన్‌ను సృష్టించిన దళిత్ పాంథర్స్







(హైదరాబాద్ బుక్ ట్రస్ట్ త్వరలో తెలుగులో వెలువరిస్తున్న" దళిత్ పాంథర్స్ " పుస్తకం నుంచి రచయిత, దళిత్ పాంథర్ వ్యవస్తాపకులలో ఒకరైన జే.వీ.పవార్ ముందుమాట : )

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్‌ ఉద్యమమే. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఆవిర్భవించింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న సంస్థను రద్దు చేస్తున్నట్టు ముంబయిలో చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్‌ పాంథర్‌ సంస్థ అంతరించిపోయింది.
నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలే, జె.వి. పవార్‌లను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దసాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది. ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.
ఈ కాలంలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమం దేశంలో ఒక పెను తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక ఊపు ఊపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధ సైనికుల మాదిరిగా వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించగల వీరులుగా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది. దళిత్‌ పాంథర్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి, అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలాచేయడం కూడా.
దళిత్‌ పాంథర్‌ ఉద్యమం 1974 జనవరి 4 వరకూ ఎంతో ఉధృతంగా సాగింది. ఆతరువాత 1974 జనవరి 5న ముంబయిలో ముఖ్యంగా వోర్లీ, నయీగావ్‌ ప్రాంతాల్లో ఉద్యమంపై ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున దాడిజరిగింది. ఆ దాడిలో దళిత్‌ పాంథర్లు భగవత్‌ జాదవ్‌, రమేష్‌ డియెరుక్కర్‌లు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది దళిత యువకుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. జైళ్లపాలయ్యారు. అయితే వారి త్యాగాలు అంబేడ్కరిస్ట్‌ ఉద్యమానికి ఒక కొత్త శక్తిని సమకూర్చాయనే చెప్పాలి.
కొన్ని పదవులు, కొద్దిపాటి డబ్బు కోసం ఉద్యమాన్ని సంపన్నుల పాదాలవద్ద తాకట్టు పెట్టిన పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నమైనది. దళిత్‌ పాంథర్‌ కొనసాగింది కొద్దికాలమే అయినా అది భారత సమాజంమీదా, రాజకీయాల మీదా బలమైన ముద్ర వేసింది. ఈ చారిత్రాత్మకమైన ఉద్యమ ప్రభావం ఎంతటిదంటే 2006లో మహారాష్ట్ర భండారా జిల్లా ఖైర్లాంజిలో ఒక దళిత కుటుంబంలో నలుగురిని (ఒక మహిళ, ఆమె యుక్తవయసు కూతురుతో సహా) అత్యంత దారుణంగా హత్యచేసినప్పుడు- కులపరమైన దాడులకు పాల్పడేవారిని నిర్మూలిందుకు మళ్లీ దళిత్‌ పాంథర్‌ వంటి మిలిటెంట్‌ సంస్థ కావాలి అన్న డిమాండ్‌ తిరిగి బలంగా వినిపించింది.
ఈ ఉద్యమంపై ఇప్పటికే పలు పరిశోధనాపత్రాలు, సంకలనాలతో సహా అనేక రచనలు వెలువడ్డాయి.
వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను, ఉద్యమకారులతో జరిపిన సంభాషణలను ఆధారంగా చేసుకుని దళిత్‌ పాంథర్‌పై ఆ పరిశోధనా పత్రాలను, వ్యాస సంకలనాలను తయారుచేశారు. చాలామంది తమ సైద్ధాంతిక ఆలోచనలకు అనుగుణంగా, తమకు నచ్చిన రీతిలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమాన్ని విశ్లేషించారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చరిత్రను వక్రీకరిస్తూ, గాలివాటంగా చేసినవే ఎక్కువ. మరికొందరు ప్రచారం కోసం, తాత్కాలిక లబ్దికోసం ఉద్యమకారులమనే ముసుగుతో, ఉద్యమ పితామహులమని చెప్పుకుంటూ రచనలు చేశారు. ఉద్యమాన్ని మొట్టమొదటి రోజునుంచీ పరిశీలించిన ప్రత్యక్ష సాక్షిని నేను. కేవలం ప్రేక్షకుడిగానో, రచయితగానో కాకుండా ఈ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకడిగా, చురుకైన ఉద్యమకారుడిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాను. దళిత్‌ పాంథర్‌ సంస్థకు నామ్‌దేవ్‌ దసాల్‌, నేనూ వ్యవస్థాపకులం. అలాగే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కీలకమైన వ్యక్తి రాజా దాలే.
కాబట్టి, దళిత్‌ పాంథర్‌ ఉద్యమ చరిత్రను రాజా దాలే, నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌ (నేను) మాత్రమే సరిగా లిఖించేందుకు అర్హులమని భావిస్తాను. నేను మొదట దళిత్‌ పాంథర్‌ నిర్వాహకుడిగా, ఆతరువాత ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తత్ఫలితంగా సంస్థకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, దస్తావేజులు అన్నీ నావద్ద భద్రంగా వున్నాయి. ఆరోజుల్లో ఫొటో కాపీయింగ్‌ యంత్రాలు అందుబాటులో వుండేవి కావు. అందువల్ల ఉత్తరాలను, ప్రకటనలను రాసేటప్పుడు కార్బన్‌ పేపర్లను ఉపయోగించి ప్రతులను తయారు చేసేవాళ్లం. అలాంటి వాటన్నింటినీ నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలన్నింటికీ నావద్ద సాక్ష్యాధారాలు వున్నాయనీ, ఇవన్నీ సాధికారికమైనవనీ స్పష్టం చేసేందుకే నేనీ మాట చెబుతున్నాను. వీటికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ప్రాచీన పత్ర భాండాగారాన్నీ, పోలీసు ఇంటలిజెన్సు విభాగాల దస్తావేజులను అన్నింటినీ పరిశీలించేందుకు అనుమతినిచ్చారు. అందువల్ల నా ఈ రచనకు మరింత సాధికారికత చేకూరింది.
'డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ అనంతరం అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం' అనే అంశంపై నేను మరాఠీలో అనేక వ్యాసాలు రాశాను. అదే క్రమంలో వెలువడుతున్న నాలుగవ పుస్తకం ఇది. దళిత్‌ పాంథర్‌ ఉద్యమ కాలం ఎంతో మహత్తరమైనది. రాజా దాలే, నామ్‌దేవ్‌ దసాల్‌లతో సహా అనేకమంది మేధావులు ఇప్పటికే ఈ ఉద్యమంపై పలు రచనలు చేశారు.
దళిత్‌ పాంథర్‌ ఉద్యమ కాలంలో మరాఠీ వార్తా పత్రిక 'నవకాల్‌' సంపాదకుడు నీలూభావ్‌ ఖాదిల్కర్‌ తన పత్రికను ఈ ఉద్యమవార్తలకు వేదికగా చేశారు. నవకాల్‌ దళిత్‌ పాంథర్ల అధికార పత్రికేమో అన్నట్టుగా వుండేది. దీనితోపాటు నవశక్తి, మరాఠా, మహారాష్ట్ర టైమ్స్‌, లోక్‌సత్తా, సకాల్‌ వంటి మరికొన్ని ఇతర పత్రికలు కూడా దళిత్‌ పాంథర్‌ వార్తలను ప్రచురిస్తూ ఉద్యమానికి ఎంతో అండగా నిలిచాయి. వారందరికీ ఈసందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
అంబేడ్కర్‌ జీవించివున్న కాలంలో నేను కార్యకర్తగా గానీ, రచయితగా గానీ లేను. అంబేడ్కర్‌ సంపాదకత్వం వహించిన 'మూక్‌ నాయక్‌', 'ప్రబుద్ధ భారత్‌' వంటి పత్రికలకు అనేకమంది తమ రచనలను అందించేవారు. అయితే వాళ్లంతా ఆకాలపు వార్తలను నమోదు చేసిన వాళ్లు మాత్రమే. వారిలో సి.బి.ఖైర్మోడ్‌ రచనా విధానం ఎంతో అమూల్యమైనది. నేను ఈ పుస్తకంలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమాన్ని కేవలం నమోదు చేయాలనికాకుండా విశ్లేషించాలని భావిస్తున్నాను. ఈ ఉద్యమంలో నేను స్వయంగా పాలుపంచుకున్నాను. ఏదో మూలన కుర్చుని ఉద్యమాన్ని చూసిన మౌన ప్రేక్షకుడిని కాదు నేను. అందువల్ల ఉద్యమ చరిత్రను నా రచన సమగ్రంగా విశ్లేషిస్తుంది. నేను 1972 నుంచి ఉద్యమ అగ్రభాగాన నిలవడమే కాకుండా అంతకుముందు 1964లో సుప్రసిద్ధ భూపోరాట ఉద్యమాన్ని నడిపిన దాదాసాహెబ్‌ గైక్వాడ్‌ విద్యార్థి విభాగానికి కూడా నేను నాయకత్వం వహించివున్నాను.
నేనూ, నా కవిమిత్రుడు నామ్‌దేవ్‌ దసాల్‌ కలిసి 1972లో దళిత్‌ పాంథర్‌ని నెలకొల్పాం. అది స్వల్ప కాలమే జీవించివున్నప్పటికీ అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం మాదిరిగా అంబేడ్కర్‌ మరణానంతర ఉద్యమాలన్నింటికీ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.
నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.
రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఆ నాయకులు ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది.
గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.
దీనినిబట్టి దళిత్‌ పాంథర్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ దృష్టితోనే ఈ రచనను ముందుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీసుకరావడం జరిగింది. నేను దళిత్‌ పాంథర్‌ చరిత్రను 'దళిత్‌ పాంథర్స్‌' అన్న పేరుతో 2010 డిసెంబర్‌ 6 న మరాఠీలో వెలువరించాను. మరాఠీ పాఠకులు, కార్యకర్తలు దానిని విశేషంగా ఆదరించారు.
దళిత్‌ పాంథర్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రపంచం నలుమూలలనుంచీ పరిశోధకులు, విద్యార్థులు తరచూ అడుగుతుంటారు. అందువల్లే ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీషు భాషల్లో వస్తే చాలా ఉపయోగంగా వుంటుందని నాకు అనిపించింది. అమెరికా బ్లాక్‌ పాంథర్స్‌కు చెందిన ఉద్యమకారిణి ఏంజెలా డేవిస్‌ 2016 డిసెంబర్‌ 16న భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికాలో పోరాడుతున్న ఆఫ్రికన్‌-అమెరికన్‌ సోదరీ సోదరుల ప్రయోజనం కోసం ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ పుస్తకాన్ని మరాఠీ నుంచి ఇంగ్లీషులోకి అనువదించిన నా సీనియర్‌ సహోద్యోగి రక్షిత్‌ సోనేవాడీకి నేను ఎంతగానో రుణపడివుంటాను. ....
...... - జే.వీ.పవార్

Thursday, August 8, 2019

''నాకు కశ్మీర్‌ కావాలి'' - జవహర్‌లాల్‌ నెహూృ

''నాకు కశ్మీర్‌ కావాలి'' - జవహర్‌లాల్‌ నెహూృ

'... నెహూృ ఆలోచనలు కశ్మీర్‌ పైనే వున్నాయన్నది వాస్తవం. ఆయన ఉత్తర ప్రదేశ్‌లో పుట్టి పెరిగినప్పటికీ తన పూర్వీకులంతా కశ్మీర్‌లోని హిందూ సంపన్న వర్గానికి చెందిన వాళ్లు కావడం వల్ల కశ్మీర్‌తో నెహూృకు కొంత భావోద్వేగపరమైన అనుబంధం వుంది. ...

మొట్టమొదటిసారిగా నెహూృ పైలా పచ్చీసు వయసులో ఎలుగుబంటి వేటకోసం కశ్మీర్‌ వెళ్లారు. ఆ తర్వాత 1940 వరకూ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ కశ్మీర్‌ గురించి పర్యాటక ప్రచార కరపత్రాలలో వుండే అసహజమైన అభివర్ణనల మాదిరిగా ఆయన తన స్మృతులను రాసుకున్నారు.

''నేను ఆ అద్భుత సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ కశ్మీర్‌లో సంచరించాను. ఆ మైకం నా మనసంతా ఆవహించింది. కశ్మీర్‌ ఒక అతిలోక సుందరిలా వుంది. మానవాతీతంగా, మనిషి ఊహలకు అందని అందాలను కలిగివుంది. ఆ నదులూ, ఆ కొండలూ, కోనలూ, సరస్సూ ముగ్ధమనోహరమైన వృక్షాలూ అన్నింటిలోనూ స్త్రీ సౌందర్యం దోబూచులాడుతోంది. ఆ ప్రేమపూర్వకమైన సౌందర్యం నన్ను వివశుణ్ని చేసింది. నేను దాదాపు మూర్ఛిల్లిపోయాను'' అంటూ అభివర్ణించారు. ''కశ్మీర్‌ మళ్లీ పిలుస్తోంది. మునుపటి కంటే బలంగా నన్ను తనవైపు లాగుతోంది. వీనుల విందు చేసే ఆ చిరునవ్వుల చిరుసవ్వడి, ఆ జ్ఞాపకాలు నా మనసును వివశం చేస్తున్నాయి. ఒక్కసారి తన వశీకరణకు గురైతే ఎవరైనా ఆ మోహం నుంచి ఎలా బయటపడగలరు?''

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్‌ వ్యూహకర్తలలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా కశ్మీర్‌ను మధ్య ఆసియా మార్గాలను నియంత్రించగల వ్యూహాత్మక రక్షణ ప్రదేశంగా భావించింది. అన్నింటికి మించి సైద్ధాంతికంగా దేశ ప్రతిష్టను పెంచే ప్రాంతమది. భారతదేశానికి కశ్మీర్‌ దక్కితే మొదటినుంచీ చెప్పుకుంటున్నట్టు తమది లౌకిక (సెక్యులర్‌) రాజ్యమనీ, హిందూ రాష్ట్రాలతో పాటు ముస్లిం రాష్ట్రం కూడా తమతో సహజీవనం చేయగలదనీ, భారత ఉపఖండాన్నినిట్టనిలువునా చీల్చిన పాకిస్థాన్‌ మాదిరిగా భారతదేశం ఏకపక్ష రాజ్యం కాదనీ చాటుకునేందుకు వీలవుతుంది.

నెహూృ కైతే కశ్మీర్‌ 'మరీ వ్యక్తిగత ప్రాధాన్యత' వున్న వ్యవహారంగా మారిపోయింది. ఆయన తన మనసులోని భావాలను ఏమాత్రం దాచుకోకుండా లార్డ్‌ మౌంట్‌బాటెన్‌కు చెప్పుకున్నారు. కశ్మీర్‌ తనకు అన్నింటికంటే ముఖ్యమైనదని వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు మౌంట్‌ బాటెన్‌ సతీమణి ఎడ్వినాతో ''నా మీద కశ్మీర్‌ విపరీతమైన ప్రభావం చూపుతోందనీ, ఒకోసారి అది సంగీతంలా, ప్రియురాలి సాంగత్యంలా అనుభూతిని కలిగిస్తోందనీ' చెప్పుకున్నారు. చిన్నపిల్లాడిలా ''నాకు కశ్మీర్‌ కావాలి'' అంటూ మారాం చేశారు.

ఆయన జూన్‌లో లార్డ్‌ మౌంట్‌బాటెన్‌కు సమర్పించిన ఒక మెమొరాండమ్‌లో 'దేశ విభజన సమయంలోనే కశ్మీర్‌ భారతదేశానికి చెందడం అత్యంత సహజమైన రీతిలో కచ్చితంగా జరిగిపోవాలనీ, పాకిస్తాన్‌ గొడవపడుతుందేమో నని భావించడం అర్థరహితమనీ వివరించారు'.

కశ్మీర్‌ గొడవ దానికదేగా రూపుదిద్దుకుంది. పంజాబ్‌ విభజనపై పెల్లుబికిన మతహింస జమ్మూకు వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దోగ్రాలు జమ్మూ నుంచి ముస్లింలను తరిమివేయడం మొదలుపెట్టారు. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన పూంఛ్‌లో హిందూరాజు పాలనకు వ్యతిరేకంగా ఒక్కసారిగా పూర్తి స్థాయి ముస్లిం తిరుగుబాటు చెలరేగింది.

భారత ఆయుధాలను భద్రపరిచిన కశ్మీర్‌లోయ ప్రాంతానికి పటియాలా నుంచి ఒక సాయుధ దళం వచ్చింది.

పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముస్లింలను ఊచకోత కోస్తున్నారనే వార్త గుప్పుమనడంతో పాకిస్థాన్‌ నుంచీ వాయవ్య సరిహద్దు ప్రాంతం నుంచీ పఠాన్‌ తెగకు చెందినవాళ్లు సంప్రదాయిక ఆయుధాలతో అడ్డొచ్చిన వాళ్ల మీద దాడి చేస్తూ శ్రీనగర్‌ వైపు దూసుకువచ్చారు. కశ్మీర్‌ రాజు జమ్మూకు పారిపోయారు.

పఠాన్‌ పోరాట యోధులు శ్రీనగర్‌ పొలిమేర వరకూ చేరుకోవడంతో కశ్మీర్‌ను దక్కించుకోవడానికి భారతదేశం ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దిల్లీ వెంటనే రంగంలోకి దిగింది.

అప్పుడు స్వతంత్ర భారతదేశానికి ఇంకా లార్డ్‌ మౌంట్‌బాటెనే గవర్నర్‌ జనరల్‌గా వున్నారు. అటు పాకిస్థాన్‌లో మాదిరిగానే ఇటు భారతదేశంలో కూడా సైన్యం అంతా ఇంకా బ్రిటిష్‌ అధికారుల నియంత్రణలోనే వుంది. నెహూృకు కశ్మీర్‌ అంటే ఎంత ప్రాణమో మౌంట్‌బాటెన్‌కు మొదటినుంచీ తెలుసు.

దేశ విభజన సరిహద్దులను నిర్ణయించేందుకు లండన్‌ నుంచి రాడ్‌క్లిఫ్‌ భారతదేశానికి రావడానికి 9 రోజుల ముందు మౌంట్‌బాటెన్‌ గురుదాస్‌పూర్‌ జిల్లాను భారతదేశానికి కేటాయించేలా మేనన్‌ చేత ఒక నోటును తయారుచేయించారు.

భారతదేశం నుంచి కశ్మీర్‌ చేరుకోవాలంటే గురుదాస్‌పూర్‌ జిల్లా నుండి వెళ్లే రోడ్డు మార్గమే గతి. ముస్లింలు అత్యదిక సంఖ్యలో వుండే ప్రాంతమైనప్పటికీ ఆ జిల్లాను రాడ్‌క్లిఫ్‌ చేత భారతదేశానికి కేటాయింప జేశారు. మౌంట్‌బాటెన్‌ ఏవైపు మొగ్గుచూపాడన్న విషయంలో సందిగ్థతే లేదు.

అయితే, కశ్మీర్‌లో సైనిక జోక్యం చేసుకోవాలంటే న్యాయపరమైన ఏదో ఒక కారణం కావాలి. అక్టోబర్‌ 26న ఆ సాకును మేనన్‌ సమకూర్చారు. భారత యూనియన్‌లో చేరుతున్నానని కశ్మీర్‌ మహరాజు ప్రకటించినట్టుగా రాజుగారి దొంగ సంతకంతో ఆయన ఒక పత్రాన్ని సృష్టించారు. దానిని అప్పుడే శ్రీనగర్‌ నుంచి తెచ్చినట్టు బుకాయించారు. నిజానికి ఆ సమయంలో మేనన్‌ దిల్లీలోనే వున్నారు.

మొత్తం కశ్మీర్‌ మీద భారతదేశానికి హక్కును ప్రసాదించిన ఆ పత్రాన్ని యాభై ఏళ్ల వరకూ ప్రపంచానికి చూపించలేదు.

వాస్తవానికి ఆనాడు కశ్మీర్‌ మహారాజు దిల్లీని ధిక్కరించే స్థితిలో లేడు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టే స్థితిలో వున్నాడు. కానీ పఠాన్ల దాడికి శ్రీనగర్‌ ఎక్కడ పతనమవుతుందో నన్న భయంతో దిల్లీ వేచివుండలేకపోయింది. (అలెస్టర్‌ లాంబ్‌, 'ఇన్‌కంప్లీట్‌ పార్టిషన్‌').

వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ శ్రీనగర్‌కు వాయుమార్గంలో సైనిక బలగాలను తరలించారు. బ్రిటిష్‌ కమాండర్ల నేతృత్శలో ఆ మొత్తం వ్యవహారాన్ని లార్డ్‌ మౌంట్‌బాటెనే పర్యవేక్షించారు. భారతదేశం సత్వరమే కశ్మీర్‌లో చాలా భాగాన్ని స్వాధీనం చేసుకుంది.

జిన్నా కొంత ఆలస్యంగా మేల్కొని పాకిస్థాన్‌ సైన్యాన్ని కశ్మీర్‌కు పంపించి ప్రతిఘటించాలని ప్రయత్నించినప్పుడు దిల్లీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ హుటాహుటిన కరాచీకి వెళ్లి అక్కడి తన సహచర కమాండ్‌ర్‌ ఇన్‌ చీఫ్‌ మెసర్వీని కలసి భారతదేశానికి చట్టబద్ధంగా దక్కిన కశ్మీర్‌పై పాకిస్తాన్‌ గనక దాడికి పూనుకుంటే బ్రిటిష్‌ సైనికాధికారులంతా వెంటనే తమ పదవులకు రాజినామా చేస్తారని, అప్పుడు మొత్తం పాకిస్థాన్‌ సైన్యమే పనికిరాకుండా పోతుందనీ హెచ్చరించారు.

దాంతో జిన్నా వెనక్కి తగ్గాడు.
ఆవిధంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కశ్మీర్‌ను పళ్లెంలో పెట్టి మరీ భారతదేశానికి అందించింది.


("ఇండియాలో దాగిన హిందుస్థాన్‌", పెరీ ఆండర్‌సన్‌, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, సెప్టెంబర్‌
2014 నుండి)





("ఇండియాలో దాగిన హిందుస్థాన్‌")


Saturday, July 20, 2019

తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర


తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర



మొన్న జులై 16న ముంబయిలో మరణించిన రాజా దాలే (78) దళిత్‌ పాంథర్స్‌ వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరు. మిగతా ఇద్దరు నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌లు. రాజా దాలే అద్భుతమైన వక్త. ఆయన ప్రసంగాలు దళిత యువతను ఉర్రూతలూగించేవి.

దళితులపై జరుగుతున్న అత్యాచారాలను చూసి సహించలేక వాటిని అరికట్టేందుకు మిలిటెంట్‌ పోరాటాలు అనివార్యంగా భావించి వాళ్లు నడుంబిగించారు. అమెరికాలోని ఆఫ్రో అమెరికన్ల 'బ్లాక్‌ పాంథర్స్‌' సంస్థ ప్రేరణతో తమ సంస్థకు దళిత్‌ పాంథర్స్‌ అని పేరు పెట్టుకున్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ ఉనికిలో వున్నది ఐదేళ్లే (1972-77). అందులోనూ చురుకుగా పనిచేసింది కేవలం మూడేళ్లే. 1975లో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించిన కారణంగా చివరి రెండేళ్లూ తీవ్ర నిర్బంధాలకు గురికావలసి వచ్చింది.

ఆ మూడేళ్ల కాలం లోనే  దళిత్‌ పాంథర్స్‌ ముంబయినీ, మహరాష్ట్రనీ ఒక ఊపు ఊపింది. దళిత సమస్యపై యావద్దేశం దృష్టి సారించేట్టు చేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో తనదైన ప్రభావాన్ని చూపింది. దళిత యువతలో పోరాట స్ఫూర్తిని నింపింది. దళిత్‌ పాంథర్స్‌ రద్దయిపోయి ముఫ్పై నాలుగేళ్లు గడచినా ఈనాటికీ అది  చేసిన వీరోచిత పోరాటాలు, సాధించిన విజయాలు, రచనలు ఎందరికో ఉత్తేజాన్ని ఇస్తూనే వున్నాయి.
సంస్థ నిర్మాతల్లో ఒకరైన జె.వి.పవార్‌ రాసిన ''దళిత్‌ పాంథర్స్‌ - ఏన్‌ అథారిటేటివ్‌ హిస్టరీ'' అన్న పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ త్వరలో తెలుగులో వెలువరించనుంది. ఈ సందర్భంగా పుస్తక రచయిత రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు మీకోసం.


... ... ...

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో  స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్స్‌కే చెందుతుంది. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న ముంబయిలో నిర్వాహకులు చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్ పాంథర్స్ రద్దు అయిపోయింది.. 

అంతకుముందు నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలేను , జె.వి. పవార్‌ను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన విడుదల చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దశాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది.

ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలుయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఒక తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధత తో వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించే వీర సైనికుల్లా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది.
దళిత్‌ పాంథర్స్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్స్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు, వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలా చేయడం కూడా.
... ... ...

1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
... ... ...

నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి డా.అంబేడ్కర్‌ నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.

ఆ నాయకులు రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్స్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్స్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.

దీనినిబట్టి దళిత్‌ పాంథర్స్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

-జే.వీ. పవార్



Sunday, June 23, 2019

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కేటలాగ్


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన,
ప్రస్తుతం అందుబాటులో వున్న
పుస్తకాల
వివరాల కోసం
ఈ కింది లింక్ పై
క్లిక్ చేయండి

( మీరు ఈ పీడీఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ / ప్రింట్ కూడా చేసుకోవచ్చు)


HBT  BOOKS  CATALOG   PDF







https://drive.google.com/file/d/1JIoBaV3RZFJVEVYwIM7Anmx55JXnGM7t/view





Saturday, April 20, 2019

''హింద్‌ స్వరాజ్‌'' - గాంధీ సిద్ధాంతానికి పునాది వంటి పుస్తకం!


ఇంతవరకు గాంధీయిజంకు సంబంధించిన పుస్తకాలేవీ నేను చదవలేదు. చదవాలన్న ఆసక్తి కూడా ఎప్పుడూ కలగలేదు. అలాంటిది ఈ మధ్య అనుకోకుండా 'హింద్‌ స్వరాజ్‌'ని తప్పనిసరిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌, మైసూర్‌ నుంచి మిత్రులు మాథ్యూస్‌ ప్రత్తిపాటి గారు ఫోన్‌ చేసి గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా హింద్‌ స్వరాజ్‌ని తెలుగులో వెలువరించాలని తలపెట్టినట్టు, దానిని అర్జంటుగా అనువాదం చేసివ్వాలని అడిగారు.
నేను అంతకు ముందు నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ (ఎన్‌టిఎం), హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బిటి)లు సంయుక్తంగా ప్రచురించిన గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ ''భారత రాజ్యాంగం- దేశానికి మూలస్తంభం'' పుస్తకాన్ని అనువాదం చేసివున్నాను.
అందువల్లనే నాకీ అవకాశాన్ని కల్పించారు. గత సంవత్సరం అక్టోబర్‌ 2న దిల్లీలో విడుదల చేయాలని భావించినప్పటికీ ముద్రణా తదితర సమస్యల వల్ల వీలుకాలేదు. ఈమధ్యనే మరో నాలుగు భారతీయ భాషల అనువాదాలతో కలిపి దీనిని మైసూరులో ఆవిష్కరించారు. ఈరోజే నాకు కాంప్లిమెంటరీ కాపీలు అందాయి.
గాందీజీ దక్షిణాఫ్రికాలో వుంటున్నప్పుడు 1909లో హింద్‌ స్వరాజ్‌ని గుజరాతీ భాషలో రాశారు. ఆ తరువాత 1910లో తనే ఇంగ్లీషులోకి అనువదించి పుస్తకరూపంలో వెలువరించారు. దాదాపు 109 సంవత్సరాలు గడచినా ఈ
పుస్తకం ఇప్పటికీ తెలుగులో రాకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. (ఒకవేళ ఇంతకు ముందే తెలుగులో వచ్చి ఆ ప్రతులేవీ దొరకకపోవడం వల్ల మళ్లీ ఇందుకు పూనుకున్నారేమో తెలియదు).
మొత్తం మీద ఈ చారిత్రాత్మక పుస్తకాన్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించడం నా మట్టుకు నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. గాంధీ సిద్ధాంతానికి పునాది వంటిది ఈ పుస్తకం. సిద్ధాంత మంచిచెడ్డల సంగతిని పక్కన పెడితే అసలు గాంధీ ఆలోచనా విధానం ఏమిటో ఇది మనకి స్థూలంగా పరిచయం చేస్తుంది. జాతీయ కాంగ్రెస్‌ పాత్ర, భారత దేశ పరిస్థితి, ఇంగ్లండ్‌ పరిస్థితి, భారతదేశం ఎందుకు పరాధీనమయింది, ఎలా స్వతంత్రమవుతుంది, స్వరాజ్యం అంటే ఏమిటి, హిందూ ముస్లింల ఐక్యత , నిజమైన నాగరికత, బెంగాల్‌ విభజన, సాత్విక ప్రతిఘటన-సత్యాగ్రహం, విద్య, యంత్రాలు వంటి వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను విస్పష్టంగా ఇందులో పొందుపరిచారు.
దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడ అనేకమంది భారతీయ అతివాద, మితవాద నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపి 1909లో సముద్రమార్గంలో దక్షిణాఫ్రికాకు తిరుగు ప్రయాణమైనప్పుడు ఆయన ఓడలోనే ప్రశ్నలు జవాబుల రూపంలో ఈ పుస్తకాన్ని రాశారు. మొదట తన సంపాదకత్వంలో వెలువడే స్థానిక ''ఇండియన్‌ ఒపినియన్‌'' పత్రికలో సీరియల్‌గా ప్రచురించారు. గుజరాతీ భాషలో వెలువడిన పుస్తక ప్రతులను బొంబాయి రేవులో
బ్రిటిష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాంతో ఆయనే ఆఘమేఘాల మీద ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. ఆతదనంతరం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం పెను సంచలనమే సృష్టించింది.
ఇవాళ దేశంలో కుహనా దేశభక్తి, మతోన్మాదం, పరమత అసహనం, గోసంరక్షణ పేరిట అమానవీయ దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో గాంధీజీ వంద సంవత్సరాల క్రితం వెలిబుచ్చిన అభిప్రాయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రేరేపిస్తాయి.
హిందూ ముస్లిం విభేదాల గురించి (పేజి 39లో):
'' ... భారతదేశం కేవలం హిందువులతోనే కూడివుండాలని హిందువులు భావిస్తున్నట్టయితే వాళ్లు ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టే లెక్క. హిందువులూ ముస్లింలూ పార్శీలూ క్రైస్తవులూ ఎవరైతే భారతదేశాన్ని తమ దేశంగా చేసుకున్నారో వాళ్లంతా సహ దేశీయులే. తమ ప్రయోజనం కోసమైనా సరే వాళ్లంతా ఐకమత్యంతో ఈ దేశంలో జీవించాలి. ప్రపంచంలో ఎక్కడా ఒకే జాతీయత, ఒకే మతం ప్రాతిపదికతో కూడిన ప్రదేశం లేదు. భారతదేశంలో కూడా ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు...."
"...ముస్లిం రాజుల కాలంలో కూడా హిందువులు అభివృద్ధి చెందారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే హిందూ రాజుల కాలంలో ముస్లింలూ వర్థిల్లారు. పరస్పరం కలహించుకోవడమనేది ఆత్మహత్యా సదృశం అవుతుందని రెండు పక్షాలూ గుర్తించాయి. ఆయుధాలను ఎక్కుపెట్టినా ఏ పక్షంవారూ తమ మతాన్ని విసర్జించరు. అందుకే ఇరు పక్షాలూ శాంతియుతంగా జీవించాలని నిశ్చయించుకున్నాయి. బ్రిటిష్‌ వారి రాకతో తిరిగి కలహాలు రాజుకున్నాయి.
మీరు పేర్కొన్న సామెతలు ఇరువర్గాలూ పోట్లాడుకుంటున్న కాలంలో పుట్టినవి. వాటిని ఇప్పుడు ప్రస్తావించడం హానికరం అవుతుంది. అనేకమంది హిందువుల, ముస్లింల పూర్వీకులు ఒకరేననీ వారి రక్తంలో ప్రవహిస్తున్నది ఒకే రక్తమనీ మనం మరచిపోతే ఎలా? మతం మారిన కారణంగా శత్రువులైపోవాలా?
ముస్లింల దేవుడికీ హిందువుల దేవుడికీ మధ్య తేడా వుందా? మతాల మార్గం వేరే కావచ్చు కానీ అవి ఒకేచోట కలుస్తాయి. మనం చేరుకునే గమ్యం ఒకటే అయినప్పుడు మనం ప్రయాణం చేసే మార్గాలు వేరైతేనేంటి? మనం పోట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది?
శివ భక్తులకూ, విష్ణు భక్తులకూ మధ్య కూడా ఇలాంటి దారుణమైన సామెతలు అనేకం వుండేవి. అయినంత మాత్రాన వాళ్లిరువురిదీ ఒకే దేశం కాదని ఎవరూ అనలేరు కదా. వైదికమతం జైన మతానికంటే భిన్నమైనది. అయినా ఆ రెండు మతాలను అవలంభించేవాళ్లు వేరు వేరు దేశాలకు చెందిన వాళ్లేం కాదు కదా.
అసలు వాస్తవం ఏమిటంటే మనం బానిసల మాదిరిగా మారిపోయాం. అందుకే పరస్పరం పోట్లాడుకుంటున్నాం. మన పోట్లాటలపై మూడో పక్షం తీర్పును కోరుకుంటున్నాం. ముస్లింలలో వున్నట్టే హిందువులలో కూడా విగ్రహ విధ్వంసకులు వున్నారు. మనలో నిజమైన జ్ఞానం పెంపొందుతున్నా కొద్దీ ఇతర మతస్థులతో పోట్లాడాల్సిన అవసరం లేదన్న అవగాహన కలుగుతుంది."
గో సంరక్షణ విషయం గురించి :
"...నేను స్వయంగా ఆవును గౌరవిస్తాను. ఆవు పట్ల అపారమైన ప్రేమాభిమానాలను కనబరుస్తాను. వ్యవసాయ దేశం కాబట్టి భారతదేశానికి ఆవు సంరక్షకురాలు. దేశం ఆవు మీదనే ఆధారపడి వుంది. ఆవు వందలాది విధాలుగా ఎంతో ఉపయోగకపడుతుంది. మన ముస్లిం సోదరులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.
అయితే నేను ఆవును గౌరవించినట్టే నా సహోదర భారతీయుడిని కూడా గౌరవిస్తానా అన్నది ప్రశ్న. ఒక మనిషి ముస్లిం అయినా, హిందువు అయినా అతను ఆవు అంత ఉపయోగకరమైన వాడే. కాబట్టి ఒక ఆవును కాపాడేందుకు నేను ఒక ముస్లింతో పోట్లాడాలా? లేదా అతడిని చంపాలా? ఆ పనిచేయడం వల్ల నేను ముస్లింలకే కాదు ఆవుకు కూడా శత్రువును అవుతాను.
అందువల్ల ఆవును రక్షించేందుకు నా ముందున్న ఒకే ఒక విధానం ఏమిటంటే ముస్లిం సోదరుని వద్దకు వెళ్లి దేశం కోసం ఆవును కాపాడే కార్యక్రమంలో నాతో చేతులు కలపవలసిందిగా అభ్యర్థించడమే. ఒకవేళ అతను నా మాటను
మన్నించకపోతే ఇక నా చేతిలో ఏమీ లేదన్న సాధారణ కారణంతో ఆవును వదులుకుంటాను.
నాకు గనక ఆవు మీద అపరిమితమైన జాలి వుంటే దానిని కాపాడేందుకు నా ప్రాణాన్ని అర్పిస్తానే తప్ప నా సోదరుడి ప్రాణాలు తీయను. నేను అనుసరిస్తున్నది మన మతం ప్రబోధిస్తున్న ధర్మమే.
మనిషి మొండివాడిగా తయారైనప్పుడు సమస్య సంక్లిష్టమవుతుంది. నేను ఒకవైపు లాగితే నా ముస్లిం సోదరుడు మరొకవైపు లాగుతాడు. నేను అతడి పట్ల సానుకూలంగా వుంటే అతను నాపట్ల సానుకూలంగా వుంటాడు. నేను
అతని ముందు వినయంగా తలవంచితే అతను అదేపనిని నా కంటే ఎక్కువగా చేస్తాడు. తలవంచడమనేది తప్పేమీ కాదన్నది నా ఉద్దేశం.
హిందువులు అతిగా పట్టుపట్టినప్పుడే ఆవులను వధించడం ఎక్కువయింది. నా అభిప్రాయం ప్రకారం గో సంరక్షణ సంఘాలను గో వధ సంఘాలుగా పరిగణించాలి. అలాంటి సంఘాల అవసరం ఏర్పడటం దురదృష్టకరం. ఆవులను ఎలా సంరక్షించాలో మనకు తెలియనప్పుడు అలాంటి సంఘాల అవసరం వుంటుంది.
స్వయానా నా తోడబుట్టిన సోదరుడే ఆవును చంపబోతుంటే నేను ఏం చేయాలి? అతడిని నేను చంపాలా లేక అతని కాళ్ల మీద పడి అలా చేయొద్దని వేడుకోవాలా? రెండోదే సరైనదని మీరు ఒప్పుకుంటే నేను ముస్లిం సోదరుడి
విషయంలో కూడా ఆపనే చేయాలి కదా.
కొందరు హిందువులు ఆవులను సరిగా చూడకుండా క్రూరంగా వ్యవహరిస్తూ వాటి వినాశనానికి కారణమవుతున్నప్పుడు వాటిని ఎవరు రక్షించాలి? కారణం ఏమైనా కావచ్చు కొందరు హిందువులు ఆవులను నిర్దాక్షిణ్యంగా దుడ్డు కర్రలతో బాదుతున్నప్పుడు ఎవరు అడ్డుకోవాలి? ఈ విషయాలు ఎలా వున్నా ఇవేవీ మనల్ని ఒకే దేశీయులుగా వుండకుండా చేయలేవు కదా.
చివరగా, హిందువులు అహింసా సిద్ధాంతాన్ని నమ్ముతారనీ, ముస్లింలు నమ్మరనీ భావించినప్పుడు హిందువులు చేయాల్సిన పనేమిటి, బతిమిలాడటమేనా? అహింసా ధర్మాన్ని పాటించే వ్యక్తి తోటి వాడిని చంపొచ్చని ఎక్కడా రాసిపెట్టి లేదు. అతను అనుసరించాల్సిన మార్గం సూటిగా వుంటుంది.
ఒక ప్రాణిని రక్షించేందుకు మరొక ప్రాణిని చంపకూడదు. అతను కేవలం బతిమిలాడవచ్చు. అదే అతని ఏకైక విద్యుక్త ధర్మం.
అయితే ప్రతి హిందువూ అహింసను నమ్ముతాడా? కొంచెం లోతుగా వెళ్లి పరిశీలిస్తే ఏ ఒక్కరూ అహింసా సిద్ధాంతాన్ని అనుసరించరనీ మనమంతా జీవుల ప్రాణాలను హరిస్తున్నామని అర్థమవుతుంది. ఏ ప్రాణినీ చంపకుండా
వుండాలన్న ఉద్దేశంతో మనం అహింసా సిద్ధాంతాన్ని పాటించాలని చెబుతుంటాం. మామూలుగా చెప్పాలంటే అనేకమంది హిందువులు మాంసాన్ని స్వీకరిస్తారు కాబట్టి వాళ్లు అహింసావాదులు కారు.
ఈ నేపథ్యంలో హిందువులు అహింసను నమ్ముతారనీ, ముస్లింలు హింసను పాటిస్తారనీ తత్ఫలితంగా వాళ్లు సామరస్యంగా కలసి మెలసి వుండలేరనీ అంటూ ఒక తీర్మానానికి రావడం పొరపాటవుతుంది.ఇలాంటి భేదభావాలను కొందరు స్వార్థపరులైన నకిలీ మతపెద్దలు మన మనసుల్లోకి చొప్పించారు. ఆంగ్లేయులు వాటిని మరింత సానబెట్టారు. వాళ్లకి చరిత్రను నమోదుచేసే అలవాటుంది. ప్రజలందరి పద్ధతులనూ, సంప్రదాయాలనూ అధ్యయనం చేస్తుంటామని వాళ్లు బుకాయిస్తుంటారు. దేవుడు మనకు పరిమితమైన మానసిక శక్తిని ఇచ్చాడు. కానీ వాళ్లు దేవుడి స్థానాన్ని తీసుకుని సరికొత్త ప్రయోగాలు చేయాలని చూస్తుంటారు. తమ పరిశోధనల గురించి సొంత డబ్బా కొట్టుకుంటారు. వాటిని నమ్మేలా మనల్నివశీకరణం చేసుకుంటారు. అజ్ఞానం వల్ల మనం వాళ్లకు దాసోహులమైపోతుంటాం.
అపార్థాలు కూడదని భావించేవాళ్లు ఖురాన్‌ను చదవొచ్చు. అందులో హిందువులకు ఆమోదయోగ్యమైన విషయాలు అనేకం కనిపిస్తాయి. అలాగే భగవద్గీతలో ముస్లింలు ఆక్షేపణ చెప్పడానికి అవకాశంలేని అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఖురాన్‌లో నాకు అర్థం కాని, లేక నాకు ఇష్టంలేని అంశాలు వున్నాయన్న నెపంతో నేను ముస్లింల పట్ల అయిష్టతను ప్రదర్శించాలా?
నాకు ఒక ముస్లింతో కొట్లాటపెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ ముస్లిం నాతో కొట్లాడే విషయంలో అశక్తుడవుతాడు. అలాగే అతను నాతో పోట్లాడటానికి ముందుకు రానప్పుడు నేను అతనితో పోట్లాడే విషయంలో శక్తిహీనుడిని అవుతాను. ఒక్క చేతిని గాలిలో ఆడిస్తే చప్పట్లు మోగవు కదా.
ప్రతి ఒక్కరూ తమ తమ మతాల అంతస్సారాన్ని అర్థం చేసుకుంటే, నకిలీ ప్రబోధకులను మాటలను పట్టించుకోకుండా వుంటే ఈ పోట్లాటలకు అసలు అవకాశమే వుండదు. ...."
.....................................................
హింద్ స్వరాజ్ ఆంగ్ల మూలం : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
తొలి ముద్రణ : అక్టోబర్ 2018 (ఆశ్వయుజం 1940 శక సం)
ISBN NO: 978-81-7343-286-6

ప్రచురణ కర్తలు :
జాతీయ అనువాద సమితి (నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్)
మైసూరు
ముద్రణ: CIIL, Printing Press, Mysuru
114 పేజీలు , ధర : రూ. 110 /-
ప్రతులకు :
Ph. No. 0821- 2345182, 09845565614,
Email. : nandeesh77@gmail.com
publication.kar-ciil@nic.in