Sunday, January 20, 2013

" నువ్వు జై తెలంగాణా అంటే - నేను సై తెలంగాణా అంటాను" - డాక్టర్ సి. నారాయణ రెడ్డి ...

ఇవాళ (20జనవరి 2013) ఏవీ కాలేజ్, హైదరాబాద్ లో జరిగిన తెలంగాణా రచయితల వేదిక ' సాహిత్య యుద్ధభేరి '  సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ  
స్వయంగా నిలదోక్కుకోగలిగే వనరులు కలిగివున్న చిన్న రాష్ట్రాలు బాగా అభివృద్ది చెందుతాయని, ఈ దృష్ట్యానే భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనతో నిమిత్తం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం మూడు హిందీ మాట్లాడే రాష్ట్రాలను విభజించి చత్తీస్స్ ఘర్, జార్ఖండ్, ఉత్తరాంచల్ అనే మూడు కొత్త రాష్టాలను ఏర్పాటు చేసిందని అన్నారు.

 హిందీ మాట్లాడే వారికి ఏడు రాష్ట్రాలు వున్నప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వుంటే తప్పేమీ లేదని చెప్పారు.
తెలంగాణా రచయితలను ఉత్తేజ పరుస్తూ " నువ్వు  జై తెలంగాణా అంటే - నేను సై  తెలంగాణా అంటాను" అని హర్షద్వానాల మధ్య  ప్రకటించారు.

Monday, January 7, 2013

నేను చూసిన మొదటి సినిమా ...
నేను చూసిన మొదటి సినిమా

(నమస్తే తెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం ''బతుకమ్మ''లో (06-01-2013) ( Pages 22 & 23) ప్రచురించబడ్డ వ్యాసమిది. స్థలాభావం వల్ల కొంత ఎడిట్‌ అయింది. పూర్తి వర్షన్‌ ఇక్కడ పొందుపరుస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులు కందుకూరి రమేష్‌బాబు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. - ప్రభాకర్‌)

''ఎనిమిది గంటలు పని... ఎనిమిది గంటలు విశ్రాంతి... ఎనిమిది గంటలు వినోదం..!'' నూటా ముఫ్ఫై ఏళ్ల క్రిందట చికాగో శ్రామికులు పిడికిలి బిగించి చేసిన నినాదం! ప్రపంచ కార్మికులను సంఘటితపరచి, మేడే ప్రభంజనాన్ని సృష్టించిందది. అంతవరకూ కార్మికులు ఏ హక్కులూ లేకుండా రోజుకు 12 నుంచి 16 గంటలు బండచాకిరీ చేయాల్సి వచ్చేదట. చాలామంది పాక్టరీల్లోనే పడుకుంటూ వారానికి ఒక రోజు ఇంటికి వెళ్లివచ్చేవారట. ఎంత దుర్భరమైన జీవితమది. వినోదం లేని యాంత్రిక జీవితాన్ని ఇప్పుడు ఊహించుకోవాలంటేనే భయమనిపిస్తది కదా.

నేను కూడా కార్మిక కుటుంబం నుంచి వచ్చినవాణ్ని. మా నాయిన వీరయ్య వరంగల్‌ ఆజంజాహీ మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. మేం అప్పుడు మిల్‌ కాలనీలోనే వుండేవాళ్లం. ఆర్టీసీలో చేరడానికి ముందు నేను కూడా అదే మిల్లులో ఐదేళ్లు పనిచేశాను. ఇప్పుడు ఆ మీల్లూ లేదు, మిల్‌కాలనీ లేదు. తెలంగాణాలో అనేక మిల్లుల్లాగే అది కూడా అదృశ్యమైపోయింది. అయితే అదంత ఇంకో కథ.

వినోదం అంటే ఆట, పాట, మాట ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో మానవ సంబంధాలు పచ్చగ వుండేవి. మిల్‌ కాలనీలో అనేక ఆట స్థలాలుండేవి. సాయంత్రం అయితే చాలు ఆడ, మగ పిల్లల ఆటపాటలతో అవి కళకళలాడుతుండేవి. మేడే, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, శ్రీరామ నవమి వంటి పండుగలప్పుడు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. సింధోళ్ల నాటకాలు, గొల్ల సుద్దులు, బుర్రకథలు మస్తుగుండేవి. కొందరు తమ ఇళ్లల్లోనే గొల్లకతలు చెప్పించేవారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ప్రొజెక్టర్‌ సాయంతో డాక్యుమెంటరీ ఫిలింలు ప్రదర్శించేవారు. వీటికి తోడు వంటలకు (వనభోజనాలకు) పోవడం, కొత్తకొండ, కొమ్మాల, ఐలోని, సమ్మక్క సారక్క వగైరా జాతరలకు వెళ్లడం...ఇలా సినిమాలుకాక  కావలసినంత వినోదం అందుబాటులో వుండేది.

ఆనాడు కార్మికుల జీతాలు తక్కువే అయినా  కోరికలు అంతకంటే తక్కువగా వుండేవి కాబట్టి, నిజాయితీ తప్ప బడాయి లేకపోయేది కాబట్టి ఉన్నంతలో జీవితం హాయిగా అనిపించేది. సామాన్య జనానికి అత్యంత చవకగా దొరికే వినోద సాధనం సినిమా. వరంగల్‌లో అప్పట్లోనే బోలెడన్ని సినిమా థియేటర్లుండేవి. మిల్‌కాలనీ నుంచి చాలామంది గుంపులు గుంపులుగా సినిమాలకు పోయి వస్తుండేవాళ్లు. అయితే ఆటపాటలవల్లనో మరెందువ్లలనో కానీ నాకు పదేళ్ల వయసు వచ్చేవరకు పెద్దగా సినిమాలు తెలియదు.

మా నాయిన చిన్నపాటి కార్మిక నాయకుడు. అందుకె ఇంట్లో ఎక్కువ టైం గడిపేవాడుకాదు. తన ఎనిమిది గంటల వినోద సమయాన్ని పూర్తిగా యూనియన్‌ ఆఫీసుకే ధారపోసెటోడు. ఇక అమ్మ కౌసల్య బట్టలు కుట్టేది. ఇంటి చాకిరీ అంతా ఒక్కచేత్తో చేసేది. ఆఖరికి కూరగాయలు తెచ్చేపనైనా మమ్మల్ని చేయనిచ్చేది కాదు. 'మీకు బేరం చేయడం రాదు, అంతా పుచ్చులు తెస్తరు, వద్దులే' అంటూ బయటి పనులు కూడా  తనే చేసుకునేది. వీటన్నింటివల్ల ఆమెకు రోజుకు 16 గంటల పని 8 గంటల విశ్రాంతి మాత్రమే లభించేది. ఆదివారాల్లేవు, పండగ సెలవుల్లేవు. చికాగో కార్మికులు సాధించిన 8 గంటల వినోదం విషయం ఆమెకు తెలియనే తెలియదు.

ఈ నేపథ్యంలో నేను చూసిన మొదటి సినిమా ఏమిటా అని ఆలోచిస్తే 'కీలు గుర్రం' గుర్తుకొస్తోంది. ఆరోజు ఏ కళనున్నాడో మా నాయిన నన్నూ, మా అమ్మనూ ఆ సిన్మాకు తీసుకపోయిండు.  అప్పుడు మా చెల్లె కడుపుల ఉన్నది. ఆ మొదటి సినిమా నన్ను నేల మీద నిలబడనివ్వలేదు. నన్ను గాయి గాయి చేసింది. పగలు ఊహల్లో, రాత్రి కలల్లో ఎన్ని రోజులు తేలిపోయానో చెప్పలేను.

నాకు ఎవరో ఒక కీలుగుర్రాన్ని ఇచ్చినట్టు, దాని మీద కూచుని మిల్‌ కాలనీ, ఆజంజాహీ మిల్లు, ఖిలా వరంగల్‌ చుట్టూ ఆకాశ మార్గాన చక్కెర్లు కొడుతున్నట్టు తెగ ఊహించుకునేవాన్ని. ఆ కీలుగుర్రం ఎడమ చెవిని మెలెస్తే ఎడమకు తిరిగేది. కుడిచెవి మెలేస్తే కుడికి తిరిగేది. రెండు చెవుల్ని పట్టుకని ముందుకు అంటె కిందికి దిగేది. వెనక్కి లాగితే గాల్లో పైకి లేచేది. దానిపై స్వారీ చేయడం చాలా సులువుగా వుండేది. నేను ఆ కీలుగుర్రం మీద కూచుని విమానంలాగ గుంయ్‌మని శబ్ధం చేస్తూ ఆకాశంలో తిరుగుతుంటే కింద నా సోపతిగాళ్లు, కార్మికులు, జనం నోళ్లు వెళ్లబెట్టుకుని పైకి చూసేవాళ్లు. మా అమ్మయితె ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకుని వచ్చి చెయ్యి పైకెత్తి ''పైలం కొడుకా. గట్టిగ పట్టుకోరా...'' అని అరుస్తుండేది. మొదటి సినిమా పవర్‌ అట్లుండె. అందుకే అది బాగా గుర్తున్నది.

ఆ తరువాత ఎందుకో మా అమ్మా నాయినలతో కలిసి మరో సినిమా ఏదీ చూడనేలేదు. మా నాయిన ఎప్పుడైనా తన తోటి కార్మికులతో కలిసి సినిమాకు పోయేవాడు. మా అమ్మకు సినిమా చూసే టైమే దొరికేది కాదు. ఎప్పుడో ఒకసారి నా గదుమ పట్టుకుని బతిమిలాడి చెల్లెను, తమ్ముణ్ని నాకు అప్పగించి మా పక్కింటి ఈశ్వరమ్మ పెద్దమ్మతో, కనకమ్మ పెద్దమ్మతో  కలిసి వెళ్లేది. ఏమైనా వెంకటేశ్వర మహత్యం, సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ లీలలు, సంపూర్ణ రామాయణం వంటి భక్తి సినిమాలు చూసేది. నేను చిన్నప్పుడు ఏమైనా సినిమాలు చూశానంటే అది మా మేనమామ పుణ్యాన్నే. నాకు ఇద్దరు మేనమామలుండేవాళ్లు. సూరిమామ, శేఖర్‌మామ. సూరిమామతో ఎక్కువ టచ్‌ ఉండేది కాదు. శేఖర్‌మామతోనే దోస్తాన ఎక్కువ. అప్పట్ల ఆయన శంభునిపేటలో పనిచేసేవాడు. నాకంటే పదేళ్లే పెద్ద. అప్పటికింక పెళ్లి కాలేదు. ప్రతి ఆదివారం శంభునిపేట నుంచి నడచుకుంట నా కోసం మిల్‌కిలనీకి వచ్చెటోడు.

కీలుగుర్రం తర్వాత విడిగా మా అమ్మతో కలిసి మరొక్క సినిమా మాత్రమే చూశాను. ఆరోజు ఆదివారం. మా నాయిన ఇతర కార్మికులతో కలిసి బొంబాయికో ఏమొ దౌరాకు పోయిండు. మా అమ్మ ''బాలనాగమ్మ మంచిగున్నదట. పోదామార కొడకా'' అన్నది. ఇరుగుపొరుగు పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరు ఆ సినిమాను ఎప్పుడో చూసిండ్లు. తోడెవ్వరు లేక నన్నడిగింది మా అమ్మ. సినిమాకు పోదామంటె కాదంటానా. ఎగిరి గంతేసిన. మా అమ్మా, నేనూ, మా చెల్లే, యాడాది నిండని మా పెద్ద తమ్ముడూ నలుగురం కలిసి బాలనాగమ్మ మ్యాట్నీ షోకు పోయినం. అయితె థియేటర్‌ల అడుగుపెట్టిన కాణ్నుంచి మా తమ్ముడు ఒకటే ఏడుపు. వాణ్ని కొద్దిగసేపు మా అమ్మ బయటకు తీసుకపోవడం, కొద్దిగసేపు నేను ఎత్తుకుని సముదాయించడం. మూడు గంటలు ఇదేపని. సినిమా చూసినట్టే అనిపించలేదు.

ఈ రోజుల్లో సినిమా హాళ్లల్లో పిల్లల ఏడుపులు వినిపించడం లేదు. కానీ ఆరోజుల్లో పిల్లలు ఒకటే ఏడ్చేవారు. అదిరిపోయె  సౌండ్‌కు పిల్లలు బెదురుతున్నరని అనుకునెటోళ్లం. మరి ఈనాటి పిల్లలు ఎందుకు బెదుర్తలేరు. అంటే సౌండ్‌ కారాణం కాదు. ఆరోజుల్లో సినిమాహాళ్లలో జనం బాజాప్తా పొగతాగెటోళ్లు. ఆ మూడు గంటలూ హాళ్లో వందలమంది బీడీలూ, సిగరెట్లు గుప్పుగుప్పున కాలుస్తనే ఉండెటోళ్లు. హాలంతా దట్టంగా పొగ కమ్ముకునేది. సినిమా నుంచి బయటకు వచ్చాక షర్టు వాసన చూసుకుంటే పొగచూరిన కంపుతో తలతిరిగిపోయేది. ఆ పొగవాసన వల్లనే పసిపిల్లలు ఉక్కిరి బిక్కిరి అయి ఏడ్చెటోళ్లు. వినోదం సంగతి దేవుడెరుగు ఆ పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల ఆరోజుల్లో ఎంతమంది అనారోగ్యం పాలయ్యేవారో.

ఆ తరువాత ప్రభుత్వం సినిమాహాళ్లలో పోగతాగడం నిషేధించింది. సినిమా టాకీసులల్ల పోలీసుల్ని కాపలా పెట్టింది. అయినా కొందరు బీడీలను కనపడకుండా గుప్పిట్ల పట్టుకుని దొంగతనంగా తాగేవారు. అయితే ప్రొజెక్టర్‌ వెలుగులో పొగ ఎక్కడినుంచి వస్తోందో సులువుగా తెలిసిపోయేది. దాంతో వెంటనే పోలీసులో, థియేటర్‌ కాపాలాదార్లో వచ్చి వాళ్లని కాలర్‌ పట్టుకుని దొంగల్లా బయటకు ఈడ్చుకుపోయేవారు. జరిమానాలు వేసేవాళ్లు. కొట్టేవాళ్లు. ఆ అవమానాలు భరించలేక ప్రేక్షకులు క్రమంగా సినిమా హాళ్లలో పొగతాగడాన్ని పూర్తిగా మానేసిండ్లు.

తొలినాళ్ల సినిమా అనుభవాలను తలచుకున్నప్పుడు గుర్తుకొచ్చే మరో అంశం ఒక్క పైసాను మిగుల్చుకోవడం కోసం పడ్డ పాట్లు. ఆ రోజుల్లో చిట్టచివరి క్లాసు టికెట్‌ ధర ఆరణాలుండేది. అణాకు ఆరు పైసలు. ఆరణాలంటే 36 పైసలన్నమాట. అప్పటికింకా అణాల చెల్లుబాటు రద్దుకాలేదు. మరో పక్క నయాపైసలు రంగ ప్రవేశం చేసినయ్‌. అప్పుడే కొత్తగా పావలా బిళ్లలు వచ్చినయి. పావలా అంటే నాలుగణాలే కానీ పైసల లెక్కన అయితే 25 పైసలు. పావలా బిళ్లకు ఒక బేడ లేదా రెండు అణాలు కలిపి ఇస్తే 37 పైసలయ్యేది. మనకి ఒక పైసా నష్టం. అదే మూడు బేడలో, ఆరు అణాలో ఇస్తే 36 పైసలే.  మనకి ఒక పైసా లాభం. ఆరోజుల్లో పైసా అంటే మాటలు కాదు. ఇద్దరికి ఇంట్రవెల్‌ ఖర్చు వెళ్లిపోయేది. అందుకని ఆ పైసా మిగుల్చుకోడానికి నానా తంటాలు పడేవాళ్లం.

నేను ఏవీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ పక్కనే దుర్గా కళా మందిర్‌ అనే కొత్త థియేటర్‌ను కట్టారు. 'దస్‌లాఖ్‌' అనే హిందీ సినిమాతో అది ఓపెన్‌ అయింది. ఆ టాకీస్‌ తెరిచిన మర్నాడే అనూహ్యంగా భీంసింగ్‌ అనే నా క్లాస్‌మేట్‌ ఓ ఇరవై బాల్కనీ టికెట్లు తీసుకొచ్చాడు. వాళ్ల నాన్న టింబర్‌ వ్యాపారం చేసేవాడు. ఆరోజు స్కూల్‌ వదిలాక అందరం భీంసింగ్‌ ఇంట్లోనే ఫ్రెషప్‌ అయి పుస్తకాల సంచులతోనే ఫస్ట్‌ షొకు పోయినం. గోవర్థన్‌, మాధవరావు తదితర ఆత్మీయ మిత్రులతో సినిమా చూడటం ఒక గొప్ప అనుభూతి. అంతవరకు బెంచి టికెట్లు తప్ప మరొకటి తెలియని నాకు బాల్కనీలో మెత్తటి కుషన్‌ సీట్ల మీద కూచుని సినిమా చూస్తుంటే ఏదో లోకంలో విహరించినట్టనిపించింది. కీలుగుర్రం చూసినప్పటిలాగే 'దస్‌లాఖ్‌' సినిమా చూసిన తరువాత కూడా నాకు ఏదో బంపర్‌ లాటరీ తగిలినట్టు, మేం కూడా లక్షాధికార్లం అయిపోయినట్టు చాలా రోజులు ఊహల్లో తేలిపోయాను.

ఏవీ హైస్కూల్‌కు ఎదురుగుండా శ్రీనివాస్‌ టాకీస్‌ వుండేది. టెంత్‌లో మా తరగతి గది కిటికీ లోంచి ఆ టాకీస్‌ కనిపించేది. అప్పుడు అందులో ''కథానాయకుడు కథ'' అనే డబ్బిగ్‌ సినిమా ఆడుతోంది. ఒకరోజు మా తెలుగు టీచర్‌ ఆ సినిమా టైటిల్‌లో ఒక తప్పు వుంది అదేమిటో ఎవరైన చెప్పగలరా అని ప్రశ్నించాడు. నేనొక్కణ్నే చెయ్యి పైకెత్తాను. చెప్పమన్నాడు.  ''కథానాయకుడి కథ'' అని వుండాలిసార్‌ అన్నారు. అంతే ఆయన చాలా మెచ్చుకున్నారు. ఆవిధంగా నా తెలుగు భాషా ప్రావీణ్యాన్ని మొట్టమొదటిసారిగా నలుగురు గుర్తించేలా చేసింది కూడా సినిమానే. అదే టాకీస్‌లో ''కులగోత్రాలు'' అనే సినిమా ఆడుతున్నప్పుడు ఒక చిత్రమైన నినాదం వ్యాప్తిలోకి వచ్చింది. ఒక విద్యార్థి 'కులగోత్రాలు' అనగానే ఇతర విద్యార్థులు 'మలమూత్రాలు' అనేవాళ్లు. ఎవరు సృష్టించారో తెలియదు కానీ పసితనంలో ఒకటే నవ్వుకునేవాళ్లం.

వినోదం కోసం వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన సినిమాలు కూడా మస్తున్నయి. అందులో 'రక్త సంబంధం', 'మనుషులు మారాలి' ముఖ్యమైనవి. వాటిని నేను రెండేసి సార్లు చూసి ఆ రెండుసార్లూ ఏడ్చాను. మా శేఖర్‌ మామ తను కూడ ఏడుస్తూనే ''ఏ ఉత్త సినిమా కాదురా. నిజమనుకుంటున్నవా ఏంది. ఎందుకేడుస్తానవ్‌'' అంటూ నన్ను ఓదార్చేవాడు. చార్లీ చాప్లిన్‌ సినిమాలు నవ్వించి ఏడ్పించేవి. ఏడ్పించి నవ్వించేవి. 'మాడ్రన్‌ టైమ్స్‌' సినిమా చూసినప్పుడైతే థియేటర్‌లో పగలబడి నవ్వి, ఇంటికొచ్చి కొన్ని సీన్లను తలచుకుని తలచుకుని ఆ అనుభవాలన్నీ నాకే జరిగినట్టు కంటతడిపెట్టుకున్నాను.

హన్మకొండ విజయా టాకీసులో హిందీ సినిమాలు, అ లంకార్‌లో ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. దారాసింగ్‌ సినిమాలంటే చిన్నప్పుడు పిచ్చి ఇష్టంగా వుండేది. కింగ్‌కాంగ్‌ ఎప్పుడన్న దారాసింగ్‌ను కిందపడేస్తె గుండె ఆగినంత పనయ్యేది. ఆరోజుల్లో ఇంగ్లీషు సినిమాలు అర్థం కాకపోయినా గొప్పకోసం చూసేటోళ్లం. కాకపోతే 'టెన్‌ కమాండ్‌మెంట్స్‌, బెన్‌హర్‌, స్పార్టకస్‌, ఫైవ్‌మెన్‌ ఆర్మీ, మెకన్నాస్‌ గోల్డ్‌, డ్రాకులా, వన్‌ మిలియన్‌ ఇయర్స్‌ బిసి' వంటి సినిమాలు భాష రాకపోయినా చాలావరకు అర్థమయినట్టే అనిపించేవి.

మొత్తం మీద 'రోటీ, కపడా ఔర్‌ మకాన్‌' కాదు 'రోటీ, కపడా ఔర్‌ సినిమా' అన్నట్టుగా వుండేవి ఆ రోజులు. సినిమాలు/వినోదం లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం కదా !

"బతుకమ్మ" లింక్స్ :
http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?eddate=1/6/2013&edcode=36

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=36&eddate=1/6/2013&querypage=22

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=36&eddate=1/6/2013&querypage=23(prabhakarmandaara@gmail.com)


Tuesday, January 1, 2013

నూతన సంవత్సర శుభోదయ వేళ ప్రతి ఇంటి ముందూ చిత్ర కళా ప్రదర్శన !

ఇవాళ ఉదయపు నడక ఎంత ఉల్లాసంగా అనిపించిందో.......
ఇంటింటా ఇంతమంది అద్భుత చిత్రకారులున్నారా అని ఆశ్చర్య పోతూ ...
భూమాత కాన్వాస్ మీద ఒకర్ని మించి ఒకరు వేసిన చిత్రాలను వీక్షిస్తూ
ఇంటికొచ్చే సరికి మా ఇంటి ముందు
ఇదిగో ఈ పక్షుల కిల కిలారావాల సందడి కనిపించింది!
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!