Wednesday, November 21, 2012

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి !




నలభై ఏళ్ల కిందట రాసిన వ్యంగ్య కవిత ఇది.
ఇందులో కవిత్వం పాలు ఎలా వున్నా వస్తువు మాత్రం ఇప్పటికీ పాతబడలేదు.
ఇవాళ రాసినట్టే అనిపిస్తోంది.

సహచర కవి 'అగ్నిమిత్ర' సంపాదకత్వంలో వెలువడిన ''సమరం'' అన్న కవితా సంకలనంలో ఇది ముద్రించబడింది. ఆ పుస్తకం ప్రతిని నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను. చాలా విచిత్రంగా ఈ మధ్య ఒక మిత్రుడి వద్ద కనిపిస్తే జెరాక్స్‌ తీసి పెట్టుకున్నాను.
అందులో నావి నాలుగు కవితలున్నాయి.

1972లో (తేదీ గుర్తులేదు) హన్మకొండలోని ''రాజరాజనరేంద్ర గ్రంథాలయం''లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో క్రిక్కిరిసిన సాహిత్యాభిమానుల ముందు నిలబడి సభాకంపంతో ఈ కవితను చదవడం ఇప్పటికీ గుర్తుంది.

సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు ''సమరం'' పై  తన అభిప్రాయం తెలియజేస్తూ రాసిన కార్డును (చందమామ పత్రిక ఎంబ్లెం వున్న పోస్టుకార్డు) కూడా నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడే చూశాను. ఫలానా కవితలు బాగున్నాయి అంటూ ఆయన ప్రస్తావించిన నాలుగైదు కవితల్లో ఈ కవిత కూడా వుండటం థ్రిల్లింగ్‌గా అనిపించింది.

ఫేస్‌బుక్‌లో తన మనసులోని మాటను రాసిన పాపానికి ఒకరు, ఆ అభిప్రాయాన్ని ఇష్టపడినందుకు (లైక్‌ మీద మౌస్‌తో జెస్ట్‌ క్లిక్‌ చేసినందుకు) మరొకరు - ఇద్దరు ముంబాయి అమ్మాయిలు జైలుపాలవడం,  మొదటి అమ్మాయి బంధువుల డిస్పెన్సరీమీద దాడిజరగడం వంటి సంఘటనలు, తెలంగాణా సమస్య పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచకీయ, అవకాశవాద విధానాలు, అవనీతి  మొదలైన వాటి  నేపథ్యంలో ఈ కవితను చదువుతుంటే చిత్రమైన అనుభూతి కలుగుతోంది.

నిజంగానే మన ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది!



ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి !

ప్రజాస్వామ్యం వర్థిల్లాలి
లక్షాధికారుల్ని కోటీశ్వరులుగా పెంచి
బీదవాళ్లను బిచ్చగాళ్లగా మార్చే
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

తినడానికి తిండిలేక
కట్టడానికి బట్టలేక
కోట్లాది ప్రజలు ఆకలితో అ లమటిస్తున్నా
వీధుల్లో అడుక్కుతింటున్నా
సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం అని పాడే
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

కూడులేదని, భూమిలేదని
ఉద్యోగాలివ్వమని, జీతాలు పెంచమని
మొరపెట్టుకునే నిరాయుధ 'పౌరుల్ని'
లాఠీలతో తన్ని-తుపాకులతో కాల్చి-జైళ్లలో కుక్కి
బలవంతంగా వాళ్ల నోళ్లు నొక్కే
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట
లాఠీచార్జీలు, 144 సెక్షన్లు, బాష్పవాయు ప్రయోగాలు
కర్ఫ్యూలు, కాల్పులు ఘోరాతిఘోరంగా జరుగుతున్నా
వందల సంఖ్యలో జనం నేలకొరుగుతున్నా
మా దేశం శాంతికాముక దేశం
మా దేశం అహింసావాద దేశం అని చాటుకునే
మహత్తర ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

స్వా (హా) తంత్య్రం వచ్చి పాతికేళ్లయినా
మాల, మాదిగ, ఎరుకలి, డక్కలి, లంబాడీ, కోయ,
ఫకీర్‌, బైరాగి, బైటికమ్మరి, బాలసంత వగైరా పేర్లతో
విద్యకీ, విజ్ఞానానికీ దూరంగా
స్వాతంత్య్రానికీ, సమాజానికీ దూరంగా
పాతరాతియుగం నాటికంటే హీనంగా
(కుక్కల వలె, నక్కలవలె, సందులలో పందులవలె...)
కోట్లాది భారతీయులు వెట్టిబతుకులు బతుకుతున్నా
మా రాజ్యాంగంలో సర్వమానవులూ సమానమంటూ
నీతులు కూసే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

ఊళ్లనే కొనగల పెట్టుబడిదార్లు ఒకవైపు
కడుపునిండా కూడులేని బీదవాళ్లు మరోవైపు వున్నా
సోషలిజం, సమానత్వం అంటూ ఓండ్రపెట్టే
ధనవంతుల ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

లక్షాధికార్లకు, లంచగొండులకు, గుండాలకు
దొంగలకు, లుచ్ఛాలకు, భూలోక స్వర్గంలాంటి ప్రజాస్వామ్యం
ఖద్దర్‌ నాయకుల విదేశపర్యటనలకు, విందులకు
వినోదాలకు ఉపయోగపడే ప్రజాస్వామ్యం-
బిచ్చగాళ్లతో, కరువు కాటకాలతో, రోగాలతో
ఆకలిమంటలతో, నిరుద్యోగులతో, నిరక్షరాస్యులతో
దోపిడీ దొంగతనాలతో, కల్తీవ్యాపారాలతో, వ్యభిచారాలతో
లుకలుకలుకలుక లాడుతున్న ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

ఈ ప్రజాస్వామ్య వైభవాన్ని చూచి ఓర్వలేక
సమసమాజం, కమ్యూనిజం అంటూ
'దుండగులు' చేస్తున్న 'హింసా' చర్యలు నశించాలి
'చట్టబద్ధ' ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

(రచనా కాలం: 1972)


Tuesday, November 20, 2012

2012 యుగాంతం 4012 కు వాయిదా !


2012 యుగాంతం 4012 కు వాయిదా !

కోటానుకోట్ల జనం గజ గజ వణుకుతూ ఎదురు చూస్తున్న 2012 యుగాంతం 
అనివార్య కారణాల వల్ల 4012 కు వాయిదా పడిందని తెలియజేయడానికి విచారిస్తున్నాము. 

గతం లో  "అష్టాగ్రహ కూటమి"-  "1999 డిసెంబర్ 31 ప్రళయం" నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.. 
అయితే 4012 యుగాంతం మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని కొందరు ఆస్తికులు ఢమకా బజాయించి చెప్తున్నారు.  4012 యుగాంతానికి స్వాగతం పలికేందుకు వారు ఇప్పటినుంచే సన్నాహాలను మొదలు పెట్టారు. 

నాస్తికులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ బతుకు పోరాటాల్లో తాము నిమగ్నమై వున్నట్టు మా ప్రతినిధి తెలియజేస్తున్నారు.  కాగా , యుగాంతం ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ప్రజల్లో బొత్తిగా భయభక్తులు లేకుండా పోతాయని మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
దీనిపై కొందరు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ముందు విశ్వ వాణి వార్తల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.  

(ఫేస్ బుక్ లో ఒక మిత్రుడి వ్యాఖ్య చూసి సరదాగా)