Saturday, November 23, 2013

గుండె చెరువైతున్నది
    అశోకుడు ''రహదారులకు ఇరువైపులా చెట్లను నాటించెను'' అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ కాకతీయులు ''ప్రజలకోసం తటాకములను నిర్మించిరి'' అని మాత్రం చదువుకోలేదు. ఆంధ్ర వలసపాలకులకు తెలంగాణ పట్ల చిన్నచూపు వుండటం, తెలంగాణా నాయకులకు అస్తిత్వ సోయి లేకపోవడం వల్లనే ఇప్పటివరకూ మన చరిత్రకు మన పాఠ్యపుస్తకాల్లోనే చోటు లేకుండాపోయింది. అశోకుడు నాటించిన చెట్లు ఇప్పుడు ఎక్కడైనా వున్నాయో లేవోగానీ  కాకతీయులు తవ్వించిన చెరువులు మాత్రం ఇప్పటికీ కళకళలాడుతున్నాయి, వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నాయి.

    కాకతీయులు ప్రకృతి ప్రేమికులు. చెరువులను తవ్వించడమేకాదు వాటిని పూలతో పూజించారు. బతుకమ్మ పండుగ కాకతీయుల హయాములోనే జగత్‌ప్రసిద్ధి చెందింది.

బతుకమ్మకూ చెరువులకూ మధ్య అవినాభావ సంబంధం వుంటుంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఆడపడచులు ఆటపాటలతో ఆరాధించి చివరికి చెరువులకే సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ తెల్లారి వెళ్లి చూస్తే చెరువుల మీద పూల తివాచీలు పరచినట్టు ముగ్ధమనోహర దృశ్యం కనిపిస్తుంది.
ఒకవిధంగా బతుమ్మ పండుగ చెరువుల పరిరక్షణకు కూడా ఎంతో దోహదం చేసింది.

    ఇదంతా ఒకప్పటి మాట. 1956 తరువాత చెరువులను పరిరక్షించకపోవడం అటుంచి ఇష్టారాజ్యంగా కబ్జాలు చేయడం మొదలయింది.

తెలంగాణా అంతటా వందలాది వేలాది చెరువులు భూభకాసురుల చేతుల్లో చిక్కి మటుమాయమైపోయాయి. అట్లాంటి చెరువుల్లో ''మల్లికుంట చెరువు'' కూడా ఒకటి. వరంగల్లులో ఆజం జాహీ మిల్లుకు రెండు కిలోమీటర్ల దూరంలో వుండేది. ఆ చెరువు కట్టమీద నిలబడి చూస్తే ఒక పక్క కనుచూపు మేర నీళ్లు మరో పక్క పచ్చని పొలాలు కనువిందు చేసేవి.

మేం అప్పుడు మిల్‌ కాలనీలో వుండేవాళ్లం. ఆ చెరువుతో మాది ముప్ఫై ఏళ్ల అనుబంధం. భారీ వర్షాలు పడ్డప్పుడు చెరువులోని చేపలు వరదలో ఎదురీదుతూ మా ఇంటి దాకా వచ్చేవి. పిల్లలంతా కేరింతలు కొడుతూ వాటిని పట్టుకునేందుకు నానా తంటాలు పడేవాళ్లు.

నేను ఆ చెరువులోనే బట్టలు ఉతికే బండలను పట్టుకుని నీళ్లలో కాళ్ళు ఆడిస్తూ ఈత నేర్చుకున్నాను. చెరువులో బట్టలు ఉతికే దృశ్యాన్ని కొంచెం దూరం నుంచి చూస్తున్నప్పుడు బట్ట బండను తాకడం ముందుగా కనిపించేది. దాని శబ్ధం మాత్రం కొన్ని క్షణాలు ఆలస్యంగా వినిపించేది. ఆ విచిత్రం వెనకున్న మర్మం తెలియక ఆశ్చర్యపడుతూ చూస్తుండిపోయేవాళ్లం.

చేపలు పట్టేందుకు వల విసిరే దృశ్యం కూడా అద్భుతంగా అనిపించేది. పెదనాయిన అని పిలుచుకునే మా పక్కింటి హనుమయ్య గారితో అప్పుడప్పుడు చెరువుకు వెళ్లేవాణ్ని. ఆయన వల విసిరి, తర్వాత దానిని దగ్గరకు లాగి అందులో పడ్డ చేపలను బుట్టలో వేస్తుంటే చూడటం గొప్ప అనుభూతి. ఆయన కొడుకు, నా దోస్తు కుమారస్వామి అదే చెరువులో ఈతకొడుతూ కాళ్లకు తీగెలు చుట్టుకుని మరణించడం ఒక విషాదం జ్ఞాపకం.

బతుకమ్మ పండుగనాడు మల్లికుంట చెరువు దగ్గర పెద్ద జాతర జరిగేది. మల్లికుంట చెరువు కంటే భద్రకాళి చెరువు చాలా పెద్దదైనప్పటికీ అక్కడ బతుకమ్మలు పెట్టుకుని ఆడేందుకు తగిన స్థలం లేకపోవడం వల్ల వరంగల్‌ పట్టణంలోని మహిళలంతా ఎక్కువగా మల్లికుంట చెరువుకే తరలి వచ్చేవారు.

సాయంత్రం మూడు నాలుగు ప్రాంతం నుంచే పీతాంబరాల, బతుకమ్మల ఊరేగింపు మొదలయ్యేది. అప్పటికి మా అమ్మ తీరుబడిగా ఏ సత్తు పిండి చేస్తూనో, బతుకమ్మను పేరుస్తూనో కనిపించేది. దాంతో 'ఇంకా ఎప్పుడు పోదామే' అని నేను నిమిష నిమిషానికి హడావిడి పెట్టడం, 'ఆడోళ్లకు లేని  తొందర నీ కెందుకుర' అని అమ్మ విసుక్కోవడం ఓ తీపి గుర్తు.

దూరం నుంచి చెరువు గట్టుకు వచ్చేవాళ్లు త్వరగా వచ్చి చీకటి పడకముందే వెళ్లిపోయేవారు. చెరువు చుట్టపక్కల వున్నవాళ్లు పొద్దుగుంకిన తరువాత తీరుబడిగా వెళ్లి రాత్రి తొమ్మిది పది వరకు ఆడేవాళ్లు. కానీ అక్కడ విద్యుద్దీపాలవంటి ఏర్పాట్లు ఏమీ వుండేవి కావు. బతుకమ్మల మీద వెలిగించే ఒత్తులు, తినుబండారాలూ ఆటవస్తువులూ అమ్మే వాళ్లదగ్గరి గుడ్డిదీపాలు మాత్రమే కాస్తంత వెలుతురునిచ్చేవి.

రాత్రి తిరిగి వస్తున్నప్పుడు పిల్లలు తప్పిపోయారని కొందరు, నగలు పోయాయని మరికొందరు ఆ చీకట్లో శోకాలు పెడుతూ వెళ్తుంటే ఆందోళనగా అనిపించేది. వేలాది మంది మహిళలు పాల్గొనే బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వం కనీసం తుమ్మచెట్లను కొట్టేయించి, కొన్ని వీధి దీపాలనైనా ఎందుకు ఏర్పాటు చేసేదికాదో, అంత నిర్లక్ష్యమెందుకో తలచుకుంటే బాధగా అనిపిస్తుంది.

ఇప్పుడైతే బతుకమ్మను అనాధను చేస్తూ ఆ మల్లికుంట చెరువే మాయమైపోయింది. ఇప్పుడక్కడ చెరువు ఆనవాళ్లు కూడా లేవు.

(నమస్తే తెలంగాణ 6 అక్టోబర్‌ 2013 బతుకమ్మ సౌజన్యంతో )

Friday, July 5, 2013

నూటా ఇరవై ఏళ్ళుగా పిల్లల్నీ పెద్దల్నీ అలరిస్తున్న ఎవర్ గ్రీన్ కథలు

మొగ్లీ - జంగిల్‌ బుక్‌ కథలు
రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌

Curtesy : Hyderabad Book Trust


http://hyderabadbooktrust.blogspot.in/2013/06/blog-post_19.html

    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ 'జంగిల్‌ బుక్‌' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్‌ చిత్రాలుగా, నాటకాలుగా వెలువడ్డాయి. బాయ్‌ స్కౌట్‌ వంటి ఎన్నో సంస్థలు వాటిని వినియోగించుకున్నాయి. ప్రధానంగా మొగ్లీ చుట్టూ తిరిగే తొమ్మిది కథలను ఈ తెలుగు అనువాదంలో పొందుపరచడం జరిగింది.

    కిప్లింగ్‌ కథనంలో పందొమ్మిదవ శతాబ్దపు ప్రకృతి చిత్రణ విధానం వ్యక్తమవుతుంది. మానవుల నియమాలకంటే ప్రకృతి నియమాలే ఎంతో ఉన్నతమైనవి అని చాటడం కనిపిస్తుంది. అడవిలో అజ్ఞానం, హింస కొంత ఎక్కువగా వున్నప్పటికీ మంచీ చెడు తెలిసిన, దేనినైనా ఎన్నుకునే స్వేచ్ఛ వున్న మానవ సమాజంలో వాటి పరిస్థితి మరీ దారుణం అంటారు. ఈ కథలు అడవిలో కాటగలసిపోయిన ఒక పసివాడికీ, మాట్లాడే జంతువులతో అతనికి ఏర్పడ్డ స్నేహానికీ సంబంధించిన కథలుగా పైకి అనిపిస్తాయి. కానీ ఎంతటి సమస్యలనైనా ఎలా ఎదుర్కోవాలో, స్నేహం ఎంత విలువైనదో చాటి చెప్పడమే వీటి ప్రధాన లక్ష్యం.

    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ రచనల మీద అనేక అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. ఆయన రచనల్లో అనేక వివాదాస్పద అంశాలు కూడా వున్నాయి. మొగ్లీ అడవి మీద సాధించిన పట్టు పరోక్షంగా భారతదేశం మీద తెల్లవారి పాలనను సూచిస్తుంది అంటారు విమర్శకులు. భారతదేశంలో పుట్టి పెరిగిన ఒక వలసవాద తెల్ల అబ్బాయి దృక్పథమే ఈ కథల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తమయిందనీ, ఈ కథలను ఆ కోణంలోనే చూడాల్సి వుంటుందని కొందరు  భావిస్తారు. ఇందులో కనిపించే వివిధ జంతువులు భారతదేశంలోని విభిన్న తరహా వ్యక్తులను, వారి మధ్యనున్న హెచ్చుతగ్గుల దొంతరలను సూచిస్తున్నాయంటారు. బ్రిటిష్‌ పాలకులు విభిన్న వర్గాలకు చెందిన భారతీయులతో ఎలా వ్యవహరించారో మొగ్లీ కూడా ఆయా జంతువులతో అ లాగే వ్యవహరించడం కనిపిస్తుందంటారు. జంతువులకూ మనుషులకూ మధ్య వున్న తేడా, మొగ్లీ వాడిచూపుల వర్ణనల్లో ఇది స్పష్టమవుతుందనీ, మొగ్లీ తన కంటి చూపుతోనే జంతువులను హడలగొట్టడం, అదుపులో పెట్టుకోవడం దానినే సూచిస్తుందనీ అంటారు.

    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ రాసిన 'కిమ్‌' తన అభిమాన నవల అని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు. కిప్లింగ్‌ 'బ్రిటిష్‌ సామ్రాజ్యవాద ప్రవక్త' అని జార్జి ఆర్వెల్‌ అభివర్ణించారు. అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యం అస్తమించిన తరువాత అందరూ ఆయనను ఒక అసాధారణ రచయితగా, వివాదాస్పదకోణంలో సైతం ఆ సామ్రాజ్య అనుభవాలకు భాష్యం చెప్పినవ్యక్తిగా గుర్తిస్తున్నారు. అనితరసాధ్యమైన రచనా శైలి ఆయన పేరుప్రఖ్యాతులను ఇంకా విస్తరింపజేస్తోంది.

    జంగిల్‌ బుక్‌ కేవలం పిల్లల పుస్తకమా?

    కొన్ని పరిమితులతో ఆలోచించినప్పుడు మాత్రమే ఇది పిల్లల పుస్తకం అన్న భావన కలుగుతుంది. కానీ ఇది పిల్లలూ పెద్దలూ అందరికీ వర్తించే పుస్తకమని కిప్లింగ్‌ని అభిమానించే విజ్ఞులైన అనేక మందిపాఠకులు విశ్వసిస్తారు. బాల్యంలో ఈ కథలను చదివినవాళ్లు లేదా విన్నవాళ్లు పెద్దయిన తరువాత ఈ పుస్తకాన్ని మళ్లీ ఎంతో ఆసక్తిగా తిరగేస్తూ ఆనందించడం సర్వసాధారణం.

    ఈ అద్భుతమైన కథలు పిల్లల్నీ పెద్దల్నీ ఆకట్టుకుంటాయి, అబ్బురపరుస్తాయి, ఆనందింపచేస్తాయి, ఆలోచింపజేస్తాయి. మళ్లీ మళ్లీ చదవాల్సిన కథలివి.
...
    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ (1865-1936) ఇంగ్లీష్‌ భాషనుంచి సాహిత్యంలో తొలి నోబుల్‌ బహుమతిని (1907) అందుకున్న రచయిత. అతి చిన్న వయసులో నోబుల్‌ పురస్కారాన్ని పొందినవాడిగా ఆయన రికార్డు ఇప్పటికీ అలాగే వుంది. కిప్లింగ్‌ ముంబయిలో జన్మించారు. ఆయన తండ్రి ముంబయి జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఆర్కిటెక్చరల్‌ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఐదేళ్ల వయసులో కిప్లింగ్‌ని తల్లిదండ్రులు ఇంగ్లండ్‌ పంపించారు. అయితే పదహారేళ్ల వయసులో ఆయన తిరిగి భారత దేశానికి వచ్చారు. ఏడేళ్ల పాటు ఇక్కడే పత్రికా రచయితగా పనిచేశారు. ఆ కాలంలోనే కిప్లింగ్‌ అనేక కథలు, కవితలు రాశారు. తదనంతరం కొంతకాలం అమెరికాలో వుండి బ్రిటన్‌ చేరుకుని శేష జీవితం అక్కడే గడిపారు.

    అనువాదకుడు ప్రభాకర్‌ మందార హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పాఠకులకు సుపరిచితులే. అనువాదాలతో పాటు పలు కథలు, రేడియో నాటికలు రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ప్రొ.యాగాటి చిన్నారావు పరిశోధనా గ్రంథం 'ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర' అనువాదానికి గాను 2009లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని (2009) అందుకున్నారు. అపరాజిత అనే నాటక రచనకు ఆకాశవాణి జాతీయ బహుమతిని(1987) గెలుచుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగవిరమణ చేశారు.మొగ్లీ - జంగిల్‌ బుక్‌ కథలు
రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌


స్వేచ్ఛానువాదం : ప్రభాకర్‌ మందార

166 పేజీలు, వెల : రూ. 100/-ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849

Email: hyderabadbooktrust@gmail.com

.Wednesday, July 3, 2013

కొత్తపుస్తకాలు

నమస్తే తెలంగాణా (3-7-2013) చెలిమె పేజీలో కొత్తపుస్తకాలు శీర్షిక కింద భారత రాజ్యాంగం పరిచయం:


http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=7/3/2013%2012:00:00%20AM&querypage=4

.

Wednesday, June 26, 2013

కేంద్రంతో అప్పుడూ ఇదే పంచాయితీ !


    కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో అనుసరిస్తున్న వైఖరికీ- భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
విషయంలో అనుసరించిన వైఖరికీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో మలిదశ తెలంగాణా ఉద్యమానికి బీజం వేసినట్టే - 1920 నాటి నాగపూర్‌ సమావేశంలో తన పాలనా వ్యవస్థను భాషా యూనిట్ల ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీయే ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనకు బీజం వేసింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్లాగయితే నాన్చివేత ధోరణిని కనబరుస్తోందో ఆనాడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఇదే నాన్చివేత ధోరణిని కనబరచింది. ఇప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ వేసి కాలయాపన చేసినట్టే అప్పుడు దార్‌ కమిషన్‌, జెవిపి కమిటీలను వేసి కాలయాపన చేసింది. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను 'వేర్పాటు వాదం' అనీ, తీవ్రవాదానికి అది ఊతమిస్తుందనీ, తెలంగాణా ఏర్పాటుచేస్తే దేశవ్యాప్తంగా అ లాంటి డిమాండ్లు మరెన్నో తలెత్తి దేశం ముక్క చెక్కలైపోతుందనీ కొందరు ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో - ఆనాడు స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటువల్ల 'ఉప జాతీయవాదం' పెరుగుతుందనీ, దేశ సమగ్రత, జాతీయ భావన దెబ్బతింటాయనీ హెచ్చరికలు జారీ చేసింది.

    ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు మనకు గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ రాసిన 'ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ - కార్నర్‌స్టోన్‌ ఆఫ్‌ ఎ నేషన్‌' అన్న పుస్తకంలో లభిస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ యునివర్సిటీ ప్రెస్‌ వారు ఈ పుస్తకాన్ని 1966లో ప్రచురించారు. 1972లో తొలి భారతీయ ముద్రణ వెలువడింది. విశేష పాఠకాదరణ పొందిన ఈ పరిశోధనాత్మక గ్రంధంలో గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ 'భారత రాజ్యాంగాన్ని ఎలా రాశారు, ఒక్కో అధికరణం తుదిరూపు సంతరించుకునే ముందు ఎలాంటి చర్చ జరిగింది' వంటి అంశాలను సవివరంగా విశ్లేషించారు.

ఇన్నాళ్ల తరువాత ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ వారు ''భారత రాజ్యాంగం - దేశానికి మూలస్తంభం'' అనే పేరుతో తెలుగులో వెలువరించారు.

    ఇందులోని 'భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య - రాజ్యాంగం' అన్న అధ్యాయంలో మనకు పై విశేషాలు కనిపిస్తాయి.
కాంగ్రెస్‌ పార్టీ 1920 నాటి నాగపూర్‌ సమావేశంలో తన పరిపాలనా వ్యవస్థను భాషా యూనిట్ల ప్రాతిపదికన వ్యవస్థీకరించింది. ఆనాటి నుంచీ బ్రిటిష్‌ ఏర్పాటు చేసిన ప్రావిన్సుల సరిహద్దులు  నిరంకుశంగా, అవకతవకలతో వున్నాయన్న విమర్శలు మొదలయ్యాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రావిన్సులను తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందే తప్ప ప్రజా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కాదన్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఒక్కో ప్రావిన్సులో అనేక భాషా ప్రాంతాలు కలగలసి వుండేవి. ఉదాహరణకు మద్రాస్‌ ప్రావిన్సులో ఆంధ్ర,ఒరియా, మలయాళ, కన్నడ ప్రాంతాలు కలగలసి వుండేవి. దాంతో మెజారిటీ భాష మాట్లాడే ప్రజలు మైనారిటీ భాష మాట్లాడే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం జరిగేది. అందుకే నెహ్రూ రిపోర్టు కూడా 'ఆయా ప్రాంతాల ఆకాంక్షలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, సంబంధిత ప్రాంత భాషపర ఐక్యతను దృష్టిలో పెట్టుకుని' ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరించాలని ఆనాడే సిఫారసు చేసింది. దాంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య క్రమంగా ఉధృతమయింది. స్వాతంత్య్రం రాగానే తమ అస్తిత్వ ఆకాంక్షలు నెరవేరతాయని ఆయా భాషా ప్రాంతాల ప్రజలు గాఢంగా విశ్వసించారు.

    కానీ దేశ విభజన జరగడం; కశ్మీర్‌ సమస్య, సంస్థానాల విలీనం సమస్య తెరమీదకు రావడం; హైదరాబాద్‌ రాజ్యం
స్వతంత్రంగా వుండాలని కోరుకోవడం వంటి కారణాల వల్ల రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం అభిప్రాయం మారిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాళ్లు వ్యతిరేకించారు. ప్రత్యేక పాలకవర్గం నేతలు అంటే జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, బాబూ రాజేంద్ర ప్రసాద్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌లు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన ఈ భావాలే ఇందుకు నిదర్శనం:

............''భావోద్వేగాలు చెలరేగివున్నప్పుడు రాజ్యాంగ నిర్ణయ సభ సమస్య పరిష్కారానికి ప్రయత్నించకూడదు. సమయం పరిపక్వమైనప్పుడు, సరైన సందర్భంలో ఆ పని చేయవచ్చు' అని జవహర్లాల్ నెహ్రూ అన్నారు.
............'భాషాపరమైన వేర్పాటు వాదం జాతీయ సమగ్రతనూ, ఐక్యతనూ దెబ్బతీస్తుందన్న కఠోర గుణపాఠాన్ని చరిత్ర మనకు నేర్పింది' అన్నారు వల్లభ భాయ్ పటేల్‌.
............'ప్రస్తుతం మనమంతా ఏదో ఒక ప్రాంతానికో, బృందానికో, సమాజానికో చెందినవారిగా కాకుండా భారతీయులుగా ఆలోచించాల్సిన అవసరం వుంది' అన్నారు బాబూ రాజేంద్ర ప్రసాద్‌.
............'దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండు ఇతర ప్రత్యేక ధోరణలు పెరిగిపోతున్నాయి కాబట్టి దేశ సమగ్రతను కాపాడేందుకు కొత్త రాజ్యాంగంలో కేంద్రానికి తిరుగులేని అధికారాన్ని కల్పించడమే ఏకైక మార్గం' అని మౌలానా ఆజాద్‌ పేర్కొన్నారు.

    అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనుంచీ ఉద్యమం ఇంకా ఉధృతం అయింది. దాంతో కేవలం 'ఆంధ్ర మాత్రమే కాకుండా ఇతర భాషా ప్రయుక్త ప్రాంతాలనూ వాటికి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించేందుకు' ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ముసాయిదా రాజ్యాంగ కమిటీ సిఫారసు చేసింది. చివరకు 1948 జూన్‌ 17న అలహాబాద్‌  హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఎస్‌.కె. దార్‌ ఛైర్మన్‌గా భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. బీహార్‌కు చెందిన పెద్దగా పేరులేని జె.ఎన్‌.లాల్‌ అనే కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిని, కేంబ్రిడ్జి పట్టభద్రుడైన గ్రేస్‌ ఇన్‌ లాయర్‌ని, పదవీ విరమణ చేసిన భారతీయ సీనియర్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి పన్నాలాల్‌ను కమిటీ సభ్యులుగా నియమించారు.

    శ్రీకృష్ణ కమిటీ లాగే దార్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా సమగ్ర విచారణ జరిపి 1948 డిసెంబర్‌ 10న తన నివేదికను సమర్పించింది. 'కేవలం భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయడం భారతదేశ విస్తృత ప్రయోజనాల రీత్యా మంచిది కాదనీ, ఆపని చేయవద్దనీ' కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి అనధికారిక నాయకుడైన పట్టాభి సీతారామయ్యతో సహా ఇతర నేతలెవ్వరికీ ఆ నివేదిక రుచించలేదు. పట్టాభి సీతారామయ్య అంతకు రెండు నెలల ముందే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారి ఒత్తిడి మేరకు, ఈ అంశంపై మరో సారి దృష్టి సారించేందుకు ఇంకో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దానిని జెవిపి కమిటీ అనేవారు. అందులో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, పట్టాభి సీతారామయ్య సభ్యులు. వాళ్ల పేర్లలోని మొదటి అక్షరాలతోనే ఆ కమిటీకి జెవిపి కమిటీ అనే పేరొచ్చింది.

ఆ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యను కూలంకషంగా పరిశీలించింది. చివరకు 'కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదని మేము భావిస్తున్నాం. అయితే ప్రజల భావోద్వేగాలు పట్టుసడలకుండా అ లాగే తీవ్రస్థాయిలో కొనసాగితే మాత్రం ప్రజాస్వామికవాదులుగా మనం దానికి ఒప్పుకోక తప్పదు, కానీ మొత్తం భారతదేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని పరిమితులకు లోబడి ఆపని చేయాల్సి వుంటుంది...' అని వారు అభిప్రాయపడ్డారు. ఆ నివేదికను చూసి భాషా ప్రయుక్త రాష్ట్రాల మద్దతుదార్లు తమకు సగం తలుపులు తెరచుకున్నట్టే అని భావించారు.
జెవిపి రిపోర్టును వాళ్లు బాహాటంగా స్వాగతించారు. తమ ఆశయ సాధనకోసం మరింత తీవ్రంగా ఒత్తిడిని కొనసాగించారు.

    అయినప్పటికీ చాలాకాలం ఆ సమస్య అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. 1950 జనవరిలో రాజ్యాంగాన్ని
ప్రారంభిస్తున్నప్పుడు రాజ్యాంగ నిర్ణయ సభ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పటు అనేది రాజ్యాంగ నిర్మాణం పరిధిలోని అంశం కాదని ప్రకటించి ఆ భారాన్ని వదిలించుకుంది.

కాకపోతే భారత రాజ్యాంగంలో అధికరణం-3 ద్వారా రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని ఏర్పరచింది. రెండు రాష్ట్రాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని విడదీసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం, ఏ రాష్ట్ర సరిహద్దులనైనా సవరించడం, ఏ రాష్ట్రం పేరునైనా మార్చడం వంటి విషయాల్లో రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండా, రాష్ట్రపతి సిఫారసుతో సులువుగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి పరిపూర్ణ అధికారాలను సమకూర్చింది.

మొదట్లో సంబంధిత రాష్ట్రాల 'సమ్మతి' పొందాలన్న అంశం ముసాయిదాలో వుంది. కానీ దానివల్ల ఆయా రాష్ట్రాలలోని అల్పసంఖ్యా వర్గానికి తగిన రక్షణ లభించకుండా పొతుందని గ్రహించి 'ప్రతిపాదిత మార్పులకు గురయ్యే రాష్ట్రాల ఆమోదాన్ని పొందాల్సిన అవసరం పార్లమెంటుకు లేదనీ, మామూలుగా ఆ రాష్ట్ర శాసన సభల 'అభిప్రాయం' తెలుసుకుంటే చాలునన్న' నిబంధనను చేర్చింది.

    ఈ అధికరణం ద్వారానే కేంద్రం ఆ తదనంతరం వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలను, అనేక ఇతర కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలిగింది. తనకు ఇష్టం లేకపోయినా ప్రజాభిప్రాయానికి తలొగ్గి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్టే తెలంగాణా ప్రజల న్యాయమైన ఆకాంక్షను గుర్తించి కేంద్రం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయకతప్పదు గాక తప్పదు.భారత రాజ్యాంగం - దేశానికి మూలస్తంభం
-గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌
తెలుగు అనువాదం :  ప్రభాకర్ మందార

483 పేజీలు, వెల: రూ.250


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500 006 

(ఈ ఆర్టికిల్ సంక్షిప్తంగా నమస్తే తెలంగాణా 25. 6. 2013 సంచికలో ప్రచురించ బడింది. వారికి ధన్యవాదాలతో )

.

Saturday, April 20, 2013

దాచేస్తే దాగదు చరిత్ర ......

దాచేస్తే దాగదు చరిత్ర
"1948: హైదరాబాద్ పతనం" పై సారంగ సాహిత్య పత్రిక సమీక్ష
http://www.saarangabooks.com/magazine/?p=1999


ప్రజోద్యమం ప్రజ్వరిల్లిన్నప్పుడు సహజంగానే ఉద్యమ సాహిత్యం వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంత చరిత్ర, నేపథ్యం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత పది పదిహేనేళ్లుగా సాగుతున్న మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణా అస్తిత్వ ఆకాంక్షను, సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక విశేషాలను చాటిచెప్పే పుస్తకాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలువడ్డాయి. వాటిలో ఈ ఏప్రిల్‌ 7న ఆవిష్కరించబడ్డ మహమ్మద్‌ హైదర్‌  రచన ''1948: హైదరాబాద్‌ పతనం'' ఎంతో విలక్షణమైనది.

నిజానికి ఈ పుస్తకానికీ ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికీ సంబంధం లేదు. కానీ ఆనాడు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మహమ్మద్‌ హైదర్‌ 1947-48లో జరిగిన సంఘటనల గురించి ఎప్పుడో 1952లో రాసిన పుస్తకం ఇన్నాళ్లకి వెలుగు చూడటానికి మాత్రం కచ్చితంగా ఆ ఉద్యమమే కారణమని చెప్పవచ్చు. మొదట్లో భారత ప్రభుత్వంతో తన ఉద్యోగం విషయమై జరుపుతున్న సంప్రదింపులకు విఘాతం కలుగుతుందేమోనన్న భావనతో రచయితే ఈ పుస్తక ప్రచురణను పక్కన పెట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కొంత సాహిత్యం వెలువడింది. 70వ దశకంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి వంటి హేమాహేమీలు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట అనుభవాలను వివరిస్తూ పలు పుస్తకాలు ప్రచురించారు. ఆ సందర్భంగా 1972లో మహమ్మద్‌ హైదర్‌ కూడా తన పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ 1973లో 58 ఏళ్ల వయసులోనే ఆయన హఠాన్మరణం పాలయ్యారు. చివరికి ఆయన కుమారుడు మసూద్‌ హైదర్‌ ''అక్టోబర్‌ కూ - ఎ మెమైర్‌ ఆఫ్‌ ది స్ట్రగుల్‌ ఫర్‌ హైదరాబాద్‌'' పేరిట తండ్రి పుస్తకాన్ని 2012లో వెలుగులోకి తెచ్చారు. దాని తెలుగు అనువాదమే 1948: హైదరాబాద్‌ పతనం.


ఈనాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షిస్తోంది... కాగా ఆనాడు తెలంగాణాతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర దేశంగా కొనసాగాలని ఆశించింది. ఈనాటిది మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయితే - ఆనాటిది కేవలం పాలకుల ఆశ. దానివల్లనే హైదరాబాద్‌ సంస్థానానికి పదమూడు నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్యం లభించింది.

బ్రిటిష్‌ వలస పాలకులు ''స్వాతంత్య్రం ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి'' అన్న రీతిలో వ్యవహరించడం వల్ల, కావాలని విభజన చిచ్చును రగిలించడం వల్ల ఆనాడు దేశమంతా అ ల్లకల్లోలంగా తయారయింది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం సుదీర్ఘకాలం అహింసాయుతంగా సాగింది కానీ తీరా స్వాతంత్య్రం సాకారమయ్యే వేళ దేశంలో కనీవిని ఎరుగనిరీతిలో హింస ప్రజ్వరిల్లి రక్తం ఏరులై ప్రవహించింది. బ్రిటిష్‌వాళ్లు తమ ప్రత్యక్ష పాలనలో వున్న ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి పరోక్ష పాలనలో వున్న 565 సంస్థానాలకు ఉద్దేశపూర్వకంగా స్వయం నిర్ణయాధికారాన్ని ప్రసాదించారు. పాకిస్థాన్‌లో చేరతారో, భారతదేశంలో చేరతారో, స్వతంత్రంగా వుంటారో మీ ఇష్టం అని వాళ్లని రెచ్చగొట్టారు. అన్ని సంస్థానాల్లోనూ అతి పెద్దది హైదరాబాద్‌ సంస్థానమే. సొంత సైన్యం, ప్రత్యేక కరెన్సీ వంటి అన్ని హంగులతో కూడిన సుసంపన్నమైన రాజ్యం. (ఆనాడు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు నిజాం రాజే అని ప్రతీతి).  రెండువందల ఏళ్లుగా తమ వంశస్థుల ఆధిపత్యంలో వున్న రాజ్యాన్ని వదులుకునేందుకు నైజాం నవాబు ససేమిరా అన్నాడు. కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్ష వేరుగా వుంది. రాచరిక వ్యవస్థనుంచి, కరడుగట్టిన భూస్వామ్య విధానాలనుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో హిందువులు 85 శాతమైతే ముస్లింలు 15 శాతం మాత్రమే. వారిలో కూడా అనేకమంది రాచరికాన్ని వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు.  తత్ఫలితంగా సంస్థానమంతటా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఒక పక్క ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అ లీ ఖాన్‌ భారత ప్రభుత్వంతో యధాతథ స్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ అగ్రిమెంట్‌)ను 1947 నవంబర్‌లో కుదుర్చుకుని మరో పక్క స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు కోసం ఐక్యరాజ్య సమితికి దరఖాస్తు చేసుకున్నాడు, తన పాలనను ధిక్కరిస్తున్న కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌ వాదులను దారుణంగా అణచివేసేందుకు పూనుకున్నాడు. దాంతో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై దండయాత్రకు దిగడం అనివార్యమయింది. ఆ మిలిటరీ దాడిని ఆపరేషన్‌ పోలో లేదా పోలీస్‌ యాక్షన్‌గా పేర్కొంటారు. పోలీసు యాక్షన్‌కు ముందు ఆ తరువాత పాలకవర్గం తీసుకున్న చర్యలను, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుందీ పుస్తకం.

1914లో జన్మించిన మహమ్మద్‌ హైదర్‌ 1937లో సివిల్‌ సర్వీస్‌లో చేరారు. 1942లో అప్పటి ఐజి నవాబ్‌ దీన్‌యార్‌ జంగ్‌ బహదూర్‌ కుమార్తెను వివాహం చేసుకున్నారు. కొంతకాలం నిజామామాద్‌ డిప్యూటీ కలక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1948 జనవరిలో 33 ఏళ్ల వయసులో మామగారు కాదన్నా వినకుండా సమస్యాత్మక జిల్లా అయిన ఉస్మానాబాద్‌కు కలెక్టర్‌గా వెళ్లారు. అది సరిహద్దు జిల్లా. కాంగ్రెస్‌వాదులు, స్వాతంత్య్ర సమరయోధులు, పలు హిందూ సంస్థలు సరిహద్దు వెలుపల శిబిరాలను ఏర్పాటుచేసుకుని ఉస్మానాబాద్‌ జిల్లాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. నిత్యం ఎక్కడో ఒకచోట హత్యలు, దొమ్మీలు, దోపిడీలు చోటుచేసుకుంటుంటాయి.


రజాకార్ల నాయకుడు సయ్యద్‌ ఖాసిం రజ్వీ ఆ ప్రాంతం వాడే. లాతూర్‌ పట్టణంలో అతనో చిన్నపాటి న్యాయవాదిగా వుండేవాడు. మజ్లిస్‌ పార్టీ అధినేత బహదూర్‌ యార్‌జంగ్‌ 1944లో అకాల మరణం చెందడంతో రజ్వీ  పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని, రజాకారు దళాన్ని ఏర్పాటు చేసి క్రమంగా మొత్తం నైజాంలో అత్యంత ప్రముఖ ముస్లిం నాయకుడిగా, మజ్లిస్‌ పార్టీ అధినేతగా ఎదిగాడు. విధినిర్వహణలో భాగంగా మహమ్మద్‌ హైదర్‌కు ఖాసిం రజ్వీతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పుస్తకంలో రజ్వీ ఆలోచనలు, వ్యవహార శైలి, వాగ్థాటి గురించి పలు చోట్ల సవివరంగా ప్రస్తావించారు. ఉస్మానాబాద్‌ను గాడిలో పెట్టేందుకు హైదర్‌ తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే పోలీస్‌ యాక్షన్‌ జరుగుతుంది. పోలీసు యాక్షన్‌కు దారితీసిన పరిస్థితులను కూడా హైదర్‌ ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. 1948 సెప్టెంబర్‌ 13న జనరల్‌ జి.ఎన్‌.చౌదరి నేతృత్వంలో, భారత సైనిక బలగాలు, యుద్ధటాంకులు, వైమానికదళం ఉస్మానాబాద్‌ జిల్లాలో 12 వ్యూహాత్మక ప్రాంతాలగుండా హైదరాబాద్‌ సంస్థానంలో ప్రవేశిస్తాయి. వాటిని ఎదుర్కొనే సత్తాలేని నిజాం సైనికులు, రజాకార్లు ఎక్కడికక్కడ చేతులెత్తేసి పలాయనం చిత్తగిస్తారు. కేవలం ఐదు రోజుల్లోనే నైజాం నవాబు భారత ప్రభుత్వానికి బేషరతుగా లొంగిపోతాడు.

పోలీసు యాక్షన్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంస్థానంలో భయంకరమైన రక్తపాతం జరిగిందనీ, నాలుగువేలకు పైగా కమ్యూనిస్టు తిరుగుబాటుదారులు, యాభైవేలకు పైగా ముస్లింలు హతులయ్యారనీ అంటారు. ఆనాటి దారుణాలన పరిశీలినకు నియమించబడిన పండిట్‌ సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక అధికారికంగా వెలుగుచూడకపోవడంతో ఇప్పటికీ ఇంకా ఒక మిస్టరీగానే వుండిపోయింది. అయితే మహమ్మద్‌ హైదర్‌ ఈ పుస్తకంలో ఆ వివరాల జోలికి వెళ్లకుండానే ఇలా అంటారు:

''పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే ఈ విషాద ఘటనలను కచ్చితంగా నివారించవచ్చు. భారత సైన్యం ముందంజవేయడంతో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయకేతనం ఎగరేసిన భారత సైన్యం ఛిన్నాభిన్నం చేస్తూ దూసుకువచ్చే బదులు స్థానిక పాలనా యంత్రాంగాలను పునరుద్ధరించడమో లేదా మిలిటరీ యంత్రాంగాలను నెలకొల్పడమో చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆ రెండూ చేయలేదు. ... హత్యలు, లూటీలు, గృహదహనాలు కొనసాగాయి. రజాకార్లుగా అనుమానించిన వాళ్లను, నైజాం సైన్యంతో కలిసి మెలసి వున్నవారిని దోపిడీ దొంగలు ఊచకోత కోశారు. వేలాది కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. పిల్లల్ని తల్లిదండ్రుల నుంచీ, భార్యలను భర్తల నుంచీ దూరం చేశారు. మహిళలను, బాలికలను వెంటాడి అత్యాచారాలు చేశారు. ఇలాంటి ఎన్నో సిగ్గుమాలిన దారుణాలు జరిగాయి ఆ రోజుల్లో. వాటి గురించి ఇప్పటికీ నేను రాయలేను.'' (పే.80)

హైదర్‌ ఒక సివిల్‌ అధికారి. పాలకవర్గంలో అంతర్భాగం. ఆయన విషయం పక్కనపెడితే ఇతరులు కూడా మౌనంగా వుండటం, ఆ దారుణాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. 

పోలీసు యాక్షన్‌ జరిగిన తరువాత చాలా మంది మిత్రులు మహమ్మద్‌ హైదర్‌ను హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపొమ్మని  ఒత్తిడి చేస్తారు. అనేకమంది ముస్లిం అధికారులు అప్పుడు పెద్ద ఎత్తున పాకిస్థాన్‌కు తరలిపోయారు. మరెందరో అరబ్‌ దేశాలకు, అమెరికా, బ్రిటన్‌లకు వలస వెళ్లారు. కానీ ఏ తప్పూ చేయని తను పుట్టిపెరిగిన దేశాన్ని వదలి ఎక్కడికో ఎందుకుపారిపోవాలనేని మహమ్మద్‌ హైదర్‌ ఉద్దేశం. అయితే ఆయన నమ్మకాన్ని వమ్ముచేస్తూ  భారత ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. హత్యలు, బందిపోటు దొంగతనాల వంటి ఎన్నో కేసులను ఆయనపై బనాయిస్తుంది. దిగువ కోర్టు కొన్ని కేసుల్లో ఆయనకు మరణ శిక్ష కూడా విధిస్తుంది. కాగా హైకోర్టు ఆ కేసులన్నింటినీ కొట్టివేస్తుంది. సుప్రీంకోర్టు కూడా 1954లో ఆయనపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేస్తుంది. మూడేళ్ల పాటు జైలుజీవితం అనుభవించి 1952 ఫిబ్రవరిలో ఆయన బెయిలుపై విడుదలవుతారు.  తనపై బనాయించిన అక్రమ కేసుల వివరాలను, వాటిపై జరిగిన వాదోపవాదాలను హైదర్‌ ఈ పుస్తకంలో సవివరంగా పేర్కొన్నారు. నిర్దోషిగా రుజువైనప్పటికీ భారత ప్రభుత్వం ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం ఒక విషాదం.


ఈ పుస్తకంలో తెలంగాణేతర హైదరాబాద్‌ సంస్థానం మనముందు ఒక కొత్త కోణంలో ఆవిష్కృతమవుతుంది. ఎక్కడా దేశముఖ్‌లు, దొరలు, కమ్యూనిస్టు తిరుగుబాటుదారులు అగుపించరు. హిందూ ముస్లిం మతోన్మాదం, సరిహద్దుల వెలుపలి శిబిరాల ద్వారా  కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సమరయోధుల, హిందూ మతతత్వ సంస్థల హింసాత్మక దాడులతో కూడిన, మనకు అంతగా పరిచయంలేని దృశ్యాలు దర్శనమిస్తాయి. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మతసామరస్యం ఒకింత ఎక్కువగా వుండటం, మరాఠీ, కన్నడ ప్రాంతాలలో మత ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగడం, అక్కడ కమ్యూనిస్టు చైతన్యం పెద్దగా కనిపించకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. మొత్తం రెండు వందల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా (గంగా జమున తహజీబ్‌) సాగిన నైజాం నవాబుల పాలన, వారి ప్రతిష్ట చివరి నాలుగు సంవత్సరాలలో అనుసరించిన విధానాల వల్ల మంటగలసిపోవడం గమనించవచ్చు. 

ఈ పుస్తకం ఆనాడు మొత్తం హైదరాబాద్‌ సంస్థానంలోని పరిస్థితులకు అద్దంపట్టదు. నిజానికి ఇది ఉస్మానాబాద్‌ జిల్లాను ప్రాతిపదికగా చేసుకుని ఆపరేషన్‌ పోలో పై చేసిన ఒక పరిమితమైన కేస్‌ స్టడీ వంటిది. అయినప్పటికీ నిజాం రాజు, రజాకార్లు, భారత మిలిటరీ చర్యలకు సంబంధించిన ఎన్నో వివరాలను మనముందుంచుతుంది. అనేక సంక్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది అంతం కాదు ఆరంభమనీ, ఈ పుస్తకం స్ఫూర్తితో ఆనాటి చారిత్రక వాస్తవాలను శోధించే ప్రయత్నాలు మరికొన్ని జరుగుతాయని , దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతుందని ఆశించవచ్చు..

 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వారు సకాలంలో తెలుగులో తీసుకురావడమే కాకుండా రెండువందల ఐదు పేజీలున్న ఈ పుస్తకాన్ని కేవలం వంద రూపాయలకే అందించడం విశేషం. అనంతు చేసిన తెలుగు అనువాదం సరళంగా, చదివించేలా వుంది.

సారంగ సాహిత్య వార పత్రిక (18 ఏప్రిల్ 2013 ) సౌజన్యంతో 
  

Wednesday, April 3, 2013

1948 లో హైదరాబాద్ రాజ్యం పతన మయింది. కానీ ప్రజలు ఓడిపోయారు. ప్రజాకంటకులే గెలిచారు.
1948 లో  హైదరాబాద్ రాజ్యం పతన మయింది.
కానీ ప్రజలు ఓడిపోయారు.
ప్రజాకంటకులే  గెలిచారు.
కిరీటం కోల్పోయినా నిజాం రాజు స్వతంత్ర భారత దేశం లో  రాజ ప్రముఖుడయ్యాడు
దున్నేవాళ్ళు స్వాధీనం చేసుకున్న  భూములన్నీ తిరిగి భూస్వాముల, జమిందార్ల, దోపిడీదార్ల పరమయ్యాయి

కొన్నాళ్ళు హైదరాబాద్ రాష్ట్రం కొద్ది పాటి స్వేచ్చా వాయువులనైనా ఆస్వాదించిందో లేదో ...
1956 లో మళ్ళీ వలసాంధ్ర పెత్తందార్ల  దురాక్రమణకు గురయ్యింది.
తన అస్తిత్వాన్నే కోల్పోయింది
ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడిది, తెలంగాణా ఎక్కడిది అంతా  మాదే అంటున్నారు దురాక్రమణ దార్లు
మీ నీళ్ళు మీకు ఇవ్వం,
మీ నిధులు మీకు దక్కనివ్వం
ఎం చేస్తారో చేసుకోండి అని హూంకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన అన్యాయాలను
మరోసారి పునరావలోకనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ మన ముందుకు వస్తోంది
అప్పటి ఉస్మానాబాద్ కలక్టర్ మహమ్మద్ హైదర్ రాసిన "1948: హైదరాబాద్ పతనం"

ఈ ఆదివారం (7 ఏప్రిల్ 2013) ఉదయం 10 గంటలకు
సారస్వత పరిషత్ హాల్ లో ఈ పుస్తకం పై జరిగే చర్చలో అందరూ పాల్గొనండి

వివరాలకు సంప్రదించండి :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్ నెం. 040 2352 1849
అన్వేషి ఫోన్ నెం. 040 2742 3168

Sunday, January 20, 2013

" నువ్వు జై తెలంగాణా అంటే - నేను సై తెలంగాణా అంటాను" - డాక్టర్ సి. నారాయణ రెడ్డి ...

ఇవాళ (20జనవరి 2013) ఏవీ కాలేజ్, హైదరాబాద్ లో జరిగిన తెలంగాణా రచయితల వేదిక ' సాహిత్య యుద్ధభేరి '  సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ  
స్వయంగా నిలదోక్కుకోగలిగే వనరులు కలిగివున్న చిన్న రాష్ట్రాలు బాగా అభివృద్ది చెందుతాయని, ఈ దృష్ట్యానే భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనతో నిమిత్తం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం మూడు హిందీ మాట్లాడే రాష్ట్రాలను విభజించి చత్తీస్స్ ఘర్, జార్ఖండ్, ఉత్తరాంచల్ అనే మూడు కొత్త రాష్టాలను ఏర్పాటు చేసిందని అన్నారు.

 హిందీ మాట్లాడే వారికి ఏడు రాష్ట్రాలు వున్నప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వుంటే తప్పేమీ లేదని చెప్పారు.
తెలంగాణా రచయితలను ఉత్తేజ పరుస్తూ " నువ్వు  జై తెలంగాణా అంటే - నేను సై  తెలంగాణా అంటాను" అని హర్షద్వానాల మధ్య  ప్రకటించారు.

Monday, January 7, 2013

నేను చూసిన మొదటి సినిమా ...
నేను చూసిన మొదటి సినిమా

(నమస్తే తెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం ''బతుకమ్మ''లో (06-01-2013) ( Pages 22 & 23) ప్రచురించబడ్డ వ్యాసమిది. స్థలాభావం వల్ల కొంత ఎడిట్‌ అయింది. పూర్తి వర్షన్‌ ఇక్కడ పొందుపరుస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులు కందుకూరి రమేష్‌బాబు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. - ప్రభాకర్‌)

''ఎనిమిది గంటలు పని... ఎనిమిది గంటలు విశ్రాంతి... ఎనిమిది గంటలు వినోదం..!'' నూటా ముఫ్ఫై ఏళ్ల క్రిందట చికాగో శ్రామికులు పిడికిలి బిగించి చేసిన నినాదం! ప్రపంచ కార్మికులను సంఘటితపరచి, మేడే ప్రభంజనాన్ని సృష్టించిందది. అంతవరకూ కార్మికులు ఏ హక్కులూ లేకుండా రోజుకు 12 నుంచి 16 గంటలు బండచాకిరీ చేయాల్సి వచ్చేదట. చాలామంది పాక్టరీల్లోనే పడుకుంటూ వారానికి ఒక రోజు ఇంటికి వెళ్లివచ్చేవారట. ఎంత దుర్భరమైన జీవితమది. వినోదం లేని యాంత్రిక జీవితాన్ని ఇప్పుడు ఊహించుకోవాలంటేనే భయమనిపిస్తది కదా.

నేను కూడా కార్మిక కుటుంబం నుంచి వచ్చినవాణ్ని. మా నాయిన వీరయ్య వరంగల్‌ ఆజంజాహీ మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. మేం అప్పుడు మిల్‌ కాలనీలోనే వుండేవాళ్లం. ఆర్టీసీలో చేరడానికి ముందు నేను కూడా అదే మిల్లులో ఐదేళ్లు పనిచేశాను. ఇప్పుడు ఆ మీల్లూ లేదు, మిల్‌కాలనీ లేదు. తెలంగాణాలో అనేక మిల్లుల్లాగే అది కూడా అదృశ్యమైపోయింది. అయితే అదంత ఇంకో కథ.

వినోదం అంటే ఆట, పాట, మాట ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో మానవ సంబంధాలు పచ్చగ వుండేవి. మిల్‌ కాలనీలో అనేక ఆట స్థలాలుండేవి. సాయంత్రం అయితే చాలు ఆడ, మగ పిల్లల ఆటపాటలతో అవి కళకళలాడుతుండేవి. మేడే, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, శ్రీరామ నవమి వంటి పండుగలప్పుడు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. సింధోళ్ల నాటకాలు, గొల్ల సుద్దులు, బుర్రకథలు మస్తుగుండేవి. కొందరు తమ ఇళ్లల్లోనే గొల్లకతలు చెప్పించేవారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ప్రొజెక్టర్‌ సాయంతో డాక్యుమెంటరీ ఫిలింలు ప్రదర్శించేవారు. వీటికి తోడు వంటలకు (వనభోజనాలకు) పోవడం, కొత్తకొండ, కొమ్మాల, ఐలోని, సమ్మక్క సారక్క వగైరా జాతరలకు వెళ్లడం...ఇలా సినిమాలుకాక  కావలసినంత వినోదం అందుబాటులో వుండేది.

ఆనాడు కార్మికుల జీతాలు తక్కువే అయినా  కోరికలు అంతకంటే తక్కువగా వుండేవి కాబట్టి, నిజాయితీ తప్ప బడాయి లేకపోయేది కాబట్టి ఉన్నంతలో జీవితం హాయిగా అనిపించేది. సామాన్య జనానికి అత్యంత చవకగా దొరికే వినోద సాధనం సినిమా. వరంగల్‌లో అప్పట్లోనే బోలెడన్ని సినిమా థియేటర్లుండేవి. మిల్‌కాలనీ నుంచి చాలామంది గుంపులు గుంపులుగా సినిమాలకు పోయి వస్తుండేవాళ్లు. అయితే ఆటపాటలవల్లనో మరెందువ్లలనో కానీ నాకు పదేళ్ల వయసు వచ్చేవరకు పెద్దగా సినిమాలు తెలియదు.

మా నాయిన చిన్నపాటి కార్మిక నాయకుడు. అందుకె ఇంట్లో ఎక్కువ టైం గడిపేవాడుకాదు. తన ఎనిమిది గంటల వినోద సమయాన్ని పూర్తిగా యూనియన్‌ ఆఫీసుకే ధారపోసెటోడు. ఇక అమ్మ కౌసల్య బట్టలు కుట్టేది. ఇంటి చాకిరీ అంతా ఒక్కచేత్తో చేసేది. ఆఖరికి కూరగాయలు తెచ్చేపనైనా మమ్మల్ని చేయనిచ్చేది కాదు. 'మీకు బేరం చేయడం రాదు, అంతా పుచ్చులు తెస్తరు, వద్దులే' అంటూ బయటి పనులు కూడా  తనే చేసుకునేది. వీటన్నింటివల్ల ఆమెకు రోజుకు 16 గంటల పని 8 గంటల విశ్రాంతి మాత్రమే లభించేది. ఆదివారాల్లేవు, పండగ సెలవుల్లేవు. చికాగో కార్మికులు సాధించిన 8 గంటల వినోదం విషయం ఆమెకు తెలియనే తెలియదు.

ఈ నేపథ్యంలో నేను చూసిన మొదటి సినిమా ఏమిటా అని ఆలోచిస్తే 'కీలు గుర్రం' గుర్తుకొస్తోంది. ఆరోజు ఏ కళనున్నాడో మా నాయిన నన్నూ, మా అమ్మనూ ఆ సిన్మాకు తీసుకపోయిండు.  అప్పుడు మా చెల్లె కడుపుల ఉన్నది. ఆ మొదటి సినిమా నన్ను నేల మీద నిలబడనివ్వలేదు. నన్ను గాయి గాయి చేసింది. పగలు ఊహల్లో, రాత్రి కలల్లో ఎన్ని రోజులు తేలిపోయానో చెప్పలేను.

నాకు ఎవరో ఒక కీలుగుర్రాన్ని ఇచ్చినట్టు, దాని మీద కూచుని మిల్‌ కాలనీ, ఆజంజాహీ మిల్లు, ఖిలా వరంగల్‌ చుట్టూ ఆకాశ మార్గాన చక్కెర్లు కొడుతున్నట్టు తెగ ఊహించుకునేవాన్ని. ఆ కీలుగుర్రం ఎడమ చెవిని మెలెస్తే ఎడమకు తిరిగేది. కుడిచెవి మెలేస్తే కుడికి తిరిగేది. రెండు చెవుల్ని పట్టుకని ముందుకు అంటె కిందికి దిగేది. వెనక్కి లాగితే గాల్లో పైకి లేచేది. దానిపై స్వారీ చేయడం చాలా సులువుగా వుండేది. నేను ఆ కీలుగుర్రం మీద కూచుని విమానంలాగ గుంయ్‌మని శబ్ధం చేస్తూ ఆకాశంలో తిరుగుతుంటే కింద నా సోపతిగాళ్లు, కార్మికులు, జనం నోళ్లు వెళ్లబెట్టుకుని పైకి చూసేవాళ్లు. మా అమ్మయితె ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకుని వచ్చి చెయ్యి పైకెత్తి ''పైలం కొడుకా. గట్టిగ పట్టుకోరా...'' అని అరుస్తుండేది. మొదటి సినిమా పవర్‌ అట్లుండె. అందుకే అది బాగా గుర్తున్నది.

ఆ తరువాత ఎందుకో మా అమ్మా నాయినలతో కలిసి మరో సినిమా ఏదీ చూడనేలేదు. మా నాయిన ఎప్పుడైనా తన తోటి కార్మికులతో కలిసి సినిమాకు పోయేవాడు. మా అమ్మకు సినిమా చూసే టైమే దొరికేది కాదు. ఎప్పుడో ఒకసారి నా గదుమ పట్టుకుని బతిమిలాడి చెల్లెను, తమ్ముణ్ని నాకు అప్పగించి మా పక్కింటి ఈశ్వరమ్మ పెద్దమ్మతో, కనకమ్మ పెద్దమ్మతో  కలిసి వెళ్లేది. ఏమైనా వెంకటేశ్వర మహత్యం, సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ లీలలు, సంపూర్ణ రామాయణం వంటి భక్తి సినిమాలు చూసేది. నేను చిన్నప్పుడు ఏమైనా సినిమాలు చూశానంటే అది మా మేనమామ పుణ్యాన్నే. నాకు ఇద్దరు మేనమామలుండేవాళ్లు. సూరిమామ, శేఖర్‌మామ. సూరిమామతో ఎక్కువ టచ్‌ ఉండేది కాదు. శేఖర్‌మామతోనే దోస్తాన ఎక్కువ. అప్పట్ల ఆయన శంభునిపేటలో పనిచేసేవాడు. నాకంటే పదేళ్లే పెద్ద. అప్పటికింక పెళ్లి కాలేదు. ప్రతి ఆదివారం శంభునిపేట నుంచి నడచుకుంట నా కోసం మిల్‌కిలనీకి వచ్చెటోడు.

కీలుగుర్రం తర్వాత విడిగా మా అమ్మతో కలిసి మరొక్క సినిమా మాత్రమే చూశాను. ఆరోజు ఆదివారం. మా నాయిన ఇతర కార్మికులతో కలిసి బొంబాయికో ఏమొ దౌరాకు పోయిండు. మా అమ్మ ''బాలనాగమ్మ మంచిగున్నదట. పోదామార కొడకా'' అన్నది. ఇరుగుపొరుగు పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరు ఆ సినిమాను ఎప్పుడో చూసిండ్లు. తోడెవ్వరు లేక నన్నడిగింది మా అమ్మ. సినిమాకు పోదామంటె కాదంటానా. ఎగిరి గంతేసిన. మా అమ్మా, నేనూ, మా చెల్లే, యాడాది నిండని మా పెద్ద తమ్ముడూ నలుగురం కలిసి బాలనాగమ్మ మ్యాట్నీ షోకు పోయినం. అయితె థియేటర్‌ల అడుగుపెట్టిన కాణ్నుంచి మా తమ్ముడు ఒకటే ఏడుపు. వాణ్ని కొద్దిగసేపు మా అమ్మ బయటకు తీసుకపోవడం, కొద్దిగసేపు నేను ఎత్తుకుని సముదాయించడం. మూడు గంటలు ఇదేపని. సినిమా చూసినట్టే అనిపించలేదు.

ఈ రోజుల్లో సినిమా హాళ్లల్లో పిల్లల ఏడుపులు వినిపించడం లేదు. కానీ ఆరోజుల్లో పిల్లలు ఒకటే ఏడ్చేవారు. అదిరిపోయె  సౌండ్‌కు పిల్లలు బెదురుతున్నరని అనుకునెటోళ్లం. మరి ఈనాటి పిల్లలు ఎందుకు బెదుర్తలేరు. అంటే సౌండ్‌ కారాణం కాదు. ఆరోజుల్లో సినిమాహాళ్లలో జనం బాజాప్తా పొగతాగెటోళ్లు. ఆ మూడు గంటలూ హాళ్లో వందలమంది బీడీలూ, సిగరెట్లు గుప్పుగుప్పున కాలుస్తనే ఉండెటోళ్లు. హాలంతా దట్టంగా పొగ కమ్ముకునేది. సినిమా నుంచి బయటకు వచ్చాక షర్టు వాసన చూసుకుంటే పొగచూరిన కంపుతో తలతిరిగిపోయేది. ఆ పొగవాసన వల్లనే పసిపిల్లలు ఉక్కిరి బిక్కిరి అయి ఏడ్చెటోళ్లు. వినోదం సంగతి దేవుడెరుగు ఆ పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల ఆరోజుల్లో ఎంతమంది అనారోగ్యం పాలయ్యేవారో.

ఆ తరువాత ప్రభుత్వం సినిమాహాళ్లలో పోగతాగడం నిషేధించింది. సినిమా టాకీసులల్ల పోలీసుల్ని కాపలా పెట్టింది. అయినా కొందరు బీడీలను కనపడకుండా గుప్పిట్ల పట్టుకుని దొంగతనంగా తాగేవారు. అయితే ప్రొజెక్టర్‌ వెలుగులో పొగ ఎక్కడినుంచి వస్తోందో సులువుగా తెలిసిపోయేది. దాంతో వెంటనే పోలీసులో, థియేటర్‌ కాపాలాదార్లో వచ్చి వాళ్లని కాలర్‌ పట్టుకుని దొంగల్లా బయటకు ఈడ్చుకుపోయేవారు. జరిమానాలు వేసేవాళ్లు. కొట్టేవాళ్లు. ఆ అవమానాలు భరించలేక ప్రేక్షకులు క్రమంగా సినిమా హాళ్లలో పొగతాగడాన్ని పూర్తిగా మానేసిండ్లు.

తొలినాళ్ల సినిమా అనుభవాలను తలచుకున్నప్పుడు గుర్తుకొచ్చే మరో అంశం ఒక్క పైసాను మిగుల్చుకోవడం కోసం పడ్డ పాట్లు. ఆ రోజుల్లో చిట్టచివరి క్లాసు టికెట్‌ ధర ఆరణాలుండేది. అణాకు ఆరు పైసలు. ఆరణాలంటే 36 పైసలన్నమాట. అప్పటికింకా అణాల చెల్లుబాటు రద్దుకాలేదు. మరో పక్క నయాపైసలు రంగ ప్రవేశం చేసినయ్‌. అప్పుడే కొత్తగా పావలా బిళ్లలు వచ్చినయి. పావలా అంటే నాలుగణాలే కానీ పైసల లెక్కన అయితే 25 పైసలు. పావలా బిళ్లకు ఒక బేడ లేదా రెండు అణాలు కలిపి ఇస్తే 37 పైసలయ్యేది. మనకి ఒక పైసా నష్టం. అదే మూడు బేడలో, ఆరు అణాలో ఇస్తే 36 పైసలే.  మనకి ఒక పైసా లాభం. ఆరోజుల్లో పైసా అంటే మాటలు కాదు. ఇద్దరికి ఇంట్రవెల్‌ ఖర్చు వెళ్లిపోయేది. అందుకని ఆ పైసా మిగుల్చుకోడానికి నానా తంటాలు పడేవాళ్లం.

నేను ఏవీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ పక్కనే దుర్గా కళా మందిర్‌ అనే కొత్త థియేటర్‌ను కట్టారు. 'దస్‌లాఖ్‌' అనే హిందీ సినిమాతో అది ఓపెన్‌ అయింది. ఆ టాకీస్‌ తెరిచిన మర్నాడే అనూహ్యంగా భీంసింగ్‌ అనే నా క్లాస్‌మేట్‌ ఓ ఇరవై బాల్కనీ టికెట్లు తీసుకొచ్చాడు. వాళ్ల నాన్న టింబర్‌ వ్యాపారం చేసేవాడు. ఆరోజు స్కూల్‌ వదిలాక అందరం భీంసింగ్‌ ఇంట్లోనే ఫ్రెషప్‌ అయి పుస్తకాల సంచులతోనే ఫస్ట్‌ షొకు పోయినం. గోవర్థన్‌, మాధవరావు తదితర ఆత్మీయ మిత్రులతో సినిమా చూడటం ఒక గొప్ప అనుభూతి. అంతవరకు బెంచి టికెట్లు తప్ప మరొకటి తెలియని నాకు బాల్కనీలో మెత్తటి కుషన్‌ సీట్ల మీద కూచుని సినిమా చూస్తుంటే ఏదో లోకంలో విహరించినట్టనిపించింది. కీలుగుర్రం చూసినప్పటిలాగే 'దస్‌లాఖ్‌' సినిమా చూసిన తరువాత కూడా నాకు ఏదో బంపర్‌ లాటరీ తగిలినట్టు, మేం కూడా లక్షాధికార్లం అయిపోయినట్టు చాలా రోజులు ఊహల్లో తేలిపోయాను.

ఏవీ హైస్కూల్‌కు ఎదురుగుండా శ్రీనివాస్‌ టాకీస్‌ వుండేది. టెంత్‌లో మా తరగతి గది కిటికీ లోంచి ఆ టాకీస్‌ కనిపించేది. అప్పుడు అందులో ''కథానాయకుడు కథ'' అనే డబ్బిగ్‌ సినిమా ఆడుతోంది. ఒకరోజు మా తెలుగు టీచర్‌ ఆ సినిమా టైటిల్‌లో ఒక తప్పు వుంది అదేమిటో ఎవరైన చెప్పగలరా అని ప్రశ్నించాడు. నేనొక్కణ్నే చెయ్యి పైకెత్తాను. చెప్పమన్నాడు.  ''కథానాయకుడి కథ'' అని వుండాలిసార్‌ అన్నారు. అంతే ఆయన చాలా మెచ్చుకున్నారు. ఆవిధంగా నా తెలుగు భాషా ప్రావీణ్యాన్ని మొట్టమొదటిసారిగా నలుగురు గుర్తించేలా చేసింది కూడా సినిమానే. అదే టాకీస్‌లో ''కులగోత్రాలు'' అనే సినిమా ఆడుతున్నప్పుడు ఒక చిత్రమైన నినాదం వ్యాప్తిలోకి వచ్చింది. ఒక విద్యార్థి 'కులగోత్రాలు' అనగానే ఇతర విద్యార్థులు 'మలమూత్రాలు' అనేవాళ్లు. ఎవరు సృష్టించారో తెలియదు కానీ పసితనంలో ఒకటే నవ్వుకునేవాళ్లం.

వినోదం కోసం వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన సినిమాలు కూడా మస్తున్నయి. అందులో 'రక్త సంబంధం', 'మనుషులు మారాలి' ముఖ్యమైనవి. వాటిని నేను రెండేసి సార్లు చూసి ఆ రెండుసార్లూ ఏడ్చాను. మా శేఖర్‌ మామ తను కూడ ఏడుస్తూనే ''ఏ ఉత్త సినిమా కాదురా. నిజమనుకుంటున్నవా ఏంది. ఎందుకేడుస్తానవ్‌'' అంటూ నన్ను ఓదార్చేవాడు. చార్లీ చాప్లిన్‌ సినిమాలు నవ్వించి ఏడ్పించేవి. ఏడ్పించి నవ్వించేవి. 'మాడ్రన్‌ టైమ్స్‌' సినిమా చూసినప్పుడైతే థియేటర్‌లో పగలబడి నవ్వి, ఇంటికొచ్చి కొన్ని సీన్లను తలచుకుని తలచుకుని ఆ అనుభవాలన్నీ నాకే జరిగినట్టు కంటతడిపెట్టుకున్నాను.

హన్మకొండ విజయా టాకీసులో హిందీ సినిమాలు, అ లంకార్‌లో ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. దారాసింగ్‌ సినిమాలంటే చిన్నప్పుడు పిచ్చి ఇష్టంగా వుండేది. కింగ్‌కాంగ్‌ ఎప్పుడన్న దారాసింగ్‌ను కిందపడేస్తె గుండె ఆగినంత పనయ్యేది. ఆరోజుల్లో ఇంగ్లీషు సినిమాలు అర్థం కాకపోయినా గొప్పకోసం చూసేటోళ్లం. కాకపోతే 'టెన్‌ కమాండ్‌మెంట్స్‌, బెన్‌హర్‌, స్పార్టకస్‌, ఫైవ్‌మెన్‌ ఆర్మీ, మెకన్నాస్‌ గోల్డ్‌, డ్రాకులా, వన్‌ మిలియన్‌ ఇయర్స్‌ బిసి' వంటి సినిమాలు భాష రాకపోయినా చాలావరకు అర్థమయినట్టే అనిపించేవి.

మొత్తం మీద 'రోటీ, కపడా ఔర్‌ మకాన్‌' కాదు 'రోటీ, కపడా ఔర్‌ సినిమా' అన్నట్టుగా వుండేవి ఆ రోజులు. సినిమాలు/వినోదం లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం కదా !

"బతుకమ్మ" లింక్స్ :
http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?eddate=1/6/2013&edcode=36

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=36&eddate=1/6/2013&querypage=22

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=36&eddate=1/6/2013&querypage=23(prabhakarmandaara@gmail.com)


Tuesday, January 1, 2013

నూతన సంవత్సర శుభోదయ వేళ ప్రతి ఇంటి ముందూ చిత్ర కళా ప్రదర్శన !

ఇవాళ ఉదయపు నడక ఎంత ఉల్లాసంగా అనిపించిందో.......
ఇంటింటా ఇంతమంది అద్భుత చిత్రకారులున్నారా అని ఆశ్చర్య పోతూ ...
భూమాత కాన్వాస్ మీద ఒకర్ని మించి ఒకరు వేసిన చిత్రాలను వీక్షిస్తూ
ఇంటికొచ్చే సరికి మా ఇంటి ముందు
ఇదిగో ఈ పక్షుల కిల కిలారావాల సందడి కనిపించింది!
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!