Saturday, April 20, 2013

దాచేస్తే దాగదు చరిత్ర ......

దాచేస్తే దాగదు చరిత్ర
"1948: హైదరాబాద్ పతనం" పై సారంగ సాహిత్య పత్రిక సమీక్ష
http://www.saarangabooks.com/magazine/?p=1999


ప్రజోద్యమం ప్రజ్వరిల్లిన్నప్పుడు సహజంగానే ఉద్యమ సాహిత్యం వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంత చరిత్ర, నేపథ్యం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత పది పదిహేనేళ్లుగా సాగుతున్న మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణా అస్తిత్వ ఆకాంక్షను, సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక విశేషాలను చాటిచెప్పే పుస్తకాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలువడ్డాయి. వాటిలో ఈ ఏప్రిల్‌ 7న ఆవిష్కరించబడ్డ మహమ్మద్‌ హైదర్‌  రచన ''1948: హైదరాబాద్‌ పతనం'' ఎంతో విలక్షణమైనది.

నిజానికి ఈ పుస్తకానికీ ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికీ సంబంధం లేదు. కానీ ఆనాడు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మహమ్మద్‌ హైదర్‌ 1947-48లో జరిగిన సంఘటనల గురించి ఎప్పుడో 1952లో రాసిన పుస్తకం ఇన్నాళ్లకి వెలుగు చూడటానికి మాత్రం కచ్చితంగా ఆ ఉద్యమమే కారణమని చెప్పవచ్చు. మొదట్లో భారత ప్రభుత్వంతో తన ఉద్యోగం విషయమై జరుపుతున్న సంప్రదింపులకు విఘాతం కలుగుతుందేమోనన్న భావనతో రచయితే ఈ పుస్తక ప్రచురణను పక్కన పెట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కొంత సాహిత్యం వెలువడింది. 70వ దశకంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి వంటి హేమాహేమీలు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట అనుభవాలను వివరిస్తూ పలు పుస్తకాలు ప్రచురించారు. ఆ సందర్భంగా 1972లో మహమ్మద్‌ హైదర్‌ కూడా తన పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ 1973లో 58 ఏళ్ల వయసులోనే ఆయన హఠాన్మరణం పాలయ్యారు. చివరికి ఆయన కుమారుడు మసూద్‌ హైదర్‌ ''అక్టోబర్‌ కూ - ఎ మెమైర్‌ ఆఫ్‌ ది స్ట్రగుల్‌ ఫర్‌ హైదరాబాద్‌'' పేరిట తండ్రి పుస్తకాన్ని 2012లో వెలుగులోకి తెచ్చారు. దాని తెలుగు అనువాదమే 1948: హైదరాబాద్‌ పతనం.


ఈనాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షిస్తోంది... కాగా ఆనాడు తెలంగాణాతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర దేశంగా కొనసాగాలని ఆశించింది. ఈనాటిది మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయితే - ఆనాటిది కేవలం పాలకుల ఆశ. దానివల్లనే హైదరాబాద్‌ సంస్థానానికి పదమూడు నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్యం లభించింది.

బ్రిటిష్‌ వలస పాలకులు ''స్వాతంత్య్రం ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి'' అన్న రీతిలో వ్యవహరించడం వల్ల, కావాలని విభజన చిచ్చును రగిలించడం వల్ల ఆనాడు దేశమంతా అ ల్లకల్లోలంగా తయారయింది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం సుదీర్ఘకాలం అహింసాయుతంగా సాగింది కానీ తీరా స్వాతంత్య్రం సాకారమయ్యే వేళ దేశంలో కనీవిని ఎరుగనిరీతిలో హింస ప్రజ్వరిల్లి రక్తం ఏరులై ప్రవహించింది. బ్రిటిష్‌వాళ్లు తమ ప్రత్యక్ష పాలనలో వున్న ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి పరోక్ష పాలనలో వున్న 565 సంస్థానాలకు ఉద్దేశపూర్వకంగా స్వయం నిర్ణయాధికారాన్ని ప్రసాదించారు. పాకిస్థాన్‌లో చేరతారో, భారతదేశంలో చేరతారో, స్వతంత్రంగా వుంటారో మీ ఇష్టం అని వాళ్లని రెచ్చగొట్టారు. అన్ని సంస్థానాల్లోనూ అతి పెద్దది హైదరాబాద్‌ సంస్థానమే. సొంత సైన్యం, ప్రత్యేక కరెన్సీ వంటి అన్ని హంగులతో కూడిన సుసంపన్నమైన రాజ్యం. (ఆనాడు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు నిజాం రాజే అని ప్రతీతి).  రెండువందల ఏళ్లుగా తమ వంశస్థుల ఆధిపత్యంలో వున్న రాజ్యాన్ని వదులుకునేందుకు నైజాం నవాబు ససేమిరా అన్నాడు. కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్ష వేరుగా వుంది. రాచరిక వ్యవస్థనుంచి, కరడుగట్టిన భూస్వామ్య విధానాలనుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో హిందువులు 85 శాతమైతే ముస్లింలు 15 శాతం మాత్రమే. వారిలో కూడా అనేకమంది రాచరికాన్ని వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు.  తత్ఫలితంగా సంస్థానమంతటా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఒక పక్క ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అ లీ ఖాన్‌ భారత ప్రభుత్వంతో యధాతథ స్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ అగ్రిమెంట్‌)ను 1947 నవంబర్‌లో కుదుర్చుకుని మరో పక్క స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు కోసం ఐక్యరాజ్య సమితికి దరఖాస్తు చేసుకున్నాడు, తన పాలనను ధిక్కరిస్తున్న కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌ వాదులను దారుణంగా అణచివేసేందుకు పూనుకున్నాడు. దాంతో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై దండయాత్రకు దిగడం అనివార్యమయింది. ఆ మిలిటరీ దాడిని ఆపరేషన్‌ పోలో లేదా పోలీస్‌ యాక్షన్‌గా పేర్కొంటారు. పోలీసు యాక్షన్‌కు ముందు ఆ తరువాత పాలకవర్గం తీసుకున్న చర్యలను, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుందీ పుస్తకం.

1914లో జన్మించిన మహమ్మద్‌ హైదర్‌ 1937లో సివిల్‌ సర్వీస్‌లో చేరారు. 1942లో అప్పటి ఐజి నవాబ్‌ దీన్‌యార్‌ జంగ్‌ బహదూర్‌ కుమార్తెను వివాహం చేసుకున్నారు. కొంతకాలం నిజామామాద్‌ డిప్యూటీ కలక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1948 జనవరిలో 33 ఏళ్ల వయసులో మామగారు కాదన్నా వినకుండా సమస్యాత్మక జిల్లా అయిన ఉస్మానాబాద్‌కు కలెక్టర్‌గా వెళ్లారు. అది సరిహద్దు జిల్లా. కాంగ్రెస్‌వాదులు, స్వాతంత్య్ర సమరయోధులు, పలు హిందూ సంస్థలు సరిహద్దు వెలుపల శిబిరాలను ఏర్పాటుచేసుకుని ఉస్మానాబాద్‌ జిల్లాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. నిత్యం ఎక్కడో ఒకచోట హత్యలు, దొమ్మీలు, దోపిడీలు చోటుచేసుకుంటుంటాయి.


రజాకార్ల నాయకుడు సయ్యద్‌ ఖాసిం రజ్వీ ఆ ప్రాంతం వాడే. లాతూర్‌ పట్టణంలో అతనో చిన్నపాటి న్యాయవాదిగా వుండేవాడు. మజ్లిస్‌ పార్టీ అధినేత బహదూర్‌ యార్‌జంగ్‌ 1944లో అకాల మరణం చెందడంతో రజ్వీ  పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని, రజాకారు దళాన్ని ఏర్పాటు చేసి క్రమంగా మొత్తం నైజాంలో అత్యంత ప్రముఖ ముస్లిం నాయకుడిగా, మజ్లిస్‌ పార్టీ అధినేతగా ఎదిగాడు. విధినిర్వహణలో భాగంగా మహమ్మద్‌ హైదర్‌కు ఖాసిం రజ్వీతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పుస్తకంలో రజ్వీ ఆలోచనలు, వ్యవహార శైలి, వాగ్థాటి గురించి పలు చోట్ల సవివరంగా ప్రస్తావించారు. ఉస్మానాబాద్‌ను గాడిలో పెట్టేందుకు హైదర్‌ తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే పోలీస్‌ యాక్షన్‌ జరుగుతుంది. పోలీసు యాక్షన్‌కు దారితీసిన పరిస్థితులను కూడా హైదర్‌ ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. 1948 సెప్టెంబర్‌ 13న జనరల్‌ జి.ఎన్‌.చౌదరి నేతృత్వంలో, భారత సైనిక బలగాలు, యుద్ధటాంకులు, వైమానికదళం ఉస్మానాబాద్‌ జిల్లాలో 12 వ్యూహాత్మక ప్రాంతాలగుండా హైదరాబాద్‌ సంస్థానంలో ప్రవేశిస్తాయి. వాటిని ఎదుర్కొనే సత్తాలేని నిజాం సైనికులు, రజాకార్లు ఎక్కడికక్కడ చేతులెత్తేసి పలాయనం చిత్తగిస్తారు. కేవలం ఐదు రోజుల్లోనే నైజాం నవాబు భారత ప్రభుత్వానికి బేషరతుగా లొంగిపోతాడు.

పోలీసు యాక్షన్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంస్థానంలో భయంకరమైన రక్తపాతం జరిగిందనీ, నాలుగువేలకు పైగా కమ్యూనిస్టు తిరుగుబాటుదారులు, యాభైవేలకు పైగా ముస్లింలు హతులయ్యారనీ అంటారు. ఆనాటి దారుణాలన పరిశీలినకు నియమించబడిన పండిట్‌ సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక అధికారికంగా వెలుగుచూడకపోవడంతో ఇప్పటికీ ఇంకా ఒక మిస్టరీగానే వుండిపోయింది. అయితే మహమ్మద్‌ హైదర్‌ ఈ పుస్తకంలో ఆ వివరాల జోలికి వెళ్లకుండానే ఇలా అంటారు:

''పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే ఈ విషాద ఘటనలను కచ్చితంగా నివారించవచ్చు. భారత సైన్యం ముందంజవేయడంతో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయకేతనం ఎగరేసిన భారత సైన్యం ఛిన్నాభిన్నం చేస్తూ దూసుకువచ్చే బదులు స్థానిక పాలనా యంత్రాంగాలను పునరుద్ధరించడమో లేదా మిలిటరీ యంత్రాంగాలను నెలకొల్పడమో చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆ రెండూ చేయలేదు. ... హత్యలు, లూటీలు, గృహదహనాలు కొనసాగాయి. రజాకార్లుగా అనుమానించిన వాళ్లను, నైజాం సైన్యంతో కలిసి మెలసి వున్నవారిని దోపిడీ దొంగలు ఊచకోత కోశారు. వేలాది కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. పిల్లల్ని తల్లిదండ్రుల నుంచీ, భార్యలను భర్తల నుంచీ దూరం చేశారు. మహిళలను, బాలికలను వెంటాడి అత్యాచారాలు చేశారు. ఇలాంటి ఎన్నో సిగ్గుమాలిన దారుణాలు జరిగాయి ఆ రోజుల్లో. వాటి గురించి ఇప్పటికీ నేను రాయలేను.'' (పే.80)

హైదర్‌ ఒక సివిల్‌ అధికారి. పాలకవర్గంలో అంతర్భాగం. ఆయన విషయం పక్కనపెడితే ఇతరులు కూడా మౌనంగా వుండటం, ఆ దారుణాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. 

పోలీసు యాక్షన్‌ జరిగిన తరువాత చాలా మంది మిత్రులు మహమ్మద్‌ హైదర్‌ను హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపొమ్మని  ఒత్తిడి చేస్తారు. అనేకమంది ముస్లిం అధికారులు అప్పుడు పెద్ద ఎత్తున పాకిస్థాన్‌కు తరలిపోయారు. మరెందరో అరబ్‌ దేశాలకు, అమెరికా, బ్రిటన్‌లకు వలస వెళ్లారు. కానీ ఏ తప్పూ చేయని తను పుట్టిపెరిగిన దేశాన్ని వదలి ఎక్కడికో ఎందుకుపారిపోవాలనేని మహమ్మద్‌ హైదర్‌ ఉద్దేశం. అయితే ఆయన నమ్మకాన్ని వమ్ముచేస్తూ  భారత ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. హత్యలు, బందిపోటు దొంగతనాల వంటి ఎన్నో కేసులను ఆయనపై బనాయిస్తుంది. దిగువ కోర్టు కొన్ని కేసుల్లో ఆయనకు మరణ శిక్ష కూడా విధిస్తుంది. కాగా హైకోర్టు ఆ కేసులన్నింటినీ కొట్టివేస్తుంది. సుప్రీంకోర్టు కూడా 1954లో ఆయనపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేస్తుంది. మూడేళ్ల పాటు జైలుజీవితం అనుభవించి 1952 ఫిబ్రవరిలో ఆయన బెయిలుపై విడుదలవుతారు.  తనపై బనాయించిన అక్రమ కేసుల వివరాలను, వాటిపై జరిగిన వాదోపవాదాలను హైదర్‌ ఈ పుస్తకంలో సవివరంగా పేర్కొన్నారు. నిర్దోషిగా రుజువైనప్పటికీ భారత ప్రభుత్వం ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం ఒక విషాదం.


ఈ పుస్తకంలో తెలంగాణేతర హైదరాబాద్‌ సంస్థానం మనముందు ఒక కొత్త కోణంలో ఆవిష్కృతమవుతుంది. ఎక్కడా దేశముఖ్‌లు, దొరలు, కమ్యూనిస్టు తిరుగుబాటుదారులు అగుపించరు. హిందూ ముస్లిం మతోన్మాదం, సరిహద్దుల వెలుపలి శిబిరాల ద్వారా  కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సమరయోధుల, హిందూ మతతత్వ సంస్థల హింసాత్మక దాడులతో కూడిన, మనకు అంతగా పరిచయంలేని దృశ్యాలు దర్శనమిస్తాయి. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మతసామరస్యం ఒకింత ఎక్కువగా వుండటం, మరాఠీ, కన్నడ ప్రాంతాలలో మత ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగడం, అక్కడ కమ్యూనిస్టు చైతన్యం పెద్దగా కనిపించకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. మొత్తం రెండు వందల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా (గంగా జమున తహజీబ్‌) సాగిన నైజాం నవాబుల పాలన, వారి ప్రతిష్ట చివరి నాలుగు సంవత్సరాలలో అనుసరించిన విధానాల వల్ల మంటగలసిపోవడం గమనించవచ్చు. 

ఈ పుస్తకం ఆనాడు మొత్తం హైదరాబాద్‌ సంస్థానంలోని పరిస్థితులకు అద్దంపట్టదు. నిజానికి ఇది ఉస్మానాబాద్‌ జిల్లాను ప్రాతిపదికగా చేసుకుని ఆపరేషన్‌ పోలో పై చేసిన ఒక పరిమితమైన కేస్‌ స్టడీ వంటిది. అయినప్పటికీ నిజాం రాజు, రజాకార్లు, భారత మిలిటరీ చర్యలకు సంబంధించిన ఎన్నో వివరాలను మనముందుంచుతుంది. అనేక సంక్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది అంతం కాదు ఆరంభమనీ, ఈ పుస్తకం స్ఫూర్తితో ఆనాటి చారిత్రక వాస్తవాలను శోధించే ప్రయత్నాలు మరికొన్ని జరుగుతాయని , దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతుందని ఆశించవచ్చు..

 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వారు సకాలంలో తెలుగులో తీసుకురావడమే కాకుండా రెండువందల ఐదు పేజీలున్న ఈ పుస్తకాన్ని కేవలం వంద రూపాయలకే అందించడం విశేషం. అనంతు చేసిన తెలుగు అనువాదం సరళంగా, చదివించేలా వుంది.

సారంగ సాహిత్య వార పత్రిక (18 ఏప్రిల్ 2013 ) సౌజన్యంతో 
  

Wednesday, April 3, 2013

1948 లో హైదరాబాద్ రాజ్యం పతన మయింది. కానీ ప్రజలు ఓడిపోయారు. ప్రజాకంటకులే గెలిచారు.
1948 లో  హైదరాబాద్ రాజ్యం పతన మయింది.
కానీ ప్రజలు ఓడిపోయారు.
ప్రజాకంటకులే  గెలిచారు.
కిరీటం కోల్పోయినా నిజాం రాజు స్వతంత్ర భారత దేశం లో  రాజ ప్రముఖుడయ్యాడు
దున్నేవాళ్ళు స్వాధీనం చేసుకున్న  భూములన్నీ తిరిగి భూస్వాముల, జమిందార్ల, దోపిడీదార్ల పరమయ్యాయి

కొన్నాళ్ళు హైదరాబాద్ రాష్ట్రం కొద్ది పాటి స్వేచ్చా వాయువులనైనా ఆస్వాదించిందో లేదో ...
1956 లో మళ్ళీ వలసాంధ్ర పెత్తందార్ల  దురాక్రమణకు గురయ్యింది.
తన అస్తిత్వాన్నే కోల్పోయింది
ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడిది, తెలంగాణా ఎక్కడిది అంతా  మాదే అంటున్నారు దురాక్రమణ దార్లు
మీ నీళ్ళు మీకు ఇవ్వం,
మీ నిధులు మీకు దక్కనివ్వం
ఎం చేస్తారో చేసుకోండి అని హూంకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన అన్యాయాలను
మరోసారి పునరావలోకనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ మన ముందుకు వస్తోంది
అప్పటి ఉస్మానాబాద్ కలక్టర్ మహమ్మద్ హైదర్ రాసిన "1948: హైదరాబాద్ పతనం"

ఈ ఆదివారం (7 ఏప్రిల్ 2013) ఉదయం 10 గంటలకు
సారస్వత పరిషత్ హాల్ లో ఈ పుస్తకం పై జరిగే చర్చలో అందరూ పాల్గొనండి

వివరాలకు సంప్రదించండి :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్ నెం. 040 2352 1849
అన్వేషి ఫోన్ నెం. 040 2742 3168