Wednesday, December 20, 2017

'కాల'కూట విషం




కవీ

నువ్వు బతికున్నంతకాలం
ఏలినవారికి బద్ధ శత్రువ్వి !
నీపై ఎన్ని నిర్బంధాలు, ఎన్ని ఆంక్షలు !!

నువ్వు చనిపోయాక ఇప్పుడు వారికి
ఆప్తమిత్రుడివి, ఆదర్శప్రాయుడివి !!

నీ కవిత్వాన్ని పారాయణం చేస్తారు!
పవిత్ర మైన వ్యాఖ్యానాలు చెబుతారు !
నీ పటానికి దండలేసి దండాలుపెడ్తారు!!

మనువు సైతం వచ్చి అంబేడ్కర్‌ విగహ్రానికి
పాలాభిషేకం చేసివెళ్లినట్టు !!

                                  - ప్రభాకర్‌ మందార




Tuesday, December 12, 2017

కూర్గ్‌ : ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష - గౌరి లంకేశ్‌

("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)

కూర్గ్‌.
దేశం దృష్టిలో ఇదొక అపురూపమైన ప్రాంతం.
ఇక్కడి దట్టమైన అడవులు, వరి పొలాలు, తోటలు అన్నీ పోస్ట్‌కార్డు ఫోటోల్లో ఎక్కదగ్గంత అందంగా ఉంటాయి.

కాని చుట్టూరా పర్వత శ్రేణులున్న ఈ చిన్న కర్ణాటక జిల్లా ఇకముందు ప్రశాంతంగా వుండే పరిస్థితి కనిపించడం లేదు.

కూర్గులు (లేదా కొడవలు) ఈ ప్రాంత మూలవాసులు. వారిదో విలక్షణ జాతి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వాళ్లు ఇకముందు బోడోలు, జార్ఖండ్‌ వాసులు, కశ్మీరీలు అనుసరిస్తున్న బాటలో నడుస్తారేమో అన్న భయాలను రేకెత్తిస్తున్నాయి.

వినడానికి కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చునేమో కానీ, కొత్తగా ఏర్పడిన 'కొడగు ఏకీకరణ రంగ' (కెఇఆర్‌) అనే సంస్థ ఈ మధ్య కర్ణాటక నుంచి కూర్గ్‌ (కొడగు) ప్రాంతాన్ని విభజించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. కెఇఆర్‌ కొన్ని సంస్థల కలయికతో ఏర్పడిన ఒక సమాఖ్య. ఇందులో కళా సాంస్కృతిక బృందాలు కూడా వున్నాయి. అవన్నీ ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు.

కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం కూర్గుల జీవన విధానానికి హాని కలిగిస్తుందన్న భయమే ఈ ప్రత్యేక రాష్ట్ర పిలుపునకు మూలకారణం. 1990 డిసెంబర్‌లో  'కూర్గుల ఆధీనంలో వున్న జమ్మా (jamma)  భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సంక్షేమ చర్యలలో భాగంగా పేద ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటోంది' అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు ఆ భూములను కూర్గులకు కాలవ్యవధి ప్రాతిపదికన ఇనాం భూములలాగా మంజూరు చేశారు తప్ప వారికి ఆ భూముల మీద ఎలాంటి యాజమాన్య హక్కునూ ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దాని వలన జమ్మా భూములపై ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు తమకు ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

కాని కూర్గులు ఈ వాదనతో విభేదిస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతాన్ని ఏలిన దొడ్డవీరరాజా తన సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా 18వ శతాబ్దంలోనే జమ్మా (అంటే జన్మహక్కు) భూములపై కూర్గుల హక్కును స్థిరపరిచారు. ఆ భూములపై 'సూర్యచంద్రులు వున్నంతవరకు' చెల్లుబాటయ్యేలా తమకు ఆయన ఆస్తి హక్కును ప్రసాదించారని వారంటారు.

బంగారప్ప తీసుకున్న నిర్ణయం కూర్గులపై కేవలం ఆర్థిక ప్రభావాన్ని మాత్రమే కాదు, అంతకంటే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని కొడగు ఏకీకరణ రంగ భావిస్తోంది. ముఖ్యమంత్రి కూర్గుల మనోభావాలను కూడా గాయపరిచారు. జమ్మా వ్యవస్థ కూర్గ్‌ సంస్కృతిలో అంతర్భాగం. కూర్గులను కలిపి ఉంచేది జమ్మా భూములే. దాదాపు రెండున్నర లక్షల ఎకరాల జమ్మా భూములు వ్యక్తుల పేరిట కాకుండా కుటుంబాల పేరిట ఉంటాయనేది మరిచిపోకూడదు. ఒక్కో చోట ఒక్కో కమతం మీద వంద కుటుంబాలు ఆధారపడి బతుకుతుంటాయి. అంతేకాదు జమ్మా భూముల్లోనే ఉమ్మడి కుటుంబానికి చెందిన ఇల్లు (అందరు మళ్లీ మళ్లీ కలుసుకునే చోటు), పూర్వీకుల సమాధులు (వారిని పూజించేవారికి ఇవి చాలా ముఖ్యమైనవి) వుంటాయి. ''నాకున్న ఏడెకరాల పొలం పదిమంది సభ్యులతో కూడిన నా కుటుంబం బతకడానికి బొటాబొటిగా సరిపోతుంది. అయినా బంగారప్ప నా పొలాన్ని తీసేసుకుందామని చూస్తున్నాడు. మేం ఈ పొలానికి ఎప్పట్నించో పన్నులు కూడా కడుతున్నాం'' అని చెప్పాడు బాధితుల్లో ఒకరైన హెచ్‌.కెంపన్న.

ఇప్పుడు కూర్గుల జీవితాల్లో బహుశా అన్నిటికంటే ఎక్కువ భావోద్వేగాలతో కూడిన సమస్య ఈ భూ వివాదమే. అయినా అదొక్కటే  వారి ఆగ్రహానికి కారణం కాదు. 1956లో కర్ణాటక రాష్ట్రంలో విలీనమైన నాటి నుంచీ తమ జిల్లాను అసలు పట్టించుకోవడమే లేదని లేదా నామమాత్రంగా మాత్రమే పట్టించుకున్నారని వాళ్ల భావన. కూర్గ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పిలుపు ని చ్చిన కొడగు ఏకీకరణ రంగ అధ్యక్షులు మోనప్ప ''గత అనేక సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అభ్యర్థనలను సమర్పించీ సమర్పించీ మేం అలసిపోయాం. వాటి వల్ల మాకు ఎలాంటి ప్రయోజనమూ ఒనగూడలేదు'' అన్నారు. (మోనప్ప కూర్గుల ప్రయోజనాల కోసం పాటుపడే 'అఖిల కొడవ సమాజ' అనే మరో శక్తివంతమైన సంస్థకు కూడా అధ్యక్షులు.)

తమ ప్రాంతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ తమకు కొద్దిపాటి ప్రయోజనాలను కూడా కల్పించకపోవడమనేది అనేక ఇతర అంశాలతో పాటు కూర్గులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. కాఫీ తోటలు, ఏలకుల సాగు, కమలా పళ్ల పెంపకం మొదలైన వాటి వల్ల కూర్గ్‌ నుంచి ప్రభుత్వానికి లభించే వార్షిక ఆదాయం 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువే అంటారు మోనప్ప. ఇందులో విదేశీ మారక ద్రవ్యం కూడా గణనీయంగా ఉందని చెపుతూ ''గత సంవత్సరం ప్రభుత్వం ఈ ప్రాంతానికి ముష్టి ఇచ్చినట్లు 30 కోట్ల రూపాయలను విదిల్చింది. అందులో 18 కోట్ల రూపాయలు ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకే సరిపోయింది'' అన్నారు మోనప్ప.

తమ ప్రాంతానికి నదీ జలాల్లో దక్కాల్సిన వాటా సైతం దక్కడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. ''మేం కావేరీ నదిని ఆరాధిస్తాం. కానీ అందులోని నీళ్లు మాత్రం మాకు రావు. ఇప్పటివరకు దానిమీద కట్టిన ప్రాజెక్టులన్నీ ఇతర ప్రాంతాలకే ప్రయోజనాన్ని కలిగించాయి. ఈ జిల్లాకు ఎంతో అవసరమైన ఒక చిన్న ఎత్తిపోతల పథకానికి 6 కోట్ల రూపాయలను కేటాయించాలన్న మా అభ్యర్థనని సైతం ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు'' అని కెఇఆర్‌ నాయకుడొకరు వాపోయారు.

ఈ జిల్లాకు 'బయటి వ్యక్తులు' పెద్దఎత్తున తరలి రావడం గురించి కూడా కూర్గులు చాలాకాలం నుండి ఫిర్యాదు చేస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుంచి, ముఖ్యంగా కేరళ నుంచి అనేకమంది వచ్చి కూర్గ్‌లో స్థిరపడ్డారు. అలా వచ్చిన వాళ్లు తమ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా, వాణిజ్యాన్ని, ప్రత్యేకించి కలప వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడంపై వారు కలవరపడుతున్నారు. ''ఇవాళ కూర్గ్‌లో కొడగుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది'' అని అల్లారణ్య మండ్యెప అనే ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి వ్యంగ్యంగా అన్నారు.

వీటన్నిటి వలన గత కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చినవారికీ, స్థానిక కూర్గులకూ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.  తమ ఉద్యమం ఏ సమాజానికీ, ఏ సమూహానికీ వ్యతిరేకం కాదని కొడగు ఏకీకరణ రంగ చెబుతున్నప్పటికీ 'బయటి వ్యక్తుల సమస్య' కూర్గులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందనేది స్పష్టమే. 17 మార్చి (1991) లోపల తీర్చాలంటూ ప్రభుత్వానికి కెఇఆర్‌ ఒక కోర్కెల పత్రాన్ని సమర్పించింది. (ఆ పత్రంలో ఇతర డిమాండ్లతో పాటు రెవెన్యూ భూములను క్రమబద్ధీకరించాలని, అక్రమంగా చెట్లను నరికివేయడాన్నీ, కలపను దొంగతనంగా బయటికి తరలించడాన్నీ అరికట్టాలని, కాఫీ పండించేవారిపై పన్నులు తగ్గించాలని, తోటలకు విద్యుత్‌ సరఫరా పెంచాలనే డిమాండ్లు కూడా వున్నాయి.)

ప్రభుత్వం గనక తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 17 మార్చి నుంచి శాంతియుతంగానే ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే రీతిలో ఉద్యమం చేస్తామని ప్రకటించింది. ''కూర్గులకు ఆమోదయోగ్యంకాని చట్టాలను ధిక్కరించడం మీద దృష్టిని కేంద్రీకరిస్తాం'' అని మోనప్ప అన్నారు. దీనికి ఎంతమేరకు ప్రజా మద్దతు లభిస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదు. కాని కొడగు ఏకీకరణ రంగకు మాత్రం ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణే ఉందని చెప్పాలి.  రెండు నెలల క్రితం జనవరి 17న జిల్లా కేంద్రమైన మెర్కరాలోని పాతకోట ప్రాంతంలో వారు ఒక భారీ ఊరేగింపును నిర్వహించి ప్రభుత్వానికి భూమి శిస్తు కట్టవద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. అలాగే చట్టాన్ని ధిక్కరిస్తూ కాఫీ అమ్మకాలకు కూడా ఏర్పాట్లు చేశారు. కూర్గ్‌ ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాల మీద రూపొందించిన వీధి నాటకాలను ప్రదర్శించడంతో పాటు అదే అంశంపై వీడియో క్యాసెట్లను బహిరంగంగా ప్రదర్శించారు. అమ్మారు.

కొడగు ఏకీకరణ రంగ ఇప్పటివరకు సాధించింది ఏమిటంటే ప్రజలకు తమ జిల్లా దుస్థితి గురించి బాగా అవగాహన కల్పించడం. తత్ఫలితంగా ఇవాళ ఊదా, ఆకుపచ్చ రంగులతో కూడిన ఆ సంస్థ జెండాలు అనేక కూర్గ్‌ల ఇళ్ల మీద రెపరెపలాడుతుండటాన్ని చూడొచ్చు. మార్చి 17 తరువాత కెఇఆర్‌ ఏం చేయబోతోందనేదే బహుశా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కువగా కలవరపరుస్తున్న అంశం కావచ్చు. తమ ఆశయ సాధన కోసం ఆయుధాలు పట్టే సమస్యే లేదని మోనప్ప నొక్కి చెప్పినప్పటికీ కొంతమందికి ఆయన మితవాద పోకడలు నచ్చడం లేదనే అభిప్రాయం ఉంది. ''జమ్మా భూముల మీద తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు మేం బంగారప్పకి రెండు నెలల గడువు ఇచ్చాం. స్పందన రాలేదనుకోండి మార్చి 17 తరువాత హింస చోటు చేసుకుంటే మమ్మల్ని తప్పు పట్టొద్దు'' అన్నారు వారిలో ఒకరు. చాలామంది కూర్గుల వద్ద తుపాకులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మాటల వల్ల సహజంగానే ఆందోళన కలుగుతుంది.

జిల్లా డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌. భాస్కర్‌ చెప్పినదాని ప్రకారం జమ్మా భూముల యజమానుల వద్దే దాదాపు పదివేల తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. ఒక్కొక్క లైసెన్సు కింద వారు మూడేసి తుపాకులు ఉంచుకోవచ్చు. కొడగు ఏకీకరణ రంగ అంచనా ప్రకారం కూర్గుల వద్ద ఆయుధాలు దాదాపు 1,80,000 వరకు వున్నాయి. భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటే ఆ ఆయుధాలు ఆవేశపరులైన యువకుల చేతుల్లోకి పోవచ్చనే భయం వుంది. ఇప్పటికే 'కొడగు లిబరేషన్‌ ఫ్రంట్‌' పేరుతో ఒక మిలిటెంట్‌ సంస్థ ఏర్పాటయిందన్న ధృవీకరించబడని వార్త ఒకటి ఆందోళన కలిగిస్తోంది.

అయితే కూర్గ్‌లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల గురించి కర్ణాటక రాజకీయ నాయకులు మాత్రం ఏమీ ఆందోళన చెందుతున్నట్టు లేరు. కూర్గ్‌ జిల్లాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులూ (అందరూ కాంగ్రెస్‌-ఐ పార్టీవారు) ఇప్పటిదాకా కొడగు ఏకీకరణ రంగ గురించి గాని, దాని కార్యకలాపాల గురించి గాని నోరు మెదపలేదు. ఈ జిల్లాకు సంబంధించిన శాసన మండలి సభ్యుడు ఎ.కె. సుబ్బయ్య ''ఈ గొడవ చేస్తున్న వాళ్లంతా కూర్గ్‌ రాజకీయాలతో సంబంధం లేనివాళ్లే. వాళ్లనసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు'' అన్నారు. వారి ఉద్యమం మిలిటెంట్‌ రూపం తీసుకునే అవకాశం లేదని చెబుతూ ''అలాంటి పనులు కూర్గులు చేయలేరు. ఈ వైఖరి తీసుకోవడం వల్ల ఏదో ఒరుగుతుందని కెఇఆర్‌ గనక భావిస్తున్నట్టయితే, వాళ్లు దారుణంగా పొరబడుతున్నట్టే'' అన్నారు.

కొడగు ఏకీకరణ రంగ డిమాండ్లపై బంగారప్ప ఇంతవరకు స్పందించనప్పటికీ, రాష్ట్ర మంత్రి టి. ఎన్‌. నరసింహారెడ్డి (కూర్గ్‌ ప్రాంత పరిశీలకుడు) మాత్రం తమ ప్రభుత్వం ఒత్తిళ్లకు తలవంచదని అన్నారు. ''ఆందోళనలు చేస్తామన్న బెదిరింపులకు మేం లొంగం. చట్ట వ్యతిరేక చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం'' అని కూడా అన్నారు. మొత్తం మీద ప్రభుత్వం ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదనీ, దక్షిణ భారతంలో మరో బోడోలాండ్‌ లేదా జార్ఖండ్‌ ఏర్పడుతుందని భయపెట్టే వాళ్లది తెలివితక్కువతనం అని, వాళ్లు అతిగా ఊహించుకుని భయపడుతున్నారని భావిస్తున్నట్టు అనిపిస్తోంది.
       వాళ్ల భావన నిజమే కావచ్చు కానీ, కుర్చీలో కూర్చుని కూర్గుల గొడవలు వాటంతట అవే సద్దుమణుగుతాయని అనుకోవడం కూడా తెలివైన పని కాదని రేపు రుజువు కావచ్చు.

'సండే' వారపత్రిక, 24-30 మార్చి 1991
 అనువాదం : ప్రభాకర్‌ మందార

.............................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Saturday, December 9, 2017

నిర్భీతికి ప్రతీక గౌరీ లంకేశ్


నిర్భీతికి ప్రతీక గౌరీ లంకేశ్
గౌరి లంకేశ్‌ 29 జనవరి 1962న షిమోగాలో జన్మించారు. డిగ్రీ వరకు బెంగళూరులో చదువుకున్నారు. ఆ తరువాత పి.జి. డిప్లొమా (మాస్‌ కమ్యూనికేషన్స్‌) ఐ.ఐ.ఎం.సి., దిల్లీలో (1983-84) చేశారు.
ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో బెంగళూరు, దిల్లీ (1985-90), సండే వీక్లీలో (1990-93, 1998-2000), చీఫ్‌ బ్యూరోగా ఈ టీవీ న్యూస్‌, , దిల్లీలో (1998-2000) పనిచేశారు. ఆతరువాత తండ్రి పాల్యాద లంకేశ్‌ మరణానంతరం ఆయన నిర్వహిస్తూ వచ్చిన 'లంకేశ్‌ పత్రికె' ఎడిటర్‌ బాధ్యతలను (2000-2005) చేపట్టారు.
నక్సలైట్ల విషయంలో గౌరి లంకేశ్‌ చూపిన శ్రద్ధ మూలంగా ఆమెకూ, ఆమె సోదరునికీ మధ్య విభేదాలు తలెత్తాయి. అతనే ఆ పత్రిక యజమాని కాబట్టి 2005లో లంకేశ్‌ పత్రికె నుంచి బయటికి వచ్చి ''గౌరి లంకేశ్‌ పత్రికె'' ను స్థాపించారు. 2017 సెప్టెంబర్‌ 6న హత్యకు గురై చనిపోయేనాటివరకు వ్యవస్థాపక సంపాదకురాలిగా ఆ పత్రికను అనితరసాధ్యమైన రీతిలో నిర్వహించారు.
'కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు' పుస్తకంలో గౌరిని పరిచయం చేస్తూ బెంగళూరు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకులు, రచయిత చందన్‌ గౌడ ఇలా చెప్పారు:
'విలేఖరిగా జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి కూడా అధికారం పట్ల నిర్భీతి, చక్కటి పదచాతుర్యం, ఏ పరిస్థితినైనా మానవీకరించే సహజసిద్ధ నైపుణ్యం ఆమెలో పుష్కలంగా ఉండడం గమనించవచ్చు. అవి చివరి వరకూ చెక్కుచెదరలేదు.
సత్యసాయిబాబా మీద రాసిన వ్యాసంలో ఆయన ఆధిపత్య వ్యవహార శైలి పట్ల తన అయిష్టతను ఆమె స్పష్టంగా తెలియజేసింది. వరుస హత్యలు చేసిన ఒక నేరగాణ్ని జైల్లో కలిసినప్పుడు ఫోటో కోసం మొఖానికి కట్టుకున్న ముసుగును తీసేయమని చెప్పడంలో ఆమె సాహసం కనిపిస్తుంది.
చివరికి కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరేంద్ర పాటిల్‌ను తొలగించడంపై రాసిన రాజకీయ ముఖచిత్ర కథనంలో కూడా ఆమెలోని చమత్కారం ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో పర్యటించేందుకు రాజీవ్‌ గాంధీ హెలికాప్టర్‌ కావాలని అడిగితే ముఖ్యమంత్రి కార్యాలయం వారు హెలికాప్టర్‌ మరమ్మతులో వుంది కాబట్టి దానికి బదులు కారు సరిపోతుందా అని సమాధానం చెప్పారని రాయడంలో ఆమెలోని హాస్యచతురత వ్యక్తమవుతుంది. ఆమె ఇంగ్లీషు రిపోర్టింగ్‌లో కనిపించే వివరణాత్మకత, భాషా నైపుణ్యం నిరుపమానమైనవి.
ఇంగ్లీషు జర్నలిస్టుగా పదిహేనేళ్లపాటు (1985-2000) పనిచేసిన గౌరి ఈ పుస్తకం మొదట్లోనే పేర్కొన్నట్టు తన తండ్రి 2000 సంవత్సరం తొలినాళ్లలో చనిపోయిన తరువాతే ఆయన నడిపిన 'లంకేశ్‌ పత్రికె'కు సంపాదకత్వ బాధ్యతలను చేపట్టింది. అప్పటివరకూ ఆమె ఎప్పుడూ కన్నడలో రాయలేదు. కానీ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలన్న తపనతో కన్నడలో పత్రికా రచనలను మొదలుపెట్టింది. తర్వాతి పదిహేడేళ్లలో ఆమె కన్నడ భాషా ప్రావీణ్యం ఎంతో మెరుగైనప్పటికీ ఇంగ్లీషు భాషపై ఉన్నంత పట్టును, సౌలభ్యాన్ని మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి.
ఇంగ్లీషు చదువులు చదివిన అనేకమంది భారతీయుల మాదిరిగానే తను చిన్నప్పుడే మాతృభాషకు ఎలా దూరమయిందీ, తిరిగి దానిపై పట్టుకోసం ఎంత సంఘర్షణ పడిందీ ఒక రచనలో ఆమె హృదయాన్ని కదిలించేలా రాసింది. ... ...
ప్రభుత్వ బాధ్యతారహిత చర్యలనూ, రాజకీయ నాయకుల తప్పులనూ, వ్యాపారవేత్తల అవకతవకలనూ ఎక్కడికక్కడ ఎండగట్టేది. మొదట్లో సాహిత్యానికి కూడా పత్రికలో తగిన చోటును కల్పించేందుకు కృషి చేసింది. రచనల కొరత ఏర్పడినప్పుడు తనే స్వయంగా చిన్న కథలను అనువదించి ఆ కొరత లేకుండా చూసేది.
ఒక పక్క 'లంకేశ్‌ పత్రిక'ను వారం వారం వెలువరిస్తూనే మరోపక్క సొంతంగా అనేక రచనలు చేసింది. బెనజిర్‌ భుట్టో సంక్షిప్త జీవిత చరిత్రను రచించింది. ఇద్రీస్‌ షా 'టేల్‌ ఆఫ్‌ ది డర్వేషెస్‌'ను అనువదించింది. అలాగే ఫ్రాంకోయిస్‌ శాగన్‌, కుష్వంత్‌ సింగ్‌, ఇస్మత్‌ చుగ్తాయ్‌, గై డి మపాసా, ఓ.హెన్రీ, కేట్‌ చాపిన్‌ మొదలైన వారి కథలను అనువదించి 'కప్పు మల్లిగె' (బ్లాక్‌ జాస్మిన్‌-నల్ల మల్లెలు) పేరుతో ఒక సంకలనాన్ని వెలువరించింది. 1997లో కొంత కాలం అమెరికాలో వున్నప్పుడు పూర్ణచంద్ర తేజస్వి నవల 'జుగారి క్రాస్‌' ను ఇంగ్లీషులోకి అనువాదం చేసింది. (ఆ రాత ప్రతి ఎక్కడుందో ఇప్పుడు వెతకాలి.)
లంకేశ్‌ పత్రిక సంపాదకురాలిగా గౌరి బాధ్యతలు నిర్వహిస్తున్న కాలమూ, కర్ణాటకలో హిందుత్వ శక్తులు సంఘటితమవుతున్న కాలమూ ఒకటే. హిందువులు, ముస్లింలు కూడా ఆరాధించే సూఫీ సాధువు బాబాబుడన్‌కు, హిందూ దేవుడు దత్తాత్రేయకు నెలవైన బాబా బుడన్‌గిరి ఆరాధనా స్థలాన్ని హిందూ మితవాద శక్తుల ఆక్రమణ నుంచి కాపాడేందుకు 2003లో గౌరి చేసిన సమరశీల రచనలు ఆమెను ఒక్కసారిగా సంక్లిష్టమైన రాజకీయ ప్రపంచంలో ఒక నూతన క్రియాశీల కార్యకర్తగా నిలబెట్టాయి.
తదనంతర కాలంలో కర్ణాటకలో హిందుత్వ శక్తుల హింసాకాండ పెరగడంతో ఆమెకు ఇక అదే ప్రధాన పోరాట రంగంగా మారింది. హిందుత్వ శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా 'కర్ణాటక మత సామరస్య వేదికల కార్యక్రమాల్లో గౌరి చాలా చురుకుగా పాలుపంచుకుంది. డజన్లకొద్దీ ప్రతిఘటనా సమావేశాలను నిర్వహించింది. ఆమె చిట్టచివరి సంపాదకీయం కూడా దేశానికి ఆందోళనకరంగా తయారవుతున్న 'తప్పుడు వార్తల' (టaసవ అవషర) విధానం గురించే. ... ...
తండ్రి లాగే గౌరికి కూడా లౌకికవాద ఆదర్శాలంటే ఎనలేని అభిమానం. అలాగే స్త్రీ పురుష సమానత్వం, కులాల సమానత్వం, మతాల శాంతియుత సహజీవనం, రైతుల, ఆదివాసుల సంక్షేమం వంటి అంశాల పట్ల కూడా. అందుకే వాటికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది.
సోషలిస్టు మేధావి రామ్‌ మనోహర్‌ లోహియా అభిమాని కావడం వల్ల లంకేశ్‌ తన పత్రికలో కమ్యూనిస్టు, వామపక్ష అతివాద రాజకీయాలకు స్థానం కల్పించేవాడు కాదు. కానీ గౌరి మాత్రం 2004, 2005 - రెండు సంవత్సరాల కాలంలో అంటే కర్ణాటకలో నక్సలైట్ల ఉనికి అంతంత మాత్రంగా వున్న కాలంలోనే నక్సలైట్‌ రాజకీయాల పట్ల పాఠకుల అవగాహనను పెంచేందుకు కృషి చేసింది. అయితే నక్సలైట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపును మాత్రం ఆమె ఎన్నడూ సమర్థించలేదు. ఎందుకంటే ఎన్నికలనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మల వంటివని ఆమె భావించేది.
ఆమె దృష్టిలో అహింసా విధానం తిరుగులేనిది. అందుకే 2016 డిసెంబర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు లొంగిపోవడానికి గౌరి మధ్యవర్తిగా వ్యవహరించింది. మొదటి నుంచి ఆమె నక్సలైట్లను ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఎంతో నిజాయితీగా ప్రయత్నించింది.
అందుకు ఆమె రచనలే సాక్ష్యం.
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి, కె.సజయ, ప్రభాకర్ మందార, పి.సత్యవతి, కాత్యాయని, ఉణుదుర్తి సుధాకర్‌, కె. సురేష్‌, కె.ఆదిత్య, సుధాకిరణ్‌, కల్యాణి ఎస్‌.జె., బి. కృష్ణకుమారి, కీర్తి చెరుకూరి, కె. సుధ, మృణాళిని, రాహుల్‌ మాగంటి, కె. అనురాధ, శ్యామసుందరి, జి. లక్ష్మీ నరసయ్య, ఎన్‌. శ్రీనివాసరావు, వినోదిని, ఎం.విమల, ఎ. సునీత, కొండవీటి సత్యవతి, బి. విజయభారతి, రమాసుందరి బత్తుల, ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ), ఎన్‌. వేణుగోపాల్‌, శోభాదేవి, కె. లలిత, ఆలూరి విజయలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి
230 పేజీలు , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com