Wednesday, June 26, 2013

కేంద్రంతో అప్పుడూ ఇదే పంచాయితీ !


    కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో అనుసరిస్తున్న వైఖరికీ- భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు
విషయంలో అనుసరించిన వైఖరికీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో మలిదశ తెలంగాణా ఉద్యమానికి బీజం వేసినట్టే - 1920 నాటి నాగపూర్‌ సమావేశంలో తన పాలనా వ్యవస్థను భాషా యూనిట్ల ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీయే ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనకు బీజం వేసింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్లాగయితే నాన్చివేత ధోరణిని కనబరుస్తోందో ఆనాడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఇదే నాన్చివేత ధోరణిని కనబరచింది. ఇప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ వేసి కాలయాపన చేసినట్టే అప్పుడు దార్‌ కమిషన్‌, జెవిపి కమిటీలను వేసి కాలయాపన చేసింది. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను 'వేర్పాటు వాదం' అనీ, తీవ్రవాదానికి అది ఊతమిస్తుందనీ, తెలంగాణా ఏర్పాటుచేస్తే దేశవ్యాప్తంగా అ లాంటి డిమాండ్లు మరెన్నో తలెత్తి దేశం ముక్క చెక్కలైపోతుందనీ కొందరు ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో - ఆనాడు స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటువల్ల 'ఉప జాతీయవాదం' పెరుగుతుందనీ, దేశ సమగ్రత, జాతీయ భావన దెబ్బతింటాయనీ హెచ్చరికలు జారీ చేసింది.

    ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు మనకు గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ రాసిన 'ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ - కార్నర్‌స్టోన్‌ ఆఫ్‌ ఎ నేషన్‌' అన్న పుస్తకంలో లభిస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ యునివర్సిటీ ప్రెస్‌ వారు ఈ పుస్తకాన్ని 1966లో ప్రచురించారు. 1972లో తొలి భారతీయ ముద్రణ వెలువడింది. విశేష పాఠకాదరణ పొందిన ఈ పరిశోధనాత్మక గ్రంధంలో గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ 'భారత రాజ్యాంగాన్ని ఎలా రాశారు, ఒక్కో అధికరణం తుదిరూపు సంతరించుకునే ముందు ఎలాంటి చర్చ జరిగింది' వంటి అంశాలను సవివరంగా విశ్లేషించారు.

ఇన్నాళ్ల తరువాత ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ వారు ''భారత రాజ్యాంగం - దేశానికి మూలస్తంభం'' అనే పేరుతో తెలుగులో వెలువరించారు.

    ఇందులోని 'భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య - రాజ్యాంగం' అన్న అధ్యాయంలో మనకు పై విశేషాలు కనిపిస్తాయి.
కాంగ్రెస్‌ పార్టీ 1920 నాటి నాగపూర్‌ సమావేశంలో తన పరిపాలనా వ్యవస్థను భాషా యూనిట్ల ప్రాతిపదికన వ్యవస్థీకరించింది. ఆనాటి నుంచీ బ్రిటిష్‌ ఏర్పాటు చేసిన ప్రావిన్సుల సరిహద్దులు  నిరంకుశంగా, అవకతవకలతో వున్నాయన్న విమర్శలు మొదలయ్యాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రావిన్సులను తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందే తప్ప ప్రజా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కాదన్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఒక్కో ప్రావిన్సులో అనేక భాషా ప్రాంతాలు కలగలసి వుండేవి. ఉదాహరణకు మద్రాస్‌ ప్రావిన్సులో ఆంధ్ర,ఒరియా, మలయాళ, కన్నడ ప్రాంతాలు కలగలసి వుండేవి. దాంతో మెజారిటీ భాష మాట్లాడే ప్రజలు మైనారిటీ భాష మాట్లాడే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం జరిగేది. అందుకే నెహ్రూ రిపోర్టు కూడా 'ఆయా ప్రాంతాల ఆకాంక్షలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, సంబంధిత ప్రాంత భాషపర ఐక్యతను దృష్టిలో పెట్టుకుని' ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరించాలని ఆనాడే సిఫారసు చేసింది. దాంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య క్రమంగా ఉధృతమయింది. స్వాతంత్య్రం రాగానే తమ అస్తిత్వ ఆకాంక్షలు నెరవేరతాయని ఆయా భాషా ప్రాంతాల ప్రజలు గాఢంగా విశ్వసించారు.

    కానీ దేశ విభజన జరగడం; కశ్మీర్‌ సమస్య, సంస్థానాల విలీనం సమస్య తెరమీదకు రావడం; హైదరాబాద్‌ రాజ్యం
స్వతంత్రంగా వుండాలని కోరుకోవడం వంటి కారణాల వల్ల రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం అభిప్రాయం మారిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాళ్లు వ్యతిరేకించారు. ప్రత్యేక పాలకవర్గం నేతలు అంటే జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, బాబూ రాజేంద్ర ప్రసాద్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌లు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన ఈ భావాలే ఇందుకు నిదర్శనం:

............''భావోద్వేగాలు చెలరేగివున్నప్పుడు రాజ్యాంగ నిర్ణయ సభ సమస్య పరిష్కారానికి ప్రయత్నించకూడదు. సమయం పరిపక్వమైనప్పుడు, సరైన సందర్భంలో ఆ పని చేయవచ్చు' అని జవహర్లాల్ నెహ్రూ అన్నారు.
............'భాషాపరమైన వేర్పాటు వాదం జాతీయ సమగ్రతనూ, ఐక్యతనూ దెబ్బతీస్తుందన్న కఠోర గుణపాఠాన్ని చరిత్ర మనకు నేర్పింది' అన్నారు వల్లభ భాయ్ పటేల్‌.
............'ప్రస్తుతం మనమంతా ఏదో ఒక ప్రాంతానికో, బృందానికో, సమాజానికో చెందినవారిగా కాకుండా భారతీయులుగా ఆలోచించాల్సిన అవసరం వుంది' అన్నారు బాబూ రాజేంద్ర ప్రసాద్‌.
............'దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండు ఇతర ప్రత్యేక ధోరణలు పెరిగిపోతున్నాయి కాబట్టి దేశ సమగ్రతను కాపాడేందుకు కొత్త రాజ్యాంగంలో కేంద్రానికి తిరుగులేని అధికారాన్ని కల్పించడమే ఏకైక మార్గం' అని మౌలానా ఆజాద్‌ పేర్కొన్నారు.

    అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనుంచీ ఉద్యమం ఇంకా ఉధృతం అయింది. దాంతో కేవలం 'ఆంధ్ర మాత్రమే కాకుండా ఇతర భాషా ప్రయుక్త ప్రాంతాలనూ వాటికి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించేందుకు' ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ముసాయిదా రాజ్యాంగ కమిటీ సిఫారసు చేసింది. చివరకు 1948 జూన్‌ 17న అలహాబాద్‌  హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఎస్‌.కె. దార్‌ ఛైర్మన్‌గా భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. బీహార్‌కు చెందిన పెద్దగా పేరులేని జె.ఎన్‌.లాల్‌ అనే కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిని, కేంబ్రిడ్జి పట్టభద్రుడైన గ్రేస్‌ ఇన్‌ లాయర్‌ని, పదవీ విరమణ చేసిన భారతీయ సీనియర్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి పన్నాలాల్‌ను కమిటీ సభ్యులుగా నియమించారు.

    శ్రీకృష్ణ కమిటీ లాగే దార్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా సమగ్ర విచారణ జరిపి 1948 డిసెంబర్‌ 10న తన నివేదికను సమర్పించింది. 'కేవలం భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయడం భారతదేశ విస్తృత ప్రయోజనాల రీత్యా మంచిది కాదనీ, ఆపని చేయవద్దనీ' కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి అనధికారిక నాయకుడైన పట్టాభి సీతారామయ్యతో సహా ఇతర నేతలెవ్వరికీ ఆ నివేదిక రుచించలేదు. పట్టాభి సీతారామయ్య అంతకు రెండు నెలల ముందే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారి ఒత్తిడి మేరకు, ఈ అంశంపై మరో సారి దృష్టి సారించేందుకు ఇంకో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దానిని జెవిపి కమిటీ అనేవారు. అందులో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, పట్టాభి సీతారామయ్య సభ్యులు. వాళ్ల పేర్లలోని మొదటి అక్షరాలతోనే ఆ కమిటీకి జెవిపి కమిటీ అనే పేరొచ్చింది.

ఆ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యను కూలంకషంగా పరిశీలించింది. చివరకు 'కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదని మేము భావిస్తున్నాం. అయితే ప్రజల భావోద్వేగాలు పట్టుసడలకుండా అ లాగే తీవ్రస్థాయిలో కొనసాగితే మాత్రం ప్రజాస్వామికవాదులుగా మనం దానికి ఒప్పుకోక తప్పదు, కానీ మొత్తం భారతదేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని పరిమితులకు లోబడి ఆపని చేయాల్సి వుంటుంది...' అని వారు అభిప్రాయపడ్డారు. ఆ నివేదికను చూసి భాషా ప్రయుక్త రాష్ట్రాల మద్దతుదార్లు తమకు సగం తలుపులు తెరచుకున్నట్టే అని భావించారు.
జెవిపి రిపోర్టును వాళ్లు బాహాటంగా స్వాగతించారు. తమ ఆశయ సాధనకోసం మరింత తీవ్రంగా ఒత్తిడిని కొనసాగించారు.

    అయినప్పటికీ చాలాకాలం ఆ సమస్య అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. 1950 జనవరిలో రాజ్యాంగాన్ని
ప్రారంభిస్తున్నప్పుడు రాజ్యాంగ నిర్ణయ సభ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పటు అనేది రాజ్యాంగ నిర్మాణం పరిధిలోని అంశం కాదని ప్రకటించి ఆ భారాన్ని వదిలించుకుంది.

కాకపోతే భారత రాజ్యాంగంలో అధికరణం-3 ద్వారా రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని ఏర్పరచింది. రెండు రాష్ట్రాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని విడదీసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం, ఏ రాష్ట్ర సరిహద్దులనైనా సవరించడం, ఏ రాష్ట్రం పేరునైనా మార్చడం వంటి విషయాల్లో రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండా, రాష్ట్రపతి సిఫారసుతో సులువుగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి పరిపూర్ణ అధికారాలను సమకూర్చింది.

మొదట్లో సంబంధిత రాష్ట్రాల 'సమ్మతి' పొందాలన్న అంశం ముసాయిదాలో వుంది. కానీ దానివల్ల ఆయా రాష్ట్రాలలోని అల్పసంఖ్యా వర్గానికి తగిన రక్షణ లభించకుండా పొతుందని గ్రహించి 'ప్రతిపాదిత మార్పులకు గురయ్యే రాష్ట్రాల ఆమోదాన్ని పొందాల్సిన అవసరం పార్లమెంటుకు లేదనీ, మామూలుగా ఆ రాష్ట్ర శాసన సభల 'అభిప్రాయం' తెలుసుకుంటే చాలునన్న' నిబంధనను చేర్చింది.

    ఈ అధికరణం ద్వారానే కేంద్రం ఆ తదనంతరం వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలను, అనేక ఇతర కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలిగింది. తనకు ఇష్టం లేకపోయినా ప్రజాభిప్రాయానికి తలొగ్గి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్టే తెలంగాణా ప్రజల న్యాయమైన ఆకాంక్షను గుర్తించి కేంద్రం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయకతప్పదు గాక తప్పదు.భారత రాజ్యాంగం - దేశానికి మూలస్తంభం
-గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌
తెలుగు అనువాదం :  ప్రభాకర్ మందార

483 పేజీలు, వెల: రూ.250


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500 006 

(ఈ ఆర్టికిల్ సంక్షిప్తంగా నమస్తే తెలంగాణా 25. 6. 2013 సంచికలో ప్రచురించ బడింది. వారికి ధన్యవాదాలతో )

.