Showing posts with label మరికొన్ని కథలు 1. Show all posts
Showing posts with label మరికొన్ని కథలు 1. Show all posts

Saturday, August 22, 2009

కూలని గోడలు (కథ) ...

కూలని గోడలు (కథ) ...

తలుపుల మీద దబదబ బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడి నిద్రలేచాను.
అప్రయత్నంగా నా చూపు గోడ గడియారం వైపు మళ్లింది.
పన్నెండు పది!
ఇంత అర్థరాత్రి ఎవరబ్బా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను.
ఎదురుగా అభిలాష్‌. ఎనిమిదేళ్ల కుర్రాడు. ఆర్టీసీ డ్రైవర్‌ బలరాం కొడుకు.
సంశయంగా వాడి భుజం పట్టుకుని 'ఏంట్రా' అన్నాను.
''నాన్నకు గుండెనొప్పొచ్చింది. అమ్మ, మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మంది''
నేను నిర్ఘాంత పోయాను.

ఆర్నెళ్ల క్రితమే బలరాంకి మైల్డ్‌గా హార్ట్‌ అటాక్‌ వచ్చింది. అప్పుడు అతణ్ని నేనే హైదరాబాద్‌ తార్నాక లోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లాను. వాళ్లు వెంటనే నిమ్స్‌కి డైరెక్ట్‌ చేశారు. నెల రోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చాడు బలరాం. అప్పుడు లక్షన్నర వరకు ఖర్చయింది. అయితే ఆ ఖర్చంతా ఫూర్తిగా ఆర్టీసీయే భరించింది.
అప్పుడే మళ్లీ ఇదేమిటి!

అసలు బలరాంను చూస్తే ఎలాటి జబ్బులైనా ఆమడ దూరం పారిపోతాయనిపిస్తుంది.

పేరుకు తగ్గ పర్సనాలిటీ. ఉక్కు మనిషిలా వుంటాడు. పైగా వయసు ముఫ్ఫై ఐదేళ్లు కూడా దాటలేదు. అతనికి గుండెపోటేమిటి కాల వైపరీత్యం కాకపోతే.

నేను గబగబా బట్టలు మార్చుకుంటుండగా ''ఎక్కడికండీ'' అంటూ ప్రశ్నించింది మా ఆవిడ.
''బలరాంకు మళ్లీ గుండె నొప్పొచ్చిందట.''

''అయ్యయ్యో. నేనూ వస్తానుండండి'' అంటూ లేచింది ఆందోళన పడిపోతూ.

''ఆలస్యమవుతుంది. నువ్వు తర్వాత రా'' అంటూ అభిలాష్‌తో వాళ్లింటివేపు నడిచాను.

బలరాం మా బంధువేం కాదు. నా ప్రియ శిష్యుల్లో ఒకడు. చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నా వద్దే చదువుకున్నాడు. స్కూలు అయిపోయిన తరువాత కూడా మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు.

బలరాం అంటే నాకూ, మా ఆవిడకూ ఎంతో అభిమానం. అతని వినయవిధేయతలూ, చదువు మీది శ్రద్ధా చూడ ముచ్చటగా వుండేవి. ఒక దశలో మేం బలరాంని మా అ ల్లుడిని చేసుకోవాలని కూడా అనుకున్నాం.

బలరాం పదోతరగతిలో ప్రవేశించేనాటికే మా పెద్దమ్మాయి అరవింద, రెండో అమ్మాయి అనుపమల వివాహాలు అయిపోయాయి. మా చిన్నమ్మాయి అపూర్వ బలరాం కంటే ఏడాది చిన్నది. వాళ్లిద్దరికీ ఈడూ జోడూ సరిపోతుందనుకున్నాం.

నిజానికి బలరాంది మా అంతస్తుకు తగ్గ కుటుంబమేమీ కాదు. బలరాం తండ్రి రాఘవులు ఒక ప్రైవేట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కంపోజిటర్‌గా పనిచేసేవాడు. చాలీ చాలని జీతం. ఐదుగురు పిల్లలు, ఊళ్లో ఎక్కడ చూసినా అప్పులు. ఇంటిలో పిలవకపోయినా పలికే దారిద్య్రం. అయినా సరే మాకు బలరాం అంటే చాలా ఇష్టంగా వుండేది. పిల్లవాడు బుద్ధిమంతుడు. చదువు మీద శ్రద్ధాసక్తులున్నవాడు. అతనికి మంచి భవిష్యత్తు వుంటుంది, మా అపూర్వ తప్పక సుఖపడుతుంది అనేది మా నమ్మకం.

అందుకు బలమైన కారణం కూడా వుంది. మా అరవింద, అనుపమలను గొప్పిళ్లకే ఇచ్చాం. అయితే మాత్రం ఏం లాభం, అనుక్షణం గొడవలే. వాళ్ల గొప్పతనమంతా ఆస్తికే పరిమితం. మిగతా అన్నిట్లోనూ అ లగాతనమే. ఎంత ఆస్తి వుంటే ఏం లాభం మా అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకోని రోజు, మేం ఆందోళన పడని రోజు లేదు.

అందుకే ఆడపిల్ల సుఖంగా వుండాలంటే పెళ్లికొడుకు ఆస్తిపాస్తులనూ డాబు దర్పాలనీ కాకుండా అతని మంచితనాన్నీ, సంస్కారాన్నీ చూడాలని అనుభవపూర్వకంగా తెలుసుకన్నాం. అందుకే బలరాం మీద అంత అభిమానం ఏర్పడింది. నా ప్రతిపాదనను మా ఆవిడకు చెబితే ఆమె కూడా నిస్సంకోచంగా ఒప్పుకుంది. కళ్ల ముందు పెరిగిన పిల్లవాడు. నాలుగిళ్లవతలే వుండేవాడు. రేపు పెళ్లయినా మన అమ్మాయి ఎప్పుడూ మన కళ్ల ముందే వుంటుంది అని తను కూడా ఎన్నో కలలు కంది.

అయితే ఈ విషయం మా ఇద్దరి మనసుల్లోనే వుండిపోయింది తప్ప అప్పుడూ ఇప్పుడూ మా ఆమ్మాయితో సహా మరెవరికీ చెప్పలేదు. మాకు ఆ అవసరమూ రాలేదు.

బలరాం పదో తరగతి చదువుతుండగానే అతని తండ్రి రాఘవులు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఆ రోజు అర్థరాత్రి వరకూ ప్రింటింగ్‌ ప్రెస్సులో పనిచేసి అ లసి సొలసి సైకిల్‌ మీద ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహన మేదో అతణ్ని ఢీకొట్టి వెళ్లిపోయింది.

అంతే. ఒక్కసారిగా ఆ కుటుంబం పరిస్థితి తుపానులో చిక్కుకున్న పడవలా అయిపోయింది.

పాతికేళ్లుగా తన రక్తాన్ని ధారపోసినప్పటికీ ఆ ప్రింటింగ్‌ ప్రెస్సు యజమాని రాఘవులు కుటుంబానికి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. అంతవరకు వడ్డీ రూపంలో రాఘవులు మూలుగల్ని పీల్చిన వడ్డీ వ్యాపారస్తులు ఒక్కసారిగా తమ అసలు ఇచ్చేయమంటూ ఆ ఇంటి మీదపడ్డారు. దాంతో వున్న చిన్నపాటి ఇంటిని అమ్మేయక తప్పలేదు వాళ్లకి. అయినా అప్పులు పూర్తిగా తీరనే లేదు. పిల్లలంతా తలోదిక్కు అయిపోయారు. ఒకరు హోటళ్లో, ఇంకొకరు సైకిల్‌ షాపులో, ఆడపిల్లలు బీడీల కార్ఖానాల్లో పనులకు కుదిరారు. బలరాం కూడా ఓ మోటార్‌ కంపెనీలో హెల్పర్‌గా చేరాడు.

ఎంతో చక్కని భవిష్యత్తు వుందనుకున్న బలరాం అ లా అయిపోవడం నా మనసును కలిచి వేసింది. నేను వాళ్ల అమ్మను కలిసి బలరాం చదువు ఖర్చులన్నీ నేను భరిస్తాను వాణ్నొక్కడినైనా చదివించమని కోరాను. కానీ ఆవిడ ''నా కొడుకు మీద మీకు అంత ప్రేమ వున్నందుకు నాకు సంతోషమేనండి. కానీ పెద్దోడిని చదివిస్తూ చిన్నపిల్లల్ని కూలిపనికి పంపించడం న్యాయమవుతుందా మీరే చెప్పండి'' అంది.

నేనా ప్రశ్నకి సమాధానం చెప్పలేక నిస్సహాయంగా వుండిపోయాను. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఆతర్వాత బలరాం మా ఇంటికి రావడమే మానేశాడు. మరకల దుస్తులతో నా కంటపడటానికే ఇష్టపడేవాడు కాదు. కొన్నాళ్లకి వాళ్ల కుటుంబం పట్నానికి వలస పోయింది. బలరాం మెకానిక్‌ నుంచి లారీ డ్రైవర్‌గా మారాడు. ఆ తదనంతరం ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌ అయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతకుముందే మంచి సంబంధం కుదిరితే మా అపూర్వకి కూడా వివాహం చేసేశాము.

ఆవిధంగా మా కల కల్లగా మిగిలిపోయినప్పటికీ బలరాం మీద మాకున్న వాత్సల్యం కానీ, వాడికి నా మీద వున్న గురుభక్తిగానీ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడైనా కనిపిస్తే ఎంతో అభిమానంగా మాట్లాడుతాడు. తన కష్టసుఖాలన్నీ అరమరికలు లేకుండా చెప్తాడు.

ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం, గుణవంతురాలైన అమ్మాయితో పెళ్లి బలరాం జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు అతనికి సిగరెట్లు, గుట్కా, తాగుడు వంటి దురలవాట్లు అంటుకున్నాయి. కానీ ఇప్పుడు అట్లాంటివేమీ లేవు. చదువుకునే రోజుల్లో మాదిరిగా తిరిగి హుందాగా తయారయ్యాడు. జీవితానికి మళ్లీ ఒక లక్ష్యమంటూ ఏర్పడింది.

ఆర్టీసీ వాళ్లిచ్చిన గృహనిర్మాణ రుణం సహాయంతో అతను గతంలో అమ్మేసిన తమ పెంకుటిల్లునే తిరిగి కొని అక్కడే చక్కని డాబా ఇల్లు కట్టించాడు. అతని కుటుంబ మంతా ఇప్పుడు ఆ ఇంట్లోనే వుంటున్నారు. ఊళ్ళో బలరాంకి మంచి పేరుంది. బస్టాపుల్లోనే కాదు మార్గమధ్యంలో ప్రయాణికులు కనపడ్డా బస్సాపి పిలిచి మరీ బస్సెక్కించుకుంటాడు. ప్రయాణికులందరితో మర్యాదగా, కలుపుగోలుగా మాట్లాడతాడు. వారు కోరిన చోట విసుక్కోకుండా బస్సాపి దింపుతాడు. బలరాం బస్సంటే పిల్లలకీి, పెద్దలకీ ఎంత ఇష్టమో. బలరాం బస్సు వుందంటే ఆటోల మీద వెళ్లేవాళ్లు కూడా ఎంతసేపైనా ఎదురుచూస్తూ నిలబడతారు. డ్రెవింగ్‌ కూడా ఎంత బాగా చేస్తాడో. గతుకుల రోడ్డుమీద సైతం కుదుపులు లేకుండా నడపగలిగే నైపుణ్యం అతనిది.

అట్లాంటి బలరాంకి ఇంత చిన్న వయసులో గుండెపోటేమిటో తలచుకుంటే మనసు విలవిలలాడిపోతోంది.

నేను బలరాం ఇంటికి చేరుకునే సరికే అక్కడ ఇరుగుపొరుగు వాళ్లు చాలామంది గుమికూడి వున్నారు. బలరాం తల్లి, భార్య పెడ్తున్న శోకాలు దూరంనుంచే వినపడసాగాయి.

ఒక్కసారిగా ఏదో వణుకు, భయం ఆవహించాయి నన్ను. నో. అ లా జరగి వుండదు! అ లా జరగ కూడదు! బలరాంకి ఏం కాకూడదు. భగవంతుడు అంత దుర్మార్గుడు కాదు. అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాను.

కానీ ఏదీ మనం అనుకున్నట్టు జరుగదు కదా. అప్పటికే బలరాం విగతజీవుడయ్యాడు. అతని శరీరంలో కదలికలు లేకపోయినా అతని కళ్లు మాత్రం ఇంకా ఏ భవిష్యత్తులోకో తొంగిచూస్తున్నట్టు అ లా తెరిచే వున్నాయి. ఆ కంటి రెప్పలను మూసే ప్రయత్నం చేస్తూ కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుండగా నేను కూడా బలరాం కళేబరం మీద వాలిపోయాను.

--- --- ---

బలరాం చనిపోయి ఏడాది కావస్తోంది.

ఇప్పటికీ వాడు చనిపోయాడంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడంలేదు. అందుకే ఏ బస్సుని చూసినా డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నది బలరామే నేమో అనిపిస్తుంటుంది. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు హారన్‌ మోగిస్తూ వచ్చి నా పక్కనే ఆగినట్టు... బలరాం నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నారు సార్‌. రండి అని ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది.

వాడికి ఏమీ కాని నాకే ఇలా వుంటే వాడి కన్నతల్లికి, భార్యకి, పిల్లలకి ఎలా వుంటుందో. బలరాం తండ్రి అకాల మృత్యువు పాలవడం, బలరాం చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం... ఏమిటో ఆ కుటుంబం చేసుకున్న పాపం అని మనసు విలవిలలాడుతుంది.

అయితే రాఘవులు చనిపోయినప్పుడు మాదిరిగా ఆ కుటుంబం ఇప్పుడు వీధిన పడలేదు. అప్పులవాళ్ల బాధ పడలేక ఉన్న ఇంటిని అమ్ముకుని కుటుంబమంతా ఛిన్నాభిన్నమైపోయే ఆనాటి దుస్థితి వీరికి రాలేదు.

ఆర్టీసీ వాళ్లు ఇంటి నిర్మాణంకోసం తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేశారు. ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాచ్యుటీ, ఎస్‌బిటి, ఎస్‌ఆర్‌బిఎస్‌, ఇడిఎల్‌ఐఎఫ్‌, అడిషనల్‌ మానిటరీ బెనిఫిట్‌ స్కీం, పెన్షన్‌ స్కీం ఇట్లా అనేక రకాల కార్మిక సంక్షేమ పథకాల వల్ల, దానికితోడు బలరాం ముందు చూపుతో చేసిన ఎల్‌ఐసి పాలసీ వల్ల ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక ఆసరా లభించింది. వచ్చిన డబ్బుని అధిక భాగం సిసిఎస్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. దానిపై వచ్చే ఇంట్రెస్ట్‌, పిఎఫ్‌ పెన్షన్‌ డబ్బులు కలిపితే బలరాం నెలజీతం కన్నా రెట్టింపు ఆదాయం వస్తోంది వాళ్లకి.

ఇవాళ బలరాం భార్య అనాథ కాదు.
తన తండ్రి చనిపోయినప్పటిలాగా ఇప్పుడు బలరాం పిల్లలు చదువు మానేయనవసరంలేదు.

రాఘవులు తాను చనిపోతూ తన పిల్లలకు మంచి భవిష్యత్తనేది లేకుండా చేశాడు.

బలరాం తాను చనిపోతూ తన పిల్లల ఆలనాపాలనకు, ఉజ్వల భవిష్యత్తుకు అన్ని ఏర్పాట్లు చేసిపోయాడు.

ప్రైవేట్‌ రంగంలో పనిచేసే కార్మికుడి పరిస్థితికీ ... ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికుడి పరిస్థితికీ మధ్య ఎంత తేడా.

బలరాం నువ్వు లేవు. నీ ఆశాసౌధం వుంది.

అది ఎప్పటికీ కూలిపోదు!
.....

(ఆర్టీసీ ప్రస్థానం మాస పత్రిక మే 1994 సంచికలో ప్రచురించబడిన కథ స్వల్ప మార్పులతో)


...

Saturday, July 11, 2009

గురివింద గింజలు... కథ



గురివింద గింజలు

సూర్యాస్తమయం అయిందంటే చాలు ఎక్కడెక్కడి పక్షులన్నీ వచ్చి ఆ తాలూకాఫీసు ఆవరణలో వున్న చెట్లపై చేరతాయి.

ఫైళ్లలో మునిగిపోయివున్న ప్రకాశం పక్షుల అరుపులతో ఇహంలోకి వచ్చేడు. తలెత్తి చూస్తే కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఆఫీసులో తనొక్కడే వున్నాడు. తోటి గుమాస్తాలంతా ఎప్పుడో వెళ్లిపోయారు.

ప్రకాశం ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తాడు. అందుకే అర్జంటు ఫైళ్లన్నీ అతని టేబుల్‌ మీదకే వస్తుంటాయి.

నీరసంగా లేచేడు. మిగిలిపోయిన ఫైళ్లని కట్టగట్టి చంకలో పెట్టుకుని ఆఫీసుని వాచ్‌మెన్‌కి అప్పగించి బయటపడ్డాడు.

ఆఫీసులో ఎంత సేపు పనిచేస్తాడో ఇంట్లోనూ అంతసేపు అదేపని చేస్తాడు. అతని ఆదివారాలు కూడా ఆఫీసు పనితోనే గడచిపోతుంటాయి. ఫైళ్లు తప్ప అతనికి వేరే వ్యాపకం ఏమీ లేదు. ఉద్యోగం చేయడానికే బతుకుతున్న అరుదైన వ్యక్తి అతను.

ఇంటికి చేరే సరికి రాత్రి ఏడయింది.

ఫైళ్లని టేబుల్‌ మీదికి గిరాటువేసి లుంగీ అందుకున్నాడు.

ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. ఆఫీసు నుంచి వొచ్చిన ప్రకాశాన్ని సాధారణంగా వెంటనే ఎవరూ పలకరించరు. అతని బడలిక తీరేవరకు ఎవరూ అసలు అతనికి ఎదురుపడటానికే ఇష్టపడరు. ఆఫీసులోని చిరాకంతా ఎక్కడ తమ మీద ప్రదర్శిస్తాడో అని భయం.

ఆఫీసులో ఎంత ఒబిడియంట్‌ సర్వెంట్‌లా వుంటాడో ఇంట్లో అంత రుసరుసలాడుతూ, మండిపడుతూ కనిపిస్తాడు.

బాత్‌రూం వైపు వెళ్లబోతున్న ప్రకాశం ఠక్కున ఆగిపోయేడు.

'డుంబు' అని ముద్దుగా పిలుచుకునే అతని ఐదేళ్ల కొడుకు గదిలో ఓ మూలన కూచుని నోట్లో వేలు పెట్టుకుని తన్మయంగా చీకుతున్నాడు.

ప్రకాశానికి ఆ దృశ్యం చూడగానే ఒంటి మీద ఒక్కసారి తేళ్లూ జెర్రులూ పాకినట్టయింది.

''ఒరేయ్‌, డుంబూ!'' ఇల్లు అదిరిపోయేలా అరిచేడు.

ఆ అరుపునకు డుంబు ఒక్కసారి దడుచుకున్నాడు. తండ్రి ఉగ్ర రూపాన్ని చూడగానే వాడికి చెమటలు పట్టేశాయి.

''నోట్లోంచి వేలు తియ్‌రా గాడిదా'' అదే స్థాయిలో మళ్లీ అరిచేడు ప్రకాశం.

వాడు నోట్లోంచి వేలు తీయకుండానే భయంతో అక్కడినుంచి పారిపోబోయేడు.

దాంతో ప్రకాశం కోపం తారాస్థాయికి చేరుకుంది.

''రాస్కెల్‌'' అని పళ్లు కొరుకుతూ డేగ కోడిపిల్లను పట్టినట్టు రెప్పపాటులో కొడుకు రెక్క పట్టుకుని లాగి చెంప ఛెళ్లుమనిపించాడు.

''నోట్లో వేలేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాల్రా ఇడియట్‌'' అంటూ ఏడుస్తున్న కొడుకుక్కి ఎడాపెడా మరో నాలుగు తగిలించాడు.

అది చూసి లోపలినుంచి ప్రకాశం తల్లీ, భార్యా హాహాకారాలు చేస్తూ పరుగెత్తుకొచ్చారు. అప్పటికే వాడి రెండు బుగ్గలూ కందిపోయేయి. ప్రకాశం భార్య భోరున ఏడుస్తూ డుంబుని ఎత్తుకుని గబాల్న పక్క గదిలోకి తీసుకుపోయింది.

''నీకేం పుట్టిందిరా రోగం? పసివాణ్ని అంతలా కొట్టడానికి చేతులెలా వచ్చాయి. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే తిక్క రేగుతుందేమిట్రా నీకు?'' అంటూ దులిపేసింది ప్రకాశం తల్లి.

''నోట్లో వేలేసుకోవద్దని ఎన్ని సార్లు చెప్పానమ్మా వాడికి. అయినా వినిపించుకుంటున్నాడా? ఏంటా వెధవ అ లవాటు? నాలుగు తన్నకపోతే ఎట్లా మానతాడు?'' బింకంగా అన్నాడు ప్రకాశం.

''చాలు చాల్లే చదవేస్తే ఉన్న మతి పోయిందట. ఏదైనా ప్రేమగా నచ్చజెప్పి మాన్పించాలి గానీ పసిపిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదాలా?''

''ఎన్ని సార్లు చెప్పలేదమ్మా వాడికి? మంచిగా చెబితే వినిపించుకుంటున్నాడా?''

''ఏం చెప్పావు నీ మొహం. నీ కసలు ప్రేమగా చెప్పే తీరిక కూడానా?! నిన్ను ఇట్లా కొట్టి పెంచితే ఇంత వాడివి అయ్యుండేవాడివే కాదు.'' ఏవగించుకుంటూ తనూ మనవడున్న గదివేపు వెళ్లిందావిడ.

ప్రకాశం బాత్‌రూంకి వెళ్లకుండా వెనక్కి వచ్చేసి అసహనంగా వాలు కుర్చీలో కూర్చుని సిగరెట్‌ వెలిగించుకున్నాడు.

రెండు దమ్ములు లాగేక ఆవేశం కొద్దిగా తగ్గినట్టయింది. ముక్కు పచ్చలారని కొడుకుని అంతగా కొట్టినందుకు గిల్టీ ఫీలింగ్‌ కలిగింది.

నోట్లో వేలు పెట్టుకునే అ లవాటంటే ప్రకాశానికి తగని చిరాకు. తన గారాబాల చెల్లెలికి కూడా ఇట్లాగే నోట్లో వేలేసుకుని చీకే అ లవాటు వుండేది.

చిన్నప్పుడు ఎవరూ ఆ అ లవాటును అంతగా పట్టించుకోలేదు. పెద్దయితే అదే పోతుందిలే అనుకున్నారు. కానీ ఎంత పెద్దయినా ఆమె ఆ వ్యసనం నుంచి బయటపడలేదు. ఎవరికీ కనపడకుండా ఆ అ లవాటును కొనసాగిస్తూండేది.

ఏ రోజైనా ఆమెకు నోట్లో వేలేసుకునే అవకాశం చిక్కకపోతే ఆరోజంతా మూడీగా వుండేది. చికాకు పడేది. విపరీతమైన తలపోటుతో బాధపడేది.

ఒకోసారి నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలీకుండానే ఆమె కుడిచేతి బొటన వేలు నోట్లోకి వెళ్లిపోయేది. ఎదిగిన వయసులో అట్లా నోట్లో వేలేసుకుని పడుకున్న చెల్లెల్ని చూస్తే తనకి జుగుప్సగా వుండేది. ఎందరు ఎన్ని విధాల చెప్పినా ఆమెనుంచి ఆ అ లవాటు దూరం కాలేదు.

చివరికి ఆమె పెళ్లినాడు ఆ అ లవాటు వల్ల తామందరికీ చచ్చే చావయింది. ఇంట్లో బంధువుల సందడి వల్ల ఆరోజు ఆమెకు నోట్లో వేలేసుకునేందుకు ఏమాత్రం అవకాశం చిక్కలేదు. ఎవరైనా చూస్తే బాగోదు అనే ఉద్దేశంతో తను కూడా తన కుతిని ఆణిచిపెట్టుకుంటూ వచ్చింది.

తీరా పెళ్లి పీటల మీదకు వచ్చే వేళకు ఆ కుతి తారాస్థాయికి చేరుకుంది. తలపోటును, చికాకును తట్టుకోలేక కుదేలయింది. ఆమె మొహం కళా విహీనం అయింది. స్పృహతప్పి పడిపోతుందేమో అనుకున్నారు అందరూ.

పరిస్థితిని అర్థం చేసుకున్న అమ్మా, పిన్నీ మొదలైన వాళ్లంతా నానా తంటాలు పడి దడిలా అడ్డంగా నిలుచుని ఎదో అ లంకరణ సరిచేస్తున్నట్టు నటిస్తూ ఆమెకు నోట్లో కాసేపు వేలు వేసుకునే అవకాశం కల్పించారు. అప్పుడు తన చెల్లి కొంగు చాటు చేసుకుని కొద్ది క్షణాలు తన బొటనవేలుని ఆబగా చీకి రిప్రెష్‌ అయింది.

పెళ్లికొడుక్కి కానీ, అతని తరఫు బంధువులకి గానీ ఆ విషయం తెలిస్తే ఎంత గొడవయ్యుండేదో తలచుకుంటే ఇప్పటికీ గుండె జల్లు మంటుంది.

ఆ సంఘటన ప్రకాశం మనసులో చెరగని ముద్రవేసింది. ఆనాటి నుంచి ఆ అ లవాటు అంటేనే కంపరంగా వుంటుందతనికి.

దురదృష్ట వశాత్తూ ఆ అ లవాటు మళ్లీ తన కొడుక్కీ అంటుకుంది.

డాక్టర్‌ని సంప్రదిస్తే ఆయన కూడా అది అంత మంచి అ లవాటు కాదన్నాడు. ఆ అ లవాటు వల్ల పలువరుస ఎగుడుదిగుడుగా అయ్యే ప్రమాదం వుందన్నాడు. ఆ అ లవాటు వల్ల పిల్లలు న్యూరోటిక్‌గా తయారౌతారన్నాడు. దానిని మాన్పించడానికి ఏ మందులూ లేవనీ నయానో భయానో మాన్పించాల్సిందే తప్ప మరో మార్గాంతరం లేదన్నాడు. అందుకే వాడిని వీలైనంత త్వరగా ఆ అ లవాటు నుంచి విముక్తుణ్ని చేయాలని ఆరాటపడుతుంటాడు ప్రకాశం.

కోప్పడటం, కొట్టడం వల్ల ఆ అ లవాటు మరింత బలపడుతుందనీ ప్రేమగా, ఆప్యాయంగా నచ్చచెప్పి మాన్పించాలనీ డాక్టర్‌ కూడా సలహా యిచ్చాడు. కానీ ఎన్ని రకాలుగా చెప్పినా వాడు మాత్రం ఆ అ లవాటుకు దూరం కావడంలేదు. తనకేమో ఏమాత్రం ఓపిక వుండటం లేదు.

''ప్రకాషం... ఒరే ప్రకాషం...''

తండ్రి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాశం.

''తలుపులు తీసే వున్నాయి నాన్నా.'' అంటూ చేతిలోని సిగరెట్‌ని ఆర్పేశాడు. అప్పటికే అతను ఓ పెట్డెడు సిగరెట్లు తగలేశాడు. గదినిండా సిగరెట్‌ పీకలు చిందరవందరగా పడివున్నాయి.

ప్రకాశం తండ్రి తూలుతూ లోపలికి వచ్చాడు. ఆయన ఎక్సైజు డిపార్ట్‌మెంట్‌లో బంట్రోతుగా పనిచేస్తున్నాడు. ఇంకో రెండేళ్ల సర్వీసుంది. ఉచితంగా దొరుకుతుంది కాబట్టి రోజూ ఫుల్లుగా మందు కొట్టి మరీ ఇంటికొస్తుంటాడు.

''ఏంట్రా.. దిగులుగా కూషున్నావు?''

ప్రకాశం బదులివ్వలేదు.

ఆయనే మళ్లీ ''ఈ షిగరెట్లేమిటి? మొత్తం అన్నీ నువ్వే కాల్షావా?'' అడిగాడు.

దానికీ ప్రకాశం సమాధానం చెప్పలేదు.

ఆయన తన ధోరణిలో తను చెప్పుకుపోసాగాడు. ''ఒరే ప్రకాషం...సిగరెట్లు నీ ఒంటికి పడవని చెప్పినా వినిపింషుకోవేమిట్రా? ఈ పాడలవాడు మానేయవా నువ్వు? షెప్పు. కావాలంటే మందు అ లవాటు చేసుకోరా నాలాగా... కానీ సిగరెట్లు మాత్రం తాగకు. మంషిది కాదు. ఇష్కూలుకు వెల్లే రోజులనుంచి తాగుతున్నావు. నీ ఊపిరి తిత్తులన్నీ షెడిపొయి వుంటాయి. ఇప్పటికైనా మానెయ్‌రా.. అప్పుడు దొంగతనంగా కాల్చేవాడివి. ఇప్పుడు పెద్దోడివైపోయావు కదా ఇంట్లోనే కాల్చేస్తున్నావు. నేను నా కోషం చెప్పట్లేదు రా నీ ఆరోగ్యం కోషం చెప్తున్నా.... ఇదిగో ఒసేవ్‌...'' అంటూ ప్రకాశం తల్లిని కేకేశాడు.

ఆవిడ ఈ మాటలన్నీ వింటూనే వుంది. అప్పటికే భర్త పక్కకొచ్చి నిల్చుని వుంది.

''ఏంటి గొడవ?'' అందావిడ. ''కొడుక్కి సిగరెట్లు కాల్చొద్దని చెప్తున్నారా?''

''అవునే వాడు ఈ పాడు అ లవాటు మానడంలేదు షూడు.''

''ఆహాహా చాలా బావుందండి. సారా తాగే తండ్రి సిగరెట్లు తాగే కొడుక్కి బుద్ధి చెప్తాడు. సిగరెట్లు తాగే తండ్రి నోట్లో వేలు పెట్టుకునే కొడుక్కి బుద్ధి చెప్తాడు. ఎంత ఆదర్శ పురుషులో. ఎవరైన వింటే నవ్వి పోతారు. చాలించండిక.''

తండ్రీ కొడుకులిద్దరూ మొహమొహాలు తీసుకున్నారు. ఎవరూ కిక్కురు మనలేదు.

...


(స్వాతి సపరివార పత్రిక 26-9-1986 సంచికలో ప్రచురించబడిన కథ.
స్వాతి సంపాదకులకు కృతజ్ఞతలతో)

Tuesday, June 23, 2009

కత్తెర ... కథ ...




కత్తెర

కొత్తనీరొస్తే పాత నీరు కొట్టుకుపోతుందంటారు. కానీ, మా ఇంట్లో టీవీ వచ్చినా రేడియో మాత్రం ఇంకా కొట్టుకుపోలేదు.
ఇప్పటికీ ఉదయం పూట మేం టీవీకి బదులు రేడియోనే ఉపయోగిస్తుంటాం.
అందుక్కారణం లేకపోలేదు.
రేడియో అయితే పనులు చేసుకుంటూ వినొచ్చు, ఎప్పటికప్పుడు టైం ఎంతైందో తెలుసుకుంటుండవచ్చు. రేడియో వల్లనే మా ఆవిడ టైం ప్రకారం పనులు పూర్తిచేసి పిల్లల్ని స్కూలుకీ, నన్ను ఆపీసుకీ సక్రమంగా పంపగలుగుతోంది.

సాధారణంగా ప్రాంతీయ వార్తలు వచ్చే వేళకి నేను నిద్ర లేస్తాను.
ఎప్పుడైనా లేవకపోతే వాల్యూమ్‌ పెంచి రేడియోని అ లారం పీస్‌లా ప్రయోగిస్తుంది మా ఆవిడ.

ఆ రోజు వార్తలకి బదులు ఏవో డైలాగులు వినిపిస్తుంటే - మొదట రేడియో నాటికేమో అనుకున్నాను. కాదని కాసేపట్లోనే తేలిపోయింది. ఎందుకంటే ఆ వినిపించే మగ కంఠం ఎవరిదో తెలియదు కానీ ఆడ కంఠం మాత్రం కచ్చితంగా మా ఆవిడది!

''దీనికి ముప్ఫై రూపాయలు కావాలా? అడగడానికైనా హద్దుండాలి!''

''నువ్వెంతిస్తవో చెప్పరాదమ్మ?''

''ముప్ఫై అడిగాక ఇంకేం చెప్పాలి?''

''పోనీ గని ఇరవై ఐదిస్తవా?''

''ఇంకా నయ్యం. ఇరవై తొమ్మిదిన్నర అన్లేదు.''

''అరె గంత కోపమెందుకమ్మ? ఏదో ఒకటి నువ్వే అడగరాదు మల్ల.''

''ఐదు రూపాయలిస్తాను. ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదు.''

నేను దిగ్గున లేచి కూచున్నాను. ముప్ఫై అడిగితే ఐదు రూపాయలకి బేరమాడుతోంది! ఎంత ధైర్యమో. వాడెవడో కాస్త ఘాటుగా రియాక్టు అవుతాడని చెవులు రిక్కించాను.

''ఐదు రూపాయలా! హు. మంచి బేరమే దొరికింది పొద్దుగాల్నే. ఆఖరి మాట చెప్తున్న పదియ్యి చేసిస్త'' అన్నాడు వాడు మామూలు ధోరణిలోనే. చివరికి మా ఆవిడ ఎనిమిది రూపాయలకి ఖరారు చేసింది.

మా ఆవిడ బేరం చేస్తుందంటే ఎదుటివాడు ఎక్కడి తిడతాడో అని నాకు ఎప్పుడూ గుండె దడదడలాడుతూ వుంటుంది. అదేమిటో ఆమె ఎంత కడిగినా ఏమీ అనరు. అదే నేను కాస్త రేటు తగ్గించమంటే చాలు గయ్యినలేస్తారు. అందుకే నన్నేమీ కొననివ్వదు. అన్నీ తనే కొంటూ వుంటుంది. పొరపాట్న ఏదైనా కొని తేవాల్సి వస్తే ఆమె తృప్తికోసం వాటి ధర పదిరూపాయలు తగ్గించి మరీ చెప్తుంటాను. అయినా ఆమె సంతృప్తిచెందదు. వంటలో లాగే బేరంలో కూడా తనే స్పెషలిస్టు.

అసలా బేరం దేనిగురించో తెలుసుకుందామన్న కుతూహలంతో మంచందిగి వరండాలోకి వెళ్లాను.
మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, చంకలో విరిగిపోయిన గొడుగులు, చేతిలో తుప్పు పట్టిన ట్రంకు పెట్టె ... నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేనికుర్రాడు కనిపించాడు.
ఎన్నాళ్లుగానో మూలన పడివున్న మా గొడుగు మరమ్మత్తు గురించన్నమాట!

వాణ్ని చూస్తే నాకెందుకో శ్రమదోపిడీకి గురవుతున్నట్టు జాలి అనిపించింది.
బట్ట చిరిగి, పుల్లలు విరిగి బయటికొచ్చి బీభత్సంగా వున్న మా పాత గొడుగును వాడికందించి ఇల్లు తుడవడంలో నిమగ్నమైపోయింది మా ఆవిడ.
వాడు తన సరంజామాని వాకిట్లో పరచుకుని పనిలో మునిగిపోయాడు.

నేను వాడి పేరూ, ఊరూ కనుక్కుంటూ వరండా మెట్టుమీదే కూచుండిపోయాను.

తన మొండి కత్తెరతో బట్ట ఎంతకీ తెగకపోయే సరికి వాడు తలెత్తి ''సార్‌, మీ తాన కత్తెరున్నదా?'' అన్నాడు.

నేను వుంది అనలేక మా ఆవిడ వంక చూశాను. తను టైలరింగ్‌ నేర్చుకుంటా నంటే ఈ మధ్యే డెబ్బై రూపాయలు పెట్టి కొత్త కత్తెర కొన్నాం. దాని మీద సర్వ హక్కులు ఆమెవే కాబట్టి నేనేమీ కమిట్‌ కాలేదు.

ఒక క్షణ తటపటాయించి విసుక్కుంటూ వెళ్లి ఆ కత్తెరను తెచ్చి యిచ్చింది. కత్తెరతోపాటు ''సరిగ్గా కుట్టు. లేకుంటే ఒక్క పైసా కూడా ఇవ్వను జాగ్రత్త.'' అని వార్నింగ్‌ కూడా జారీ చేసింది.

పదిహేను నిమిషాల్లో పని పూర్తి చేశాడు.

మా ఆవిడ అనుమానించినట్టుగానే చాలా అస్తవ్యస్తంగా కుట్టాడు. గొడుగంతా ముడతలొచ్చాయి.
దాంతో మా ఆవిడ వాడితో పెద్ద గొడవపెట్టుకుంది.

వాడేమో ''నా తప్పేం లేదమ్మా. చానా పాత ఛత్రి. ఇంతకంటే మంచిగ ఎవడుకుడ్తడు?'' అంటూ వాదనకు దిగాడు. అంతా అయిపోయింతరువాత ఏం అనుకుంటే ఏం లాభం అని నేనే సముదాయించి, ఎనిమిది రూపాయలు వాడికి ఇప్పించి పంపించాను.

వాడు వెళ్లిపోయిన తరువాత అయిదు నిమిషాలకి గానీ వాడు మా కొత్త కత్తెరను తిరిగి ఇవ్వలేదన్న విషయం గుర్తుకు రాలేదు!

ఒక్కసారిగా అవమానం, కోపం, బాధ మమ్మల్ని ముప్పిరిగొన్నాయి.

వాణ్ని పట్టుకుని నాలుగు తన్నాలన్నంత కోపం వచ్చింది.
వెంటనే సైకిల్‌ వేసుకుని రయ్యిన బయలుదేరాను.
ఎన్నడూ అడుగుపెట్టని ప్రతి సందూ గొందూ గాలించాను.

అయినా వాడు దొరకలేదు. చాలా నిరాశ కలిగింది.

ఎంతో కష్టపడి గీరి గీరి బేరం చేసి అతి తక్కువ ఖర్చుతో మూలనపడివున్న గొడుగును బాగు చేయించిన మా ఆవిడైతే షాకునుంచి తేరుకోలేకపోయింది. ఇంకా తను టైలరింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టలేదు. కత్తెరకు బోణీ అయినా చేయలేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.

ఆ సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక మళ్లీ మేం అదే టాపిక్‌ గురించి చర్చించుకుంటూ కూర్చున్నాం.
నాకు మొదట్లో వాడి మీద ఏర్పడిన సానుభూతి మచ్చుకు కూడా లేకుండా పోయింది.
అలగాజనానికి తప్పకుండా అల్ప బుద్ధులే వుంటాయి అన్న మా ఆవిడ అభిప్రాయంతో నేను ఏమాత్రం విభేదించలేకపోయాను.
మేం ఆవిధంగా కసిగా, బాధగా చర్చించుకుంటుండగా ''ఛత్రీలు బాగు చేస్తాం ... గొడుగులు రిపేర్లు చేస్తాం...'' అన్న కేక వినిపించింది. గభాల్న బయటికొచ్చి చూశాం.

కానీ వీడు వాడు కాదు, వేరేవాడు.

నా మనసులో ఏదో ఫ్లాష్‌ వెలిగినట్టయింది. ఆ కుర్రాణ్ని పిలిచాను. ప్రొద్దున ఉబుసుపోక వాడి ఊరూపేరూ అడిగి తెలుసుకోవడం మంచిదయింది.

ఈ కొత్త కుర్రాడు గేటు దగ్గరకు వచ్చి ''ఏంది సార్‌?'' అన్నాడు.
''నీ పేరేంటి?''
''చేరాలు సార్‌''
''ఎక్కడుంటారు?''
''బతుకమ్మ కుంట సార్‌, ఎందుకు?''
''ఏం లేదు నీకు రాములుగాడు తెలుసా? వాడు కూడా నీలాగే గొడుగులు రిపేరు చేస్తుంటాడు.'' అడిగాను.
''తెలుసు సార్‌'' అన్నాడు వాడు.

అంతే ఒక్కసారి ఉత్సాహం వచ్చింది నాకు. 'దొంగ రాములూ ఇంక తప్పించుకోలేవురా' అనుకున్నాను.

ప్రొద్దున జరిగిన ఉదంతమంతా వాడికి చెప్పాను.
''చూడూ వాడు గనక రేపు తెల్లారేలోగా మా కత్తెరను మాకు తెచ్చిస్తే సరే సరి. లేదంటే మా మామయ్య పోలీసు సబ్‌ఇన్స్‌పెక్టర్‌. వాడి ఒంట్లో సున్నం మిగలకుండా తన్నిస్తాను అని చెప్పు'' అంటూ ఓ ధమ్కీ కూడా ఇచ్చాను.

వెంటనే వాడికి ఈ విషయం చెప్పకపోయావో పోలీసు కేసులో నిన్ను కూడా ఇరికిస్తాను జాగ్రత్త'' అని బెదిరించాను.

వాడు హడలిపోతూ ''తప్పకుండా చెప్త సార్‌'' అని పరుగుపరుగున వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ ''నిజంగా వాడు మన కత్తెరని తెచ్చిస్తారంటారా?'' అని అడిగింది.

''చచ్చినట్టు తెచ్చిస్తాడు. నువ్వింక నిశ్చింతగా వుండొచ్చు. రేపు తెల్లారే సరికి నీ కత్తెర నీ ముందుంటుంది .'' అని భరోసా యిచ్చాను.

మర్నాడు ఆదివారం.
ఉదయం నుంచే రాములు రాక కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాను.
ఏడైంది. ఎనిమిదయింది. తొమ్మిదైంది. ఉహు వాడు రాలేదు.
పది దాటాక నా నమ్మకం సడలిపోయింది.
అంత బెదిరించినా వాడు బెదరలేదంటే వాళ్లకిలాంటివి మామూలేమో. దొంగతనంలో ఆరితేరి వుంటారు. ఎంతైనా అలగా జనం కదా. అనుకున్నాను కసిగా.

చేసేదేంలేక సిగరెట్లు తెచ్చుకుందామని బయటికి వెళ్లాను.
పాన్‌ షాప్‌ వద్ద ఆగి ''ఆదా సిగరెట్‌ ప్యాకెట్‌ దేవ్‌'' అంటూ పదిరూపాయల నోటు అందించాను.
గిరాకి ఎక్కువగా వుండటం వల్ల పాన్‌ షాపు వాడు సరిగా చూసుకోకుండా నేను యిచ్చింది యాభై రూపాయల నోటు అనుకుని సిగరెట్లతో సహా నలభై ఐదు రూపాయలను నా చేతిలో పెట్టాడు.

నాకు ఒక్క సారి చెయ్యి వణికింది.
అంతలోనే పోయిన మా కత్తెర గుర్తుకొచ్చింది.
ఆ నష్టం కొంతవరకు ఈ విధంగా భర్తీ అవుతున్నట్టనిపించింది.
నాలోని సైతాన్‌ నన్ను లోబరచుకున్నాడు. అంతే గప్‌చుప్‌గా డబ్బులు, సిగరెట్లు జేబులో కుక్కేసుకుని గబగబా అక్కడినుంచి వచ్చేశాను.

ఇంటికి వచ్చేవరకు పాన్‌షాప్‌ వాడు తన పొరపాటు తెలుసుకుని నా వెనక ఎక్కడ పరుగెత్తుకొస్తాడో అన్న భయం వెంటాడింది.

ఇల్లు చేరాక కానీ నా మనసు స్థిమితపడలేదు.

అంతలోనే ''సార్‌..''అన్న పిలుపు వినిపించింది. ఎవరా అని చూస్తే రాములు!

వాడి చేతిలో తళతళ మెరిసిపోతోంది మా కత్తెర!!

''నిన్న గల్తీల మీ కత్తెర పట్కపోయిన సార్‌. ఇంటికి పోయినంక సూసుకున్న. ఇంతల మా నాయినకు మోటర్‌ టక్కరవుట్ల దవఖానకు తీస్కపోయినం. ఇటొచ్చెటానికి వీలు పడలేదు సారు. ఏమనుకోవద్దు. ఇగోండి మీ కత్తెర.'' అంటూ కత్తెరను నాకు అందించి దండం పెట్టి మరీ వెళ్లిపోయాడు.

నేను ఒక క్షణం అప్రతిభుడినై అలాగే వుండిపోయాను. ఏకకాలంలో ఆనందం, అపరాధ భావన నన్ను ముంచెత్తాయి.

మా ఆవిడ లోపలినుంచి పట్టరాని సంతోషంతో వచ్చి నా చేతిలోని కత్తెరను తీసుకుంది. ''మనకు బాకీ వుంటే తప్పకుండా దొరుకుతుందని అప్పుడే అనుకున్నాను. దొరికింది. న్యాయంగా సంపాదించిన సొమ్ముతో కొన్న వస్తువులు ఎక్కడికీ పోవండీ.'' అంటో కత్తెరను బిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకుని లోపలికి వెళ్లింది.

పాన్‌ షాపు వాడి పట్ల నేను చేసిన నేరం, వంచన నన్ను స్థిరంగా నించోనివ్వడం లేదు.

జేబులోకి అక్రమంగా వచ్చి చేరిన ఆ నలభైఐదు రూపాయల నోట్లు గుండుసూదుల్లా గుండెకు గుచ్చుకుంటున్నాయి.

ఆ తర్వాత మరికాసేపటికే నాకు మరో దెబ్బ తగిలింది.
''సార్‌'' అని పిలుస్తూ గొడుగులు బాగు చేసే రెండో కుర్రాడు చేరాలు వచ్చాడు.
''ఏంటి?''
''రాములు కల్వలేదు సార్‌. వాల్ల నాయినకు యాక్సిడెంట్‌ అయిందంట సార్‌ .. నిన్న సాయంత్రం సంది వాళ్లింట్ల ఎవ్వరు లేరు. ఇయ్యాల కనబడ్తె తప్పకుండ చెప్త సార్‌. మీ కత్తెర యాడికి పోదు సార్‌. వాడు అసొంటోడు కాదు సార్‌.'' అని బాధ్యతగా చెప్పి వెళ్లిపోయాడు.

అంటే రాములు తనంతటతానే, నిజాయితీగా మా కత్తెరను తెచ్చి యిచ్చాడన్నమాట.
నేను పోలీసులకు పట్టిస్తానన్న ధమ్కీకి భయపడి కాదన్నమాట!

దాంతో నేను మరింత డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయాను.
వాడి గురించి నేను ఎంత చులకనగా ఆలోచించాను. ఎవరు అలగా జనం. వాళ్లా నేనా?
నా గొంతులో బుల్లి కత్తెరేదో ఇరుక్కుపోయిన ఫీలింగ్‌ కలిగింది. ఆ సెల్ఫ్‌ పిటీని తట్టుకోవడం ఇక నా వల్లకాదనిపించింది.

వెంటనే ఏమైతే అదయిందని నా జేబులోని అపరాధ భారాన్ని దించేసుకునేందుకు పాన్‌ షాప్‌ వైపు నడిచాను, ''ఎక్కడికండీ?'' అని అడుగుతున్న మా ఆవిడకు సమాధానంచెప్పకుండానే!

- - -

(ఆర్ట్స్‌కో 1993లో నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ)

...

Thursday, June 4, 2009

సొంత చిరునామా ... కథ


సొంత చిరునామా ... కథ

''మమ్మీ...ఎందుకేలుత్తున్నావ్‌?''

దొడ్లో బావిగట్టుమీద కూచుని అంట్లుతోముతున్న తల్లిని తదేకంగా చూస్తూ అడిగింది భవిత.

కూతురు రాకను గమనించకపోవడంవల్ల ఆ ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కిపడింది భవాని. తన ఉలికిపాటును పైకి కనబడనివ్వకుండా భుజాలతో కళ్లు తుడుచుకుని 'నేనేం ఏడవడం లేదే' అన్నట్టు నవ్వింది. బాధ అడ్డుపడటం వల్ల ఆ మాట గొంతుదాటి బయటకు రాలేకపోయింది.

భవిత వయసు మూడేళ్లే కానీ ఎంతో ఆరిందాలా మాట్లాడుతుంది. వయసుకు మించిన తెలివి తేటల్ని ప్రదర్శిస్తుంటుంది.

జీవంలేని తల్లి నవ్వును ఏమాత్రం పట్టించుకోకుండా ''తాతయ్య నిన్ను తిట్టాలు. అందుకే ఏడుత్తున్నావ్‌ కదూ?'' అంది తిరిగి.

''అబ్బే లేదమ్మా! కంట్లో ఏదో నలక పడితేనూ తుడుచుకుంటున్నా...'' సూటిగా కూతురి కళ్లల్లోకి చూడలేకపోయింది భవాని.

''అంతా అబ్‌దం''

''లేదే నిజం... ఒట్టు'' కుడిచేయి పిడికిలి బిగించి అంట్లు అంటకుండా మణికట్టును తలమీద పెట్టుకుంటూ అంది.

తల్లి ఒట్టు పెట్టుకునేసరికి ఆ చిన్నారి క్షణకాలం సంశయంలో పడిపోయింది. ఆ వెంటనే ''తాతయ్య మంచాడు కాదు. ముచ్చలి, బూచి..''అంది కసిగా.

''అవేం మాటలే. పెద్దవాళ్లను అ లా అనొచ్చా? తప్పుకదూ!'' కూతుర్ని మందలించింది భవాని.

''మరి మరి నేను చని గహమా? డాడీని నేను చంపానా??'' తల ఎగరేస్తూ ఆక్రోశంగా అడుగుతున్న కూతుర్ని చూసి తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకోలేకపోయింది. చప్పున చేతుల్ని కడుక్కుని కూతుర్ని ఒళ్కోకి లాక్కుని భోరు మంది.

తండ్రి మాటలు తననే కాక ఆ పసి హృదయాన్ని కూడా అంతగా గాయపరిచి వుంటాయని ఏమాత్రం ఊహించలేకపోయింది.

అసలు తప్పంతా తనదే!

ఇల్లు తుడవబోతూ 'కాస్త ఆ ఫ్యాను ఆపు చెయ్యమ్మా' అంటూ తనే పాపను పురమాయించింది. ఎప్పుడూ తన కూడా వుంటూ తనకు ఏదో ఒక సాయం చెయ్యాలని ఉబలాటపడే కూతురి ముచ్చట తీర్చాలనే చెప్పింది తప్ప మరో ఉద్దేశంతో కాదు.

తన నోట్లోంచి ఆ మాట వచ్చిందో లేదో పాప గబగబా వెళ్లి తాతయ్య పడుకున్న మంచం ఎక్కి స్విచ్‌ ఆఫ్‌ చేయబోయింది. ఆయన తలగడ పక్కనే వున్న కళ్లజోడును పాపా చూడలేదు తనూ చూడలేదు పాప కాలుతగిలి కిందపడిపోయేవరకూ!

గాఢ నిద్రలో వున్నాడనుకున్న నాన్నగారు గభాల్న లేచి ''వెధవ సంత.. వెధవ సంతాని'' అంటూ పాప వీపు మీద ఒక్కటిచ్చారు. అంతటితో ఆగకుండా శనిగ్రహం అదీ ఇదీ అంటూ సణగడం మొదలుపెట్టారు.

తీరా చూస్తే కిందపడ్డ కళ్లజోడు నిక్షేపంగానే వుంది!

అభం శుభం తెలీని పసిపిల్లను పట్టుకుని అంతంత మాటలు అంటుంటే తను సహించలేకపోయింది.
''ఎందుకు నాన్నా గారూ ఊరికే నోరు పారేసుకుంటారు? దానికేం తెలుసని? అయినా మీ కళ్లజోడు కేం కాలేదుగా?'' అంది ఆక్రోశంగా.

''ఇది పుట్టిన ఘడియే అ లాంటిదమ్మా. నేనేం ఊరికే అనడం లేదు. మూడు పంచాగాలు ముఫ్పైసార్లు తిరగేసి చెప్తున్నాను. దీనంత నష్ట జాతకురాలు ఈ లోకంలో ఎవత్తీ వుండదు'' అంటూ ఏదేదో వాగారు.

ఆ క్షణంలో ఇంట్లో వున్న పంచాంగం పుస్తకాలన్నీ కుప్పపోసి తగలేద్దామా అన్నంత కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా గుడ్ల నీరు కక్కుకుంటూ దొడ్లోకి పారిపోయి వచ్చేసింది.

కొద్ది రోజుల కిందట ఆయన చేసిన గాయం ఇంకా పచ్చిగానే వుంది అప్పుడే ఇది మరో గాయం!

ఆ రోజు భవిత పేరిట అర్చన చేయించాలని తను గుడికి వెళ్లింది. భర్త చనిపోయిన తరువాత ఈ ఏడాదికాలంలో తను ఒక్కసారైనా గుడికి వెళ్లలేదు. ఏం మొహం పెట్టుకుని వెళ్తుంది? ఏం కోరిక కోరుకుంటుంది?

నాల్రోజులుగా భవిత జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ తనకి దేవుడు గుర్తుకు రాలేదు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా నాన్న గారు అప్పుడే ఇంట్లోంచి ఏదోపనిమీద బయటికి వెళ్తున్నారు. తను ఎదురుపడగానే ఒక్కసారి మొహంమీదే ''ఛిఛీ!'' అనేసి గిరుక్కున వెనుతిరిగారాయన.

ఆ పూట తన ప్రయాణమే మానుకున్నారు. ''పైగా అప్పుడే వీధిన పడాలేమిటి? అంతగా నీ కూతురి పేరిట అర్చన చేయించాలనుకుంటే ఎవర్నో ఒకర్ని అడగొచ్చుకదా. నువ్వే వెళ్లాలా?'' అంటూ నానామాటలన్నారు.

తను నిర్ఘాంతపోయింది.

ఒకప్పుడు ఏ పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చినా అక్కయ్యల్ని కాదని ఎక్కడున్నా తననే ఎదురు రమ్మనేవారాయన. తను వచ్చే వరకూ ఎదురుచూస్తూ కూచునే వారు?! అట్లాంటి నాన్నగారికి కూడా ఇవాళ తను అపశకున పక్షి అయిపోయిందా?

ఎంత కుమిలిపోయిందో తను ఆరోజంతా!

తన భర్త భానుమూర్తికి ఇట్లాంటి నమ్మకాలేమీ లేవు. పూజా పునస్కారాలు కూడా ఏమీ చేసేవారు కాదు. పెళ్లయిన కొత్తలో వీలు చిక్కినప్పుడల్లా నాన్న గారి మూఢనమ్మకాలనీ, శకునాలనీ, జోస్యాలనీ అవహేళనచేసేవారు. ''సీతారామయ్య కూతురిగా కాదు భానుమూర్తి భార్యగా ఆలోచించడం అ లవాటు చేసుకో భవానీ'' అంటూ కవ్వించే వాడు. తనకప్పుడు ఆయన మీద ఎంత కోపం వచ్చేదో. ఒక పూటంతా మాటలు మానేసేది. ఎందుకంటే నాన్న గారి కున్న నమ్మకాలన్నీ తనకూ వుండేవి మరి.

ఇప్పుడు ఆలోచిస్తుంటే తన భర్త ఆలోచనలే కరెక్టు అనిపిస్తోంది. ఇవన్నీ అర్థం లేని మూఢనమ్మకాలే అనిపిస్తోంది. తన భర్త భావాల ఔన్నత్యాన్ని ఆయన బతికున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ అర్థం చేసుకోగలుగుతోంది తను.

ఒకసారి పండక్కి పుట్టింటికి వచ్చి తామిద్దరం తిరుగు ప్రయాణం అవుతున్నాం. భానుమూర్తి సూట్‌కేసు పట్టుకుని నాన్నగారితో ''వస్తాం మామయ్యా'' అని చెప్పి ముందుకు కదిలారు. తనూ అమ్మానాన్నల వద్ద సెలవు తీసుకుని ఆయనను అనుసరించింది. కానీ అంతలో నాన్నగారు ఒక్కసారిగా ''ఆగండాగండి'' అంటూ అరిచారు. ''వెధవ ముండ ఎదురొస్తోంది. ఒక నిమిషం కూచుని వెళ్లండి'' అన్నారు.

చూస్తే వీధిలోంచి దూరంగా గంగాభాగీరధీ సమానురాలైన పక్కింటి వెంకాయమ్మ ఇటువేపే వస్తోంది.
సీతారామయ్య మాటల్ని భానుమూర్తి ఖాతరు చేయలేదు.

''నాన్నగారు పిలుస్తున్నారు వెనక్కొచ్చేయండి'' అంది తను. ఆయన చిరాకు పడిపోతూ ''ఏంటా మూఢనమ్మకాలు? నోర్మూసుకుని వచ్చేయ్‌'' అంటూ ముందుకు సాగారు. తను నిస్సహాయంగా భర్తను అనుసరించక తప్పలేదు.

అప్పుడు తన మాట కాదన్నందుకు నాన్నగారు ఎంత బాధపడిపోయి వుంటారో అని ఆలోచించిందే తప్ప- భర్త అన్నట్టు అ లా చేస్తే వెంకాయమ్మ మనసు ఎంత కుమిలిపోయి వుండేదో అని ఆలోచించలేదు.

ఇవాళ నాన్నగారు తనని కూడా ఆరోజు వెంకాయమ్మని చూసినట్టు చూస్తే తప్ప తన కళ్లు తెరుచుకోలేదు.

భానుమూర్తికి జాతకాలమీదా, జోస్యాల మీదా ఏమాత్రం నమ్మకం వుండేది కాదు. నాన్నగారిని ఏవిషయంలోనూ సంప్రదించేవాడు కాదు. ఆయన ఏం చెప్పబోయినా వినిపించుకునేవాడూ కాదు.

''అంతా నుదుటి రాత ప్రకారమే జరుగుతుందని అనుకున్నప్పుడు ... ఆ రాత గురించి తెలుసుకోడానికి ప్రయత్నించడంవల్ల ఏమిటి ఉపయోగం? తలరాతల్ని మార్చడం ఎవరితరమైనా అవుతుందా? ఏంటీ పిచ్చి నమ్మకాలు?'' అని తనతో వాదించేవారు.

అయినే సరే ఆయనకి తెలియకుండా ఆయన పుట్టిన తేదీ, సమయమూ కనుక్కుని నాన్నగారికి అందించింది. నాన్నగారు అతి కష్టం మీద పాత పంచాంగాన్ని సేకరించి మరీ ఆయన జాతకం చూశారు.

భానుమూర్తిది మహర్జాతకమట. జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారట. త్వరలో ఆఫీసరు అయ్యే యోగం వుందట. ఎంతో డబ్బు సంపాదిస్తాడట కానీ ఆయన చేతిలో డబ్బు నిలవదట. రెండు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఖర్చు చేస్తాడట.

తను ఉత్సాహంగా నాన్నగారు చెప్పిన జాతకం గురించి చెప్పబోతే భర్త ఎంత తేలిగ్గా కొట్టి పాడేశారో.

''ఇట్లాంటి జాతకాలు నాకే కాదు మన సమాజంలో నూటికి తొంభై మందికి సరిగ్గా అతికినట్టు సరిపోతాయి భవానీ. మన జీతభత్యాలు పెరుగుతున్న జీవన ప్రమాణాలకు, అవసరాలకు అనుగుణంగా లేవు. ఒకప్పుడు కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే చాలు పదిమంది కూర్చుని తినగలిగే వారు. కానీ ఇప్పుడు ఒక జీతం మీద ఇద్దరు కూడా సరిగా బతకలేక పోతున్నారు. ధరలు గుర్రాల మీదా జీతాలు గాడిదల మీదా దౌడు చేస్తున్నాయి మరి'' అంటూ తనకు క్లాసు తీసుకున్నారు.

''ఈయనెప్పుడూ ఇంతే'' అని విసుక్కుందే తప్ప ఆ మాటల లోతును అర్థం చేసుకోవాలని ప్రయత్నించలేదు తను.

తన భర్త గొప్పవాడవుతాడు. దుబారా ఖర్చు మాట ఎలా వున్నా బాగా సంపాదిస్తాడు కదా అని పొంగిపోయింది.

తన కలల వంతెన కూలిపోయినప్పుడు కానీ నాన్నగారు చెప్పిన జోస్యంలోని డొల్లతనం బోధపడలేదు.

''పిల్లలు పుట్టిన వేళావిశేషాన్ని బట్టి ఒకోసారి మన జాతకాలు తారుమారవుతాయమ్మా. దీని కంతటికీ కారణం నీ కూతురే...'' అంటూ ఎదో వివరించబోయినప్పుడు తను భగ్గున మండిపోయింది. అప్పటినుంచీ ''తన కూతురు నష్టజాతకురాలనీ, పుడుతూనే తండ్రిని పొట్టనపెట్టుకుందని'' ఎవరైనా అంటే సహించలేకపోతోంది. జాతకాలంటేనే ఏవగింపు కలుగుతోందిప్పుడు. ఆ మాటలు తనను నిలువునా రంపపు కోత కోస్తున్నాయి.

''మీకో మీ జోస్యాలకూ, మీ జాతకాలకూ ఓ నమస్కారం మా మానాన మమ్మల్ని ఇలా బతకనీయండి'' అని అరవాలనిపిస్తోంది.

ఎంత మార్పు. ఈ మార్పును తనలో తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించేవాడో భానుమూర్తి.

ఆడపిల్ల పెద్ద మనిషి అయితే చాలు ఇహ గడపదాటి వీధిలో అడుగుపెట్టకూడదు అరిష్టం అనేది నాన్నగారి సిద్ధాంతం. అందుకే తన ముగ్గురి అక్కయ్యలతో పాటు తన చదువూ ఏడో తరగతి దాటి ముందుకు సాగలేదు.

''కూతుళ్లంటే సీతారామయ్య గారి కూతుళ్లేనమ్మా. అసలు ఇంట్లో వున్నట్టే తెలియదు'' అని ఎవరైనా అంటూంటే ఎంత పొంగిపోతారో నాన్నగారు. పై చదువులకు వెళ్లి తప్పటడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకున్న ఆడపిల్లల ఉదంతాలు విన్నప్పుడు నాన్నగారి పాలసీయే రైటు అనితృప్తిపడేది తను.

''మీ నాన్న ఉత్త మూర్ఖుడు భవానీ. వెయ్యేళ్ల కిందట పుట్టవలసినవాడు.'' అని భర్త నిందిస్తుంటే భరించలేకపోయేది. ''ఆడ పిల్లల్ని కూడా మగ పిల్లల్లాగే పెంచాలి. అసలు ఆడామగా తేడానే తెలియనివ్వకూడదు పిల్లలకి. చదువు అందరికీ తప్పనిసరి. తప్పు చేస్తారేమో, అన్యాయమైపోతారేమో అనే భయంతో గదిలో బంధించడం కాదు... ఏది తప్పో ఏది ఒప్పో వాళ్లే స్వయంగా గ్రహించేలా చేయాలి'' అనేవాడు భానుమూర్తి.

చలం రాసిన ''బిడ్డల శిక్షణ'' యిచ్చి పదే పదే చదవమని తనని ఒత్తిడి చేసేవారు.

తనను మానసికంగా ఎదగకుండా చేశారని నాన్నగారి మీద ఎంత కసో ఆయనకి. అట్లాగే మిగతా అ ల్లుళ్లలాగా తన మాటలనీ, జాతకాలనీ గౌరవించడం లేదని నాన్నగారికి కూడా భానుమూర్తి మీద కినుక వుండేది.

అటు తండ్రి మార్గం అనుసరించాలో, ఇటు భర్త మార్గం అనుసరించాలో తెలీక సతమతమైపోతుండేది
తను. ఉత్తరోత్తరా తండ్రి పక్షమే వహించేది.

కానీ ఇప్పుడు ...

చేయి పట్టుకుని నడిపించేందుకు భర్త లేడు.

తండ్రి అవాక్కులని వేద వాక్యాల్లా భావించే స్థితిలో తను లేదు.

''భవానీ... భవానీ...!'' తల్లి రాఘవమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిందామె.

''ఏమిటే ఇది? ప్రతి చిన్న విషయానికీ నువ్విట్లా కుమిలిపోతూ కూచోడం బాగాలేదమ్మా'' అంది రాఘవమ్మ.

''నా కూతుర్ని పదే పదే శనిగ్రహం, నష్ట జాతకురాలు అని తిట్టడం, నన్ను అపశకునపక్షిలా చీదరించుకోవడం నీకు చిన్న విషయాల్లా కనిపిస్తున్నాయా అమ్మా?'' ఆక్రోశంగా అడిగింది భవాని.



''అబ్బబ్బ. నీతో ఏం మాట్లాడాలన్నా కష్టమేనే. నాన్నగారి తత్వమే అంతకదా. నీకేమైనా కొత్తా ఏమిటి? ఆయన మాటల్ని ఎందుకంత పట్టించుకుంటావు? ముందు ఏదోఒకటి అనేయడం ఆ తరువాత బాధపడటం ఆయనకలవాటు. అదిగో పిలుస్తున్నారు వెళ్లు'' అంటూ కూతుర్ని లేపి అంట్ల ముందు తను కూర్చుంది రాఘవమ్మ.

ఇష్టం లేకపోయినా భవితను భుజాన వేసుకుని తండ్రి గదిలోకి వెళ్లింది భవాని.

''బాధ పడుతున్నావుట. అమ్మ చెప్పింది. నేను అనాలని అనలేదు చిన్నీ. ఏదో కోపంలో వచ్చేశాయి'' అనునయంగా అన్నారు సీతారామయ్య.

భవానీ ఏం మాట్లాడలేదు.

''ఏం విఘ్నేశ్వరీ దేవీ నీక్కూడా కోపమొచ్చిందా ఈ తాతయ్య మీద?'' అంటూ మనవరాల్ని మాటల్తో ప్రసన్నం చేసుకోబోయారాయన.

భవిత చుర చురా చూస్తూ ''నాపేరు విగ్గేశ్వరి కాదు బవిత'' అంది.

''అబ్బో'' అని ఊరుకున్నారు సీతారామయ్య. మరో సందర్భంలో అయితే వాదనకు దిగేవారే ఆయన.

పాపకు ఆయన సూచించిన పేరు విఘ్నేశ్వరి. జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ పేరు పెడితేనే మంచిదని ఆయన ఖరాకండీగా చెప్పారు. కానీ భానుమూర్తి అందుకు ఒప్పుకోలేదు. తమ ఇద్దరి పేర్లకు సరిపోయేలా భవిత అని తనే పేరు పెట్టాడు. పాప భవిష్యత్తు గురించి ఆయనకి ఎన్నో ఆలోచనలుండేవి.

మొదట్లో భవిత అన్న పేరు తనకీ ఇష్టమనిపించేది కాదు. కానీ రాను రాను అదే అ లవాటైపోయింది. అయితే పుట్టింట్లో మాత్రం నాన్నగారితో పాటు అందరూ పాపని విఘ్నేశ్వరీ అనే పిలుస్తుంటారు. ఆ సంబోధన చెవినపడితే సహించలేకపోయేవారు భానుమూర్తి.

''నాపేరు విగ్గేశ్వరి కాదు బవిత'' అని కూతురు అరిచేసరికి అదంతా గుర్తుకొచ్చింది భవానీకి. ప్రేమగా కూతురి బుగ్గ గిల్లింది.

వాతావరణం కాస్త తేలికపడ్డట్టయింది.

''చిన్నీ, ఈ కాగితాల మీద సంతకం పెట్టివ్వమ్మా'' అన్నారు సీతారామయ్య.

''ఏం కాగితాలు నాన్నగారూ'' పాపను దించి కాగితాలను అందుకుంటూ అడిగింది భవాని.

''ఆస్తిలో భాగం పంచివ్వమని మీ మామగారికి పంపే పార్టిషన్‌ నోటీసు.'' అన్నారాయన.

భవానీ చప్పున ఆ కాగితాలని తండ్రికి తిరిగి అందించి ''నేను వద్దని అప్పుడే చెప్పాను కదా నాన్నగారూ. ఆయన పోయి ఏడాది కాలేదు అప్పుడే ఆస్తిలో వాటా కోసం దావా వేయాలా?''అంది.

సమాధానం కోసం ఎదురుచూడకుండా కూతుర్ని ఎత్తుకుని వేరే గదిలోకి విసవిసా వెళ్లిపోయింది.

అహం దెబ్బతిన్న సీతారామయ్య ''మాట్లాడుతుంటే అ లా వెళ్లిపోతావేమిటే తలతిక్కా?'' అంటూ తిరిగి తన సహజ ధోరణిలోకి వెళ్లిపోయారు.

భవానీకి మళ్లీ దుఃఖం తెర్లుకొచ్చింది.

పుట్టింటి కంటే మెట్టినిల్లే కాస్త మెరుగేమో అనుకుంది ఒక్క క్షణం. కానీ అంతలోనే అక్కడ జరిగిన అవమానాలు గుర్తుకొచ్చాయి.

తమ పెళ్లయిన నెెల రోజులకే భానుమూర్తికి హైదరాబాదుకు బదిలీ అయింది. తనే కావాలనే హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నానని చెప్పాడు భానుమూర్తి.

''ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వుండవనీ, అడుగడుగునా ఆంక్షల్ని తను తట్టుకోలేడనీ, తన మనస్తత్వానికి అది సరిపడదనీ'' చెప్పాడు భానుమూర్తి.

ఆ ఇంట్లో భానుమూర్తే చిన్నవాడు. ఇద్దరు అన్నయ్యలూ వ్యవసాయం చేసేవారు. భానుమూర్తి ఒక్కడే ఉద్యోగం చేసేవాడు. తోటి కోడళ్లు ఎప్పుడూ ఒకరిమీద ఒకరు చెవులు కొరుక్కునేవారు. వాళ్ల పిల్లలు కూడా ఎప్పుడూ పరస్పరం పోట్లాడుకుంటూ చాడీలు చెప్పుకుంటూ రభస సృష్టించేవారు. తను కాసేపు ఖాళీగా కూర్చుంటే అత్తగారు ఓర్చుకోలేక పోయేది. అయినా అక్కడ వున్నన్ని రోజులూ ఎవరూ వేలెత్తి చూపకుండా జాగ్రత్తపడుతూ అన్నిటికీ సర్దుకుపోతూ గడిపింది తను. అయినా తన పోరువల్లే భానుమూర్తి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడని ఆడిపోసుకున్నారు అందరూ.


హైదరాబాద్‌లో కొత్త కాపురం మొదలుపెట్టిన తరువాత కానీ తనకి అసలు ప్రపంచం అంటే ఏమిటో, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అంటే ఎమిటో తెలియలేదు.

కొత్తలో భానుమూర్తి ఆఫీసుకు వెళ్లేక బిక్కుబిక్కు మంటూ ఒంటరిగా గడపడం ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇరుగూ పొరుగు వాళ్లతో స్నేహం ఏర్పడ్డాక అ లవాటైపోయింది.

అట్లా నెల రోజులు గడిచాయో లేదో తనని ప్రైవేటుగా ఎస్‌ఎస్‌సి పరీక్ష రాయమంటూ పోరడం మొదలుపెట్టాడు భర్త. ''బాబోయ్‌ ఈ వయసులో మళ్లీ చదువేమిట''ి తనవల్ల కాదు అని ఎంత అభ్యంతరపెట్టబోయినా ఆయన వినిపించుకోలేదు. అదేవీధిలో వున్న ట్యుటోరియల్‌ కాలేజీలో బలవంతంగా చేర్పించాడు. మొదట్లో ఎంత సిగ్గుగా వుండేదో. అంతా తనని చూసి నవ్వుకుంటారని ఊహించుకునేది. కానీ అసలు ఒకరి గురించి ఒకరు పట్టించుకునే తీరికెవరికుంటుంది పట్నంలో. పైగా తనలాగే చదవుకునే పెద్దవాళ్లు అక్కడ మరికొందరు కూడా కనిపించేసరికి ఎంతో ధైర్యం వచ్చింది. ఆ తరువాత భర్త మాటలతో పట్టుదల పెరిగింది.

అంతే ఆశ్చర్యంగా మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్‌సి అన్ని సబ్జెక్టుల్లోనూ పాసైంది తను. ఆ తరువాత టైపు కూడా నేర్చుకుంది.

పెళ్లయిన తరువాత రెండేళ్ల పాటు భర్త కోరిక మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేవాళ్లు. ఆ రోజులు ఎంత మధురంగా వుండేవో. భానుమూర్తి తన పట్ల చూపిన ప్రేమానురాగాలు అనుభవిస్తున్నప్పటికంటే ఇప్పుడు ఎంతో గొప్పగా అనిపిస్తున్నాయి. అప్పుడు అదంతా సర్వసాధారణమైన విషయంగానే అనుకుంది తను. ఇప్పుడు మనుషుల్ని తరచి చూడటం అ లవాటైన తరువాత గానీ తన భర్త వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలీడంలేదు.

మూడేళ్ల కాపురంలో మూడు జన్మలకు సరిపడేంత తీయని అనుభూతుల్ని మిగిల్చి వెళ్లాడు భానుమూర్తి.

దేవుడ్నీ దయ్యాలనీ నమ్మడన్న ఒక్క విషయం తప్ప ఆయనలో అన్నీ గొప్పగుణాలే. ఆయన కూడా తనలాగే దేవుడికి దండం పెట్టుకుంటే మరింత బాగుండేది కదా అనిమాత్రం అప్పుడప్పుడూ అనుకునేది. అయితే తనను దండం పెట్టుకోవద్దని మాత్రం ఆయన ఎన్నడూ ఆంక్షలు విధించలేదు. ప్రసాదం ఇస్తే తన తృప్తికోసం చక్కగా కళ్లకద్దుకుని తినేవాడు. పండగలప్పుడు వద్దనకుండా హారతి కూడా తీసుకునేవాడు.

ఆ రోజు ...

ఆఫీసు నుంచి ఇంటికొస్తూ స్కూటర్‌ ఏక్సిడెంటుకు గురై ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా తన గురించీ, తమ బిడ్డ గురించీ ఎంతగా పరితపించాడో... కేవలం తమకోసం మృత్యువును జయించేందుకు ఆయన విఫలయత్నం చేశాడు. అది తలచుకుంటే కన్నీళ్లు ఆగలేదు భవానీకి.

ఏదో ఒకరోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసేమో. అందుకే తన చదువు పట్ల అంతగా పట్టుపట్టాడేమో.

భర్త చనిపోయిన తరువాత హైదరాబాద్‌ నుంచి మకాం ఎత్తేసి నెల రోజుల పాటు అత్తవారింట్లో వుంది భవాని. కానీ అందరూ భర్త చావుకి తనే కారకురాలన్నట్టుగా ఆడిపోసుకోవడం. భానుమూర్తిని తనే బలవంతంగా బదిలీచేయించి పచ్చని ఉమ్మడి కుటుంబంలో చిచ్చుపెట్టినట్టు అందుకు తగిన శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నట్టు సూటిపోటి మాటలు అనడం తను భరించలేకపోయింది. ఆ ఇంట్లో తనకు ఏ ఒక్కరితో కూడా ఆత్మీయ అనుబంధం ఏర్పడలేదు. అందుకే అక్కడ ఉండలేకపోయింది.

పుట్టింటికి వస్తే మాత్రం తన సమస్య తీరిందా? లేదు. ఒకప్పుడు పంచవటిలా కనిపించిన ఇల్లు ఇప్పుడు పంజరంలా అనిపిస్తోంది.

నాన్నగారికి తన మీద కంటే తన వెంట వచ్చిన, రాబోతున్న ఆస్తి మీదే ప్రేమ ఎక్కువ అని ఇట్టే గ్రహించింది భవాని. భర్త ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాచ్యుటీ డబ్బు మీద అడగకుండా ఆయనే పెత్తనం చెలాయిస్తున్నారు. పనీపాటా లేని అన్నయ్య చేత వ్యాపారం పెట్టించడానికని యధేచ్చగా ఆ డబ్బుని వాడేస్తున్నారు. కాకపోతే ఆ వ్యాపారానికి భవానీ అన్న పేరు పెట్టి తనను మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేమో భర్త ఆస్తిలో వాటాకోసం దావా వేసి మరింత డబ్బును కూడగట్టాలని పథకం వేశారు.

ఛీ ఛీ ఏం మనుషులు? వీళ్ల మధ్య తన శేష జీవితం ఎలా గడుస్తుంది? తన బిడ్డ భవిష్యత్తు ఎలా భద్రంగా వుంటుంది?

భవానీ ఒక స్థిర నిశ్చయానికొచ్చేసింది. తన భర్త చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చిన ఆఫీసర్‌ గుర్తుకొచ్చాడు. ''అమ్మా నువ్వు ఉద్యోగం చెయ్యాలనుకుంటే మా ఆఫీసులో నీ భర్త స్థానం ఎప్పుడూ నీకోసం ఖాళీగా వుంటుందమ్మా. పరిస్థితులు నెమ్మదించాక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా'' అన్నాడాయన.

భర్త బలవంతంమీద టెంత్‌ పరీక్ష రాయడం, టైపు నేర్చుకోవడం ఎంత మేలైందో. ఇందుకే అప్పుడాయన అంత పట్టుపట్టి తనచేత చదివించాడేమో.

భవానీకి ఒక్కసారిగా ఎక్కడలేని ధైర్యం, శక్తీ వచ్చినట్టనిపించాయి.

బాల్యంలో తండ్రి చాటున, యవ్వనంలో భర్త చాటున, వృద్ధాప్యంలో కొడుకు చాటున అణిగిమణిగి వుండాలే తప్ప ఆడది స్వేచ్ఛగా ఎదిగేందుకు వీల్లేదు అన్న తండ్రి తాలూకు భావజాలం పట్టునుంచి ఆమె పూర్తిగా బయటపడింది.

''నాకు ఇంకా ఈ కేరాఫ్‌ బతుకు అక్కరలేదు. నా కాళ్ల మీద నేను నిలబడతాను. నాకంటూ ఒక సొంత చిరునామాను ఏర్పరచుకుంటాను. నా బిడ్డను భానుమూర్తి భావాలకు అనుగుణంగా పెంచి పెద్ద చేస్తాను'' స్థిరంగా అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది భవానీ.





( ఆంధ్రప్రభ అనుబంధం మహిళ 02 మార్చి 1995 సంచికలో ప్రచురించబడిన కథ )


...........

Monday, April 27, 2009

ప్రేమిస్తే పెళ్లవుతుందా?







ప్రేమిస్తే పెళ్లవుతుందా?
కథ


''ఎక్కడికే ముస్తాబవుతున్నావు?'' జడవేసుకుంటున్న కూతుర్ని కటువుగా ప్రశ్ని�ంచింది పార్వతి.

''కాలేజీకి'' నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది సౌమ్య.

''ఏమిటా తలబిరుసు? ఇవాళ పెళ్లివస్తున్నారు, కాలేజీకి సెలవుపెట్టమని చెప్పలేదూ?!''

''....''

''ఏం మాట్లాడవేం?''

''అబ్బబ్బబ్బ... చంపకమ్మా నన్ను...! ఆ బేరగాళ్లు వచ్చేది సాయంత్రం కదా. అంతవరకూ ఊరికే ఇంట్లో కూర్చునుండటం దేనికి? సాయంత్రం త్వరగా వస్తాలే!''

''చదవేస్తే వున్న మతి పోయినట్టు... పెళ్లి చూపులకు వచ్చే వాళ్లని పట్టుకుని బేరగాళ్లంటావేమిటే?''

''కాకపోతే ఏమిటి? వస్తువుల్నో, జంతువుల్నో పరీక్షించినట్టు పరీక్షించడం... ఆతరువాత కట్నకానుకలంటూ బేరమాడటం ... ఇంతేకదా పెళ్లి చూపులంటే...''

పక్క గదిలోంచి తల్లీ కూతుళ్ల సంభాషణని వింటున్న నారాయణరావు మధ్యలో కల్పించుకుని ''పార్వతీ! అమ్మాయిని కాలేజీకి వెళ్లనివ్వు. సాయంత్రం త్వరగానే వస్తానంటోందిగా!'' అన్నాడు.

పార్వతి విసురుగా భర్తముందుకు వచ్చి ''మీరిట్లా ప్రతిదానికీ వెనకేసుకొస్తుండబట్టే అది రోజురోజుకూ మొండిగా తయారవుతోంది. ఆడపిల్లకు అణకువ నేర్పకపోతే తండ్రినేమీ అనరండీ... కన్న తల్లిని నన్నాడిపోసుకుంటారు!'' తన ఉక్రోషాన్ని వెళ్లగక్కి కోపంగా వంటింట్లోకి వెళ్లిపోయింది పార్వతి.

తండ్రికి కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోంచి బయటపడింది సౌమ్య.

సౌమ్యకి తమ ఇంటి పరిస్థితులు బాగా తెలుసు. తండ్రి రిటైరైన బడిపంతులు. ఆయన కొచ్చే పెన్షన్‌ డబ్బు, ఆయన చెప్పే టూషన్లు తప్ప వేరే ఆదాయం ఏమీ లేదు. అప్పటికే ఇద్దరు అక్కయ్యల పెళ్లిళ్లు చేసివుండటంతో వున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులూ తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకా తనూ తన చెల్లెలూ పెళ్లికెదిగి వున్నారు.

చెల్లెలికి మేనరికం వుంది కాబట్టి పెద్ద సమస్యకాదు. అయితే ఎలాగూ పెళ్లి చేసుకో బోతున్నాం కదా అని తొందరపడటంతో చెల్లెలికి నెలతప్పి తన ప్రాణం మీదకు వచ్చింది. చెల్లెలికి పెళ్లి చేయాలంటే ముందు తనకి పెళ్లి చేయాలి. అందుకే ఈ గొడవ. ఈ హడావిడి.

తనేమో తన క్లాస్‌ మేట్‌ రమేష్‌ని ప్రేమిస్తోంది. పెద్దలతో చెబుదామంటే తమ ఇద్దరి కులాలూ వేరు. పెద్దలు కులాంతర వివాహాలకి ఎప్పుడూ వ్యతిరేకమే కదా!

అందుకే చదువు పూర్తయ్యేవరకూ బయటపడకుండా ఆగాలనుకున్నారు. స్వంత కాళ్లమీద నిలబడగల ఆర్థిక స్థోమత వుంటే ఈ కులగోత్రాలూ, కట్టుబాట్లూ ఏమీ చేయలేవు.

కానీ...

చెల్లెలు చేసిన పని తన భవిష్యత్తును అయోమయంలో పడవేసింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. తను కాలేజీకి బయలుదేరింది కూడా అందుకే. వారం రోజులుగా రమేష్‌ కనిపించడం లేదు. ఇవాళైనా కనిపిస్తాడో లేదో. ఎలాగైనా తనని కలిసి అర్జంటుగా మాట్లాడాలి.

పరిపరివిధాల ఆలోచిస్తూ వెళ్తున్న సౌమ్యకి రిక్షాలో వెళ్తున్న రమేష్‌ కనిపించాడు!
వెదకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో.

రమేష్‌ పక్కన మరెవరో కూర్చుని వున్నారు. అయినా లక్ష్యపెట్టకుండా ''రమేష్‌... రమేష్‌...'' అని పిలుస్తూ రిక్షా వేపు వడివడిగా నడిచింది.

ఆమె కేకలకు రిక్షాలో కూర్చున్న ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. కొంచెం దూరం వెళ్లి ఆగింది రిక్షా. అందులోంచి రమేష్‌ ఒక్క ఉదుటున దిగి దూకుడుగా సౌమ్యవైపు వచ్చాడు .

''ఏంటి? నడిరోడ్డు మీద ఈ గావుకేకలేంటి? ఆ..'' కళ్లెర్ర జేస్తూ ఉరిమినట్టు అన్నాడతను.

అతని అకారణ కోపానికి ఒక క్షణం నిర్ఘాంతపోయింది సౌమ్య. ''అది కాదు రమేష్‌...నేనూ... నాకూ ...ఏం చెప్పాలో తోచక తత్తరపడింది.

''చాల్లే... రోడ్డు మీద ఏమిటీ న్యూసెన్స్‌. నా పక్కన కూర్చున్నది మా నాన్నగారు. రేపు సాయంత్రం పార్కులో మాట్లాడుకుందాం. ఇప్పుడేమీ యాగీ చేయకు. వస్తా...''అని వచ్చినంత దూకుడుగా వెళ్లిపోయాడు రమేష్‌.

చాలాసేపు చేష్టలుడిగిన దాన్లా రోడ్డుమీద అట్లాగే నించుండి పోయింది. ఆ తరువాత కాలేజీకి వెళ్లకుండా ఇంటిముఖం పట్టింది.

ఆ రోజు సాయంత్రం యధావిధిగా పెళ్లి చూపుల తతంగం జరిగింది.

అబ్బాయి పేరు శ్రీకాంత్‌. పట్నంలో బ్యాంకు ఆపీసర్‌గా పనిచేస్తున్నాడట. సౌమ్య నిర్లిప్తంగా చూసింది అతనివేపు. 'బాగానే వున్నాడు' అనుకుంది. కానీ ఆమె మనసంతా రమేషే మెదలసాగాడు.

శ్రీకాంత్‌కి సౌమ్య నచ్చింది. సౌమ్య నమ్మకాలకి విరుద్ధంగా కట్నకానుకలేమీ వద్దన్నాడు. పైగా పెళ్లి కూడా ఆడంబరాలు లేకుండా సింపుల్‌గా జరగాలన్నాడు. సంబంధం ఖాయమైనట్టే.

సౌమ్య తల్లిదండ్రుల సంతోషానికి అంతేలేదు.

''ఏమ్మా అబ్బాయి నీకు నచ్చినట్టేనా?'' యదాలాపంగా అడిగాడు సౌమ్య తండ్రి. ఔననీ కాదనీ స్పష్టం చేయనట్టు నిర్లిప్తంగా తల ఊపింది సౌమ్య.

ఈ సంబంధం తప్పి పోవాలని ఆమె మనసంతా తహతహలాడింది. ఈ పెళ్లి ఉచ్చులోంచి ఎలాగైనా బయటపడాలి. రమేష్‌ని కలిసి అర్జంటుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతులేని సంఘర్షణ. చివరగా ఆమెకో ఆలోచన తట్టింది. వెంటనే కలం తీసుకుని ఇలా రాసింది:

డియర్‌ ఫ్రండ్‌
సౌమ్యని వివాహం చేసుకుంటే దగా పడతావు. సౌమ్య క్యారెక్టర్‌ మంచిది కాదు. ఆమె పేరూ ఆమె క్లాస్‌మేట్‌ రమేష్‌ పేరూ కాలేజి గోడల మీదకెక్కాయి. ఆ తర్వాత మీ ఇష్టం...
ఇట్లు
మీ శ్రేయోభిలాషి

ఎవ్వరి కంటా పడకుండా పక్కింటి అబ్బాయి చేత ఆ ఆకాశరామన్న ఉత్తరాన్ని పెళ్లి చూపులు ముగించుకుని వెళ్తున్న శ్రీకాంత్‌కు అందేట్టు చేసింది. దాంతో ఇక గ,డం గడిచినట్టే షని హాయిగా ఊపిరి పీల్చుకుంది.

మర్నాడు సాయంత్రం ముందు అనుకున్నట్టుగా తనూ, రమేష్‌ తరచూ కలుసుకునే పార్క్‌కు వెళ్లి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది సౌమ్య.

కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేందుకు తను చేసిన పనిని గురించి చెప్తే అతను అర్థం చేసుకుంటాడనీ, హర్షిస్తాడనీ అనుకుంది. తాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోక తప్పదని ఒప్పించాలి. పెళ్లి చేసుకున్నా చదువు పూర్తయి ఉద్యోగం దొరికే వరకు కాపురం పెట్టకుండా ఎవరింట్లో వాళ్లు వుండేట్లు ఒప్పందం కుదుర్చుకోవాలి అని ఏవేవో ఊహించుకోసాగింది.

అప్పటికే చీకటి పడిపోయింది. పార్కులో ఎప్పుడో లైట్లు వెలిగాయి. జనం పలచబడ్డారు. ఆమెలో ఆందోళన మొదలయింది.

అంతలో పక్కన ఎవరిదో నీడ పడేసరికి ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది.

వచ్చింది రమేష్‌ కాదు, శ్రీకాంత్‌.

అదిరిపోయింది సౌమ్య.

''రమేష్‌ కోసం ఎదురు చూస్తున్నారా?'' అడిగాడు శ్రీకాంత్‌.

ఆ ప్రశ్నకి మరింత బిత్తరపోయిందామె.

''నేను రమేష్‌ ఇంటి దగ్గరనుంచే వస్తున్నాను. ఎవరో రాసిన ఆకాశ రామన్న ఉత్తరం చూసి నిజమేమిటో తెలుసుకుందామని వాళ్లింటికి వెళ్లాను. అతణ్ని కలిసి మాట్లాడాను. ఈ ఆదివారమే అతని పెళ్లి. చాలా బిజీగా వున్నాడు. ఏదో సరదాకోసం నీతో క్లోజ్‌గా వున్నాడట. కులాంతర వివాహం చేసుకుని కులభ్రష్టుణ్నయ్యే ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నాడు. నువ్విక్కడ తనకోసం వెయిట్‌ చేస్తుంటావని తనే చెప్పాడు. ఇదిగో తన పెళ్లి ఇన్విటేషన్‌ కూడా ఇచ్చాడు.'' అంటూ ఓ శుభ లేఖ అందించాడు శ్రీకాంత్‌.

వణుకుతున్న చేతుల్తో దానిని అందుకుంది సౌమ్య.

అది రమేష్‌ వెడ్డింగ్‌ కార్డే. వధూ వరుల పేర్లతో పాటు అనుమానం లేకుండా వారి ఫొటోలు కూడా అచ్చువేయబడి వున్నాయి.

ఒక్కసారి కళ్లు బైర్లు కమ్మినట్టయింది సౌమ్యకు.

తలవంచుకుని వెళ్లిపోతున్న శ్రీకాంత్‌ని కన్నీటి పొరల్లోంచి అచేతనంగా చూస్తుండిపోయింది.

....



(ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక 07-3-1986 సౌజన్యంతో)





(ఈ కథలోని ప్రధాన సంఘటన నిజంగా జరిగిందే. ఇందులోని 'సౌమ్య' నిజజీవితంలో మరిన్ని విషాద సంఘటనలు తోడై అవివాహితగా వుండిపోయింది. తన పేరూ, నా పేరూ తెలియకుండా వుండేందుకు అప్పుడు ఈ కథను ''అశాంత్‌'' అన్న పేరుతో ఆంధ్ర జ్యోతికి పంపాను. అదే పేరుతో ఇది అచ్చయింది. అశాంత్‌ అన్న కలం పేరుతో మరికొన్ని రచనలు చేశాను కానీ అవేమీ ఇప్పుడు నా దగ్గర లేవు.)

Saturday, April 25, 2009

గుజ్జన గూళ్లు



గుజ్జన గూళ్లు

అశ్వత్థామా హతః కుంజర... అంటూ నిజంలాంటి అబద్ధం చెప్పిం తరువాత ధర్మరాజు కూడా అంత బాధపడివుండడు!

ఎవడో కోన్‌కిస్కాగాడు ఏదో వాగాడన్న ఆవేశంలో అర్థాంగిని అడవికి పంపించిన తరువాత శ్రీరామచంద్రుడు కూడా అంత కుమిలిపోయి వుండడు!!

కానీ, వీర్రాజు మాత్రం తన అనాలోచిత చర్యకి పశ్చాత్తాపంతో నిలువునా దహించుకుపోయేడు. జీవితంలో మొట్టమొదటిసారి తన మీద తనకే అసహ్యం వేసింది.

ఇంట్లో కాలు నిలవక, వికలమైన మనసుతో వీధిన పడ్డాడు. ఒక గమ్యం లేకుండా ఊరంతా తిరిగి తిరిగి చివరకి ఓ సిగరెట్‌ పెట్టె కొనుక్కుని పార్క్‌లో దూరాడు.

అతను సిగరెట్‌ మానేసి ఎనిమిదేళ్లవుతోంది!

అతని కొడుకు సూర్యం వయసు కూడా ఎనిమిదేళ్లే! సూర్యం పుట్టిన కొద్దిరోజులకే వీర్రాజు సిగరెట్‌కి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసేడు.

సిగరెట్‌ కాల్చిన తరువాత చేతులూ నోరూ కడుక్కోకుండా కొడుకుని ముట్టుకోనిచ్చేది కాదు అతని భార్య. ''ముందు నోరు కడుక్కుని రండి. వీడికి సిగరెట్‌ వాసన పడదు.'' అంటూ ఎప్పుడూ అడ్డుకునేదామె.

పెళ్లయిన కొత్తలో భర్త సిగరెట్‌ వ్యసనంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. అయితే, తరవాత్తరవాత అదే అ లవాటైపోయిందామెకు. కానీ, తన కొడుక్కి కూడా పసితనంలోనే ఆ వాసన అ లవాటైతే ఇంకేమైనా వుందా..! తండ్రి కాలేజీ రోజుల్లో ప్రారంభిస్తే... కొడుకు స్కూలు లెవెల్లోనే సిగరెట్‌ కాల్చడం మొదలు పెడతాడు. పాతికేళ్లొచ్చేసరికి వాడి సగం ఊపిరితిత్తులు పాడై పోతాయి. ఇదీ ఆమె భయం.
సిగరెట్‌కంపు కొట్టే పెదాలతో కొడుకు మొహంలో మొహం పెట్టి ముద్దాడాలంటే వీర్రాజుకు కూడా ఇష్టముండేది కాదు. ఎంత పుక్కిలించినా తన నోటినీ, శ్వాసనీ సిగరెట్‌ వాసన పూర్తిగా వదలనట్టే అనిపించేది ఎప్పుడూ.

సిగరెట్‌ పొగ ఎంత హానికరకమో ప్రతి వ్యసనపరుడికీ తెలుసు. అందులోనూ పాసివ్‌ స్మోకింగ్‌ అ లవాటు పసిపిల్లలకు ఎంత ప్రాణాంతకమో వీర్రాజుకు మరింత బాగా తెలుసు. అందుకే సిగరెట్‌ కాల్చినప్పుడు వాడిని దగ్గరకు తీసుకోవాలంటే గిల్టీగా వుండేది. తన దుర లవాటు వల్ల తను ఎంతో మిస్‌ అవుతున్నట్టనిపించేది.

దాంతో వున్నట్టుండి ఒక రోజు తాగుతున్న సిగరెట్‌ని నేలకు విసిరికొట్టి, ఏ జెర్రినో నలిపినట్టు బూటుకాలితో నలిపేసి 'ఇదే ఆఖరు సిగరెట్‌' అని తనకుతనే ప్రకటించుకున్నాడు.
అంతే!

మళ్లీ ఇప్పటివరకూ దాని జోలికెళ్లలేదు. ఎనిమిదేళ్ల తరువాత అతను సిగరెట్‌ కాల్చడం ఇదే ప్రథమం.
''వీర్రాజూ, నువ్వేదో గొప్పోడివనీ, నీకేదో ఆదర్శాలు వున్నాయనీ ఇన్నాళ్లూ భ్రమల్లో వున్నావు గానీ... నువ్వూ అందర్లాటోడివే. నీకూ దిక్కుమాలిన బలహీనతలున్నాయి...'' తన అంతరాత్మ తనని వెక్కిరిస్తున్నట్టనిపించింది. ఆ అంతరాత్మను పొగతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు పార్కులో కూచుని సిగరెట్‌ మీద సిగరెట్‌ కాల్చసాగాడు వీర్రాజు.

'కొత్తగా వచ్చిన ఆఫీసరును తలచుకుంటేనే ఒళ్లు మండిపోతుంది. తనను తానొక జమిందారుగా భావిస్తాడు. డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ బొత్తిగా తెలియదు. తన కింది ఉద్యోగులను బానిసల్లా చూస్తాడు. అతనికి కావలసింది పని కాదు అణిగిమణిగి వుండటం. చెంచాగిరి చేయని వాళ్లంతా శత్రువుల్లా కనిపిస్తారతనకి. '

తన పనేదో తను చేసుకుపోతూ ఆత్మాభిమానంతో బతకాలనుకునే మనస్తత్వం వీర్రాజుది. తమవి పరస్పర విరుద్ధ దృక్పథాలవడం వల్ల తరచూ తమ మధ్య ఘర్షణ చోటుచేసుకుంటోంది. ఆఫీసరు ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి వీర్రాజే మనస్తాపానికి గురికావలసి వస్తోంది.

ఇవాళ తమ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎవరో చేసిన తప్పుకు తనను నిందించబోతే సహించలేక ఎదురు తిరిగాడు. మాటామాటా పెరిగింది. ఆఫీసునుంచి అదే చికాకుతో ఇంటికి వస్తున్న వీర్రాజుకి వాననీటిలో కేరింతలు కొడుతూ ఆడుతున్న కొడుకు కనిపించాడు. వాడి బట్టలే కాదు, పుస్తకాల సంచీ కూడా బురదకొట్టుకు పోయి వుంది. పుస్తకాలు బాగా తడిచిపాడైపోయి వుంటాయి. అదేమీ పట్టించుకోకుండా నీళ్లల్లో ఎగురుతున్నాడు వాడు.

మరొకప్పుడైతే ''ఏం పనిరా కన్నా యిది? పుస్తకాలు తడిస్తే రేపు ఎలా చదువుకుంటావు?'' అంటూ సున్నితంగా మందలించి, మట్టి దులిపి ఆ పుస్తకాల బ్యాగును భుజానికి తగిలించుకుని మరీ ఇంటికి తీసుకెళ్లేవాడు. కానీ, ఆఫీసులో జరిగిన గొడవ కారణంగా మనసంతా రగిలిపోతూ వుండటం వల్ల అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

''సూర్యం...'' గట్టిగా అరిచేడు వీర్రాజు.

ఆ అరుపునకు సూర్యం కన్నా ఇతర పిల్లలే ఎక్కువగా బెదిరిపోయారు. సూర్యం మాత్రం ఎప్పటిలా నవ్వుతూ చూశాడు. తను అంత కోపంగా అరిచినా పట్టించుకోకుండా నవ్వుతూ నించున్న కొడుకులో ఎందుకో ఒక్క క్షణం శాడిస్ట్‌ ఆఫీసర్‌ కనిపించాడు.

అంతే! మరుక్షణంలో సూర్యం చెంప ఛెళ్లుమంది.

ఆ దెబ్బకి సూర్యం అంత దూరం ఎగిరి నీళ్లలో పడ్డాడు. అంతవరకు కొద్దిగానే తడచివున్న అతని బట్టలు, పుస్తకాలు పూర్తిగా తడచిపోయాయి.

అయినా అతని కోపం తగ్గలేదు. కొడుకు చేయిపట్టుకుని విసురుగా లేపి మరి నాలుగు అంటించాడు.
ఆ దృశ్యం గుర్తుకు రాగానే వీర్రాజు మనసు వికలమైపోయింది. ''ఛిఛీ నేను మనిషిని కాను. పశువుని. ఉత్త స్కౌండ్రల్‌ని'' నూరోసారి తనని తాను తిట్టుకుంటూ జుట్టు పీక్కున్నాడు. అప్పటికి సిగరెట్‌ పెట్టె ఖాళీ అయిపోయింది. బాగా పొద్దు పోవడం వల్ల పార్కంతా నిర్మానుష్యంగా మారిపోయింది.
వీర్రాజు నిస్సత్తువగా లేచి తప్పదన్నుట్టు గృహోన్ముఖుడయ్యాడు.

ఇంటిముందు నిలబడి 'సూర్యం' అని పిలువబోయాడు. కానీ ఎందుకో గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. తలుపు తెరిచేది భార్యే అయినా ఎప్పుడూ కొడుకు పేరుతో పిలవడమే అ లవాటతనికి. కొడుకు ఇంట్లో లేని సమయంలో కూడా తనకి బాత్‌రూంలో ఏ సబ్బో, టవలో అవసరమైనప్పుడు సూర్యం అనే కేక వేస్తాడు. ఆ పిలుపు తననుద్దేశించేనని అతని భార్యకు తెలుసు కాబట్టి 'ఆ వస్తున్నానండీ' అంటూ వెంటనే స్పందిస్తూ వుంటుంది. ఇప్పుడు అపరాధ భావనవల్ల అతనికి కొడుకు పేరును ఉచ్ఛరించలేకపోయాడు. తలుపు మీద చేత్తో చిన్నగా శబ్దం మాత్రం చేయగలిగాడు.

ఎప్పుడూ చిరునవ్వుతో స్వాగతం పలికే తన శ్రీమతి చాలా ముభావంగా కనిపించింది.
యాంత్రికంగా బట్టలు మార్చుకుని వచ్చేసరికి టేబుల్‌ మీద భోజనం వడ్డించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లి మంచం మీద వాలిందామె.

ఆ మౌనం తన గాయాన్ని మరింత కెలికినట్టయింది.

''కమలా!'' అసహనంగా పిలిచాడు.

ఆమె పలకలేదు.

''నిన్నే'' తిరిగి రెట్టించేడు.

''ఉ'' సన్నగా మూలిగినట్టంది.

''నువ్వు వడ్డించుకోలేదేం?''

''.......''

''మాట్లాడవేం?''

''నేను తినేశాను!''

''ఎప్పుడు?''

''ఇందాకే!''

''ఈ అబద్ధాలు ఎప్పటినుంచి?''

మళ్లీ మౌనం.

ఆమె తినలేదని వీర్రాజుకి తెలుసు. ఆ విషయం అతనికి తెలుసని ఆమెకూ తెలుసు.
పెళ్లయి పదేళ్లు కావస్తున్నా ఆమె ఏ రోజూ భర్తకంటే ముందు ఒంటరిగా భోంచేసి ఎరగదు. ఆమె కదో సెంటిమెంటు.

ఇంట్లో భార్య ఆకలితో తన రాక కోసం ఎదురు చూస్తూ వుంటుందన్న స్పృహ లేకపోతే భర్తలు మరీ బొత్తిగా అదుపులో వుండరని చాలా మంది ఆడవాళ్ల లాగే ఆమె కూడా నమ్ముతుంది.

అయితే ఏ వ్యసనాలూ లేని వీర్రాజు మాత్రం ఎప్పుడో తప్ప ఇంటికి ఆలస్యంగా రావడం జరగదు. ఘర్షణలు లేని అన్యోన్య దాంపత్యం వాళ్లది.

''కమలా, నిన్నే అడిగిందానికి సమాధానం చెప్పవేం?'' చిరాకు పడిపోయేడు వీర్రాజు.

''నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయండి'' విసుగ్గా అంది కమల.

సూర్యాన్ని కొట్టినందుకు ఆమె అ లిగిందని అతనికి తెలుసు . కానీ తన పొరపాటును అంగీకరించాలంటే అహం అడ్డొస్తోంది.

''సూర్యం తిన్నాడా?'' ప్రశ్నించేడు.

''ఉహూ'' కనబడకుండా కన్నీరు తుడుచుకుంది కమల.

''కొంచెం తినిపించకపోయేవా?''

తన్నుకొస్తున్న దుఖాన్ని ఇక ఆపుకోలేక భోరుమందామె.

''ఎంత బలవంతం చేసినా తిన్లేదు. అ లాగే ఏడుస్తూ పడుకున్నాడు. వాడి మనసెంత గాయపడిందో, పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.''

భారంగా నిట్టూర్చాడు వీర్రాజు.

కొడుకు కప్పుకున్న దుప్పటిని నెమ్మదిగా తొలగించాడు. ఒక్కసారి షాక్‌ తగిలినట్టయింది. వాడి ఎడమ చెంప ఎర్రగా కందిపోయి వుంది. నాలుగు వేళ్ల అచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దెబ్బకి చెవి డయాఫ్రం కొంచెమైనా దెబ్బతిని వుంటుంది.

గుండెను ఎవరో పిండేసినట్టయింది. అంత గట్టిగా కొట్టాడా తను. అసలు వాడేమంత పెద్ద తప్పు చేశాడని. తనకి చేతులెట్లా వచ్చాయి. తనకు తాను శిక్ష విధించుకుంటున్నట్టు కసిగా తన కుడి చేతిని గట్టిగా గోడమీద చరిచాడు.

భర్త పశ్చాత్తాప ధోరణిని చూసేక అంతవరకు అతని మీదున్న కోపం పోయి జాలి కలిగింది కమలకు.
''ఏంటండీ యిది?!'' అంటూ దగ్గరకు వెళ్లి అతని చేయి పట్టుకుంది.

భార్య భుజం మీద తలవాల్చి చిన్నపిల్లాడిలా రోదించేడు వీర్రాజు.

''ఇవాళ మా ఆఫీసులో పెద్ద గొడవైంది కమలా! నేనూ మా ఆఫీసరూ మాటా మాటా అనుకున్నాం. నేను ఫూలిష్‌గా వాడి మీది కోపాన్నంతా మన బాబు మీద చూపించాను. చూడు ఎంత రాక్షసంగా కొట్టానో.''

''పోన్లెండి. జరిగిందేదో జరిగిపోయింది. వాణ్ని మీరెంత ప్రేమగా చూసుకుంటారో నాకు తెలీదా'' అనునయించింది కమల.

ఆమెకు గత సంఘటనొకటి గుర్తుకొచ్చింది. సూర్యం ఒకసారి ఇంట్లోనే క్రికెట్‌ ఆడబోయి టేబుల్‌ గడియారాన్ని బద్దలు కొట్టాడు. అది చూసి తను కోపంతో వెళ్లి వాడి వీపు మీద ఒక్క చరుపు చరిచింది. అంతే వీర్రాజు ఎంత రాద్దాంతం చేశాడో. ''వెధవ గడియారం పోతే పోయింది కొడితే తిరిగొస్తుందా?'' అంటూ పెద్ద క్లాసే తీసుకున్నాడు.

తను ఎప్పుడైనా సూర్యం బాగా అ ల్లరి చేస్తున్నాడని ఫిర్యాదు చేయబోతే మధ్యలోనే అడ్డుకుని ''అది వాళ్ల జన్మహక్కు. వాళ్లు అ ల్లరి చేస్తుంటేనే అందం. అ ల్లరి చేయడం లేదంటే ఆ పిల్లల్లో ఏదో లోపం వుందని అనుమానించాలి. పిల్లల్ని కొడితే వాళ్ల సహజ శక్తి సామర్థ్యాలు దెబ్బతింటాయి'' అంటూ ఉపన్యాసాలు యిచ్చేవాడు.

అ లాంటి భర్త ఇవాళ తనే కొడుకును అంత గట్టిగా దండించాడంటే ఏదో పెద్ద కారణమే వుండివుంటుంది అనుకుంది కమల.

భార్య ఓదార్పుతో కొంచెం కుదుటపడ్డాడు వీర్రాజు.

''భోంచేయండి'' అంది కమల.

''నా ఆకలి చచ్చిపోయింది కమలా. ఇప్పుడేం వద్దు.'' అన్నాడు.

''పోనీ సూర్యాన్ని లేపమంటారా? మీరు అడిగితే కాస్తన్నా ఎంగిలిపడతాడేమో... ముగ్గురం కలిసి తినొచ్చు'' అంది.

''వద్దు కమలా. లేపితే వాడు అన్నం తినకపోగా నిద్రకు కూడా దూరమవుతాడు.'' అన్నాడు కొడుకు పక్కన నడుం వాలుస్తూ.

''సరే మీ ఇష్టం'' అంటూ లేచి గిన్నెలన్నీ సర్దేసి, లైటార్పి వచ్చి కొడుకు అవతలి పక్కన పడుకుంది.
ఆ రాత్రి అతి భారంగా గడిచింది వాళ్లకి.

తెల్లవారిం తరువాత సూర్యం సీరియస్‌గా పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. తండ్రి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తల్లితోనూ మాట్లాడలేదు.

వీర్రాజు తన కొడుకు ప్రతి కదలికనూ గమనించసాగాడు. కొడుకును పలకరించాలంటేనే గిల్టీగా, భయంగా వుంది అతనికి.

ప్రతిరోజూ వీధి మలుపు తిరిగే వరకూ టాటా చెబుతూ వెళ్లే కొడుకు తన ఉనికినే గమనించనట్టు స్కూలుకు వెళ్లిపోవడం వీర్రాజు మనసును చివుక్కు మనిపించింది.

''ఏమండీ! ఆఫీసుకు వెళ్లరా, తాపీగా కూర్చున్నారు?'' కొడుకును స్కూలుకు పంపేక అడిగింది కమల.
''వెళ్లను కమలా, మనసేం బాగాలేదు.'' అన్నాడు వీర్రాజు.

''రేపు మరో దెబ్బలాటవుతుందేమో మీ ఆఫీసర్తో''

''అవనీ. ఈసారి అత్త మీద కోపం దుత్త మీద చూపించనులే. భయపడకు'' అన్నాడు.

మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భోజనం చేసిన తరువాత స్కూలు నుంచి వచ్చే కొడుకు కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు. మూడింటికి స్కూలు అయిపోతుంది. మూడున్నర ప్రాంతంలో వాడు ఇల్లు చేరతాడు. అప్పటికి వాడి కోపం తగ్గిపోతుందా? ఉద్వేగంతో కూడిన ఎదురు చూపు...

చూస్తుండగానే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. చూరునుంచి కారుతున్న నీటి చుక్కల్ని అరచేత్తో పట్టుకోసాగాడు వీర్రాజు. అతనికి తన బాల్యం గుర్తుకొచ్చింది.

వర్షమంటే తనకి చిన్నప్పటినుంచీ ఎంతిష్టమో. కానీ జలుబుచేస్తుందని అమ్మ వర్షంలోకి వెళ్ల నిచ్చేది కాదు. నాన్న ఉంటే మాత్రం ఏం కాదులే ఆడుకో అని ప్రోత్సహించేవాడు. మంచి పుస్తకాలను చించి కాగితం పడవలు చేసుకున్నా మందలించేవాడు కాదు.

క్రమ శిక్షణ మంచిదే కానీ దానిని దెబ్బలతో, తిట్లతో నేర్పకూడదు. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని మరబొమ్మల్లా మార్చకూడదు. మంచీ చెడూ వాళ్లే తెలుసుకునేట్టు చేయాలి అనేవాడు నాన్న. తనకూ అవే ఆదర్శాలు అబ్బాయి. కానీ ఎప్పుడూ లేనిది ఇవాళే ఇలా అయింది.

''పోస్ట్‌'' అన్న కేకతో ఇహంలోకి వచ్చాడు వీర్రాజు.

''మీకు బేరింగ్‌ కవర్‌ వుంది సార్‌''అన్నాడు పోస్ట్‌మాన్‌.

''బేరింగా ఎక్కడి నుంచి?'' ఆశ్చర్యపోతూ అడిగాడు.

''లోకలే సార్‌. కానీ ఫ్రం అడ్రస్‌ లేదు. ఎవరో మన పోస్టాఫీస్‌ బాక్స్‌లోనే వేశారు. తీసుకుంటారా?''

''బేరింగ్‌ చార్జీ ఎంత?''

''రెండ్రూపాయలు''

''సర్లే రెండ్రూపాయలేకదా. ఇటివ్వు చూద్దాం'' అంటూ కవర్‌ అందుకున్నాడు.

చిరునామా అస్పష్టంగా వుంది కానీ తన పేరు మాత్రం సరిగానే రాశారెవరో.

''ఎక్కడినుంచండీ లెటర్‌?'' అంటూ వచ్చింది కమల.

''తెలీదు'' అంటూ కవర్‌ చించాడు.

చేతి రాత చూడగానే అర్థమైపోయింది. లెక్కల పుస్తకంలోని గళ్ల పేజీలో పెన్సిల్‌ రాత, తుడుపులు కొట్టివేతలతో అస్తవ్యస్తంగా వుంది.

గబగబా చదివి స్తాణువైపోయాడు వీర్రాజు.

గాభరాపడిపోతూ భర్తచేతుల్లోంచి ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివింది కమల. ఆమె పరిస్థితీ అట్లాగే అయింది. ... ...

''వీరజు గరికి

నీ కొడుకు సూర్యం చలా మచి వడు.
బాగ చదవుతడు.
క్లాసులో అదరికంటే ఫసుటు వసత్తడు.
చాలా మచి వడు. వాల టీచర్‌ గుడ్‌ బయ్‌ అంటుది.
గుడ్‌ బయ్‌ని కొటవద్దు. తపు.
నిన నెనె వరసం కురిపిచిన. సూర్యం ఆడుకుటె నువు కొటినవు.
నకు కొపం వసుతుంది. ఇంకసారి కొటను అని చెపు.
ఇట్లు
దెవుడు.''
...
అమ్మా మన్ను తినంగ నే శిశువునో, ఆకొంటినో... అంటూ నోరు తెరచిన బాలృష్ణుడిని చూసి నిర్ఘాంతపోయిన యశోదలా వుంది కమల పరిస్థితి.

ఇద్దరి కళ్లలో దు:ఖాశ్రువులు, ఆనంద బాష్పాలు ఏకకాలంలో పొంగి పొర్లాయి.

''నా కన్నా, నా తండ్రీ నీ కెంత తెలివిరా.... నీ సున్నితమైన మనసెంత గాయపడిందిరా...''

''కమలా నేను స్కూలు వరకు వెళ్లొస్తాను. వెంటనే వాణ్ని చూడాలి.'' అంటూ రివ్వున బయటికి వెళ్లిపోయాడు వీర్రాజు.

''నేను వస్తానుండండి...'' అన్న భార్య మాటల్ని ఆ హడావిడిలో వినిపించుకోలేదు.

గబగబా ఇంటికి తాళం వేసి ఆ వెనకే తనూ బయలుదేరింది కమల.

సూర్యం స్కూల్లో లేడు...!

అసలు ఇవాళ స్కూలుకే రాలేదు...!!

వీర్రాజు గుండెలు దడదడలాడాయి. తనకు ఉత్తరం రాసి... స్కూలుకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లినట్టు? కొంపదీసి ఏదైనా అఘాయిత్యం...

నో.. అరుస్తూ బయటికి పరుగెత్తాడు. పిచ్చిగా వీథులన్నీ సర్వే చేశాడు. చివరికి నీళ్ల ట్యాంకు దగ్గర ఓ రాతి గుండుమీద దిగులుగా కూర్చుని వున్న సూర్యం కనిపించాడు.

వీర్రాజుకు ఒక్కసారి ప్రాణం లేచివచ్చినట్టయింది. ''సూర్యం బాబూ'' ఆప్యాయంగా పిలుస్తూ దగ్గరకు వెళ్లాడు.

తండ్రిని హఠాత్తుగా చూసేసరికి సూర్యానికి భయం వేసింది. వణుకుతూ లేచి నుంచున్నాడు. స్కూలు ఎగ్గొట్టి ఇక్కడ కూచున్నందుకు మళ్లీ కొడతాడేమో అని బెదిరిపోయాడు.

''భయపడకు నాన్నా. సారీ రా. నిన్ను అన్యాయంగా కొట్టాను. ఇక ఎప్పుడూ కొట్టను. దేవుడు నాకు వార్నింగ్‌ ఇచ్చాడు నాన్నా. దేవుడు నాకు ఉత్తరం రాశాడు. నిన్నెప్పుడైనా మళ్లీ కొడితే ఊరుకోనన్నాడు. నా దేవుడివి నువ్వే నాన్నా. నువ్వే నా దేవుడివి...'' అంటూ కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు వీర్రాజు.

వర్షపు జల్లులు అప్పటికే ఆగిపోయాయి.

ఆకాశంలో ఏ అదృశ్య దేవతో వేసిన రంగుల ముగ్గులా ఇంద్రధనసు వెలిసింది. అక్కడక్కడా మబ్బుతునకలు గొబ్బిళ్లలా పొందికగా వున్నాయి. బరువు దిగిన వీర్రాజు మనసులాగే వాతావరణం ఎంతో ఆహ్లాదంగా వుంది.

మరికాసేపటికి వాళ్లని వెతుక్కుంటూ కమల రొప్పుతూ అక్కడికి చేరుకుంది.

అప్పటికి తండ్రీ కొడుకులిద్దరూ తడిచిన మట్టిని కూడదీసి మహోత్సాహంగా గుజ్జన గూళ్లు కడుతున్నారు.

ఇద్దరి బట్టలూ మట్టి కొట్టుకుని బురదబురదగా మారి వున్నాయి.

వాళ్లని ఆస్థితిలో చూసిన కమల తేలికపడ్డ మనసుతో గుండెల మీద చేయి వేసుకుని తృప్తిగా నిట్టూర్చింది.

...

(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక 28-9-1988 సౌజన్యంతో)

Wednesday, January 21, 2009

ఉత్తరం

( వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవలసిన బాధ్యత తప్పనిసరిగా పిల్లలదే. కానీ మానవ సంబంధాలన్నీ యాంత్రికంగా మారిపోతున్న ఈ కాలంలో ఏవో సాకులు చెబుతూ చాలామంది తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో వున్న తల్లిదండ్రులు సైతం ఇవాళ పిల్లల ఆప్యాయతకోసం అ లమటిస్తున్నారు. ఒంటరితనంతో కుంగి పోతున్నారు. ఈ సబ్జెక్ట్‌ మీద రాసిన కథ ఇది.
ఇందులో ఉత్తరం సంఘటన యథార్థంగా జరిగింది. ఒకసారి చిక్కడపల్లి పోస్టాఫీసుకు వెళ్లినప్పుడు ఒక చిత్తుకాగితాలు ఏరుకుని బతికే కుర్రాడు తారస పడి నాచేత ఈ ఉత్తరం రాయించుకున్నాడు. అతని పేరు అన్వర పాషానే. అందులోని వాక్యాలన్నీ అతనివే. నన్ను తీవ్రంగా స్పందింపచేశాయవి. అతను నాకు మళ్లీ కనిపించలేదు.)


ఉత్తరం (కథ)

''ఏం గురూ గారూ? ఇంకా బిజీ తగ్గినట్టులేదే!'' స్టూల్‌ లాక్కుని పక్కనే కూర్చుంటూ వెటకారంగా అన్నాడు శాస్త్రి.

అతను మా డిపార్ట్‌మెంట్‌లోనే మరో సెక్షన్‌లో పనిచేస్తాడు.మా పెళ్లిళ్లవక ముందు మే మిద్దరం రూం మేట్స్‌మి కూడా.

''బిజీయా పాడా! నాన్న గారికి లెటర్‌ రాస్తున్నాను. అంతే...!'' అన్నాను పెదవి విరుస్తూ.

''ఏంటి విశేషాలు?''

''ఏముంది, ఇక్కడ నేనేదో వేలకు వేలు సంపాదించి పోగేస్తున్నట్టు డబ్బు పంపమని కబురు చేశాడు. అందుకు సమాధానమే ఈ ఉత్తరం...''

''అరే, చిత్రంగా వుందే! సరిగ్గా మా నాన్నగారి దగ్గరి నుంచి నాక్కూడా ఇట్లాంటి లెటరే వచ్చింది. దానికి ఇప్పుడే రిప్లై రాశాను. ఇదిగో...'' అని జేబులోని ఉత్తరాన్ని తీసి చూపించాడు. ''మళ్లీ జన్మలో డబ్బు పంపమని అడక్కుండా ఘాటుగా రాశాను. మనం చేసేది గుమస్తాగిరి అనుకుంటున్నారో... కలెక్టర్‌గిరీ అనుకుంటున్నారో అర్థం కాదు''.

''ఈ మహానగరంలో ఒక్క జీతంతో బతకడం ఎంత కష్టమో పల్లెటూర్లోని వాళ్లకెలా తెలుస్తుంది. చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ల గోల వాళ్లదే కదా.'' అన్నాను.

''ఇవాళ నా మూడేం బాగోలేదు సూర్యం. నీ పరిస్థితీ అదే కాబట్టి ఓ పనిచేద్దామా?'' అడిగాడు.

''ఏంటి''అన్నాను.

''అ లా బార్‌ కెళ్లి ఓ పెగ్గేసుకుందామా? కాస్త శిరోభారమైనా తగ్గుతుంది.''

''నెలాఖర్లో... బారుకి...'' నిరాశగా నవ్వాను.

''డబ్బు దేముంది? మన ఆఫీసులో అప్పులిచ్చే ఐరావతాలు బోలెడు. అది నేను చూసుకుంటాన్లే కానీ ఐదు నిమిషాల్లో దుకాణం కట్టేసి రెడీగా వుండు.'' అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు.

మేమేమీ రెగ్యులర్‌ తాగుబోతులం కాదు. ఏ రెండుమూడు నెలలకోసారో... ఎరియర్స్‌ లాంటి అదనపు ఆదాయం చేతికందినప్పుడు ఏ బార్‌కో హోటల్‌కో వెళ్తుంటాం అంతే.

మేం ఇద్దరం నడుచుకుంటూ ముందు పోస్టాఫీసుకెళ్లాం. ఎటు వెళ్లాలన్నా కాలినడకే... లేదంటే ఆర్టీసీ బస్సే గతి.

మా ఆఫీసులో అటెండర్లకి సైతం బైకులున్నాయి. కానీ మా ఇద్దరికే లేవు. అసలు మాకు డ్రైవింగ్‌ కూడా రాదు. ఎలాగూ కొనే స్థోమత లేదు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

ఉత్తరాలని పోస్టుబాక్సులో పడేశాక సగం బరువు దిగినట్టనిపించింది!

వెనుదిరుగుతుంటే ''నమస్తె సార్‌'' అన్న పిలుపు వినిపించింది.

తైల సంస్కారం లేని జుట్టు... నల్లగా మాసిపోయిన దుస్తులు...పదిహేనేళ్లుకూడా లేని ఆ కుర్రాడి అవతారం చూసి బిచ్చగాడనే అనుకున్నాను.

దేశం నిండా బిచ్చగాళ్లే.

పొద్దున లేచింది మొదలు అర్థరాత్రి వరకు ఎక్కడి కెళ్లినా వీళ్లే ప్రత్యక్షమవుతారు. దేశం రోజురోజుకీ ఎంత అభివృద్ధి చెందుతోందో మరి.
''చిల్లర లేదు ఫో...'' అని చీదరించుకున్నాను.

''సార్‌ నేను బిచ్చగాణ్ని కాదు సార్‌!'' అన్నాడు వాడు నొచ్చుకుంటూ.

నేను వాడివంక ఎగాదిగా చూశాను.

''కొంచెం ఈ ఉత్తరం రాసిపెట్టండి సార్‌!'' అంటూ నలిగిన ఓ ఇన్‌ లాండ్‌ లెటర్‌ని అందించబోయాడు.

వాడిని బిచ్చగాడని పొరబడిన నా తొందరపాటుకు సిగ్గనిపించింది.

''వెధవ గోల పదండి గురూ గారూ! టైం లేదు. ఒరే నువ్వు వేరే ఎవర్నైనా చూసుకో..''అంటూ నా చేయిపట్టుకుని లాగాడు శాస్త్రి.

''గంట సేపట్నుంచీ అందర్నీ అడుగుతుండాను సార్‌. ఎవరూ రాయడం లేదు. మీరైనా రెండు ముక్కలు రాసిపెట్టండి సార్‌ నాకు చదువు రాదు సార్‌!'' నా పాదాలకు నమస్కరించబోయాడు వాడు.

ఎందుకో వాడిమీద సానుభూతి కలిగింది. వాడి చేతిలోని ఇన్‌లాండ్‌ లెటర్‌ని అందుకున్నాను.

శాస్త్రి అసహనంతో నిట్టూర్చి ''సరే త్వరగా కానివ్వండి...నేను ఈ లోగా సిగరెట్లు తెస్తా'' అని పాన్‌ షాప్‌ వైపు వెళ్లాడు.
ఫొస్టాఫీసు ముందున్న బెంచీపై కూర్చుంటూ ''ఎవరికి?'' అని అడిగాను.

''మా యమ్మకి సార్‌'' అన్నాడు వాడు.

నేను గబగబా రాయడం మొదలుపెట్టాను.

ప్రియమైన అమ్మకి
నమస్కరించి వ్రాయునది-
ఇక్కడ నేను క్షేమంగానే వున్నాను. అక్కడ మీరంతా క్షేమంగా వున్నారని తలుస్తున్నాను.' అని ముందుమాట రాసేసి ఊ చెప్పు'' అన్నాను.

''అమ్మా ... నేను ఈడ బాగానే వుండాను. మీరు బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.'' అని చెప్పాడు.

వీడికి ఉత్తరాల ఛందస్సు బాగానే తెలిసినట్టుందే అని నవ్వుకున్నాను. ''ఊ.. రాశాలే... ఆ తర్వాత ఏం రాయమంటావో చెప్పు...''

''నాకు ఒంట్లో బాగా లేక రెణ్నెళ్ల కాన్నించి పనికి పోటం లేదు. అందు గురించే నీకు పైసలేమీ పంప లేక పోయినాను. ఏమీ అనుకో బాకు. ఇప్పుడు నా ఒంట్లో బాగానే వుండాది. మళ్లీ పనిలోకి పోతున్నాను. నాలుగైదు దినాలల్ల ఎట్టాగైనా చేసి ఎంతో కొంత డబ్బు పంపిస్తాను.

ఇంట్లో ఎంత కష్టంగా వుండాదో అని నాకు చానా బెంగగా వుండాది. నిన్న రేత్రి చాంద్‌ బీ కలలోకొచ్చింది. అప్పటినుంచి నాకు అన్నం సయించటం లేదు. దానికి పోలియో రాకుంటే ఎంత బాగుండేదో అని ఎప్పుడూ అనుకుంటాను. తమ్ముళ్లు ఎలా వున్నారు. చెప్పిన పని చేస్తున్నారా ఊరికే జులాయిగా తిరుగుతున్నారా?

బాబూ సేఠ్‌ తన బాకీ డబ్బుల గురించి ఊరికే బాధ పెడ్తున్నాడా? ఒక్క ఆరు నెలలు ఓపికపట్టమని చెప్పు. ఆయన బాకీ మొత్తం నేను తీర్చేస్తాను. నేను ఇప్పుడు వేరే సోట పనిలో చేరాను. మునపటికన్నా నాలుగు డబ్బులు ఎక్కువ దొరుకుతున్నాయి. పాత అడ్రసుకు ఉత్తరం రాయించబోకు. కొత్త అడ్రసు తర్వాత తెలియజేస్తాను. తమ్ముళ్లను అడిగానని చెప్పు. చాంద్‌బీకి మరీ మరీ ముద్దులు.
ఇట్లు మీ కొడుకు అన్వర్‌ పాషా.''

వాడు ప్రవాహంలా చెప్పుకుంటూ పోయాడు... నేను మంత్రముగ్ధుణ్నై అదే వేగంతో రాస్తూ పోయాను. వాడి నోటి నుంచి వెలువడిన వాక్యాలు నాలోని సుషుప్త మనసును చురుక్కు మనిపించాయి.

ఇంకా చెప్పాలంటే ఆ వాక్యాలు నాకు శరాఘాతాల్లా తగిలాయి.

కొద్ది క్షణాలకిందట మా నాన్నకు రాసి పోస్ట్‌ చేసిన ఉత్తరానికీ, వీడు తన తల్లికి నా చేత రాయించిన ఉత్తరానికీ మధ్య ఎంత తేడా వుంది!

సిగ్గుతో నాలో నేనే కుంచించుకు పోయాను.

''ఏం పని చేస్తావు అన్వర్‌ పాషా?'' అనడిగాను వాడివంక వాత్సల్యంగా చూస్తూ

''కాగితాలు ఏరుకుంటాను సార్‌'' అన్నాడు.

''ఏంటీ...?!''

''గల్లీలు తిరిగి చెత్తకాగితాలు ఏరి అమ్ముకుంటాను సార్‌!''

''రోజుకి ఎంత సంపాదిస్తావు?''

''ఐదు, పది ఒక్కో రోజు ఒక్కో లాగ సార్‌! మొన్నటి వరకు హోటల్లో పనిచేశాను సార్‌. నా చేతులకు పుళ్లయితే సేఠ్‌ నన్ను పనిలోంచి తీసేసి మరొకర్ని పెట్టుకున్నాడు.... ఆకాడ్నుంచీ ఈ పని చేస్తావున్నాను. మా యమ్మకు తెలిస్తే బాధ పడతాదని ఈ మాట రాయించలేదు సార్‌...''

నా మనసు మరింత భారమైపోయింది.

సిగరెట్‌ కాలుస్తూ దూరంగా నించున్న శాస్త్రి 'ఇంకా ఏంటీగోల. పద పద' అన్నట్టు సైగ చేశాడు.

ఒక్క ఐదు నిమిషాలు ఆగు అన్నట్టు నేను కూడా సైగద్వారానే చెప్పాను. అరచేత్తో తలను కొట్టుకుంటూ మరో సిగరెట్‌ వెలిగించాడు.

''హోటల్లో పనిచేస్తే చేతులకు పుళ్లవుతాయా అన్వర్‌?'' అని అడిగాను.

''పొద్దున లేచిన కాడ్నుంచి రేత్రి పడుకోపోయే వరకు అంట్లు కడుగుతూ, తడిబట్టతో బండలూ బల్లలూ తుడుస్తూ వుంటే చేతులు కాళ్లు నాని నాని పుళ్లుకాక మరేమవుతాయి సార్‌'' అన్నాడు.

నాకు వాడిని చూస్తుంటే ఏదో తెలియని మమకారం కలుగసాగింది. ఇంత చిన్న వయసులో వీడికి ఎన్ని కష్టాలు... వీడి మాటల్లో ఎంత విజ్ఞత.

''మీ ఇల్లెక్కడ అన్వర్‌?'
'
''ఇల్లా...'' అంటూ నవ్వి ''ఇదివరకు హోటల్లోనే వుండేవోడ్ని. ఇప్పుడు ఫుట్‌పాతే నా ఇల్లు. పగలంతా గల్లీలు తిరుగుతూ కాగితాలు ఏరుకోడం, అమ్ముకోడంతోటే సరిపోతుంది. రేత్రి ఏడోకాడ తొంగుంటాను''

''మరి నీ సామాను?!''

మళ్లీ నవ్వాడు. ఆ నవ్వు కూడా ఎంత కమ్యూనికేటివ్‌గా వుందో!

''నాకు సామానేముంటాది సార్‌. అదిగో ఆ సంచే నా సామాను. అందులోనే ఓ ప్లేటు, గ్లాసు, జత బట్టలు వున్నాయి.'' అంటూ దూరంగా పడేసినట్టున్న గోనె సంచీని చూపించాడు.

నాకు నోట మాటరాలేదు. భారంగా చూస్తూ ''అడ్రస్‌ చెప్పు'' అన్నాను.

''ఖమ్రున్నీసా బేగం, సత్తయ్య సైకిల్‌ షాపు పక్కన, భవాని పురం, బనగానపల్లి.''

''ఎక్కడి బనగాన పల్లి ఎక్కడి హైదరాబాదు! అక్కడే పని చూసుకోక ఒక్కడివీ ఇంత దూరం ఎందుకొచ్చావు అన్వర్‌?'' కుతూహలంగా అడిగాను.

''మా నాయిన యాక్సిడెంటులో చచ్చిపోయాడు సార్‌. బాబు సేఠ్‌ దగ్గర ఎప్పుడో అప్పు చేశాడంట. నేను ఆయన దగ్గిరే పనిచేసేవోణ్ని. వడ్డీ కింద జీతం చెల్లు అంటూ ఒక్క పైసా కూడా యిచ్చేవాడు కాదు. అక్కడుంటే ఇంక అప్పు ఎప్పటికీ తీరదని ఇటు పారిపోయొచ్చాను.'' అన్నాడు.''నెల నెలా మా యమ్మకి నలభై ... యాభై ఎంత కూడితే అంత పంపిస్తావుంటాను. మా బాకీ తీరినాక అక్కడికే యెల్లిపోతాను సార్‌''.

నా మనసంతా దేవినట్టయిపోయింది. తమాయించుకుంటూ ''ఒకసారి ఉత్తరం చదివి వినిపించమంటావా అన్వర్‌?'' అని అడిగాను.

''మీ దయ సార్‌'' అన్నాడు. తాపీగా చదివాను. నేనే రాసినప్పటికీ ఒక్కో వాక్యం చదువుతుంటే నాకే కొత్తగా వింతగా అనిపించింది.

చాలా శ్రద్ధగా ఉత్తరాన్ని అంటించి వాడికిచ్చాను.

వాడు రెండు చేతులూ జోడించి దాన్ని తీసుకెళ్లి పోస్ట్‌ డబ్బాలో వేసి వెళ్లిపోయాడు.

నేను మాత్రం శిలావిగ్రహంలా బెంచీ మీద అట్లాగే కూర్చుండిపోయాను.

వాడి ఉత్తరానికీ, నా ఉత్తరానికీ మధ్య ఎంత భయంకరమైన తేడా!

అక్షరం ముక్కరాని అన్వర్‌...తిండికీ, ఠికాణాకూ కూడా దిక్కు లేని అన్వర్‌... ఇంకా సరిగా ముక్కపచ్చలారని వయసులో వున్న అన్వర్‌.. తన కన్న తల్లిని ఆదుకోడానికి ఎంత తహ తహలాడుతున్నాడు!

వాడి తల్లిదండ్రులు వాడికి జన్మను తప్ప యిచ్చిందేమీ లేదు!!

అయినా వారిమీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత కృతజ్ఞత...!!

మరి నేను...

మానాన్న తన కోరికలను చంపుకుని, ఒకపూట తినీ ఒక పూట తినక నానా ఇబ్బందులు పడుతూ నన్ను డిగ్రీ వరకు చదివించాడు. నాకు ఇరవై రెండేళ్ల వయసు వచ్చేవరకు తనే పెంచి పోషించాడు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బ తిని కాస్త డబ్బు సాయం చేయమని అడిగితే ఎంత నిర్దయగా, ఎంత ఘాటుగా జవాబు రాశాడు తను!

రోజూ పెట్టెడు సిగరెట్లు కాలుస్తూ, కాఫీ టీలకి డబ్బులు తగలేస్తూ, అప్పుడప్పుడు సినిమాలూ, షికార్లు, పార్టీలు ఏదీ వదులుకోకుండా, ఏ త్యాగమూ చేయకుండా ఒకింత నిశ్చింతగానే బతుకుతూ అట్లా ఉత్తరం రాయడం ఎంత దుర్మార్గం.

అక్షర జ్ఞానం లేని అన్వర్‌ నాలోని హిపోక్రసీ ముసుగును తొలగించి వెళ్లిపోయాడు.

''ఏంటి దీర్ఘాలోచనలో పడ్డావు. వాడు నీ మూడ్‌ను ఇంకా పాడు చేసినట్టున్నాడే...'' అంటూ నా భుజం తట్టి అన్నాడు శాస్త్రి.

''లేదు శాస్త్రీ. వాడు నా కళ్లు తెరిపించాడు.'' అన్నాను.

''ఇంత సెన్సిటివ్‌గా ఆలోచిస్తే ఈ లోకంలో బతకలేం సూర్యం. ఇట్లాంటివాటిని పట్టించుకోకూడదు. పదపదా..'' అన్నాడు శాస్త్రి చాలా తేలిగ్గా తీసుకుంటూ.

''సారీ శాస్త్రీ. నేనిప్పుడు మందు తాగలేను. ఈ రోజే కాదు ఇంకెప్పుడూ తాగను. సిగరెట్లు కూడా ఈ క్షణం నుంచే మానేస్తున్నాను. అర్జంటుగా ఊరెళ్లి నాన్నను పరామర్శించిరావాలి. గత్యంతరం లేని స్థితిలో తప్ప నన్ను ఎప్పుడూ ఆయన డబ్బు అడగడు. ఇట్లాంటి సమయంలో కూడా సాయం చేయకపోతే కొడుకునని చెప్పుకునే అర్హత ... అసలు మనిషినని చెప్పుకునే అర్హత కూడా నాకు వుండదు.'' అన్నాను.

ప్రతిస్పందన కోసం అతనివంక చూడకుండానే గబగబా ఇంటివైపు అడుగులువేశాను.

---


(పల్లకి సచిత్ర వార పత్రిక, డిసెంబర్‌ 26, 1985 లో ప్రచురించ బడింది)

.................................