Wednesday, June 29, 2016

ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ జ్ఞాపకం


స్థలం: ఆదర్శ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, జమ్మికుంట, కరీంనగర్‌
కాలం: 1968- 69 మధ్య.
ఫొటోలో వున్న వారు వరుసగా ఎడమ నుండి కుడికి: శ్రీ యం.వి తిరుపతయ్య (తెలుగు లెక్చరర్‌), శ్రీ రంగనాథ (వైస్‌ ప్రిన్సిపాల్‌), శ్రీ లక్ష్మారెడ్డి (ప్రిన్సిపాల్‌), శ్రీ కృష్ణ (ఇంగ్లీష్‌ లెక్చరర్‌), చివరగా మొండి ప్యాంట్‌, హవాయి చెప్పులతో బెరుకు బెరుకుగా నేను.
సందర్భం: కాలేజ్‌ మ్యాగజైన్‌ ఎడిటోరియల్‌ బోర్డు.

ఇక్కడ బ్లాక్‌ విచారానికీ, వైట్‌ సంతోషానికీ ప్రతీకలు. ఏకకాలంలో ఆ రెండు అనుభూతులను గుర్తుచేసే ఫొటో ఇది.
ముందుగా విచారం గురించి చెప్పుకోవాలి:

మల్టీపర్పస్‌ హెచ్‌ఎస్‌సి పూర్తయిన తరువాత బీఎస్‌సి చదివి సైన్స్‌ టీచర్‌ని అవాలన్నది అప్పటి నా రంగుల కల.
కానీ, 'ఇంక చదివిచ్చుడు నా వల్ల కాదు. మిల్లులో కార్మికుడిగా చేరి ఇంటికి ఆసరాగా వుండు' అంటాడు మా నాయిన. ఆరోజుల్లో ఆయన పనిచేసే ఆజంజాహి మిల్లులో 'బదిలి పాటీలు' (టెంపరరీ కార్మికుల కార్డులు) సులువుగా ఇచ్చేవారు. పర్మినెంట్‌ కార్మికులెవరైనా పనికి డుమ్మా కొడితే వారి స్థానంలో పనిచేయాలి.
కార్మికుల పిల్లలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు.
నాతో పాటు చదువుకున్న కొందరు పేద కార్మికుల పిల్లలు అప్పటికే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి కార్మికులుగా మారిపోయారు.

అయితే నేను మాత్రం చదువుకుంటాను తప్ప పనిలో చేరను అని భీష్మించుకుని కూర్చున్నాను.
ఆనాడు వరంగల్‌ జిల్లా మొత్తానికి ఒకే ఒక్క ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ వుండేది.
అక్కడ సీటు దొరకని వాళ్లంతా పొలో మంటూ వరంగల్‌ సమీపంలోని జమ్మికుంటకు వెళ్లేవారు. అప్పటికే ఏవీ హైస్కూల్‌ లోని నా క్లాస్‌మేట్స్‌ చాలా మంది అక్కడ చేరిపోయారు. అది ప్రైవేటు కాలేజి.

నా ఏడుపులు, అలకలు, భూక్‌హర్తాళ్‌లు ఏవీ మా నాయన ముందు పనిచేయలేదు. చూస్తుండగానే కాలేజీలు తెరిచి మూడు నెలలు గడచిపోయాయి.

చివరికి మా అమ్మ మనసే కరిగింది (ఎంతైనా అమ్మ అమ్మే కదా). తన వద్ద కొన్ని నల్లపూసల గుండ్లు, రెండు వెండి కడియాలు వుండేవి. తను ఎనిమిదేళ్ల వయసులో వుండగా వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు ఆమె ఒంటిమీద నుంచి తీసిచ్చారట. వాటిని చాలా అపురూపంగా చూసుకునేది. అలాంటి వాటిని అమ్మో కుదువబెట్టో మొత్తం మీద రెండు వందల రూపాయలు తెచ్చి ''ఎట్లైతె అట్లైంది మంచిగ సదువుకో కొడుకా'' అంటూ నా చేతిలో పెట్టింది.
ప్రాణం లేచొచ్చినట్టయింది. ఎక్కడలేని సంతోషంతో రయ్యిమని జమ్మికుంటకు వెళ్లిపోయాను.

తీరా చూస్తే అక్కడ బిఎస్‌సిలో చేరాలంటే 300 రూపాయలు కట్టాలన్నారు. బిఎ, బికాంలకు మాత్రం 200 రూపాయలు.
నా ఉత్సాహమంతా నీరుకారిపోయింది.
ఏం చేయాలో పాలుపోలేదు.
ఇంటికి వెళ్లి మరో వంద రూపాయలు తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదు. వున్న రెండు వందలూ పోతాయి.
ఆలోచించి ఆలోచించి చివరికి బిఏలో చేరాలని నిర్ణయించుకున్నాను.

ఫాం నింపి ఫీజు కట్టబోతుంటే అకౌంటెంట్‌ ''బీఏలో చేరితే ఏం ఫ్యూచర్‌ వుంటుంది బాబూ. బీకామ్‌లో చేరు. బ్యాంకు ఉద్యోగం దొరుకుతుంది'' అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు. పెద్దాయన అనుభవంతో, నా మేలు కోరి చెబుతున్నాడు, సైన్స్‌ టీచర్‌ కంటే బ్యాంకు ఉద్యోగం ఏం తీసిపోదు కదా అనుకుని అప్లికేషన్‌లో బీఏను కొట్టేసి బికామ్‌ అని రాసి ఫీజు కట్టేశాను.

అక్కడ నా తోటి ఏవీ హైస్కూల్‌ విద్యార్థులంతా బీఎస్సీలో వున్నారు, నేనొక్కణ్నే ''భీ ఖాం !''
కాలేజీలో చేరానన్న ఆనందం ఆవిరైపోయింది.

రశీదు జేబులో పెట్టుకుని భారమైన మససుతో కాసేపు కాలేజీలోనే అటూ ఇటూ తిరిగాను.
క్లాసులు జోరుగా జరుగుతున్నాయి.
హఠాత్తుగా నోటీసు బోర్డు మీదున్న ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది.
కాలేజీ మ్యాగజైన్‌ ఎడిటర్‌ సెలక్షన్‌ కోసం ఆరోజు సాయంత్రం 5 గంటలకు వ్యాస రచన పోటీ వుందన్నది దాని సారాంశం.

ఇప్పుడే ఫీజు కట్టాను. ఇంకా క్లాసులో అడుగుపెట్టనే లేదు. అప్పుడే పోటీలో పాల్గొనొచ్చో లేదో అని సంశయిస్తూ అకౌంటెంట్‌ని అడిగితే పోయి ప్రిన్సిపాల్‌ని కలవమన్నారు. అంతకు కొంత సేపటి క్రితమే ఆయనను కలిశాను కాబట్టి పెద్దగా జంకు అనిపించలేదు.
''ఎందుకా డౌట్‌. ఫీజు కట్టావంటే నువ్వు మా కాలేజ్‌ స్టుడెంట్‌ అయిపోయినట్టే కదా. శుభ్రంగా వెళ్లి పాల్గో'' అన్నారాయన.

సరే చూద్దాం అని సాయంత్రం ఐదయ్యే వరకు కాలేజీ ఆవరణలోని ఓ చెట్టు కింద కాలక్షేపం చేశాను. కాలేజీలో చేరిన ఆనందం కంటే బీఎస్సీ మిస్‌ అయిందే అన్న దిగులే ఎక్కువయింది. ఆగి ఆగి లోపలినుంచి ఏడుపు తన్నుకొచ్చింది.
వ్యాస రచన పోటీలో ఏం టాపిక్‌ ఇచ్చారో, ఎలా రాశానో ఇప్పుడేమీ గుర్తులేదు.

కానీ వారం రోజుల తరువాత నేను ట్రంకుపెట్టె, బియ్యం మూట పట్టుకుని జమ్మికుంట బస్టాండ్‌లో దిగుతుంటే నలుగురైదుగురు పాత ఫ్రండ్స్‌ దగ్గరకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పడం మొదలుపెట్టారు.
నా వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చిందట, కాలేజి మ్యాగజైన్‌కు తెలుగు ఎడిటర్‌గా సెలక్ట్‌ అయినట్టు నా పేరు నోటీసు బోర్డు మీద పెట్టారట.
ఇంకా క్లాసులో అడుగుపెట్టక ముందే కాలేజీ మ్యాగజైన్‌కు ఎడిటర్‌ని కావడం నిజంగా ఒక థ్రిల్లింగ్‌ అనుభవం.
భీకర బీకాం బాధకి అదొక విరుగుడన్నమాట.

అప్పటికే తెలుగు లెక్చరర్‌ యం.వి.తిరుపతయ్యగారు రెండు మూడు సార్లు నాకోసం వాకబు చేశారట. మర్నాడే స్టాఫ్‌ రూంకి వెళ్లి ఆయనను కలిశాను. షేక్‌ హాండిచ్చి ''చాలా బాగా రాశావయ్యా'' అని మెచ్చుకున్నారు. ''నీ వ్యాసం మా వాళ్లు ఎవరైనా చదివితే అది నేనే నీకు రాసిచ్చాననుకుంటారు'' అన్నారు. ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు.
''ప్రతి సంవత్సరం ఎడిటర్‌ సెలక్షన్‌ జరుగుతోంది కానీ ఇంత వరకు మ్యాగజైన్‌ మాత్రం బయటికి రాలేదు. ఈసారి అట్లా కాకూడదు. కష్టపడి ఎలాగైనా మ్యాగజైన్‌ని తీసుకురావాలి మనం'' అన్నారు.
''తప్పకుండా సర్‌'' అన్నాను.
కాలేజీలో చేరిన మరుక్షణం నుంచీ మ్యాగజైన్‌ వర్కే నాకు ప్రథానమైపోయింది.

చదువు విషయానికి వస్తే ఒక్క తెలుగు, ఇంగ్లీషు క్లాసులు తప్ప ఏవీ ఇంట్రెస్టుగా వుండేవి కాదు. ఆ లయబిలిటీసేమిటో, అసెట్సేమిటో, ఆ బ్యాలెన్స్‌ షీట్లేమిటో ఏ పాఠమూ కొరుకుడు పడేది కాదు. అమ్మడమూ కొనడమూ ఏదీ రాని నాకు ఆ వ్యాపార పాఠాల వల్ల ఏం ఉపయోగమో ఏమీ అర్థమయ్యేది కాదు. వింటుంటే పిచ్చెత్తినట్టుగా వుండేది.

నా రూంమేట్స్‌ ఇద్దరూ బీఎస్సీనే. వాళ్ల టెక్ట్స్‌ట్‌ బుక్స్‌ పట్టుకుంటే ఎంత ముచ్చటగా అనిపించేదో. అదే నా టెక్స్ట్‌ బుక్స్‌ పట్టుకురటే అరచేతుల మీద తేళ్లు, జెర్రులు పాకుతున్నట్టనిపించేది.

నా జీవితంలో అప్పుడే డిప్రెషన్‌ మొదలయింది.

అయితే అది ముదిరి పాకాన పడకుండా కాలేజి మ్యాగజైన్‌ వర్క్‌, సాహితీ సేవ అడ్డుకున్నాయి.
''వరంగల్‌లో లాగా మనం కూడా ఇక్కడ చిన్నగా ఒక సాహితీ మిత్రమండలిని మొదలుపెడదాం'' అన్నారు తిరుపతయ్య గారు.
ప్రారంభంలో నన్నే దానికి కన్వీనర్‌గా వుంచారు. పేరుకు కన్వీనర్నే గానీ అన్ని తనే చూసుకునేవారు. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట అన్నట్టుగా వుండేది.
మొదట్లో మిత్రమండలి సమావేశాలకి పట్టుమని పదిమంది కూడా వచ్చేవారు కాదు. కానీ రాను రాను ఆ సంఖ్య నలభై యాభైకి పెరిగింది. విద్యార్థులతోపాటు లెక్చరర్లు, స్థానిక టీచర్లు, ఒకోసారి మా ప్రిన్సిపాల్‌ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేవారు.

ఒకసారి నేను కరువు మీద రాసిన కవితకి మంచి అప్లాజ్‌ వచ్చింది. దానిని 'సృజన' కు పంపించమన్నారు సార్‌. తనే ఆ కవిత మీద రెండు వాక్యాలేవో రాశారు. నేను సృజనకు పోస్ట్‌ చేశాను. వారం రోజులలోపలే వరవరరావు గారి దగ్గర నుంచి నాకు ఒక పోస్ట్‌ కార్డ్‌ వచ్చింది.
'డియర్‌ ప్రభాకర్‌, నీ కవిత అందింది. బాగుంది. మంచి కవితకు సిఫారసు అక్కరలేదు. ఈ నెల సంచికలోనే ప్రచురిస్తున్నాం' అని వుంది.
చాలా సంతోషంగా దానిని తీసుకుని తిరుపతయ్య గారి ఇంటికి వెళ్లాను. చూసి నాది సిఫారసు ఎట్లవుతుంది. సృజన నిర్వాహకుల్లో నేనూ ఒకణ్ని కదా. అది నా అభిప్రాయం, నా సెలక్షన్‌. అంతే. ఆ విషయమే వరవరరావుకు రిప్లై రాయమన్నారు.
నేను బెంబేలు పడిపోయాను. వద్దు సార్‌ బాగుండదు సార్‌ అంటూ నసిగాను.

మరోసారి 'అరుణవర్ణం' అనే కవితను రాసి మిత్రమండలిలో చదివి వినిపించకుండానే 'విద్యుల్లత'కు పంపించాను. 'రక్తంలో ముంచి తీసినట్టుండే మందార పుష్పం, రుధిరంతో అలికనట్టుండే సంధ్యాకాశం నాకు ఎంతో ఎంతో ఇష్టం' అంటూ ఏదో రాసినట్టు గుర్తు.
రెండు రోజుల్లోనే తిరుపతయ్యగారు పిలిచి విద్యుల్లతకు పంపిన కవిత బాగుంది. కొంచెం ముందుగా కవితల పోటీకి పంపితే ప్రైజు వచ్చివుండేది. వచ్చేనెలలో ప్రింట్‌ అవుతుంది. కాకపోతే కవిత శీర్షికను 'ఎరుపు రంగు' అని మార్చాను'' అన్నారు. సార్‌కు విద్యుల్లత పత్రికతో వున్న అనుబంధం గురించి నాకు అంతవరకు తెలియదు.

కాలేజీ అనుభవాలు ఇంకా చాలా వున్నాయి.
కానీ ఇది ఫొటోకు పరిమితమైన కథనం కాబట్టి వాటినేమీ ఇక్కడ ప్రస్తావించడం లేదు.

''మరో రెండేళ్లు కష్టపడి తెలుగు ఎంఏ చేయి. డబ్బులు నేనిస్తాను. నీకు ఉద్యోగం దొరికినతరువాత తీరుద్దువుగానీ'' అనేవారాయన. కానీ ఇంటి పరిస్థితులు సహకరించక వారి చేయూతని ఉపయోగించుకోలేకపోయాను.
మొత్తం మీద బీకాం పాసయ్యాను.
ఆజంజాహీ మిల్లులో ఉద్యోగం రెడీగా వుంది.
అయితే ఈసారి టెంపరరీ కార్మికుడి ఉద్యోగం కాదు. టెంపరరీ క్లర్కు ఉద్యోగం.
రిజల్ట్స్‌ రాకముందే ఆ ఉద్యోగంలో చేరిపోయాను. అదో ప్రహసనం.
ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో చూసినప్పుడల్లా ఇలా ఏదో అలజడి కలుగుతూనే వుంటుంది.