Saturday, April 20, 2019

''హింద్‌ స్వరాజ్‌'' - గాంధీ సిద్ధాంతానికి పునాది వంటి పుస్తకం!


ఇంతవరకు గాంధీయిజంకు సంబంధించిన పుస్తకాలేవీ నేను చదవలేదు. చదవాలన్న ఆసక్తి కూడా ఎప్పుడూ కలగలేదు. అలాంటిది ఈ మధ్య అనుకోకుండా 'హింద్‌ స్వరాజ్‌'ని తప్పనిసరిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌, మైసూర్‌ నుంచి మిత్రులు మాథ్యూస్‌ ప్రత్తిపాటి గారు ఫోన్‌ చేసి గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా హింద్‌ స్వరాజ్‌ని తెలుగులో వెలువరించాలని తలపెట్టినట్టు, దానిని అర్జంటుగా అనువాదం చేసివ్వాలని అడిగారు.
నేను అంతకు ముందు నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ (ఎన్‌టిఎం), హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బిటి)లు సంయుక్తంగా ప్రచురించిన గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ ''భారత రాజ్యాంగం- దేశానికి మూలస్తంభం'' పుస్తకాన్ని అనువాదం చేసివున్నాను.
అందువల్లనే నాకీ అవకాశాన్ని కల్పించారు. గత సంవత్సరం అక్టోబర్‌ 2న దిల్లీలో విడుదల చేయాలని భావించినప్పటికీ ముద్రణా తదితర సమస్యల వల్ల వీలుకాలేదు. ఈమధ్యనే మరో నాలుగు భారతీయ భాషల అనువాదాలతో కలిపి దీనిని మైసూరులో ఆవిష్కరించారు. ఈరోజే నాకు కాంప్లిమెంటరీ కాపీలు అందాయి.
గాందీజీ దక్షిణాఫ్రికాలో వుంటున్నప్పుడు 1909లో హింద్‌ స్వరాజ్‌ని గుజరాతీ భాషలో రాశారు. ఆ తరువాత 1910లో తనే ఇంగ్లీషులోకి అనువదించి పుస్తకరూపంలో వెలువరించారు. దాదాపు 109 సంవత్సరాలు గడచినా ఈ
పుస్తకం ఇప్పటికీ తెలుగులో రాకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. (ఒకవేళ ఇంతకు ముందే తెలుగులో వచ్చి ఆ ప్రతులేవీ దొరకకపోవడం వల్ల మళ్లీ ఇందుకు పూనుకున్నారేమో తెలియదు).
మొత్తం మీద ఈ చారిత్రాత్మక పుస్తకాన్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించడం నా మట్టుకు నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. గాంధీ సిద్ధాంతానికి పునాది వంటిది ఈ పుస్తకం. సిద్ధాంత మంచిచెడ్డల సంగతిని పక్కన పెడితే అసలు గాంధీ ఆలోచనా విధానం ఏమిటో ఇది మనకి స్థూలంగా పరిచయం చేస్తుంది. జాతీయ కాంగ్రెస్‌ పాత్ర, భారత దేశ పరిస్థితి, ఇంగ్లండ్‌ పరిస్థితి, భారతదేశం ఎందుకు పరాధీనమయింది, ఎలా స్వతంత్రమవుతుంది, స్వరాజ్యం అంటే ఏమిటి, హిందూ ముస్లింల ఐక్యత , నిజమైన నాగరికత, బెంగాల్‌ విభజన, సాత్విక ప్రతిఘటన-సత్యాగ్రహం, విద్య, యంత్రాలు వంటి వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను విస్పష్టంగా ఇందులో పొందుపరిచారు.
దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడ అనేకమంది భారతీయ అతివాద, మితవాద నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపి 1909లో సముద్రమార్గంలో దక్షిణాఫ్రికాకు తిరుగు ప్రయాణమైనప్పుడు ఆయన ఓడలోనే ప్రశ్నలు జవాబుల రూపంలో ఈ పుస్తకాన్ని రాశారు. మొదట తన సంపాదకత్వంలో వెలువడే స్థానిక ''ఇండియన్‌ ఒపినియన్‌'' పత్రికలో సీరియల్‌గా ప్రచురించారు. గుజరాతీ భాషలో వెలువడిన పుస్తక ప్రతులను బొంబాయి రేవులో
బ్రిటిష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాంతో ఆయనే ఆఘమేఘాల మీద ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. ఆతదనంతరం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం పెను సంచలనమే సృష్టించింది.
ఇవాళ దేశంలో కుహనా దేశభక్తి, మతోన్మాదం, పరమత అసహనం, గోసంరక్షణ పేరిట అమానవీయ దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో గాంధీజీ వంద సంవత్సరాల క్రితం వెలిబుచ్చిన అభిప్రాయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రేరేపిస్తాయి.
హిందూ ముస్లిం విభేదాల గురించి (పేజి 39లో):
'' ... భారతదేశం కేవలం హిందువులతోనే కూడివుండాలని హిందువులు భావిస్తున్నట్టయితే వాళ్లు ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టే లెక్క. హిందువులూ ముస్లింలూ పార్శీలూ క్రైస్తవులూ ఎవరైతే భారతదేశాన్ని తమ దేశంగా చేసుకున్నారో వాళ్లంతా సహ దేశీయులే. తమ ప్రయోజనం కోసమైనా సరే వాళ్లంతా ఐకమత్యంతో ఈ దేశంలో జీవించాలి. ప్రపంచంలో ఎక్కడా ఒకే జాతీయత, ఒకే మతం ప్రాతిపదికతో కూడిన ప్రదేశం లేదు. భారతదేశంలో కూడా ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు...."
"...ముస్లిం రాజుల కాలంలో కూడా హిందువులు అభివృద్ధి చెందారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే హిందూ రాజుల కాలంలో ముస్లింలూ వర్థిల్లారు. పరస్పరం కలహించుకోవడమనేది ఆత్మహత్యా సదృశం అవుతుందని రెండు పక్షాలూ గుర్తించాయి. ఆయుధాలను ఎక్కుపెట్టినా ఏ పక్షంవారూ తమ మతాన్ని విసర్జించరు. అందుకే ఇరు పక్షాలూ శాంతియుతంగా జీవించాలని నిశ్చయించుకున్నాయి. బ్రిటిష్‌ వారి రాకతో తిరిగి కలహాలు రాజుకున్నాయి.
మీరు పేర్కొన్న సామెతలు ఇరువర్గాలూ పోట్లాడుకుంటున్న కాలంలో పుట్టినవి. వాటిని ఇప్పుడు ప్రస్తావించడం హానికరం అవుతుంది. అనేకమంది హిందువుల, ముస్లింల పూర్వీకులు ఒకరేననీ వారి రక్తంలో ప్రవహిస్తున్నది ఒకే రక్తమనీ మనం మరచిపోతే ఎలా? మతం మారిన కారణంగా శత్రువులైపోవాలా?
ముస్లింల దేవుడికీ హిందువుల దేవుడికీ మధ్య తేడా వుందా? మతాల మార్గం వేరే కావచ్చు కానీ అవి ఒకేచోట కలుస్తాయి. మనం చేరుకునే గమ్యం ఒకటే అయినప్పుడు మనం ప్రయాణం చేసే మార్గాలు వేరైతేనేంటి? మనం పోట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది?
శివ భక్తులకూ, విష్ణు భక్తులకూ మధ్య కూడా ఇలాంటి దారుణమైన సామెతలు అనేకం వుండేవి. అయినంత మాత్రాన వాళ్లిరువురిదీ ఒకే దేశం కాదని ఎవరూ అనలేరు కదా. వైదికమతం జైన మతానికంటే భిన్నమైనది. అయినా ఆ రెండు మతాలను అవలంభించేవాళ్లు వేరు వేరు దేశాలకు చెందిన వాళ్లేం కాదు కదా.
అసలు వాస్తవం ఏమిటంటే మనం బానిసల మాదిరిగా మారిపోయాం. అందుకే పరస్పరం పోట్లాడుకుంటున్నాం. మన పోట్లాటలపై మూడో పక్షం తీర్పును కోరుకుంటున్నాం. ముస్లింలలో వున్నట్టే హిందువులలో కూడా విగ్రహ విధ్వంసకులు వున్నారు. మనలో నిజమైన జ్ఞానం పెంపొందుతున్నా కొద్దీ ఇతర మతస్థులతో పోట్లాడాల్సిన అవసరం లేదన్న అవగాహన కలుగుతుంది."
గో సంరక్షణ విషయం గురించి :
"...నేను స్వయంగా ఆవును గౌరవిస్తాను. ఆవు పట్ల అపారమైన ప్రేమాభిమానాలను కనబరుస్తాను. వ్యవసాయ దేశం కాబట్టి భారతదేశానికి ఆవు సంరక్షకురాలు. దేశం ఆవు మీదనే ఆధారపడి వుంది. ఆవు వందలాది విధాలుగా ఎంతో ఉపయోగకపడుతుంది. మన ముస్లిం సోదరులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.
అయితే నేను ఆవును గౌరవించినట్టే నా సహోదర భారతీయుడిని కూడా గౌరవిస్తానా అన్నది ప్రశ్న. ఒక మనిషి ముస్లిం అయినా, హిందువు అయినా అతను ఆవు అంత ఉపయోగకరమైన వాడే. కాబట్టి ఒక ఆవును కాపాడేందుకు నేను ఒక ముస్లింతో పోట్లాడాలా? లేదా అతడిని చంపాలా? ఆ పనిచేయడం వల్ల నేను ముస్లింలకే కాదు ఆవుకు కూడా శత్రువును అవుతాను.
అందువల్ల ఆవును రక్షించేందుకు నా ముందున్న ఒకే ఒక విధానం ఏమిటంటే ముస్లిం సోదరుని వద్దకు వెళ్లి దేశం కోసం ఆవును కాపాడే కార్యక్రమంలో నాతో చేతులు కలపవలసిందిగా అభ్యర్థించడమే. ఒకవేళ అతను నా మాటను
మన్నించకపోతే ఇక నా చేతిలో ఏమీ లేదన్న సాధారణ కారణంతో ఆవును వదులుకుంటాను.
నాకు గనక ఆవు మీద అపరిమితమైన జాలి వుంటే దానిని కాపాడేందుకు నా ప్రాణాన్ని అర్పిస్తానే తప్ప నా సోదరుడి ప్రాణాలు తీయను. నేను అనుసరిస్తున్నది మన మతం ప్రబోధిస్తున్న ధర్మమే.
మనిషి మొండివాడిగా తయారైనప్పుడు సమస్య సంక్లిష్టమవుతుంది. నేను ఒకవైపు లాగితే నా ముస్లిం సోదరుడు మరొకవైపు లాగుతాడు. నేను అతడి పట్ల సానుకూలంగా వుంటే అతను నాపట్ల సానుకూలంగా వుంటాడు. నేను
అతని ముందు వినయంగా తలవంచితే అతను అదేపనిని నా కంటే ఎక్కువగా చేస్తాడు. తలవంచడమనేది తప్పేమీ కాదన్నది నా ఉద్దేశం.
హిందువులు అతిగా పట్టుపట్టినప్పుడే ఆవులను వధించడం ఎక్కువయింది. నా అభిప్రాయం ప్రకారం గో సంరక్షణ సంఘాలను గో వధ సంఘాలుగా పరిగణించాలి. అలాంటి సంఘాల అవసరం ఏర్పడటం దురదృష్టకరం. ఆవులను ఎలా సంరక్షించాలో మనకు తెలియనప్పుడు అలాంటి సంఘాల అవసరం వుంటుంది.
స్వయానా నా తోడబుట్టిన సోదరుడే ఆవును చంపబోతుంటే నేను ఏం చేయాలి? అతడిని నేను చంపాలా లేక అతని కాళ్ల మీద పడి అలా చేయొద్దని వేడుకోవాలా? రెండోదే సరైనదని మీరు ఒప్పుకుంటే నేను ముస్లిం సోదరుడి
విషయంలో కూడా ఆపనే చేయాలి కదా.
కొందరు హిందువులు ఆవులను సరిగా చూడకుండా క్రూరంగా వ్యవహరిస్తూ వాటి వినాశనానికి కారణమవుతున్నప్పుడు వాటిని ఎవరు రక్షించాలి? కారణం ఏమైనా కావచ్చు కొందరు హిందువులు ఆవులను నిర్దాక్షిణ్యంగా దుడ్డు కర్రలతో బాదుతున్నప్పుడు ఎవరు అడ్డుకోవాలి? ఈ విషయాలు ఎలా వున్నా ఇవేవీ మనల్ని ఒకే దేశీయులుగా వుండకుండా చేయలేవు కదా.
చివరగా, హిందువులు అహింసా సిద్ధాంతాన్ని నమ్ముతారనీ, ముస్లింలు నమ్మరనీ భావించినప్పుడు హిందువులు చేయాల్సిన పనేమిటి, బతిమిలాడటమేనా? అహింసా ధర్మాన్ని పాటించే వ్యక్తి తోటి వాడిని చంపొచ్చని ఎక్కడా రాసిపెట్టి లేదు. అతను అనుసరించాల్సిన మార్గం సూటిగా వుంటుంది.
ఒక ప్రాణిని రక్షించేందుకు మరొక ప్రాణిని చంపకూడదు. అతను కేవలం బతిమిలాడవచ్చు. అదే అతని ఏకైక విద్యుక్త ధర్మం.
అయితే ప్రతి హిందువూ అహింసను నమ్ముతాడా? కొంచెం లోతుగా వెళ్లి పరిశీలిస్తే ఏ ఒక్కరూ అహింసా సిద్ధాంతాన్ని అనుసరించరనీ మనమంతా జీవుల ప్రాణాలను హరిస్తున్నామని అర్థమవుతుంది. ఏ ప్రాణినీ చంపకుండా
వుండాలన్న ఉద్దేశంతో మనం అహింసా సిద్ధాంతాన్ని పాటించాలని చెబుతుంటాం. మామూలుగా చెప్పాలంటే అనేకమంది హిందువులు మాంసాన్ని స్వీకరిస్తారు కాబట్టి వాళ్లు అహింసావాదులు కారు.
ఈ నేపథ్యంలో హిందువులు అహింసను నమ్ముతారనీ, ముస్లింలు హింసను పాటిస్తారనీ తత్ఫలితంగా వాళ్లు సామరస్యంగా కలసి మెలసి వుండలేరనీ అంటూ ఒక తీర్మానానికి రావడం పొరపాటవుతుంది.ఇలాంటి భేదభావాలను కొందరు స్వార్థపరులైన నకిలీ మతపెద్దలు మన మనసుల్లోకి చొప్పించారు. ఆంగ్లేయులు వాటిని మరింత సానబెట్టారు. వాళ్లకి చరిత్రను నమోదుచేసే అలవాటుంది. ప్రజలందరి పద్ధతులనూ, సంప్రదాయాలనూ అధ్యయనం చేస్తుంటామని వాళ్లు బుకాయిస్తుంటారు. దేవుడు మనకు పరిమితమైన మానసిక శక్తిని ఇచ్చాడు. కానీ వాళ్లు దేవుడి స్థానాన్ని తీసుకుని సరికొత్త ప్రయోగాలు చేయాలని చూస్తుంటారు. తమ పరిశోధనల గురించి సొంత డబ్బా కొట్టుకుంటారు. వాటిని నమ్మేలా మనల్నివశీకరణం చేసుకుంటారు. అజ్ఞానం వల్ల మనం వాళ్లకు దాసోహులమైపోతుంటాం.
అపార్థాలు కూడదని భావించేవాళ్లు ఖురాన్‌ను చదవొచ్చు. అందులో హిందువులకు ఆమోదయోగ్యమైన విషయాలు అనేకం కనిపిస్తాయి. అలాగే భగవద్గీతలో ముస్లింలు ఆక్షేపణ చెప్పడానికి అవకాశంలేని అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఖురాన్‌లో నాకు అర్థం కాని, లేక నాకు ఇష్టంలేని అంశాలు వున్నాయన్న నెపంతో నేను ముస్లింల పట్ల అయిష్టతను ప్రదర్శించాలా?
నాకు ఒక ముస్లింతో కొట్లాటపెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ ముస్లిం నాతో కొట్లాడే విషయంలో అశక్తుడవుతాడు. అలాగే అతను నాతో పోట్లాడటానికి ముందుకు రానప్పుడు నేను అతనితో పోట్లాడే విషయంలో శక్తిహీనుడిని అవుతాను. ఒక్క చేతిని గాలిలో ఆడిస్తే చప్పట్లు మోగవు కదా.
ప్రతి ఒక్కరూ తమ తమ మతాల అంతస్సారాన్ని అర్థం చేసుకుంటే, నకిలీ ప్రబోధకులను మాటలను పట్టించుకోకుండా వుంటే ఈ పోట్లాటలకు అసలు అవకాశమే వుండదు. ...."
.....................................................
హింద్ స్వరాజ్ ఆంగ్ల మూలం : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
తొలి ముద్రణ : అక్టోబర్ 2018 (ఆశ్వయుజం 1940 శక సం)
ISBN NO: 978-81-7343-286-6

ప్రచురణ కర్తలు :
జాతీయ అనువాద సమితి (నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్)
మైసూరు
ముద్రణ: CIIL, Printing Press, Mysuru
114 పేజీలు , ధర : రూ. 110 /-
ప్రతులకు :
Ph. No. 0821- 2345182, 09845565614,
Email. : nandeesh77@gmail.com
publication.kar-ciil@nic.in