Wednesday, November 9, 2011

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలకు ఆత్మీయ సత్కారం

...


వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థవారు 23 అక్టోబర్‌ 2011 నాడు హైదరాబాద్‌ త్యాగరాయ గాన సభలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్న తెలుగు కవులు, రచయితలు, అనువాదకులను ఘనంగా సత్కరించారు.

నాటి అపూర్వమైన కార్యక్రమంలో అనేకమంది సాహితీ దిగ్గజాలతో కలిసి సత్కారం పొందే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. గత సంవత్సరం ఆగస్టు 20న గోవాలో అసలు అవార్డు అందుకున్నప్పటికంటే ఈ సత్కారం అమితానందాన్ని, మధురానుభూతిని కలిగించింది.

వంగూరి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డా. చిట్టెన్‌ రాజుగారికీ, శ్రీ వంశీ రామరాజు గారికీ, శ్రీమతి తెన్నేటి సుధ  గారికి, మిత్రులు రాంపా, ఆర్‌.వి.రమణ లకూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనాటి కొన్ని ఛాయా చిత్రాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

,,,Tuesday, August 16, 2011

''కావాలంటే నీ కోసం నా ప్రాణాలిస్తాను... కానీ నా పుస్తకాలను మాత్రం ఇవ్వను!''


    కొంతకాలం కిందట హచ్‌ ఫోన్‌ వాళ్ల వ్యాపార ప్రకటనలు హోరెత్తిస్తుండేవి. వోడా ఫోన్‌లో విలీనం కావడం వల్ల కాలగర్భంలో కలిసిపోయినా ఇప్పటికీ అవి చాలామందికి గుర్తుండేవుంటాయి.

    ఒక చిన్నారి 'పగ్‌' జాతి కుక్కపిల్లతో - ''మీరు ఎక్కడికి వెళ్లినా (మా నెట్‌వర్క్‌) తోడుగా వస్తుంది'' ... ''మీకు సహాయం చేయడమంటే దీనికి మహా ఇష్టం'' వంటి శీర్షికలతో చేసిన ఆ ప్రచారాలు ఎంతో ముచ్చటగా, ఆలోచింపజేసేలా వుండేవి.  హచ్‌ వాళ్ల హోర్డింగులు, టీవీ  ప్రకటనలు చూపు తిప్పుకోనిచ్చేవి కావు.

    ఆ చిన్నారి కుక్కపిల్ల స్నేహపూర్వక విన్యాసాలు చూసినప్పుడల్లా దీనిలాగా సహాయం చేసే గుణం మనుషులందరికీ వుంటే ఎంత బాగుండేదో అనిపించేది.


    పురుషులందు పుణ్య పురుషులు వేరయా (స్త్రీలయందు పుణ్య స్త్రీలు వేరమ్మా?) అన్నట్టు ... అట్లాంటి వాళ్లు మనుషుల్లో లేకపోలేదు. వున్నారు.

    అపకారికి నుపకారం చేసేవాళ్లున్నారు.
    నుపకారికి అపకారం చేసేవాళ్లున్నారు.
    అపకారికి అపకారం - ఉపకారికి ఉపకారం చేసే నిష్టాగరిష్టులున్నారు.
    ఆ జన్మాంతం ఎవరికీ అపకారం, ఎవరికీ ఉపకారం చేయని మహానుభావులున్నారు.
    సహాయం చేసే గుణం లేశమాత్రం లేకపోయినా ఉచిత సలహాలిస్తూ...  క్లాసులు పీకుతూ... తెగ సహాయాలు చేసిపారేస్తున్నట్టు నటించే వాళ్ల్లూ వున్నారు.

    సరే, ఆ గొడవని అట్లా వుంచి అసలు శీర్షిక విషయానికి వస్తాను...
    నేను వరంగల్‌ ఎవివి మల్టీపర్పస్‌ హైస్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్నప్పటి సంగతి ఇది. ఇప్పుడు అంతగా కనిపించడంలేదు గానీ - అప్పట్లో సామూహిక అధ్యయనాలు ఎక్కువగా వుండేవి. పరీక్షల భయం నుంచి బయటపడేందుకు నలుగురు ఒకచోట చేరి చదువుకునేవాళ్లు. కాస్త విశాలమైన ఇళ్లున్న సహవిద్యార్థి ఎవరైనా కలసి చదువుకుందాం రా అంటే నా బోటి ప్రశాంతంగా చదువుకునే వాతావరణం లేని బీద విద్యార్థులు ఉత్సాహంగా వెళ్లేవాళ్లు. పనికిమాలిన ముచ్చట్లతో, కాఫీ-టీ  సేవనాలతో చాలా సమయం వృధా అయినప్పటికీ వాటి వల్ల మాకు మేలేజరిగేది. ఇంట్లో కంటే అక్కడ ఎంతో కొంత చదువుకోగలిగేవాళ్లం.


    వార్షిక పరీక్షలకు నెల రోజుల ముందు - కొంతకాలం పరశురామన్‌ అనే నా సహ విద్యార్థి అధీనంలోని  ఇంట్లో నేనూ, రాజేష్‌ అనే మరో మిత్రుడూ కలసి చదువుకున్నాం.  పరశురామన్‌, నేనూ మిల్‌ కాలనీలోనే వుండేవాళ్లం.  పరశురామన్‌ ఫాదరూ మా నాయినా ఆజాం జాహీ మిల్లులో పనిచేసేవారు. కాకపోతే ఆయన ఇంజనీరైతే, మా నాయిన మామూలు కార్మికుడు. చూడ్డానికి మిల్‌ కాలనీ అంతా ఒక్కలాగే కనిపించేది కానీ ఉద్యోగుల హోదాలకు తగినట్టు ఐదు రకాల ... ఎ క్లాస్‌, బి క్లాస్‌, సి క్లాస్‌, డి క్లాస్‌ క్వార్టర్లు... వాటితో పాటు కొన్ని సువిశాలమైన బంగళాలు వుండేవి. పరశురామన్‌ వాళ్లు ఒక బంగళాలో వుండేవాళ్లు.

    అదే మిల్లులో పనిచేసే పరశురామన్‌ వాళ్ల బంధువు ఒకరు మద్రాస్‌లో మరో ఉద్యోగం రావడంతో వెంటనే రాజినామా చేయకుండా తన ఎ క్లాస్‌ క్వార్టర్‌ని వీళ్లకి అప్పగించి వెళ్లి పోయాడు. అందులో మా కంబైండ్ స్టడీ. ఐదు గదులూ, విశాల మైన ఆవరణా, చుట్టూ ప్రహరీ గోడా ... ఆ లంకంత ఇంట్లో మేం ముగ్గురం! ఓహ్‌, ఎంత స్వేచ్ఛగా, ఎంత ఉల్లాసంగా వుండేదో.

    నేనూ, రాజేష్‌ తిండికి తప్ప మా ఇళ్లకు వెళ్లే వాళ్లమే కాదు. పరశురామన్‌ మాత్రం రాత్రి పడుకోడానికి వాళ్ల ఇంటికి వెళ్లిపోయేవాడు. రాజేష్‌, నేనే ఆ ఇంట్లో ఎక్కువ సేపు గడిపేవాళ్లం. ఒకవిధంగా అది మా సొంత ఇల్లుగా మారింది. పరశురామన్‌ తమ ఇంటి నుంచి పెద్ద ఫ్లాస్కులో హార్లిక్స్‌ కలిపిన పాలు తెచ్చేవాడు. తరచూ రకరకాల చిరుతిళ్లను తీసుకొస్తుండేవాడు. అతని జేబుల్లో ఎప్పుడూ నోట్ల కట్టలు కనిపించేవి. మా పంట్లాములకు కూడా జేబులుండేవి (రెండు పక్కలా రెండు, వెనకాల ఒకటి వెరసి మూడు జేబులు) కానీ అవి మాకు డబ్బులు పెట్టుకునేందుకు కాకుండా ఎప్పుడైనా చేతులు దూర్చి పోజులు కొట్టడానికి మాత్రమే పనికొచ్చేవి.

    అప్పట్లో చాలామందికి లాగే మాకూ చుట్టూ నాలుగిళ్లకు వినపడేలాగా పైకి చదివే అలవాటుండేది.  ఆ అలవాటు వల్ల మేం ముగ్గురం మూడు గదుల్లో సెటిలై సీరియస్‌గా చదువుకునేవాళ్లం. (అయినా ఇంకా రెండు గదులు ఖాళీనే). ఎప్పుడైనా కబుర్లు చెప్పుకోడానికి, అతను తెచ్చిన చిరుతిళ్లను తినడానికి మాత్రమే ఒకగదిలో చేరేవాళ్లం.

    మేం టెక్స్‌ట్‌ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే పరశురామన్‌ మాత్రం ఎప్పుడూ నోట్‌ పుస్తకాలనే తిరిగేస్తుండేవాడు. అదేంటీ టెక్స్‌ట్‌ పుస్తకాలను చదవవా అని ఒకసారి అడిగితే ఆ అవసరం నాకు లేదు. ట్యూషన్‌లో యిచ్చిన ఈ నోట్స్‌ చదివితే చాలు ఫస్ట్‌ క్లాస్‌ గ్యారంటీ అని మా సార్లు చెప్పారు అన్నాడు. మాకైతే నెలకు మూడు రూపాయల స్కూల్‌ ఫీజు కట్టడమే కనా కష్టంగా వున్న ఆ రోజుల్లో అతను నాలుగువందల యాభై రూపాయల ఫీజు కట్టి ట్యూషన్‌కు వెళ్తుండేవాడు. 

    ''ఏదీ ఒకసారి నోట్స్‌ ఇవ్వవా చూసిస్తాం'' అంటే- ''ఇది మాత్రం అడగొద్దు. నేనివ్వను.'' అని ఖరా కండీగా చెప్పాడు. ''అదేంటి మేం నీ స్టడీస్‌ని ఏమీ డిస్టర్బ్‌ చెయ్యం నువ్వు చదవని సబ్జెక్ట్‌ నోట్సే ఇవ్వొచ్చుకదా'' అంటే - ''డిస్టర్బెన్స్‌ అని కాదు. మా ఫాదర్‌ నాలుగువందల యాభై రూపాలు పెట్టి నన్ను చదివించేది మీకు ఇవ్వడానికి కాదు. వీటిని కాకుండా ఇంకేదైనా అడగండి తెచ్చిస్తాను. వీటిని మాత్రం చచ్చినా ఇవ్వను.'' అని మొహమాటం లేకుండా చెప్పాడు....యమధర్మరాజు  సావిత్రిని  ''ఏదైనా వరంబు కోరుకొనుము ఇచ్చెద'' అంటూనే ''అదియునూ నీ పతి ప్రాణంబు దక్క'' అని మెలిక పెట్టినట్టుగా!

    ఆ క్షణంలో అతను మాకు పరాయివాడిగా అనిపించాడు. ఫ్రెండ్స్‌మి కదా నోట్స్‌ ఇస్తే అతనికొచ్చే నష్టం ఏమిటి? మాకు ఇచ్చినట్టు వాళ్ల నాన్నకి ఎవరు చెప్తారు? ఎంతో మంచి వాడు ఇంత సంకుచితంగా మాట్లాడుతున్నాడేమిటి అని బాధ కలిగింది. కానీ, అనవసరపు వాదనతో మా స్నేహాన్ని చెడగొట్టుకోవద్దు అని ఆ విషయం ఎత్తడం మానేశాం. 

    అతను ఎప్పుడు బయటకెళ్లినా తన నోటు పుస్తకాలని బీరువాలో పెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. మిగతా అన్ని విషయాల్లో ఎంతో 'దిల్‌దార్‌'గా వుండే అతని ప్రవర్తన ఆ ఒక్క విషయంలో మాత్రం మిత్ర పూరితంగా కాకుండా శత్రుపూరితంగా వున్నట్టు అనిపించేది. ఏం, పుస్తకాలు ఇస్తే ఏమవుతుంది? మాకోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు. ఇంత గొప్ప సౌకర్యం కల్పించాడు. ఆ పుస్తకాలు కూడా చదవనిస్తే ఏం పోతుంది? మాకు మంచి మార్కులొస్తే అతనికి వచ్చే నష్టమేంటి? నిజంగా మా బాగును కోరేవాడు చేసే పనేనా ఇది అనిపించేది. 

    ఇలా వుండగా ఒకరోజు వాళ్ల ఇంటినుంచి పిలుపొస్తే హడావిడిలో నోటు పుస్తకాలని అట్లాగే వదిలేసి వెళ్లిపోయాడు పరశురామన్‌.  రాజేష్‌ అంతకు ముందే భోజనానికి వెళ్లాడు. నేనొక్కడినే ఇంట్లో వున్నాను.అతను వెళ్లిపోయాక అప్రయత్నంగా నా దృష్టి ఆ నోటు పుస్తకాల మీద పడింది. వాటి ఆకర్షణశక్తి నన్ను నిలబడనియ్యలేదు. నాలోని చెడు నిద్రలేచింది. తప్పు ...ఒద్దు ...ఒద్దు అనుకుంటూనే వాటిని అందుకుని ఆబగా తిరగేయడం మొదలుపెట్టాను. 

    పరీక్ష పేపర్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నోట్స్‌ అది. చదువుతుంటే ఎంత హాయిగా, ఎంత సులువుగా వుందో. టెక్స్‌ట్‌ పుస్తకాలకూ - ఆ నోటు పుస్తకాలకూ మధ్య కీకారణ్యానికీ - బృందావన్‌ గార్డెన్‌కీ మధ్య వున్నంత తేడా వుంది. (అప్పట్లో ప్రతి సినిమాలో బృందావన్‌ గార్డెన్‌ కనిపించేది లెండి). ఒక్క నాలుగు రోజులు వాటిని చదవనిస్తే పరీక్ష పేపర్లన్నీ దున్నిపారేయొచ్చనిపించింది. నన్ను నేను మరచిపోయి ఒక సబ్జెక్ట్‌ తరువాత మరో సబ్జెక్ట్‌ నోట్స్‌ని గబగబా తిరగేస్తూ కూచున్నాను. ఎంత సేపయిందో తెలియదు. ఎప్పుడొచ్చాడో గానీ పరశురామన్‌ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నా చేతిలోని పుస్తకాలని లాగేసుకుని నన్ను ఒక్క తోపు తోశాడు. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా వుండే అతనిలో అంత కోపం చూడడం అదే మొదటిసారి.  

    నన్ను అతను అన్న మాటలు మక్కీకి మక్కీగా గుర్తులేవు కానీ వాటి సారాంశం ఏమిటంటే 'అ లగా జనంతో డబ్బున్న వాళ్లు స్నేహం చేయకూడదనీ... తక్కువ కులం వాళ్లని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచాలనీ... వాళ్లు ఇటెటు రమ్మంటే ఇళ్లంతా నాదే అంటారనీ... వాళ్ల రక్తంలోనే దొంగబుద్ధి వుంటుందనీ, నైంటీనైన్‌ పర్సెంట్‌ క్రిమినల్సేననీ... జాగ్రత్త అనీ...వాళ్ల నాన్న ఎప్పుడో చెప్పాడట. నా ఫ్రండ్స్‌ అట్లాంటి వాళ్లు కాదు అని తను వాదించాడట. చివరికి మా నాన్న అన్నదే నిజమయింది. నాకు బాగా బుద్ధి చెప్పావు...' 

    నేను నిజంగా ఆ రోజు సిగ్గుతో చచ్చిపోయాను. జీవితంలో అంత గిల్టీగా ఎప్పుడూ ఫీల్‌ కాలేదు. ఇంత చిన్న విషయానికి అతను అంత హర్ట్‌ అవుతాడనీ, అంత రెచ్చిపోతాడనీ నేను ఊహించలేదు. వాటిని చదవడం అంత ఘోరమైన నేరమా? నేను సమాధానం చెప్పబోయినా కొద్దీ అతను మరింత రెచ్చిపోయాడు. దాంతో చేసేదేంలేక తలవంచుకుని సారీ చెప్పి నా పుస్తకాలను సర్దుకుని ఏడుస్తూ మా ఇంటికి వెళ్లిపోయాను. 

    ఆ తరువాత చాలా కాలం మా మధ్య మాటలు లేవు. స్కూల్లో ఎడమొహం పెడమొహంగా వుండేవాళ్లం. అదే నా చిట్టచివరి కంబైన్డ్‌ స్టడీ. పరీక్షలైపోయాయి. ఫలితాలు వచ్చాయి. ఇద్దరం సెకండ్‌ క్లాస్‌లో పాసైనా విచిత్రంగా పరశురామన్‌ కంటే నాకే పదో పదిహేనో మార్కులు ఎక్కువ వచ్చాయి. 

    ఒకరోజు స్కూల్లో టీసీ తీసుకునేటప్పుడు కౌంటర్‌ వద్ద  ఇద్దరం ఎదురుపడ్డాం. నేను చూపులు తిప్పుకుని మౌనంగా నిలబడ్డాను. చాలా ఇబ్బందిగా అనిపించసాగింది. అయితే, ఉన్నట్టుండి అతను దగ్గరకొచ్చి, నా చేయి పట్టుకుని 'సారీ' అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. ''చాలా ఫూలిష్‌గా బిహేవ్‌ చేశాను'' అన్నాడు. ఏమైంది అని ఇతర విద్యార్థులు ఆరా తీస్తుంటే ఏంలేదు అంటూ నన్ను బలవంతంగా టీ తాగుదాం పదా అంటూ పక్కనే వున్న హోటల్‌కి తీసుకెళ్లాడు. చాలాసేపు పశ్చాత్తాప పడ్డాడు. ''తను స్వార్థపరుడు కాదనీ, తనది నలుగురికి సహాయం చేసే మనస్తత్వమనీ, ఆ ఒక్క విషయంలో అంత తెలివితక్కువగా ఎలా బిహేవ్‌ చేశానో తనకే అర్థం కావడం లేదనీ, నాన్న మాటలే తనని మిస్‌గైడ్‌ చేశాయనీ''  పరిపరివిదాలుగా నొచ్చుకున్నాడు  ''నేను చేసింది కూడా తప్పే కదా. నిన్ను ఒప్పించి,  అడిగి తీసుకోవాలి తప్ప అట్లా దొంగతనంగా చదవడం నేరమే కదా'' అని నేను కూడా అతనికి అపాలిజీ చెప్పాను. అప్పటి నుంచీ మళ్లీ మా స్నేహం ఎప్పటిలా చిగురించింది. 

    అతను వరంగల్‌లోనే బిఎస్‌సి చదివాడు. ఆతరువాత వాళ్ల నాన్న రిటైర్‌ కావడంతో మద్రాస్‌కి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి తరచూ ఉత్తరాలు రాసేవాడు. అతను ఎన్ని సార్లు రమ్మన్నా నేను ఆర్థిక సమస్యల వల్లా, అతని తల్లిదండ్రులంటే వున్న బెదురు వల్లా ఒక్కసారైనా మద్రాస్‌ వెళ్లలేకపోయాను. తరువాత పరశురామన్‌ ఉద్యోగరీత్యా త్రివేండ్రం వెళ్లాడు. అక్కడి నుంచి బొంబాయి వెళ్లాడు. బొంబాయి తాజ్‌ మహల్‌ హోటల్‌లో చెఫ్‌గా చాలా కాలం పనిచేశాడు. ఆతరువాత సూరత్‌కీ, అక్కడినుంచి  అహ్మదాబాద్‌కి వెళ్లాడు. ''పెళ్లి చేసుకుంటే స్వార్థం పెరుగుతుంది... స్వేచ్ఛ పోతుంది... కాబట్టి జన్మలో పెళ్లి చేసుకోను'' అనేవాడు. మా ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆ అంశం మీదనే ఎక్కువగా చర్చ జరిగేది. నేను అతణ్ని కన్విన్స్‌ చేయలేకపోయాను. అతను రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఎందరికో సహాయం చేశాడు. కానీ, ఎందుకో ఒకచోట కుదురుగా వుండలేకపోయాడు.  అహ్మదాబాద్‌ నుంచి కొన్నాళ్లు ఉత్తరాలు వచ్చి హఠాత్తుగా ఆగిపోయాయి. నేను ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. ఇప్పుడు పరశురామన్‌ ఎక్కడున్నాడో, ఎలావున్నాడో తెలియదు.

Don’t Give a Friend a Fish. Teach Him How To Fish Instead.

Wednesday, June 1, 2011

శత్రువుతో పాతికేళ్ల సహజీనం ....!

మేం విడిపోయి అప్పుడే పదేళ్లవుతోంది...!
మా తెగదెంపుల దశమ వార్షికోత్సవ సందర్భమిది...!!
ఒకటి కాదు రెండు కాదు పాతికేళ్ల సహజీవనం మాది...!
అంత సుదీర్ఘ అనుబంధాన్ని నేను ఎలా తెంచుకో గలిగాను?!

తను సదా నా హృదయంలో నిదురించిన చెలి... మనసున మనసై బ్రతుకున బ్రతుకైన నెచ్చలి... చీకటి మూసిన ఏకాంతంలో నేనున్నాని నిండుగ పలికిన ఆపద్భంధువు... చికాకుతో, ఒత్తిడితో సతమవుతున్నప్పుడు అక్కున చేర్చుకుని ఊరటనిచ్చిన ఆత్మీయురాలు... అలాంటి తనకి దూరమవుతానని నేను కలలో కూడా అనుకోలేదు.

నా తుదిశ్వాసతోనే మా బంధం అంతమవాలి తప్ప - కంఠంలో ప్రాణం వున్నంతవరకూ తనని నేనూ, నన్ను తనూ ఒక్క పూటైనా వదలివుండే ప్రసక్తే లేదని గట్టిగా నమ్మాను.
ఆ నమ్మకం ఎలా వమ్మయింది?
తను నా మిత్రువు కాదు- ఆగర్భ శత్రువు అన్న నిజం నాకు ఎప్పుడు ఎలా తెలిసింది!
ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అంతా చిత్రమనిపిస్తుంది.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. ఆ మాట కొస్తే నాకు తొలిరోజుల్లో తనంటే ఆకర్షణ కాదు కదా వికర్షణ వుండేది.
తనే నా జీవితంలోకి బలవంతంగా చొచ్చుకొచ్చింది. ఆ తర్వాతే నేను తనని ఆరాధించడం మొదలుపెట్టాను. పాతికేళ్లు ఏదో వశీకరణకు గురైనట్టు తన మాయలో పడిపోయాను.

ఇక అసలు విషయంలోకి వస్తే-
గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే నాకు మా వరంగల్‌లోని ఆజం జాహీ మిల్లులో 'టెంపరరీ రిలీవింగ్‌ పూల్‌ క్లర్క్‌' అనే ఉద్యోగం దొరికింది.
ఎవరైనా రెగ్యులర్‌ క్లర్కు సెలవు పెడితే వెళ్లి ఆ స్థానంలో పనిచేయాలి. లేదంటే ఇంటికి వెళ్లిపోవాలి. అదీ ఉద్యోగం. ఐదేళ్లు చేశానక్కడ.

దాదాపు ఐదువేల మంది కార్మికులు, నూటాయాభై మంది క్లర్కులూ వుండేవాళ్లు. మరో పదివేల కుటుంబాలన్నా పరోక్షంగా ఆ మిల్లు మీద ఆధారపడి బతికేవి. ఆసియాలోనే అతిపెద్ద కాంపోజిట్‌ బట్టల మిల్లు. నిజాం కాలం నాటిది. అనేక దశాబ్దాలపాటు కళకళలాడిన ఆ మిల్లు ఎన్‌టీసీ అధీనంలోకి వెళ్లాక అవినీతి వైరస్‌కు గురై జబ్బుపడ్డది. అనేక గద్దలు, రాబందులు మిల్లును నిలువునా పీక్కు తిన్నాయి. ఇప్పుడు ఆ మిల్ల్లు లేదు, మిల్లునూ, మిల్లు కాలనీనీ నేలమట్టం చేసి ప్లాట్లుగా కోసి అమ్మి పారేసింది ప్రభుత్వం. అదో పెద్ద కథ. ఆ కధతో ఈ కథకు సంబంధం లేదు కాబట్టి దాన్ని ఇంతటితో వదిలేద్దాం.

అక్కడ జనరల్‌ షిఫ్టలో ఎక్కువ మంది క్లర్కులు, సెకండ్‌, థర్డ్‌ షిప్ట్‌లో తక్కుమంది క్లర్కులు పనిచేసేవారు. నాది టెంపరరీ ఉద్యోగం కాబట్టి అన్ని షిఫ్టుల్లో, అన్ని ఖాతాల్లో (డిపార్ట్‌మెంట్లలో) పనిచేయాల్సి వచ్చేది. మూడో షిఫ్టు రాత్రి పదకొండు నుంచి ఉదయం ఏడు వరకు వుంటుంది. తెల్లవారే వరకూ నిద్రని ఆపుకోవాలి కాబట్టి పదేపదే టీలు తాగేవాళ్లం. టీ సీటు దగ్గరకే వచ్చేది. స్పెషల్‌ టీ కావాలనుకున్నప్పుడు మాత్రం కాంటీన్‌కు వెళ్లేవాళ్లం. అప్పుడు కప్పు టీ ఐదు పైసలే.... టైపింగ్‌ తప్పు కాదు నిజంగా ఐదే ఐదు పైసలు. టీ తాగగానే దాదాపు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లి సిగరెట్‌ తాగేవాళ్లు. (కొందరు బీడీలు, చుట్టలు కాల్చేవాళ్లు). టీకీ, సిగరెట్‌కీ ఆ అవినాభావ సంబంధం ఏమిటో....!

ఆజంజాహీ మిల్లు పొగ గొట్టమే తెల్లరంగులో ఒక పెద్ద కింగ్‌ సైజ్‌ సిగరెట్‌లా వుండేది.
మిల్లులో ... టాయిలెట్లలో, ఆవరణలోని చెట్ల కింద ఎక్కడ చూసినా కుప్పలు కప్పలుగా బీడీలు, సిగరెట్‌ పీకలే. పొగతాగనివాళ్ల సంఖ్య వేళ్ల మీదుండేది.

నలుగురైదుగురు క్లర్కులం టీ తాగాక ఖాతాకు కాస్త దూరంగా వుండే ఆఫీసు గదిలో తలుపులు పెట్టుకుని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూచునేవాళ్లం. అక్కడ సిగరెట్‌ కాల్చకూడదు కాబట్టి ఎవరూ చూడకుండా తలుపులు మూసేసేవారు. ఆఫీసర్లు, హెడ్‌ క్లర్కులూ వుండరు కాబట్టి రాత్రి షిఫ్ట్‌ ఎంతో స్వేచ్ఛగా అనిపించేది. నాకు అప్పటికి సిగరెట్‌ కాల్చే అలవాటు లేదు. తలుపులు మూసిన గదిలో మిత్రులు వదిలే పొగతో నాకూ సిగరెట్‌ తాగినంత పనయ్యేది.

అంతేకాదు ఆరోజుల్లో థియేటర్లలో జనం దర్జాగా సిగరెట్లు కాలుస్తూ సినిమా చూసేవాళ్లు. ప్రొజెక్టర్‌ వెలుగులో తెల్లని పొగ మేఘాలు తెరమీద బొమ్మలతో పాటు తేలియాడుతుండేవి. హాలు నుంచి బయటికి వచ్చాక చూసుకుంటే బట్టలు పొగచూరి కంపు కొట్టేవి. ఆతర్వాత ధియేటర్లలో పొగ తాగరాదు అన్న నిషేదం అమలు లోకి వచ్చింది. అయినా కొత్తలో కొందరు సినిమా చూస్తూ రహస్యంగా సిగరెట్‌ తాగడం.... మఫ్టీలో వున్న పోలీసులు వాళ్లని పట్టుకుని దొంగల్ని తీసుకుపోయినట్టు బయటకు తీసుకుపోవడం... అలా కొన్ని రోజులు సాగింది.

అట్లాగే మా ఇంట్లో మా నాన్న తెగ బీడీలు కాల్చేవాడు. ప్రతి నెల సరుకుల జాబితాలో రెండో మూడో పెద్ద కోహినూర్‌ బీడీల పాకెట్లు విధిగా వుండేవి. ఆయన ప్రంఢ్స్‌ వచ్చినప్పుడు వాళ్లు కూడా మా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య కూచుని మా ముందే బీడీలు కాల్చేవాళ్లు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఆ రోజుల్లో ప్రత్యక్షంగా పొగ తాగకపోయినా ప్రతి ఒక్కరూ ఇప్పటికంటే ఎక్కువగా పాసివ్‌ స్మోకింగ్‌కు గురైయ్యేవాళ్లు.

నైట్‌ షిఫ్ట్‌లో మిత్రులు నాకు పదే పదే సిగరెట్‌ ఆఫర్‌ చేసేవారు. చాలా రోజులు నిరాకరిస్తూ వచ్చాను. పాసివ్‌ స్మోకింగ్‌ కారణంగా ఆ పొగ వాసన అంటేనే ఎలర్జీగా వుండేది . ''అరె ఏమయా ఆడపిల్లలాగ సిగ్గుపడ్తున్నవ్‌. ఇయ్యాల రేపు ఆడోళ్లు కూడా తాగుతున్నరు. అన్నిట్ల వుండాలె. అన్ని చూడాలె. మడిగట్టుకుని కూచుంటె ఎట్ల. రోజు తాగమంటున్నమా?'' అంటూ సీనియర్లు సూటిపోటి మాటలతో రెచ్చగొట్టేవాళ్లు. చివరికి ఒకరోజు రాత్రి ఓ బలహీన క్షణాన మొదటి సిగరెట్‌ పెదాల మధ్యకు వచ్చింది. తొలి అనుభవం చాలా పేలవంగా, వెగటుగా అనిపించింది. ఏముంది దీన్లో ... ఎందుకు ఇంత మంది దీనికి బానిసలవుతున్నారు అనుకున్నాను.

''సిగరెట్‌ పొగను నోటితో పీల్చి ముక్కుతో వదలాలి. అప్పుడు తెలుస్తుంది దాన్ల మజా...''
అదో ఛాలెంజ్‌ నాకు.
కొత్తలో ఆ ప్రయత్నం చేసి నప్పుడల్లా పొగ నషాళానికి అంటి ఉక్కిరి బిక్కిరి అయ్యేది. కళ్లల్లోంచి నీళ్లొచ్చేవి. ఓ పది పదిహేను సిగరెట్లు తగలేసిన తర్వాత గానీ నాకు పొగను ముక్కులోంచి వదలడం చాతకాలేదు. అలా అలా నెమ్మదిగా ఆ ఊబిలో కూరుకుపోయాను.
అప్పటి నా అభిమాన హీరో నాగీశ్వరరావు ఎవర్ గ్రీన్ 'దేవదాసు' మొదలుకుని అనేక సినిమాల్లో స్టైల్‌గా సిగరెట్‌ తాగిన దృశ్యాల ప్రభావం కూడా నా మీద బాగా పనిచేసింది.

ఒక మిత్రుడు సిగరెట్‌ పొగను గాలిలో రింగులు రింగులుగా వదిలేవాడు. ఆఫీసు గదిలో ఫాన్‌ ఆపి అతను సిగరెట్‌ పొగతో రింగులు సృష్టించడం అవి నెమ్మదిగా విస్తరిస్తూ గాలిలో కలసిపోవడం ఓ అద్భుత దృశ్యం. నేను కూడా అట్లా రింగులు సృష్టించాలని చాలా చాలా ప్రయత్నించాను. కానీ పాతికేళ్లయినా ఆ విన్యాసాన్ని సాధించలేకపోయాను... అది వేరే విషయం.

నేను ఇతర్లలా సిగరెట్‌కు బానిసను కాను, కాబోను అనే అనుకున్నాను మొదట్లో.
నైట్‌ షిఫ్టులో మిత్రులతో తప్ప బయట తాగనని కఠోర నిర్ణయమే తీసుకున్నాను.
సిగరెట్‌ నాకు తాత్కాలిక హాబీ మాత్రమే తప్ప వ్యసనం కాదనే భావించాను. ఎప్పుడంటే అప్పుడు నేను అవలీలగా సిగరెట్‌ మానేస్తాను అని అతి విశ్వాసానికి పోయాను.

బహుశా సిగరెట్‌ తాగడం మొదలుపెట్టిన కొత్తలో ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటారేమో.

ఆజంజాహీ మిల్లు ఉద్యోగం వదిలి ఆర్టీసీలో చేరి హైదరాబాద్‌ వచ్చాక ఇక నా సిగరెట్‌ వ్యసనానికి అడ్డనేదే లేకుండా పోయింది. అంతకు ముందు తాగాలనిపించినప్పుడల్లా ఒకే ఒక్క సిగరెట్‌ కొనుక్కుని తాగేవాణ్ని. అట్లాంటిది హైదరాబాద్‌ వచ్చాక జేబులో సిగరెట్‌, అగ్గిపెట్టెలు పెట్టుకోవడం మూడొచ్చినప్పుడల్లా కాల్చడం మొదలయింది... రూంలో కూడా కావలసినన్ని సిగరెట్‌ పెట్టెలు స్టాక్‌ వుంచుకునేవాణ్ని. ఒక దశలో నా తిండి ఖర్చుకంటే టీ సిగరెట్ల ఖర్చే ఎక్కువయింది.

ఆ తర్వాత పెళ్లయింది. ఒక గది ఇంటి లోంచి రెండు గదుల ఇంటిలోకి మారాం. ఖర్చులు పెరగడం వల్ల రోజూ కాల్చే సిగరెట్ల సంఖ్య తగ్గింది. పొగ వాసన పడక శ్రీమతి ఇబ్బంది పడుతుంటే ఇంట్లో కాకుండా వీధి అరుగు మీద కూర్చుని సిగరెట్‌ కాల్చి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేవాణ్ని. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సిగరెట్‌ మానేద్దామని నాలుగైదు సార్లు ప్రయత్నించాను కానీ ఎప్పుడూ రెండు మూడు రోజులకు మించి మానేయలేకపోయాను. ఒకే ఒక్కసారి అనుకుంటా ఓ ఇరవై రోజుల పాటు మానేశాను కానీ ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. సిగరెట్‌ కాల్చకపోతే తోచేది కాదు. పిచ్చెత్తినట్టుండేది.

ఇద్దరు పిల్లలు పుట్టాక ఒక్క జీతంతో ఇల్లు గడవడం మరింత కష్టం అయింది. దాంతో అదనపు ఆదాయం కోసం ఏదో ఒక పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయాల్సి వచ్చేది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా నేను సిగరెట్‌ ను మాత్రం వదులుకోలేకపోయాను. జేబులో డబ్బులు లేనప్పుడు నలిపేసిన సిగరెట్‌ పీకల్ని మళ్లీ వెలిగించి రెండు మూడు దమ్ములు లాగిన రోజులున్నాయి. పాతిక సంవత్సరాలపాటు సిగరెట్‌ అలా నన్ను విడవకుండా అంటిపెట్టుకుని వుంది. పైగా అది నా కష్టాల్లో పాలు పంచుకుంటున్నట్టు, నేనున్నానని ఉపశమనం కలిగిస్తున్నట్టు, ఆత్మస్థైర్యాన్నిస్తున్నట్టు ఓ పిచ్చి ఫీలింగ్‌. ఇంక ఎట్లా మాన్తాను? అనేకసార్లు ఖళ్‌ ఖళ్‌ మని దగ్గుతూ కూడా సిగరెట్‌ని ముద్దాడుతూనే వచ్చాను.

సిగరెట్‌ స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజూరియస్‌ టు హెల్త్‌....
సిగరెట్‌ తాగితే ఊపిరితిత్తుల కాన్సర్‌ వస్తుంది....
ఒక్క సిగరెట్‌ వల్ల ఏడు నిమిషాల ఆయుర్దాయం తగ్గిపోతుంది....
ఏటా ఇన్ని లక్షల మంది అకాల మృత్యువుకు గురవుతున్నారు... వంటి హెచ్చరికలూ, వార్తలూ, సమాచారం ఏదీ నా మైండ్‌ మీద పనిచేయలేదు.

సిగరెట్‌ ఈజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌.... దట్సాల్‌ !

ఇలా వుండగా ఒకసారి రెండు కుటుంబాలవాళ్లం కలసి తిరుపతి వెళ్లాం. కొండమీద సిగరెట్లు దొరకవు కాబట్టి ముందు జాగ్రత్తగా ఓ నాలుగు సిగరెట్‌ పెట్టెలు వెంట తీసుకెళ్లాను. ఒకరోజు వుండి దర్శనం చేసుకుని వద్దామని బయల్దేరాం. కానీ అది అన్‌సీజన్‌ అవడం వల్ల దానికి తోడు అక్కడక్కడా భారీ వర్షాల కురవడం వల్ల అప్పుడు తిరుమలలో ఏమాత్రం రద్దీ లేదు. ధర్మదర్శనం కూడా మంత్రులకు, విఐపీలకు అయినట్టు శీఘ్ర దర్శనం అవుతోంది. ఏ పూజకైనా టికెట్లు సులువుగా దొరుకుతున్నాయి. కాటేజీలు, క్యాంటీనూ అన్నీ ఖాళీఖాళీగా వున్నాయి. దాంతో మా ఒక రోజు యాత్ర మూడు రోజులకు పెరిగింది.

అందరూ రోజుకు మూడు పూటలా తనివితీరా దర్శనం చేసుకుంటున్నారు. ఏవేవో పూజలు చేయిస్తున్నారు. నేను పెద్ద భక్తుణ్ని ఏమీ కాదు. ఒకసారి దర్శనం చేసుకుని వచ్చాక మళ్లీ రానని కాటేజీలోనే వుండిపోయాను.

అప్పుడు ఏదో చిన్న అనువాదం చేయాల్సిన (జాబ్‌ వర్క్‌) పుస్తకాన్ని కూడా వెంట తీసుకెళ్లాను. ఆ పనిచేసుకుంటూ కూచున్నాను. తీసుకెళ్లిన సిగరెట్లు ఒక్క రోజులోనే అయిపోయాయి. రెండో రోజునుంచీ సిగరెట్ల కోసం వేట... పదిమందిని అడిగితే ఒక్కరి దగ్గర అతి రహస్యంగా ఒకటో రెండో ఏవో బ్రాండ్‌ సిగరెట్లు రెట్టింపు ధరకు దొరికేవి. సిగరెట్లు దొరకనప్పుడు బీడీలు తీసుకునేవాణ్ని. అవీ లేనప్పుడు గుట్కా పాకెట్లు కూడా. అలా రెండు రోజులు ఏది పడితే అది తాగి, గుట్కాలు (జీవితంలోనే మొదటిసారి) తిని మొత్తం నా ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నాను. కొండ దిగే సమయానికే నాకు ఆయాసం, దగ్గు ఎక్కువయింది. హైదరాబాద్‌ చేరేసరికి మాట పడిపోయింది. ఏంత గట్టిగా అరవబోయినా గుసగుస శబ్ధం తప్ప నోట్లోంచి మాట బయటికి రావడం లేదు. ముక్కుమూసుకు పోయి ... నోటితో కూడా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాను. డాక్టర్‌ చాలా సీరియస్‌గా వుంది పరిస్థితి అన్నారు. ఏడు రోజుల పాటు రకరకాల చికిత్సల అనంతరం గానీ మామూలు మనిషిని కాలేకపోయాను.
అంతే...!

పాతికేళ్లలో మొట్టమొదటిసారిగా సిగరెట్‌ నా శత్రువు అన్న భావన కలిగింది.
సిగరెట్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కానే కాదు అన్న వాస్తవం తెలిసి వచ్చింది.
అదే ఈ వ్యసనంలో కీలకమైన మలుపు.
మిత్రుణ్ని వదులుకోవడం కష్టం కానీ శత్రువును వదులుకోవడం ఏం కష్టం?
ఈ విధంగా పదేళ్ల క్రితం సిగరెట్‌తో నా దోస్తీ కాస్త దుష్మనీగా మారింది.
పాతికేళ్ల మా ఫాల్స్‌ రిలేషన్‌కి పర్మనెంట్ గా తెరపడింది.

................................................................................................

ఈ దిగువ కార్టూన్ జయదేవ్ గారిది . వారికి నా కృతజ్ఞతలు.
మిగతా చిత్రాలు గూగుల్ నుంచి సేకరించినవి.Friday, April 22, 2011

ఇంగ్లీషూ తెలుగూ - ఏ భాషనూ సరిగా నేర్పలేకపోతున్న మన చదువులు!

... ఇంగ్లీషూ తెలుగూ - ఏ భాషనూ సరిగా నేర్పలేకపోతున్న మన చదువులు! ...

ఈమధ్య ''తెలుగు భాషను రక్షించుకుందాం'' అనే నినాదం తరచుగా వినిపిస్తోంది.
అదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతినుంచే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలూ వెల్లు వెత్తుతున్నాయి.
నిజానికి ఒక భాషను రక్షించాలంటే మరో భాషను నిరసించాల్సిన అవసరం లేదు.
తెలుగును తప్పకుండా రక్షించుకోవాల్సిందే.
తెలుగుతో పాటు ఉర్దూ, కోయ, గోండు, లంబాడా తదితర భాషలన్నింటినీ కాపాడుకోవాల్సిందే.
ఏ భాషా కాలగర్భంలో కలిసిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందే.

మెజారిటీ ప్రజలు మాట్లాడే తెలుగు భాషలో పరిపాలన సాగితే సామాన్య ప్రజానీకానికి ఎంతో సౌలభ్యంగా వుంటుంది.
అదేసమయంలో విద్యార్థులు ఈనాటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం విశేషంగా తోడ్పడుతుంది.

అయితే అష్టకష్టాలు పడి, పదిహేను సంవత్సరాలపాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, బండెడు పుస్తకాలతో కుస్తీ పట్టి, పట్టా సంపాదించుకునే నేటి సగటు విద్యార్థికి ఏ భాషలోనూ పరిపూర్ణ పరిజ్ఞానం లభించకపోవడం ఒక విషాదం.
ఇవాళే విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
మొత్తం ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ...
అందులో లక్షా 80 వేల మంది విద్యార్థులు ఇంగ్లీషులో ఫెయిలయ్యారు.
వారిలో 36,505 మంది విద్యార్థులకు 0 ... అక్షరాలా సున్నా మార్కులొచ్చాయి.
అదేసమయంలో తెలుగులో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు.
మొత్తం 62,426 మంది విద్యార్థులు తెలుగులో ఫెయిలయ్యారు.
వారిలో 24,029 మంది విద్యార్థులకు సున్నా మార్కులొచ్చాయి.

ఒకపక్క వేలకువేల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్‌ కళాశాలలు తాము సాధించిన ఫలితాలను గురించి లక్షలకులక్షలు గుప్పించి పత్రికా ప్రకటనలతో, టీవీ యాడ్‌లతో సంబరాలు జరుపుకుంటుంటే - ఇంకోపక్క దిగువ మధ్య తరగతి, నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
ఎన్ని సంవత్సరాలు చదివినా మనకు మన మాతృభాష రాదు.
ఎన్ని సంవత్సరాలు ఎన్ని పుస్తకాలు బట్టీయం పట్టినా మనం ఇంగ్లీషులో తప్పులులేకుండా రాయలేం, మాట్లాడలేం. (కాన్వెంట్‌ చదువుల గురించి పక్కన పెట్టి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల గురించి మాట్లాడుకుందాం). ఎంత దారుణమిది.
ఎక్కడుంది లోపం?

మన దేశానికి మానవ వనరులే తిరుగులేని సంపద. ఇంతటి బృహత్తరమైన సంపద మరే దేశానికీ లేదు. అ లాంటి మానవవనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో ఎందుకు విఫలమౌతున్నాం? ఎక్కడ విఫలమవుతున్నాం?
పాఠ్యపుస్తకాలలో, సిలబస్‌లో దారుణమైన లోపాలేవో వున్నాయి.
అందుకే ఎన్ని సంవత్సరాలు వాటిని తిరగేసినా ఫలితాలు రావడం లేదు.
దీనికి తోడు ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులకే సరైన భాషా పరిజ్ఞానం వుండటంలేదు. వాళ్లకే రానప్పుడు పిల్లలకేం చెప్తారు.

మరోపక్క నిన్నమొన్నటి వరకు ఇంగ్లీషులో మనకంటే ఎంతో వెనకబడి వున్న
మన ప్రత్యర్థి దేశం చైనా అతి కొద్ది సంవత్సరాలలోనే మనల్ని దాటి ముందుకు దూసుకుపోతోందన్న వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లీషు నైపుణ్యం విషయంలో మొత్తం 44 దేశాల జాబితాలో చైనా 29వ స్థానంలో వుంటే, భారతదేశం 30వ స్థానంలో వున్నట్టు ఒక సర్వేలో తేలింది.
చైనా ప్రభుత్వం ఇంగ్లీషు బోధించే టీచర్లకు మంచి శిక్షణ యిచ్చి, ఆకర్షణీయమైన జీతాలిచ్చి, అనేక ప్రోత్సహకాలు కల్పించి ఈ అభివృద్ధిని సాధించింది.

మన దేశం ఇదే అ లసత్వాన్ని కొనసాగిస్తే మునుముందు మనం చైనాకంటే మరింత వెనుకబడిపోయే ప్రమాదం వుంది. అక్కడ వాళ్లు తమ మాతృభాషను అ లక్ష్యం చేయకుండానే,
ఇంకా చెప్పాలంటే దేశీయంగా పరిపాలనా, న్యాయ, వైద్య తదితర అన్ని రంగాలలో చైనా భాషను అమలు పరుచుకుంటూనే, అభివృద్ధిపరచుకుంటూనే కొద్ది సంవత్సరాలలో ఇంగ్లీషులో ఈ తిరుగులేని ఆధిక్యతను సాధించారు.

మనం కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూనే ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్ని అవసరం వుంది.
తెలుగుకు ఇంగ్లీషు, ఇంగ్లీషుకు తెలుగు వ్యతిరేకం కావన్న వాస్తవాన్ని గ్రహించి ఆంగ్ల భాషాభివృద్ధికి మరింత బలమైన పునాదులు వేసుకోవాలి.
ఇంగ్లీషు భాషాపరిజ్ఞానం దళితబడుగువర్గాల సత్వర సర్వతోముఖాభివృద్ధికి కూడా విశేషంగా దోహదం చేస్తుంది.

Tuesday, March 22, 2011

ట్రెయిన్‌లో పోయిన బ్యాగు మళ్లీ దొరుకుతుందనుకోలేదు!ట్రెయిన్‌లో పోయిన బ్యాగు మళ్లీ దొరుకుతుందనుకోలేదు!

మాది రిజర్వేషన్‌ ప్రయాణం కాదు. కూర్చున్న సీటు నెంబర్‌ తెలీదు. బోగీ నెంబర్‌ చూసుకోలేదు.
కొత్తగా కొన్న బ్యాగు కాబట్టి దాని ఆనవాళ్లైనా సరిగా చెప్పలేని స్థితి. అప్పటికే ట్రైన్‌ వెళ్లిపోయి దాదాపు పదినిమిషాలు కావస్తోంది.
బ్యాగు దొరకడం అసంభవం అన్నారు విన్నవాళ్లు. స్టేషన్‌ మాస్టర్‌ కూడా పెదవి విరిచారు.
''డబ్బూ, నగలూ ఏమైనా వున్నాయా అందులో?''
''లేవు సార్‌. నావి రెండు జతల బట్టలు, మా ఆవిడవి నాలుగు పట్టు చీరెలు, మ్యాచింగ్‌ గాజులూ వున్నాయి.''
''ఉత్త బట్టలకోసం ఇంత బాధ పడుతున్నారా? వృధా ప్రయాస. పోయాయనుకుని కొత్తవి కొనుక్కోండి.''
''ఈ సాయంత్రం దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లికి అటెండ్‌ కావాలి సర్‌. ఒక్కసారి ప్రయత్నించండి ప్లీజ్‌.''

మాది కష్టార్జితమైన సొమ్ము కాబట్టి తప్పక దొరుకుతుందని ఏమూలో ఓ చిన్న ఆశ. దుర్బలమైన సెంటిమెంటు. మా ఆందోళనను గుర్తించి చివరికి ఫోన్‌ రిసీవర్‌ అందుకున్నారు స్టేషన్‌ మాస్టర్‌ .

రైల్వేల గురించీ, రైల్వే ఉద్యోగుల గురించీ అంతవరకూ నాలో వున్న దురభిప్రాయాన్ని తుడిచేసిన ఈ సంఘటన ఇటీవలే 4 ఫిబ్రవరి 2011న జరిగింది.

ఆరోజు నేనూ, మా ఆవిడా, మా చిన్న తమ్ముడి భార్యా, వాళ్ల ఇద్దరు పిల్లలూ కలిసి హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాం. మేం ప్లాట్‌ఫాం మీదకు చేరుకునే సరికే ''...సికిందరాబాద్‌ నుండి గుంటూరునకు వెళ్లు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుటకు సిద్ధముగా వున్నది...'' అన్న ప్రకటన వినబడుతోంది. పరుగు పరుగున వెళ్లి ఎక్కేశాం. పెళ్లిళ్ల సీజన్‌ వల్ల కాబోలు ట్రైన్‌ కిటకిటలాడుతోంది. వాళ్లనీ వీళ్లనీ బతిమిలాడి ఎలాగోలా ముగ్గురం మూడు చోట్ల మూడు అర సీట్లు సంపాదించుకుని కూచున్నాం.

డబ్బూ నగలూ వున్న చిన్న హ్యాండ్‌ బ్యాగ్‌ మా ఆవిడదగ్గరుంది. బట్టలున్న ఎయిర్‌ బ్యాగ్‌ నా దగ్గరుంది. మా తమ్ముడి పిల్లలు ఒక చోట కుదురుగా కూచోకుండా అటూ ఇటూ ఒకరి దగ్గరనుంచి మరొకరి దగ్గరకు ఉరుకులు పెడుతున్నారు. పెద్దాడి వయసు ఆరేళ్లూ, చిన్నాడి వయసు నాలుగేళ్లూ వుంటాయి. చిడుగులు. రెండున్నర గంటల ప్రయాణం వాళ్లను చూసుకోవడంతోనే సరిపోయింది. వరంగల్‌లో దిగేప్పుడు పిల్లల్ని పట్టుకుని జాగ్రత్తగా దించి స్టేషన్‌ బయటకు తీసుకొచ్చాను. ఆటోస్టాండ్‌ వద్ద వాళ్లని పంపించేసిన మరుక్షణం నా చేతులు వెలితిగా వున్నట్టనిపించింది. అంతవరకూ బ్యాగు విషయం మా ముగ్గురిలో ఎవ్వరికీ గుర్తులేదు. గుండె ఢమాల్‌ మంది.
వరంగల్‌ స్టేషన్‌లో ట్రైన్‌ ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆగదు. ఎప్పుడో వెళ్లిపోయిందది.
చాలా సేపటి వరకు ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాం. ఐదారు శాల్తీల్లో ఒక దాన్ని మరచిపోయామంటే అర్థం వుంది కానీ వున్న ఒక్క బ్యాగునూ ట్రైన్‌లో వదిలేసి చేతులూపుకుంటూ దిగడమేమిటి? ఒకరికి కాకపోతే మరొకరికైనా దాని గురించిన ఆలోచన రాకపోవడమేమిటి? అని ఒకటే బాధ... ఒకటే ఆవేదన... మా ఆవిడ కళ్లల్లో అప్పటికే నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రయాణంలో నలిగిపోతాయని సాదా దుస్తులు వేసుకున్నాం. వాటితో పెళ్లికి వెళ్లాలంటే నామోషీగా వుంది.

తప్పు నాది కాబట్టి నేనెలాగో అడ్జెస్ట్‌ అయిపోగలను. కానీ మా ఆవిడ ససేమిరా వినేలాగా లేదు. నేను వెనక్కి వెళ్లిపోతాను. ఒంట్లో బాగాలేదని ఏదో ఒకటి మీరే సర్ది చెప్పేయండి అంది. తను ఈ పెళ్లి కోసమనే కొద్ది రోజుల క్రిందటే ఓ పట్టు చీరను కొన్నది. మరో పట్టు చీర కూడా ఆరునెళ్ల కిందటిదే. వాటికోసం కొత్తగా రెండు జాకెట్లు వెయ్యేసి రూపాయల ఎంబ్రాయిడరీ వర్క్‌ చేయించి ఈమధ్యే కుట్టించింది. ప్రొద్దునొక చీర సాయంత్రం ఒక చీర ... ఎన్నెన్ని ఊహించుకుందో. సాధారణ గృహిణులకు పెళ్లిల్లే ఫేషన్‌ పరేడ్‌ వేదికలు కదా. అందుకే బట్టల ఖరీదు కంటే ఆశాభంగం వెయ్యి రెట్లు ఎక్కువగా వుంది తనకి.

ముందు నేనే తేరుకుని 'ఎందుకైనా మంచిది, ఒకసారి స్టేషన్‌ మాస్టర్‌ను అడిగి చూద్దాం పదా' అన్నాను. కానీ ఆయన మా ఫిర్యాదు విని ''దొరకడం కష్టమండి. విలువైన వస్తువులేమీ లేవంటున్నారు కదా మరిచిపోవడం బెటర్‌'' అన్నారు. ''మరో సందర్భంలో అయితే మేం ఇంత బాధ పడేవాళ్లం కాదండీ ఈ సాయంత్రమే దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరు కావలసి వుంది'' అని రిక్వెస్ట్‌ చేస్తే మహబూబాబాద్‌ స్టేషన్‌ మాస్టర్‌కు ఫోన్‌ చేసి విషయం వివరించారు.

''ఇంజన్‌ తర్వాత వరుసగా నాలుగైదు రిజర్వేషన్‌ బోగీలు, ఒక ఏసీ బోగీ వున్నాయండీ. వాటి తర్వాత వచ్చే మొదటి లేదా రెండవ బోగీలో మేం కూచున్నాం'' ఇదీ మేం చెప్పిన ఆనవాలు. ''నా పక్క సీటులో ఎస్వీ రంగారావు లాగా భారీ పర్సనాలిటీ వున్నాయన కూచున్నారు. డెబ్బై ఏళ్లుంటాయి. బుర్ర మీసాలు. విజయవాడ వరకు వెళ్తున్నారు. ఆయన మా పిల్లలతో సరదాగా మాట్లాడారు. వద్దన్నా వినకుండా వాళ్లకి రెండు చాక్లెట్లు కూడా ఇచ్చారు. బ్యాగు ఆయన పైనున్న ర్యాకు మీదే వుంది'' అన్నది రెండో బండగుర్తు.

ఈ ఆనవాళ్లనైనా మాకు గుర్తొచ్చినప్పుడల్లా దఫదఫాలుగా చెప్పాం. వరంగల్‌ స్టేషన్‌ మాస్టర్‌ గారు (ఆయన పేరు సుదర్శన్‌) మేం చెప్పినప్పుడల్లా మహబూబాబాద్‌ స్టేషన్‌ మాస్టర్‌కి రెండు మూడు సార్లు ఓపిగ్గా ఫోన్‌ చేసి వివరించారు. ''పాపం పెళ్లికి వెళ్లాలట ... కొంచెం శ్రద్ధగా చూడండి'' అని ప్రత్యేకంగా రిక్వెస్ట్‌ చేశారు.

''ఇంకో ఇరవై నిమిషాల్లో మెసేజ్‌ వస్తుంది ఈలోగా మీరు టీ అదీ తాగి రిలాక్స్‌ అవండి'' అన్నారు. కానీ మాకు పచ్చి మంచి నీళ్లు కూడా గొంతుదిగేలా లేవు. ప్లాట్‌ఫాం మీద అటూ ఇటూ తచ్చాడుతూ గడిపాం. క్షణమొక యుగంగా గడవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసింది. స్టేషన్‌ మాస్టర్‌కు ఫిర్యాదు చేస్తుంటే విన్న ఇతర సిబ్బంది, రైల్వే కూలీలు ''దొరకడం కష్టం సార్‌. ఇంత సేపుంటుందా. ఈపాటికి ఎవరో కొట్టేసి వుంటారు.'' అంటూ రకరకాలుగా నెగెటివ్‌ కామెంట్స్‌తో అదరగొడ్తున్నారు.
మా ఆవిడ అవన్నీ పట్టించుకోకుండా ఒక విధమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి మనసులోనే దేవుడికి దండాలు పెట్టుకోసాగింది. నేనైతే లక్కుంటే దొరుకుతుంది లేకుంటే లేదన్నట్టు నిర్లిప్తంగా వున్నాను.

కాసేపటికే స్టేషన్‌ మాస్టర్‌గారు స్వయంగా పిలిచి ''మీ బ్యాగు దొరికిందట'' అంటూ చల్లని కబురు చెప్పారు.
ఎంత థ్రిల్‌ అనిపించిందో ఆక్షణాన చెప్పలేం.

''మరో పదినిమిషాల్లో మహబూబాబాద్‌ వెళ్లేందుకు ట్రైన్‌ వుంది. టికెట్‌ తెచ్చుకోండి. ఈ లోగా లెటర్‌ రాసిస్తాను'' అన్నారు. నేను మా ఆవిడను ఆటోలో పంపించేసి ఆ లెటర్‌ తీసుకుని మహబూబాబాద్‌ వెళ్లాను.
అక్కడి స్టేషన్‌ మాస్టర్‌ కూడా ఎంత మంచాయనో. తను స్వయంగా ఇద్దరు ఉద్యోగుల్ని వెంటేసుకుని చెక్‌ చేసి మరీ మా బ్యాగును రికవర్‌ చేశారట.

''తిరుగు ప్రయాణానికి వెంటనే ట్రైన్‌ లేదు. బస్సులో వెళ్తారా?'' అని అడిగారాయన. అ లాగే అని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి బ్యాగును ఆలింగనం చేసుకుని మరీ బయటికొచ్చాను.

బస్సులో వస్తోంటే మట్టి రోడ్డు మీద చెలరేగుతున్న దుమ్ము కూడా ఎంతో అందం అనిపించింది.
ఎవరిని చూసినా మల్లె పువ్వుల్లా ఎంతో స్వచ్ఛంగా కనిపించారు.
వరంగల్‌, మహబూబాబాద్‌ స్టేషన్‌ మాస్టర్లకి, వారి సిబ్బందికీ మరోసారి ఈ బ్లాగు ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

...

Wednesday, March 16, 2011

ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణే అమర జీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి!

ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణే అమర జీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి!

ఈరోజు (2011 మార్చి 16) అమరజీవి పొట్టి శ్రీరాములు 110వ పుట్టిన రోజు.
ప్రతి సంవత్సరం మార్చ్‌ 16న జయంతినీ, డిసెంబర్‌ 16న వర్థంతినీ యాంత్రికంగా జరపడమే తప్ప - ఏ ఆశయంకోసం ఆయన ఆత్మార్పణ చేశారని ఆలోచించేవాళ్లే నేడు కరువయ్యారు.

నిజంగా ఈనాటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితిని చూస్తే ఆయన ఆత్మ ''ఇది కాదు నేను ఆశించిన స్వరాష్ట్రం'' అని ఎంత క్షోభిస్తుందో అనిపిస్తుంది.
మద్రాస్‌ ప్రెసిడెన్సీలో తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయాన్నీ, తమిళుల దాష్టీకాన్నీ చూసి సహించలేక - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగారు.
మద్రాసు రాజధానిగా తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ఆయన ప్రగాఢమైన ఆకాంక్ష.
(చారిత్రకంగా చెన్నడు అనే తెలుగు రాజు పాలించడం వల్లనే ఆ నగరానికి చెన్నై అనే పేరొచ్చిందంటారు.)
''మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తలకాయ లేని మొండెంతో సమానం'' అని ఆయన స్వయంగా ప్రకటించారు.
అయితే మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న పొట్టి శ్రీరాములు కల మాత్రం నెరవేరనే లేదు. ఆయన అభీష్టానికి విరుద్ధంగా ఏ వసతులూ లేని కర్నూలు రాజధానిగా 1 అక్టోబర్‌ 1953 నాడు ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

నిజానికి అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహూృ సహా చాలామంది జాతీయ నాయకులు వ్యతిరేకించేవాళ్లు.
ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడదీయడం అంటే దేశ సమగ్రతకు భంగం కలిగించడమే అని కొందరు ఇవాళ ఎలా వాదిస్తున్నారో -
ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్ర భావన దేశ సమైక్యతకు, జాతీయ భావనకు విఘాతం కలిగిస్తుంది అని ఎంతో మంది వాదించేవాళ్లు.

స్వాతంత్య్రం సిద్ధించి కొద్ది కాలమే అయింది కాబట్టి - అందరం ముందు జాతి ఐక్యతపై దృష్టిని కేంద్రీకరించాలనీ, కొంతకాలం తరువాతనే భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి ఆలోచించాలనీ జవహర్‌లాల్‌ నెహూృ కూడా గట్టిగా చెప్పేవారు. అయితే ప్రజోద్యమానికి, మెజారిటీ అభిప్రాయానికి తలొగి -్గ తన కిష్టంలేకపోయినా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకరించారు.

మద్రాసును సాధించుకోలేకపోయిన ఆంధ్ర నాయకులు అప్పటికే సకల సౌకర్యాలున్న హైదరాబాద్‌ మహానగరం మీద దృష్టిని కేంద్రీకరించి విశాలాంధ్ర నినాదంతో మళ్లీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.

అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో మరాఠీ మాట్లాడే ఔరంగాబాద్‌ డివిజన్‌, కన్నడ మాట్లాడే గుల్బర్గా డివిజన్‌లతో కలిపి మొత్తం 16 జిల్లాలుండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ఊపందుకోవడం వల్ల హైదరాబాద్‌ రాష్ట్రంలోని ఆయా భాషా ప్రాంతాల నేతలు అటు మహరాష్ట్రలో, ఇటు కర్ణాటకలో విలీనమయ్యేందుకు ఉత్సాహపడుతుండేవారు. మిగతా తెలుగు, ఉర్దూ మాట్లాడే తెలంగాణా ప్రాంతంలో - కొందరు విశాలాంధ్ర వైపు మొగ్గు చూపితే, మరికొందరు హైదరాబాద్‌ రాష్ట్రం స్వతంత్రంగా కొనసాగాలని అభిలషించారు.

ఈ నేపథ్యంలో ఫజల్‌ అ లీ కమిషన్‌ (మొదటి ఎస్‌ఆర్‌సి) నియమాకం జరిగింది. ఆ కమిషన్‌ హైదరాబాద్‌ రాష్ట్ర పరిస్తితులను కూలంకషంగా పరిశీలించి హైదరాబాద్‌ రాష్ట్రాన్ని విడిగానే వుండనిచ్చి 1961 సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత ఆ అసెంబ్లీ గనక 3/2 వంతు మెజారిటీ ఆమోదంతో తీర్మానం చేస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని స్పష్టంగా సూచించింది.

అయితే 1961 వరకు ఆగితే హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రంతో కలవడానికి అంగీకరించరని ఆంధ్ర రాష్ట్ర నాయకులు లాబీయింగ్‌ ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలున్న 16 జిల్లాల హైదారాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించి ఒత్తిడి పెంచారు. ఈ డిమాండ్‌ సామ్రాజ్య వాద విస్తరణ లాంటిదని బాహాటంగా విమర్శిస్తూనే నెహూృ కొన్ని షరతులతో, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. సరిపడకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని ఆయన అప్పుడే చెప్పారు.

ఈవిధంగా తమిళుల పెత్తనం నుంచి పోరాడి బయటపడ్డ ఆంధ్ర ప్రాంత నేతలు, అనేక బూటకపు హామీలు, ఒప్పందాలతో తెలంగాణా ప్రాంతంపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణా అస్తిత్వాన్ని, ఆకాంక్షలనీ, కాల రాశారు. విలీనమై 60 సంవత్సరాలైనా కూడా ఆంధ్ర తెలంగాణా ప్రజల మధ్య ఆత్మీయతలు తరిగి, అగాధాలు పెరగడం ఒక విషాదం.

ఒక ప్రాంత దాష్టీకాన్ని ఎదిరించిన అమర జీవి పొట్టి శ్రీరాములు మరో ప్రాంతంపై అదే దాష్టీకాన్ని కొనసాగించడాన్ని ఇష్టపడతారని అనుకోలేం.
ఆయన కోరుకున్నది తమిళుల పెత్తనం నుంచి విముక్తి తప్ప తెలంగాణా ప్రజల మీద అజమాయిషీ కానే కాదు. ఆయన మద్రాసు రాజధానిగా గల ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నారే తప్ప హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణా పై పెత్తనాన్ని కాదు. ఒప్పందాలను ఉల్లంఘించడం, హామీలను తుంగలో తొక్కడం, ముందు ఒకటి చెప్పి తరువాత ఒకటి చేయడం, 'తొండి'కి దిగడం అమర జీవి పొట్టి శ్రీరాములు స్వభావానికి ఏమాత్రం సరిపడని అంశాలు. ఆయన ఈ బూటకపు మాటలను, బలవంతపు కాపురాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించి వుండేవారు కాదు గాక కాదు.

కాబట్టి 1956 కు ముందరి ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను గౌరవించడమే నేడు పొట్టి శ్రీరాములుకు మనం అర్పించే నిజమైన నివాళిగా భావించాలి.