
నిన్న మొన్నటి వరకూ ''ప్రత్యేక తెలంగాణా'' అనేది కొంతమంది ''రాజకీయ నిరుద్యోగులు'' చేస్తున్న ఆర్భాటంగా 'లైట్' తీసుకున్నాను. గుప్పెడు మంది స్వార్థపరులు ఆడుతున్న నాటకంగా పెదవి విరిచాను. దుర్మార్గమైన ''వేర్పాటు వాదం'' గా ఈసడించుకున్నాను.
రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఇస్తే దేశం ముక్క చెక్కలైపోతుందని ఆవేశపడ్డాను. భారత పాకిస్థాన్‌ల మాదిరి వైషమ్యాలు తలెత్తి తెలుగు ప్రజల ''సమైక్యత'' సర్వనాశనమై పోతుందని ఆవేదన చెందాను.
కె.సి.ఆర్. అనే వ్యక్తికి (2000 సంవత్సరంలో) చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వక పోవడం వల్లనే ఈ గొడవ తలెత్తిందనీ, ఆయనకు గనక అప్పుడు ఓ మంత్రి పదవి పడేస్తే మిగతా తెలంగాణా నాయకమ్మణ్యుల్లా ఈయనా కిక్కురుమనకుండా పడివుండేవాడు కదా అని నమ్మాను.
అతను ఈ తెలంగాణా వాదాన్ని తీసుకురాకపోతే-
ఆంధ్రావాళ్లు, రాయల సీమవాళ్లు, అట్లాగే హైదరాబాద్‌లోనూ, ఇతర తెలంగాణా జిల్లాల్లోనూ లక్షలాదిగా స్థిరపడిన ''సెటిలర్లు'' అందరూ ... ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో వుండేవారు కదా ...అని అనేకానేకసార్లు మదనపడ్డాను.
పిల్ల నిచ్చిన మామ నుంచి ''అదనపు కట్నం'' గా ముఖ్యమంత్రి పదవినే లాక్కున్న బాబు, ఈ అర్భకుడి మొహాన ఓ మంత్రి పదవి కొడితే ఏం పోయేదని చాలా సార్లు తెగ బాధపడిపోయాను. కె.సి.ఆర్. మీద కంటే అతనికి మంత్రిపదవి నిరాకరించి తప్పు చేసిన బాబు మీదే నాకు ఎక్కువ మంటగా వుండేది.
ఒక మంత్రి పదవి పడేస్తే కే సి ఆర్ తెలంగాణా జపం చేసేవాడే కాదని అందరిలా నేను కూడా భావించినప్పటికీ, ఆయనకు ఏకంగా కేద్ర మంత్రి పదవి వచ్చినా తెలంగాణా వాదాన్ని ఇంకా ఎందుకు అంటి పెట్టుకుని వుండి పోయాడో అర్ధం అయ్యేది కాదు. అంత స్వార్ధ పరుడు, రాజ కీయ నిరుద్యోగి అన్న ముద్ర పడ్డ వ్యక్తీ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర మంత్రి పదవి లభించినా దానిని గడ్డి పోచలా ఎట్లా విసిరి కొట్ట గలిగాడో, అన్ని సార్లు ఎం పీ సీటుకు రాజీనామా చేసి వేరు వేరు నియోజక వర్గాల్లో ఎట్లా విజయం సాధించ గలిగాడో ఆయనకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చేదో అని నేను ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోలేదు. కే సి ఆర్ రాజకీయ నిరుద్యోగి అన్న పాత పాటనే అరిగిపోయిన రికార్డులా పాడుకుంటూ, నిందిస్తూ, అసహ్యంగా వితండ వాదం చేస్తూ కూచుంది పోయాను.
సరే మేం పుట్టిందే తెలంగాణా సాధన కోసం అనే తె. రా. స. తెలంగాణా జపం చేయడంలో పెద్దగా ఆశ్యర్య పోవాల్సిందేమీ లేదు. కానీ రాష్ట్రం విడిపోకూడదని కోరుకునే (!) కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికలలో తెరాసతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి రావడం తెరాస వాళ్లకి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిపదవులివ్వడం, తెలంగాణా అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టి ప్రధాన మంత్రి చేత, రాష్ట్రపతిచేత పార్లమెంట్‌లో చెప్పించడం, ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేసి నాటకమాడటం మాత్రం నాకు ఒక పట్టాన జీర్ణమయ్యేది కాదు.
అట్లాగే సమైక్యవాదం జపిస్తూ, తన హయాంలో ''తెలంగాణా'' అన్న పదాన్ని కూడా ఉచ్ఛరించనివ్వని నికార్సయిన సమైక్య తెలుగుదేశం పార్టీ - తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేయడం, తెరాసతో పొత్తు పెట్టుకుని 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం నన్ను మరింత గందరగోళానికి గురిచేసింది.
సీపీఐ, బిజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కూడా తెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలు చేయడంతో బెంబేలెత్తి పోయాను. ఈ పార్టీలన్నీ ఉత్తిత్తిగానే, ఒల్లెక్కలకు తెలంగాణా పాట పాడాయి కానీ లోపల వాటి ధ్యేయం సమైక్యతే అని ఆత్మవంచన చేసుకోవడం నా వల్ల కాలేదు.
తెలంగాణాకు ప్రజల్లో మద్దతు లేకపోతే ఇన్ని ప్రధాన పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ఎట్లా తీర్మానం చేస్తాయి. ఒకవేళ ఓట్ల కోసం అట్లా ''బడాయి'' తీర్మానాలు చేసినా అవి సమైక్యతనే కోరుకుంటున్నాయని అనుకున్నా అది తెలంగాణా ప్రజల్ని మోసం చేయడమే కదా?
ఇట్లా చూసినా మెజారిటీ తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటున్నట్టు రూఢి అవుతోంది కదా?
అయినా నేను ఇన్నాళ్లూ ఈ విషయాలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించకుండా అందరిలాగే మెజారిటీ ప్రజల ఆకాంక్షను పక్కనపెట్టి, అసలు సమస్యను గాలికి వదిలేసి తెరాస పార్టీ కుప్పిగంతులమీద, అది వేసే డ్రామాల మీద, ''బక్కోడు'' (ఈ మాట నాది కాదు, నికార్సైన సమైక్యవాదులది) ఉపయోగించే భాష మీద, తెరాసకు వచ్చే ఓట్ల మీద, సీట్ల మీద,తెలుగు తల్లి మీద, తెలంగాణా తల్లి మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి వాదోపవాదాలు చేస్తూ వచ్చాను.
తెరాస టికెట్‌తో గెలిచిన 26 మంది ఎంఎల్‌ఎలలో 10 మందిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బుట్టలో వేసుకున్నప్పుడు, తెరాసలో నెంబర్ టూ టైగర్ నరేంద్రను కూడా చాకచక్యంగా లోబరచుకున్నప్పుడు, విజయశాంతి మీదకు కూడా గేలం విసిరినప్పుడు, తెలంగాణా వాళ్ల మీదకు తెలంగాణా వాళ్లనే ఉసి కొల్పుతున్నప్పుడు లోలోపల అట్లాంటి పనులు చేయడం ధర్మం కాదని అంతరాత్మ ఘోషిస్తున్నా .... ఏదో ఒక విధంగా సమైక్యత నిలబడుతోంది కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను అందరిలా శాడిస్టిక్‌గా ఆనందించానే తప్ప అది లత్తకోరు, ఫాక్షనిస్టు రాజకీయం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాదని గట్టిగా ఎవరితోనూ అనలేకపోయాను.. దానివల్ల మన సమాజంలో, రాజకీయాలలో విలువలు మరింత పతన మవుతాయన్న భావన నాకు అప్పుడు ఏ కోశానా రాలేదు. వచ్చినా ''తెలంగాణాను వ్యతిరేకించే మైకం''లో దానిని ఏమాత్రం పట్టించుకోలేదు.
మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెరాస పోటీ చేయాడానికి కూడా భయపడి తోక ముడిచి మొహం చాటేసినప్పుడు ఇక తెలంగాణా వాదం పని అయిపోయినట్టే ... ప్రజల్లో తెరాసకి పలుకుబడి పూర్తిగా తగ్గి పోయినట్టే అని సంబరపడ్డాను. ఒకవేళ తెరాస పోటీ చేసి ఓ పదో పాతికో కార్పొరేటర్ సీట్లు గెలిచినా మన ఘనత వహించిన నూరేళ్ల చరిత్ర వున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ తెరాస కార్పొరేటర్లని అవలీలగా కొనిపారేసిది. గొడవ వొదిలిపోయేది. అయితే అది వేరే విషయం.
కెసిఆర్ ''ఆమరణ'' దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు ''ఉత్తర కుమారుని'' ప్రగల్భంగా ఎంత నవ్వుకున్నానో. 24 గంటల్లో దీక్ష తుస్సవుతుంది, తెలంగాణా ఫట్టవుతుంది అని చంకలు గుద్దుకున్నాను. ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కెసీఆర్‌ను అనవసరంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టడం, ఆయనేమో జైల్లోనే దీక్ష కొనసాగించడం నన్ను మళ్లీ కొంత ఆందోళనకు గురి చేసింది. అయితే రెండో రోజు బలవంతంగా సెలైన్ ఎక్కించగానే కెేసీఆర్ దీక్ష విరమించినట్టు ప్రకటించగానే ఫినిష్ ప్రత్యేక తెలంగాణా వాదానికి శాశ్వతంగా నూకలు చెల్లినట్టే అని ఎగిరి గంతులేశాను.
కానీ ఆ మరుక్షణమే తెలంగాణాలోని విద్యార్థులు తిరగబడి కేసీఆర్‌ని తెలంగాణా ద్రోహిగా ప్రకటించి ఇక నుంచి తెలంగాణా ఉద్యమాన్ని తామే నడుపుతామని చాటడంతో షాక్‌కు గురయ్యాను. విద్యార్థుల వార్నింగ్‌కి జడిసిన కెసిఆర్ నేను దీక్ష విరమించలేదు, అదంతా పోలీసుల కుట్ర అనడం, దీక్ష కొనసాగించడం దరిమిలా పరిస్థితి అంతా ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా మారిపోవడం నన్ను మళ్లీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణా లోని అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు రోడ్ల మీదకు వచ్చి జై తెలంగాణా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటే
ఇంకా నేను కెసిఆర్ భాష గురించి,
టిఆర్‌ఎస్‌కు వచ్చిన అసెంబ్లీ సీట్ల గురించి
చర్చించుకుంటూ
తెలంగాణాలో మెజారిటీ ప్రజలు తెలంగాణాను కోరుకోవడం లేదని బుకాయిస్తూ ఆత్మవంచన చేసుకోలేకపోతున్నాను.
అందుకే ఈ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కెసిఆర్ ఒక్కడి ఉద్యమం కాదు.
నాలుగుకోట్ల తెలంగాణా ప్రజల ఉద్యమంగా మారిపోయింది. తెలంగాణా ప్రజల బలమైన ఆకాంక్షలో నిజాయితీ వుంది, నిబద్ధత వుంది, న్యాయం వుంది.
1956లో తెలంగాణాను ఆంధ్రాలో విలీనం చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రజలు విడిపోవాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపే నిజాయితీ మన ప్రజాస్వామ్యానికి ఎలాగూ లేదు.
అన్ని పార్టీలూ తాము తెలంగాణాకు అనుకూలమే అంటూ తీర్మానాలు చేసి ప్రజలను వంచించి ఓట్లు దండుకుంటున్నాయి.
ఒక్క పార్టీ కూడా మేం సమైక్యవాదులం.
ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులం అని ధైర్యంగా ప్రకటించిన పాపానపోలేదు.
అంత ధైర్యం ఏ ప్రధాన పార్టీకీ లేదు.
అట్లాంటప్పుడు తెరాసకి వచ్చినవి మాత్రమే తెలంగాణా కోరుకునే వారి ఓట్లు
మిగతా పార్టీలకు వచ్చినవన్నీ సమైక్యతను కోరుకునే వారి ఓట్లు అని ఎట్లా అంటారు?
దానంత పచ్చి అవకాశ వాదం, దుర్మార్గం మరొకటి వుంటుందా?
ఇవాళ తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్రంకోసం ఎంతో మంది ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజిస్తున్నా కూడా స్వార్థపరులైన రాజకీయ నాయకుల్లాగా ఉష్ట్రపక్షుల్లా వ్యవహరించడం నా వల్ల కాదనిపించింది.
1956లో ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల ఎత్తులకు, జిత్తులకు మోసపోయే తెలంగాణా ఆంధ్రాలో విలీనమయింది. అప్పటి పెద్ద మనుషుల ఒప్పందాలను, ముల్కీ నిబంధనలను, ఫజల్ అ లీ మిషన్, గిర్‌గ్లాని కమిషన్ నివేదికలను, 610 జీవో మొదలైనవాటన్నింటినీ తుంగలో తొక్కడం వల్లనే, విలీనమప్పుడు చేసుకున్న ఒప్పందాలకు నిజాయితీగా కట్టుబడి వుండకపోవడం వల్లనే... నిధులూ, నీళ్లు, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరగడం వల్లనే .... తెలంగాణా ప్రజల్లో విడిపోతే తప్ప బాగుపడమన్న భావన బలంగా ఏర్పడింది. ఇప్పుడు ఏ పైపూతలు, లేపనాలు, లేహ్యాలు, ఒప్పందాలు, ఏ అభివృద్ధి లెక్కలూ పత్రాలూ చైతన్యవంతులైన తెలంగాణా ప్రజలను ఏమార్చలేవు. అవన్నీ ఇక వృధా ప్రయాసే!
నిన్నమొన్నటి పొత్తులు, ప్రణబ్ కమిటీ, రోశయ్య కమిటీ నాటకాలు, తెలంగాణా అనుకూల తీర్మానాలు, నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరించే రాజకీయ అవకాశవాదం తెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొడుతున్నాయి.
కడపులో లేంది కావలించుకుంటే రాదంటారు.
మేడిపండులాంటి సమైక్యత వల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ వుండదు.
మన సమైక్యతని రాజకీయ అవకాశవాదులు, పెట్టుబడిదార్లు, భూస్వాములు, కాంట్రాక్టర్లు ఎప్పుడో మలినం చేశారు. ఇప్పుడది సెప్టిక్ అయివుంది. ఇంకా తాత్సారం చేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఎన్నో నిండు ప్రాణాలు బలవుతాయి.
తెలంగాణా ఆంధ్ర విడిపోవడం వల్ల సామాన్యులకు, నిజాయితీపరులకు ఒనగూడే నష్టం ఏమీ వుండదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడ్తున్నది ఇరుప్రాంతాల స్వార్థపరులూ, అవకాశవాదులే.
తెలుగువాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది వున్నారు. తెలంగాణా ఆంధ్రాల్లో వున్నవాళ్ల సంఖ్య కేవలం 8 కోట్లే. ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినంత మాత్రాన తెలుగు ప్రజల ఐక్యతకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. హిందీ వాళ్లకు ఆరేడు రాష్ట్రాలు వుండగా లేనిది మనకు రెండో మూడో రాష్ట్రాలు వుంటే తప్పేమిటి? బలవంతపు కాపురం వల్లనే మన సమైక్యత, మన సహృద్భావం దెబ్బతింటాయి. కాబట్టి నేను నా సమైక్యవాదానికి తిలోదకాలిస్తూ, ఆంధ్ర - తెలంగాణా రాష్ట్రాలు సామరస్యంగా, అన్నదమ్ముల్లా విడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(గల్పిక)
తెలంగాణా చరిత్ర గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే వారి కోసం కొన్ని లింకులు:
video.google.com/videoplay?docid=7730660376611492753#
http://www.telangana.org/TelanganaFAQ.asp
http://discover-telangana.org/wp/2002/08/06/gentlemens_agreement_andhra_telangana_1956/
http://discover-telangana.org/wp/2007/06/14/6point_formula_girglani_report_vol2/
http://telangana1969.com/martyrs1.html
http://telanganamedia.wordpress.com/
http://discover-telangana.org/
http://www.telangana.org/Home.asp
JAI TELANGANA ! JAI ANDHRA !! JAI RAYALA SEEMA !!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,