Saturday, January 31, 2009

సృష్టి




( .... ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురైనా,ఎవరైనా తుమ్మినా కొందరు ప్రయాణాలు మానేస్తారు. అట్లాంటి మూఢనమ్మకాల వల్ల ఇతర్లకు ఇబ్బందేం లేదు. అది వాళ్ల వ్యక్తిగత బలహీనత అనుకుని వదిలేయొచ్చు. కానీ మరికొన్ని నమ్మకాలు ఇతర్లకి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.

మా శివరామయ్య తాతకు (పేరు, వరుస మార్చాను) అనేక నమ్మకాలుండేవి. శుభకార్యం మీద వెళ్లేటప్పుడు విధవరాలు ఎదురుపడితే ఆయనకు పూనకం వచ్చినట్టయ్యేది. మంచి చెడు విచక్షణ లేకుండా ఆమె మొహం మీదనే తిట్లవర్షం కురిపించేవాడు. ఆయన నోటి దురుసు వల్ల అందరికీ చచ్చే చావయ్యేది. ఆయన నోటికి భయపడి చాలా మంది ఆయనని చూడగానే పారిపోతుండేవారు. దుశ్శకునం అంటే ఆయనకు చెడ్డ భయం. ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్తున్నా తన మనవరాళ్లలో ఒకరిని ఎదురు రమ్మనేవాడు. అట్లా ప్రతిసారీ ... శుభశకునాన్ని ... స్వయంగా ఏర్పాటుచేసేవాడు.

జాతకాలు, ముహుర్తాలు అంటే ఆయనకు మహా పిచ్చి. ఆ పిచ్చి వల్ల ఒకసారి తన కూతురి ప్రాణాలమీదకు వచ్చింది. ఆ వాస్తవ సంఘటనపై ఆధారపడి రాసిన కథ ఇది)


సృష్టి (కథ)




సున్నం కొట్టిన రాతి బంతిలా వున్నాడు చంద్రుడు!

దండలోంచి జారిపోయిన ముత్యాల్లా అక్కడొకటి ఇక్కడొకటిగా మిణుకు మిణుకు మంటున్నాయి నక్షత్రాలు!

సూర్యుడు పొద్దంతా భూమ్మీద చల్లిన నిప్పులు ఎప్పుడో బూడిదగా మారిపోయాయి!

చేతులు చాచి తిరుగుతున్న సీలింగ్‌ ఫాన్‌కు జడిసి కిటికీ దగ్గరే తచ్చాడుతోంది పిల్లతెమ్మెర!

రెప్పలతో కళ్లని ఎంతసేపు బంధించినా రాజ్యానికి కునుకు రావడం లేదు. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు తనకూ నిద్ర రావడంలేన్న విషయాన్ని కాళ్లతో తంతూ తెలియజేస్తోంది!

ఆ లేత కాళ్లని సున్నితంగా దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నించింది రాజ్యం. అవి చిక్కినట్టే చిక్కి బుడుంగున జారిపోయాయి. లోపల బిడ్డ పల్టీలు కొడుతున్నప్పుడల్లా తీయని నొప్పి కలుక్కుమంటోంది.

పొట్టను గోముగా నిమురుకుంటూ ''ఇది మహాగడుసుదయ్యేలా వుందే'' అనుకుంది. ఆ మరుక్షణమే ఒక్కసారి ఉలిక్కిపడింది.
పుట్టబోయేది ఖచ్చితంగా ఆడపిల్లే అన్నట్టు ఊహించుకుంటోందేమిటి తను?!

కొంపదీసి ఈసారి కూడా ఆడపిల్లే పుడితుందా...?

అమ్మో వద్దు వద్దు..! తనకు బాబే కావాలి.... బాబే కావాలి...!

''ఒరేయ్‌ నువ్వు బాబువే కదూ...? అవును బాబువే...! అందుకే ఈ తల్లిని అంత బలంగా తన్న గలుగుతున్నావు!! ఆడపిల్లవైతే నీకు ఇంత శక్తి ఎలా వుంటుంది?... నువ్వు బాబువే...కచ్చితంగా బాబువే! కానీ ఒరే కన్నా ... నా చిట్టి తండ్రీ...అందరు మగాళ్లలా నవ్వు మాత్రం పెద్దయ్యాక కఠినాత్ముడివి కాకూడదు నాన్నా...! నీ మనసు నవనీతంలా వుండాలి... నీది జాలిగుండె కావాలి...నా రక్తం పంచుకు పుడుతున్నావు ... నా గుణాల్ని కొన్నైనా అ లవర్చుకోవూ..?!

రాజ్యం మనసంతా అదోలా అయిపోయింది!

ఆమెకిది నాలుగో కాన్పు. ముందరి మూడు కాన్పుల్లో ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారు. ఈసారి కూడా ఆడపిల్లే పుడితే పరిణామాలు ఎలా వుంటాయో తలచుకుంటేనే భయమేస్తోందామెకు.

భర్తా, అత్తమామలూ ఈసారి మగపిల్లవాడే పుడతాడని ఎంతో ధీమాగా వున్నారు!

మామ శ్రీమన్నారాయణ జ్యోతిష్య శాస్త్రంలో పండితుడు. 'జ్యోతిష్య రత్న' అన్న బిరుదుకూడా వుందాయనకు. (ఎవరిచ్చారో తెలియదు). జ్యోతిష్యం ఆయనకు వ్యాపకమేకాదు, వ్యాపారం కూడా! వాళ్లకీ వీళ్లకీ జాతకాలు చెప్పి ఇంతో అంతో డబ్బు సంపాదిస్తుంటారు.

తన తొలికాన్పు ఆడపిల్లేనని మూడో నెలలోనే ప్రకటించేశారాయన. మలికాన్పు కూడా ఆడపిల్లేనని ముందుగానే చెప్పేశారు. మూడో కాన్పు సమయంలో మాత్రం ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. గ్రహగతుల లెక్కల్లో ఏదో తేడా వస్తోందనీ... అయితే ఆడపిల్ల ... లేకుంటే మగపిల్ల ... అన్నట్టు సందిగ్ధంగా చెప్పారు.

కానీ, ఇప్పుడు... ఆరు నూరైనా, నూరు ఆరైనా తమ వంశాంకురమే జన్మించబోతున్నట్టు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆయన జోస్యం ఇంట్లో అందరికీ ఎనలేని ఆనందాన్ని కలిగిస్తే రాజ్యంలో మాత్రం అంతులేని భయాన్ని రగిలించింది.

పొరపాటున మళ్లీ ఆడపిల్లే పుడితే తనకు ఏ గతిపడ్తుందో?!

ఆమె తన మనసులోని భయాన్ని భర్త పార్వతీశం వద్ద ఒకసారి జంకుతూనే ప్రస్తావించింది. దానికతను ఇంతెత్తున ఎగిరిపడ్డాడు.
''నాన్న గారి జోస్యాన్నే శంకిస్తావా? బుద్ధుందా నీకు..? యేం.. ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావు. ఇంకా తనివి తీరలేదా? ఈసారి కూడా ఆడపిల్లనే కనాలనుందా?'' అంటూ ఛడామడా దులిపేశాడు.

అసలు మొదటి సారి ఆడపిల్ల పుట్టిందని తెలిసినప్పుడే అతని మొహం ముడుచుకుపోయింది. రెండోసారి, మూడోసారి కూడా వరుసగా కూతుళ్లే పుట్టేసరికి దాదాపు పిచ్చెక్కినంతపనయింది.

కూతుళ్లని చూస్తే అప్పులవాళ్లని చూసినట్టుగా వుంటుంది పార్వతీశానికి.

''రేపు ఈ ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయడం ఎలాగ? ఎంత తలకు మాసిన సంబంధాలకైనా ఒక్కో పెళ్లికి ఒక్కో లకారమైనా కావాలి. ముగ్గురికీ మూడు లక్షలంటే ఎక్కడినుంచి తేగలడు తను? ఆడపిల్లల వల్ల అంతా నష్టమే తప్ప దమ్మిడీ లాభం లేదుకదా...'' ఇవీ అతని ఆలోచనలు.

దీనికి తోడు ఒక్క కొడుకైనా లేకపోతే ఎలాగ? పున్నామ నరకం సంగతటుంచి... తమ వంశం ఏమైపోవాలి అన్న బెంగ కూడా వుందతనికి. కారణం తల్లితండ్రులకి తనొక్కడే సంతానం. తనకి కొడుకులు పుట్టకపోతే తమ ఇంటిపేరు తనతోనే అంతరించిపోతుంది!
'భార్య అపశకునం పలుకులు పొరపాట్న నిజమైతే?! అమ్మో... ఇంకేమైనా వుందా. తను తట్టుకోలేడు. పెళ్లిళ్ల సంగతి దేముడెరుగు..నలుగురు ఆడపిల్లల్ని పెంచి పెధ్ద చేయడం కూడా తనవల్లకాదు. బడిపంతులిగా తన బొటాబొటి జీతం వాళ్ల గాజులకీ, రిబ్బన్లకీ, కొబ్బరి నూనెకీ, పౌడర్లకే చాలదు.'

తండ్రి జోస్యం మీద ఎంత గురీ గౌరవం వున్నప్పటికీ ... అతని మనసులో కూడా ఏదో మూల చిన్న అనుమానం తొలుస్తూనే వుంది.

ఆలోచించిగా ఆలోచించగా ఆ సమస్యకు ఓ పరిష్కార మార్గం తట్టిందతనికి.

గర్భస్థ శిశువు ఆడో మగో తేల్చిచెప్పే వైద్యకేంద్రాలు హైదరాబాద్‌లో బోలెడు వుంటాయట. అక్కడికి రాజ్యాన్ని తీసుకెళ్ళి పరీక్షచేయిస్తే సరి. పుట్టబోయేది మగపిల్లవాడైతే సరేసరి. లేదంటే గుట్టు చప్పుడు కాకుండా అక్కడే అబార్షన్‌ చేయిస్తే పీడాపోతుంది అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు.

నిజం చెబితే ''నా కొడుకువై వుండి నా జోస్యాన్నే శంకిస్తున్నావుట్రా'' అని నాన్న బాధ పడతాడు. కోపగించుకుంటాడు. అందుని దగ్గరి స్నేహితుడి పెళ్లనీ, తప్పనిసరిగా వెళ్లాలనీ తండ్రితో అబద్ధం చెప్పి భార్యతో సహా హైదరాబాదుకు పయనమయ్యాడు పార్వతీశం.
అప్పటికే రాజ్యానికి మూడోనెల దాటింది. భర్తతో బయలుదేరుతున్నప్పుడు రాజ్యానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదటి కాన్పు అయినప్పటినుంచీ ఎప్పుడూ పట్టుమని పావలా మల్లెపూలు కూడా తేని భర్త ఏకంగా తన మిత్రుడి పెళ్లికి తనని హైదరాబాదుకు తీసుకెళ్లడం చిత్రంగా అనిపించింది. పుత్రోత్సాహం అంటే ఇదే కాబోలు అనుకుంది.

హైదరాబాదులో వైద్య పరీక్షా కేంద్రంలో అడుగుపెట్టిన తరువాత గానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. నిజం తెలిసిం తరువాత గుండెలో కలుక్కుమన్నట్టయింది. దుఃఖం ముంచుకొచ్చింది. అబల, అందులోనూ తల్లీ తండ్రీ లేని అనాథ తను చేయగలిగేదేముంది.
ఆ పరీక్షా కేంద్రంలోని లేడీ డాక్టర్‌ ''ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు? మీలో ఎవరికైనా జన్యుపరమైన సమస్యలు, దీర్ఘ వ్యాధులు ఏమైనా వున్నాయా? ఇంతకు ముందు పుట్టిన పిల్లల్లో లోపాలేమైనా వున్నాయా? మీది మేనరికం వివాహమా?'' అంటూ ఎన్నో ప్రశ్నలు వేసింది.

పార్వతీశం మొదట ఖంగు తిన్నాడు. డాక్టర్ల వద్ద అబద్ధాలు దాగవన్న ఉద్దేశంతో తన మనసులోని ఉద్దేశాన్ని ఉన్నదున్నట్టు చెప్పేశాడు.

దయామయిలాంటి ఆ డాక్టర్‌కు పరిస్థితి క్షుణ్ణంగా అర్థమైపోయింది. రాజ్యం కళ్లలో కదలాడే భావాలని, భయాలని కూడా గమనించింది. పరీక్ష చేయాలన్న నెపంతో పార్వతీశాన్ని బయటకు పంపించి-

''ఏమ్మా! నీకీ పరీక్ష ఇష్టం లేదు కదూ?'' అంటూ అనునయంగా అడిగింది.

ఆమెవంక బేలగా చూసింది తప్ప ఔననీ కాదనీ ఎటూ చెప్పలేకపోయింది రాజ్యం.

''భయపడకమ్మా! నువ్వు చెప్పకపోయినా నిన్ను చూడగానే పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మేము ఈ పరీక్షలు చేస్తోంది నీలాంటి... నాలాంటి ఆడపిల్లల్ని ఈ లోకంలోకి రాకుండా చిదిమెయ్యడానికి కాదమ్మా'' అందావిడ.

రాజ్యం విస్మయంగా చూసింది.

''నిజమమ్మా! అసలీ పరీక్షలు ఎందుకు చేస్తారో తెలుసా? గర్భస్థ శిశువులో జన్యుపరమైన లోపాలేమైనా వుంటే కనుక్కోడానికి. అట్లా కనుక్కుంటే పిండదశలోనే వాటిని సరిచెయ్యడానికి వీలవుతుంది. అంతే తప్ప పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలుసుకుని ఆడయితే ఆ పిండాన్ని గర్భంలోనే విచ్ఛిన్నం చేసెయ్యడానికి కాదు. ఈ పరీక్ష ఎవరికి పడితే వారికి చెయ్యరు'' అంది.
డాక్టర్‌ మాటలు ఆమెకు కర్ణపేయంగా తోచాయి. అనిర్వచనీయమైన ఆత్మీయతకు ఎంతో స్వాంతన లభించినట్టయింది.

''పురుషుడు తన పుట్టుకకు కారణమైన తల్లిని గౌరవిస్తాడు! తనకు స్వర్గ సుఖాలందించే భార్యను ప్రేమిస్తాడు! కానీ, కూతురు పుట్టిందంటే మాత్రం గింజుకు చస్తాడు. ఇది ఒక్క నీ భర్త విషయంలోనే కాదమ్మా లోకంలో ఎక్కువమంది పురుషుల ఆలోచనా ధోరణి ఇలాగే వుంటుంది. అందుకని నువ్వేం బాధ పడనవసరం లేదు. అసలు రెండో బిడ్డ పుట్టగానే నువ్వు ఆపరేషన్‌ చేయించుకుంటే బాగుండేది'' అందామె.

''ఇంట్లో ఎవరూ ఒప్పుకోకుండా ఎలా సాధ్యపడుతుందండీ?!'' అంటూ పెదవివిప్పింది రాజ్యం.

''నిజమేలే. నిన్నొక పిల్లల్ని కనే యంత్రంలా చూసేవాళ్లు ఎలా ఒప్పుకుంటారు! ఒప్పుకోరు. కొడుకు పుట్టే వరకూ కంటూనే వుండమని శాసిస్తారు. కావాలని ఆడపిల్లల్ని కంటున్నావని ఆడిపోసుకుంటారు. ఈసడించుకుంటారు.'' అంటూ నిట్టూర్చిందా లేడీ డాక్టర్‌.

''నువ్వు చాలా బలహీనంగా వున్నావమ్మా. పైగా ఆడపిల్ల పుడుతుందో, మగపిల్లవాడు పుడతాడో అన్న బెంగతో అనుక్షణం కుంగిపోతున్నట్టున్నావు. బాధపడుతూ కూచోవడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు సృష్టి అనేది నీ చేతిలో వుందా... నా చేతిలో వుందా చెప్పు?!''

రాజ్యం కళ్లలో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి. తన మనసులోని ఆవేదనని తను చెప్పకుండానే ఎంత బాగా కనిపెట్టిందీ డాక్టర్‌' అనుకుంది.

''చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు ఒప్పుకుంటానంటే నేనొక చిన్న నాటక మాడతాను. నాకోసం కాదు. నీ కోసమే... నీ శ్రేయస్సు కోసమే. సమ్మతమేనా మరి?'' అనునయంగా అడిగిందామె.

రాజ్యం అప్రయత్నంగా సరేనన్నట్టు తలాడించింది.

ఆ లేడీ డాక్టర్‌ సంతృప్తిగా నవ్వి ''ఇప్పుడు నీ గర్భంలో పెరుగుతున్నది మగ శిశువేనని నీ భర్తకు చిన్న అబద్ధం చెబుతాను. ఈ పరీక్షలవీ నీకిప్పుడు అనవసరం. పైగా అవి నీ ఆరోగ్యానికి కూడా హానిచేస్తాయి. కాబట్టి రేపు ఆడపిల్ల పుట్టినా, మగ పిల్లవాడు పుట్టినా నువ్వేం బాధ పడకూడదు. అంతా విధి లీల అనుకో. అయినా ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్ల మగపిల్ల అంటూ విచక్షణ చూపడంలో అర్థంలేదు. నువ్వు నిశ్చింతగా, ధైర్యంగా వుండు. బాబు పుడుతున్నాడంటే మీ ఇంట్లో వాళ్లు నిన్ను బాగా చూసుకుంటారు. పుష్టికరమైన ఆహారం అందిస్తారు. అది నీకు చాలా అవసరం. ఎలాగూ బాబు పుడుతున్నాడు కాబట్టి ఇప్పుడే ఆపరేషన్‌ చేయించుకొమ్మని నీ భర్తకు గట్టిగా చెబుతాను... సరేనా?!''

రాజ్యం మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఈవిడెవరు...తనెవరు?! ఏ జన్మ అనుబంధమో తమది. ఈవిడ మనిషి కాదు దేవత... మనసులోనే చేతులెత్తి నమస్కరించింది.

డాక్టర్‌ చెప్పిన తీయని అబద్ధం విన్న పార్వతీశానికి హిమాలయా పర్వతాల్ని అధిరోహించినంత మధురానుభూతి కలిగింది.

మగపిల్లవాడు పుడతాడని తన తండ్రి ప్రవచించినప్పుడు కలిగిన ఆనందానికి... ఇప్పుడు అదేమాట డాక్టర్‌ నోట విన్నప్పుడు కలిగిన ఆనందానికి మధ్య పోలికేలేదు.

ఎందుకంటే అది కేవలం విశ్వాసం. ఇది శాస్త్రీయ విజ్ఞానం.

హైదరాబాదు నుంచి తిరిగొచ్చిన వారం రోజుల్లోనే పార్వతీశం వేసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. ముగ్గురు పిల్లల తరువాత ఆపరేషన్‌ చేయించుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్‌ ఇంక్రిమెంట్‌ ఇస్తారు. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత చేయించుకుంటే ఇవ్వరు. అన్న ప్రలోభం కూడా అందుకో కారణం.

తన జోస్యం మీద తన కొడుక్కి వున్న అచంచలమైన విశ్వాసానికి శ్రీమన్నారాయణ కూడా ఎంతో పొంగిపోయాడు. ఆ క్షణం నుంచీ కొడుకు జాతకాన్ని, కోడలు జాతకాన్ని, పంచాగాల్ని ముందేసుకుని ఒకటే లెక్కలు వేయడంలో మునిగిపోయాడు.

భర్త వేసక్టమీ ఆపరేషన్‌ చేయించుకోవడం, మామయ్య ఎప్పుడూ తమ జాతకాలతో అదేపనిగా కుస్తీపడ్తుండడం రాజ్యంలో రోజురోజుకి భయాన్ని, బెదురుని పెంచేశాయి. భర్త తన మీద ఎన్నడూ లేనంత అనురాగాన్ని కురిపిస్తున్నా ఆమెకు ఏమాత్రం అది నిజమైన సంతోషాన్ని అందింరీచడం లేదు.

... ... ... ...


కడుపులో శిశువు బలంగా తన్నడంతో ఆలోచనలనుంచి తేరుకుని 'అబ్బ ఏమిటే ఇది' అంటూ పైకి అనేసింది. అంతలోనే తన పొరపాటు తెలుసుకుని ''ఒరే ఏమిట్రా బాబూ ఈ పని' అని తన తప్పును తనే సరిదిద్దుకుంది.

ఫ్యాన్‌ ఎంత స్పీడ్‌గా తిరుగుతున్నా ఆమెకు ఉక్కపోస్తున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా మంచం దిగింది.

భర్త ఆద మరచి నిద్రపోతున్నాడు. మరో మంచం మీద ముగ్గురు కూతుళ్ళూ అస్తవ్యస్తంగా పడుకుని వున్నారు. వాళ్లని చూస్తే చాలా జాలిగా అనిపించింది. ఇంట్లో ఎవరికీ వీళ్ల మీద ఇప్పుడే ప్రేమ లేదు. రేపు నిజంగానే కొడుకు పుడితే వీరి పరిస్థితి ఇంకెంత దయనీయంగా తయారువుతుందో.

కూతుళ్లనందరినీ సరిగా పడుకోబెట్టి, దుప్పటి కప్పింది.

నెమ్మదిగా కిటికీ వద్దకు వెళ్లి నిలబడింది. బయటి నుంచి వీచిన చల్లని గాలి శరీరానికి తగిలి ప్రాణం లేచొచ్చినట్టయింది. కిటికీ లోంచి చంద్రుడు ఆకాశంలో వేలాడదీసిన సిరిమల్లె చెండులా కనిపిస్తున్నాడు. కాసేపు ఆరుబయట చల్లని నిండుపున్నమి వెన్నెలలో కూచోవాలనిపించింది రాజ్యానికి.

భారంగా అడుగులు వేసుకుంటూ తలుపు దగ్గరకు నడచి గొళ్లెం తీసేందుకు చేయి పైకెత్తింది. అంతే కడుపులో ఎక్కడో గట్టిగా కలుక్కుమన్నట్టయింది.

''అమ్మా..!'' అంటూ పొట్టను పట్టుకుని బాధతో విలవిలలాడిపోయింది.

ఆమె అరుపు విని దిగ్గున లేచాడు పార్వతీశం. ''ఏమిటి రాజ్యం? ఏమైంది?'' ఆందోళనగా అడిగాడు.

''అబ్బే ఏం లేదండీ. కాస్త అత్తయ్యని పిలవండి.'' అంది రాజ్యం పంటి బిగువన బాధను అణచిపెట్టుకుంటూ.

పార్వతీశం బెంబేలు పడిపోతూ వెళ్లి తల్లినీ, తండ్రినీ నిద్రలేపాడు.

రాజ్యాన్ని పరిశీలించిన పార్వతీశంతల్లికి అవి పురిటి నొప్పులేనని బోధపడింది. ఆ విషయమే చెప్పి త్వరగా మంత్రసానిని పిలుచుకురమ్మని కొడుకుని పురమాయించింది.

ఆ ఊళ్లో నాటు మంత్రసాని తప్ప మెటర్నిటీ డాక్టరెవరూ లేరు. దేనికైనా పాతిక కిలోమీటర్ల దూరంలో వున్న పట్నం వెళ్లాల్సిందే.
పార్వతీశం లుంగీ బనీను మీదే పరుగు లంకించుకున్నాడు.

విషయం తెలిసిన శ్రీమన్నారాయణ పంచాగాన్ని, జాతకాల పుస్తకాలని పట్టుకుని వరండాలోని వాలు కుర్చీలో కూర్చున్నారు. కళ్ల జోడు సవరించుకుని, సీరియస్‌గా తిథి, వార, నక్షత్రాల్ని, గ్రహగతుల్ని గణించడం ప్రారంభించారు.

హఠాత్తుగా ఆయన భృకుటి ముడిపడింది.

ఎంత తరచి చూసినా ఇది భయంకరమైన దుర్ముహూర్తం!

మరో రెండు ఘడియల తరువాత అయితే పుట్టేవాడు మహర్జాతకుడు అవుతాడు. లేక లేక పుడుతున్న తమ వంశాకురం పరమ దురదృష్టకరమైన ఘడియల్లో పుడితే ఎట్లా?!

ఆయన మనసు విలవిలలాడసాగింది.

ఇదే పట్నంలో అయితే నొప్పులు కొంచెం ముందుగా రావలన్నా ... లేదా కాన్పు కొంచెం ఆలస్యంగా కావాలన్నా ఏవో ఇంజక్షన్లూ అవీ వుంటాయి. అవసరమైతే చెప్పిన టైంకి సిజేరియన్‌ చేస్తారు.

యాత్రలు, పండుగలు, పబ్బాలప్పుడు బహిష్టులను వాయిదా వేయడానికి ఇంట్లోని ఆడంగులకు టాబ్లెట్లు వాడటం మామూలే.

కానీ ఈ పల్లెటూర్లో, ఇంత రాత్రి వేళ ఇప్పుడు ఏం చేయగలడు?!

పెద్ద చిక్కే వచ్చిపడిందే.

ఒకరోజు ముందే పట్నం తీసుకెళ్లి ఏ నర్సింగ్‌ హోంలోనో చేర్పిస్తే ఎంత బాగుండేది. అయినా డాక్టర్‌ చెప్పిన డేట్‌న కాకుండా ఇంత త్వరగా నొప్పులు రావడం ఏమిటి?

శ్రీమన్నారాయణ అంతర్మథనంలో వుండగానే పార్వతీశం వీధిగేటు తీసుకుని లోనికి వచ్చాడు.

''మంత్రసాని ఏదిరా?!''

''వస్తోంది !'' అంటూ ఆగిపోయాడు. అతని దృష్టి తండ్రి తిరగేస్తున్న పంచాంగం మీద పడింది. ''గ్రహ స్థితి ఎలా వుంది నాన్నగారూ?'' అనడిగాడు పార్వతీశం ఆసక్తిగా.

శ్రీమన్నారాయణ తిథి, నక్షత్రాల పరిస్థితి అంతా వివరించారు.

''ఇప్పుడెలా మరి?!'' అయోమయంగా అడిగాడు పార్వతీశం.

అంతలో దండాలు పెట్టుకుంటూ మంత్రసాని వచ్చింది. శ్రీమన్నారాయణ ఆమెను ఆపి సంగతి చెప్పి ''కాన్పు రెండు గంటలు ఆలస్యం చేయడానికి వీలవుతుందా?'' అని అడిగాడు.

మంత్రసాని రెండు క్షణాలు తటపటాయించింది.

ఆమెకు ఆయన జాతకాల పిచ్చి బాగా తెలుసు. ''మీ కోడలు తలచుకుంటే అదెంతపని అయ్యగారూ?'' అంది.

''అయితే దానికి నువ్వే నచ్చ చెప్పు. ఎలాగైనా సరే కనీసం రెండు గంటలు గడిచేదాకా కాన్పు కాకుండా చూడు. నీకు మంచి ప్రతిఫలం ఇస్తాలే.'' అన్నాడాయన.

మంత్రసాని లోపలికి వెళ్లే సరికి రాజ్యం పిడికిళ్లు బిగించి తల అటూ ఇటూ విదిలిస్తూ బాధతో మెలికలు తిరిగిపోతోంది.

''కాన్పుకి ఇంకా వారం రోజుల టైం వుందని చెప్పారట కదమ్మా పట్నం డాక్టరు. అప్పుడే తొందరపడిపోతున్నారేమిటి మీ కోడలు?'' అందామె.

పార్వతీశం తల్లి ఏమీ మాట్లాడలేదు.

ఆవిడకు అప్పటికే గుండెదడగా వుంది. ఆమెకు హైబీపీ వుంది. పైగా రక్తం చూస్తే తట్టుకోలేదు. కళ్లు తిరుగుతాయి.

అందుకే ఆవిడ కావలసినవన్నీ మంత్రసానికి అందించి పక్కగదిలోకి తప్పుకుంది.

''ముగ్గుర్ని కన్నావు. ఇదే మొదటి కాన్పు అయినట్టు ఇట్లా బెంబేలు పడిపోతున్నారేటమ్మా'' అంటూ పరిహాసాలాడింది మంత్రసాని.

''అవతల మీ మాంగారు రెండు గంటలు ఆలస్యంగా కనమంటున్నారు. ఇక్కడ మీరేమో ఓ తొందరిపడిపోతున్నారేటి?'' అంటూ చీర తొలగించి పరీక్షించిందామె.

మంత్రసాని మాటల్ని వినే స్థితిలో గానీ, ఆమె చేష్టల్ని గమనించే స్థితిలో గానీ లేదు రాజ్యం.

పుట్టబోయేది ఆడపిల్లా - మగపిల్లాడా అన్న దిగులుతో ఆమె అప్పటికే చిక్కి శల్యమయింది. ఆమె ఒంట్లో నొప్పుల్ని భరించే శక్తి కూడా ఏమాత్రంలేదు.

మంత్రసానికి శిశువు మాడు కొద్దిగా కనిపించింది.

అబ్బో కాన్పు ఈ క్షణమో మరుక్షణమో అన్నట్టుగా వుంది ఇప్పుడెలాగబ్బా అని గాభరాపడిపోయింది. శిశువు మాడు మీద తన బొటనవేలు ఆన్చి నెమ్మదిగా లోనికి నెట్టింది.

రాజ్యం ఒక్కసారి కెవ్వుమని అరిచింది.

పొత్తి కడుపులో గునపాలు దించినట్టు విలవిలలాడిపోయింది. మంత్రసాని అదేం పట్టించుకోకుండా రాజ్యం రెండు మోకాళ్లని దగ్గరకని పట్టుకుంది.

ఒకటి రెండు నిమిషాల్లోనే శిశువు తల మళ్లీ మరింత స్పష్టంగా బయటకు అగుపించింది.

''వామ్మో ఈ దూకుడేంటి బాబో... ఇక్కడ ఏమంత కొంపలంటుకుపోతున్నాయనీ..'' అంటూ తిరిగి ఒడుపుగా బిడ్డను లోనికి నెట్టింది.

రాజ్యం ఆ రంపపు కోతను భరించలేక గొంతు చిట్లేలా అరుస్తోంది.

ఏదో చెప్పాలని ప్రయత్నించింది... కానీ, దుర్భరమైన బాధవల్ల మాటలు గొంతు దాటి వెలుపలికి రావడం లేదు.

బయట పార్వతీశం అటూ ఇటూ కాలు గాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు.

''కొడుకే పుడ్తాడు కదా.. నిజంగా కొడుకే కదా..'' అని అతనికి ఎంతో ఉద్వేగంగా వుంది.

వాలు కుర్చీలో కూర్చున్న శ్రీమన్నారాయణ ఇంకా పంచాంగంతో కుస్తీపడుతూనే వున్నాడు. మరికొన్ని క్షణాలు గడిస్తే దివ్యమైన ముహూర్తం వుంది. ఆ నక్షత్రాన పుట్టేవాడు మహర్జాతకుడు అవుతాడు....!

లోపల పరిస్థితి మరోరకంగా వుంది.

శిశువు తల మరింతగా బయటకు పొడుచుకువచ్చింది. ''వారినాయనో ఈ దూకుడేంటి బాబో...'' అని ఆందోళనపడిపోతూ మంత్రసాని బిడ్డ తలమీద అరచేయి ఆన్చి ఒకింత బలంగా మళ్లీ లోనికి అదిమింది.

దిక్కులు పిక్కటిల్లేంత బిగ్గరగా గావుకేక పెట్టింది రాజ్యం.

ఆ మరుక్షణమే ఆమెలో కదలికలు ఆగిపోయాయి.

ఒక్కసారి భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది అక్కడ.

గట్టిగా తోయడం వల్ల శిశువు అడ్డం తిరిగిపోయింది.

''అమ్మయ్య కాసేపు అట్లా ఏ గొడవా చెయ్యకుండా మిన్నకుండిపొండలాగ..'' అంటూ మంత్రసాని తాపీగా ఒక పక్కన కూచుని బొడ్లోంచి చుట్ట తీసి వెలిగించుకుంది.

బాధ వల్ల రాజ్యం సొమ్మసిల్లి వుంటుంది అనుకొందామె.

లోపల ఏం జరుగుతోందో బయటి వాళ్లకు తెలియదు. ఎవరి గొడవలో, ఎవరి ఆలోచనల్లో, ఎవరి నమ్మకాల్లో వాళ్లు మునిగి తేలుతున్నారు.

దుర్ముహూర్తం దాటేక నెమ్మదిగా తిరిగి తన పని ప్రారంభించబోయింది మంత్రసాని.

అప్పుడు గానీ తెలియలేదు ఆమెకు ... రాజ్యం పంచ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయని!

మంత్రసాని కళ్లు ఒక్కసారిగా బైర్లు కమ్మినట్టయ్యాయి. ఆమె చేతులు వణికి పోసాగాయి. గుండెల్లో దడ మొదలయింది. ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి.

''అయ్యో... అయ్యో...ఎంత గోరం జరిగిపోయిందిరా దేవుడో... నేనేం చేయాలిరా దేవుడో...'' అని మనసులోనే వాపోయింది. కనీసం చిన్న ప్రాణాన్నయినా బయటపడేద్దామనుకుని ధైర్యం కూడదీసుకుంది. అతి కష్టం మీద బయటకు లాగేసింది.
చూస్తే మగ బిడ్డే...!

కానీ... మృత కళేబరం...!!

బయటినుంచి శ్రీమన్నారాయణ కేకవేశాడు ''ఏమే కాన్పయిందా? సరిగ్గా టైం చూశావా? మగబిడ్డా... ఆడబిడ్డా?''

సమాధానం చెప్పేందుకు మంత్రసాని గొంతెలా పెగులుతుంది?

పెగలదు.

పెగలలేదు...!


---


(ఈనాడు ఆదివారం అనుబంధం, 11 ఆగస్టు 1991 సౌజన్యంతో)
(ఈ కథ కన్నడంలోకి అనువాదమై కన్నడ ప్రభ పత్రికలో ప్రచురించబడింది.)

6 comments:

  1. ప్రభాకర్ సర్ !సృష్టి కధ ఆద్యంతం స్త్రీల దయనీయతకు అద్దం పట్టేదిగా ఉంది .మనిషి ఒక వైపు దిగంతాల అంచులు చేరుకుంటున్నా ,మరోవైపు శకునాలూ ,జ్యోతిష్య శాస్త్రాలు నమ్ముతూనే ఉంటారు .దానికో ఉదాహరణ చెప్పమంటారా ? చంద్ర మండలం మీదకి రాకెట్ పంపించేటప్పుడు ముహూర్తం చూసి పూజలు చేసి ,కొబ్బరికాయలు కొట్టి పంపించడం .హాస్యాస్పదంగా అనిపించినా ఇది నిజం .ఆమధ్య పేపర్ లో మీరూ చూసే ఉంటారు .(ఇలా అంటున్నానని నేనేమీ నాస్తికురాలిని కానండోయ్ ) .ఐతే నమ్మకం వేరు ,మూఢ నమ్మకం వేరు .పిచ్చి నమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకోనేవారు నిజంగానే ఉన్నారు .కధ చదువుతున్నంతసేపూ రాజ్యం పాత్ర నా ఎదుటే ఉన్నఫీలింగ్ .మనసు ఆర్ద్ర మైపోయింది .సర్ !ఇటువంటి నమ్మకాల పర్యవసానాన్ని చక్కగా చెప్పారు .

    ReplyDelete
  2. ఒక సారి IRON LEG SAASTRI గారికి పిల్లి ఎదురు వచ్చిందట. శాస్త్రి గారికి ఏమి కాలేదు కాని .. పాపం ఆ పిల్లి లారి క్రింద పడి చచ్చింది.

    ReplyDelete
  3. @ పరిమళం గారూ
    కథ పై మీ స్పందన స్ఫూర్తి దాయకంగా వుంది.
    నమ్మకం వేరు - మూఢ నమ్మకం వేరు అని చక్కగా విశ్లేషించారు.
    రోగిని సకాలం లో ఆసుపత్రిలో చేర్పించి... బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకోవడం నమ్మకం.!
    ఆసుపత్రీ వద్దు ... మందులూ వద్దు ... ఏ విభూతో పూస్తే ... ఎలాంటి రోగమైనా ఇట్టే తగ్గిపోతుందనుకోవడం మూఢ నమ్మకం.!!
    మొదటి దాని వల్ల ఇతర్లకు ఇబ్బంది వుండదు.
    రెండోదాని వల్ల మాత్రం ఒకోసారి ప్రాణాల మీదకు వస్తుంది.
    దానితోనే మనకు పేచీ!
    చక్కని కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.

    @ కృష్ణారావు గారూ,
    జోకు బాగుంది.
    పాపం ఇట్లాంటి కామెడీ కే ఆయన బలి పోయాడేమో, చివరికి !
    ఈ ఐరన్ లెగ్ (కాలు పెట్టిన వేళా విశేషం ) మూఢ నమ్మకం ఎంతో మంది కొత్త కోడళ్ళ బతుకులను నిష్కారణంగా దుర్భరం చేస్తోంది !

    ReplyDelete
  4. కధ చివరికి వచ్చేసరికి వళ్ళు జలదరించింది.బిడ్డని వెనక్కి నెట్టడం.......నిజం గా అలా చెయ్యగలరా? నేనింకా వణుకుతూనే వున్నాను కధ చదివి.కధలో ఇచ్చిన సందేశం బాగుంది.

    ReplyDelete
  5. @ రాధిక గారూ
    ఈ కథ యదార్థ సంఘటన ఆధారంగా రాసింది. కాకపోతే ఆనాడు అదృష్టవశాత్తు తల్లి బిడ్డా క్షేమంగా బతికి బయటపడ్డారు. సిజేరియన్ ఆపరేషన్ల టైం విషయంలో ఇట్లాంటి ఒత్తిళ్ళు మీకు ఏ నర్సింగ్ హోం లోనైనా ఇప్పటికీ కనిపిస్తాయి. కథ రాస్తున్నప్పుడు నేనూ చాల ఇబ్బంది పడ్డ్డాను.

    ReplyDelete
  6. ప్రతి జంటకు ఒక్క బిడ్డ చాలు.మరో బిడ్డ కావాలంటే ఒక అనాధను దత్తత చేసుకోవటం మంచిది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని పది వేలరూపాయలకు పెంచితే మంచిది.

    ReplyDelete