Sunday, January 18, 2009

చెమ్మగిల్లిన కళ్లు''డాక్టర్‌గారు ఆపరేషన్‌ థియేటర్‌లో వున్నారు. బయటకు రావడానికి గంటన్నా పడుతుంది..!''
సిస్టర్‌ సమాధానంతో రామ్మూర్తికి ఒక్కసారి నీరసం ఆవహించినట్టయింది.

కూతురి పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. ఎక్కడి పనులు అక్కడే వున్నాయి.
తర్వాత వద్దామంటే డాక్టర్‌ గారు చాలా బిజీ మనిషి ... మళ్లీ దొరుకుతారో దొరకరో.

చేతిలో వున్న శుభలేఖల వంక చూసుకుంటూ ఎటూ పాలుపోక కాసేపు అట్లాగే నించుండిపోయాడు రామ్మూర్తి. చేయవలసిన ఇతర పనులకంటే ముందు డాక్టర్‌గారిని కలవడమే ముఖ్యమనిపించింది.
ఆసుపత్రి వరండాలో ఖాళీగా వున్న బెంచీ మీద అసహనంగా చతికిలపడ్డాడు.

అక్కడ అప్పటికే మరో ఐదారుగురు కూచుని వున్నారు. వాళ్లంతా లోపల ఆపరేషన్‌ జరుగుతున్న పేషెంట్‌ తాలూకు మనుషులని వారి మొహాలే చెబుతున్నాయి. అందరూ దిగులుగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నట్టున్నారు.

ఆపరేషన్‌ థియేటర్‌ తలుపు మీద ఎర్రలైటు వెలుగుతోంది.

వెచ్చని రక్తంలో అప్పుడే ముంచి తీసినట్టుందది.

గోడలమీద కంటి జబ్బులకు సంబంధించిన రకరకాల చార్టులు వేలాడుతున్నాయి.

'కళ్లను జాగ్రత్తగా సంరక్షించుకోవడం ఎలా?',

'ఎ విటమిన్‌ లోపం - పసిపిల్లల పాలిటి శాపం',

'కంటి జబ్బులు - వాటి లక్షణాలు'

కంజెక్టివైటిస్‌, ఐరిస్‌, ట్రకోమా, గ్లూకోమా, కాటారాక్ట్‌, కార్నియల్‌ అ ల్సర్‌, టెరీజియమ్‌....

అబ్బ ఇన్ని రకాల కంటి జబ్బులా?! ఆ బొమ్మల్ని చూస్తుంటే గుండెలో కెలికినట్టయింది.

గట్టిగా కళ్లు మూసుకున్నాడు. కంటిముందున్న సమస్త ప్రపంచం ఒక్క క్షణంలో అదృశ్యమైపోయింది. చీకటి... కారు చీకటి... అంతులేని శూన్యం...

హడలిపోతూ చప్పున కళ్లు తెరిచాడు.

పంచరంగుల లోకం కళ్ల ముందు తిరిగి ప్రత్యక్షమయింది.

రెప్పలు మూస్తే కరంటు పోయినట్టు అంధకారం... రెప్పలు తెరిస్తే స్విచ్‌ వేసినట్టు భళ్లున పరచుకునే వెళుతురు! తనకా సౌలభ్యం వుంది.

కానీ కళ్లకు శాశ్వతంగా ఇనుప తెరలున్నవాళ్ల పరిస్థితి ఏమిటి?

ఇరవైనాలుగు గంటలూ చీకటిని భరించాలంటే ఎంత దుర్భరంగా వుంటుందో.

అందుకే అన్నారు... సర్వేంద్రియానాం నయనం ప్రధానం!

రామ్మూర్తి ఆలోచనలు ఎక్కడెక్కడో పరిభ్రమిస్తుండగానే ఎర్రలైటు ఆరిపోయింది.
డాక్టర్‌ రావు గారు డోరు తెరచుకుని బయటికొచ్చారు. అంతవరకు శిలా విగ్రహాల్లా కూచున్న వాళ్లంతా దిగ్గున లేచినిలబడ్డారు.

'చూచితిన్‌ సీతన్‌' అని హనుమంతుడు రాముడికి సమాచారం అందించినట్టు ''గుడ్‌ లక్‌. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. మీ వాడికి చూపు వచ్చినట్టే'' ఉల్లాసంగా చెప్పారు డాక్టర్‌ రావు.

అందరి మొహాలూ ఒక్కసారి హండ్రెడ్‌ క్యాండిల్‌ బల్బుల్లా వెలిగిపోయాయి.

''మీ మేలు జన్మలో మరిచిపోలేం డాక్టర్‌ గారూ... మీరు మా పాలిటి దేవుడేనండీ...'' వంగి కాళ్లమీద పడబోయినవ్యక్తిని సున్నితంగా అడ్డుకుంటూ ముందుకు కదిలారు డాక్టర్‌ రావు.

రామ్మూర్తి ఎదురెళ్లి రెండు చేతులూ జోడించాడు.

డాక్టర్‌ రావు చిరునవ్వుతో తలపంకిస్తూ అతని భుజంమీద చేయి వేసి ''రండి. నా గదిలో కూచుని మాట్లాడుకుందాం'' అన్నారు.

రామ్మూర్తి ఆయనను మౌనంగా అనుసరించారు.

బాటిళ్లో వున్న మంచినీళ్లని గ్లాసులోకి వంపుకుని తాగి ''మీకూ కావాలా?'' అనడిగారు డాక్టర్‌ రావు.
వద్దన్నట్టు తల ఊపాడు రామ్మూర్తి.

కాస్త రిలాక్సయి, గొంతు సవరించుకుని '' రెండ్రోజుల క్రితమే మీ అభ్యర్థనని మా మెడికల్‌ అసోసియేషన్‌ ముందుంచాను.'' అన్నారు.

''ఏమన్నారు సార్‌?... ఒప్పుకున్నారా!''

''లేదు, బ్లంట్‌గా తిరస్కరించారు.''

''సా...ర్‌...!''

''ఇందులో వాళ్ల తప్పేంలేదు. రూల్సే అలా వున్నాయి. రక్త దాతల పేర్లు గానీ, నేత్ర దాతల పేర్లు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోగికి వెల్లడించకూడదు. వారి పేర్లను గోప్యంగా వుంచాలి అనేది మా ప్రాథమిక సూత్రం. కళ్లను ఎవరు ఇచ్చారు... వాటిని ఎవరికి అమర్చారు వంటి విషయాలు వెల్లడిస్తే న్యాయపరంగానూ, సామాజికంగానూ కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం వుంటుంది.''

రామ్మూర్తి ఒక్కసారిగా హతాశుడైపోయాడు.

చేతులు జోడించి ఎంతో ఆవేదనగా ''మా వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా రాదు సార్‌. మాకు ఇందులో ఎలాంటి స్వార్థమూ, ఏ దురుద్దేశమూ లేదు. ప్రమాణం చేసి చెబుతున్నాను సార్‌. నా మాట నమ్మండి. కావాలంటే మీరు ఎలాంటి హామీ రాసివ్వమన్నా రాసిస్తాను. చచ్చినా మరెవ్వరికీ ఈ విషయం చెప్పం సార్‌. దయచేసి నా కూతురు కోరిన ఈ చిన్న కోరికను కాదనకండి సార్‌. అది అప్సెట్‌ అయిపోతుంది. ప్లీజ్‌ సార్‌..'' అన్నాడు.

డాక్టర్‌ రావు అతని వంక నిశితంగా చూశాడు.

రామ్మూర్తే తిరిగి కొనసాగించాడు. ''అమ్మ సెంటిమెంటు ఎంత బలమైనదో మీకు తెలియంది కాదు కదా సర్‌. అమ్మ చనిపోయినా- నేత్ర దానం వల్ల ఆమె కళ్లు మరో వ్యక్తిలో జీవించేవున్నాయన్న భావన... అమ్మ కళ్లు తన పెళ్లిని చూడాలి, తనని ఆశీర్వదించాలి అన్న కోరిక నా కూతురిలో బలంగా ఏర్పడింది. దయచేసి ఆ వ్యక్తిని ఎలాగైనా ఈ పెళ్లికి వచ్చి, నా కూతురి తల మీద నాలుగు అక్షింతలు వేసి వెళ్లేట్టు చేయండి సార్‌. మళ్లీ ఎప్పుడూ వాళ్లని కానీ, మిమ్మల్ని కానీ ఇబ్బందిపెట్టం సార్‌. ఇది పిచ్చితనమో, అర్థంలేని సెంటిమెంటో ఏదైనా అనుకోండి. కానీ నా కూతురి తృప్తికోసం ఈ చిన్న కోరికను కాదనకండి సార్‌''.
కడుపులోంచి తన్నుకొచ్చిన దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.

''రామ్మూర్తిగారూ, ప్లీజ్‌ కూల్‌డౌన్‌. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మాయిది అర్థం లేని కోరికేం కాదు. అదొక ఉదాత్తమైన ఆలోచన. ఆ భావన నిజంగా నన్ను కూడా కదిలించింది. అందుకే నేను స్వయంగా వెళ్లి మా మెడికల్‌ అసోసియేషన్‌లో గట్టిగా వాదించాను. చివరికి నా పర్సనల్‌ రిస్క్‌పై అసోసియేషన్‌ అనుమతిని కూడా సాధించగలిగాను. కానీ...''

''కానీ... ఏం జరిగింది సార్‌?'' సంభ్రమంగా, ఆందోళనగా అడిగాడు రామ్మూర్తి.

''ఏంలేదు. మీ శ్రీమతి కళ్లను ఎవరికైతే ట్రాన్స్‌ప్లాంట్‌ చేశామో వాళ్లు ఇల్లు మారారు. ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఎంత ప్రయత్నించినా తెలియలేదు.''

రామ్మూర్తిలో అప్పుడే చిగురించిన ఆశ కాస్తా పాలపొంగు మీద నీళ్లు చిలకరించినట్టు చప్పున చల్లారిపోయింది.

''మీరేం వర్రీ అవకండి. ఎలాగైనాసరే వాళ్ల అడ్రస్‌ కనుక్కునేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తాను. సరేనా'' అనునయించారు డాక్టర్‌ రావు.

''ఏమో సార్‌. నా కూతురికి మంకు పట్టు ఎక్కువ. దాన్ని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు.''

''నా మాటగా చెప్పండి. ఇప్పుడిది నా సమస్య. మీరిక ఈ విషయం గురించి ఆలోచించకండి. నిశ్చింతగా మీ పనులు చూసుకోండి.'' ధైర్యం చెప్పారాయన.

చేసేదేం లేక భారంగా లేచాడు.

''అంతా మీ దయ సార్‌. మా అమ్మాయి పెళ్లికి కనీసం మీరైనా తప్పకుండా రావాలి.'' అంటూ చేతి సంచీలోంచి ఒక శుభలేఖ తీసి అందించాడు రామ్మూర్తి.

''ఓ ష్యూర్‌'' అంటూ కరచాలనం చేశారు డాక్టర్‌ రావు.

ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఏడాది క్రితం జరిగిన సంఘటన అతని మనసులో మెదిలింది.

ఆరోజు...

తను పనిచేసే స్కూల్లో డిఇఓ ఇన్‌స్పెక్షన్‌ జరుగుతోంది. తను చాలా బిజీగా వున్నాడు. అట్లాంటి సమయంలో అటెండర్‌ పరుగెత్తుకుని వచ్చి ''అమ్మగారికి సీరియస్‌గా వుందట సార్‌ మిమ్మల్ని అర్జంటుగా రమ్మని కబురొచ్చింది.'' అని చెప్పాడు.

తనకి గుండె ఆగినంతపనయింది.

డిఇఓ గారు ''మీరు వెళ్లండి ఫరవాలేదు'' అనడంతో ఆఘమేఘాల మీద ఇల్లు చేరాడు.

కానీ అప్పటికే తన అన్నపూర్ణ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తనకి చివరి చూపు కూడా దక్కలేదు.

అన్నపూర్ణకి పెద్దగా జబ్బేమీ లేదు. అప్పుడప్పుడు కడుపు నొప్పి, నడుం నొప్పి అని మాత్రం బాధపడేది. ఆమెకి అ ల్లోపతీ మందులు పడేవికావు. అందుకే ఎప్పుడూ హోమియో మందులు తీసుకుంటుండేది. కానీ ఇంత హఠాత్తుగా ప్రాణాల మీదికి ఎట్లా ముంచుకొచ్చిందో తెలియదు.

కొండంత బాధనైనా పంటి బిగువన దిగమింగుకునే ఓర్పు ఆమెకుండేది. మొదటినుంచి ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకూడదు అనుకునే మనస్తత్వం ఆమెది. అందుకే తన బాధలని, సమస్యలని ఎవరికీ చెప్పుకునేది కాదు. బహుశా ఆ అతి మంచితనమే ఆమె ప్రాణం మీదికి తెచ్చిందేమో.

అప్పటికీ తన కూతురు సౌమ్య తల్లి బాధను చూసి ఆసుపత్రికి వెళ్దాం పదమ్మా అని ఎంత బలవంతం చేసినా ఆమె ''ఏం ఫరవాలేదు సౌమ్యా, మామూలు నొప్పే ఇది'' అంటూవచ్చిందట. అంతలోనే ఆమె గుండె ఆగిపోయింది.

దాదాపు పాతిక సంవత్సరాలు తనతో జీవితం పంచుకున్న అన్నపూర్ణ, తన ప్రాణంలో ప్రాణమైన అన్నపూర్ణ తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా వెళ్లిపోయింది.

అన్నపూర్ణని అట్లా నిర్జీవంగా చూడవలసివస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. ఆమె శవం మీద పడి చిన్నపిల్లాడిలా భోరున ఏడ్చాడు.

సౌమ్యనైతే ఎవరూ పట్టుకోలేకపోయారు.

ఎందుకో అంత దు:ఖంలోనూ హఠాత్తుగా తనూ, అన్నపూర్ణా నేత్రదానం చేయాలంటూ అంతకు కొద్దిరోజుల క్రితమే తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఓ ఐ బ్యాంకు వాళ్లు తమ స్కూలుకు వస్తే ఇతర్లతో పాటు తను కూడా మరణానంతర నేత్రదాన హామీ పత్రంపై సంతకం చేశాడు.

ఇంటికి వెళ్లింతరువాత ఐ బ్యాంకు వాళ్లిచ్చిన కార్డు చూపించినప్పుడు తను కూడా నేత్రదానం చేస్తానంటూ పట్టుబట్టింది. వెంటనే మరో పాం తీసుకొచ్చి నింపి ఇచ్చేవరకూ ఊరుకోలేదు.

అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదేమో అనిపిస్తుంది. తను త్వరలో వెళ్లిపోతున్నట్టు అన్నపూర్ణకు తెలుసేమో... తన నేత్రాలను త్వరగా దానం చేసేందుకే తను ఇంత అర్థంతరంగా తనువు చాలించిందేమో...

తను గుండె రాయి చేసుకుని ఐ బ్యాంకు వాళ్లకి కబురు పంపించాడు.

అరగంటలో ఇంటి ముందు అంబులెన్స్‌ వచ్చి ఆగింది.

విషయం తెలిసిన సౌమ్య ఒక్కసారి హిస్టీరిక్‌గా మారిపోయింది. ''మా అమ్మ కళ్లను తీసుకుపోతారా? వీల్లేదు.. మా అమ్మ కళ్లను పెరికేసేందుకు వీల్లేదు. నేను ఒప్పుకోను..'' అంటూ పెద్ద గొడవచేసింది.

''మీ అమ్మ చివరి కోరిక కదమ్మా. తీర్చకపోతే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుందా? మేమేమీ మీ అమ్మ కనుగుడ్లను పూర్తిగా పెరికించట్లేదమ్మా. కేవలం సన్నని పొరల్లాంటి ............ కార్నియాలను మాత్రమే తొలగిస్తాం.

వాటితో మరొకరికి చూపు వస్తుంది. మీ అమ్మ కళ్లు మరో జీవితకాలం సజీవంగా వుంటాయి.

శరీరంతో పాటు వాటిని కూడా అగ్నికి ఆహుతిచేస్తే ఏమొస్తుంది చెప్పు. పైగా మీ అమ్మ స్వయంగా కోరుకున్న ఆఖరు కోరిక కదా ఇది..'' అంటూ డాక్టర్‌ రావుగారే సౌమ్యకు ఎన్నోరకాలుగా నచ్చజెప్ప చూశారు.

అయినా సౌమ్య వినిపించుకోకుండా తన మంకుపట్టును వీడకపోవడంతో ఆమెను బలవంతంగా మరో గదిలోకి లాక్కెళ్లవలసి వచ్చింది.

అప్పుడు అంతగా వ్యతిరేకించిన సౌమ్యే ఇప్పుడు తన తల్లి కళ్లు తన పెళ్లిని చూడాలని, తనను ఆశీర్వదించాలని పట్టుపడుతోంది.

... ... ...


తండ్రి చెప్పిన వృత్తాంతం విన్న సౌమ్య ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయింది.

తన తల్లి లేకపోయినా ఆమె సజీవమైన కళ్లు ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తూనే వున్నాయన్న భావన ఆమెలో అ లౌకిక ఆనందా న్నిస్తోందామెకు. తన తల్లి కళ్లతో ఈ లోకాన్ని చూస్తున్న వ్యక్తి పాదాలకు ఒక్కసారి నమస్కరించాలని, ఆ కళ్లలో అమ్మ ప్రతిరూపాన్ని తనివితీరా చూసుకోవాలని ఎంతగానో అశపడిందామె.

దిగాలుపడిపోతున్న తన కూతురి తలమీద చేయి వేసి నిమురుతూ ''పెళ్లికి ఇంకా చాలా రోజుల టైం వుంది కదమ్మా. ఈ లోగా వాళ్ల చిరునామా దొరుకుతుందిలే. డాక్టర్‌ గారు గట్టిగా ప్రయత్నిస్తానని మాటిచ్చారుగా.'' అంటూ అనునయించాడు రామ్మూర్తి.

చూస్తుండగానే పెళ్లిరోజు వచ్చేసింది.

డాక్టర్‌ రావుగారి నుంచి మాత్రం ఎలాంటి కబురూ రాలేదు. తమకా అదృష్టం లేదని ఆశ వదులుకున్నాడు
రామ్మూర్తి.

పెళ్లిపనులు, డబ్బు సర్దుబాటు గొడవల్లో ఒక విధంగా ఆ విషయాన్ని పక్కనపెట్డాడాయన.

సౌమ్యకు మాత్రం ఇంకా ఎక్కడో ఏమూలో ఆశ మిణుకుమిణుకు మంటోంది. తల్లి చిత్రపటం వేపు చూసినప్పుడల్లా ఆమెకు కేవలం కళ్లే కనపడేవి.

ఆరోజు మంగళ వాయిద్యాల హోరు మొదలయింది. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా వరుడు వధువు మెడలో కట్టేందుకు మంగళసూత్రం పట్టుకుని లేచాడు.

అంతే...! సరిగ్గా అదే సమయంలో ''ఆగరా.. ఆగు'' అనే అరుపు వినిపించింది.

పెళ్లిపందిరిలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ అరిచింది ఎవరోకాదు పెళ్లికొడుకు తల్లి రాఘవమ్మ. ఆమె గబగబా వచ్చి తన కొడుకు చేయిపట్టుకుని మంటపం బయటకు లాగింది.

''ఒప్పుకున్న కట్నం పూర్తిగా ఇవ్వందే ఈ పెళ్లి జరగదు'' అందావిడ.

''అదేమిటండీ అ లా అంటారు. అణాపైసలతో పూర్తిగా ముందే ఇచ్చేశాం కదా మీకు'' అన్నాడు రామ్మూర్తి.

'' స్కూటర్‌ డబ్బు ఎక్కడిచ్చారు? మాకే ఠోకరా వేయాలని చూస్తున్నారా?''

అసలు స్కూటర్‌ విషయం ముందు అనుకోనేలేదనీ, కావలిస్తే పండక్కి ఇస్తాననీ, ఇప్పుడంటే ఇప్పుడు తన దగ్గర అంత డబ్బులేదనీ ప్రాధేయపడ్డాడు రామ్మూర్తి.

ఈ వాదోపవాదాలతో వియ్యం కాస్తా కయ్యంగా మారిపోయింది. అంతా గందరగోళంగా వున్న అదే సమయంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు డాక్టర్‌ రావుగారు.

అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి ''నమస్కారం రాఘవమ్మగారూ'' అన్నారు.

రాఘవమ్మ ఆయనను చూసి అవాక్కయిపోయింది.

''గుర్తుపట్టారా నన్ను? ఏడాది క్రితం యాక్సిడెంట్‌లో మీకు చూపుపోతే ఆపరేషన్‌ చేసి చూపు తెప్పించిన డాక్టర్‌ని.....''

''...ఏమయ్యా పెళ్లికొడుకా నీకైనా గుర్తున్నానా? మీ అడ్రస్‌ కనుక్కోవడం ఆలస్యమైనా సరిగ్గా సమయానికి ివచ్చానన్నమాట ఇక్కడికి.'' అన్నారు డాక్టర్‌ రావు.

పెళ్లికొడుకూ పెళ్లికొడుకు తల్లీ నిర్ఘాంతపోతూ మొహమొహాలు చూసుకున్నారు. వాళ్లు ఆయననేమీ మరచిపోలేదు. అయితే ఆ సమయంలో ఆయన అక్కడికి రావడం, ఆయన మాటలు వాళ్లను విస్మయానికి గురిచేశాయి.

పెళ్లి పందిరిలో కలకలం తగ్గి క్రమంగా నిశ్శబ్దం అ లముకుంది.

''రాఘవమ్మగారూ, మీరు ఏ కళ్లతో ఇవాళ తిరిగి లోకాన్ని చూడగలుగుతున్నారో ఆ కళ్లు ఎవరివో తెలుసా?'' నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఖంగున మోగింది ఆయన కంఠం.

''ఇదిగో మీ కాబోయే కోడలి కన్నతల్లివే... అంటే మీ వియ్యపురాలివేనమ్మా ఆ కళ్లు.''

డాక్టర్‌ రావు మాటలు బాంబులా పేలాయి. ఒక్కసారిగా మళ్లీ కలకలం చెలరేగింది.

''అన్నపూర్ణమ్మ తన కూతురి పెళ్లికి కట్నంగా ఎంతో అమూల్యమైన తన కళ్లని మీకు ముందే ప్రసాదించింది కదమ్మా ..... ఇంకా ఎందుకమ్మా ముష్టి స్కూటర్‌ కోసం పాకులాడతావు?'' అన్నాడాయన.

రాఘవమ్మకు ఒక్కసారిగా ఏదో షాక్‌ తగిలినట్టు ... మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది. ఆమె అప్రయత్నంగా, దిగ్భ్రాంతిగా సౌమ్యవైపు చూసింది.

క్షణం కిందటి వరకు భగ్గున మండినట్టున్న ఆ చూపుల్లో ఇప్పుడు మచ్చుకు కూడా కాఠిన్యం లేదు.

సౌమ్య పెళ్లిపీటలమీదనుంచి మంత్రముగ్దలా లేచి ''అమ్మా'' అంటూ పరుగున వచ్చి రాఘవమ్మను పెనవేసుకుపోయింది.

ఆ దృశ్యం చూసిన అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.


----( స్వాతి సపరివార పత్రిక, 09-05-1997 సౌజన్యంతో )

3 comments:

 1. ప్రభాకర్ గారు,

  చిన్న సవరణ.....కళ్లు తీసుకోడమంటే "రెటీనా" తీసుకోరు.....మీరు చెప్పినట్టు సన్నటి పొర అయిన ""కార్నియా" తీసుకుంటారు.......కథ బాగుంది...కొంచం మన తెలుగు సినిమా కథల్లా మెలోడ్రామా ఎక్కువున్నా..... :-)

  ReplyDelete
 2. మీ చెమ్మగిల్లిన కళ్ళు కథ చదివాను. నేత్రదానం అంశాన్ని తీసుకుని చక్కగా మలిచారు.

  ReplyDelete
 3. @ భావకుడన్ గారు
  పొరపాటును సూచించినందుకు ధన్యవాదాలు. రేటీనాను కార్నియాగా సవరించాను.
  ఇది స్వాతి "కథలపోటి" కోసం రాసిన కథ . ఏదో సందేశం ఇవ్వాలన్న గాడి లో పడడంతో ఇలా రూపుదిద్దు కుంది. ఎలాగైతేనేం సాధారణ ప్రచురణకు నోచుకుంది.

  @ ఆది శేషా రెడ్డి గారు
  మీ స్పందనను తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete