Saturday, July 11, 2009

గురివింద గింజలు... కథగురివింద గింజలు

సూర్యాస్తమయం అయిందంటే చాలు ఎక్కడెక్కడి పక్షులన్నీ వచ్చి ఆ తాలూకాఫీసు ఆవరణలో వున్న చెట్లపై చేరతాయి.

ఫైళ్లలో మునిగిపోయివున్న ప్రకాశం పక్షుల అరుపులతో ఇహంలోకి వచ్చేడు. తలెత్తి చూస్తే కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఆఫీసులో తనొక్కడే వున్నాడు. తోటి గుమాస్తాలంతా ఎప్పుడో వెళ్లిపోయారు.

ప్రకాశం ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తాడు. అందుకే అర్జంటు ఫైళ్లన్నీ అతని టేబుల్‌ మీదకే వస్తుంటాయి.

నీరసంగా లేచేడు. మిగిలిపోయిన ఫైళ్లని కట్టగట్టి చంకలో పెట్టుకుని ఆఫీసుని వాచ్‌మెన్‌కి అప్పగించి బయటపడ్డాడు.

ఆఫీసులో ఎంత సేపు పనిచేస్తాడో ఇంట్లోనూ అంతసేపు అదేపని చేస్తాడు. అతని ఆదివారాలు కూడా ఆఫీసు పనితోనే గడచిపోతుంటాయి. ఫైళ్లు తప్ప అతనికి వేరే వ్యాపకం ఏమీ లేదు. ఉద్యోగం చేయడానికే బతుకుతున్న అరుదైన వ్యక్తి అతను.

ఇంటికి చేరే సరికి రాత్రి ఏడయింది.

ఫైళ్లని టేబుల్‌ మీదికి గిరాటువేసి లుంగీ అందుకున్నాడు.

ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. ఆఫీసు నుంచి వొచ్చిన ప్రకాశాన్ని సాధారణంగా వెంటనే ఎవరూ పలకరించరు. అతని బడలిక తీరేవరకు ఎవరూ అసలు అతనికి ఎదురుపడటానికే ఇష్టపడరు. ఆఫీసులోని చిరాకంతా ఎక్కడ తమ మీద ప్రదర్శిస్తాడో అని భయం.

ఆఫీసులో ఎంత ఒబిడియంట్‌ సర్వెంట్‌లా వుంటాడో ఇంట్లో అంత రుసరుసలాడుతూ, మండిపడుతూ కనిపిస్తాడు.

బాత్‌రూం వైపు వెళ్లబోతున్న ప్రకాశం ఠక్కున ఆగిపోయేడు.

'డుంబు' అని ముద్దుగా పిలుచుకునే అతని ఐదేళ్ల కొడుకు గదిలో ఓ మూలన కూచుని నోట్లో వేలు పెట్టుకుని తన్మయంగా చీకుతున్నాడు.

ప్రకాశానికి ఆ దృశ్యం చూడగానే ఒంటి మీద ఒక్కసారి తేళ్లూ జెర్రులూ పాకినట్టయింది.

''ఒరేయ్‌, డుంబూ!'' ఇల్లు అదిరిపోయేలా అరిచేడు.

ఆ అరుపునకు డుంబు ఒక్కసారి దడుచుకున్నాడు. తండ్రి ఉగ్ర రూపాన్ని చూడగానే వాడికి చెమటలు పట్టేశాయి.

''నోట్లోంచి వేలు తియ్‌రా గాడిదా'' అదే స్థాయిలో మళ్లీ అరిచేడు ప్రకాశం.

వాడు నోట్లోంచి వేలు తీయకుండానే భయంతో అక్కడినుంచి పారిపోబోయేడు.

దాంతో ప్రకాశం కోపం తారాస్థాయికి చేరుకుంది.

''రాస్కెల్‌'' అని పళ్లు కొరుకుతూ డేగ కోడిపిల్లను పట్టినట్టు రెప్పపాటులో కొడుకు రెక్క పట్టుకుని లాగి చెంప ఛెళ్లుమనిపించాడు.

''నోట్లో వేలేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాల్రా ఇడియట్‌'' అంటూ ఏడుస్తున్న కొడుకుక్కి ఎడాపెడా మరో నాలుగు తగిలించాడు.

అది చూసి లోపలినుంచి ప్రకాశం తల్లీ, భార్యా హాహాకారాలు చేస్తూ పరుగెత్తుకొచ్చారు. అప్పటికే వాడి రెండు బుగ్గలూ కందిపోయేయి. ప్రకాశం భార్య భోరున ఏడుస్తూ డుంబుని ఎత్తుకుని గబాల్న పక్క గదిలోకి తీసుకుపోయింది.

''నీకేం పుట్టిందిరా రోగం? పసివాణ్ని అంతలా కొట్టడానికి చేతులెలా వచ్చాయి. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే తిక్క రేగుతుందేమిట్రా నీకు?'' అంటూ దులిపేసింది ప్రకాశం తల్లి.

''నోట్లో వేలేసుకోవద్దని ఎన్ని సార్లు చెప్పానమ్మా వాడికి. అయినా వినిపించుకుంటున్నాడా? ఏంటా వెధవ అ లవాటు? నాలుగు తన్నకపోతే ఎట్లా మానతాడు?'' బింకంగా అన్నాడు ప్రకాశం.

''చాలు చాల్లే చదవేస్తే ఉన్న మతి పోయిందట. ఏదైనా ప్రేమగా నచ్చజెప్పి మాన్పించాలి గానీ పసిపిల్లల్ని గొడ్డును బాదినట్టు బాదాలా?''

''ఎన్ని సార్లు చెప్పలేదమ్మా వాడికి? మంచిగా చెబితే వినిపించుకుంటున్నాడా?''

''ఏం చెప్పావు నీ మొహం. నీ కసలు ప్రేమగా చెప్పే తీరిక కూడానా?! నిన్ను ఇట్లా కొట్టి పెంచితే ఇంత వాడివి అయ్యుండేవాడివే కాదు.'' ఏవగించుకుంటూ తనూ మనవడున్న గదివేపు వెళ్లిందావిడ.

ప్రకాశం బాత్‌రూంకి వెళ్లకుండా వెనక్కి వచ్చేసి అసహనంగా వాలు కుర్చీలో కూర్చుని సిగరెట్‌ వెలిగించుకున్నాడు.

రెండు దమ్ములు లాగేక ఆవేశం కొద్దిగా తగ్గినట్టయింది. ముక్కు పచ్చలారని కొడుకుని అంతగా కొట్టినందుకు గిల్టీ ఫీలింగ్‌ కలిగింది.

నోట్లో వేలు పెట్టుకునే అ లవాటంటే ప్రకాశానికి తగని చిరాకు. తన గారాబాల చెల్లెలికి కూడా ఇట్లాగే నోట్లో వేలేసుకుని చీకే అ లవాటు వుండేది.

చిన్నప్పుడు ఎవరూ ఆ అ లవాటును అంతగా పట్టించుకోలేదు. పెద్దయితే అదే పోతుందిలే అనుకున్నారు. కానీ ఎంత పెద్దయినా ఆమె ఆ వ్యసనం నుంచి బయటపడలేదు. ఎవరికీ కనపడకుండా ఆ అ లవాటును కొనసాగిస్తూండేది.

ఏ రోజైనా ఆమెకు నోట్లో వేలేసుకునే అవకాశం చిక్కకపోతే ఆరోజంతా మూడీగా వుండేది. చికాకు పడేది. విపరీతమైన తలపోటుతో బాధపడేది.

ఒకోసారి నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలీకుండానే ఆమె కుడిచేతి బొటన వేలు నోట్లోకి వెళ్లిపోయేది. ఎదిగిన వయసులో అట్లా నోట్లో వేలేసుకుని పడుకున్న చెల్లెల్ని చూస్తే తనకి జుగుప్సగా వుండేది. ఎందరు ఎన్ని విధాల చెప్పినా ఆమెనుంచి ఆ అ లవాటు దూరం కాలేదు.

చివరికి ఆమె పెళ్లినాడు ఆ అ లవాటు వల్ల తామందరికీ చచ్చే చావయింది. ఇంట్లో బంధువుల సందడి వల్ల ఆరోజు ఆమెకు నోట్లో వేలేసుకునేందుకు ఏమాత్రం అవకాశం చిక్కలేదు. ఎవరైనా చూస్తే బాగోదు అనే ఉద్దేశంతో తను కూడా తన కుతిని ఆణిచిపెట్టుకుంటూ వచ్చింది.

తీరా పెళ్లి పీటల మీదకు వచ్చే వేళకు ఆ కుతి తారాస్థాయికి చేరుకుంది. తలపోటును, చికాకును తట్టుకోలేక కుదేలయింది. ఆమె మొహం కళా విహీనం అయింది. స్పృహతప్పి పడిపోతుందేమో అనుకున్నారు అందరూ.

పరిస్థితిని అర్థం చేసుకున్న అమ్మా, పిన్నీ మొదలైన వాళ్లంతా నానా తంటాలు పడి దడిలా అడ్డంగా నిలుచుని ఎదో అ లంకరణ సరిచేస్తున్నట్టు నటిస్తూ ఆమెకు నోట్లో కాసేపు వేలు వేసుకునే అవకాశం కల్పించారు. అప్పుడు తన చెల్లి కొంగు చాటు చేసుకుని కొద్ది క్షణాలు తన బొటనవేలుని ఆబగా చీకి రిప్రెష్‌ అయింది.

పెళ్లికొడుక్కి కానీ, అతని తరఫు బంధువులకి గానీ ఆ విషయం తెలిస్తే ఎంత గొడవయ్యుండేదో తలచుకుంటే ఇప్పటికీ గుండె జల్లు మంటుంది.

ఆ సంఘటన ప్రకాశం మనసులో చెరగని ముద్రవేసింది. ఆనాటి నుంచి ఆ అ లవాటు అంటేనే కంపరంగా వుంటుందతనికి.

దురదృష్ట వశాత్తూ ఆ అ లవాటు మళ్లీ తన కొడుక్కీ అంటుకుంది.

డాక్టర్‌ని సంప్రదిస్తే ఆయన కూడా అది అంత మంచి అ లవాటు కాదన్నాడు. ఆ అ లవాటు వల్ల పలువరుస ఎగుడుదిగుడుగా అయ్యే ప్రమాదం వుందన్నాడు. ఆ అ లవాటు వల్ల పిల్లలు న్యూరోటిక్‌గా తయారౌతారన్నాడు. దానిని మాన్పించడానికి ఏ మందులూ లేవనీ నయానో భయానో మాన్పించాల్సిందే తప్ప మరో మార్గాంతరం లేదన్నాడు. అందుకే వాడిని వీలైనంత త్వరగా ఆ అ లవాటు నుంచి విముక్తుణ్ని చేయాలని ఆరాటపడుతుంటాడు ప్రకాశం.

కోప్పడటం, కొట్టడం వల్ల ఆ అ లవాటు మరింత బలపడుతుందనీ ప్రేమగా, ఆప్యాయంగా నచ్చచెప్పి మాన్పించాలనీ డాక్టర్‌ కూడా సలహా యిచ్చాడు. కానీ ఎన్ని రకాలుగా చెప్పినా వాడు మాత్రం ఆ అ లవాటుకు దూరం కావడంలేదు. తనకేమో ఏమాత్రం ఓపిక వుండటం లేదు.

''ప్రకాషం... ఒరే ప్రకాషం...''

తండ్రి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాశం.

''తలుపులు తీసే వున్నాయి నాన్నా.'' అంటూ చేతిలోని సిగరెట్‌ని ఆర్పేశాడు. అప్పటికే అతను ఓ పెట్డెడు సిగరెట్లు తగలేశాడు. గదినిండా సిగరెట్‌ పీకలు చిందరవందరగా పడివున్నాయి.

ప్రకాశం తండ్రి తూలుతూ లోపలికి వచ్చాడు. ఆయన ఎక్సైజు డిపార్ట్‌మెంట్‌లో బంట్రోతుగా పనిచేస్తున్నాడు. ఇంకో రెండేళ్ల సర్వీసుంది. ఉచితంగా దొరుకుతుంది కాబట్టి రోజూ ఫుల్లుగా మందు కొట్టి మరీ ఇంటికొస్తుంటాడు.

''ఏంట్రా.. దిగులుగా కూషున్నావు?''

ప్రకాశం బదులివ్వలేదు.

ఆయనే మళ్లీ ''ఈ షిగరెట్లేమిటి? మొత్తం అన్నీ నువ్వే కాల్షావా?'' అడిగాడు.

దానికీ ప్రకాశం సమాధానం చెప్పలేదు.

ఆయన తన ధోరణిలో తను చెప్పుకుపోసాగాడు. ''ఒరే ప్రకాషం...సిగరెట్లు నీ ఒంటికి పడవని చెప్పినా వినిపింషుకోవేమిట్రా? ఈ పాడలవాడు మానేయవా నువ్వు? షెప్పు. కావాలంటే మందు అ లవాటు చేసుకోరా నాలాగా... కానీ సిగరెట్లు మాత్రం తాగకు. మంషిది కాదు. ఇష్కూలుకు వెల్లే రోజులనుంచి తాగుతున్నావు. నీ ఊపిరి తిత్తులన్నీ షెడిపొయి వుంటాయి. ఇప్పటికైనా మానెయ్‌రా.. అప్పుడు దొంగతనంగా కాల్చేవాడివి. ఇప్పుడు పెద్దోడివైపోయావు కదా ఇంట్లోనే కాల్చేస్తున్నావు. నేను నా కోషం చెప్పట్లేదు రా నీ ఆరోగ్యం కోషం చెప్తున్నా.... ఇదిగో ఒసేవ్‌...'' అంటూ ప్రకాశం తల్లిని కేకేశాడు.

ఆవిడ ఈ మాటలన్నీ వింటూనే వుంది. అప్పటికే భర్త పక్కకొచ్చి నిల్చుని వుంది.

''ఏంటి గొడవ?'' అందావిడ. ''కొడుక్కి సిగరెట్లు కాల్చొద్దని చెప్తున్నారా?''

''అవునే వాడు ఈ పాడు అ లవాటు మానడంలేదు షూడు.''

''ఆహాహా చాలా బావుందండి. సారా తాగే తండ్రి సిగరెట్లు తాగే కొడుక్కి బుద్ధి చెప్తాడు. సిగరెట్లు తాగే తండ్రి నోట్లో వేలు పెట్టుకునే కొడుక్కి బుద్ధి చెప్తాడు. ఎంత ఆదర్శ పురుషులో. ఎవరైన వింటే నవ్వి పోతారు. చాలించండిక.''

తండ్రీ కొడుకులిద్దరూ మొహమొహాలు తీసుకున్నారు. ఎవరూ కిక్కురు మనలేదు.

...


(స్వాతి సపరివార పత్రిక 26-9-1986 సంచికలో ప్రచురించబడిన కథ.
స్వాతి సంపాదకులకు కృతజ్ఞతలతో)

3 comments:

 1. ''ఆహాహా చాలా బావుందండి. సారా తాగే తండ్రి సిగరెట్లు తాగే కొడుక్కి బుద్ధి చెప్తాడు. సిగరెట్లు తాగే తండ్రి నోట్లో వేలు పెట్టుకునే కొడుక్కి బుద్ధి చెప్తాడు''
  భలే !:) :)

  ReplyDelete
 2. ఆలస్యంగా వచ్చేను కానీ మంచి కథ చదివేనండీ. నిజమే. ఎంతసేపూ ఎదటివారి దురలవాట్లే కనిపిస్తాయి. అభినందనలు.

  ReplyDelete
 3. పరిమళం గారూ
  నా కథలన్నింటినీ ఓపిగ్గా చదువుతూ మీ అభిప్రాయం తెలియజేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.

  తెలుగు తూలిక గారూ
  మీ మెప్పు నిజంగా నాకొక యోగ్యతా పత్రమే!
  కృతజ్ఞతాభివందనములు .

  ReplyDelete