Saturday, November 16, 2019

ప్రజా రవాణా రక్షకులే ప్రజా పాలకులు చాడ వెంకట రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి


ప్రజా రవాణా రక్షకులే ప్రజా పాలకులు
చాడ వెంకట రెడ్డి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
(ఆంధ్ర జ్యోతి దినపత్రిక 16-11-2019)

---------------------------
వేల మంది ఆర్‌టిసి కార్మికులుతమ కుటుంబాలను పణంగా పెట్టి ఎందుకు సమ్మె చేస్తున్నారుస్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు బెదిరింపులకు దిగినా మొక్కవోని ధైర్యంతో ఎందుకు సమ్మె సాగిస్తున్నారుఎందుకు... అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం.ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ప్రశ్నార్థకంగా మారనున్నప్రజారవాణాకు సంబంధించింది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె గత 42 రోజులుగా కొనసాగుతోంది. ఈ సమ్మె ప్రధానంగా ప్రజా రవాణాకు సంబంధించినది. మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు రాష్ట్ర వ్యాపితంగా రోజుకు 97 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసే విశ్వసనీయ సంస్థ ఆర్‌టిసి.
తెలంగాణలో తొమ్మిది దశాబ్దాలుగా సామాన్యునికి సేవలు అందిస్తున్న ఘన చరిత్ర కలిగిన ప్రజాసేవా సంస్థ ఆర్‌టిసి. తెలంగాణ కోసం ఉద్యమించడంలో ఆర్‌టిసి కార్మికులది కూడా కీలక పాత్రే.
అలాంటిది స్వరాష్ట్రంలో సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక రోజులు సమ్మె చేయాల్సి రావడం దురదృష్టకరం. కార్మికుల కంటే ప్రభుత్వానికే ఆర్‌టిసి సమ్మె జరగాలనే వైఖరి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆర్‌టిసిని పరిరక్షించేందుకు ఉన్న అవకాశాలను కాదని మూసి వేసేందుకు లేని మార్గాలను కూడా ప్రభుత్వం వెతికి వెతికి భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తోంది. సమ్మెను పరిష్కరించే దిశగా అడుగులేయడం లేదు.
ఆర్‌టిసి సమ్మె పట్ల ముఖ్యమంత్రి కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. సమ్మె ప్రారంభంలోనే కేసీఆర్‌ కఠినమైన మాటలు మాట్లాడారు. ఒక్క మాటతోనే 48 వేల మంది కార్మికులను ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరకపోతే సెల్ఫ్ డిస్మిస్‌అని భయబ్రాంతులకు గురి చేశాడు.
అంతేగాకుండా మరో సందర్భంలో యూనియన్‌లో చేరబోమని రాతపూర్వకంగా హామీ లేఖలు ఇస్తే మీ ఉద్యోగాలు మీకు ఉంటాయని చెప్పడం జరిగింది.
మరొకసారి అసలు ఆర్‌టిసి సంస్థ అనేదే లేదన్నారు. అ తదుపరి నవంబర్‌ 2న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నవంబర్‌ 5వ తేదీ అర్థరాత్రి లోపు కార్మికులు తమతమ విధుల్లో చేరాలని డెడ్‌లైన్‌ విధిస్తేకేవలం 300 మంది కార్మికులు మాత్రమే చేరారు. అందులో ఎక్కువ మంది బస్‌ భవన్‌లో ఉద్యోగం చేసేవారు.
దాదాపు 5100 రూట్లను ప్రైవేట్‌ పరం చేసామని ప్రకటించారురు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండాచర్చలకు ఆహ్వానించకుండా ఇలాంటి నిర్ణయాలు చేయడం మూర్ఖపు ధోరణికి అద్దం పడుతుంది.
దాదాపు 14 సార్లు ఆర్‌టిసి సమ్మెపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి కొండను తవ్వి ఎలుకను కూడ పట్ట లేకపోయారు.
కేసీఆర్‌ సెల్ఫ్ డిస్మిస్‌అనే పదం ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేయాల్సి వస్తుందనే సామెతను గుర్తు చేసుకోవాల్సివస్తుంది.
తప్పును సవరించుకోవడం మానవ ధర్మం. కానీ అహంభావంతో తప్పుల మీద తప్పులు చేస్తుండటం సరైంది కాదు. రాజ్యాంగం పౌరహక్కులు అందరికీ సమానంగానే ప్రసాదించింది. కాకపోతే పదవిలో వున్న వారికి ఆ పదవికి ఉన్న ప్రతిష్ఠ కారణంగా వ్యక్తిగత గౌరవం ఉండటం సహజం. కొన్ని సందర్భాలలో త్యాగాలను బట్టి కూడా వ్యక్తులకు గౌరవం వుంటుంది. కానీ కేసిఆర్‌ ఇప్పుడు ఏ కోవకు వస్తాడనేది ప్రధాన ప్రశ్న.
ఇబ్బందులు లేని జీవితమైనప్పటికీ సంస్థఅందులో పని చేసే వేలాది మంది కార్మికుల భవితవ్యంప్రభుత్వ వితండవాదంతో కలత చెంది డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి నిప్పు పెట్టుకొని చనిపోయాడు.
అలాగే రాణిగంజ్‌ డిపోకు చెందిన సురేందర్‌ గౌడ్‌ ఉరి వేసుకొని మృతి చెందాడు.
నీరజ అనే కండక్టర్‌ కూడా ఉరి వేసుకొని చనిపోయింది.
అంతేగాకుండా నిరసన సభలుసమావేశాలలో పాల్గొన్న కార్మికులు ఉద్రేకానికి లోనై గుండె ఆగిచని పోయినవారు కూడా అనేక మంది వున్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఆత్మహత్యలు వుండవని తెలంగాణ సమాజం అనుకున్న తరుణంలో ఇప్పుడు ఇంత మంది కార్మికుల చావుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంటి అద్దెలు కట్టుకోకుండాపిల్లల ఫీజులు సకాలంలో చెల్లించకపోవడం వలన కార్మికుల కుటుంబాలు అల్లాడుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా కనికరం చూపాలి.
హైకోర్టులో ఆర్‌టిసి సమ్మెపై జరుగుతున్న విచారణను చూస్తుంటే తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యమా అని ఈ దౌర్భాగ్యం వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నడూ లేనివిధంగా నలుగురు సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లు స్వయంగా వారి తప్పులేకున్నా పాలకుల వైఖరి కారణంగా బోనులో నిలబడాల్సి వచ్చింది. అంతేగాకుండా ప్రధాన న్యాయమూర్తి , న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అధికారులు సమాధానం చెప్పలేక తెల్లమొహాలు వేయాల్సి వచ్చింది. న్యాయస్థానంలో కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండా క్షమించండి అని చెప్పడంతో ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి ఇచ్చిన నివేదికకు హైకోర్టులో ఆర్థిక కార్యదర్శి ఆర్‌టిసి ఇన్‌చార్జ్‌ ఎండీలు కోర్టు ఇచ్చిన అఫిడవిట్లకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఐఎఎస్‌ ఆఫీసర్లు కూడా ఇలాంటి తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారని ప్రధాన న్యాయమూర్తి మందలించడంతోపాటు ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించారు.
ఫిలిప్పీన్స్‌ దేశంలో ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వం పడిపోయిందని తెలంగాణలో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా అని కోర్టు ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను తక్కువ అంచనా వేసి కించపరుస్తున్నాడు.
ఆర్‌టిసి సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ వాహనాలే శరణ్యంగా మారాయి. డైలీ వేజ్‌ డ్రైవర్లు కండక్టర్లతో బస్సులు నడుస్తున్నా సమయ పాలన పాటించడం లేదు. ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది వివిధ ప్రాంతాలలో ఆర్‌టిసి బస్సులు ఢీ కొట్టడంతో మరణించడం జరిగింది.
సమ్మె కాలంలో ఎంత ఆదాయం ఆర్‌టిసిఇకి వచ్చింది ఎంత ఖర్చు చేశారో ఆర్‌టిసి యాజమాన్యం గానీ లేదా ప్రభుత్వం గానీ ప్రజలకు తెలియజేయాలి.
49 వేల మంది ఆర్‌టిసి కార్మికులు తమ కుటుంబాలను పణంగా పెట్టి ఎందుకు సమ్మె చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు బెదిరింపులకు దిగినా మొక్కవోని ధైర్యంతో ఎందుకు సమ్మె సాగిస్తున్నారు.. ఎందుకు అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం. ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ప్రశ్నార్థకంగా మారనున్న ప్రజారవాణా గురించి.
ఇప్పటికే ప్రభుత్వ వైఖరితో సమ్మె కొనసాగుతూండడంతో 24 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు మతిస్థిమితం కూడా కోల్పోతున్నారు.
కార్మికులు డ్యూటీ చేసిన సెప్టెంబర్‌ నెల జీతాలు రెండు నెలలు గడిచినాకోర్టు ఆదేశించినా ఇవ్వకుండా ప్రభుత్వం పైశాచికానందం పొందుతోంది.
ముఖ్యమంత్రిగా వున్నవారు ఒక తండ్రిలా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఒకవైపు వారూ నా బిడ్డలేనంటూమరోవైపు చర్చలకు ముందుకు రాకపోవడం తొడపాశం పెట్టి జోల పాట పాడినట్లుంది. ఆర్‌టిసి వాళ్ళు తెలంగాణ బిడ్డలైనప్పుడు తెలంగాణలో పెద్ద పండుగైన దసరాదీపావళికి చేసిన పనికి కూడా జీతాలివ్వకుండా ఉపవాసం ఉంచుతారా
బాధ్యతాయుత స్థానంలో ఉన్న క్యాబినెట్‌ మంత్రులు కూడా ఆర్‌టిసి సమ్మె విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ పాలన మంత్రుల సమిష్టి బాధ్యత కాదా ముఖ్యమంత్రిని కనీసం కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేయకపోతే జరుగుతున్న తప్పు వారిని భవిష్యత్తులో వెంటాడుతుంది.
సంపద ఉన్న రాష్ట్రం కాబట్టి అప్పులు వస్తున్నాయని పలుమార్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆర్‌టిసికి ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులు ఏ మాత్రం ఎక్కువ కాదు.
పైగా సంస్థ లాభాల్లోకి వచ్చేందుకు ఏమి చేయాలనే సూచనలు ఇవ్వడంతో పాటు మోటు కష్టం చేసేందుకు ఆర్‌టిసి కార్మికులు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే పలుమార్లు ఆర్‌టిసి కార్మికులు కాకితో కబురంపినా చర్చలకు సిద్ధమని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ఆలోచించి పట్టుదలకు పోకుండా తక్షణమే కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమ్మె విరమింపజేయాలి. భేషజాలకు పోతే నష్టపోయేది తెలంగాణ బిడ్డలే. ఆర్‌టిసి మూతపడితే ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలే.
చాడ వెంకటరెడ్డి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

3 comments:

  1. "ఇప్పటికే పలుమార్లు ఆర్‌టిసి కార్మికులు కాకితో కబురంపినా చర్చలకు సిద్ధమని చెబుతున్నారు"

    ఆ విషయాన్ని యూనియన్లు పారిశ్రామిక వివాద చట్టం (ID act) సెక్షన్ 4 కింద నియమించబడ్డ సంప్రదింపు అధికారికి (Conciliation officer) రాయాలి కానీ ఈ కాకులకు కోకిలలకు పత్రికాముఖంగా చెప్పడం ఎందుకో?

    ReplyDelete
    Replies
    1. Not a single word of sympathy for the suffering families. Not a speck of advice to KCR. Well Jai Garu. You can't be so lopsided.

      Delete
    2. ఆర్టీసీ కార్మికులు & కుటుంబాల కష్టాల మీద నాకు పూర్తి సానుభూతి ఉంది. ముఖ్యంగా చనిపోయిన కార్మికుల వెతలు చూసి దుఃఖం వస్తుంది.

      ప్రస్తుత ఆర్టీసీ పోరాటాలు చట్టం పరిధిలో చేస్తేనే లాభం చేకూరుతుందని నా నమ్మకం. అందుకే ఈ వ్యాఖ్య.

      Delete