Thursday, November 7, 2019

తిండి సరిపోక చేసేది సమ్మె! ‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !! - రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019)


తిండి సరిపోక చేసేది సమ్మె!
‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !!
- రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019)

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు, 4 వారాలకు పైగా సమ్మెలో ఉన్నారు. ‘ఆర్టీసీకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని అడుగుతున్నాం’ అన్నారు, ఆ కార్మికులు. 26 సమస్యల్ని చెప్పారు. కార్మికులు ఒక్క సమస్యని చెప్పినా, పాలకులు ఒక్క గంటలో, శ్రద్ధ పెడితే, అరగంటలో కదలాలి. కానీ ఇక్కడ 26 సమస్యలకు కూడా, పాలకులకు ఆ కదలిక ఎన్ని రోజులైనా లేదు.

ఆర్టీసీ సమస్యలేమిటో కొన్నైనా చూద్దాం. ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యకూడదని. ప్రభుత్వ సంస్తగా మార్చాలని. జీతాల సవరణ చెయ్యాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని. ఖాళీగా వున్న ఉద్యోగాలని నింపాలని. కాలం చెల్లిన పాత బస్సుల్ని తీసివేసి, కొత్త బస్సుల్ని పెట్టి, ప్రయాణీకులకూ, డ్రైవర్లకూ రక్షణ కల్పించాలని.

ఏ శాఖలో అయినా, సమస్యలు తలెత్తుతోంటే, వాటిని పాలకులు తక్షణం చూసుకోవాలా లేదా? కానీ, ఈ పాలకులు, ‘అటువంటి పాలకులం కాము’ అని రుజువు చేసుకుంటున్నారు. ఆర్టీసీలో 26 సమస్యలు పేరుకు పోయి వున్నాయంటే, అదేనా పరిపాలన?

రవాణా కార్మికులు తమ సమస్యలన్నిటినీ, పాలకులకు మొదట చూపించి, జవాబు రాకే, సమ్మె ప్రారంభించారు. కార్మికులకు సమస్యలు వుంటే, వాటి కోసం పాలకులు కదలక పోతే, శ్రమల్ని ఆపివేయ్యడమే, కార్మికులకు ఆత్మగౌరవం.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రధానంగా, ‘తెలంగాణా మజ్దూర్ యూనియన్’ నాయకత్వాన సాగుతోంది. ఇదే యూనియన్, గతంలో, తెలంగాణా రాష్ట్రం రాక ముందు, పెద్ద మెజారిటీతో గెలిస్తే, ఈ యూనియన్ని, ఆ నాడు, ఇంకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్, తను ఎంతెంత మెచ్చుకోలు మాటలు అన్నదీ మర్చిపోయి వుండవచ్చు గానీ, ఆర్టీసీ కార్మికులకూ, ఆ మాటల్ని తెరమీద చూసిన టీవీ ప్రేక్షకులకూ గుర్తే!
కార్మికుల కాలిలో ముల్లు దిగితే, తన పంటితో తీస్తానని ఆ నాటి వాగ్దానం. ఆ నాడు, అలా ప్రకటించిన ఆ పెద్దమనిషి, ఈ నాడు పాలకుడిగా మారి, ఆ అధికార దర్పంతో, ఆ రవాణా కార్మికుల గురించే అన్న మాటలేమిటో కొన్నిటిని చూడాలి.

మొన్నటి విలేఖరుల సమావేశంలో, పాలకుడు అన్నది: ‘‘తిన్నది అరగక చేసే సమ్మె ఇది!’’
ఈ ఒక్క మాటే కాదు, ఇంకా ఎన్నో!
‘‘పనికి మాలిన సమ్మె’’,
‘‘లవి కానీ కోరికలు’’,
యూనియన్ చిల్లర రాజకీయాలు’’;
‘‘సింగరేణి కార్మికులకు బోనసులు ఇచ్చాను’’,
‘‘ఆర్టీసీ కార్మికులు యూనియన్లు లేకుండా పని చేస్తే వాళ్ళకి కూడా బోనస్ వచ్చేది!’’,
‘‘విలీనం అనేది వివేకం లేని, తెలివితక్కువ నినాదం’’,
‘‘పనికి మాలిన రాజకీయ నాయకులు...
తలకాయలు మాసిపోయినోడు... వీళ్ళా మాట్లాడేది?’’
–ఇలా సాగాయి పాలకుడి అహంకారీ, పెత్తందారీ మాటలు!

రాత్రింబవళ్ళూ శ్రమలు చేస్తూ, వాళ్ళ శ్రమ విలువ అంతా వాళ్ళూ పొందకుండా, కేవలం బళ్ళు నడుపుతూ, జీవించే అమాయకుల మీద అలాంటి మాటలా!
వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా ఈ పాలకుడు అధికార పీఠం ఎక్కింది?
అంత నమ్మారు వాళ్ళు!
ఈ పాలకుడు, ఆ పీఠం ఎక్కక ముందు, ఆ కార్మిక సంస్త గురించి మాట్లాడిందేమిటీ, ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటీ?

అప్పుడు కార్మికుల కాళ్ళలో ముళ్ళని తన పంటితో తీస్తానని!
ఇప్పుడు మాట్లాడేది, ఆ ముళ్ళని తెచ్చి తనే గుచ్చుతానని!
ఒక నాడు శక్తివంతురాలైన కార్మిక యూనియనూ, ఆ నాయకులూ, ఈ నాడు పనికి మాలిన సంస్తా, తలలు మాసిన వాళ్ళూ అయ్యారు ఈయన దృష్టిలో.
ఆనాడు, ఈ యూనియన్ నాయకుల్ని పక్కన నిలబెట్టుకుని, వాళ్ళని కీర్తించిన పాలకుడికి, అదే నాయకులు ఈ నాడు తలలు మాసిన వాళ్ళయ్యారు.
కార్మికుల సమస్యల్ని పరిష్కరించే దృష్టి లేనప్పుడు, కార్మికుల సమ్మెలు పనికి మాలినివిగా కనపడతాయి.

సమ్మెచేసే కార్మికులకు వ్యతిరేకంగా కొత్త కార్మికులు పనుల్లోకి రాకూడదు. ఈ విషయాన్ని, కార్మిక సంఘాలు చాలా కాలం నించి ప్రచారం చేస్తూ, కార్మికులకు నేర్పితే, ఆ కొత్త కార్మికులు రాకపోతే, పాలకుల నిరంకుశత్వం, ఒక్క రోజు కూడా సాగదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనుకూలంగా, అనేక మంది వ్యక్తులూ, సంస్తలూ రకరకాలుగా సంఘీభావం చూపించారు. రోజూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి స్పందనలు వారు చూపవలిసిందే.
ఈ సమస్యని, మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ సిద్ధాంత కోణం’ నించీ పరిశీలిస్తే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలలో ఉన్న కార్మిక వ్యతిరేక ధోరణిని ప్రజలందరూ, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సరిగా అర్ధం చేసుకోవడానికి వీలవుతుంది.

అలా గాక, ‘మనం కొన్ని సమస్యల్ని పరిష్కరించమని అడిగాం; ముఖ్య మంత్రి ఒప్పుకోవడం లేదు’ అని, మామూలు లోక గ్న్యాన దృష్టితో మాత్రమే అర్ధం చేసుకుంటే, కార్మికుల చైతన్యం ఒక దగ్గిర ఆగిపోతుంది.
అదనపు విలువ సిద్ధాంతం ప్రకారం, రవాణా కార్మికులు, తాము పొందే జీతాలకన్నా, అదనంగా ఎంతో విలువని (డబ్బుని) తెచ్చిపెడతారు సంస్తకి.

ఆ సంస్త ప్రైవేటు పెట్టుబడి దారుడిది అయినా, ప్రభుత్వ ఆధీనంలో నడిచేది అయినా. రవాణా అనేది ఒక పరిశ్రమ. దానిలో తయారయ్యే సరుకు ‘రవాణా’ అనే సౌకర్యం. ప్రయాణీకుల్నీ, వారి సామాన్లనీ ఒక చోటు (ఊరు) నించి ఇంకో చోటుకి (ఊరుకి) తీసికెళ్ళే పని జరుగుతుంది. అక్కడ బస్సులు వున్నంత మాత్రాన సరిపోదు గదా?

దాన్ని నడిపే డ్రైవర్లు వుండాలి. దాన్ని ఎప్పటికప్పుడు పనిచేసే స్తితిలో ఉందో లేదో చూసే మెకానిక్కులూ, క్లీనర్లూ ఉండాలి. వీళ్ళు తమకు వచ్చే జీతలకన్నా ఎక్కువ అదనంగా విలువని ఎలా సృష్టిస్తారో ఒక ఉదాహరణ ద్వారా అతి క్లుప్తంగా చూద్దాం.

ఒక బస్సు ఒక ఊరు నించి ఒక ఊరికి వెళ్తోంది అనుకుందాం. ఆ బస్సులో 50 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క టిక్కట్టు ధర 40 అనుకుందాం. ఒక ట్రిప్పులో ఆ ప్రయాణం వల్ల వసూలైన మొత్తం 50X40 = 2,000.
ఇందులో, డీజిలూ, బస్సు అరుగుదలా, రోడ్డు అరుగుదలా వగైరాల మీద పెట్టిన ‘పెట్టుబడి’ ఖర్చంతా 500 అనుకుందాం. 2000 లోంచి 500 తీసివెయ్యగా మిగిలేది 1500. ఇది ఆ బస్సుని నడపడం అనే శ్రమ చేసిన డ్రైవరిది. (మన ఉదాహరణలో ఒక్క డ్రైవరే అనుకుందాం.)
అంటే, ఆ బస్సుని నడిపిన డ్రైవరూ, అవసరమైనప్పుడల్లా బస్సుని శుభ్రం చేసే క్లీనర్లూ, మెకానిక్కులూ వగైరా శ్రామికులు కలిపి ఇచ్చిన శ్రమ విలువ అది. ఆ ప్రయాణంలో ఒక్క డ్రైవరే, ఒక్క మెకానిక్కే, ఒక్క క్లీనరే పనిచేశారు –అనుకుంటే, ఆ 1500, ఆ ౩గ్గురు శ్రామికులకే చెందాలి. ఆ ప్రయాణం, 6 గంటల కాలం పట్టిందనుకుందాం. ఆ 6 గంటల డ్యూటీలో పని చేసినందుకు ఆ 3గ్గురు శ్రామికులకూ జీతాలుగా, ఆ బస్సు యజమాని (అతను ప్రైవేటు వ్యక్తి కావొచ్చు, ప్రభుత్వమే కావొచ్చు. ప్రభుత్వం కూడా ఒక యజమానే, ఆర్టీసీ వంటి సంస్తల విషయంలో) 300 ఇచ్చి, మిగిలిన 1200ని ‘లాభం’ పేరుతో తనే తీసుకుంటాడు. ఈ 1200, ఆ 3గ్గురు కార్మికుల నించి వచ్చిన ‘అదనపు విలువ’.

అయితే, బస్సు పెట్టుబడిదారుడికి (ఇక్కడ ఆర్టీసీకి), అదనపు విలువని ఇవ్వని కార్మికులు కూడా ఉంటారు. అయినా వారు చేసేది కూడా శ్రమే.
వాళ్ళూ వేతన శ్రామికులే. ఉదా: టిక్కట్లు అమ్మే శ్రమ అనుత్పాదక శ్రమ. ‘టిక్కెట్ల అమ్మకం’ అనేది, ఏ ప్రయాణానికి అయినా ‘సహజ అవసరం’ కాదు. టిక్కెట్ల అమ్మకం లేకపోయినా, బస్సు కదులుతుంది.

బస్సుని నడిపే శ్రమ లేకపోతేనో, బస్సుకి డీజిల్ లేకపోతేనో బస్సు ఆగిపోయినట్టుగా, టిక్కెట్ల అమ్మకం లేకపోతే బస్సు ఆగిపోదు. కాబట్టి, టిక్కెట్ల పుస్తకాలఖర్చూ, టిక్కెట్లు అమ్మే ఉద్యోగి జీతమూ వంటిఖర్చులు, ఆ ప్రయాణానికి అవసరమయ్యే ‘శ్రమ మొత్తం’లోకి చేరవు.

కానీ, ఆర్టీసీ, ఈ అంశాల మీద కూడా ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చుల్ని 100 అనుకుంటే, డ్రైవరూ వగైరా కార్మికుల ద్వారా వచ్చిన ‘1200 అదనపు విలువ’ నించే ఈ 100ని ఖర్చు పెట్టాలి. ఇంకా 1100 మిగులుతుంది. మన ఉదాహరణలో ఉన్న బస్సు ప్రయాణం 6 గంటలే. ఆ బస్సు రాత్రింబవళ్ళూ పనిలోనే ఉంటుంది. రోజుకి 3, 4 ప్రయాణాలు! ఒక ఊరు నించి ఇంకో ఊరుకి వెళ్ళేప్పుడు ఒక లాభమూ, మళ్ళీ ఆ ఊరు నించి ఈ ఊరికి వచ్చేటప్పుడు ఒక లాభమూ! అలాగ ఒక ట్రిప్పు తర్వాత ఒక ట్రిప్పు తిరుగుతూనే ఉంటుంది. కార్మికులు పగలూ, రాత్రీ పని చేస్తూనే వుంటారు.
ఇప్పుడు చెప్పండి, నిరంతరం శ్రమిస్తూ, సంస్తకి అదనపు విలువ ఇచ్చే కార్మికులు, తమ సమస్యల మీద సమ్మె చేస్తే తిన్నది అరక్క చెయ్యడమా? ఆర్టీసీ కార్మికుల అదనపు విలువనే కాక, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్తల కార్మికుల అదనపు విలువల్ని పన్నుల రూపంలో తన అధీనంలో పెట్టుకునే ప్రభుత్వం చేసే వాదనలన్నీ ‘అదనపు విలువ’ అరక్క చేసే దూషణలే!

‘సింగరేణి కార్మికులకు రెండు లక్షలు బోనసు ఇచ్చాను,
మీరు సమ్మే- గిమ్మే, యూనియన్- గీనియన్ అనకపోతే మీకు కూడా బోనస్ ఇచ్చే వాణ్ణి’ అనడం.
ఆ బోనసుల డబ్బు పాలకుల శ్రమలా?
ఎక్కనుంచి తెచ్చి ఇస్తున్నారు?
ముఖ్య మంత్రీ, ఇతర మంత్రులూ, ఆర్టీసీ అధికారులూ, శారీరక శ్రమో, మేధా శ్రమో చేసి ఆ బోనసులూ, పెంచామంటున్న జీతాలూ ఇస్తున్నారా?
కార్మికులు ఇచ్చిన అదనపు విలువలోనించే కదా తీసి ఇచ్చేది?
పైగా, నిర్జీవమైన గుళ్ళకీ, గోపురాలకీ లక్షల నిధులు. సజీవులైన కార్మిక మానవులకి తిట్లు,
‘అన్నం అరక్క’;
‘బుద్ధిలేని’,
‘పనికి మాలిన’ అంటూ!
అమ్మ వారికీ, శ్రీవారికీ ముక్కు పుడకలూ, కిరీటాలూ. అన్నీ పన్నుల రూపంలో వచ్చిన కార్మికుల అదనపు విలువే.

ఆర్టీసీ కార్మికులూ!
నిరుత్సాహ పడకండి!
కొందరు ఆత్మహత్యల ఆలోచనలు చేశారు. అది సరి కాదు.
ఎందుకంటే, ఈ సమ్మెలో పెట్టిన డిమాండ్లు వ్యక్తిగతమైనవి కావు.
కార్మికులందరికీ సంబంధించినవి.

అందరితో కలిసి పొరాడి సాధించుకోవడానికి ప్రయత్నించాలి.
వ్యక్తులు పోతే ఉద్యమాలు బలహీన పడి పోతాయి.
ఆత్మహత్యలు పాలకుల్ని కదిలించవు.
అలా మనం చేస్తే, వాళ్ళ పెత్తనానికి లొంగిపోయిన వాళ్ళం అవుతాం.

- రంగనాయకమ్మ

4 comments:

  1. రంగనాయకమ్మ ఇంకా బతికే ఉందా?

    ReplyDelete
    Replies
    1. అనామకంగా బతికే వారికేం తెలుస్తుంది రంగనాయకమ్మ గారు బతికే వున్నారో... ఈ వయసులోకూడా ప్రజా సమస్యలపై ఎంత సునిశితంగా స్పందిస్తున్నారో, ఎంత గొప్ప రచనలు చేస్తున్నారో !

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. ఇంతకీ పైన ఆవిడ చెప్పిన లెక్కల్లో లాజిక్ ఉందా, కామన్ సెన్స్ మిస్సయ్యిందా?

      Delete