Wednesday, July 6, 2016

చలో అమెరికా !

చలో అమెరికా !
2 జులై 2016
మొట్టమొదటిసారి విమానం ఎక్కబోతున్నాం.
ఏకంగా 18 గంటలు మేఘాల మీద గాలిలో తేలియాడబోతున్నాం. చాలా థ్రిల్లింగ్ గా వుంది.
గాలిలో తేలాలన్న కోరిక ఈనాటిది కాదు. చిన్నప్పుడు 'కీలుగుర్రం' సినిమా చూసినప్పటి నుంచీ మనసులో గూడు కట్టుకుని ఊరిస్తూనే వుంది.
అక్కినేని నాగేశ్వరరావుని రిక్వెస్ట్‌ చేసి ఆయన కీలుగుర్రం తీసుకుని ఆకాశంలో వరంగల్‌, హన్మకొండ చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టేవాణ్నో ఆరోజుల్లో.
విచిత్రం ఏమిటంటే ఆనాటి ఊహల్లో కూడా నేను ఎప్పుడూ వరంగల్‌ దాటి వెళ్లలేదు. ఎంతసేపూ ఆజంజాహీ మిల్లు పొగగొట్టం, వరంగల్‌ కోట, భద్రకాళి చెరువు, వేయిస్థంభాల గుడి వీటి మీదుగానే తిరిగేవాణ్ని. ఆ కీలుగుర్రం మీద కనీసం ఒక్కసారైనా హైదరాబాద్‌ చుట్టి వచ్చిన గుర్తులేదు. బహుశ నాకు అప్పుడు వరంగల్‌ తప్ప మరో ప్రపంచం ఏదీ తెలియకపోవడమే అందుకు కారణం కావచ్చు.
ఆతరువాత గత సంవత్సరం ఇవేరోజుల్లో బంధుమిత్రులతో కలిసి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లినప్పుడు బాల్టాల్‌లో కనీసం హెలీకాప్టర్‌ అయినా ఎక్కాలని ఎంతో తహతహలాడాను. కానీ వాతావరణం బాగాలేకపోవడంతో ఆరోజు హెలీకాప్టర్‌ సర్వీసును రద్దు చేశారు.
గత్యంతరం లేక డోలీలో వెళ్లాల్సి వచ్చింది. డోలీ అంటే చచ్చిన తరువాత నలుగురు మనుషులు శవాన్ని మోసుకెళ్లినట్టు మోసుకెళ్లడం. కాకపోతే అక్కడ పాడె మీద శవాన్ని పడుకో బెడతారు. ఇక్కడ మనం ఇంకా ప్రాణమున్న మనుషులం కాబట్టి పాడె మీద ఓ కుర్చీ వేసి కూర్చోబెడతారు. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. సరే అది వేరే కథ.
2010లో కూడా నాకు అనుకోకుండా విమానంలో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. 'ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర' అనువాదానికి గాను నాకు అప్పుడు అనూహ్యంగా కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాదక బహుమతిని ప్రకటించారు.
బహుమతి ప్రదానోత్సవం గోవా రాజధాని పనాజీలో. విమానంలో కూడా రావచ్చన్నారు కానీ ఒక్కరికే రాను పోను ఛార్జీలు చెల్లిస్తామన్నారు. శ్రీమతిని వెంట తీసుకొస్తే మాత్రం ఆ టికెట్‌ ఖర్చును మీరే భరించాల్సి వుంటుందన్నారు. టూ టైర్‌ ఎసి ట్రైన్‌లో అయితే ఇద్దరి ఫేర్‌ మేమే భరిస్తామన్నారు. దాంతో ఎంతో తర్జన బర్జన పడి చివరికి ఇద్దరం ట్రైన్‌లోనే గోవాకు వెళ్లాం.
ఇన్నాళ్ల తరువాత ఇవాళ ఏకంగా 18 గంటల పాటు మేఘాలలో తేలిపోయే అదృష్టం వచ్చింది. ఇది ఊహించని ప్రయాణం. అనవసరపు ఖర్చెందుకు, మీ పెళ్లిల్లయిన తరువాత వస్తామన్నా వినకండా పిల్లలు టికెట్లు పంపించారు.
అమెరికాలో మూడు నెలలు మకాం. నలభై ఐదు రోజులు న్యూయార్క్‌ దగ్గరి బాల్టిమోర్‌లో, నలభై ఐదు రోజులు డల్లస్‌లో.
ప్రయాణ ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడం వల్ల హడావిడిలో నా మనసులో వున్న ఆలోచనలను సరిగా పంచుకోలేకపోతున్నాను. మరో సారి వివరంగా రాస్తాను. అంతవరకు సెలవు.
(Dt.02-07-2016)

No comments:

Post a Comment