Tuesday, January 27, 2009

ఇక ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఆంధ్ర నాయకులే దిక్కేమో...!

..... 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో దాదాపు నాలుగు వందల మంది ప్రాణాలు బలయ్యాయి. ఎన్ని వీపులు చిట్లిపోయాయో, ఎంత మంది జైలు పాలయ్యారో, ఎంతమంది విద్యార్థుల చదువులు దెబ్బ తిన్నాయో ఎందరు ఎన్నిరకాలుగా కష్టనష్టాలకు గురయ్యారో లెక్కేలేదు.

అసలు ఆ ఉద్యమాన్ని నడిపింది విద్యార్థులు. ఖమ్మంలో ఒక విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్షతో మొదలయి మొత్తం తెలంగాణా జిల్లాలకు వ్యాపించింది.

మల్లికార్జున్‌, శ్రీధర్‌రెడ్డి వంటి విద్యార్థి నాయకుల నేతృత్వంలో, కాళోజీ వంటి పెద్దల అండదండలతో సాగుతున్న నాటి ఉద్యమంలో క్రమంగా కొండాలక్ష్మణ్‌ బాపూజీ, వందేమాతరం రామచంద్రరావు వంటి రాజకీయ నాయకులు వచ్చిచేరారు.

అందరికంటే ఆఖరున ఉద్యమంలోకి వచ్చి మొత్తం ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నవాడు మర్రి చెన్నారెడ్డి. (తెలంగాణా నాయకులను ఉద్యమంలోకి ఆహ్వానించే క్రమంలో విద్యార్థులు పాడిన... "రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి... ఇకనైన రావోయి వెర్రి చెన్నారెడ్డి..." అనే పాట అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది).

ఆ ఉద్యమ కాలంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్‌) ఒంటరిగా పోటీ చేసి తెలంగాణాలోని 15 ఎంపి సీట్లకు గాను 10 సీట్లను గెలుచుకుంది.

అయితే అప్పుడు అధికారంలో వున్న అపర చాణిక్యురాలైన ఇందిరమ్మ ...ఛూమంతర్‌... అనగానే ఆ పది మందీ తెలంగాణా జెండాను అవతల పారేసి ఖద్దరు టోపీలు పెట్టుకున్నారు.
మర్రి చెన్నారెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి పీఠం మీద ఓ రెండేళ్లు "పొన్ను కర్ర" తిప్పుకుంటూ కూర్చుని తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు.
ప్రజలు ఆ నయవంచనను నిస్సహాయంగా చూస్తుండిపోయారు.

ఆ తరువాత తెలుగుదేశం హయాంలో "తెలంగాణా జనసభ" అనేక ప్రతికూల పరిస్థితులను, నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించింది. ఆశించిన మంత్రి పదవి దక్కని కల్వ కుంట చంద్రశేఖరావు తెలంగాణా రాష్ట్ర సమితిని స్థాపించి తాజా ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.

తెలుగుదేశం బూచిని చూపి... గతంలో ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీతోనే పొత్తు కుదుర్చుకుని, మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూ రెండో ఎస్సార్సి వేయడం అనే ఒక జంతర్‌మంతర్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుని మొత్తం తెలంగాణా ప్రజల భవిష్యత్తును సోనియమ్మ చేతిలో పెట్టాడు.

సోనియమ్మ భజన చేసుకుంట తెలంగాణా వచ్చే దాక కూడా ఆగలేక తెలంగాణా రాష్ట్ర సమితి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు తీసుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికోసం కొంతకాలం పక్షపాతం లేకుండా కృషి చేసి పునీతమైంది.

ఆదిలోనే హంసపాదులా టిఆర్‌ఎస్‌ తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అప్పుడే శతృపక్షంలో చేరిపోయారు.

ఉద్యమం అంటే ఉన్న గుప్పెడు మంత్రి పదవులకు, ఎంపి, ఎంఎల్‌ఎ పదవులకు రాజినామాలు చేయడం ... మళ్లీమళ్లీ బై ఎలక్షన్లకు వెళ్లడం ... అనే వింత తంతు కింద మార్చి పారేసి చివరికి కెసిఆర్‌ అభాసు పాలయ్యాడు.

ఇక ఇప్పుడు...
నిన్నటి దాకా తెలంగాణా ద్రోహుల పార్టీ అని దుమ్మెత్తి పోసిన టిడిపి తో.... అట్లాగే - ఒక భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలు వుండటానికి వీలు లేదు గాక వీలులేదని మనసా వాచా కర్మనా నమ్మే సిపిఎంతో .....(వాళ్లు కాంగ్రెస్‌ పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడంటె అప్పుడు తమ విశ్వాసాన్ని మార్చుకుంటరు గని తెలంగాణా మీద మాత్రం చచ్చినా మార్చుకోరు. సాక్షాత్తు కారల్‌ మార్క్స్‌ వచ్చి తెలుగోళ్లకి రెండు రాష్ట్రాలు వున్నా తప్పులేదురభై అని చెప్పినా ఒప్పుకోరు) అట్లాంటి సిపిఎంతో పొత్తుకు సై అంటున్నాడు. వాళ్లు (సిపిఎం) ఒక దిక్కు తెలంగాణా వద్దనుకుంట తెలంగాణా ప్రజాసమితి తోని అప్పుడు కాంగ్రెస్‌తో కలిసి, ఇప్పుడు టిడిపితో కలిసి ఎట్ల పొత్తుకు సై అంటున్నరో బ్రహ్మ దేవునికి కూడా అర్థం కాదు.

ఈ సిపిఎం ఒప్పుకోకపోవడం వల్లనే ...(కం...చెం...చ...ష్‌ రాక)... ప్రత్యేక తెలంగాణా మీద తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ మొన్నటిదాకా పాటపాడుతూ వచ్చింది.

అట్లాగే అప్పుడు తెలుగు దేశం మోకాలడ్డడం వల్లనే తామ హయాంలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయలేకపోయామని, లేకపొతే మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణాను కూడా అప్పుడే ఏర్పాటు చేసివుండేవాళ్లమని బిజెపి వాపోతోంది.

గీ ముచ్చట గిట్లుంటె .......
నిన్న మొన్నటి దాకా సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో వుంటూ వచ్చిన దేవేందర్‌ గౌడ్‌ జెర ఆలస్యంగనైనా తెలంగాణా పల్లవి అందుకుని నవతెలంగాణా ప్రజా పార్టీని తెరిచిండు. ఇప్పుడు గాయన ప్రజారాజ్యం పార్టీతోని చేతులు కలుపుతుండు.

మరోపక్క పాపం తెలుగుదేశం పార్టీ సుత ... ప్రజల సెంటిమెంటును గౌరవించి ప్రత్యేక తెలంగాణాకు (రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడానికి) అనుకూలంగా తీర్మానం చేసింది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అయితె ... రేపు అధికారంలోకి రాంగనె ఫౌరెన్‌ ... అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేస్తానని ఢంక బజాయించి చెప్తోంది. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణా నడిబొడ్డున నిలబడి తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పటివరకు ఏం వెలగబెట్టిందని గల్ల పట్టుకుని నిలదీస్తుండు.

తెలుగు దేశం అధికారంలో వున్నప్పుడు తెలంగాణాకు ప్రత్యేక పిసిసి కావాలని.... రాజశేఖర రెడ్డిని సైమన్‌ గోబ్యాక్‌ అని ... నానా హడావిడి చేసిన చాలీస్‌ తెలంగాణా కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు తెలంగాణా సమస్యను నాలుగున్నరేళ్ల కిందట సోనియమ్మ చేతులపెట్టి సప్పుడు చెయ్యకుంట, ఫరాకతుగా ... తమ పని తాము చేసుకుంట పోతున్నారు.

ఏందిర భై గీ పాలిటిక్స్‌ గింత లత్తకోరుగున్నయి అని సోంచాయించే వాళ్లకి ఏమనిపిస్తాందంటే ...........

ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఇక ఆంధ్ర నాయకులే నడుపుతరేమో అని !!!
తెలంగాణా నాయకులకు తెలంగాణా ఉద్యమాన్ని నడపడం చాతనైతలేదు.
తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకులకు జైకొడ్తే సాలు తెలంగాణా వచ్చినట్లె.
అందరు బే ఫికర్‌గ వుండుండ్రి....!

తెలుగు దేశం అధికారంలోకి వచ్చిందనుకోండ్రి......
ప్రత్యేక తెలంగాణాకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితడు.
ప్రత్యేక ఆంధ్రకు బాలకృష్ట ముఖ్యమంత్రి అయితడు.
ఆ దెబ్బతోని ఏ పరేశాన్లు గిరేశాన్లు లేకుండ నందమూరి కుటుంబం మొత్తం సమైక్యంగ వుంటది.

అట్లగాక........
ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చిందనుకోండ్రి...
ప్రత్యేక ఆంధ్రకు చిరంజీవి ముఖ్యమంత్రిగ వుంటడు,
ప్రత్యేక తెలంగాణాకు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అయితడు.

సర్వేజనా సుఖినోభవంతు.

ఏమంటరు ?????

7 comments:

  1. తథాస్తు. మీకోరిక తప్పక ఫలిస్తుంది.

    ReplyDelete
  2. ..... 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో దాదాపు నాలుగు వందల మంది ప్రాణాలు బలయ్యాయి. ఎన్ని వీపులు చిట్లిపోయాయో, ఎంత మంది జైలు పాలయ్యారో, ఎంతమంది విద్యార్థుల చదువులు దెబ్బ తిన్నాయో ఎందరు ఎన్నిరకాలుగా కష్టనష్టాలకు గురయ్యారో లెక్కేలేదు. అన్నరు నిజమే అలగే జై అంధ్రా ఉంద్యమం కూడా, విధ్యార్దులే నడిపారు.

    "ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఇక ఆంధ్ర నాయకులే నడుపుతరేమో అని !!! " ఏముంది దీనికి విరుగుడుగా ప్రత్యెక ఆంధ్రా ఉద్యమాన్ని తెలంగాణా నాయకులు నడిపితే పోలా?

    ReplyDelete
  3. ఏందబ్బా ఇది మరి రాయలసీమ విషయం తేల్చండి. ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ఎవరు నడుపుతారు చెప్పండి :)

    ReplyDelete
  4. @ జీడి పప్పు గారూ
    నాది కోరిక కాదు. ఆక్రోశం. అరణ్య రోదన.

    @ అజ్ఞాత గారూ
    విద్యార్ధులు తలచుకుంటే వ్యవస్థనే మార్చేయగలరు. అలాటి రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
    తెలంగాణా నాయకులకు తెలంగాణా జిల్లాలలో పర్యటించి ఇక్కడి ప్రజలను చైతన్య పరిచే తీరికా ఓపికా నే లేదు ఇక ఆంధ్రాను ఏం ఉద్దరిస్తారు లెండి

    @ చైతన్య గారూ
    ఆంధ్రా , తెలంగాణా లలో మాదిరిగా రాయలసీమ లో ఇంతవరకు ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరగలేదు కదా. ముందు మీరు నడుం బిగించండి.

    ReplyDelete
  5. ప్రభాకర్ గారూ,
    మీ భయానికి చాలా ఆధారాలే కనబడుతున్నాయి. పొత్తులు, సీట్లే నిర్ణయాత్మక శక్తి అయితే - మీరన్నట్టు - తెలంగాణా మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబో, పవన్ కల్యాణో అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. టి.ఆర్.ఎస్. లో కెసిఆర్ ఒక్కడికే అంతపట్టు వుండడం ఎలా సాధ్యమో నాకు అర్ధం కావడం లేదు. ఉత్తరం రేపిన కలకలం తరవాత పరిస్థితులు ఎలా వుండబోతున్నాయో.

    ReplyDelete
  6. కేసీయార్ బొందిలో ప్రాణముండగా ఆంధ్రప్రదేశ్ సమైక్యతకి ముప్పు రానీయడు. ఈయన్ని ఇంతకు ముందు నేను అపార్ధం చేసుకుని తెగ తిట్టుకునేవాడిని. అదెంత తప్పో మెల్లిగా అర్ధమయింది. పైకి కరడుగట్టిన ప్రత్యేకవాదిలా కనిపిస్తాడు కానీ, మన రాష్ట్రంలో అసలు సిసలు సమైక్యవాది కేసీయారొక్కడే.

    ReplyDelete
  7. @ రమణ గారూ,
    ఒక్క టిఆర్ఎస్ లోనే కాక దాదాపు అన్ని పార్టీలలోనూ సిద్ధాంతాలు, ప్రజాస్వామిక విలువల కంటే వ్యక్తి నియంతృత్వం, వ్యక్తి ఆరాధన పెరిగి పోతోంది. తమకు ఇష్టం లేక పోయినా మిగతా వాళ్ళంతా నిస్సహాయంగా, స్వార్ధ ప్రయోజనాలకోసం మౌనం వహిస్తున్నారు. పెరుగుతున్న ప్రజా చైతన్యమే ఈ ఒంటెత్తు పోకడలకు, నియంతృత్వానికి చెక్ పెట్టాలి.

    @ అబ్రకదబ్ర గారూ
    కేసిఆర్ ని మరీ సమైక్యవాది అని చెప్పలేం కానీ ఆయన ప్రజలను భాగస్వాములను చేయకుండా, ఉద్యమ విస్తృతికి నిర్మాణాత్మకంగా కృషిచేయకుండా ... ఒంటెత్తు పోకడలతో , నత్తనడకలతో ఉద్యమాన్ని నడపడం ఉద్యమానికి తప్పక హాని చేస్తుంది. చేసింది.

    ReplyDelete