Friday, January 23, 2009

మనిషికి ఎంత భూమి కావాలి సత్యం / సిఎం గారూ ??????

అనగనగా ఒక రైతు.

అతనికి ఓ రెండెకరాల పొలంవుండేది. ఆరుగాలం శ్రమిస్తూ అందులో బంగారం పండించేవాడు. తిండిగింజలకు లోటు లేకుండా అతని కుటుంబం నిశ్చింతగా జీవిస్తుండేది.

అయితే అతని కో అన్న వున్నాడు. ఆయన పట్నంలో ఏదో ఉద్యోగం చేస్తూ వీళ్లకంటే కాస్త ఉన్నతంగా బతుకుతున్నాడు. వాళ్లని చూసినప్పుడల్లా రైతు భార్య తమ మట్టి బతుకు పట్ల, అరకొర సౌకర్యాలపట్ల తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండేది.

దరిమిలా - ' మరో పదెకరాల పొలం వుంటేనా...' అనే ఆలోచన ఆ రైతును తొలవడం ప్రారంభించింది.

ఇలా వుండగా ఊళ్లోని దొరసానమ్మ తన పొలం మొత్తం అమ్ముకుని పట్నం వెళ్లిపొతోందన్న వార్త వెలువడింది. అందరితో పాటు ఆ రైతు కూడా అప్పోసప్పో చేసి ఓ పదెకరాలు కొనేశాడు.

దాంతో ఆతని ఆదాయం పెరిగింది. పరపతి పెరిగింది. వైభోగం పెరిగింది.

ఇలా అతనూ అతని కుటుంబం దర్జాగా జీవిస్తుండగా ఒక బాటసారి మరో తీయని కబురు చెవిలో వేశాడు.

దూరంగా ఓ ప్రాంతంలో .....రూపాయికి ఎకరం చొప్పున ....కారు చవగ్గా భూములు అమ్ముతున్నారట. తను అదే పనిమీద వెళ్తున్నానని చెప్పాడతను.

ఒక్కసారిగా రైతు కళ్ల ముందు మరో అద్భుతమైన రంగుల ప్రపంచం ప్రత్యక్షమయింది.

మొత్తం తన పన్నెండెకరాల పొలాన్ని, ఇంటినీ తెగనమ్మి భార్యాపిల్లలతో ఆ ప్రాంతానికి వలసపోయాడు.

అక్కడ రెండొందల ఎకరాల పొలాన్ని, చక్కని భవంతిని సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు రైతు కాస్తా భూస్వామిగా మారాడు.

పట్నంలోని తన అన్న కన్నా అతని అంతస్తు వెయ్యి రెట్లు పెరిగింది.

ఇట్లా వుండగా మళ్లీ మరో బాటసారి మరో వింతైన కబురు తెచ్చాడు. పొరుగు రాజ్యంలో భూములను ..... పైసాకి ఎకరం .... చొప్పున అమ్ముతున్నారట!!

వారి నాయనోయ్‌! ... తన రెండొందల ఎకరాల భూమిని అమ్మితే ... ఆ రాజ్యంలో రెండు వేల ఎకరాల భూమిని సొంతం చేసుకోవచ్చు!!!.

అంతే
తక్షణమే తన భూమి మొత్తాన్ని అమ్మేసి కుటుంబంతో ఆ రాజ్యం పయనమయ్యాడు.

అక్కడ రాజావారు ఆ రైతు తెచ్చిన డబ్బును పుచ్చుకుని మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదన చేశాడు.

''నువ్వు ఉదయం ఒక చోటు నుంచి బయలు దేరి నీకు కావలసినంత భూమికి హద్దులు పెట్టుకుంటూ సూర్యాస్తమయం అయ్యేలోపు బయలు దేరిన చోటుకు చేరుకోవాలి. అప్పుడు నువ్వు తిరిగినంత నేల నీ సొంతమవుతుంది. ఒక వేళ సూర్యాస్తమయం అయ్యే లోపు బయలు దేరిన చోటుకు రాలేక పోతే మాత్రం నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వడం జరగదు'' అన్నాడు రాజు.

మన రైతుకు ఆ ప్రతిపాదనతో కళ్ళు బైర్లు కమ్మాయి.

ఈ దెబ్బతో ... రెండువేల ఎకరాలేం ఖర్మ .... ఒక చిన్నపాటి రాజ్యాన్నే సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు.

మర్నాడు సూర్యోదయం కాగానే నిర్ణీత ప్రదేశం నుంచి బయలు దేరాడు. నెమ్మదిగా నడిస్తే ఎక్కువ ఏరియాని కవర్‌ చేయలేనని పరుగులు తీయడం మొదలు పెట్టాడు.

పరుగెత్తాడు... పరుగెత్తాడు.. పరుగెత్తాడు...

ఆయాసాన్ని లెక్కచేయకుండా కొండలు కోనలు దాటుతూ మధ్యాహ్నం కల్లా చాలా మైళ్ల దూరం వచ్చేశాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని ఈ నేలంతా నాదే కదా అని మహదానంద పడిపోయాడు.

అంతలో అతనికి రాజుగారు పెట్టిన షరతు గుర్తుకు వచ్చింది.

సూర్యుడు అప్పుడే నడినెత్తి మీద వున్నాడు.

అమ్మో సూర్యాస్తమయం అయ్యేలోగా బయలు దేరిన చోటుకు చేరుకోవాలి కదా ... సంపాదించుకున్న భూమి ఇక చాల్లే అని వెనుతిరగాడు.

అప్పటికి అతని ఒంట్లో శక్తి చాలావరకు హరించుకుపోయింది. నీరసం, కాళ్ల నొప్పులు.. అడుగు తీసి అడుగువేయాలంటే కష్టంగా వుంది.

లేని ఓపికను తెచ్చుకుంటూ నడకను కొనసాగించాడు.

ఎట్టకేలకు సూర్యాస్తమయం కాబోతున్న వేళ ... అతనికి తను బయలుదేరిన చోటు, అక్కడ రాజుగారి బిడారం కనుచూపు దూరంలో కనిపించింది.

అప్పటికి చెప్పులు తెగిపోయి, కాళ్లు వాచిపోయి రక్తం కారుతున్నాయి.... నోరు దాహంతో పిడచట్టుకు పోతోంది.... కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి....

దూరంగా జనం “ వచ్చేయ్‌...” “ ఇంకా త్వరగా నడువు ...” అంటూ కేకలు వేస్తున్నారు.

కానీ పాపం రైతు నడవలేకపోయాడు.
అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు.
చివరికి ఒక్కసారిగా దభీల్మని బయలుదేరిన చోటును పూర్తిగా చేరుకోకుండానే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

అంతా అయ్యో పాపం అనుకున్నారు.

అతడి శవాన్ని అక్కడే .... ఆరడుగుల .... గొయ్యితవ్వి పూడ్చేశారు !


ఇది మహా రచయిత టాల్‌ స్టాయ్‌ 1886లో ''ఎంత భూమి కావాలి'' అన్న పేరుతో రాసిన కథ తాలూకు (ఇష్టానుసారంగా చేసిన) సారాంశం.

ఇవాళ ఈనాడులో ......''రామలింగ రాజు భూదాహం'' ......అన్న శీర్షికతో వచ్చిన వార్త చదివిన తరువాత నాకు ఈ కథ గుర్తుకు వచ్చింది.

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm

దురాశ ఎంత వాడినైనా ఎంత పతనం చేస్తుందో, పరువు ప్రతిష్టలను ఏవిధంగా మంటకలుపుతుందో కదా అనిపించింది.

మైటాస్‌ కంపెనీకి అనుబంధంగా మరో 240 బినామీ సంస్థలను పుట్టించి 3500 ఎకరాలను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో దొరికిన పత్రాల ద్వారా గుర్తించారట. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములున్నాయో.

2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ భూదందా వెర్రితలలు వేస్తోంది.

భూసంస్కరణలు, సీలింగ్‌ చట్టం ఎక్కడ చచ్చాయో ఏమో.

పేదవాడికి గుడిసె వేసుకునేందుకు 25 గజాల స్థలం దొరకదు కానీ ఒక్కక్కడు ఎక్కడపడితే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు, ఏ పేరుతో అంటే ఆ పేరుతో గుటకాయస్వాహా చేస్తున్నాడు.

రాబోయే రోజుల్లో ఇక చచ్చిన పేదల శవాల్ని పూడ్చేందుకు కూడా జాగా దొరకదేమో!!!!

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేంత వరకు ప్రత్యేక తెలంగాణాకు సానుకూలంగా వుండి....
(ఇప్పటికీ మేం తెలంగాణాకు వ్యతిరేకం కాదు, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం, సమస్య పరిష్కారం బాధ్యతను అధిష్టానం చేతిలో పెట్టాం వంటి సొల్లు కబుర్లు కొనసాగిస్తూనే వున్నారనుకోండి)
... అధికారం చేజిక్కాక ఇప్పుడు తెలంగాణాకు బద్ధ వ్యతిరేకంగా మారడానికి కారణం కూడా ఈ భూదందాయే.

ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్న భూములను ఎక్కడ వదులుకోవలసి వస్తుందో, లేదా వాటి ధరలు ఎక్కడ తగ్గిపోతాయో అన్న భయం వల్లనే ఈ మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది.

అసత్యమేవ జయతే
సత్యం వధ, ధర్మం చెఱ!

కొస మెరుపు :
సత్యం రామ లింగ రాజు మీద మన యువ సాఫ్టు వేర్ ఇంజనీర్లు ఇటీవల కసితో ఒక వీడియో గేం ని రూపొందించారు. అందులో మీరు చేయవలసింది ఆయన మొహం మీద కుళ్ళిన కోడి గుడ్లు విసరడం . ఒక నిమిషం లో ఎన్ని గుడ్లు అయన మొహానికి కొడితే అన్ని పాయింట్లు వస్తాయి. .మీరు ఇంకా చూడక పొతే ఇదిగో ఆ గేం చిరునామా:



http://nailthethief.com/


...............................

9 comments:

  1. ప్రభాకర్ సర్ !మీ టపాలన్నీ చదివాను ."వ్యక్తిగత పత్రిక " ఆలోచన చక్కగా ఉంది .మీ కధలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి . ''ఎంత భూమి కావాలి''చదివి నప్పుడు ఎంత ప్రాకులాడినా మనిషికి చివరికి మిగిలేది ఆరడుగులేగా ......అనిపించింది . ఖంగారు పడకండి ఈ స్మశాన వైరాగ్యం మీ బ్లాగ్ దాటేవరకే. తర్వాత షరా మామూలే .కుడితిలో పడ్డ ఎలుక చందం .
    *మీ పూదోట చాలా అద్భుతంగా ఉందండీ !అర్జంటుగా మా ఫ్రెండ్ కి చూపించాలి .

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు. కథ బాగుంది. నెనరులు.

    ReplyDelete
  3. నాకో సందేహం!! మీరు హైటెక్సిటీ లో పనిచేస్తారా? ఒకేల చేస్తుంటే, ఒరాకిల్ కార్యాలంనుండి ఓ సారి తల పక్కకి తిప్పి చూడండి. మీకో పెద్ద కాంప్లెక్స్ కనిపిస్తుండాలి, దానిపేరే "జయభేరీ" వాళ్ల "జయభేరీ ఎంక్లేవ్". దాని పక్కనే జయభేరీ సిలీకాన్ వ్యాలి, ఇంకొంచెం ముందుకెళ్తే జయభేరీ మట్టీ మషానం. ఇవి కట్టటానికి, ఒక్కసారి ఎవ్వరెవ్వరు ఎంతెంత భూమి కోల్పొయ్యారో సేకరించండి. లేక అప్పుడు పోనీలే మనోళ్లేగా ఆక్రమించింది అని వదిలేసారా?
    సత్యం 1990లలో మొదలైన కంపెనీయేగా, 9 సమచ్చరాల చంద్రబాబు కి, మరి సి.ఈ.ఓ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కదా, పట్టుకోలేకపొయ్యాడేం?
    మిమ్మల్ని పాయింటౌట్ చేస్తున్నా అని భావించకండి. నిజానిజాలు తెల్సుకుని రాయండి.
    నా బాధ ఏంటంటే, మీకు అనవసరం నాబాధేంటో అయినా చెప్తా, మనం మన రేషనలిజాన్ని కోల్పోకూడదూ అని.
    శుభం.

    ReplyDelete
  4. @ పరిమళం గారూ
    మీ ఆత్మీయమైన ప్రతిస్పందనకు ధన్యవాదాలు.
    పూదోట నాది కాదండోయ్ . మీకు మీరే సృష్టించు కుంటారు కాబట్టి అది మీదే.
    మొక్కలు సరఫరా చేసిన ఆ అజ్ఞాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఒకసారి చేయెత్తి జైకొడదాం.

    @ నాగన్న గారూ
    కథ క్రెడిట్ మహా రచయిత టాల్ స్టాయ్ ది. కాబట్టి మీ నెనరులు ఆ మహానీయుడికే.

    ReplyDelete
  5. @ భాస్కర రామ రాజు గారూ

    ముందుగా మీ స్పందనను తెలిపినందుకు కృతజ్ఞతలు.

    అసెంబ్లీ లో పదే పదే చూస్తున్న ఎదురుదాడి ని తలపింప చేసింది మీ వాదన.
    ఇప్పుడు చేస్తున్న తప్పులను సమర్ధించు కోడానికి అప్పుడు జరిగిన తప్పులను ఎత్తిచూపడం హేతు భద్ధత అవుతుందా ?
    అధికారం లో వున్నారు కదా .... అప్పటి నేరాలపై చట్టపరంగా చర్యలు తీసుకోకూడదా?
    దొంగలు దొంగలు వూళ్ళు పంచు కున్నట్టు ఈ పరంపర కొనసాగవలసిందేనా?
    రాజకీయాలు మహా వ్యాపారంగా వర్ధిల్ల వలసిందేనా ?

    నేను ఏ పార్టీ సభుడిని కానీ .... ఏ రాజకీయ నాయకుడి దురభిమానిని కూడా కాను.
    నేనొక సగటు పౌరుడిని.
    పత్రికలూ, టీవీల ద్వారా తప్ప నాకు నిజానిజాలు తెలిసే అవకాశం లేదు. ఆర్ధిక హంగులూ లేవు.

    కాబట్టి ...
    ఐదేళ్ళ కో సారి వోటు వేస్తూ నోరు మూసుకుని కూర్చోవడమే బెటర్ అదే రేషనలిజం అంటారా ఏమిటి కొంపతీసి!

    ReplyDelete
  6. సోదరా!!
    ముందుగా
    >>పత్రికలూ, టీవీల ద్వారా తప్ప నాకు నిజానిజాలు తెలిసే అవకాశం లేదు. ఆర్ధిక హంగులూ లేవు.
    నిజాన్ని తెల్సుకోటానికి పత్రికలూ అఖర్లేదు, వార్తలూ అవసరంలేదు. ఏ పత్రిక మీకు నిజాన్ని అందిస్తోందో చెప్పూ నేనూ చదువుతా.
    అలానే నిజాన్ని తెల్సుకోటానికి ఆర్ధిక హంగులూ అవసరంలేదు. డబ్బు జల్లితే వచ్చేది నిజంకాదు, దాన్ని "హైప్" అంటారు.
    >>ఐదేళ్ళ కో సారి వోటు వేస్తూ నోరు మూసుకుని కూర్చోవడమే బెటర్ అదే రేషనలిజం అంటారా ఏమిటి కొంపతీసి!
    కొంపతియ్యకుండా కూడా అనను.
    >>
    అసెంబ్లీ లో పదే పదే చూస్తున్న ఎదురుదాడి ని తలపింప చేసింది మీ వాదన.
    నేను వాదించలేదు. నేను వాదించను కూడా.
    >>ఇప్పుడు చేస్తున్న తప్పులను సమర్ధించు కోడానికి అప్పుడు జరిగిన తప్పులను ఎత్తిచూపడం హేతు భద్ధత అవుతుందా ?
    ఇప్పుడు వేసిన ప్రశ్నని అప్పుడు దేనికి వెయ్యలేదూ అనేది నా గోల. లేక ఇపుడు ఇలా అవుతున్నప్పుడు, అప్పటి మూలాల్లేవా అనేది "రేషనలిజం"
    >>అధికారం లో వున్నారు కదా .... అప్పటి నేరాలపై చట్టపరంగా చర్యలు తీసుకోకూడదా?
    ఇది మన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బహుసా కొన్నితరాల తర్వాత "వేగుచుక్క"ల పాలనలో జరుగుతాయేమో.
    >>దొంగలు దొంగలు వూళ్ళు పంచు కున్నట్టు ఈ పరంపర కొనసాగవలసిందేనా?
    దొంగలు పట్టుబడ్డప్పుడే. ఒక్క రాజకీయ నాయకుణ్ణి చూపించండి ఆర్ధికనేరం చేసి పట్టుబడి జైలుకెళ్లినోణ్ణి.
    >>రాజకీయాలు మహా వ్యాపారంగా వర్ధిల్ల వలసిందేనా ?
    రాజకీయమంటేనే వ్యాపారం. వ్యాపార బేహారులు తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసి కాపాడుకోటానికి కట్టే "పొలిటికల్" కోటగోడలే ఈ రాజకీయ నాయకులు. ఇది కేవలం భారతం లోనే కాదు. ఎక్కడైనా అంతే!!

    ధన్యవాదాలు
    మీకు శుభరాత్రి.

    ReplyDelete
  7. భాస్కర్, "మన రేషనలిజాన్ని కోల్పోకూడదూ" -ఇది మీ బాధ అన్నారు. మరి మీరు రాసిన వ్యాఖ్య రేషనల్‌గా ఉందేమో ఆలోచించండి. ఈ బ్లాగరికి తనా మనా అంటగట్టడం ఉచితంగా ఉందా?

    ReplyDelete
  8. @చదువరి గారు: తనా మనా ని అంటగగట్టినట్టు మీకు దేనికనిపించిందో? నాకే తనా మనా లేదు. ఏమైనా, క్షమించండి. నిన్న్ ఏనుగెక్కించామ్, ఈరోజు కోడిగుడ్లతో కొడుతున్నాం. "ఆలోచించాలి" అనేది నా పాయింటు. Well, ఎవరి అభిప్రాయాలు వాళ్లవి.

    ReplyDelete
  9. @ చదువరి గారూ
    ధన్యవాదాలు. మీ వాక్యాలతో ఎంతో స్వాంతన లభించింది.

    @ భాస్కర రామరాజు గారూ
    ధన్యోస్మి.

    ReplyDelete