Wednesday, January 21, 2009

ఉత్తరం

( వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవలసిన బాధ్యత తప్పనిసరిగా పిల్లలదే. కానీ మానవ సంబంధాలన్నీ యాంత్రికంగా మారిపోతున్న ఈ కాలంలో ఏవో సాకులు చెబుతూ చాలామంది తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో వున్న తల్లిదండ్రులు సైతం ఇవాళ పిల్లల ఆప్యాయతకోసం అ లమటిస్తున్నారు. ఒంటరితనంతో కుంగి పోతున్నారు. ఈ సబ్జెక్ట్‌ మీద రాసిన కథ ఇది.
ఇందులో ఉత్తరం సంఘటన యథార్థంగా జరిగింది. ఒకసారి చిక్కడపల్లి పోస్టాఫీసుకు వెళ్లినప్పుడు ఒక చిత్తుకాగితాలు ఏరుకుని బతికే కుర్రాడు తారస పడి నాచేత ఈ ఉత్తరం రాయించుకున్నాడు. అతని పేరు అన్వర పాషానే. అందులోని వాక్యాలన్నీ అతనివే. నన్ను తీవ్రంగా స్పందింపచేశాయవి. అతను నాకు మళ్లీ కనిపించలేదు.)


ఉత్తరం (కథ)

''ఏం గురూ గారూ? ఇంకా బిజీ తగ్గినట్టులేదే!'' స్టూల్‌ లాక్కుని పక్కనే కూర్చుంటూ వెటకారంగా అన్నాడు శాస్త్రి.

అతను మా డిపార్ట్‌మెంట్‌లోనే మరో సెక్షన్‌లో పనిచేస్తాడు.మా పెళ్లిళ్లవక ముందు మే మిద్దరం రూం మేట్స్‌మి కూడా.

''బిజీయా పాడా! నాన్న గారికి లెటర్‌ రాస్తున్నాను. అంతే...!'' అన్నాను పెదవి విరుస్తూ.

''ఏంటి విశేషాలు?''

''ఏముంది, ఇక్కడ నేనేదో వేలకు వేలు సంపాదించి పోగేస్తున్నట్టు డబ్బు పంపమని కబురు చేశాడు. అందుకు సమాధానమే ఈ ఉత్తరం...''

''అరే, చిత్రంగా వుందే! సరిగ్గా మా నాన్నగారి దగ్గరి నుంచి నాక్కూడా ఇట్లాంటి లెటరే వచ్చింది. దానికి ఇప్పుడే రిప్లై రాశాను. ఇదిగో...'' అని జేబులోని ఉత్తరాన్ని తీసి చూపించాడు. ''మళ్లీ జన్మలో డబ్బు పంపమని అడక్కుండా ఘాటుగా రాశాను. మనం చేసేది గుమస్తాగిరి అనుకుంటున్నారో... కలెక్టర్‌గిరీ అనుకుంటున్నారో అర్థం కాదు''.

''ఈ మహానగరంలో ఒక్క జీతంతో బతకడం ఎంత కష్టమో పల్లెటూర్లోని వాళ్లకెలా తెలుస్తుంది. చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ల గోల వాళ్లదే కదా.'' అన్నాను.

''ఇవాళ నా మూడేం బాగోలేదు సూర్యం. నీ పరిస్థితీ అదే కాబట్టి ఓ పనిచేద్దామా?'' అడిగాడు.

''ఏంటి''అన్నాను.

''అ లా బార్‌ కెళ్లి ఓ పెగ్గేసుకుందామా? కాస్త శిరోభారమైనా తగ్గుతుంది.''

''నెలాఖర్లో... బారుకి...'' నిరాశగా నవ్వాను.

''డబ్బు దేముంది? మన ఆఫీసులో అప్పులిచ్చే ఐరావతాలు బోలెడు. అది నేను చూసుకుంటాన్లే కానీ ఐదు నిమిషాల్లో దుకాణం కట్టేసి రెడీగా వుండు.'' అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు.

మేమేమీ రెగ్యులర్‌ తాగుబోతులం కాదు. ఏ రెండుమూడు నెలలకోసారో... ఎరియర్స్‌ లాంటి అదనపు ఆదాయం చేతికందినప్పుడు ఏ బార్‌కో హోటల్‌కో వెళ్తుంటాం అంతే.

మేం ఇద్దరం నడుచుకుంటూ ముందు పోస్టాఫీసుకెళ్లాం. ఎటు వెళ్లాలన్నా కాలినడకే... లేదంటే ఆర్టీసీ బస్సే గతి.

మా ఆఫీసులో అటెండర్లకి సైతం బైకులున్నాయి. కానీ మా ఇద్దరికే లేవు. అసలు మాకు డ్రైవింగ్‌ కూడా రాదు. ఎలాగూ కొనే స్థోమత లేదు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

ఉత్తరాలని పోస్టుబాక్సులో పడేశాక సగం బరువు దిగినట్టనిపించింది!

వెనుదిరుగుతుంటే ''నమస్తె సార్‌'' అన్న పిలుపు వినిపించింది.

తైల సంస్కారం లేని జుట్టు... నల్లగా మాసిపోయిన దుస్తులు...పదిహేనేళ్లుకూడా లేని ఆ కుర్రాడి అవతారం చూసి బిచ్చగాడనే అనుకున్నాను.

దేశం నిండా బిచ్చగాళ్లే.

పొద్దున లేచింది మొదలు అర్థరాత్రి వరకు ఎక్కడి కెళ్లినా వీళ్లే ప్రత్యక్షమవుతారు. దేశం రోజురోజుకీ ఎంత అభివృద్ధి చెందుతోందో మరి.
''చిల్లర లేదు ఫో...'' అని చీదరించుకున్నాను.

''సార్‌ నేను బిచ్చగాణ్ని కాదు సార్‌!'' అన్నాడు వాడు నొచ్చుకుంటూ.

నేను వాడివంక ఎగాదిగా చూశాను.

''కొంచెం ఈ ఉత్తరం రాసిపెట్టండి సార్‌!'' అంటూ నలిగిన ఓ ఇన్‌ లాండ్‌ లెటర్‌ని అందించబోయాడు.

వాడిని బిచ్చగాడని పొరబడిన నా తొందరపాటుకు సిగ్గనిపించింది.

''వెధవ గోల పదండి గురూ గారూ! టైం లేదు. ఒరే నువ్వు వేరే ఎవర్నైనా చూసుకో..''అంటూ నా చేయిపట్టుకుని లాగాడు శాస్త్రి.

''గంట సేపట్నుంచీ అందర్నీ అడుగుతుండాను సార్‌. ఎవరూ రాయడం లేదు. మీరైనా రెండు ముక్కలు రాసిపెట్టండి సార్‌ నాకు చదువు రాదు సార్‌!'' నా పాదాలకు నమస్కరించబోయాడు వాడు.

ఎందుకో వాడిమీద సానుభూతి కలిగింది. వాడి చేతిలోని ఇన్‌లాండ్‌ లెటర్‌ని అందుకున్నాను.

శాస్త్రి అసహనంతో నిట్టూర్చి ''సరే త్వరగా కానివ్వండి...నేను ఈ లోగా సిగరెట్లు తెస్తా'' అని పాన్‌ షాప్‌ వైపు వెళ్లాడు.
ఫొస్టాఫీసు ముందున్న బెంచీపై కూర్చుంటూ ''ఎవరికి?'' అని అడిగాను.

''మా యమ్మకి సార్‌'' అన్నాడు వాడు.

నేను గబగబా రాయడం మొదలుపెట్టాను.

ప్రియమైన అమ్మకి
నమస్కరించి వ్రాయునది-
ఇక్కడ నేను క్షేమంగానే వున్నాను. అక్కడ మీరంతా క్షేమంగా వున్నారని తలుస్తున్నాను.' అని ముందుమాట రాసేసి ఊ చెప్పు'' అన్నాను.

''అమ్మా ... నేను ఈడ బాగానే వుండాను. మీరు బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.'' అని చెప్పాడు.

వీడికి ఉత్తరాల ఛందస్సు బాగానే తెలిసినట్టుందే అని నవ్వుకున్నాను. ''ఊ.. రాశాలే... ఆ తర్వాత ఏం రాయమంటావో చెప్పు...''

''నాకు ఒంట్లో బాగా లేక రెణ్నెళ్ల కాన్నించి పనికి పోటం లేదు. అందు గురించే నీకు పైసలేమీ పంప లేక పోయినాను. ఏమీ అనుకో బాకు. ఇప్పుడు నా ఒంట్లో బాగానే వుండాది. మళ్లీ పనిలోకి పోతున్నాను. నాలుగైదు దినాలల్ల ఎట్టాగైనా చేసి ఎంతో కొంత డబ్బు పంపిస్తాను.

ఇంట్లో ఎంత కష్టంగా వుండాదో అని నాకు చానా బెంగగా వుండాది. నిన్న రేత్రి చాంద్‌ బీ కలలోకొచ్చింది. అప్పటినుంచి నాకు అన్నం సయించటం లేదు. దానికి పోలియో రాకుంటే ఎంత బాగుండేదో అని ఎప్పుడూ అనుకుంటాను. తమ్ముళ్లు ఎలా వున్నారు. చెప్పిన పని చేస్తున్నారా ఊరికే జులాయిగా తిరుగుతున్నారా?

బాబూ సేఠ్‌ తన బాకీ డబ్బుల గురించి ఊరికే బాధ పెడ్తున్నాడా? ఒక్క ఆరు నెలలు ఓపికపట్టమని చెప్పు. ఆయన బాకీ మొత్తం నేను తీర్చేస్తాను. నేను ఇప్పుడు వేరే సోట పనిలో చేరాను. మునపటికన్నా నాలుగు డబ్బులు ఎక్కువ దొరుకుతున్నాయి. పాత అడ్రసుకు ఉత్తరం రాయించబోకు. కొత్త అడ్రసు తర్వాత తెలియజేస్తాను. తమ్ముళ్లను అడిగానని చెప్పు. చాంద్‌బీకి మరీ మరీ ముద్దులు.
ఇట్లు మీ కొడుకు అన్వర్‌ పాషా.''

వాడు ప్రవాహంలా చెప్పుకుంటూ పోయాడు... నేను మంత్రముగ్ధుణ్నై అదే వేగంతో రాస్తూ పోయాను. వాడి నోటి నుంచి వెలువడిన వాక్యాలు నాలోని సుషుప్త మనసును చురుక్కు మనిపించాయి.

ఇంకా చెప్పాలంటే ఆ వాక్యాలు నాకు శరాఘాతాల్లా తగిలాయి.

కొద్ది క్షణాలకిందట మా నాన్నకు రాసి పోస్ట్‌ చేసిన ఉత్తరానికీ, వీడు తన తల్లికి నా చేత రాయించిన ఉత్తరానికీ మధ్య ఎంత తేడా వుంది!

సిగ్గుతో నాలో నేనే కుంచించుకు పోయాను.

''ఏం పని చేస్తావు అన్వర్‌ పాషా?'' అనడిగాను వాడివంక వాత్సల్యంగా చూస్తూ

''కాగితాలు ఏరుకుంటాను సార్‌'' అన్నాడు.

''ఏంటీ...?!''

''గల్లీలు తిరిగి చెత్తకాగితాలు ఏరి అమ్ముకుంటాను సార్‌!''

''రోజుకి ఎంత సంపాదిస్తావు?''

''ఐదు, పది ఒక్కో రోజు ఒక్కో లాగ సార్‌! మొన్నటి వరకు హోటల్లో పనిచేశాను సార్‌. నా చేతులకు పుళ్లయితే సేఠ్‌ నన్ను పనిలోంచి తీసేసి మరొకర్ని పెట్టుకున్నాడు.... ఆకాడ్నుంచీ ఈ పని చేస్తావున్నాను. మా యమ్మకు తెలిస్తే బాధ పడతాదని ఈ మాట రాయించలేదు సార్‌...''

నా మనసు మరింత భారమైపోయింది.

సిగరెట్‌ కాలుస్తూ దూరంగా నించున్న శాస్త్రి 'ఇంకా ఏంటీగోల. పద పద' అన్నట్టు సైగ చేశాడు.

ఒక్క ఐదు నిమిషాలు ఆగు అన్నట్టు నేను కూడా సైగద్వారానే చెప్పాను. అరచేత్తో తలను కొట్టుకుంటూ మరో సిగరెట్‌ వెలిగించాడు.

''హోటల్లో పనిచేస్తే చేతులకు పుళ్లవుతాయా అన్వర్‌?'' అని అడిగాను.

''పొద్దున లేచిన కాడ్నుంచి రేత్రి పడుకోపోయే వరకు అంట్లు కడుగుతూ, తడిబట్టతో బండలూ బల్లలూ తుడుస్తూ వుంటే చేతులు కాళ్లు నాని నాని పుళ్లుకాక మరేమవుతాయి సార్‌'' అన్నాడు.

నాకు వాడిని చూస్తుంటే ఏదో తెలియని మమకారం కలుగసాగింది. ఇంత చిన్న వయసులో వీడికి ఎన్ని కష్టాలు... వీడి మాటల్లో ఎంత విజ్ఞత.

''మీ ఇల్లెక్కడ అన్వర్‌?'
'
''ఇల్లా...'' అంటూ నవ్వి ''ఇదివరకు హోటల్లోనే వుండేవోడ్ని. ఇప్పుడు ఫుట్‌పాతే నా ఇల్లు. పగలంతా గల్లీలు తిరుగుతూ కాగితాలు ఏరుకోడం, అమ్ముకోడంతోటే సరిపోతుంది. రేత్రి ఏడోకాడ తొంగుంటాను''

''మరి నీ సామాను?!''

మళ్లీ నవ్వాడు. ఆ నవ్వు కూడా ఎంత కమ్యూనికేటివ్‌గా వుందో!

''నాకు సామానేముంటాది సార్‌. అదిగో ఆ సంచే నా సామాను. అందులోనే ఓ ప్లేటు, గ్లాసు, జత బట్టలు వున్నాయి.'' అంటూ దూరంగా పడేసినట్టున్న గోనె సంచీని చూపించాడు.

నాకు నోట మాటరాలేదు. భారంగా చూస్తూ ''అడ్రస్‌ చెప్పు'' అన్నాను.

''ఖమ్రున్నీసా బేగం, సత్తయ్య సైకిల్‌ షాపు పక్కన, భవాని పురం, బనగానపల్లి.''

''ఎక్కడి బనగాన పల్లి ఎక్కడి హైదరాబాదు! అక్కడే పని చూసుకోక ఒక్కడివీ ఇంత దూరం ఎందుకొచ్చావు అన్వర్‌?'' కుతూహలంగా అడిగాను.

''మా నాయిన యాక్సిడెంటులో చచ్చిపోయాడు సార్‌. బాబు సేఠ్‌ దగ్గర ఎప్పుడో అప్పు చేశాడంట. నేను ఆయన దగ్గిరే పనిచేసేవోణ్ని. వడ్డీ కింద జీతం చెల్లు అంటూ ఒక్క పైసా కూడా యిచ్చేవాడు కాదు. అక్కడుంటే ఇంక అప్పు ఎప్పటికీ తీరదని ఇటు పారిపోయొచ్చాను.'' అన్నాడు.''నెల నెలా మా యమ్మకి నలభై ... యాభై ఎంత కూడితే అంత పంపిస్తావుంటాను. మా బాకీ తీరినాక అక్కడికే యెల్లిపోతాను సార్‌''.

నా మనసంతా దేవినట్టయిపోయింది. తమాయించుకుంటూ ''ఒకసారి ఉత్తరం చదివి వినిపించమంటావా అన్వర్‌?'' అని అడిగాను.

''మీ దయ సార్‌'' అన్నాడు. తాపీగా చదివాను. నేనే రాసినప్పటికీ ఒక్కో వాక్యం చదువుతుంటే నాకే కొత్తగా వింతగా అనిపించింది.

చాలా శ్రద్ధగా ఉత్తరాన్ని అంటించి వాడికిచ్చాను.

వాడు రెండు చేతులూ జోడించి దాన్ని తీసుకెళ్లి పోస్ట్‌ డబ్బాలో వేసి వెళ్లిపోయాడు.

నేను మాత్రం శిలావిగ్రహంలా బెంచీ మీద అట్లాగే కూర్చుండిపోయాను.

వాడి ఉత్తరానికీ, నా ఉత్తరానికీ మధ్య ఎంత భయంకరమైన తేడా!

అక్షరం ముక్కరాని అన్వర్‌...తిండికీ, ఠికాణాకూ కూడా దిక్కు లేని అన్వర్‌... ఇంకా సరిగా ముక్కపచ్చలారని వయసులో వున్న అన్వర్‌.. తన కన్న తల్లిని ఆదుకోడానికి ఎంత తహ తహలాడుతున్నాడు!

వాడి తల్లిదండ్రులు వాడికి జన్మను తప్ప యిచ్చిందేమీ లేదు!!

అయినా వారిమీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత కృతజ్ఞత...!!

మరి నేను...

మానాన్న తన కోరికలను చంపుకుని, ఒకపూట తినీ ఒక పూట తినక నానా ఇబ్బందులు పడుతూ నన్ను డిగ్రీ వరకు చదివించాడు. నాకు ఇరవై రెండేళ్ల వయసు వచ్చేవరకు తనే పెంచి పోషించాడు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బ తిని కాస్త డబ్బు సాయం చేయమని అడిగితే ఎంత నిర్దయగా, ఎంత ఘాటుగా జవాబు రాశాడు తను!

రోజూ పెట్టెడు సిగరెట్లు కాలుస్తూ, కాఫీ టీలకి డబ్బులు తగలేస్తూ, అప్పుడప్పుడు సినిమాలూ, షికార్లు, పార్టీలు ఏదీ వదులుకోకుండా, ఏ త్యాగమూ చేయకుండా ఒకింత నిశ్చింతగానే బతుకుతూ అట్లా ఉత్తరం రాయడం ఎంత దుర్మార్గం.

అక్షర జ్ఞానం లేని అన్వర్‌ నాలోని హిపోక్రసీ ముసుగును తొలగించి వెళ్లిపోయాడు.

''ఏంటి దీర్ఘాలోచనలో పడ్డావు. వాడు నీ మూడ్‌ను ఇంకా పాడు చేసినట్టున్నాడే...'' అంటూ నా భుజం తట్టి అన్నాడు శాస్త్రి.

''లేదు శాస్త్రీ. వాడు నా కళ్లు తెరిపించాడు.'' అన్నాను.

''ఇంత సెన్సిటివ్‌గా ఆలోచిస్తే ఈ లోకంలో బతకలేం సూర్యం. ఇట్లాంటివాటిని పట్టించుకోకూడదు. పదపదా..'' అన్నాడు శాస్త్రి చాలా తేలిగ్గా తీసుకుంటూ.

''సారీ శాస్త్రీ. నేనిప్పుడు మందు తాగలేను. ఈ రోజే కాదు ఇంకెప్పుడూ తాగను. సిగరెట్లు కూడా ఈ క్షణం నుంచే మానేస్తున్నాను. అర్జంటుగా ఊరెళ్లి నాన్నను పరామర్శించిరావాలి. గత్యంతరం లేని స్థితిలో తప్ప నన్ను ఎప్పుడూ ఆయన డబ్బు అడగడు. ఇట్లాంటి సమయంలో కూడా సాయం చేయకపోతే కొడుకునని చెప్పుకునే అర్హత ... అసలు మనిషినని చెప్పుకునే అర్హత కూడా నాకు వుండదు.'' అన్నాను.

ప్రతిస్పందన కోసం అతనివంక చూడకుండానే గబగబా ఇంటివైపు అడుగులువేశాను.

---


(పల్లకి సచిత్ర వార పత్రిక, డిసెంబర్‌ 26, 1985 లో ప్రచురించ బడింది)

.................................

5 comments:

  1. ప్రభాకర్ సర్ !మీ ఉత్తరం మనసుని కదిలించే విధంగా ఉంది .

    ReplyDelete
  2. కథ చాలా బాగుంది... మన సమాజం లో కొందరు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు... ఓల్డెజ్ హోమ్స్ లో తమ జీవితాన్ని గడపాల్సి వస్తుంది.
    మీ అన్నీ కథలు చదివాను... చాలా బాగా వ్రాస్తున్నారు.

    ReplyDelete
  3. @ పరిమళ గారూ
    మీ స్పందన ఉత్తేజకరం గా వుంది. ధన్యవాదాలు.

    @ ప్రఫుల్ల చంద్ర గారూ
    మీ అభినందనలకు కృతజ్ఞతలు.
    నటుడికి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, రచయితకి ఇట్లాంటి ప్రతిస్పందనలు టానిక్ లా పనిచేస్తాయి.

    ReplyDelete
  4. మీ అన్నీ కథలు చదివాను .చాలా బాగా వ్రాస్తున్నారు

    ReplyDelete
  5. @ రాధిక గారూ
    థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్ !

    ReplyDelete