Wednesday, July 1, 2009

ఓ సరసమైన కథ ... సారే జహాసే అచ్ఛా ...



నగరం నిద్రకు ఉపక్రమించే వేళ ఒకటీ అరా వాహనాల కదలిక తప్ప రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఆకాశంలో పుచ్చపువ్వులా వెన్నెల విరగకాస్తోంది.

ఉండి ఉండి చల్లగా పిల్ల తెమ్మెరలు వీస్తున్నాయి.

చంద్రిగాడి గుండె కువకువలాడుతోంది. నరాల్లో రక్తం ఉడుకెత్తిపోతోంది. పక్కనే పడుకుని వున్న పెళ్లాం మీంచి వచ్చే ఆడవాసన వాడిని ఉన్మత్తుణ్ని చేస్తోంది.

నెమ్మదిగా ఆమెవైపు ఒత్తిగిలి నడుంమీద చేయి వేశాడు.

ఒక్కసారి షాక్ తగిలినట్టు ఉలిక్కి పడింది మల్లి. విసురుగా భర్త చేతిని వెనక్కి విసిరికొట్టింది.

చంద్రిగాడి ఉత్సాహమంతా నీరుగారిపోయినట్టయింది. కోపంగా పళ్లు పటపట కొరుక్కున్నాడు.

వాళ్లిద్దరికీ కొంచెం దూరంగా పడుకునివున్న మల్లి తండ్రి ఖళ్లు ఖళ్లు మని దగ్గడం మొదలుపెట్టాడు.

ఆ ముసలాడి దగ్గుకు రాత్రి పగలు అనే భేదం ఏమీ వుండదు. కాకపోతే అప్పుడప్పుడూ కొన్ని క్షణాల పాటో, నిమిషాలపాటో విరామం యిస్తుంటుందది. అంతే!

మరికాసేపటికే చంద్రిగాడి కోపం తగ్గి మల్లి మీద మళ్లీ తాపం పెరిగింది. ఈ సారి ఆమె జబ్బ మీద చేయివేసి తనవైపు తిప్పుకోబోయాడు. మల్లి గింజుకుంది. అయినా వాడి పట్టు సడలలేదు. పెళ్లాం మీద తనకు సర్వహక్కులు వున్నాయన్న స్పృహ వాడిని రెచ్చగొడ్తోంద

మగడివైపు తిరిగినట్టే తిరిగి రెండు చేతులూ వాడి చాతిమీద వేసి ''ఎహలే...'' అంటూ బలంగా తోసింది. దాంతో చంద్రి గాడు పట్టు సడలి వెల్లకిలా అయిపోయాడు. అదే అదనని ఆమె వాడికి రెండడుగులు ఎడంగా జరిగి పడుకుంది.

చంద్రిగాడిలో ఒక్కసారి కోపం, కసి, బాధ పెల్లుబికాయి.

అప్పటికి వాళ్ల పెళ్లయి నెల రోజుల పైనే అయింది!

పేరుకు పెళ్లయితే అయింది కానీ ఇంత వరకూ 'కార్యం' మాత్రం కాలేదు!!

అసలు మల్లి మనసులో ఏముందో వాడికి అంతుబట్టకుండా వుంది. తనంటే ఇష్టం లేదని అనుకుందామా అంటే ... ఒక్క రాత్రిపూట తప్ప పగలస్తమానం తనని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. చెరువుగట్టుకు తీసుకెళ్లి సుబ్బరంగా వీపు రుద్దుతుంది. తలంటుతుంది. అప్పుడప్పుడు వద్దన్నా వినకుండా కాళ్లు కూడా పడుతుంది.

కానీ, రాత్రయితే చాలు తనకి దూరంగా వుంటుంది!

ఎంత జుట్టు పీక్కున్నా వాడికి కారణం కనిపించడంలేదు. పక్కనే ముసలి తండ్రి వున్నాడని బిడియమా? అట్లా అయితే ఇట్లా ఎంత కాలం? ముసలాడు చచ్చే వరకూ తన గతి ఇంతేనా?

వాడు అసహనంగా అటూ ఇటూ పొర్లుతూ వుండిపోయాడు.

ముసలాడికి దగ్గు తెమ్మర ఎక్కువ కావడంతో లేచి కూచున్నాడు. ఫిరంగులు పేలుతున్నట్టు అతి భయంకరంగా వుంది ముసలాడి దగ్గు.

''అయ్యా...!'' ఆందోళనగా పిలిచింది మల్లి. ''గిన్ని మంచినీళ్లు గిట్ల తాగుతవా?'' అని అడిగింది.

''నువ్వింక నిద్రపోలేదా బిడ్డా?'' దగ్గుతూనే అడిగాడు ముసలాడు.

''నా నిద్ర కేం ముంచు కొచ్చింది తియ్యి గని, మంచి నీళ్లియ్యనా?''

''వద్దు బిడ్డా! గింత ఉప్పు గల్ల వుంటె ఇయ్యి.''

మల్లి లేచి ముంతలోంచి నాలుగు ఉప్పు రవ్వలు తెచ్చి తండ్రికి యిచ్చింది. దగ్గుకు దరిద్రులు వాడే పరమ ఔషదం ఉప్పే!

రెండు రవ్వలు జాగ్రత్తగా నాలిక కింద పెట్టుకుని చప్పరించాడు ముసలాడు. దగ్గు ఆపుకోడానికి విశ్వప్రయత్నం చేస్తూ మళ్లీ వీళ్ల వైపు వీపు పెట్టి నడుం వాల్చాడు. అతను పొరపాట్న కూడా వీళ్ల వైపు తిరగడు.

చిరిగిన బొంత తండ్రి మీద కప్పి నిట్టూర్చింది మల్లి. మొగుడి వైపు చూస్తే అతను రెండు చేతులు దగ్గరగా మడచుకుని వాటిమీద మొహం పెట్టి బోర్లా పడుకుని వున్నాడు. పున్నమి వెన్నెల్లో ఏ ఆచ్ఛాదనా లేని వాడి వీపు నల్లగా నిగనిగలాడుతోంది.

మొగుడి అవస్థ చూసి జాలనిపించింది మల్లికి. కొంచెం దగ్గరగా వెళ్లి వాడికి ఆనుకుని పడుకుంది. అయినా వాడిలో చలనం రాలేదు.

''కోప మచ్చిందా?'' తల మీద చేయి వేసి గారంగా గుసగుసగా అడిగింది.

''అహ... సంబడం'' కసిగా అన్నాడు చంద్రిగాడు.

''ఉష్...జర మెల్లెగ మాట్లాడు. నాయిన ఇంటడు.'' అంది గాభరాగా.

''ఎహెపో... దూరంగ జరుగు'' అని కసురుకున్నాడు వాడు, తల ఎత్తకుండానే.

మొగుడి కోపం ఎంత తారాస్థాయిలో వుందో మల్లికి అర్థమయిపోయింది. ఎలగైనా అతడిని ప్రసన్నం చేసుకోవాలని మరింత దగ్గరగా జరిగింది. ఆమె వక్షోజాలు వాడి పక్కటెముకల్ని మెత్తగా తాకాయి. అర్థనగ్నంగా వున్న వాడి శరీరం మీద చేయి వేసి ప్రేమగా నిమిరింది.

చంద్రిగాడి శరీరంలో నెమ్మదిగా మళ్లీ వేడి రాజుకుంది. వాడి కోపం కరిగిపోయింది. చప్పున పక్కకు తిరిగి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆబగా మొహమంతా ముద్దులు పెట్టుకున్నాడు.

మల్లి తమకంలో తేలిపోతూనే ''వద్దు అయ్య లేస్తడు ... ఇక్కడద్దు ...ఇక్కడద్దు'' అంటూ గింజుకుంది.

''ఇక్కడ కాకపోతే ఇంకెక్కడే...'' అంటూ వాడు ఆగకుండా పెళ్లాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు.

''చంద్రిగాడి శరీరం బరువుకు ఊపిరాడనట్టయింది మల్లికి. ఎంత ప్రయత్నించినా వాడిని కొంచెం కూడా కదల్చలేకపోయింది.
సరిగా అదే సమయంలో తిరిగి ఫిరంగులు పేలడం మొదలయింది.

ఖళ్...ఖళ్...ఖళ్...

చంద్రిగాడు హడలి పోతూ పెళ్లాం మీంచి పక్కకు దొర్లాడు. ముసలాడి తల బద్దలు కొట్టాలన్నంత కోపం వచ్చింది వాడికి. కసిగా నేల మీద పిడి గుద్దులు గుద్దాడు. అందులో ఒక్క దెబ్బ చాలు ముసలాడి ప్రాణాలు గుటుక్కు మనిపించడానికి!

తండ్రి వైపు తలతిప్పి చూసింది మల్లి. ఆయన దుప్పట్లో మునగదీసుకునే ఖళ్లు ఖళ్లు మని దగ్గుతున్నాడు. నిస్సహాయంగా నిట్టూర్చింది.

ఇటు చూస్తే చంద్రిగాడు జుట్టు పీక్కుంటున్నాడు. జాలిగా పక్కకు జరిగి వాడి చెంప నిమిరింది. కోపంతో తల విదిలించాడు.

చప్పున వాడి మీదకు వంగి ''ఇక్కడ లాబం లేదు గని అమ్మోరి గుడి దగ్గరికి పోదాం రా'' అంది చెవిలో గుసగుసగా.

''గిప్పుడు గుడికెందుకే?'' విసుగ్గా అన్నాడు వాడు.

''ఆ.. గందుకే'' అని కిసుక్కున నవ్వింది మల్లి.

వాడికి అర్థమై దిగ్గున లేచి కూచున్నాడు. వాడి చేయి పట్టుకుని చడీ చప్పుడు కాకుండా గుడివైపు నడిపించింది మల్లి.

గుడంటే అదేం పెద్ద గుడి కాదు. నిలువెత్తు కూడా లేని చిన్న గోపురం లాంటి కట్టడం. రోడ్డుకు కొంచెం దిగువన కాలువ పక్కన వుంటుంది. గుళ్లో అస్తవ్యస్తంగా చెక్కి రంగు పులమబడ్డ ఓ గ్రామ దేవత విగ్రహం వుంటుంది. అయ్యగారు కానీ, కాపలా వాడు కానీ ఎవరూ వుండరు అక్కడ. ఆ గుడికి అసలు తలుపులు కూడా లేవు.

అక్కడైతే కాస్త మరుగుంటుందని మల్లి ఉద్దేశం. వారం రోజుల కిందటనే ఆ 'చోటు'ని గుర్తించింది. కానీ అమ్మోరి గుడిలో 'పాడు పని' చేయాలంటే బుగులనిపించి ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమైపోయింది. అమ్మోరికి ఆగ్రహం వస్తే ఇంకేమైనా వుందా ఈ నాలుగు మెతుకుల 'భాగ్యం' కూడా లేకుండా పోదూ! అయితే ఆమెకు అంతకంటే మెరుగైన చోటు ఆ మహానగరంలో మరెక్కడా కనిపించలేదు.

ఇటు చూస్తే మొగుడు ఆగేటట్టు లేడు. చూస్తుండగానే తమ పెళ్లయి అప్పుడే నెల రోజులు దాటిపోయింది. ''పెళ్లి చేసుకుని ఏం లాభం?''

మొగుడితో తన కోరిక తీర్చుకోవాలనే భావన కంటే మొగుడిని సంతోష పెట్టాలనే తపన ఎక్కువయిపోయింది మల్లికి.

అయినా తాము చేసేదేమీ లం... తనం కాదు కదా! కట్టుకున్న మొగుడితో చేసేది 'పాపం పని' ఎట్లా అవుతుంది? దేవతలు మాత్రం ఆ పని చేసుకోరా? అని ఈ వారం రోజులుగా తనకు తాను నచ్చ జెప్పుకుంది. 'చల్లని తల్లి అమ్మోరు ఏమీ అనుకోదు. పైగా ముచ్చటపడి పండంటి కొడుకు పుట్టేలా ఆశీర్వదిస్తుంది.'

రోడ్డు మీద నడుస్తూనే రోడ్డు కిరుపక్కలా వున్న బంగళాల వైపు ఈర్ష్యగా చూసింది మల్లి. వాటిలో వుండే జంటలు అనుభవించే సుఖాన్ని తలచుకుని ఒక క్షణం అసూయపడింది.

''ఛీ ముదనష్టపు బతుకు. తినడానికి తిండి లేదు. కట్టుకోడానికి సరైన బట్టలేదు. వుండటానికి గింత తడిక చాటన్న లేదు.'' తన దౌర్భాగ్యాన్ని తనే నిందించుకుంది మల్లి.

''ఇంకెక్క డున్నదే గుడి?'' అసహనంగా అడిగాడు చంద్రిగాడు. వాడికి మహ తొందరగా వుంది.

వాడికి ఇట్లాంటి ఆలోచనలేవీ రావు. అది వాళ్ల అదృష్టం... ఇది నా ఖర్మ అనే భావనతో రాజీ పడిపోయాడు వాడు.
మొగుడు పడుతున్న ఉరుకులాటను చూసి మల్లి మురిసిపోయింది.

''దగ్గర పడ్డత్తియ్యి ...'' అంటూ ప్రేమగా వాడిని గిల్లింది.

''ఇహిహి...'' అని నవ్వి వాడు పెళ్ళాం భుజం మీదున్న తన చేయిని ఆమె గుండెల మీదికి జరుపబోయాడు.

''ఊ ఏంటిదా తొందర...'' అని ఆ చేయిని అట్లాగే ఒడిసి పట్టుకుంది.

వాళ్లు గుడి దగ్గరకు చేరారు. గుడి పక్కన పెద్ద వేప చెట్టు వుండటం వల్ల గుడిమీద వెన్నెల ప్రసరించడంలేదు. దగ్గరలో వీధి లైటు కూడా లేకపోవడం వల్ల అక్కడంతా మసక చీకటిగా వుంది. కీచురాళ్లు కర్ణకఠోరంగా అరుస్తున్నాయి.

మల్లి గుడి ఎదురుగా నిలబడి ''తప్పయితే చమించు తల్లీ...'' అని దండం పెట్టుకుని చెంపలేసుకుంది. చిరిగిన జాకెట్టులోంచి పసుపు తాడును బయటికి లాగి కళ్లకు అద్దుకుంది.

మల్లి ఇంకా తాత్సారం చేయడాన్ని సహించలేక ''నడువెహె...'' అంటూ ముందుకు తోశాడు చంద్రిగాడు.

''ఆగు. అమ్మోరికి దండం పెట్టుకోవద్దా?''

''గిప్పుడా దండం పెట్టుకునేది? నడు నడు...!'' వాడికి బొత్తిగా 'భక్తి' లేదు, భయం లేదు.

మల్లి భర్త చేతిని గట్టిగా పట్టుకుని గుబులు పడుతూనే గుడిలోకి అడుగు వేయబోయింది.

అంతే...!

''ఓరేయ్ ఎవర్రా అదీ...'' అని గుళ్లోంచి బిగ్గరగా మగ కంఠం అరుపు వినిపించింది. మల్లి పై ప్రాణాలు పైనే పొయినట్టయ్యాయి.

ఒక్క క్షణం ఏమీ అర్థం కాక గజగజ వణికి పోయింది. ఆతరువాత ఆమెకు గుళ్లో రెండు ఆకారాలు కనిపించాయి. ఒక ఆడా ఒక మగా!

తాము శోభనం గదిలా వాడుకోవాలనుకున్న గుడిని అప్పటికే ఎవరో ఆక్రమించేశారని అర్థమైపోయింది.

''మల్లీ ఏమైందే ? ఎవరు వాళ్లు?'' దూరంగా జరిగిపోయిన మల్లి గురించి గాల్లో చేతులు ఆడిస్తూ అయోమయంగా అడిగాడు చంద్రిగాడు.

చప్పున వాడి చేయి అందుకుని ''ఎవరో మనకెందుకు గని పోదాం రా...'' అంది మల్లి.

''ఎక్కడికి?''

''ఎక్కడినుంచి వచ్చినమో గక్కడికె''

''థూ నీ యవ్వ. నేను రాను పో. ఇయ్యాల్టి సంది నీకు నాకు ఏం సంబంధంలేదు పో. నువ్వు నాకు పెళ్లానివే కాదు. నేను నీకు మొగుడ్నే కాదు పో నీ యవ్వ....'' మల్లి చేయిని గట్టిగా విదిల్చి కొట్టి ముందుకు పోబోయాడు వాడు. రెండడుగులు వేశాడో లేదో కాలికి రాయి తగిలి బోర్లా పడిపోయాడు.

చంద్రిగాడికి రెండు కళ్లూ లేవు!

దయగల ప్రభువుల, ధర్మ తల్లుల మనసు కరిగి దానం చేయాలంటే ముష్టి వాళ్లకి ఏదో ఒక అంగవైకల్యం వుండాలి. అందుకే వాడి రెండు కళ్లల్లో చిన్నప్పుడే జీళ్లు పోశారు.

మల్లి గబగబా కుంటుతూ వెళ్లి మొగుణ్ని లేవదీసేందుకు ప్రయత్నించింది. ఆమెకు ఒక కాలు సొట్ట. ఒకరికొకరు తోడుగా వుంటారన్న ఉద్దేశంతో తోటి ముష్టివాళ్లంతా నెల రోజుల కిందే వాళ్లిద్దరికీ సంబంధం కుదిర్చి పెళ్లి చేశారు.

చంద్రి గాడికి నా అనే వాళ్లెవరూ లేరు. మల్లికి మాత్రం రేపో మాపో అనే ముసలి తండ్రి వున్నాడు.

చంద్రిగాడికి కళ్లు లేకపోయినా శ్రావ్యమైన కంఠస్వరం వుంది. స్వయంగా చిన్న డప్పును వాయిస్తూ ఎంతో మధురంగా పాటలు పాడతాడు.

''ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ...
అహ అందరూ సుఖ పడాలీ నంద నందానా ......''

''కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడీ దానా ...
బుగ్గ మీదా గులాబి రంగూ ఎలా వచ్చెనో తెలుప గలవా...?''

చాలా మంది ముఖ్యంగా ఫాక్టరీ కార్మికులు, కాలేజీ పిల్లలు వాడి చేత కోరి కోరి ఇట్లాంటి పాటలు పాడించుకుంటుంటారు. తను పాడే పాటల్లోని భావం వాడికి తెలుసో తెలియదో కానీ అవి అందరినీ అ లరించి దండిగా డబ్బులు రాలుస్తుంటాయి.

చంద్రిగాడితో ముడిపడక ముందు ముసలి తండ్రితో మల్లి బతుకు దుర్భరంగా వుండేది. ఒకోసారి సరైన తిండి దొరక్క ఆకలితో నకనకలాడాల్సి వచ్చేది.

అట్లాంటిది ఇప్పుడు చంద్రిగాడి 'దండి' సంపాదనతో ఆమె బతుకు 'హాయి'గా గడిచిపోతోంది. అందుకే మల్లికి చంద్రిగాడంటే వల్లమాలిన ప్రేమ!

ఎలాగోలా వాణ్ని బతిమిలాడి, బామాలి మళ్లీ తాముండే ధర్మసత్రం అరుగు మీదికి చేర్చింది. చాలామంది ముష్టివాళ్లు మాంచి నిద్రలో జోగుతున్నారక్కడ. తన ముసలి తండ్రి అటుతిరిగి అట్లాగే దగ్గుతున్నాడు. ఉత్సాహమంతా చచ్చిపోయిన చంద్రిగాడు తన శాశ్వత చీకటిని మునిగిపోయి కసికసిగా ఏవో ఆలోచించుకుంటూ వెల్లకిలా పడుకున్నాడు. మల్లి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కాసేపు అట్లాగే కూచుండి పోయింది.

అంతలో ఎక్కడి నుంచే ఒక ఆడ కుక్క అటు వేపు పరుగెత్తు కొచ్చింది. దాన్ని వెంబడిస్తూ వెనకాలే ఓ మగకుక్క కూడా వుంది.
మల్లి తదేకంగా వాటినే చూడసాగింది.

చాటుకోసమేమో ఆడ కుక్క అటు తిప్పి ఇటు తిప్పి ఇక లాభం లేదనుకుని నడి రోడ్డులో ఆగి మగ కుక్కకు లొంగిపోయింది.
తనలో తను నవ్వుకుంది మల్లి. తమ బతుకులు ఈ కుక్కల కంటే ఏమంత గొప్పగా వున్నాయి గనక? అసలు తమని మనుషులుగా గుర్తించేదెవరు? జంతువులకు లేని సిగ్గు తమకెందుకు?

ఏదో స్థిర నిశ్చయానికొచ్చేసింది మల్లి.

ఒంటి మీదున్న చిరుగు పాత బట్టల్ని తీసి పారేసి వివస్త్రగా మారింది. మొగుడి చేయిని తీసుకుని తన గుండెల మీద వేసుకుంది.

మెత్తటి స్పర్శ! చంద్రిగాడికి ఒక్కసారి వళ్లు ఝల్లు మంది. గబగబా ఆమె శరీరమంతా తడిమాడు. ''మల్లీ...!'' అన్నాడు నమ్మలేకపోతూ.

''అవును మామా. నీ మల్లినే...రా... '' అంటూ మొగుడ్ని తన మీదకు లాక్కుంది.


ఇప్పుడామెకు ముసలి తండ్రి దగ్గు వినిపించడంలేదు. పక్కన తోటి ముష్టివాళ్లు దొంగ చూపులు చూస్తుంటారేమో అన్న భావన భయపెట్టడం లేదు. మనస్ఫూర్తిగా, తెగువగా తనను తాను మొగుడికి అర్పించుకుంది.

ఆ మర్నాడు ...

కొత్తగా నేర్చుకున్న హిందీ పాటను మహోత్సాహంగా పాడి రెట్టింపు కలెక్షన్లు సాధించాడు చంద్రిగాడు.


''సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమారా...


( స్వాతి సపరివార పత్రిక 10 జూన్ 1988 సంచికలో ప్రచురించబడిన కథ ఇది. స్వాతికి మరో మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ)


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఒక మాట

సాహిత్యం సమాజానికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదని నమ్మే వాళ్లలో నేను కూడా ఒకడిని. ఈ దృష్ట్యానే కొందరు సరసాన్ని తృణీకరిస్తారు. సరసం లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా వుంటుందో అది అవధులు దాటితే అంత ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది.

నేను నాలుగు సరసమైన కథలు రాశాను. ఆ నాలుగింటి లోనూ సామాజిక దృక్పథం / స్పృహ కూడా వుందనీ, పాఠకుల్ని అవి ఆరోగ్యకరమైన ఆలోచనలవైపే నడిపిస్తాయనీ, సమాజానికి ఎట్లాంటి కీడూ చేయవనే అనుకుంటున్నాను. (లేదా భ్రమిస్తున్నాను).
ఈ కథ మీద వచ్చే ప్రతిస్పందనలను బట్టి మిగతా ఆ మూడు కథల్ని నా బ్లాగులో పెట్టాలో లేదో నిర్ణయించుకుంటాను. ఆ మిగతా మూడు కథలు: ''కొత్త పెళ్లి కొడుకు'', ''బంగినపల్లి మామిడిపండు'', ''లాహిరి లాహిరి లారీలో...''

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

11 comments:

  1. సామాజిక ప్రయోజనం సంగతేమోగానీ కథ మాత్రం చాలా బాగుంది.

    ReplyDelete
  2. మందాకినీ గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.
    కత్తి మహేష్ కుమార్ గారూ మీకు ఈ కథ నచ్చినందుకు సంతోషం. సామాజిక దృక్పథంకు బదులు సామాజిక ప్రయోజనం అనే పెద్ద మాటను పొరపాటున వాడాను. ఇప్పుడు సవరించాను.
    కృతజ్ఞతలు

    ReplyDelete
  3. ప్రభాకర్ సర్ !భార్యా భర్తల మధ్య అనుబంధం,అనుభూతులు అందరికీ ఉంటాయనీ వైకల్యం , పేదరికం అడ్డు కావని చక్కగా చెప్పారు . కాస్త సరసత ఎక్కువైనా ....సరసమైన కధకోసం కదా !

    ReplyDelete
  4. boothu boothu boothu idi tappu kadaa!
    kadha bavundi

    ReplyDelete
  5. @ వినయ్ చక్ర వర్తి గోగినేని గారూ
    పెద్ద సస్పెన్స్ లో పెట్టేసారు ...!
    @ పరిమళం గారూ
    ధన్యవాదాలు. మీరన్నది నిజమే ! ఇదే థీమ్ ని సాధారణ కథ గా రాసి వుంటే కొంత భిన్నంగా వుండేది.
    @ అనానిమస్
    ఓహ్.. స్కై ! హే... రామ్ !! ధన్యవాద్

    ReplyDelete
  6. శ్యాం ప్రసాద్ గారూ,
    మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. kada chala bagundi.mee migilina kadha lu kuda bloge lo unchandi

    ReplyDelete
  8. తులసి గారూ
    సారే జహాసే అచ్చా మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది. నా దగ్గర వున్న కథలు ఇప్పటికే బ్లాగులో పెట్టాను. కొన్ని కథలు పోయాయి. వాటి అన్వేషణలో వున్నాను. సారీ, మీ కామెంట్ ని ఆలస్యంగా చూసాను. ధన్యవాదాలతో -ప్రభాకర్

    ReplyDelete