Tuesday, June 23, 2009

కత్తెర ... కథ ...




కత్తెర

కొత్తనీరొస్తే పాత నీరు కొట్టుకుపోతుందంటారు. కానీ, మా ఇంట్లో టీవీ వచ్చినా రేడియో మాత్రం ఇంకా కొట్టుకుపోలేదు.
ఇప్పటికీ ఉదయం పూట మేం టీవీకి బదులు రేడియోనే ఉపయోగిస్తుంటాం.
అందుక్కారణం లేకపోలేదు.
రేడియో అయితే పనులు చేసుకుంటూ వినొచ్చు, ఎప్పటికప్పుడు టైం ఎంతైందో తెలుసుకుంటుండవచ్చు. రేడియో వల్లనే మా ఆవిడ టైం ప్రకారం పనులు పూర్తిచేసి పిల్లల్ని స్కూలుకీ, నన్ను ఆపీసుకీ సక్రమంగా పంపగలుగుతోంది.

సాధారణంగా ప్రాంతీయ వార్తలు వచ్చే వేళకి నేను నిద్ర లేస్తాను.
ఎప్పుడైనా లేవకపోతే వాల్యూమ్‌ పెంచి రేడియోని అ లారం పీస్‌లా ప్రయోగిస్తుంది మా ఆవిడ.

ఆ రోజు వార్తలకి బదులు ఏవో డైలాగులు వినిపిస్తుంటే - మొదట రేడియో నాటికేమో అనుకున్నాను. కాదని కాసేపట్లోనే తేలిపోయింది. ఎందుకంటే ఆ వినిపించే మగ కంఠం ఎవరిదో తెలియదు కానీ ఆడ కంఠం మాత్రం కచ్చితంగా మా ఆవిడది!

''దీనికి ముప్ఫై రూపాయలు కావాలా? అడగడానికైనా హద్దుండాలి!''

''నువ్వెంతిస్తవో చెప్పరాదమ్మ?''

''ముప్ఫై అడిగాక ఇంకేం చెప్పాలి?''

''పోనీ గని ఇరవై ఐదిస్తవా?''

''ఇంకా నయ్యం. ఇరవై తొమ్మిదిన్నర అన్లేదు.''

''అరె గంత కోపమెందుకమ్మ? ఏదో ఒకటి నువ్వే అడగరాదు మల్ల.''

''ఐదు రూపాయలిస్తాను. ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదు.''

నేను దిగ్గున లేచి కూచున్నాను. ముప్ఫై అడిగితే ఐదు రూపాయలకి బేరమాడుతోంది! ఎంత ధైర్యమో. వాడెవడో కాస్త ఘాటుగా రియాక్టు అవుతాడని చెవులు రిక్కించాను.

''ఐదు రూపాయలా! హు. మంచి బేరమే దొరికింది పొద్దుగాల్నే. ఆఖరి మాట చెప్తున్న పదియ్యి చేసిస్త'' అన్నాడు వాడు మామూలు ధోరణిలోనే. చివరికి మా ఆవిడ ఎనిమిది రూపాయలకి ఖరారు చేసింది.

మా ఆవిడ బేరం చేస్తుందంటే ఎదుటివాడు ఎక్కడి తిడతాడో అని నాకు ఎప్పుడూ గుండె దడదడలాడుతూ వుంటుంది. అదేమిటో ఆమె ఎంత కడిగినా ఏమీ అనరు. అదే నేను కాస్త రేటు తగ్గించమంటే చాలు గయ్యినలేస్తారు. అందుకే నన్నేమీ కొననివ్వదు. అన్నీ తనే కొంటూ వుంటుంది. పొరపాట్న ఏదైనా కొని తేవాల్సి వస్తే ఆమె తృప్తికోసం వాటి ధర పదిరూపాయలు తగ్గించి మరీ చెప్తుంటాను. అయినా ఆమె సంతృప్తిచెందదు. వంటలో లాగే బేరంలో కూడా తనే స్పెషలిస్టు.

అసలా బేరం దేనిగురించో తెలుసుకుందామన్న కుతూహలంతో మంచందిగి వరండాలోకి వెళ్లాను.
మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, చంకలో విరిగిపోయిన గొడుగులు, చేతిలో తుప్పు పట్టిన ట్రంకు పెట్టె ... నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేనికుర్రాడు కనిపించాడు.
ఎన్నాళ్లుగానో మూలన పడివున్న మా గొడుగు మరమ్మత్తు గురించన్నమాట!

వాణ్ని చూస్తే నాకెందుకో శ్రమదోపిడీకి గురవుతున్నట్టు జాలి అనిపించింది.
బట్ట చిరిగి, పుల్లలు విరిగి బయటికొచ్చి బీభత్సంగా వున్న మా పాత గొడుగును వాడికందించి ఇల్లు తుడవడంలో నిమగ్నమైపోయింది మా ఆవిడ.
వాడు తన సరంజామాని వాకిట్లో పరచుకుని పనిలో మునిగిపోయాడు.

నేను వాడి పేరూ, ఊరూ కనుక్కుంటూ వరండా మెట్టుమీదే కూచుండిపోయాను.

తన మొండి కత్తెరతో బట్ట ఎంతకీ తెగకపోయే సరికి వాడు తలెత్తి ''సార్‌, మీ తాన కత్తెరున్నదా?'' అన్నాడు.

నేను వుంది అనలేక మా ఆవిడ వంక చూశాను. తను టైలరింగ్‌ నేర్చుకుంటా నంటే ఈ మధ్యే డెబ్బై రూపాయలు పెట్టి కొత్త కత్తెర కొన్నాం. దాని మీద సర్వ హక్కులు ఆమెవే కాబట్టి నేనేమీ కమిట్‌ కాలేదు.

ఒక క్షణ తటపటాయించి విసుక్కుంటూ వెళ్లి ఆ కత్తెరను తెచ్చి యిచ్చింది. కత్తెరతోపాటు ''సరిగ్గా కుట్టు. లేకుంటే ఒక్క పైసా కూడా ఇవ్వను జాగ్రత్త.'' అని వార్నింగ్‌ కూడా జారీ చేసింది.

పదిహేను నిమిషాల్లో పని పూర్తి చేశాడు.

మా ఆవిడ అనుమానించినట్టుగానే చాలా అస్తవ్యస్తంగా కుట్టాడు. గొడుగంతా ముడతలొచ్చాయి.
దాంతో మా ఆవిడ వాడితో పెద్ద గొడవపెట్టుకుంది.

వాడేమో ''నా తప్పేం లేదమ్మా. చానా పాత ఛత్రి. ఇంతకంటే మంచిగ ఎవడుకుడ్తడు?'' అంటూ వాదనకు దిగాడు. అంతా అయిపోయింతరువాత ఏం అనుకుంటే ఏం లాభం అని నేనే సముదాయించి, ఎనిమిది రూపాయలు వాడికి ఇప్పించి పంపించాను.

వాడు వెళ్లిపోయిన తరువాత అయిదు నిమిషాలకి గానీ వాడు మా కొత్త కత్తెరను తిరిగి ఇవ్వలేదన్న విషయం గుర్తుకు రాలేదు!

ఒక్కసారిగా అవమానం, కోపం, బాధ మమ్మల్ని ముప్పిరిగొన్నాయి.

వాణ్ని పట్టుకుని నాలుగు తన్నాలన్నంత కోపం వచ్చింది.
వెంటనే సైకిల్‌ వేసుకుని రయ్యిన బయలుదేరాను.
ఎన్నడూ అడుగుపెట్టని ప్రతి సందూ గొందూ గాలించాను.

అయినా వాడు దొరకలేదు. చాలా నిరాశ కలిగింది.

ఎంతో కష్టపడి గీరి గీరి బేరం చేసి అతి తక్కువ ఖర్చుతో మూలనపడివున్న గొడుగును బాగు చేయించిన మా ఆవిడైతే షాకునుంచి తేరుకోలేకపోయింది. ఇంకా తను టైలరింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టలేదు. కత్తెరకు బోణీ అయినా చేయలేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.

ఆ సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక మళ్లీ మేం అదే టాపిక్‌ గురించి చర్చించుకుంటూ కూర్చున్నాం.
నాకు మొదట్లో వాడి మీద ఏర్పడిన సానుభూతి మచ్చుకు కూడా లేకుండా పోయింది.
అలగాజనానికి తప్పకుండా అల్ప బుద్ధులే వుంటాయి అన్న మా ఆవిడ అభిప్రాయంతో నేను ఏమాత్రం విభేదించలేకపోయాను.
మేం ఆవిధంగా కసిగా, బాధగా చర్చించుకుంటుండగా ''ఛత్రీలు బాగు చేస్తాం ... గొడుగులు రిపేర్లు చేస్తాం...'' అన్న కేక వినిపించింది. గభాల్న బయటికొచ్చి చూశాం.

కానీ వీడు వాడు కాదు, వేరేవాడు.

నా మనసులో ఏదో ఫ్లాష్‌ వెలిగినట్టయింది. ఆ కుర్రాణ్ని పిలిచాను. ప్రొద్దున ఉబుసుపోక వాడి ఊరూపేరూ అడిగి తెలుసుకోవడం మంచిదయింది.

ఈ కొత్త కుర్రాడు గేటు దగ్గరకు వచ్చి ''ఏంది సార్‌?'' అన్నాడు.
''నీ పేరేంటి?''
''చేరాలు సార్‌''
''ఎక్కడుంటారు?''
''బతుకమ్మ కుంట సార్‌, ఎందుకు?''
''ఏం లేదు నీకు రాములుగాడు తెలుసా? వాడు కూడా నీలాగే గొడుగులు రిపేరు చేస్తుంటాడు.'' అడిగాను.
''తెలుసు సార్‌'' అన్నాడు వాడు.

అంతే ఒక్కసారి ఉత్సాహం వచ్చింది నాకు. 'దొంగ రాములూ ఇంక తప్పించుకోలేవురా' అనుకున్నాను.

ప్రొద్దున జరిగిన ఉదంతమంతా వాడికి చెప్పాను.
''చూడూ వాడు గనక రేపు తెల్లారేలోగా మా కత్తెరను మాకు తెచ్చిస్తే సరే సరి. లేదంటే మా మామయ్య పోలీసు సబ్‌ఇన్స్‌పెక్టర్‌. వాడి ఒంట్లో సున్నం మిగలకుండా తన్నిస్తాను అని చెప్పు'' అంటూ ఓ ధమ్కీ కూడా ఇచ్చాను.

వెంటనే వాడికి ఈ విషయం చెప్పకపోయావో పోలీసు కేసులో నిన్ను కూడా ఇరికిస్తాను జాగ్రత్త'' అని బెదిరించాను.

వాడు హడలిపోతూ ''తప్పకుండా చెప్త సార్‌'' అని పరుగుపరుగున వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ ''నిజంగా వాడు మన కత్తెరని తెచ్చిస్తారంటారా?'' అని అడిగింది.

''చచ్చినట్టు తెచ్చిస్తాడు. నువ్వింక నిశ్చింతగా వుండొచ్చు. రేపు తెల్లారే సరికి నీ కత్తెర నీ ముందుంటుంది .'' అని భరోసా యిచ్చాను.

మర్నాడు ఆదివారం.
ఉదయం నుంచే రాములు రాక కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాను.
ఏడైంది. ఎనిమిదయింది. తొమ్మిదైంది. ఉహు వాడు రాలేదు.
పది దాటాక నా నమ్మకం సడలిపోయింది.
అంత బెదిరించినా వాడు బెదరలేదంటే వాళ్లకిలాంటివి మామూలేమో. దొంగతనంలో ఆరితేరి వుంటారు. ఎంతైనా అలగా జనం కదా. అనుకున్నాను కసిగా.

చేసేదేంలేక సిగరెట్లు తెచ్చుకుందామని బయటికి వెళ్లాను.
పాన్‌ షాప్‌ వద్ద ఆగి ''ఆదా సిగరెట్‌ ప్యాకెట్‌ దేవ్‌'' అంటూ పదిరూపాయల నోటు అందించాను.
గిరాకి ఎక్కువగా వుండటం వల్ల పాన్‌ షాపు వాడు సరిగా చూసుకోకుండా నేను యిచ్చింది యాభై రూపాయల నోటు అనుకుని సిగరెట్లతో సహా నలభై ఐదు రూపాయలను నా చేతిలో పెట్టాడు.

నాకు ఒక్క సారి చెయ్యి వణికింది.
అంతలోనే పోయిన మా కత్తెర గుర్తుకొచ్చింది.
ఆ నష్టం కొంతవరకు ఈ విధంగా భర్తీ అవుతున్నట్టనిపించింది.
నాలోని సైతాన్‌ నన్ను లోబరచుకున్నాడు. అంతే గప్‌చుప్‌గా డబ్బులు, సిగరెట్లు జేబులో కుక్కేసుకుని గబగబా అక్కడినుంచి వచ్చేశాను.

ఇంటికి వచ్చేవరకు పాన్‌షాప్‌ వాడు తన పొరపాటు తెలుసుకుని నా వెనక ఎక్కడ పరుగెత్తుకొస్తాడో అన్న భయం వెంటాడింది.

ఇల్లు చేరాక కానీ నా మనసు స్థిమితపడలేదు.

అంతలోనే ''సార్‌..''అన్న పిలుపు వినిపించింది. ఎవరా అని చూస్తే రాములు!

వాడి చేతిలో తళతళ మెరిసిపోతోంది మా కత్తెర!!

''నిన్న గల్తీల మీ కత్తెర పట్కపోయిన సార్‌. ఇంటికి పోయినంక సూసుకున్న. ఇంతల మా నాయినకు మోటర్‌ టక్కరవుట్ల దవఖానకు తీస్కపోయినం. ఇటొచ్చెటానికి వీలు పడలేదు సారు. ఏమనుకోవద్దు. ఇగోండి మీ కత్తెర.'' అంటూ కత్తెరను నాకు అందించి దండం పెట్టి మరీ వెళ్లిపోయాడు.

నేను ఒక క్షణం అప్రతిభుడినై అలాగే వుండిపోయాను. ఏకకాలంలో ఆనందం, అపరాధ భావన నన్ను ముంచెత్తాయి.

మా ఆవిడ లోపలినుంచి పట్టరాని సంతోషంతో వచ్చి నా చేతిలోని కత్తెరను తీసుకుంది. ''మనకు బాకీ వుంటే తప్పకుండా దొరుకుతుందని అప్పుడే అనుకున్నాను. దొరికింది. న్యాయంగా సంపాదించిన సొమ్ముతో కొన్న వస్తువులు ఎక్కడికీ పోవండీ.'' అంటో కత్తెరను బిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకుని లోపలికి వెళ్లింది.

పాన్‌ షాపు వాడి పట్ల నేను చేసిన నేరం, వంచన నన్ను స్థిరంగా నించోనివ్వడం లేదు.

జేబులోకి అక్రమంగా వచ్చి చేరిన ఆ నలభైఐదు రూపాయల నోట్లు గుండుసూదుల్లా గుండెకు గుచ్చుకుంటున్నాయి.

ఆ తర్వాత మరికాసేపటికే నాకు మరో దెబ్బ తగిలింది.
''సార్‌'' అని పిలుస్తూ గొడుగులు బాగు చేసే రెండో కుర్రాడు చేరాలు వచ్చాడు.
''ఏంటి?''
''రాములు కల్వలేదు సార్‌. వాల్ల నాయినకు యాక్సిడెంట్‌ అయిందంట సార్‌ .. నిన్న సాయంత్రం సంది వాళ్లింట్ల ఎవ్వరు లేరు. ఇయ్యాల కనబడ్తె తప్పకుండ చెప్త సార్‌. మీ కత్తెర యాడికి పోదు సార్‌. వాడు అసొంటోడు కాదు సార్‌.'' అని బాధ్యతగా చెప్పి వెళ్లిపోయాడు.

అంటే రాములు తనంతటతానే, నిజాయితీగా మా కత్తెరను తెచ్చి యిచ్చాడన్నమాట.
నేను పోలీసులకు పట్టిస్తానన్న ధమ్కీకి భయపడి కాదన్నమాట!

దాంతో నేను మరింత డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయాను.
వాడి గురించి నేను ఎంత చులకనగా ఆలోచించాను. ఎవరు అలగా జనం. వాళ్లా నేనా?
నా గొంతులో బుల్లి కత్తెరేదో ఇరుక్కుపోయిన ఫీలింగ్‌ కలిగింది. ఆ సెల్ఫ్‌ పిటీని తట్టుకోవడం ఇక నా వల్లకాదనిపించింది.

వెంటనే ఏమైతే అదయిందని నా జేబులోని అపరాధ భారాన్ని దించేసుకునేందుకు పాన్‌ షాప్‌ వైపు నడిచాను, ''ఎక్కడికండీ?'' అని అడుగుతున్న మా ఆవిడకు సమాధానంచెప్పకుండానే!

- - -

(ఆర్ట్స్‌కో 1993లో నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ)

...

8 comments:

  1. కథ చాలా బాగుందండి.

    ReplyDelete
  2. కథ చాలా బాగుంది

    ReplyDelete
  3. ప్రభాకర్ సర్ ! ఎప్పటిలాగే కధ చాలా బావుంది .మనసును తరచి చూసుకోనేలా ...

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. @ కత్తి మహేష్ కుమార్, వినయ్ చక్రవర్తి గోగినేని, హరేఫల, శివ భండారు, పరిమళం గార్లకు ...
    ఈ కథ మీకు నచ్చినందుకు,
    మీ స్పందనను తెలిపినందుకు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete