తమిళనాడు, కేరళ యాత్రా స్మృతులు
………………………………………………………..
పదిరోజులపాటు సాగిన తమిళనాడు, కేరళ యాత్రలో (జనవరి 28 - ఫిబ్రవరి 7, 2025) ఎన్నెన్ని అద్భుతమైన దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను దర్శించామో..
ఎంతెంత నడక నడిచామో.. ఎన్నెన్ని మెట్లెక్కామో .. తలచుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది!
చిదంబరం, కుంభకోణం, తంజావూర్, రామేశ్వరం, మధురై, కుర్తాళం, టెంకాశి, తిరునల్వేలి,
కన్యాకుమారి, త్రివేండ్రం, గురువాయూర్, పళని, శ్రీరంగం, అరుణాచలం, కంచి వంటి అనేక ప్రదేశాలు, ఎన్నెన్నో అపరూపమైన దేవాలయాలు!
సాగర్ గారి పకడ్బందీ ప్రణాళిక వల్లనే .. ఉరుకులు పరుగులతో కూడుకున్నప్పటికీ .. ఇంత తక్కువ వ్యవధిలో వీటన్నిటినీ చూడటం
సాధ్యమయింది. నిజానికి ఒక్కో ప్రదేశాన్ని
సమగ్రంగా వీక్షించాలంటే రెండేసి రోజులైనా సరిపోవు!
కెవిఎన్ ఆచార్య గారు ప్రతి
దేవాలయ ప్రాశస్త్యం గురించి ఎప్పటికప్పుడు వాట్స్‌ఆప్ గ్రూప్‌లో పొందుపరుస్తూ
వచ్చారు. చివరి రోజు సహ యాత్రికులు కొందరు బస్సులోనే తమ యాత్రానుభవాలను
పంచుకున్నారు. అందువల్ల చర్వితచర్వణం కాకుండా నా ఈ స్పందన...
ఎంత సువిశాలమైన దేవాలయాలు! అనితరసాధ్యమైన రాతి
కట్టడాలు! అమూల్యమైన శిల్ప సంపద! ఆ కాలంలోనే ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణ
కళా కౌశలం!
ఒక్కొక్క స్తంభం ఎత్తు రెండంతస్తులపైనే
వుంటుంది. అలాంటివి ఒకటి కాదు రెండు కాదు... వందలు, వేలు! వాటి మీద అంతకంటే పొడవైన, నున్నగా చెక్కిన, రాతి దుంగలతో కూడిన పైకప్పులు! ప్రతి
స్తంభం మీద అందమైన విగ్రహాలు.. బొమ్మలు.. నగిషీలు! వాటిని చెక్కడం కోసం మన భోనగిరి
లాంటి ఎన్ని రాతి గుట్టలు కరిగిపోయి వుంటాయో అనిపించింది!
నిపుణులైన శిల్పుల చేతుల్లో కఠిన శిలలు సైతం
మైనపు ముద్దల్లా మారిపోయినట్టున్నాయి! ఏ
సాంకేతిక పరికరాలు లేని రోజుల్లో అంతంత భారీ స్తంభాలను ఎలా నిలబెట్టగలిగారో..
అంతంత బరువైన రాతి దుంగలను ఎలా పైకి చేర్చివుంటారో ... ఆకాశహర్యాల్లాంటి ఎత్తైన
గోపురాలను ఎలా నిర్మించి వుంటారో అని ఒకటే ఆశ్చర్యం! ప్రతి శిల్పంలో జీవ కళ
తొణికిసలాడుతోంది !!
‘‘శిలలపై శిల్పాలు చెక్కినారూ...మనవాళ్లు
సృష్టికే అందాలు తెచ్చినారూ... ...’’
‘‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో.. ఈ
బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో... ఓ.. ఓ..’’
ఆనాటి శిల్పుల ఉలుల శబ్దాలు వీనుల
విందుగా ప్రతిధ్వనిస్తుండగా .. సమయభావం వల్ల .. అనివార్యంగా .. గబగబా ముందుకు
సాగాల్సి వచ్చింది.
కొన్ని వందల వేల సంవత్సరాల కిందట
నిర్మించినవైనా ఆ దేవాలయాలన్నీ ఏమాత్రం చెక్కు చెదరకుండా దేదీప్యమానంగా
వెలిగిపోతుండటం అబ్బురపరిచింది. వాటిని చూస్తుంటే మనసంతా పులకరించిపోయింది..
అదేసమయంలో మన వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, తెలంగాణాలోని అనేక ఇతర ప్రాంతాలలో తలలు
తెగిన.. కాళ్లూ చేతులు విరిగిన.. ఛిద్రమైన విగ్రహాలు.. శిథిల దేవాలయాలు మదిలో
మెదిలి బాధ కూడా కలిగింది. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకు మన భద్రకాళి, వేయి స్తంభాల గుళ్లు కూడా ఎంత వెలవెల
బోతుండేవో. తమిళులు, మలయాళీలు మాత్రం మొదటినుంచీ తమ దేవాలయాలనీ, శిల్ప సంపదనీ ప్రాణ ప్రదంగా కాపాడు
కుంటూ వస్తున్నారు.
కొట్టొచ్చినట్టు కనిపించిన మరొక అంశం - చెన్నైలోనూ ఇతర పట్టణాలలోనూ ఎక్కడ
చూసినా .. ప్రతి షాపు ముందూ, కార్యాలయం ముందూ సైన్ బోర్డులన్నీ తమిళంలోనే వుండడం. ఇంగ్లీషు
మచ్చుకైనా కనిపించకపోవడం.
‘సుందర తెలుంగు’.. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’...!!
అని మురిసిపోతుంటాం.. కానీ ఏం లాభం.. ఇంత
అందమైన మన భాష పట్ల మనమే అలసత్వం వహిస్తున్నాం. కరడుగట్టిన మొఘలు సామంతరాజులూ
నైజాములూ మూడు వందల ఏళ్లు మనలను
పరిపాలించడం ఆందుకు ఒక కారణం. వాళ్లు మన ప్రాంతాన్ని ఆక్రమించి మన మీద ఉర్దూను
రుద్దారు .. ఉర్దూలోనే పరిపాలన సాగించారు .. అందువల్ల మనం చచ్చినట్టు ఉర్దూను
నేర్చుకోవాల్సి వచ్చింది.. త్రివర్ణ పతాకం ఎగిరే వరకూ ఉర్దూ మీడియంలోనే
చదువుకోవాల్సి వచ్చింది.
కానీ స్వాతంత్య్రం వచ్చి.. భాషా ప్రయుక్త
రాష్ట్రాలు ఏర్పడి ఏడు దశాబ్దాలు గడిచినా మన గడ్డ మీద కూడా మనం తెలుగును అధికార భాషగా
అమలు పరచుకోలేకపోతున్నాం. సగటు ప్రజానీకానికి అవసరం లేకపోయినా, రాకపోయినా ఇంగ్లీషును పట్టుకుని
వేలాడుతున్నాం. ఎంత ఆత్మవంచన ఇది .. తమిళులు- ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలన కింద
శతాబ్దాలపాటు వున్నప్పటికీ తమిళనాడులో ఎక్కడ చూసినా తమిళమే కనిపిస్తుంది, తమిళమే వినిపిస్తుంది .. ! ఎంత మాతృ
భాషాభిమానం వాళ్లకి! మనలో అలాంటి మాతృభాషాభిమానం ఎందుకు కొరవడిరదో అర్థంకాదు ?!
ఈ యాత్రలో నన్ను అమితంగా స్పందింపజేసిన మరో
రెడు అంశాలు/ప్రదేశాలు`- రామేశ్వరం, అరుణాచలం.
రామేశ్వరంలో ధనుష్కోటి, వివేకానంద మెమోరియల్ రాక్, గ్లాస్ బ్రిడ్జి, 130 అడుగుల ఎత్తున్న తిరువళ్లువార్
విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ విజ్‌డమ్) అలాగే బంగాళా ఖాతం` హిందూ మహా సముద్రం` అరేబియన్ సముద్రం ఈ మూడిరటి సంగమ
ప్రదేశం... వాటిలో సూర్యోదయం .. సూర్యాస్తమయం.. మహనీయుడు అబ్దుల్ కలాం పుట్టి పెరిగిన
ఇల్లు వంటి ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి.
ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించి
రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన .. కోట్లాది మంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన
భారత రత్న డా. ఎపిజె అబ్దుల్ కలాం వున్న వీధిలో నడుస్తుంటే ఎన్ని ప్రకంపనలు
కలిగాయో.
సైకిలెత్తు కూడా లేని వయసులో .. ఆయన
దినపత్రికలను సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ సరఫరా చేస్తున్న దృశ్యం మదిలో
మెదిలింది. ఆయన ఇంటిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. పదినిమిషాల్లో చూసి
వచ్చేయాలని సాగర్ గారు నిర్దేశించడం వల్ల సరిగా చూడలేకపోయాం. దానికి తోడు ఇక్కడ
కూడా కెమెరాలు, సెల్‌ఫోన్లు
ఉపయోగించకూడదనే నిబంధన ఒకటి! అక్కడ ప్రదర్శించిన ఫొటోలను ఫొటో తీసుకోవద్దనే నిబంధన
ఎందుకో అర్థం కాలేదు...! అయినా అందరితో పాటు చటుక్కున ఒకటి రెండు ఫొటోలు
తీసుకున్నాను. గబగబా నడుస్తూనే ఆ వీధిని వీడియో తీశాను.
ఇక అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమాన్ని
సందర్శించినప్పుడు కూడా నాకు ఇలాంటి అనిర్వచనీయమైన స్పందనే కలిగింది. చలంగా సుప్రసిద్ధులైన
ప్రఖ్యాత రచయిత గుడిపాటి వెంకట చలం (1894`1979) తన శేష జీవితాన్ని ఈ రమణాశ్రమంలోనే
గడిపారు.
ఆయన ‘మైదానం, దైవమిచ్చిన భార్య, అమీనా, అరుణ, శశిరేఖ, బ్రాహ్మణీకం వంటి నవలలు, మ్యూజింగ్స్, ప్రేమలేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ వంటి నాన్‌ఫిక్షన్
రచనలు, అనేక
కధలు రాశారు. ఒక్కొక్కటి ఒక్కో సంచలనం. మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్ధానం’ ఎంత సుప్రసిద్ధమో దానికి చలం రాసిన
ముందు మాట కూడా అంతే సుప్రసిద్ధమయింది.
ప్రధానంగా ఆయన రచనలన్నీ ` ఆచారాలూ, సంప్రదాయాలూ, కట్టుబాట్ల పేరిట స్త్రీలను అణిచివేతకు
గురిచేస్తున్న సమాజాన్ని ధిక్కరిసిస్తూ, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్యాల కోసం
పరితపిస్తూ తిరుగుబాటు ధోరణితో చేసినవే.
హైస్కూల్ చదువు పూర్తయ్యేనాటికే ఆయన
అభ్యుదయవాదిగా, నాస్తికుడిగా
మారిపోయారు. మద్రాసు కాలేజీలో చేరాక మెడలోంచి యజ్ఞోపవీతాన్ని తీసేసి మాంసాహారాన్ని
తినడం అలవర్చుకున్నారు. అప్పటికే తల్లిదండ్రులు ఆయనకు వివాహం జరిపించారు. మద్రాస్
వెళ్లగానే తన భార్యను స్కూల్లో చేర్పించి రోజూ సైకిల్ మీద తీసుకెళ్లేవారట.
తల్లిదండ్రులు, అత్తమామలతో సహా ఆయన బంధువర్గం, బ్రాహ్మణ సమాజం ఆయనను వెలివేసింది. ఆయన
రచనలను అనధికారికంగా నిషేధించింది. అడుగడుగునా ఆయనను వేధింపులకు గురిచేసింది.
మానసికంగా విసిగివేసారి పోయిన ఆయన నాస్తికత్వాన్ని వదిలేసి, రచనలకు స్వస్తి చెప్పి 1936 నుంచీ మళ్లీ ఆధ్యాత్మిక మార్గంలో
పయనించడం మొదలుపెట్టారు. చివరికి 1950లో అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆశ్రయం
పొందారు. చలం ఉపాధ్యాయుడిగా వున్నప్పుడు కొంతకాలం మన కరీంనగర్‌లో కూడా పనిచేశారు.
అభ్యుదయ మార్గాన్ని వదిలి` ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించినా
తనలోని పాత చలాన్ని, పాత స్ఫూర్తిని విసర్జించలేదు. ఆయన బతికున్న రోజుల్లో సాహితీవేత్తలకు, యువ రచయితలకు రమణాశ్రమం ఒక
యాత్రాస్థలంగా వుండేది. ఎవరు ఉత్తరం రాసినా ఆయన వెంటనే పోస్టుకార్డు ద్వారా
స్పందించేవారు. కాకపోతే ఈశ్వరాశీస్సులతో అని ఉత్తరాన్ని ముగించేవారు.
రమణాశ్రమాన్ని మౌనంగా సందర్శిస్తుంటే ప్రశాంత వదనంతో చిరునవ్వులు చిందిస్తూ
అభిమానులతో ముచ్చటిస్తున్న ఆ మహనీయుని రూపమే కనిపించింది.
టైట్ షెడ్యూల్ వల్ల ఈ యాత్రలో ఏ ప్రదేశాన్నీ
సంపూర్ణంగా ఆస్వాదించినట్టు అనిపించలేదు. ఏ రోజూ ఏ లాడ్జిలోనూ పట్టుమని ఏడెనిమిది
గంటలు విశ్రాంతి తీసుకున్నదీలేదు. ఒకటే ఉరుకులూ పరుగులు! అందువల్ల పరిస్థితులూ
ఆరోగ్యం సహకరిస్తే కొన్ని ఎంపిక చేసుకున్న ప్రదేశాలను మళ్లీ తీరుబడిగా, సంతృప్తిగా సందర్శించాలని వుంది.
సహయాత్రికులందరికీ కృతజ్ఞతాభినందనలతో
… ప్రభాకర్ మందార
… హైదరాబాద్
(తమిళనాడు కేరళ యాత్ర వరంగల్ భాగస్వాముల వాట్స్
ఆప్ గ్రూప్ కోసం రాసిన ఆర్టికిల్. ఈ యాత్ర కేవలం అక్కడి ప్రముఖ దేవాలయాల సందర్శనకే
పరిమితమైనది.)
|