విశాఖపట్నంలో, హైదరాబాద్‌లో ‘దళిత్ పాంథర్స్ చరిత్ర’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన
‘దళిత్ పాంథర్స్ చరిత్ర’ పుస్తకాన్ని మార్చి 14న విశాఖపట్నంలో, మార్చి 15న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ రెండు సమావేశాలలోనూ పుస్తక రచయిత జె.
వి. పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖపట్నంలో రామాటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్
భవన్‌లో జరిగిన సభను స్థానిక భీమసేన వారు నిర్వహించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన
అనంతరం జె. వి. పవార్ మాట్లాడుతూ మన సమాజంలో సమానత్వం రావాంటే ప్రతి ఒక్కరూ
అంబేడ్కర్ రచనలను చదవాలన్నారు. ఈ ఉద్దేశంతోనే తను ముద్రణకు నోచుకోకుండా వుండిపోయిన
అనేక అంబేడ్కర్ రచనలను సేకరించి, అంబేడ్కర్ భార్యనీ, కుమారుడినీ ఒప్పించి మొత్తం 22 సంపుటాల రూపంలో అంబేడ్కర్ సమగ్ర రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం
ద్వారా ప్రచురింపజేసేందుకు నిబద్ధతతో కృషి చేసినట్టు చెప్పారు. అంబేడ్కర్
నిర్యాణానంతర ఉద్యమాలలో దళిత్ పాంథర్ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత వుందన్నారు.
దళిత్ పాంథర్ సంస్థ కొద్ది కాలమే మనుగడ సాగించినప్పటికీ మహారాష్ట్రలో, ఆమాటకొస్తే యావత్ భారతదేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలనూ,
అత్యాచారాలనూ ఎదిరించేలా దళిత్ యువతను సంఘటిత
పరచడంలో, చైతన్య పరచడంలో చెప్పుకోతగ్గ విజయం
సాధించిందని చెప్పారు.
నాటి సభలో భీమ సేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకులు
గీతా రామస్వామి, ప్రముఖ అంబేడ్కరీయులు వి.
రాఘవేంద్రరావు, డా. కె.వి.పి. ప్రసాదరావు, ప్రముఖ బహుజన
రచయిత దుప్పల రవికుమార్, అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు
ఇంటి గురుమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. వక్తల ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన
ప్రేక్షకులు పుస్తకం కొనేందుకు పొటీపడ్డారు.
తీసుకువెళ్లిన పుస్తక ప్రతులన్నీ కాసేపట్లోనే అమ్ముడుపోవడం ఒక విశేషం.
హైదరాబాద్‌లో మార్చి 15న బంజారాహిల్స్ లమకాన్‌లో జరిగిన సభలో పుస్తక రచయిత జె.వి.పవార్ మాట్లాడుతూ దళిత్
పాంథర్ ఆవిర్భావానికి దారితీసిన ఆనాటి పరిస్థితులను, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించడంలో తాము అనుసరించిన
పద్ధతులను, సాధించిన విజయాలను వివరించారు.
ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
సుబోధ్ మోరే, సురేష్ కరడే లు ప్రసంగిస్తూ ప్రస్తుత పరిస్థితులలో లాల్ జెండా నీల్
జెండా ఏకం కావసిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. కన్హయ్య కుమార్ వంటి కమ్యూనిస్టు
యువ నేతలు ప్రతి సభలో జై భీమ్, లాల్ సలామ్ అంటూ రెండు నినాదాలు చేస్తుండడం ఒక శుభపరిణామం అన్నారు.
అనువాదకుడు ప్రభాకర్ మందార మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని
అనువదిస్తున్నప్పుడు తాను ఎంతో ఉద్వేగానికి గురైనట్టు, కొన్ని సంఘటనలైతే కంటతడిపెట్టించినట్టు, ఆగ్రహావేశాలకు గురిచేసినట్టు చెప్పారు. సభలో ఇంకా హెచ్‌బిటి
నిర్వాహకులు గీతా రామస్వామి ప్రభృతులు పాల్గొన్నారు.
.......
దళిత్ పాంథర్స్ చరిత్ర
రచన : జే.వి. పవార్
ఆంగ్ల మూలం : Dalit Panthers, An Authoritative History
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
252 పేజీలు , వెల : రూ.180 /-.
ప్రతులకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ 500006
Phone: 040 2352 1849
Email: hyderabadbooktrust@gmail.com
.......
దళిత్ పాంథర్స్ చరిత్ర
రచన : జే.వి. పవార్
ఆంగ్ల మూలం : Dalit Panthers, An Authoritative History
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
252 పేజీలు , వెల : రూ.180 /-.
ప్రతులకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ 500006
Phone: 040 2352 1849
Email: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment