Sunday, February 3, 2019

ద గ్రేట్‌ డిక్టేటర్‌'లో చార్లీ చాప్లిన్‌ ఇచ్చిన అపూర్వ సందేశం:

రెండో ప్రపంచ యుద్దం మీదా, హిట్లర్‌ మీదా ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చార్లీ చాప్లిన్‌ తీసిన ''ది గ్రేట్‌ డిక్టేటర్‌'' విలక్షణమైనది.
టాకీ చిత్రాలు మొదలైనా మూకీ చిత్రాలనే నిర్మిస్తూ వచ్చిన చాప్లిన్‌ మొట్టమొదటి సారిగా తన గొంతు విప్పింది ఈ చిత్రంలోనే.
రెండో ప్రపంచ యుద్ధం ఇంకా మొదలు కాకముందే 1938లోనే చార్లీ చాప్లిన్‌ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు. జర్మనీ సైన్యం పోలండ్‌ మీద దాడి చేసి రెండో ప్రపంచ యుద్దానికి నగారా మోగించిన కొద్ది రోజులకే అంటే 1939 సెప్టెంబర్‌లోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధం బీభత్సంగా జరుగుతున్న సమయంలో 1940లోనే విడుదలయింది.
తన అన్ని సినిమాలకంటే భిన్నంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అంతే భారీగా ప్రపంచవ్యాప్తంగా విజయఢంకా మోగించింది.
హిట్లర్‌ కూడా ఈ చిత్రం ప్రింట్‌ తెప్పించుకుని మరీ ప్రత్యేకంగా చూశాడంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. చూసివుంటే ఆ బండ హృదయం కొంతైనా కరిగి వుండేది కదా అనిపిస్తుంది.
విచిత్రం ఏమిటంటే చార్లీ చాప్లిన్ అడాల్ఫ్ హిట్లర్ ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే నెలలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జన్మించారు.
చాప్లిన్ 16 ఏప్రిల్ 1889 లో జన్మిస్తే హిట్లర్ 20 ఏప్రిల్ 1889 న జన్మించాడు.
చాప్లిన్ 88 ఏళ్ళ వయసులో 25 డిసెంబర్ 1977 న వృద్ధాప్యంతో చనిపోతే
హిట్లర్ 56 ఏళ్ళ వయసులో 30-4-1945 న ఆత్మహత్య చేసుకుని చచ్చాడు.
చార్చీ చాప్లిన్‌ ఇందులో ఒక అమాయక బార్బర్‌గా, అడెనాయిడ్‌ హింకెల్‌ అనే డిక్టేటర్‌గా అద్భుతంగా ద్విపాత్రాభినయం చేశాడు.
చిట్టచివరిలో డిక్టేటర్‌ రూపంలో వున్న బార్బర్‌ ప్రసంగం చాలా గొప్పగా వుంటుంది. నేను మొదటి సారి చూసినప్పుడు ఆ ప్రసంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను.
ఈ మధ్య ఒక మిత్రుడు వాట్స్‌ఆప్‌ ద్వారా సబ్‌ టైటిల్స్‌ వున్న ఆ ప్రసంగం వీడియో క్లిప్‌ను పంపించాడు. థ్రిల్లింగ్‌ గా అనిపించింది.
వెంటనే తెలుగులోకి ఇలా అనువదించాను.
........ 'ద గ్రేట్‌ డిక్టేటర్‌'లో చార్లీ చాప్లిన్‌ ఇచ్చిన అపూర్వ సందేశం:........
''క్షమించండి!
నాకు చక్రవర్తిని కావాలన్న ఆశలేదు!
అది నా వ్యాపకం కాదు!
ఎవరినైనా పరిపాలించాలనో లేదా జయించాలనో నేను కోరుకోను!
వీలైతే ప్రతి ఒక్కరికీ ... యూదులు, క్రైస్తవేతరులు, తెల్లవాళ్లు, నల్లవాళ్లు అందరికీ మేలు చేయాలని చూస్తాను!
మనమంతా పరస్పరం సహాయం చేసుకోవాలని భావిస్తాం!
అది మానవ నైజం!
తోటివాళ్లంతా సంతోషంగా వుండాలని కోరుకుంటామే తప్ప వాళ్లు కష్టాలపాలు కావాలని కోరుకోం! పరస్పరం ద్వేషించుకోవద్దనీ, ఈసడించుకోవద్దనీ మనం భావిస్తాం!
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్థానం వుంది!
మన భూగోళం ప్రతి ఒక్కరి మనుగడకు కావలసినవి సమకూర్చగలిగేంత సుసంపన్నమైనది!
మన జీవన మార్గం స్వేచ్ఛాయుతంగా వుండాలి! అందంగా వుండాలి!!
కానీ మనం దారితప్పాం!
దురాశ మన మనసులను విషపూరితం చేసింది!
మన మధ్య విద్వేషపు అడ్డుగోడలను నిర్మించింది!
మనలను లోభంవైపు, రక్తపాతంవైపు దారిమళ్లించింది!
మనం వేగాన్ని అభివృద్ధిపరచుకున్నాం! కానీ మూలనపడి మూలుగుతున్నాం!!
యంత్రాలు సమృద్ధికి బాటలు వేస్తూనే మనల్ని నిస్సహాయుల్ని చేస్తున్నాయి!
మన జ్ఞానం మనల్ని మూర్ఖులుగా మారుస్తోంది!
మన తెలివితేటలు మనల్ని కఠినాత్ములనుగా, దయాదాక్షిణ్యాలు లేనివారిగా మారుస్తున్నాయి!
మనం కొండంత ఆలోచిస్తాం కానీ గోరంతే అనుభూతి చెందుతాం!
ఇవాళ మనకు యంత్రాలకంటే ఎక్కువగా మానవత్వం అవసరం!!
ఈ లక్షణాలు లేకపోతే జీవితం హింసాత్మకంగా తయారవుతుంది!
మనం సర్వస్వాన్ని కోల్పోతాం!!
విమానం, రేడియో మనల్ని సన్నిహితం చేశాయి! కానీ, ఆ ఆవిష్కరణలు ఇవాళ రోదిస్తున్నాయి!! మనమంతా కలసిమెలసి వుండాలనీ, మనలో మంచితనం పెంపొందాలనీ అవి ఆక్రోశిస్తున్నాయి!!
నా మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చేరుతున్నాయి! నిరాశోపహతులైన పురుషులు, స్త్రీలు, పసిపిల్లలు... అలాగే అమాయక ప్రజలను బంధించి చిత్రహింసల పాలుచేసే వ్యవస్థ కాటుకు గురైనవాళ్లు ... లక్షలాదిమంది నా మాటలను వింటున్నారు!!
నా మాటలను వింటున్నవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే ... నిరాశపడకండి!
మనలను కష్టాల పాలుచేస్తున్న ఈ దుర్మార్గం అవసానదశలో వుంది!
మానవ ప్రగతిని చూసి ఓర్వలేని దుర్మార్గులు తమ చివరి ఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు!
మనుషుల్లోని ఈ విద్వేషం తప్పక అంతరించిపోంది!
నియంతలు చచ్చిపోతారు!!
ప్రజల నుంచి వాళ్లు లాక్కున్న అధికారం తిరిగి ప్రజలకు లభిస్తుంది!
మనుషులను చంపినంత మాత్రాన స్వేచ్ఛ అంతరించిపోదు!
సైనికులారా!
మిమ్మల్ని నీచంగా చూసే వాళ్లకు, మిమ్మల్ని బానిసలుగా మార్చినవాళ్లకు, మీ జీవితాలను యాంత్రికంగా చేసినవాళ్లకు... మీరు ఏం చేయాలో, ఏం ఆలోచించాలో, ఏం అనుభూతి చెందాలో నిర్దేశించేవాళ్లకు, దుర్మార్గులకు... మీ జీవితాలను అర్పించవద్దు!
వాళ్లు మిమ్మల్ని జంతువుల్లా చూస్తారు! బలిపశువులుగా వాడుకుంటారు!!
అలాంటి అసహజమైన మనుషులకు... యంత్రాల్లాంటి మనుషులకు... యాంత్రిక మనస్కులకు... యాంత్రిక హృదయాలకు మిమ్మల్ని మీరు అర్పించుకోవద్దు!
మీరు యంత్రాలు కాదు!
మీరు పెంపుడు జంతువులు కాదు!
మీరు మనుషులు!
మీ హృదయాల్లో మానవీయమైన ప్రేమ వుంది!
మీరు ద్వేషించరు.
ప్రేమలేనివాళ్లే ద్వేషిస్తారు.
అసహజమైన వాళ్లే ద్వేషిస్తారు.
సైనికులారా!
బానిసత్వం కోసం పోరాడకండి!
స్వేచ్ఛ కోసం పోరాడండి!
సెయింట్‌ లూకా సువార్త 17వ అధ్యాయంలో ఇలా రాయబడి వున్నది.
''దేవుడి రాజ్యము మనుషుల లోపలనే వున్నది''
ఒక మనిషిలోపలనో, కొంతమంది మనుషుల గుంపులోపలనో కాదు. దేవుడి రాజ్యం మనుషులందరిలో వుంధి! మీలోనూ వుంది!!
యంత్రాలను సృష్టించే శక్తి, సంతోషాన్ని సృష్టించే శక్తి మీలో వుంది!
మానవ జీవితాన్ని స్వేచ్ఛాయుతంగా, అందంగా తీర్చిదిద్దగల శక్తి... జీవితాన్ని అద్భుతమైన సాహసంగా మార్చగల శక్తి ... మీలో వుంది!
అందువల్ల ప్రజాస్వామ్యం సాక్షిగా ఆ శక్తిని ఉపయోగించి మనమంతా ఏకమవుదాం!
ఒక కొత్త ప్రపంచం కోసం పోరాడుదాం!
అద్భుతమైన ఆ కొత్త ప్రపంచం అందరికీ ఉపాథి నిస్తుంది! యువతకు మంచి భవిష్యత్తునిస్తుంది!! వయోవృద్ధులకు భద్రతనిస్తుంది!!
ఇలాంటి వాగ్దానాలు చేసే దుర్మార్గులు అధికారాన్ని కైవసం చేసుకున్నారు!
కానీ వాళ్లు అబద్ధాలకోర్లు!
తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు!
మునుముందు కూడా నిలబెట్టుకోరు!
నియంతలు స్వీయస్వేచ్ఛను పొందుతారు! ప్రజలని మాత్రం బానిసలుగా మారుస్తారు!!
ఇప్పుడు మనం ఆ వాగ్దానాలను నెరవేర్చుకునేందుకు పోరాడుదాం!
ఈ ప్రపంచాన్ని విముక్తి చేసేందుకు... జాతీయ అడ్డుగోడలను కూలదోసేందుకు... దురాశ, ద్వేషం, అసహనంలను పారదోలేందుకు పోరాడుదాం!
సహేతుక ప్రపంచం కోసం పోరాడుదాం!!
విజ్ఞానశాస్త్రం, అభివృద్ధి మనుషులందరి ఆనందం కోసం వినియోగపడే ప్రపంచం కోసం పోరాడుదాం!!
సైనికులారా!
ప్రజాస్వామ్యం సాక్షిగా మనమంతా ఏకమవుదాం!!''


No comments:

Post a Comment