
ట్రెయిన్‌లో పోయిన బ్యాగు మళ్లీ దొరుకుతుందనుకోలేదు!
మాది రిజర్వేషన్ ప్రయాణం కాదు. కూర్చున్న సీటు నెంబర్ తెలీదు. బోగీ నెంబర్ చూసుకోలేదు.
కొత్తగా కొన్న బ్యాగు కాబట్టి దాని ఆనవాళ్లైనా సరిగా చెప్పలేని స్థితి. అప్పటికే ట్రైన్ వెళ్లిపోయి దాదాపు పదినిమిషాలు కావస్తోంది.
బ్యాగు దొరకడం అసంభవం అన్నారు విన్నవాళ్లు. స్టేషన్ మాస్టర్ కూడా పెదవి విరిచారు.
''డబ్బూ, నగలూ ఏమైనా వున్నాయా అందులో?''
''లేవు సార్. నావి రెండు జతల బట్టలు, మా ఆవిడవి నాలుగు పట్టు చీరెలు, మ్యాచింగ్ గాజులూ వున్నాయి.''
''ఉత్త బట్టలకోసం ఇంత బాధ పడుతున్నారా? వృధా ప్రయాస. పోయాయనుకుని కొత్తవి కొనుక్కోండి.''
''ఈ సాయంత్రం దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లికి అటెండ్ కావాలి సర్. ఒక్కసారి ప్రయత్నించండి ప్లీజ్.''
మాది కష్టార్జితమైన సొమ్ము కాబట్టి తప్పక దొరుకుతుందని ఏమూలో ఓ చిన్న ఆశ. దుర్బలమైన సెంటిమెంటు. మా ఆందోళనను గుర్తించి చివరికి ఫోన్ రిసీవర్ అందుకున్నారు స్టేషన్ మాస్టర్ .
రైల్వేల గురించీ, రైల్వే ఉద్యోగుల గురించీ అంతవరకూ నాలో వున్న దురభిప్రాయాన్ని తుడిచేసిన ఈ సంఘటన ఇటీవలే 4 ఫిబ్రవరి 2011న జరిగింది.
ఆరోజు నేనూ, మా ఆవిడా, మా చిన్న తమ్ముడి భార్యా, వాళ్ల ఇద్దరు పిల్లలూ కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్‌కు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాం. మేం ప్లాట్‌ఫాం మీదకు చేరుకునే సరికే ''...సికిందరాబాద్ నుండి గుంటూరునకు వెళ్లు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుటకు సిద్ధముగా వున్నది...'' అన్న ప్రకటన వినబడుతోంది. పరుగు పరుగున వెళ్లి ఎక్కేశాం. పెళ్లిళ్ల సీజన్ వల్ల కాబోలు ట్రైన్ కిటకిటలాడుతోంది. వాళ్లనీ వీళ్లనీ బతిమిలాడి ఎలాగోలా ముగ్గురం మూడు చోట్ల మూడు అర సీట్లు సంపాదించుకుని కూచున్నాం.
డబ్బూ నగలూ వున్న చిన్న హ్యాండ్ బ్యాగ్ మా ఆవిడదగ్గరుంది. బట్టలున్న ఎయిర్ బ్యాగ్ నా దగ్గరుంది. మా తమ్ముడి పిల్లలు ఒక చోట కుదురుగా కూచోకుండా అటూ ఇటూ ఒకరి దగ్గరనుంచి మరొకరి దగ్గరకు ఉరుకులు పెడుతున్నారు. పెద్దాడి వయసు ఆరేళ్లూ, చిన్నాడి వయసు నాలుగేళ్లూ వుంటాయి. చిడుగులు. రెండున్నర గంటల ప్రయాణం వాళ్లను చూసుకోవడంతోనే సరిపోయింది. వరంగల్‌లో దిగేప్పుడు పిల్లల్ని పట్టుకుని జాగ్రత్తగా దించి స్టేషన్ బయటకు తీసుకొచ్చాను. ఆటోస్టాండ్ వద్ద వాళ్లని పంపించేసిన మరుక్షణం నా చేతులు వెలితిగా వున్నట్టనిపించింది. అంతవరకూ బ్యాగు విషయం మా ముగ్గురిలో ఎవ్వరికీ గుర్తులేదు. గుండె ఢమాల్ మంది.
వరంగల్ స్టేషన్‌లో ట్రైన్ ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆగదు. ఎప్పుడో వెళ్లిపోయిందది.
చాలా సేపటి వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాం. ఐదారు శాల్తీల్లో ఒక దాన్ని మరచిపోయామంటే అర్థం వుంది కానీ వున్న ఒక్క బ్యాగునూ ట్రైన్‌లో వదిలేసి చేతులూపుకుంటూ దిగడమేమిటి? ఒకరికి కాకపోతే మరొకరికైనా దాని గురించిన ఆలోచన రాకపోవడమేమిటి? అని ఒకటే బాధ... ఒకటే ఆవేదన... మా ఆవిడ కళ్లల్లో అప్పటికే నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రయాణంలో నలిగిపోతాయని సాదా దుస్తులు వేసుకున్నాం. వాటితో పెళ్లికి వెళ్లాలంటే నామోషీగా వుంది.
తప్పు నాది కాబట్టి నేనెలాగో అడ్జెస్ట్ అయిపోగలను. కానీ మా ఆవిడ ససేమిరా వినేలాగా లేదు. నేను వెనక్కి వెళ్లిపోతాను. ఒంట్లో బాగాలేదని ఏదో ఒకటి మీరే సర్ది చెప్పేయండి అంది. తను ఈ పెళ్లి కోసమనే కొద్ది రోజుల క్రిందటే ఓ పట్టు చీరను కొన్నది. మరో పట్టు చీర కూడా ఆరునెళ్ల కిందటిదే. వాటికోసం కొత్తగా రెండు జాకెట్లు వెయ్యేసి రూపాయల ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి ఈమధ్యే కుట్టించింది. ప్రొద్దునొక చీర సాయంత్రం ఒక చీర ... ఎన్నెన్ని ఊహించుకుందో. సాధారణ గృహిణులకు పెళ్లిల్లే ఫేషన్ పరేడ్ వేదికలు కదా. అందుకే బట్టల ఖరీదు కంటే ఆశాభంగం వెయ్యి రెట్లు ఎక్కువగా వుంది తనకి.
ముందు నేనే తేరుకుని 'ఎందుకైనా మంచిది, ఒకసారి స్టేషన్ మాస్టర్‌ను అడిగి చూద్దాం పదా' అన్నాను. కానీ ఆయన మా ఫిర్యాదు విని ''దొరకడం కష్టమండి. విలువైన వస్తువులేమీ లేవంటున్నారు కదా మరిచిపోవడం బెటర్'' అన్నారు. ''మరో సందర్భంలో అయితే మేం ఇంత బాధ పడేవాళ్లం కాదండీ ఈ సాయంత్రమే దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరు కావలసి వుంది'' అని రిక్వెస్ట్ చేస్తే మహబూబాబాద్ స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసి విషయం వివరించారు.
''ఇంజన్ తర్వాత వరుసగా నాలుగైదు రిజర్వేషన్ బోగీలు, ఒక ఏసీ బోగీ వున్నాయండీ. వాటి తర్వాత వచ్చే మొదటి లేదా రెండవ బోగీలో మేం కూచున్నాం'' ఇదీ మేం చెప్పిన ఆనవాలు. ''నా పక్క సీటులో ఎస్వీ రంగారావు లాగా భారీ పర్సనాలిటీ వున్నాయన కూచున్నారు. డెబ్బై ఏళ్లుంటాయి. బుర్ర మీసాలు. విజయవాడ వరకు వెళ్తున్నారు. ఆయన మా పిల్లలతో సరదాగా మాట్లాడారు. వద్దన్నా వినకుండా వాళ్లకి రెండు చాక్లెట్లు కూడా ఇచ్చారు. బ్యాగు ఆయన పైనున్న ర్యాకు మీదే వుంది'' అన్నది రెండో బండగుర్తు.
ఈ ఆనవాళ్లనైనా మాకు గుర్తొచ్చినప్పుడల్లా దఫదఫాలుగా చెప్పాం. వరంగల్ స్టేషన్ మాస్టర్ గారు (ఆయన పేరు సుదర్శన్) మేం చెప్పినప్పుడల్లా మహబూబాబాద్ స్టేషన్ మాస్టర్‌కి రెండు మూడు సార్లు ఓపిగ్గా ఫోన్ చేసి వివరించారు. ''పాపం పెళ్లికి వెళ్లాలట ... కొంచెం శ్రద్ధగా చూడండి'' అని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు.
''ఇంకో ఇరవై నిమిషాల్లో మెసేజ్ వస్తుంది ఈలోగా మీరు టీ అదీ తాగి రిలాక్స్ అవండి'' అన్నారు. కానీ మాకు పచ్చి మంచి నీళ్లు కూడా గొంతుదిగేలా లేవు. ప్లాట్‌ఫాం మీద అటూ ఇటూ తచ్చాడుతూ గడిపాం. క్షణమొక యుగంగా గడవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసింది. స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేస్తుంటే విన్న ఇతర సిబ్బంది, రైల్వే కూలీలు ''దొరకడం కష్టం సార్. ఇంత సేపుంటుందా. ఈపాటికి ఎవరో కొట్టేసి వుంటారు.'' అంటూ రకరకాలుగా నెగెటివ్ కామెంట్స్‌తో అదరగొడ్తున్నారు.
మా ఆవిడ అవన్నీ పట్టించుకోకుండా ఒక విధమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి మనసులోనే దేవుడికి దండాలు పెట్టుకోసాగింది. నేనైతే లక్కుంటే దొరుకుతుంది లేకుంటే లేదన్నట్టు నిర్లిప్తంగా వున్నాను.
కాసేపటికే స్టేషన్ మాస్టర్‌గారు స్వయంగా పిలిచి ''మీ బ్యాగు దొరికిందట'' అంటూ చల్లని కబురు చెప్పారు.
ఎంత థ్రిల్ అనిపించిందో ఆక్షణాన చెప్పలేం.
''మరో పదినిమిషాల్లో మహబూబాబాద్ వెళ్లేందుకు ట్రైన్ వుంది. టికెట్ తెచ్చుకోండి. ఈ లోగా లెటర్ రాసిస్తాను'' అన్నారు. నేను మా ఆవిడను ఆటోలో పంపించేసి ఆ లెటర్ తీసుకుని మహబూబాబాద్ వెళ్లాను.
అక్కడి స్టేషన్ మాస్టర్ కూడా ఎంత మంచాయనో. తను స్వయంగా ఇద్దరు ఉద్యోగుల్ని వెంటేసుకుని చెక్ చేసి మరీ మా బ్యాగును రికవర్ చేశారట.
''తిరుగు ప్రయాణానికి వెంటనే ట్రైన్ లేదు. బస్సులో వెళ్తారా?'' అని అడిగారాయన. అ లాగే అని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి బ్యాగును ఆలింగనం చేసుకుని మరీ బయటికొచ్చాను.
బస్సులో వస్తోంటే మట్టి రోడ్డు మీద చెలరేగుతున్న దుమ్ము కూడా ఎంతో అందం అనిపించింది.
ఎవరిని చూసినా మల్లె పువ్వుల్లా ఎంతో స్వచ్ఛంగా కనిపించారు.
వరంగల్, మహబూబాబాద్ స్టేషన్ మాస్టర్లకి, వారి సిబ్బందికీ మరోసారి ఈ బ్లాగు ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
...