Showing posts with label స్పందన. Show all posts
Showing posts with label స్పందన. Show all posts

Monday, June 23, 2014

ఆపన్నులకు "అభయ" హస్తం !



ఆపన్నులకు "అభయ" హస్తం !
---------------------------------
ఎంతైనా అమ్మ అమ్మే. నాన్న నాన్నే!
పేగు బంధం తర్వాతే ఏదైనా, ఎవరైనా!
బిడ్డ కడుపులో పడ్డప్పుడు అరుణ కూడా అందరు తల్లుల్లాగే ఎంతో మురిసిపోయింది. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో అందమైన కలలు కన్నది. అయితే జన్యులోపమో, కాలుష్య
భూతమో కల్తీ మందుల ప్రభావమో - కారణం తెలియదు కానీ ఆమెకి శారీరక సవాళ్లను ఎదుర్కొనే పాప జన్మించింది. ముఖం చంద్రబింబంలా ఎంతో అందంగా వున్న ఆ పాపకి
ఎడమ కాలు - మోకాలు వరకే పెరిగి ఆగిపోయి వుంది. అలాగే ఎడమ చేయి బొటన వేలు తప్ప మిగతా నాలుగువేళ్లూ ఒకే వేలుగా కలగలసివున్నాయి.

అసలే పేదరికం, దానికి తోడు ఈ సవాళ్లు ... ఏమిటి నాకీ పరీక్ష అని మదన పడుతుండగానే అరుణకు మరో దెబ్బ తగిలింది. 'ఆడపిల్లను కనడమే కాకుండా ఈ లోపాలు కూడానా. నువ్వూ వద్దు నీ బిడ్డా వద్దు' అంటూ భర్త దుర్మార్గంగా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. గోరు చుట్టు మీద రోకటి పోటు అంటే ఇదే.

అయినా అరుణ అధైర్య పడలేదు. పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు కావలసినంత గుండెధైర్యం వుంది. తన బిడ్డకు పుట్టుక నుంచే సవాళ్లు వుండవచ్చు. కానీ లోకంలో ఎంతమంది ఏలోపాలూ లేకుండా పుట్టి ఆ తరువాత ఏ రోడ్డు ప్రమాదానికో గురై వికలాంగులుగా మారడంలేదు?  అప్పుడైనా చేసేదేముంటుంది? జీవితం అంటేనే ఒక నిరంతర పోరాటం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే బతుకు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. కన్నీళ్లు తుడుచుకుని, తన బిడ్డకు అన్నీ తానే అయి జీవన సమరాన్నిసాగిస్తోంది. ఇప్పుడు ఆమె బిడ్డ 'ఇందిర'కు పదమూడేళ్లు. చక్కగా ఎనిమిదవ తరగతి చదువుకుంటోంది. వాళ్లు హైదరాబాద్‌లోని ఆస్మాన్‌గఢ్‌లో వుంటున్నారు.

మొన్నీమధ్య ''అభయ'' అనే స్వచ్ఛంద సంస్థ ఇందిరకు ప్రత్యేకంగా తయారు చేయించిన కృత్రిమ కాలును అందించింది. అప్పుడు తీసినవే ఈ చిత్రాలు. 

ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి చేవూరి రామకృష్ణ, వారి శ్రీమతి కళారాధ తమ పదవీవిరమణ అనంతరం మరికొందరు మిత్రులతో కలసి 2007లో ''అభయ''ను (రిజిష్టర్డ్‌ నెం. 1788) స్థాపించారు. నిరుపేద వికలాంగులకు (ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌/ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ పర్సన్స్‌కు) తమకున్న పరిధిలో   కృత్రిమ అవయవాలు, ఊతకర్రలు, వీల్‌ చైర్లు,
హియరింగ్‌ ఎయిడ్స్‌ వంటివి ఉచితంగా అందిస్తున్నారు. కొందరు వికలాంగ విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

చేవూరి రామకృష్ణ హైదరాబాద్‌లోని వికలాంగుల కార్పొరేషన్‌లో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ప్రత్యేకించి నిమ్స్‌ ఆసుపత్రిలోని ఆ కార్పొరేషన్‌ యూనిట్‌లో పని చేస్తున్నప్పుడు ఆయన నిరుపేద వికలాంగుల కడగళ్లని కళ్లారా చూశారు. అందుకే పదవీ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని కూడా వికలాంగుల సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి కుటుంబ సభ్యులందరి నుంచీ పరిపూర్ణ మద్దతు లభించింది. వారి పిల్లలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. అభయకు ప్రాథమిక పెట్టుబడిని వాళ్లే అందించారు. ఆ తరువాత కొందరు ఎన్‌ఆర్‌ఐలు, బంధుమిత్రులు, దాతలు ముందుకు వచ్చారు.

ప్రస్తుతం అభయ కార్యాలయం సికిందరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌లోని ''ఆర్టిఫిషియల్‌ లింబ్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌''లో పనిచేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చినప్పుడు వారి చేతుల మీదుగానే  నిరుపేద వికలాంగులకు కృత్రిమ అవయవాలను ప్రదానం చేయిస్తున్నారు. దూరప్రాంతంలో వున్న దాతలు గాంధీ ఆసుపత్రివరకూ రాలేకపోతే వారు సూచించిన వారిచేత ప్రదానం చేయిస్తున్నారు.

గత నెల 12న ఇందిరకు ప్రదానం చేసిన ప్రత్యేకమైన కృత్రిమ కాలు దాతలు స్వయంగా రామకృష్ణ కళారాధ  దంపతులే కావడం విశేషం. వారు ఇందిరకు ఆ కృత్రిమ కాలును నా చేతుల మీదుగా అందించాలనుకోవడం నాకు దక్కిన అనూహ్య గౌరవం. నిజానికి అభయతో గానీ, వారి సేవా కార్యక్రమాలతో గానీ నాకు ఎలాంటి అనుబంధం లేదు. అభయను సందర్శించడం కూడా నాకు ఇదే తొలిసారి. ముందు నేను చాలా మొహమాట పడ్డాను. ఆ తరువాత వారి ఆత్మీయతకు శిరసు వంచక తప్పలేదు. నాకున్న అర్హతల్లా శ్రీమతి చేవూరి కళారాధ గారితో పాటు ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో సహోద్యోగిగా పనిచేసి వుండటమే.

లోకంలో ఎటు చూసినా స్వార్థం, సంకుచితత్వం, అమానవీయత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో  ''సొంత లాభం కొంత మానుక పొరుగువాడికి తోడుపడవోయ్‌'' అన్న నినాదాన్ని స్ఫూర్తిగా  తీసుకుని ఈ దంపతులు ఇంత మహత్తరమైన సేవా కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకోవడం అబ్బురమనిపించింది.
ఇప్పటి వరకూ అభయ దాదాపు 300 మందికి పైగా అమూల్యమైన సేవలు అందించింది. అభయకు సంబంధించిన పూర్తి వివరాలను, సేవలను ఈ కింది సైట్లలో చూడవచ్చు.

1)
https://sites.google.com/site/abhayaforyou/
2)
https://www.facebook.com/home.php?sk=group_192592937447633

Phone: +91-9160766014
Email: mailtoabhaya@gmail.com














Tuesday, January 1, 2013

నూతన సంవత్సర శుభోదయ వేళ ప్రతి ఇంటి ముందూ చిత్ర కళా ప్రదర్శన !

ఇవాళ ఉదయపు నడక ఎంత ఉల్లాసంగా అనిపించిందో.......
ఇంటింటా ఇంతమంది అద్భుత చిత్రకారులున్నారా అని ఆశ్చర్య పోతూ ...
భూమాత కాన్వాస్ మీద ఒకర్ని మించి ఒకరు వేసిన చిత్రాలను వీక్షిస్తూ
ఇంటికొచ్చే సరికి మా ఇంటి ముందు
ఇదిగో ఈ పక్షుల కిల కిలారావాల సందడి కనిపించింది!
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!




Tuesday, November 20, 2012

2012 యుగాంతం 4012 కు వాయిదా !


2012 యుగాంతం 4012 కు వాయిదా !

కోటానుకోట్ల జనం గజ గజ వణుకుతూ ఎదురు చూస్తున్న 2012 యుగాంతం 
అనివార్య కారణాల వల్ల 4012 కు వాయిదా పడిందని తెలియజేయడానికి విచారిస్తున్నాము. 

గతం లో  "అష్టాగ్రహ కూటమి"-  "1999 డిసెంబర్ 31 ప్రళయం" నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.. 
అయితే 4012 యుగాంతం మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని కొందరు ఆస్తికులు ఢమకా బజాయించి చెప్తున్నారు.  4012 యుగాంతానికి స్వాగతం పలికేందుకు వారు ఇప్పటినుంచే సన్నాహాలను మొదలు పెట్టారు. 

నాస్తికులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ బతుకు పోరాటాల్లో తాము నిమగ్నమై వున్నట్టు మా ప్రతినిధి తెలియజేస్తున్నారు.  కాగా , యుగాంతం ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ప్రజల్లో బొత్తిగా భయభక్తులు లేకుండా పోతాయని మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
దీనిపై కొందరు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ముందు విశ్వ వాణి వార్తల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.  

(ఫేస్ బుక్ లో ఒక మిత్రుడి వ్యాఖ్య చూసి సరదాగా)



Wednesday, October 24, 2012

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్‌ గంగోపాధ్యాయకు నివాళి ...


కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, సుప్రసిద్ధ బెంగాలీ కవి, కథా రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ (78)  23 అక్టోబర్‌ 2012 తెల్లవారు జామున రెండు గంటలకు కోల్‌కతాలో, గుండెపోటుతో మరణించారన్న వార్త విషాదాన్ని కలిగించింది.

2010 ఆగస్ట్‌ 20న గోవాలో వారి చేతుల మీదుగానే నేను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారాన్ని  అందుకున్నాను.  (డా. యాగాటి చిన్నారావు గారి  'దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ' అన్న థీసిస్‌ను ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పేరిట చేసిన అనువాదానికి, 2009 సంవత్సరానికి గాను ఈ బహుమతి లభించింది. ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించారు).

అకాడమీవారు పంపించిన బహుమతి ప్రదానోత్సవ ఫొటోను నేను షోకేసులో భద్రంగా దాచుకోవడం వల్ల ఈ రెండేళ్లలో వారు నాకు ఎంతో సుపరిచితుడిలా మారారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 200కు పైగా పుస్తకాలు ప్రచురించారు. అనేక కథలూ, నవలలూ, బాల సాహిత్యం, యాత్రా రచనలు చేశారు. అయితే ఆయనకు కవిత్వమంటేనే ఎక్కువ ఇష్టం. స్వయంగా క్రృతిబాస్‌ అనే కవిత్వ మాసపత్రికను నిర్వహిస్తూ అనేక మంది యువకవులను ప్రోత్సహించారు. వారి 'నీరా' కవితలు బెంగాల్‌లో ఆబాల గోపాలనాన్ని ఆకుట్టుకున్నాయి.

వారు రాసిన కొన్ని నవలలను సత్యజిత్‌ రే ( అరణ్యర్ దిన్ రాత్రి , ప్రతిద్వంది ) , గౌతం ఘోష్ ( అబర్ అరణ్య  ) వంటి ప్రఖ్యాత దర్శకులు చలన చిత్రాలుగా మలిచారు. తన పేరుతోనే కాకుండా ''నీల్‌ లోహిత్‌, నీల్‌ ఉపాధ్యాయ్‌, సనాతన్‌ పాఠక్‌'' వంటి కలం పేర్లతో కూడా ఆయన రచనలు చేశారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 1985 లో " సి సమోయ్ (అప్పటి రోజులు)" నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఆ తరువాత ఐదు సంవత్సరాలు ఉపాధ్యక్షులుగా పనిచేసి 2008లో కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌ నగరంలో వుంటున్నారు. అతను వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి.

సునీల్‌ గంగోపాధ్యాయ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.








.



Tuesday, October 2, 2012

గాంధీ సిద్ధాంతాలను మరచిపోయినా గాంధీని మాత్రం మరచిపోలేం !



( ఫోటో వ్యాఖ్య )

ఎవరన్నారు బాపూ
మేం నిన్ను మరచిపోయామని !?
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ
మా శ్వాస, ధ్యాస, ప్రయాస
మా గమనం, గమ్యం అంతా నువ్వే కదా
నిన్నెలా మరచిపోగలం ?
మా అణువణువణువణువునా నువ్వే వ్యాపించి వున్నావు
సమసమాజం ఏర్పడేంతవరకూ
నీ మీద మా భక్తి పారవశ్యాలకు ఢోకాలేదు బాపూ

Saturday, September 22, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి "

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ   "నిర్జన వారధి " 
పుస్తకావిష్కరణ సభ 23 సెప్టెంబర్ 2012 ఆదివారం ఉదయం 10 .30 కు హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీ లోని ఉర్దూ హాల్ లో. 
92 సంవత్సరాల కోటేశ్వరమ్మ గారు స్వయంగా పాల్గొంటున్నారు.


Sunday, January 1, 2012

తెలుగు బ్లాగర్ల రచనలకు 'ఆదివారం ఆంధ్రజ్యోతి' నీరాజనం!


ఈ కొత్త సంవత్సరం తెలుగు బ్లాగులు మరింత ఉజ్వలంగా వెలిగిపోనున్నాయా? 


ఆరోగ్యకరమైన చర్చలతో, ఆలోచింపజేసే రచనలతో, జీవితానుభవాలనూ వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పంచే పోస్టులతో మరింత విస్తృతంగా నెటిజనులను ఆకర్షించనున్నాయా?


అవుననే అనిపిస్తోంది ఇవాళ్టి (1-1-12) ఆదివారం ఆంధ్రజ్యోతిని చూస్తుంటే!


మొత్తం సంచికను తెలుగు బ్లాగర్ల రచనలకు అంకితం చేయడం నిజంగా అద్భుతమనిపించింది. 
నూతన సంవత్సరం తొలి ఉదయమే మహదానందం కలిగించింది.


ఇందులో పొందుపరచిన బ్లాగర్ల రచనలు, బ్లాగుల వివరాలు ఇలా వున్నాయి:


1. లుంగి - వీజె : golisoda.in
2. పందిరాజము - అనిల్‌.ఎస్‌.రాయల్‌ : anilroyal.wordpress.com
3. మగపిల్లాడు పిల్లమగాడు - డి.ఎస్‌.గౌతమ్‌ : thotaramudu.blogspot.com
4. డెమ్మ డెక్కడాలి - యర్రపు రామనాధరెడ్డి : yarnar.blogspot.com
5. అసూబా'ల ఆహార్యం - వై.ఎ.రమణ : yaramana.blogspot.com
6. వెజిటెబుల్‌ సలాడ్‌ - పద్మార్పిత : padma4245.blogspot.com
7. చిన్న గీత - సుస్మిత : kothavakaya.blogspot.com
8. పాడమని నన్నడగవలెనా - నేస్తం : jaajipoolu.blogspot.com
9. నాకు ప్రేమించి పెళ్లి చేసుకునే యోగ్యత లేదా? - బులుసు సుబ్రహ్మణ్యం : bulususubrahmanyam.blogspot.com
10. సుత్తి! సుతిమెత్తగా!! - లలిత : naaspandhana.blogspot.com
11. ఐ యామ్‌ ఓకె, యు ఆర్‌ నాట్‌ ఓకె - కృష్ణప్రియ : krishna-diary.blogspot.com
12. చుక్కల మొక్కు - మధురవాణి : madhuravani.blogspot.com


పై బ్లాగర్లకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు !


తప్పక చదవండి ఆదివారం ఆంద్ర జ్యోతి: 
 http://www.andhrajyothyweekly.com/ 




..

నూతన సంవత్సర శుభాకాంక్షలు



గతం అనే గొంగళి పురుగులోంచి 

    ఆవిర్భవించింది వర్తమాన సీతాకోక చిలుక 

    అది ఆస్వాదించేందుకు ఈ  సువిశాల  ప్రపంచంలో 

    ఎన్నెన్ని అందమైన పుష్పాలో ...

   మీ అందరికీ ఆనందమయమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ...




.

Friday, September 4, 2009

వంద గుండెలు ఆగిపోయాయి... పాతిక గుండెలు తమను తాము చిదిమేసుకున్నాయి...! ఈ పాపం ఎవ్వరిది?

...
...
...
మిగతా దేశాలతో పోలిస్తే గుండె సంబంధ వ్యాధులున్న వారు మన దేశంలోనే ఎక్కువ. ఇక్కడ ప్రతి వంద మరణాల్లో 30కి పైగా మరణాలు కేవలం గుండె జబ్బులవల్లనే సంభవిస్తున్నాయి. 1990 సంవత్సరంలో మన దేశంలో గుండె జబ్బులతో చనిపోయినవారి సంఖ్య 1.17 మిలియన్లయితే, 2000 సంవత్సరంలో అది 1.59 మిలియన్లు. కాగా వచ్చేయేటికల్లా (2010) ఈ సంఖ్య 2.03 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

అమెరికాలో గుండెజబ్బులూ, గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలూ తగ్గుతుంటే, మన దేశంలో మాత్రం అతి వేగంగా పెరుగుతున్నాయి. 2015 నాటికి అమెరికాలో గుండెజబ్బులున్న వారి సంఖ్య 16 మిలియన్లుంటే, మన దేశంలో (పరిస్థితి ఇట్లాగే కొనసాగితే) 62 మిలియన్లు దాటుతుందని కాలిఫోర్నియాలోని ఒక రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పేర్కొంది. దరిమిలా మధుమేహంతో పాటు గుండె జబ్బులకు కూడా భారతదేశమే ''ప్రపంచ రాజధాని'' అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

గుండెజబ్బులకు అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్టరాల్‌, మానసిక ఒత్తిళ్లు, పొగత్రాగడం, మద్యపాన సేవనం ప్రధాన కారణాలు.

ఈమధ్య కాలంలో మద్యపానం, సిగరెట్లు (బీదవాళ్లైతే బీడీలు) కాల్చడం, గుట్కాలూ జర్దా పాన్లూ నమలడం వంటి అ లవాట్లు మన సమాజంలో విజృంభిస్తున్నాయి. బీపీలు, గుండెజబ్బులు పెరగడానికి అవే ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. ప్రజలు ఈ దురలవాట్లకు దూరంగా వుండేలా వారిని చైతన్య పరిచేందుకు పాలకులు విస్తృత స్థాయిలో నిర్థిష్టమైన కార్యక్రమాలేమీ చేపట్టడంలేదు. పైగా మద్యపాన నిషేదాన్ని పూర్తిగా ఎత్తివేసి ఊరూరా వాడవాడలా బెల్టు షాపులు పెట్టి మంచి నీళ్లు దొరకని చోట కూడ మందుకు కరువులేకుండా చేస్తున్నారు.

ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి సంవత్సరం పది లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మనదేశంలో అయితే ఏడాదికి లక్ష మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 1989లో 68,744 మంది ఆత్మహత్యలకు పాల్పడితే 2006లో 1,18,112 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉత్తరాదికంటే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. పత్తి రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంతో అపకీర్తిని మూటగట్టుకుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలనలోనూ, రైతు అనుకూల ప్రభుత్వ పాలనలోనూ ఈ ఆత్మహత్యలు ఆగకుండా జరుగుతూనే వుండటం ఒక విషాదం.

పంటలు దెబ్బతినడం, అప్పుల పాలుకావడం, నిరుద్యోగం, గృహ హింస, మానసిక ఒత్తిళ్లు, ఫెయిల్యూర్లు, నిరాశానిస్పృహలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ఈ విషయంలో కూడా ప్రజల్లో, యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగేలా అధికారికంగా విస్తృత స్థాయిలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. దరిమిలా పరిస్థితి భయంకరంగా తయారైంది..

ఈ నేపథ్యంలో డాక్టర వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి దుర్మరణం, ఆ షాక్‌తో రాష్ట్రవ్యాప్తంగా గుండె ఆగి లేదా ఆత్మహత్య చేసుకుని దాదాపు 150 మంది వరకు చనిపోవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. గతంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఇంకా ఇతర ఏ జాతీయ నాయకులు చనిపోయినప్పుడు కూడా ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు.

మరి ఇప్పుడు ఎందుకు జరిగాయి? ఎందుకు ఇన్ని గుండెలు ఆగిపోయాయి? ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు? ఇందుకు బాధ్యులెవరు? అని ఒక్కసారి ఆలోచిస్తే కనిపించే కారణాలు:

1) ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ మీడియా బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. (గతంలో టీవీ మీడియా ఇంత విస్తృత స్థాయిలో లేదు). ఒక ఛానల్‌తో మరో ఛానల్‌ పోటీపడుతూ ఎడతెరిపి లేకుండా చేసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వార్తా ప్రసారాలకి దాదాపు 24 గంటల పాటు రాష్ట్ర ప్రజలంతా నరాలు తెగే ఉత్కంఠతకు, మానసిక ఉద్వేగానికి, ఒకవిధమైన ఉన్మాదానికి గురయ్యారు. టీవీ ఛానళ్లు ఇతర అన్ని వార్తలను పక్కన పెెట్టేశాయి. కేబుల్‌ ఆపరేటర్లు కేవలం ఈ వార్తా ఛానళ్లను తప్ప ఇతర ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేసి ప్రజల పంచేద్రియాలు ఈ వార్తకే అంకితమయ్యేట్టు చేశాయి. అది దుర్బల మనస్కుల మీద తీవ్ర ప్రభావం చూపింది.

2) కారణాలు ఏమైనా గానీ, డాక్టర్‌ వైఎస్‌ ఉదయం పూట ప్రయాణం చేసిన హెలీకాప్టర్‌ స్వరాష్ట్రంలో కూలిపోతే దాదాపు 24 గంటల వరకు ఆచూకీ కనుక్కోలేని ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం. మీడియాలో రకరకాల కథనాలు, ఊహాగానాలూ వెలువడుతున్నా ప్రభుత్వ పరంగా సకాలంలో సరైన సమాచారం ప్రజలకు లభించకపోవడం.

3) పావలా వడ్డీ రుణాలు, వృద్ధాప్య ఫించన్లు, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, బిసి స్కాలర్‌షిప్‌లు మొదలైనవన్నీ ఎక్కడ ఆగిపోతాయో అన్న ఆందోళన. అవన్నీ ఆగవనీ, వాటిని అమలు చేసేది ఒక వ్యక్తి కాదనీ, ప్రభుత్వమనీ వందేళ్ల చరిత్ర వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అవగాహన కలిగించలేకపోవడం.

4) స్వాతంత్య్రం వచ్చి 62 సంవత్సరాలు అవుతున్నా ప్రజల కనీస/ప్రాథమిక సమస్యలు కూడా తీరకపోవడం. ప్రతి చిన్న విషయానికీ రాజకీయ నాయకుల దయాధర్మాల మీద ఆధారపడే దుస్థితిలో వుండటం. వారికి రాజ్యాంగం గురించి గానీ, ప్రజాస్వామిక హక్కుల గురించి గానీ కనీస అవగాహన కూడా లేకపోవడం. నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం.

5) కమ్యూనిస్టు దేశాలలో మాదిరగా మన ప్రజాస్వామిక దేశంలో కూడా పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా వ్యక్తిపూజ పెరగడం.

''దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌'' అన్నాడు మహాకవి గురజాడ ఆనాడు. ఆ మనుషులు దుర్బల మనస్కులైతే దేశమేగతి బాగుపడునోయ్‌ అనవలసి వస్తోంది ఈనాడు.

Friday, August 28, 2009

దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?....2 ...

''దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?'' పోస్టుపై వచ్చిన స్పందనల్లో కొన్నింటికి వివరణ ఇద్దామని చేసిన ప్రయత్నమిది. నిడివి పెరగడంతో దానికి కొనసాగింపుగా 2వ టపాగా పొందు పరుస్తున్నాను.

@ Praveen Sarma, @ Indian Minerva, @ Venkata Ramana, @ Viswamitra, @ Bolloju Baba, @ Katti Mahesh Kumar, @ Ravi, @ Malakpet Rowdy, @ Anonymous @ Sharat @ Punarvasu

స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

వెటకారాలు, వ్యక్తిగత విమర్శలు, బిలో ది బెల్ట్ పంచ్ లు, దూషణలు తగ్గించుకుని సబ్జెక్ట్ కే పరిమితమై సభ్య పదజాలంతో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోగలిగితే మన బ్లాగులు ఆరోగ్యకరమైన ఆలోచనలకు వేదికలవుతాయి. మరెందరో ఆలోచనాపరులను ఆకర్షించ గలుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కొందరు ఉద్దేశ పూర్వకంగా సంయమనాన్ని కోల్పోతున్నారు అనిపిస్తోంది.. సరే దీనిని ఆయా వ్యక్తుల విజ్ఞతకు వదిలేయడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు.

ఇక్కడ కొందరు లేవనెత్తిన ప్రశ్నలకు మహేష్ కుమార్ గారు సమాధానాలు చెప్పారు. వాటితో నేను ఎకీభవిస్తున్నందువల్ల తిరిగి వాటిని ప్రస్తావించడం లేదు.

అదేవిధంగా రిజర్వేషన్ల అమలులో లోపాలు, అవకతవకలు వంటి అంశాల జోలికి వెళ్లి అసలు సమస్యను గందరగోళ పరచ దలచుకోలేదు. (ఎందుకంటే మనదేశంలో తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య వంటి ఏ కార్యక్రమాన్ని పరిశీలించినా వాటి అమలులో ఘోరమైన వైఫల్యాలూ, అక్రమాలే కనిపిస్తాయి. ఆడలేక మద్దెల వోడన్నట్టు అమలులో చిత్తశుద్ధి లేక పథకాలనే తప్పుపట్టలేం కదా) .

కాబట్టి ముఖ్యంగా ఈ కింది వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని నా అభిప్రాయాలను మీతో పంచుకునేందుకు ప్రయత్నిస్తాను.


1) >>>>> ఇప్పుడు కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించటం వల్ల, ఇతర మత వ్యాప్తి అవుతుంది అన్నది ఒక valid argument గా పరిగణించాలి.<<<< (@ Ravi) 2) >>>>> the constitution says that the Dalits who want reservations must remain Hindus. Since Christianity/Islam doesnt have caste system in place, they are NOT dalits once they get converted.<<<<< (@ Malakpet Rowdy) 3) >>>>> He wanted the government to increase reservation under the BC-C quota, now being given to Dalit Christians. It was the only way to uplift Dalit Christians, he suggested.<<<<< (@ Malakpet Rowdy)

''కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించడం వల్ల ఇతర మత వ్యాప్తి అవుతుంది'' అనడం లేని ''బూచి'' ని చూపించి పిల్లల్ని భయపెట్టడం లాంటిదే. ఈ వాదనలో పక్షపాతవైఖరి, పరమత ద్వేషం తప్ప వాస్తవికత లేదు. రిజర్వేషన్లు లేనప్పటినుంచీ మన దేశంలో మతమార్పిడులు వున్నాయి. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా మునుముందు కూడా వుంటాయి.

కొందరు వ్యక్తుల మత విశ్వాసాలు మారినంత మాత్రాన మన దేశానికి వాటిల్లే నష్టమేమీ లేదు. మతం, దేవుడు వంటి వ్యక్తిగత విశ్వాసాలను ఎవరూ నియంత్రించలేరు. మతానికీ, దేశభక్తికీ / దేశద్రోహానికీ ఏమాత్రం సంబంధం లేదు. 'పృథ్వీరాజ్‌'లు/ 'జయచంద్రులు' అన్ని మతాల్లోనూ వుంటారు.

ఇక ఎవరైనా ఎందుకు మతం మారతారన్నది అసలు ప్రశ్న.

మహాత్మాగాంధీ 1925 లో కేరళలోని శివగిరిని సందర్శించినప్పుడు ఆయనకూ, నాటి కేరళ సామాజిక తత్వవేత్త శ్రీనారాయణ గురుకూ మధ్య జరిగిన ఈ కింది సంభాషణ చూడండి:
....
మహాత్మా గాంధీ: అంటరానితనాన్ని నిర్మూలించడం కాకుండా ఇంకా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి మనం ఏం చేయాలంటారు?

శ్రీ నారాయణ గురు: వాళ్లను విద్యావంతుల్ని చేయాలి. తమ అవసరాలకు సరిపడినంత ఆదాయాన్ని సంపాదించుకోగలిగేలా చేయాలి. కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు వంటివి తక్షణమే చేపట్టాలని నేను భావించడం లేదు. ముందుగా వాళ్లు ఇతరులతో పాటు సమానంగా ఎదిగేందుకు తగిన అవకాశాలు కల్పించాలి.

మహాత్మా గాంధీ: నిమ్న కులాల వాళ్లు పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి మారడం చాలా దురదృష్టకరమైన విషయం కదా?

శ్రీ నారాయణ గురు: కొత్త నమ్మకం వారికి ఆనందాన్నిస్తున్నట్టయితే, అది వారికి ఫలసిద్ధినిస్తున్నట్టయితే తమ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ వారికి సంపూర్ణంగా వుంటుంది. కాబట్టి వాళ్లని అందుకు అనుమతించక తప్పదు.

మహాత్మా గాంధీ: కానీ వాళ్లు మత మార్పిడి చేసుకుంటున్నది అందుకు కాదు. ఏవో కొన్ని సౌకర్యాలు, హక్కులు పొందేందుకు మాత్రమే వాళ్లు వెళ్లిపోతున్నారు.

శ్రీ నారాయణ గురు: అ లాంటప్పుడు ఆ సౌకర్యాలూ హక్కులూ ఏవో వాళ్లకి మీరే కల్పించండి. అప్పుడు వాళ్లు హిందువులుగానే వుండిపోతారు కదా.
....

శ్రీనారాయణ గురు (1856-1928) మరో సందర్భంలో ఇలా అన్నారు:

''హిందూ మతం అనేది అసలు లేదు. (సింధూ నదే ఇందూ నదిగా మారి అందులోంచే హిందూ, హిందుస్థాన్‌, ఇండియా, ఇండియన్స్‌ అనే పదాలు ఆవిర్భవించాయని అంటారు). విదేశీయులు ఈ దేశాన్ని హిందూ దేశమనీ, ఇక్కడి మూలవాసులను హిందువులనీ వ్యవహరించేవారు. అంతే తప్ప హిందూ మతం అనేదే లేదు. హిందూ దేశంలో నివాసమేర్పరచుకున్న విదేశీయ క్రైస్తవ, ఇస్లాం మతాలకు చెందిన వాళ్లను కాక ఇతర్లను సంబోధించేందుకు ఈ పదాన్ని వాడేవారు. ఈ కారణంగానే కొందరు బౌద్ధ, జైన మతాలు కూడా హిందూమతంలో అంతర్భాగమని భావిస్తారు.''
.....

హిందూ మతంలో అగ్ర కులాలు ఎంత సుఖసంతోషాలతో, సౌలభ్యాలతో వున్నాయో మాల మాదిగ తదితర నిమ్నకులాలు అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంటూ, అనాదరణకు గురవుతూ అంత అసౌకర్యంగా వున్నాయి. అందుకే వాళ్లు తమ ఆత్మ గౌరవంకోసం, మానసిక శాంతికోసం మరో మతం వైపు చూడాల్సి వస్తోంది. హిందూ మతంలో ఈ కాలానికి తగిన విధంగా సంస్కరణలు జరిగితే ఈ సమస్య వుండేది కాదు.

ఇక దళిత క్రైస్తవులకు ప్రస్తుతం ఇస్తున్న బి.సి. (సి) కోటా పట్ల ఎవరికీ ఏ ఆక్షేపణ లేనట్టు కనిపిస్తోంది. వారికి ఎస్‌.సి. కోటా యివ్వడంను మాత్రం కొందరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి క్రైస్తవ మతంలో (ఫార్వర్డ్‌ రిలిజియన్‌) బి.సి.లు కూడా వుండకూడదు కదా మరి. దాని నెలా ఒప్పుకుంటున్నారో అర్థం కాదు.

ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం ఒక దళితుడు (ఎస్‌సి) క్రైస్తవ మతం స్వీకరిస్తే వెంటనే అతని ఎస్‌సి హోదా రద్దయిపోతుంది. అతడిని బిసి సి గానో ఎఫ్‌సి గానో పరిగణిస్తారు. అతనే మళ్లీ కొన్నాళ్ల తరువాత తిరిగి హిందూ మతంలో చేరితే అతని ఎస్‌సి హోదా పునరుద్ధరించబడుతుంది.
ఎంత విచిత్రమిది.
అసలు రిజర్వేషన్లు వేల సంవత్సరాల అన్యాయానికి గురైన దళితులను ఉద్ధరించడానికా లేక హిందూ మతాన్ని, కుల వివక్షను కాపాడడానికా తెలియడం లేదు.

క్రైస్తవ మతం అభివృద్ధిచెందిన (ఫార్వర్డ్‌) మతం కావచ్చు. అంతమాత్రాన అందులో చేరీ చేరగానే ఒక్కసారిగా నిరుపేద దళితులంతా ఫార్వర్డ్‌ అయిపోరు. బట్ట, పొట్టకు సంబంధించి చిన్న చిన్న సౌకర్యాలు సమకూడుతున్నాయేమో గానీ క్రైస్తవులుగా మారిన బీద దళితులు పెద్దగా బావుకుంటున్నదేమీ లేదు. మన సమాజంలో వారి స్టేటస్‌ ఏమాత్రం మారడంలేదు. ఎల్లయ్యను చూసినట్టే ఏసుపాదాన్నీ చూస్తోంది మన సమాజం.

దళితులను సృష్టించింది హైందవ సమాజమే కావచ్చు
కానీ ఆ దళితులను ఉద్ధరించేందుకు రిజర్వేషన్ల ద్వారా నడుం కట్టింది మాత్రం కేవలం స్వతంత్ర భారత ప్రభుత్వం తప్ప హిందూ మతం కాదు.
మనది మత ప్రమేయం లేని లౌకిక ప్రజాస్వామ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా మతం గురించి ఆలోచించడంలో ఔచిత్యంలేదు. మనమిప్పుడు వేలాది సంవత్సరాలుగా సాగిన అన్యాయాన్ని సరిదిద్దడం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి తప్ప వారి వారి మత విశ్వాసాల మీద కాదు.

హిందూ మతంలో దళితుల పట్ల చిన్నచూపు ఇంకా అట్లాగే కొనసాగుతున్నా కూడా వారిని చచ్చినట్టు అదే మతంలో పడివుండాలనడం, లేకపోతే రిజర్వేషన్లు ఇవ్వమని బెదిరించడం... నిజంగా దళితుల మేలు కాంక్షించేవారు చేయాల్సిన పనికాదు.

దానికి బదులు హిందూ మతంలో తగిన మార్పు తీసుకురావడం, సర్వ కుల సమానత్వం కోసం ప్రయత్నించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇతర మతాల్లో మాదిరిగా హిందూ మతంలో కూడా కులాల ప్రాధాన్యత తగ్గి, సమానత్వం సహోదరత్వం, పర్సపర ప్రేమాభిమానాలు పెరిగితే ఎవ్వరూ హిందూమతాన్ని వీడి పోయే పరిస్థితే వుండదు.



......

Thursday, August 27, 2009

దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?!

భారతదేశంలో దళితులను నిన్న మొన్నటి వరకు దేవాలయాల్లోకే అడుగుపెట్టనివ్వలేదు. వాళ్లని తాకితేనే కాదు వాళ్ల నీడ సోకినా చాలు మైలపడిపోతామ్నన్నట్టు ప్రవర్తించారు. వాళ్లను గుడుల్లోకే కాదు బడుల్లోకీ రానివ్వలేదు. ప్రధాన వీధుల్లోకీ అడుగుపెట్టనివ్వలేదు. ఊరి చివరన వెలివేసినట్టు వుండనిచ్చారు తప్ప ఊళ్లో అందరితో కలవనివ్వలేదు. వాళ్ల మీద అంటరానివాళ్లు అనే ముద్రవేసి పరమ కిరాతకంగా అణగదొక్కారు. సాటి మానవులన్న స్పృహలేకుండా జంతువుల కంటే హీనాతి హీనంగా చూశారు. (ఇప్పటికీ ఈ వివక్ష అనేక గ్రామీణ ప్రాంతల్లో కొనసాగుతూనే వుంది).

ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా హిందూమతమే (మను ధర్మమే) ఇష్టారాజ్యంగా పాలించింది. మతమూ అదే, ప్రభుత్వమూ అదే. చట్టమూ అదే. శాసనమూ అదే. అందుకే దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా అన్నివిధాలా అణగారిపోయారు. చదువుకూ, చైతన్యానికీ, అభివృద్ధికీ దూరంగా వుండిపోయారు.

ఈ అన్యాయాన్ని సరిచేసేందుకే ... హిందూమతం/హిందూ పాలక వర్గాలు దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో తరతరాలుగా చేసిన అన్యాయాన్ని కొంతైనా సరిదిద్దేందుకే రిజర్వేషన్లు వచ్చాయి. అంతే తప్ప రిజర్వేషన్లు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినవి కావు. రిజర్వేషన్లకీ హిందూ మతానికీ సంబంధంలేదు. దళితులు ఏ మత ధర్మాన్ని పాటించాలి, ఏ దేవుణ్ని పూజించాలి, అసలు ఏ దేవుణ్నయినా తప్పనిసరిగా పూజించాలా, వద్దా అనే వాటితో రిజర్వేషన్లకు నిమిత్తం లేదు.

ఈ రిజర్వేషన్ల వల్ల హిందూ మతంలో దళితుల హోదా ఏమీ పెరగదు. ఈ రిజర్వేషన్ల వల్ల దళితులు అమాంతం బ్రాహ్మణులతో సమానులైపోరు. ఈ రిజర్వేషన్ల వల్ల హిందూమతంలో సర్వ కుల సమానత్వం యేమీ ఏర్పడదు. నిజంగా హిందూ మతంలోని లోపాలను సరిదిద్దాలనుకుంటే అందుకు వేరే కార్యక్రమం పెట్టుకోవాలి.

అట్లాగే చాలామంది తెలిసో తెలియకో ఈ రిజర్వేషన్లను ఆర్థిక చట్రంలో బిగించాలని చూస్తున్నారు. తద్వారా రిజర్వేషన్ల అసలు స్ఫూర్తినే దెబ్బతీయాలనుకుంటున్నారు. రిజర్వేషన్ల లక్ష్యం భారతదేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడం కానే కాదు. రిజర్వేషన్ల వల్ల భారత దేశంలో సమసమాజమేమీ రాదు. సమసమాజ స్థాపనకు వేరే కార్యక్రమం చేపట్టాల్సి వుంటుంది

నిజానికి హిందూ మతం అనేది ఊహల్లోనే తప్ప వాస్తవికంగా ఎన్నడూ లేదు. హిందూ ధర్మం, మను ధర్మంలనే మతంగా పరిగణిస్తున్నారు. ఈ దేశంలో వున్నవి కులాలు మాత్రమే. మతం మనకి ఊహాజనితం. కులాలే వాస్తవం. అన్ని కులాల వాళ్ళూ ఒకేరకం దేవుళ్లకి దండం పెట్టుకోవడంలో మాత్రమే సారూప్యత వుంటుంది తప్ప ఇతరత్రా కాదు. ఒక్కొక్క కులం ఒక్కో మతంలా తనదైన ప్రత్యేకతను, తనదైన గుర్తింపును కలిగి వుంటుంది. ఒక కులం వాళ్ళు మరో కులం వాళ్లను పెళ్లిల్లు చేసుకోడానికి వీలు లేదు. ఈ కులాల మధ్య అనేక హెచ్చుతగ్గులు. చిన్నచూపులు. అహంభావాలు. ద్వేషాలు, అనుమానాలు, అవహేళనలు ఎన్నెన్నో వివక్షలు.

మన దేశం మీద మహ్మదీయుల, ఆంగ్లేయుల పాలన మొదలైన తర్వాతే, అంటే ఇక్కడిి అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి పడిన తర్వాతే ఈ పెద్దమనుషులకి మతం ముసుగు కావలసి వచ్చింది. అప్పటినుంచే ఒకపక్క కుల వ్యవస్థ చెక్కుచెదరకుండా జాగ్రత్తపడుతూనే మరోపక్క హిందుత్వ, హిందూమత భావనను జనంలో రగిలించడం మొదలుపెట్టారు. గతంలో తాము చేసిన పొరపాట్లను ఇప్పుడైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఎవడి కులం పరిథిలో వాడు మగ్గిపోతూనే వుండాలి కాకపోతే ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు, జండాలు మోయాల్సి వచ్చినప్పుడు మాత్రం మాలమాదిగలతో సహా అన్ని కులాలవాళ్లూ హిందువులం అన్న భ్రమతో మూకుమ్మడిగా అగ్రవర్ణాలవారికి జైకొట్టాలి. రాజ్యాధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే వుంటుంది. అంతే.

ఇలాంటి నేపథ్యంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పుణ్యమాని రిజర్వేషన్‌ విధానం కారు చీకటిలో కాంతి కిరణంలా ముందుకొచ్చింది. అది కొంతమంది దళితుల జీవితాల్లో నైనా మార్పునకు దోహదం చేస్తోంది. వెనుక బడిన కులాల్లో చైతన్యాన్ని పెంచుతోంది. దాని వల్ల కొందరు దళితులైనా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నత పదవులను, శాసనసభ, లోకసభల్లో కనీస ప్రాతినిధ్యాన్ని పొందగలుగుతున్నారు. ముందే చెప్పినట్టు రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసమో, సమసమాజ నిర్మాణం కోసమో లేక హిందూమతంలోని లోపాలను సవరించి దానిని పటిష్టం చేయడం కోసమో వచ్చినవి కాదు. కేవలం తరతరాల అన్యాయానికి గురైన దళితులకు న్యాయం చేసేందుకు వచ్చినవి మాత్రమే.

దళితులు హిందూ దేవతలనే పూజించాలి, ఇతర దేవతల వంక కన్నెత్తి చూడకూడదు, నాస్తికులుగా మారకూడదు అట్లా అయితేనే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి వంటి నిబంధనలు పెట్టాలనుకోవడం అర్థ రహితం, అప్రస్తుతం. ఆమాటకొస్తే రిజర్వేషన్లను ప్రవేశ పెట్టిన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కరే '' నేను హిందువుగా చచ్చిపోను '' అని చాలా కసిగా ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించి ఒక గొప్ప బౌద్ధుడిగా చనిపోయారు.

కాబట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తింప చేయడం ఏవిధంగానూ ఆక్షేపణీయం కాదు. ఏ మతాన్ని స్వీకరించినా, ఏ దేవుడ్ని ఆరాధించినా లేక పరమ నాస్తికులుగా మారినా దళితులు దళితులే. తరతరాల వివక్షకు ప్రతీకలే. వారి ప్రస్తుత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరికీ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే. ఈ దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు పూనుకోవడం, ఆ ప్రతిపాదనను తెలుగుదేశం, ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌, సిపిఐ, సిపిఎం, తదితర పక్షాలు సమర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

Monday, February 23, 2009

చరిత్ర సృష్టించిన స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌! ఎఆర్‌ రహమాన్‌, రసూల్‌ ఫూకుట్టీ లకు జేజేలు!!

...

ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా ఎనిమిది ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుని స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చరిత్ర సృష్టించింది.
ఆధునిక భారతీయ సంగీత మాంత్రికుడు ఎ.ఆర్‌. రహమాన్‌ (బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఒరిజనల్‌ స్కోర్‌) రెండు అవార్డులతో, రసూల్‌ ఫూకుట్టి (బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌) అవార్డుతో ఆస్కార్‌ వేదికమీద భారతీయ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశారు..

దీనికి తోడు స్మైల్‌ పింకీ అనే లఘు చిత్రానికి కూడా ఆస్కార్‌ అవార్డు రావడం మరో విశేషం.

ముంబయి మురికివాడల దరిద్రాన్ని తెరకెక్కించి మన పరువు తీశారని ఒకవైపు ఈ సినిమాను చూసిన, చూడని విమర్శకులు తిట్టిపోస్తుండగానే ...
సినీరంగపు నోబుల్‌ ప్రైజులాంటి ఆస్కార్‌ అవార్డులను (ఏకంగా ఎనిమిదింటిని) గెలుచుకుని సంచలనం సృష్టించిందీ చిత్రం!

ఈ చిత్రాన్ని తెగడినవాళ్లూ పొగిడినవాళ్లూ అందరూ తమ తమ అభిప్రాయాలను పునస్సమీక్షించుకోవాల్సిన సమయం ఇది.

ఈ చిత్రం మన ఔన్నత్యాన్ని, మన ప్రతిభను లోకానికి చాటిందా లేక
మన దరిద్య్రాన్ని పంచరంగుల్లో చూపించి పరువుతీసిందా... మళ్లీ మరోసారి చర్చించుకోక తప్పదు.

ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసే, చూసే వాళ్లున్న మన దేశానికి
ఆలస్యంగా నైనా ఈ గౌరవం లభించడం సంతోషదాయకం.

ఎంత దరిద్రపుగొట్టు సినిమాలను తీసినా ఫరవాలేదు కానీ వున్న దారిద్య్రాన్ని మాత్రం తెరకెక్కించకూడదు అనడంలో అసలు అర్థంవుందా?
గాంధీ కూడా గోచీతో తిరిగి మన పరువు తీశాడని వాదించడం సబబేనా?

ఈ వాదనలమాట ఎలా వున్నా ఈ అపూర్వ, చారిత్రాత్మక శుభ సందర్భంలో మన మంతా నిండుమనసుతో వేడుకలు చేసుకోవాలి. ఎ.ఆర్‌.రహమాన్‌కు, రసూల్‌ ఫూకుట్టీ లకు, స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చిత్ర దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, రచయితకు జేజేలు పలకాలి.

జయహో ... స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌!
జయహో ... ఎ.ఆర్‌.రహమాన్‌, రసూల్‌ ఫూకుట్టీ !!
...............

Friday, February 6, 2009

వాలంటైన్ డే నాడు ప్రేమికులకు పెళ్లిల్లు చేయడంతో పాటు ... అదే చేత్తో వాళ్లకి ఉద్యోగాలు కూడా ఇప్పించి పుణ్యం కట్టుకోండి !!!

ఆడవాళ్లు బురఖా లేకుండా బయటకు వస్తే ...
తాట వలిచేస్తామని ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఫర్మానా జారీ చేశారు.
స్త్రీలు ఉద్యోగాలు చేయడం, బడికి వెళ్లి చదువుకోవడం యహా చల్తానై ...
వాళ్లు ఇంట్లో నాలుగు గోడల మధ్య పతిసేవ చేసుకుంటూ బుద్ధిగా పడుండాలని తాఖీదు ఇచ్చారు.
ఆ తాఖీదును ఉల్లంఘించిన కొందరు మహిళల తాట వలిచేసినట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ మధ్య మన పత్రికల్లో కూడా అప్పుడప్పుడు ...
అట్లాంటి ఫర్మానాలే జారీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అయితే-
మన దేశంలో విడుదలవుతున్నవి అంత అమానుషమైన ... అంత ప్రమాదకరమైన తాఖీదులేం కాదనిపిస్తోంది.

లోతుగా ఆలోచిస్తే మన తాఖీదులవెనక
మహిళల భద్రత, ఔన్నత్యం, వారి సంక్షేమం పట్ల ఎనలేని ఆవేదన వున్నట్టు అర్థమవుతుంది.

పబ్బులకు వెళ్లి చెడిపోకండి...
మన సంస్కృతిని అప్రదిష్టపాలు చేయకండి అంటున్నారు... అంతేకదా !

వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది?

చెప్పినా వినకుండా మొండికేస్తున్న మహిళామణుల వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తున్నారు.
బస్‌ ... అంతే కదా.
చెప్పిన మాట వినకపోతే మన చెల్లెల్ని మాత్రం మనం కొట్టుకోమా ఏంటి?

కొట్టింది మన అన్నయ్యలేగా.
అదీ మన మంచి కోసమేగా?
ఎందుకు అంత ఉక్రోషపడాలి.

పబ్బులకు వెళ్లని వాళ్లని కొట్టడం లేదుగా.
పబ్బులను నడిపేవాళ్లనీ కొట్టడం లేదు. పబ్బులకు అనుమతినిచ్చే ప్రభుత్వాలనీ పడగొట్టడంలేదు.

కాబట్టి ఆఫ్ఘనిస్థాన్‌తో పోల్చుకుని మనం నానా హైరానా పడాల్సిన పనిలేదు.

నిన్ననే మరో ఫర్మానా జారీ అయింది.

రేపు ఫిబ్రవరి 14న
'' వాలెంటైన్‌ డే '' రోజునాడు

రోడ్ల మీద ప్రేమికులెవరైనా కనిపిస్తే అప్పటికప్పుడు అదే రోడ్డు మీద వాళ్ల పెళ్లి చేసిపారేస్తారట.
నిజం పెళ్లేనండి బాబూ. వేరేగా పొరబడకండి.
పైగా అది అ ల్లా టప్పా పెళ్లి కాదు. పక్కాగా రిజిష్టరు కూడా చేయిస్తారట.
ఇందు నిమిత్తం వేల సంఖ్యలో మంగళ సూత్రాలు, దస్తావేజులు సైతం సిద్ధం చేశారట కూడాను.

ఆహా...
ఎంత మంచి తాలిబన్లండీ మన వాళ్లు!

అనవసరంగా భయపడుతున్నారు గానీ ఆడ పిల్లల పెళ్లి సమస్యను చిటికెలో పరిష్కరించే
మా మంచి అన్నయ్యలు కాదూ మనవాళ్లు.
నిజంగా దేవుడిచ్చిన అన్నయ్యలు.

అయితే ఆ చేత్తోనే ఈ ప్రేమికులకు ఉద్యోగాలు కూడా చూసిపెడితే ఎంత బాగుంటుందో కదా.
ఉద్యోగం లేక, నికరమైన ఆర్థిక వనరు లేకపోతే కాపురాలు సజావుగా సాగేందుకు ఆస్కారం లేదు కదా.

ప్రేమికులకు కుల గోత్రాల పట్టింపు వుండదు.
కాబట్టి ఈ తరహా పెళ్లిల్లలో నూటికి తొంభై కులాంతర వివాహాలే అయివుంటాయి.
వాళ్లలో నూటికి తొంభైతొమ్మిది మందికి తల్లిదండ్రుల ఆమోదం వుండదు.

ఇటు ఉద్యోగమూ లేక అటు తల్లిదండ్రుల సపోర్టూ లేక కాపురాలు సజావుగా ఎలా సాగుతాయి చెప్పండి.
అందువల్ల ఈ మా మంచి అన్నయ్యలు వాళ్లకి పెళ్లిల్లు చేయడంతో పాటు ఉద్యోగాలు కూడా చూసిపెడితే దివ్యంగా వుంటుంది.

ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా ఈ ప్రేమలేంటి...
ఈ వాలెంటైన్‌ డే లేంటి... ఈ విదేశీ సంస్కృతేంటీ అంటారా?

నిజమే కానీ,
ప్రేమకు సరిహద్దులు లేవు.
కొలమానాలు లేవు.
కొందరు ఆకర్షణనే ప్రేమ అనుకోవచ్చు.
మరికొందరు అవసరం కోసం ప్రేమించవచ్చు.
మరికొందరు స్పష్టమైన జీవిత లక్ష్యంతో, జీవిత భాగస్వామి గురించిన నిర్దిష్ట అవగాహనతో ప్రేమించవచ్చు.
అందరికీ ప్రేమించడం చాతకాదు.
అందరూ ప్రేమించే సాహసం చేయలేరు.
ఇంకొందరుంటారు ... పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న తరువాత ఇంటికొచ్చిన పెళ్లాన్ని కూడా ప్రేమించలేరు.!!!

చాలామంది ప్రేమికులు రేపెప్పుడో ఉద్యోగాలు దొరికిన తరువాత పెళ్లి చేసుకుందామనుకుంటారు.
అంతవరకు నిగ్రహంగా వుండాలని నిర్ణయించుకుంటారు.

పెళ్లికి ఉద్యోగం తప్పనిసరి కానీ ప్రేమకు కాదు కదా.

మీరు తొందరపడి పెళ్లి చేస్తున్నారు కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకోవాలి.
వాళ్లకి ముందు ఉద్యోగాలు చూసిపెట్టి ఆ తరువాతే పెళ్లి చేయాలి.

మంచి అన్నయ్యలు కదూ. కాస్త దయగా ఆలోచించండి.
ఆ పుణ్యం కూడా మీరే మూటట్టుకోండి.

ద్వాపర యుగంలో
ఇలాంటి అన్నయ్యలు, అన్నయ్యల దండు లేకపోబట్టి కానీ ...
రాధా కృష్ణులు ...
మన ఆదర్శ ప్రేమికులు ...
ప్రేమతత్వానికే ప్రతీకలు ...
అట్లా శాశ్వతంగా పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవారు కాదేమో...!!!

Friday, January 23, 2009

మనిషికి ఎంత భూమి కావాలి సత్యం / సిఎం గారూ ??????

అనగనగా ఒక రైతు.

అతనికి ఓ రెండెకరాల పొలంవుండేది. ఆరుగాలం శ్రమిస్తూ అందులో బంగారం పండించేవాడు. తిండిగింజలకు లోటు లేకుండా అతని కుటుంబం నిశ్చింతగా జీవిస్తుండేది.

అయితే అతని కో అన్న వున్నాడు. ఆయన పట్నంలో ఏదో ఉద్యోగం చేస్తూ వీళ్లకంటే కాస్త ఉన్నతంగా బతుకుతున్నాడు. వాళ్లని చూసినప్పుడల్లా రైతు భార్య తమ మట్టి బతుకు పట్ల, అరకొర సౌకర్యాలపట్ల తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండేది.

దరిమిలా - ' మరో పదెకరాల పొలం వుంటేనా...' అనే ఆలోచన ఆ రైతును తొలవడం ప్రారంభించింది.

ఇలా వుండగా ఊళ్లోని దొరసానమ్మ తన పొలం మొత్తం అమ్ముకుని పట్నం వెళ్లిపొతోందన్న వార్త వెలువడింది. అందరితో పాటు ఆ రైతు కూడా అప్పోసప్పో చేసి ఓ పదెకరాలు కొనేశాడు.

దాంతో ఆతని ఆదాయం పెరిగింది. పరపతి పెరిగింది. వైభోగం పెరిగింది.

ఇలా అతనూ అతని కుటుంబం దర్జాగా జీవిస్తుండగా ఒక బాటసారి మరో తీయని కబురు చెవిలో వేశాడు.

దూరంగా ఓ ప్రాంతంలో .....రూపాయికి ఎకరం చొప్పున ....కారు చవగ్గా భూములు అమ్ముతున్నారట. తను అదే పనిమీద వెళ్తున్నానని చెప్పాడతను.

ఒక్కసారిగా రైతు కళ్ల ముందు మరో అద్భుతమైన రంగుల ప్రపంచం ప్రత్యక్షమయింది.

మొత్తం తన పన్నెండెకరాల పొలాన్ని, ఇంటినీ తెగనమ్మి భార్యాపిల్లలతో ఆ ప్రాంతానికి వలసపోయాడు.

అక్కడ రెండొందల ఎకరాల పొలాన్ని, చక్కని భవంతిని సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు రైతు కాస్తా భూస్వామిగా మారాడు.

పట్నంలోని తన అన్న కన్నా అతని అంతస్తు వెయ్యి రెట్లు పెరిగింది.

ఇట్లా వుండగా మళ్లీ మరో బాటసారి మరో వింతైన కబురు తెచ్చాడు. పొరుగు రాజ్యంలో భూములను ..... పైసాకి ఎకరం .... చొప్పున అమ్ముతున్నారట!!

వారి నాయనోయ్‌! ... తన రెండొందల ఎకరాల భూమిని అమ్మితే ... ఆ రాజ్యంలో రెండు వేల ఎకరాల భూమిని సొంతం చేసుకోవచ్చు!!!.

అంతే
తక్షణమే తన భూమి మొత్తాన్ని అమ్మేసి కుటుంబంతో ఆ రాజ్యం పయనమయ్యాడు.

అక్కడ రాజావారు ఆ రైతు తెచ్చిన డబ్బును పుచ్చుకుని మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదన చేశాడు.

''నువ్వు ఉదయం ఒక చోటు నుంచి బయలు దేరి నీకు కావలసినంత భూమికి హద్దులు పెట్టుకుంటూ సూర్యాస్తమయం అయ్యేలోపు బయలు దేరిన చోటుకు చేరుకోవాలి. అప్పుడు నువ్వు తిరిగినంత నేల నీ సొంతమవుతుంది. ఒక వేళ సూర్యాస్తమయం అయ్యే లోపు బయలు దేరిన చోటుకు రాలేక పోతే మాత్రం నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వడం జరగదు'' అన్నాడు రాజు.

మన రైతుకు ఆ ప్రతిపాదనతో కళ్ళు బైర్లు కమ్మాయి.

ఈ దెబ్బతో ... రెండువేల ఎకరాలేం ఖర్మ .... ఒక చిన్నపాటి రాజ్యాన్నే సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు.

మర్నాడు సూర్యోదయం కాగానే నిర్ణీత ప్రదేశం నుంచి బయలు దేరాడు. నెమ్మదిగా నడిస్తే ఎక్కువ ఏరియాని కవర్‌ చేయలేనని పరుగులు తీయడం మొదలు పెట్టాడు.

పరుగెత్తాడు... పరుగెత్తాడు.. పరుగెత్తాడు...

ఆయాసాన్ని లెక్కచేయకుండా కొండలు కోనలు దాటుతూ మధ్యాహ్నం కల్లా చాలా మైళ్ల దూరం వచ్చేశాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని ఈ నేలంతా నాదే కదా అని మహదానంద పడిపోయాడు.

అంతలో అతనికి రాజుగారు పెట్టిన షరతు గుర్తుకు వచ్చింది.

సూర్యుడు అప్పుడే నడినెత్తి మీద వున్నాడు.

అమ్మో సూర్యాస్తమయం అయ్యేలోగా బయలు దేరిన చోటుకు చేరుకోవాలి కదా ... సంపాదించుకున్న భూమి ఇక చాల్లే అని వెనుతిరగాడు.

అప్పటికి అతని ఒంట్లో శక్తి చాలావరకు హరించుకుపోయింది. నీరసం, కాళ్ల నొప్పులు.. అడుగు తీసి అడుగువేయాలంటే కష్టంగా వుంది.

లేని ఓపికను తెచ్చుకుంటూ నడకను కొనసాగించాడు.

ఎట్టకేలకు సూర్యాస్తమయం కాబోతున్న వేళ ... అతనికి తను బయలుదేరిన చోటు, అక్కడ రాజుగారి బిడారం కనుచూపు దూరంలో కనిపించింది.

అప్పటికి చెప్పులు తెగిపోయి, కాళ్లు వాచిపోయి రక్తం కారుతున్నాయి.... నోరు దాహంతో పిడచట్టుకు పోతోంది.... కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి....

దూరంగా జనం “ వచ్చేయ్‌...” “ ఇంకా త్వరగా నడువు ...” అంటూ కేకలు వేస్తున్నారు.

కానీ పాపం రైతు నడవలేకపోయాడు.
అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు.
చివరికి ఒక్కసారిగా దభీల్మని బయలుదేరిన చోటును పూర్తిగా చేరుకోకుండానే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

అంతా అయ్యో పాపం అనుకున్నారు.

అతడి శవాన్ని అక్కడే .... ఆరడుగుల .... గొయ్యితవ్వి పూడ్చేశారు !


ఇది మహా రచయిత టాల్‌ స్టాయ్‌ 1886లో ''ఎంత భూమి కావాలి'' అన్న పేరుతో రాసిన కథ తాలూకు (ఇష్టానుసారంగా చేసిన) సారాంశం.

ఇవాళ ఈనాడులో ......''రామలింగ రాజు భూదాహం'' ......అన్న శీర్షికతో వచ్చిన వార్త చదివిన తరువాత నాకు ఈ కథ గుర్తుకు వచ్చింది.

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm

దురాశ ఎంత వాడినైనా ఎంత పతనం చేస్తుందో, పరువు ప్రతిష్టలను ఏవిధంగా మంటకలుపుతుందో కదా అనిపించింది.

మైటాస్‌ కంపెనీకి అనుబంధంగా మరో 240 బినామీ సంస్థలను పుట్టించి 3500 ఎకరాలను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో దొరికిన పత్రాల ద్వారా గుర్తించారట. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములున్నాయో.

2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ భూదందా వెర్రితలలు వేస్తోంది.

భూసంస్కరణలు, సీలింగ్‌ చట్టం ఎక్కడ చచ్చాయో ఏమో.

పేదవాడికి గుడిసె వేసుకునేందుకు 25 గజాల స్థలం దొరకదు కానీ ఒక్కక్కడు ఎక్కడపడితే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు, ఏ పేరుతో అంటే ఆ పేరుతో గుటకాయస్వాహా చేస్తున్నాడు.

రాబోయే రోజుల్లో ఇక చచ్చిన పేదల శవాల్ని పూడ్చేందుకు కూడా జాగా దొరకదేమో!!!!

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేంత వరకు ప్రత్యేక తెలంగాణాకు సానుకూలంగా వుండి....
(ఇప్పటికీ మేం తెలంగాణాకు వ్యతిరేకం కాదు, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం, సమస్య పరిష్కారం బాధ్యతను అధిష్టానం చేతిలో పెట్టాం వంటి సొల్లు కబుర్లు కొనసాగిస్తూనే వున్నారనుకోండి)
... అధికారం చేజిక్కాక ఇప్పుడు తెలంగాణాకు బద్ధ వ్యతిరేకంగా మారడానికి కారణం కూడా ఈ భూదందాయే.

ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్న భూములను ఎక్కడ వదులుకోవలసి వస్తుందో, లేదా వాటి ధరలు ఎక్కడ తగ్గిపోతాయో అన్న భయం వల్లనే ఈ మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది.

అసత్యమేవ జయతే
సత్యం వధ, ధర్మం చెఱ!

కొస మెరుపు :
సత్యం రామ లింగ రాజు మీద మన యువ సాఫ్టు వేర్ ఇంజనీర్లు ఇటీవల కసితో ఒక వీడియో గేం ని రూపొందించారు. అందులో మీరు చేయవలసింది ఆయన మొహం మీద కుళ్ళిన కోడి గుడ్లు విసరడం . ఒక నిమిషం లో ఎన్ని గుడ్లు అయన మొహానికి కొడితే అన్ని పాయింట్లు వస్తాయి. .మీరు ఇంకా చూడక పొతే ఇదిగో ఆ గేం చిరునామా:



http://nailthethief.com/


...............................

Saturday, January 3, 2009

నెట్జనుల 'ఉయ్యాల' లో మరో కొత్త బ్లాగు...!


ఎందరో మహానుభావులు ... అందరికీ వందనములు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

2009 ఆగమన వేళ అందరి ఆశీస్సులను కోరుకుంటూ నా అక్షరాలకు అంతర్జాల ''డోలారోహణం'' చేస్తున్నాను. ఆశీర్వదించండి.



బ్లాగును ప్రారంభించడం అంటే 'పెట్టుబడి లేకుండా సొంతంగా ఒక పత్రికను పెట్టుకోవడం....
లేదా వ్యక్తిగత డైరీని బహిరంగంగా రాసుకోవడం' అనుకుంటున్నాను.




అప్పుడెప్పుడో 'ఈనాడు' ఆదివారం అనుబంధంలో వచ్చిన ప్రత్యేక కథనం ద్వారానే నాకు మొట్టమొదటి సారి తెలుగు బ్లాగుల ప్రపంచం గురించి, కూడలి, జల్లెడల గురించి తెలిసింది.
అంతర్జాలం అందుబాటులో లేక అడపాదడపా తెలుగు బ్లాగులను చూసేవాణ్ని.

ఆతరువాత బ్లాగులను నిర్వహించడం ఎలాగో, యునీకోడ్‌ అంటే ఏమిటో తెలియకపోయినా 'హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌' వారి బ్లాగును నిర్వహించాల్సిరావడంతో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాను. (నాకు ఇప్పటికీ హెచ్‌టిఎంఎల్‌, జావా, ఆర్‌టిఎస్‌, లింకులు గట్రా బొత్తిగా తెలియవు).



ఖర్చులేని పని కాబట్టి పనిలో పనిగా నా ఈ బ్లాగును (వ్యక్తిగత పత్రిక అనొచ్చునేమో) కూడా ప్రారంభిస్తున్నాను.

తదుపరి టపాలు స్వాతి సపరివార పత్రికలో ప్రథమ బహుమతి పొందిన నా మినీ కథ ''సజీవ చిత్రం''తో శ్రీకారం చుడతాను.

అంతవరకు నా దృష్టిలోకి వచ్చిన ఈ పూతోటలో సరదాగా విహరించండి.








అన్నట్టు ఈ పూతోటను మీకు మీరే సృష్టించుకోవలసి వుంటుంది. మీరు ఎక్కడ క్లిక్‌ చేస్తే అక్కడ ఓ పూల మొక్క ప్రత్యక్షమవుతుంది.

అట్లాగే దీనికి మాతృక అయిన ఈ వెబ్‌ సైట్‌లోని ''ఫ్లాష్‌ లాబరేటరీ''లోకి వెళ్తే మరెన్నో ఆసక్తికరమైన ఫ్లాష్‌ చిత్రాలను చూడవచ్చు.





మీ
ప్రభాకర్ మందార