Wednesday, October 24, 2012

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్‌ గంగోపాధ్యాయకు నివాళి ...


కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, సుప్రసిద్ధ బెంగాలీ కవి, కథా రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ (78)  23 అక్టోబర్‌ 2012 తెల్లవారు జామున రెండు గంటలకు కోల్‌కతాలో, గుండెపోటుతో మరణించారన్న వార్త విషాదాన్ని కలిగించింది.

2010 ఆగస్ట్‌ 20న గోవాలో వారి చేతుల మీదుగానే నేను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారాన్ని  అందుకున్నాను.  (డా. యాగాటి చిన్నారావు గారి  'దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ' అన్న థీసిస్‌ను ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పేరిట చేసిన అనువాదానికి, 2009 సంవత్సరానికి గాను ఈ బహుమతి లభించింది. ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించారు).

అకాడమీవారు పంపించిన బహుమతి ప్రదానోత్సవ ఫొటోను నేను షోకేసులో భద్రంగా దాచుకోవడం వల్ల ఈ రెండేళ్లలో వారు నాకు ఎంతో సుపరిచితుడిలా మారారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 200కు పైగా పుస్తకాలు ప్రచురించారు. అనేక కథలూ, నవలలూ, బాల సాహిత్యం, యాత్రా రచనలు చేశారు. అయితే ఆయనకు కవిత్వమంటేనే ఎక్కువ ఇష్టం. స్వయంగా క్రృతిబాస్‌ అనే కవిత్వ మాసపత్రికను నిర్వహిస్తూ అనేక మంది యువకవులను ప్రోత్సహించారు. వారి 'నీరా' కవితలు బెంగాల్‌లో ఆబాల గోపాలనాన్ని ఆకుట్టుకున్నాయి.

వారు రాసిన కొన్ని నవలలను సత్యజిత్‌ రే ( అరణ్యర్ దిన్ రాత్రి , ప్రతిద్వంది ) , గౌతం ఘోష్ ( అబర్ అరణ్య  ) వంటి ప్రఖ్యాత దర్శకులు చలన చిత్రాలుగా మలిచారు. తన పేరుతోనే కాకుండా ''నీల్‌ లోహిత్‌, నీల్‌ ఉపాధ్యాయ్‌, సనాతన్‌ పాఠక్‌'' వంటి కలం పేర్లతో కూడా ఆయన రచనలు చేశారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 1985 లో " సి సమోయ్ (అప్పటి రోజులు)" నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఆ తరువాత ఐదు సంవత్సరాలు ఉపాధ్యక్షులుగా పనిచేసి 2008లో కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌ నగరంలో వుంటున్నారు. అతను వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి.

సునీల్‌ గంగోపాధ్యాయ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.








.



No comments:

Post a Comment