Friday, September 4, 2009

వంద గుండెలు ఆగిపోయాయి... పాతిక గుండెలు తమను తాము చిదిమేసుకున్నాయి...! ఈ పాపం ఎవ్వరిది?

...
...
...
మిగతా దేశాలతో పోలిస్తే గుండె సంబంధ వ్యాధులున్న వారు మన దేశంలోనే ఎక్కువ. ఇక్కడ ప్రతి వంద మరణాల్లో 30కి పైగా మరణాలు కేవలం గుండె జబ్బులవల్లనే సంభవిస్తున్నాయి. 1990 సంవత్సరంలో మన దేశంలో గుండె జబ్బులతో చనిపోయినవారి సంఖ్య 1.17 మిలియన్లయితే, 2000 సంవత్సరంలో అది 1.59 మిలియన్లు. కాగా వచ్చేయేటికల్లా (2010) ఈ సంఖ్య 2.03 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

అమెరికాలో గుండెజబ్బులూ, గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలూ తగ్గుతుంటే, మన దేశంలో మాత్రం అతి వేగంగా పెరుగుతున్నాయి. 2015 నాటికి అమెరికాలో గుండెజబ్బులున్న వారి సంఖ్య 16 మిలియన్లుంటే, మన దేశంలో (పరిస్థితి ఇట్లాగే కొనసాగితే) 62 మిలియన్లు దాటుతుందని కాలిఫోర్నియాలోని ఒక రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పేర్కొంది. దరిమిలా మధుమేహంతో పాటు గుండె జబ్బులకు కూడా భారతదేశమే ''ప్రపంచ రాజధాని'' అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

గుండెజబ్బులకు అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్టరాల్‌, మానసిక ఒత్తిళ్లు, పొగత్రాగడం, మద్యపాన సేవనం ప్రధాన కారణాలు.

ఈమధ్య కాలంలో మద్యపానం, సిగరెట్లు (బీదవాళ్లైతే బీడీలు) కాల్చడం, గుట్కాలూ జర్దా పాన్లూ నమలడం వంటి అ లవాట్లు మన సమాజంలో విజృంభిస్తున్నాయి. బీపీలు, గుండెజబ్బులు పెరగడానికి అవే ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. ప్రజలు ఈ దురలవాట్లకు దూరంగా వుండేలా వారిని చైతన్య పరిచేందుకు పాలకులు విస్తృత స్థాయిలో నిర్థిష్టమైన కార్యక్రమాలేమీ చేపట్టడంలేదు. పైగా మద్యపాన నిషేదాన్ని పూర్తిగా ఎత్తివేసి ఊరూరా వాడవాడలా బెల్టు షాపులు పెట్టి మంచి నీళ్లు దొరకని చోట కూడ మందుకు కరువులేకుండా చేస్తున్నారు.

ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి సంవత్సరం పది లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మనదేశంలో అయితే ఏడాదికి లక్ష మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 1989లో 68,744 మంది ఆత్మహత్యలకు పాల్పడితే 2006లో 1,18,112 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉత్తరాదికంటే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. పత్తి రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంతో అపకీర్తిని మూటగట్టుకుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలనలోనూ, రైతు అనుకూల ప్రభుత్వ పాలనలోనూ ఈ ఆత్మహత్యలు ఆగకుండా జరుగుతూనే వుండటం ఒక విషాదం.

పంటలు దెబ్బతినడం, అప్పుల పాలుకావడం, నిరుద్యోగం, గృహ హింస, మానసిక ఒత్తిళ్లు, ఫెయిల్యూర్లు, నిరాశానిస్పృహలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ఈ విషయంలో కూడా ప్రజల్లో, యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగేలా అధికారికంగా విస్తృత స్థాయిలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. దరిమిలా పరిస్థితి భయంకరంగా తయారైంది..

ఈ నేపథ్యంలో డాక్టర వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి దుర్మరణం, ఆ షాక్‌తో రాష్ట్రవ్యాప్తంగా గుండె ఆగి లేదా ఆత్మహత్య చేసుకుని దాదాపు 150 మంది వరకు చనిపోవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. గతంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఇంకా ఇతర ఏ జాతీయ నాయకులు చనిపోయినప్పుడు కూడా ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు.

మరి ఇప్పుడు ఎందుకు జరిగాయి? ఎందుకు ఇన్ని గుండెలు ఆగిపోయాయి? ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు? ఇందుకు బాధ్యులెవరు? అని ఒక్కసారి ఆలోచిస్తే కనిపించే కారణాలు:

1) ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ మీడియా బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. (గతంలో టీవీ మీడియా ఇంత విస్తృత స్థాయిలో లేదు). ఒక ఛానల్‌తో మరో ఛానల్‌ పోటీపడుతూ ఎడతెరిపి లేకుండా చేసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వార్తా ప్రసారాలకి దాదాపు 24 గంటల పాటు రాష్ట్ర ప్రజలంతా నరాలు తెగే ఉత్కంఠతకు, మానసిక ఉద్వేగానికి, ఒకవిధమైన ఉన్మాదానికి గురయ్యారు. టీవీ ఛానళ్లు ఇతర అన్ని వార్తలను పక్కన పెెట్టేశాయి. కేబుల్‌ ఆపరేటర్లు కేవలం ఈ వార్తా ఛానళ్లను తప్ప ఇతర ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేసి ప్రజల పంచేద్రియాలు ఈ వార్తకే అంకితమయ్యేట్టు చేశాయి. అది దుర్బల మనస్కుల మీద తీవ్ర ప్రభావం చూపింది.

2) కారణాలు ఏమైనా గానీ, డాక్టర్‌ వైఎస్‌ ఉదయం పూట ప్రయాణం చేసిన హెలీకాప్టర్‌ స్వరాష్ట్రంలో కూలిపోతే దాదాపు 24 గంటల వరకు ఆచూకీ కనుక్కోలేని ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం. మీడియాలో రకరకాల కథనాలు, ఊహాగానాలూ వెలువడుతున్నా ప్రభుత్వ పరంగా సకాలంలో సరైన సమాచారం ప్రజలకు లభించకపోవడం.

3) పావలా వడ్డీ రుణాలు, వృద్ధాప్య ఫించన్లు, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, బిసి స్కాలర్‌షిప్‌లు మొదలైనవన్నీ ఎక్కడ ఆగిపోతాయో అన్న ఆందోళన. అవన్నీ ఆగవనీ, వాటిని అమలు చేసేది ఒక వ్యక్తి కాదనీ, ప్రభుత్వమనీ వందేళ్ల చరిత్ర వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అవగాహన కలిగించలేకపోవడం.

4) స్వాతంత్య్రం వచ్చి 62 సంవత్సరాలు అవుతున్నా ప్రజల కనీస/ప్రాథమిక సమస్యలు కూడా తీరకపోవడం. ప్రతి చిన్న విషయానికీ రాజకీయ నాయకుల దయాధర్మాల మీద ఆధారపడే దుస్థితిలో వుండటం. వారికి రాజ్యాంగం గురించి గానీ, ప్రజాస్వామిక హక్కుల గురించి గానీ కనీస అవగాహన కూడా లేకపోవడం. నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం.

5) కమ్యూనిస్టు దేశాలలో మాదిరగా మన ప్రజాస్వామిక దేశంలో కూడా పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా వ్యక్తిపూజ పెరగడం.

''దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌'' అన్నాడు మహాకవి గురజాడ ఆనాడు. ఆ మనుషులు దుర్బల మనస్కులైతే దేశమేగతి బాగుపడునోయ్‌ అనవలసి వస్తోంది ఈనాడు.

16 comments:

  1. well said. btw why you disabled copy paste in comment field.are u aware of it?

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Thank you for important information. Please keep posting these kind of Educating articles.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. @ Crisis-dharma
    Thank you. No I am not aware of copy paste in comment field. I don't know how to insert it. Can you please explain.

    @ Malakpet Rowdy, @ Naren
    Thank you

    ReplyDelete
  6. ప్రభాకర్ మందార గారు, చాలా తక్కువమంది ఆలోచించే కోణాన్ని ఆవిష్కరించారు. అవును నిస్సందేహంగా ఈ దారుణ మరణాలకు నైతిక బాధ్యత మీడియానే వహించాలి. టివిల్లో అవే విషాధ వార్తలు మళ్లీ మళ్లీ చూస్తూ ఇక జీవితం అంటూ ఏమీ లేదనే దుర్భలత్వం ఆవహించి చనిపోయిన వారెంతో మంది ఉన్నారు. "తట్టుకోలేని వారు ఆ వార్తలకు దూరంగా ఉండొచ్చు కదా" అని కొందరు వాదించొచ్చు. రెండు రోజుల పాటు అటు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లని నిలిపేసి, బయట కర్ఫ్యూ వాతావరణం ఉండీ, అదీగాక ఎంతో కొంత దివంగత నాయకునిపై అభిమానం కలిగిన వారు తట్టుకోలేమనుకున్నా నిభాయించులేక ఆ విషాదంతో గుండెల్లో చిచ్చుపెట్టుకున్నారు. ఒక్కటి మాత్రం చెప్పగలను.. రాజశేఖర్ రెడ్డి మిస్ అయిన క్షణం నుండి నిన్నటి సాయంత్రం అంత్యక్రియలు జరిగేవరకూ అదేపనిగా టివిలకు అతుక్కుని కూర్చుంటే మాత్రం ఎంత ఆరోగ్యవంతులైనా మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. అది మీడియా గుర్తెరగాలి.

    ReplyDelete
  7. మరణాల సంఖ్య ని వెల్లడించటం లో కూడ మీడియా అతి చేసింది అనిపిస్తున్నది. మరణ వార్త వెలువడిన రోజు 15, 29, 29 అంటూ వివిధ పత్రికలు సంఖ్యలు ఇచ్చాయి. మరుసటి రొజుకి 150, 200, 300 అంటూ వచ్చింది. మరణించిన తర్వాతి రోజుకి కూడా షాక్ తో జనాలు చనిపొతారా

    ఆంధ్రా లో రోజుకి ఎంతమంది చనిపొయేవాళ్ళుంటారు. ఆందరూ YS మీద బెంగ తొ చనిపొతారా.

    మొదట కొంతమంది పించన్లు వగైరా రావేమో అని, షాక్ తోనో చనిపోయుండొచ్చు. కొంతమంది వీరాభిమానులు ఆత్మహత్యలకు పాల్పడి వుండొచ్చు. వ్యక్తి పూజ ఎక్కువ వుండే సమాజం లొ ఇది విచిత్రం కాదు. అలాంటి ఒకటి రెండు వార్తలను పట్టుకొని మిగిలిన వాటిని కూడా వీటితో కలిపి అతి చేస్తున్నారు .

    మీడియా అంతా ఒక్కసారిగా అనుకూలంగా మారిపొవటం కూడా దీనికి ఒక కారణం.

    ReplyDelete
  8. @ నల్లమోతు శ్రీధర్ గారూ,
    నా ఆలోచనలకు మద్దతుగా చక్కని విశ్లేషణను జోడించి ఈ టపాను మరింత అర్థవంతం చేశారు. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

    @ చదువరి గారూ
    కృతఙ్ఞతలు.

    @ Anonymous గారూ
    మీరన్నట్టు వార్తా ప్రసారంలోనే కాకుండా .మరణాల సంఖ్యను వెల్లడించడం లో కూడా మీడియా అతి చేసి వుండవచ్చు.
    హైదరాబాద్ లో ఎంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం ను కూడా మీడియా పట్టించుకోలేదు. సామాన్య ప్రజల మనసులపై పడే ప్రభావాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఎవరో మంత్రించి నట్టు అన్ని చానళ్ళూ ఒకే రకంగా వ్యవహరించాయి. మీడియా నిజంగా మూడు రోజులూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

    ReplyDelete
  9. కేవలం మీడియాని తిట్టడం ఎందుకు? రాజశేఖర రెడ్డి చనిపోయాడు కనుక తమకి ఫించన్ రాదని కొంత మంది, స్వయం ఉపాధి లోన్ రాదని కొంత మంది ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళు, ఇప్పుడు కొంచెం మెరుగ్గా పనులు చేసే ముఖ్యమంత్రి చనిపోయాడు, తమకి కావలసినవి రావు అని కంఫర్మ్ చేసుకుని చనిపోయారు. పరిస్థితులది తప్పైతే మీడియాని తిట్టడం ఎందుకు?

    ReplyDelete
  10. మీరు బాగా రాశారు. మీడియా వాళ్ల మీద ఎలా చర్యలు తీసుకోవాలి? లేక పోతె మనం టపాలు రాసుకోవటం తప్ప వారి బారి నుంచి ప్రజలను ఎలా రక్షించగలం?

    *ప్రతి చిన్న విషయానికీ రాజకీయ నాయకుల దయాధర్మాల మీద ఆధారపడే దుస్థితిలో వుండటం.*
    నేను రాసే కామేంట్ ఈ టపాకు సంబందం లేక పొయినా కొన్ని బ్లాగులో కొంతమంది ఎక్కడ దేవాలయాలలో ఏ స్కాం జరిగినా చాలా మంది ఆ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చెసుకోవాలి అని రాస్తూంటారు. వారు ప్రజలకు ప్రభుత్వం అంటె చాలా నిజాయితి, పారదర్శకత ఉన్నట్టు బ్రమలను కల్పిస్తారు. ప్రభుత్వం దేవాలయాల నిర్వహన స్వాధీనం చేసుకుంటె అంతా సవ్యంగా జరుగుతుందని అదే సొల్యుషన్ అని చాలా గొప్ప గా పనీ పాటా లేని హేతువాద మేధావులు ఆస్తుంటారు. అది చాలా తప్పు. రాను రాను మనం ప్రతి ఒక్క ముఖ్యమైన రంగాలను బడి,గుడి,పెళ్లి(సాముహిక వివాహాలు) ప్రతి ఒక్క దానిని ప్రభుత్వం చేతిలో పేడుతునం. ప్రభుత్వమంటె రాజకీయ నాయకులే కదా మరి. వారు ప్రతి దానిని సొమ్ము చేసు కుంట్టున్నారు. వారిని బ్లాక్ మైల్ చేస్తు మీడియా పేరు తో బిసినెస్ హౌసెస్ వాళ్ళు తయారైయ్యరు. This has become a vicious circle. కనీసం ఇక నుంచి మనకు ఎమైనా అన్యాయాలు జరిగితె ప్రభుత్వం జోక్యం లేకుండా పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించు కోవాలి.

    ReplyDelete
  11. @ ప్రవీణ్ శర్మ గారూ
    ఇందులో మీడియాని తిట్టడం ఎక్కడుంది?
    మీడియా చేసిన అతి ... దుర్బల మనస్కులు, అప్పటికే గుండె జబ్బులూ, హై బీపీలు వున్నా వాళ్ళ మీద దుష్ప్రభావం చూపింది అనడం లో వాస్తవం లేదంటారా.?
    9/11 సంఘటనలో వేలాదిమంది శరీరాలు చితికి చిద్రమైనా అమెరికా మీడియా వాటిని పదే పదే చూపి బెమ్బెలేత్తించ లేదని విన్నాను. మన మీడియా మాత్రం భయానక దృశ్యాలను చూపించడమే కాదు ఒకటే వివరిస్తూ పోయింది. సున్నిత మనస్కులు ఠారెత్తి పోరా మరి. టీవీలకు అతుక్కు పోయి సస్పెన్సు తో 24 గంటలు, ఒకే వార్త తో రెండు రోజులు గడిపిన తరువాత జనం మానసిక పరిస్థితి మామూలుగా ఎలా వుంటుంది? గణేష్ నిమజ్జనం తో సహా రెండ్రోజుల పాటు ప్రపంచం లో ఏం జరుగుతుందో తెలియకుండా పోవడం మనసును హిప్న టైస్ చేయదా? మాస్ సైకాలజీ ప్రజ్వరిల్లదా?

    మీరే చూడండి "గతం లో ముఖ్యమంత్రులుగా పని చేసిన వాళ్ళంతా చేతకాని వాళ్ళు" అనేంత దూరం వెళ్లి పోయారు. ఇదీ మాస్ సైకాలజీ ప్రభావం.
    ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మీడియా తప్పకుండా సంయమనం తో వ్యవహరించాలి. మిగతా అన్ని వార్తలను సస్పెండ్ చేయాల్సిన అవసరం వుందా, హిందీ ఇంగ్లీష్ వార్తా చానెళ్ళ తో సహా మిగతా తెలుగు ఎంటర్తైన్మెంట్ చానళ్ళ ప్రసారాలు నిలిపి వేసి ప్రజలంతా ఈ ఒక్క వార్తెకే అంకితం అయ్యేట్టు చేయడం సబబేనా కూలంకషంగా ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వం మీడియా కొన్ని గైడ్ లైన్లను రూపొందించుకుంటే మంచిదని నా అభిప్రాయం.
    గాలిలో కలసిన వందలాది ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలను ఎవరు ఒదారుస్తారు,? వారికి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? చెప్పండి.

    @ అనానిమస్ గారూ
    ధన్యవాదాలు.
    >>>నేను రాసే కామేంట్ ఈ టపాకు సంబందం లేక పొయినా,,, అని మీరే అన్నారు కాబట్టి ఆ విషయాన్ని మరెప్పుడైనా చర్చించు కుంటే బాగుంటుంది.

    ReplyDelete
  12. State (రాజ్యం) లేకపోతే మనం చెయ్యగలిగేది ఏమీ ఉండదు అని లెనిన్ అన్నాడు. ఆర్థిక అసమానతలు ఉన్న సమాజంలో అన్ని సమస్యలూ ప్రజలు తమంత తాముగా పరిష్కరించుకోలేరు కాబట్టే నాయకులని నమ్ముతున్నారు. అంతే కానీ నాయకులు దేవుళ్ళనో, ఆకాశం నుంచి ఊడి పడ్డారనో జనం అనుకోవడం లేదు.

    ReplyDelete
  13. సైకియాట్రిస్టుల వివరణ ప్రకారం టివి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకునే అవకాశం లేదు. సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న భయంతో ఆ పథకాల వల్ల ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు.

    ReplyDelete
  14. dearfriend I have read ur article just now. i was impressed very much. mee vishleshana arati pandu olichi notlo pettinanta baaga undi. nijame media valla pabbam gadupukovadaniki maatrame untadi. madyana pichi prajaale balavutunnaru. mee article choosaina kondaraina maraali. untanu, mee bhasker.
    ps. hats off to u once again for such marvelous n eye opening arcle n hope many such from ur ready n mighty pen.

    ReplyDelete