Sunday, June 19, 2022

Mulkraj Anands First Novel Untouchable Gandhijis Influence

 

 

ముల్క్ రాజ్‌ ఆనంద్‌ తొలి నవల అన్‌టచబుల్‌- గాంధీజీ ప్రభావం

అంటరానితనం హిందూమతానికి ఒక మాయని మచ్చగా భావించేవారు గాంధీజీ. భారత దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలంటే నిమ్నకులాలూ అగ్రకులాలూ అన్న తేడా లేకుండా హిందువులందరినీ ఏకం చేయడం, ముస్లింలకూ హిందువులకూ మధ్య సామరస్యాన్నీ, సహోదరభావాన్నీ పెంపొందించడం చాలా అవసరమని బలంగా నమ్మేవారు. ఈ దృష్ట్యానే ఆయన స్వాతంత్య్రోద్యమానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో అంటరానితనం నిర్మూలనకూ, హిందూ ముస్లిం ఐక్యతకూ అంతటి ప్రాధాన్యత నిచ్చారు.

విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలుగా...ఐదువందలకు పైబడిన సంస్థానాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఒకవిధంగా దుర్బలస్థితిలో వున్న ఆనాటి భారతావనిని గాంధీజీ ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశారు. సత్యాగ్రహం, శాంతి, అహింసలనే తన ఆయుధాలుగా మలచుకున్నారు. పంచములుగా పరిగణించబడుతూ దారుణమైన వివక్షను ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు. వారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించడం, అన్ని రకాల వృత్తుల పట్ల - ముఖ్యంగా పారిశుధ్య పనులపట్ల శ్రమ గౌరవాన్నిపెంపొందించడం,’ ‘ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌ ` సబ్‌కో సన్మతి దే భగవాన్‌అంటూ మతసామరస్య భక్తిభావనను ప్రచారం చేయడం వంటి అనేక కార్యక్రమాలను భారత స్వాతంత్య్రోద్యమంతో జోడిరచి మరీ ముందుకు తీసుకెళ్లారు.

           గాంధీజీ ప్రబోధాలూ, వినూత్నమైన ఆయన ఆలోచనలూ, కార్యాచరణా దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అలా ప్రభావితమైన వారిలో ప్రముఖ రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ (1905-2004) ఒకరు. ఆయన ఇంగ్లీషులో కథలూ కవితలూ రాసేవారు. ఆ రచనలలో ఎక్కువగా సామాన్య ప్రజల జీవితం ప్రతిబింబిస్తుండేది.

గాంధీయిజం పట్ల ఆయనకి విశేషమైన అభిమానం వుండేది. ముఖ్యంగా హిందూ సమాజం నుంచి అంటరానితనం అనే రుగ్మతను పారదోలేందుకు మహాత్ముడు చేస్తున్న కృషి బాగా ఆకట్టుకునేది. అందుకే ఆయన తన తొలి నవలకు అంటరానితనాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. తన సొంత పిన్నికి ఎదురైన ఒక చేదు అనుభవం కూడా ఈ అంశంపై దృష్టి సారించేట్టు చేసింది. అభ్యుదయ భావాలున్న ఆమె ఒకరోజు ఓ ముస్లిం మహిళతో కలసి సహపంక్తి భోజనం చేస్తుంది. దానిని ఆనాటి ఛాందస సమాజం ఘోరమైన నేరంగా పరిగణిస్తుంది. సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమెను మైలపడినట్టు, అంటరానిదైపోయినట్టు బహిష్కరణకు గురిచేస్తారు. అప్పుడామె పడ్డ క్షోభ ఇంతాఅంతా కాదు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ లేని అమానుషమైన అంటరానితనం అనే జబ్బు గురించి, దుర్మార్గమైన కుల వ్యవస్థ గురించి ఏదో ఒకటి రాయకుండా వుండలేని పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి తోడు అంటరానితనం గురించి తన చిన్నప్పటి ఒక అనుభవాన్ని వివరిస్తూ 'యంగ్‌ ఇండియా' పత్రికలో గాంధీజీ రాసిన ఒక వ్యాసం ఆయనను బాగా కదిలిస్తుంది.

గాంధీజీ ఇంట్లో ఊకాఅనే కుర్రవాడు మరుగుదొడ్లు శుభ్రపరిచే పని చేస్తుండేవాడు. అతనితో మాట్లాడినా, పొరపాటున అతడిని తాకినా తల్లిదండ్రులు గట్టిగా మందలించేవారు. మైలపడిపోయినట్టు ప్రాయశ్చితం చేయించేవారు. తమ మరుగుదొడ్లను శుభ్రంచేస్తూ తమకు ఎంతో ఉపకారం చేస్తున్న వ్యక్తితో మాట్లాడితే, అతనిని తాకితే తప్పేమిటో బాలగాంధీకి అర్థమయ్యేది కాదు. ఆ విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో ఘర్షణ పడేవాడు. గాంధీజీ చెప్పిన ఈ ఉదంతం అందులోని ఊకాపాత్రే అన్‌టచబుల్‌ నవలలో ప్రధాన పాత్ర బాఖాకు జీవం పోసింది. నవల రాస్తున్నకాలంలో ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తుండేవారు. తను రాస్తున్న నవల గురించి గాంధీజీకి ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వివరిస్తూ ఆయన సలహాలు తీసుకునేవారు.

అన్‌టచబుల్‌రచన పూర్తయినప్పటికీ గాంధీజీ పలు సూచనలు చేయడంతో ప్రచురణకు వెళ్లకుండా దానిని తిరగరాయాలని నిర్ణయించుకుంటారు. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశం వచ్చాక నేరుగా అహ్మదాబాద్‌లో వున్న గాంధీజీని కలుసుకుంటారు. ఆయన సూచనలకు అనుగుణంగా తన నవలను తిరగరాయాలనుకుంటున్నట్టు చెప్తారు. అందుకుగాను  కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో వుండేందుకు అనుమతి కోరతారు. అందుకు గాంధీజీ అంగీకరించడంతో దాదాపు మూడు నెలల పాటు సబర్మతి ఆశ్రమంలో వుంటారు. ఆశ్రమ నియమాల ప్రకారం ప్రతి రోజూ ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు కడగడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేస్తూ గాంధీజీ ఆదర్శాల ఆచరణను చవిచూస్తారు. 

అయితే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ పట్ల వున్నది గుడ్డి అభిమానం కాదు. ఆయన ప్రధానంగా సోషలిస్టు, నాస్తికుడు. గాంధీజీతో పలు అంశాలలో బేధాభిప్రాయాలు కూడా వుండేవి. అదేసమయంలో మహత్తరమైన ఆయన ఆశయాలను, ఆదర్శాలను, కృషిని ఆరాధించేవారు. అహ్మదాబాద్‌లో తొలిసారి గాంధీజీని ప్రత్యక్షంగా కలిసిన తరువాత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ గాంధీజీతో ఒకరోజుఅన్న శీర్షికతో తమ మధ్య జరిగిన సంభాషణని ముఖాముఖిగా రాశారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సంపాదకత్వంలో 1968లో వెలువడిన ఒక పుస్తకంలో ఆ ముఖాముఖి చోటుచేసుకుంది. విజయవాడ అన్నపూర్ణ పబ్లికేషన్స్‌ వారు గాంధీ మహాత్ముడు నూరేళ్లుఅనే పేరుతో దీనిని 1970లో  తెలుగులో ప్రచురించారు. కాగా పొత్తూరు పుల్లయ్య తెలుగు అనువాదం చేశారు.

           అందులో ఒక చోట గాంధీజీ అస్పృశ్యులు అన్న పదాన్ని వాడకుండా వారిని మేం హరిజనులుఅంటాంఅని అభ్యంతరం చెప్పినప్పుడు ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం. కానీ మన సమాజం వారికి అలాంటి స్థానం ఏమీ ఇవ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా నాకు భగవంతుడి మీద విశ్వాసంలేదుఅని నిర్ద్వంద్వంగా చెప్తారు. అంటే మీరు హిందువులు కాదన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానించగా కాదు. కులవ్యవస్థను సమర్థించే... సహించే మతం మీద నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు కుల వ్యవస్థకు స్థానంలేని క్రైస్తవ మతం స్వీకరిద్దామనుకున్నాను కానీ ఆ మతాన్ని అనుసరించాలన్నా కూడా భగవంతుడి మీద విశ్వాసం వుండాలి కదా అని మానేశానుఅంటారు ముల్క్‌ రాజ్‌. అయితే మీకు నాస్తికుడిని అనిపించుకోవడమే ఇష్టమన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానిస్తే లేదు నేను సోషలిస్టునిఅని అంటారు ముల్క్‌రాజ్‌.

 

 కుల వ్యవస్థను హిందూమతం సమర్థించడంలేదు, సహించడం అంతకన్నా లేదు. కొందరు సనాతనపరాయణులైన హిందువులు కింది కులాల పట్ల వివక్ష చూపుతారు, కానీ సజ్జనులైన హిందువులు మాత్రం ఎన్నడూ వివక్షను ప్రదర్శించరుఅని గాంధీజీ వివరించబోతే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌  మీరు హిందూ మతం పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదిక. ఈ విషయాన్ని మీరు గుర్తించడంలేదుఅని నిర్మొహమాటంగా అంటారు. హిందూ మతానికి కుల వ్యవస్థ ప్రాతిపదిక అయినట్టయితే అలాంటి హిందూమతంతో నాకు సంబంధంలేదుఅని గాంధీజీ అంటారు. అయినా ముల్క్‌రాజ్‌ నేను మాత్రం హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదికని నమ్ముతాను, అందుకే కుల వ్యవస్థకు నిరసనగా ఈ నవల రాశానుఅని నిర్మొహమాటంగా  సమాధానం ఇస్తారు.

     ఈ నవలను ఇంగ్లీషులో రాయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయేమో తప్ప దీనిని సామాన్య ప్రజలు  ఎలా చదివి ఆనందించగలరు?’ అని గాంధీజీ అన్నప్పుడు నేను పంజాబీలో రాస్తే ముద్రించడానికి ఒక్క ప్రచురణకర్త కూడా ముందుకురారు, అందుకే విధి లేక ఇంగ్లీష్‌లో రాస్తున్నాను, అయితే కొందరు భారతదేశంలోని లోపాలను బయటి ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నానంటూ తనని విమర్శిస్తున్నారనివాపోతారు. అప్పుడు గాంధీజీ  ఎవరికి వీలయిన భాషలో వారు రాయడం తప్పుకాదు, ఎవరికి బాధ కలిగించినా లెక్కచేయకుండా సత్యాన్ని చాటిచెప్పాల్సిందే. ఎవరికి నొప్పి కలిగించినా సత్యం సత్యమే అవుతుందిఅంటారు. ఈవిధంగా కొన్ని అంశాలలో విభేదాలు వున్నప్పటికీ ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ ఆలోచనల పట్ల అపారమైన అభిమానం వుండేది.

            సబర్మతి ఆశ్రమంలో సమయం దొరికినప్పుడల్లా తను ఎడిట్‌ చేస్తున్న 'అన్‌టచబుల్‌' నవలను గాంధీజీకి వినిపించేవారు. మన సమాజంనుంచి ఏ రుగ్మతనైతే తాను సమూలంగా నిర్మూలించాలనుకుంటున్నారో ఆ రుగ్మతపై రాసిన రచన కాబట్టి గాంధీజీని అది చాలా ఆకట్టుకుంటుంది. అయితే నవల మధ్యలో కథానాయకుడు బాఖా ప్రేమలో పడటం వంటి సంఘటనలు వుండటం వల్ల అసలు సమస్య అయిన అంటరానితనం పక్కదారి పట్టినట్టు అనిపిస్తోందంటూ పలు సూచనలు చేస్తారు గాంధీజీ. ఆయన సూచనలతో ఏకీభవించిన ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ సబర్మతీ ఆశ్రమంలోనే తన నవలను పూర్తిగా తిరగ రాస్తారు. మొదట మూడు వందల పేజీలకు పైగా వచ్చిన నవల చివరకు 148 పేజీలకు తగ్గిపోతుంది. అయితే రాశి తగ్గినా వాసి పెరిగి అంటరానితనం సమస్యను మరింత బలంగా ప్రొజెక్ట్‌ చేస్తుంది. 1935లో మొదటి ముద్రణ వెలువడ్డ తర్వాత దేశ విదేశాలలో అన్‌టచబుల్‌ పెద్ద సంచలనాన్నే సృష్టించింది. 

(ఆంధ్ర ప్రభ 12 జూన్ 2022)

            ఎ పాసేజ్‌ టు ఇండియావంటి రచనలు చేసిన సుప్రసిద్ధ రచయిత ఇ. ఎం.ఫోర్‌స్టర్‌ (1879-1970)  ముల్ క్ రాజ్ ఆనంద్ రాసిన  అన్ టచ్ బుల్ నవల  కు ముందు రాశారు. ఎంత సానుభూతి వున్నప్పటికీ మరే యురోపియన్‌ రచయితా, చివరకు ఒక అస్పశ్యుడు కూడా ఇలాంటి పుస్తకాన్ని రాయలేడు...  బాఖా లాంటి పాత్రను సృష్టించలేడుఅంటూ ప్రశంసించి ఇంకా ఇలా అన్నారాయన - క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచీ ఇండియన్‌ రెజిమెంట్‌లో అంటరానివాళ్ల పిల్లలతో కలసి ఆడుకోవడం, వారి స్థితిగతులను లోతుగా అర్థంచేసుకోవడం, మంచి దృక్పథాన్ని కలిగివుండటం వల్లనే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఈ పుస్తకాన్ని రాయగలిగారుఅన్నారు. అంటరానివాళ్లది బానిసలకంటే దుర్భరమైన స్థితి. ఎందుకంటే ఒక బానిస ఎప్పుడైనా తన యజమాని నుంచి బయటపడవచ్చు, తను చేసే పని నుంచి బయటపడవచ్చు. చివరికి స్వేచ్ఛా మానవుడిగా కూడా మారిపోవచ్చు. కానీ అంటరానివ్యక్తిది బానిసకంటే హీనమైన పరిస్థితి. అంటరానివాడుగా అతనిపై మతం వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగేది కాదు. జీవితాంతం ఆమాటకొస్తే తరతరాలుగా అతని సంతతి అంతా అంటరానివాళ్లుగా పరిగణించబడుతూ వుండవలసిందే.

ఉత్తర భారత దేశంలోని బులాషా అనే పట్టణంలో సాగుతుందీ నవల. ఇంకా సూటిగా చెప్పాలంటే అక్కడి వెలివాడలో నివసించే బాఖా అనే ఓ పందొమ్మిదేళ్ల పారిశుధ్య పనివాడి జీవితం చుట్టూ తిరుగుతుంది. కేవలం ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాఖాకి ఎదురైన అవమానకరమై, అమానుషమైన, వివక్షాపూరితమైన సంఘటనల సమాహారమే ఈ నవల. అయితే ఇది కేవలం బులాషా పట్టణానికో, బాఖా అనే యువకుడికో సంబంధించినది మాత్రమే కాదు. భారతదేశంలోని ప్రతి పట్టణంలోనూ, అంటరానివారిగా పరిగణించబడే ప్రతి వ్యక్తి జీవితంలోనూ మనకు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి.

నిజానికి ఉత్తర భారతంలో బులాషా అనే పట్టణమే లేదు. అది కేవలం ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఊహాజనితం. ఆయనకు సమకాలికుడూ, ఇండియన్‌ ట్రయోలజీలో ఒకరైన మరో సుప్రసిద్ధ రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ సృష్టించిన మాల్గుడిలాంటి పట్టణమది. అనేక వెలివాడలను స్వయంగా పరిశీలించి, పరితపించి ఎంతో వాస్తవికతతో సృష్టించినది కాబట్టే ఆ పట్టణం, ఆ వెలివాడ మన పక్కనే వున్నట్టు, మనకు ఎంతో సుపరిచితమైనట్టు అనిపిస్తుంది.

ఊరికి దూరంగా కంటోన్మెంట్‌ పక్కన వెలివేసినట్టుంటుంది ఆ వాడ. అక్కడ హిందూ సమాజంలోని అట్టడుగు బహిష్కృత జనం నివసిస్తుంటారు. మట్టితో కట్టిన పూరి గుడిసెలు రెండు వరుసల్లో వుంటాయి. పక్కనే ఓ మురికి కాలువ ప్రవహిస్తుంటుంది. కాలువ గట్టున వివిధ జంతువుల కళేబరాలు, ఆరబెట్టిన జంతు చర్మాలు, గాడిదలు, గుర్రాలు, పశువుల, మనుషుల విసర్జితాలు, చెత్తా చెదారంతో పప్పుడూ చిత్తడి చిత్తడిగా దుర్గంధపూరితంగా వుంటుంది. నిజానికి కేవలం బులాషాలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలోని వెలివాడలన్నింటి పరిస్థితీ ఇంతేకదా.

ఆ పట్టణంలో లాఖా అనే అతను అక్కడి పారిశుద్ధ కార్మికుల, స్వీపర్ల జమేదార్‌. అతనికి ముగ్గురు పిల్లలు. బాఖా, సోహిని, రాఖా. భార్య అర్థంతరంగా చనిపోవడంతో అతనిలో నిర్లిప్తత, బద్ధకం చోటు చేసుకుంటాయి. తను చేయాల్సిన పనులన్నింటినీ పెద్దకొడుకైన బాఖా మీద వేస్తుంటాడు. బాఖా వయసు పందొమ్మిదేళ్లు. అతను కొంతకాలం దగ్గరలోని రెజిమెంట్‌లో పనిచేశాడు. టామీస్‌గా వ్యవహరించబడే బ్రిటిష్‌ సైనిక సిబ్బంది అక్కడ బాఖాని సాటి మనిషిలా చూసేవాళ్లు. అసలు అంటరానితనం అనే జాఢ్యమే అక్కడ కనిపించేదికాదు. బాఖాకు తాను కూడా టామీస్‌లా మంచి దుస్తులు ధరించాలని, గౌరవప్రదమైన జీవనం గడపాలని వుంటుంది. కానీ తండ్రి ఒత్తిడి అతను వల్ల కంటోన్మెంట్‌ వెలుపల పారిశుధ్యపనులు చేస్తూ అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది.

ప్రొద్దున్నే తండ్రి తిట్లదండకంతో బాఖా దినచర్య మొదలవుతుంది. అగ్రవర్ణాల ఇళ్లల్లో మరుగుదొడ్లను శుభ్రంచేసే పనికి అసహనంగానే బయలుదేరతాడు. దారిలో పొరపాటున ఒక అగ్రవర్ణస్తుడిని తాకడంతో అతను బాఖా చెంపఛెళ్లు మనిపిస్తాడు. తనని మైలపరిచావు ఇప్పుడు మళ్లీ ఇంటికి వెళ్లి స్నానం చేయాలని అని కసురుకుంటూ  చెడామడా తిడతాడు. ఆ అవమాన భారంతోనే కొన్ని ఇళ్లలో మరుగుదొడ్లను శుభ్రం చేసి తిరిగి వస్తూ అలసటగా ఒక ఇంటి ముందు కూర్చుంటే. ఆ ఇంటి ఆవిడ గబగబా బయటికి వచ్చి తమ వాకిలిని మైలపరిచావంటూ విరుచుకుపడుతుంది. ఇలా అడుగడుగునా అవమానాలే ఎదురవుతుంటాయి. మలాన్ని ఎత్తిపోసి, శుభ్రం చేసి బాగా అలసిపోతాడు. దాహం వేస్తుంటే ఎవరూ గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వరు. ఇంటికి వస్తే ఇంట్లో అన్నీ ఖాళీ కుండలే వుంటాయి. అతని చెల్లెలు ఇప్పుడే నీళ్లు తెస్తాను వుండన్నయ్యా అంటూ కుండ తీసుకుని ఊరి బావి వద్దకు పరిగెడుతుంది. అక్కడ అంటరానివాళ్లంతా క్యూ కట్టి పరస్పరం దెబ్బలాడుకుంటుంటారు. బావిలోంచి వాళ్లు నేరుగా నీళ్లు తోడుకునేందుకు వీలులేదు. ఎందుకంటే వాళ్లు ముట్టుకుంటే బావి మైలపడిపోతుందట. అగ్రకులస్తులు ఎవరైనా వచ్చి దయతలిచి నీళ్లు తోడిపోసే వరకు దళిత వర్గాలవారు దూరంగా ఎదురుచూస్తూ నిలబడివుండాల్సిందే. సోహిని చేసేదేంలేక మౌనంగా క్యూలో నించుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడి గుడి పూజారి పండిత్‌ కాళీనాథ్‌ వస్తాడు. అతని కన్ను సోహినిపై పడుతుంది. ఆమెను ముందుకు రమ్మని పిలిచి నీళ్లు తోడిపోసి అందుకు ప్రతిగా గుడిలో ఊడ్చేపని వుంది వెంటనే గుడికి రమ్మంటాడు. అన్నయ్యకు నీళ్లిచ్చి వస్తానని చెప్పి వెళ్తుంది సోహిని.

            బాఖా తనకు ఉదయం నుంచి జరిగిన అవమానాలను ఏకరువుపెట్టి ఇకనుంచి లెట్రిన్లు కడిగే పనికి వెళ్లనని తండ్రితో వాదులాటకు దిగుతాడు. అగ్రవర్ణాల వాళ్లందరూ ఒకేలా వుండరనీ, వాళ్లలో కూడా మంచివారు వుంటారని నచ్చచెప్తాడు లాఖా. చిన్నతనంలో చావు బతుకుల్లో వున్న బాఖాని ఒక అగ్రవర్ణ డాక్టరే పైసా తీసుకోకుండా చికిత్సచేసి మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడిన సంఘటనను గుర్తు చేస్తాడు. అంతలో బాఖా అంటూ హవల్దార్‌ చరత్‌ సింగ్‌ పిలుపు వినిపిస్తుంది. కంటోన్మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఆయన బాఖాకు బాగా సుపరిచితుడు. తమ లెట్రిన్‌ని అర్జంట్‌గా శుభ్రం చేయాలని పురమాయిస్తే వాళ్లింటికి వెళ్తాడు. అగ్రవర్ణాలలో కూడా మంచివాళ్లుంటారనేందుకు మరో ఉదాహరణ హవల్దార్‌ చరత్‌సింగ్‌. ఆయన హాకీ క్రీడాకారుడు. బాఖాని అందరిలా అంటరానివాడుగా కాకుండా సాటి మనిషిలా చూస్తాడు. వాళ్లింట్లో దేనినైనా ముట్టుకోవచ్చు. మైలపడిపోవడం అనేది వుండదు. బాఖా పనితీరుకు సంతోషించి అతనికి సరికొత్త హాకీ స్టిక్‌ని బహుమతిగా ఇస్తాడు.

           అక్కడి నుంచి ఇంటికి వస్తుంటే గుడిలో పూజారి పండిత్‌ కాళీనాథ్‌ తన చెల్లెలు సోహినీతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటం, సోహినీ గట్టిగా కేకలుపెడుతుండటం కంటపడుతుంది. పట్టరాని కోపంతో పండిత్‌ కాళీనాథ్‌పై దాడిచేయబోతాడు. సోహినీయే బాఖాను ఆపుతుంది. తప్పు పూజారిదైనా జనమంతా తమనే తప్పు పడతారు, తమ మాటని ఎవరూ పట్టించుకోరు అని ఆమెకు తెలుసు. ఈ అంటరానిపిల్ల తనని మైలపరిచిందిఅంటూ పూజారి అప్పటికే  అరుస్తుంటాడు. బాఖా నిస్సహాయంగా పళ్లు కొరుక్కుంటూ చెల్లెలిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు.

            తరువాత హవల్దార్‌ చరత్‌సింగ్‌ ఇచ్చిన హాకీ స్టిక్‌ పట్టుకుని గ్రౌండ్‌కి  వెళ్తాడు. హాకీ ఆటలో అందరికంటే ఎక్కువ గోల్స్‌ చేస్తాడు. అగ్రవర్ణ పిల్లలు ఈర్ష్యపడతారు. ఇరువర్గాల మధ్య గొడవ అవుతుంది. ఒక అగ్రవర్ణ బాలుడికి దెబ్బతగిలితే బాఖానే అతడిని ఇంటికి తీసుకెళ్లి దిగబెడతాడు. అది చూసి వాళ్ల అమ్మ తమ కొడుకును మైలపరిచావుకదరా అంటూ బాఖాని కసురుకుంటుంది. దాంతో మరింత హతాశుడైపోతాడు. తాను పనిచేసే ఇళ్లల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించేందుకు వెళ్లినప్పుడు ఒక ఇల్లాలు రొట్టె ముక్కను దూరం నుంచి కుక్కకు విసిరేసినట్టు విసిరేస్తుంది. కిందపడ్డ ఆ రొట్టెముక్కని చాలా అవమానభారంతో తీసుకుంటాడు. వీధికుక్కల కంటే హీనమైపోయింది తమ బతుకు అని ఆక్రోశిస్తాడు. క్రిస్టియన్‌ సాల్వేషన్‌ ఆర్మీకి చెందిన కర్నల్‌ హచిన్‌సన్‌ బాఖా పరిస్థితిపట్ల జాలి చూపుతూ అతడిని క్రైస్తవమతం స్వీకరించమని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అంటుంటాడు. ఆయన ఎంత అభిమానం కనబరచినా ఆయన భార్య మాత్రం భాఖాను ఇతర అగ్రవర్ణ స్త్రీల మాదిరిగానే చీదరించుకుంటూ వుంటుంది. హే బ్లాకీఅని హేళనగా సంబోధిస్తూ అవమానిస్తుంటుంది. అందుకే కర్నల్‌ హచిన్‌సన్‌ ప్రతిపాదన బాఖాలో ఎలాంటి స్పందన కలిగించదు.

            ఆరోజు సాయంత్రం స్టేషన్‌ వైపు వెళ్లినప్పుడు తమకు దగ్గరలోని గోల్‌బాగ్‌కు మహాత్మా గాంధీ వస్తున్నారన్న వార్త తెలుస్తుంది. బాఖా ఎంతో ఉత్సాహంగా ఆ సభకు వెళ్తాడు. గాంధీజీని చూసి చాలా ఉత్తేజితుడవుతాడు. గాంధీజీ  ఉపన్యాసమంతా అంటరానితనం నిర్మూలన గురించే సాగుతుంది. బాఖా చాలా ఆసక్తిగా వింటాడు. అతని మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. నిజంగానే అగ్రవర్ణాల వైఖరిలో మార్పు వస్తుందా? ఈ అవమానాలు, అసమానతలు, అవహేళనలు అంతరించిపోతాయా? తాము కూడా సమాజంలలో అందరిలా సగౌరవంగా బతికేరోజు నిజంగానే వస్తుందా? --అని ఆలోచిస్తూ సభనుంచి వెనుతిరుగుతాడు. దేశమంతటా త్వరలో ఫ్లష్‌ టాయ్‌లెట్ల విధానం రాబోతోందని అప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కొందరు చర్చించుకోవడం విని నూతనోత్తేజాన్ని పొందుతాడు. సమస్యపై పాఠకులు తమ దృష్టిని కేంద్రీకరించేలాచేసి పరిష్కారాన్ని సమాజానికే వదిలివేస్తాడు రచయిత.

ఈ నవల వెలువడి దాదాపు తొంభై సంవత్సరాలు అవుతున్నా దీనికింకా ప్రాసంగికత వుంది. ఎందుకంటే  అంటరానితనం ఇవాళ ఆనాటి స్థాయిలో లేకపోవచ్చు కానీ ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. మన సమాజంలో గాంధీజీ ఆశించిన మార్పు ఇంకా రావలసేవుంది.

 (ఆంధ్ర ప్రభ 19 జూన్ 2022)

(డా.నాగసూరి వేణుగోపాల్ గారు ఆంద్ర ప్రభ దినపత్రికలో నిర్వహిస్తున్న “గాంధేయం గాండీవం” కాలం కోసం వారి సూచన మేరకు రాసిన సమీక్ష ఇది. వారికీ ఆంద్ర ప్రభ కీ కృతజ్ఞతలు.)

- ప్రభాకర్‌ మందార

 

 

Monday, June 13, 2022

Mulkraj Anand Novel Untouchable 1



ముల్క్ రాజ్ ఆనంద్ తొలి నవల "అన్ టచబుల్" నవల పై 

గాంధీ ప్రభావం అనే అంశం మీద నేను రాసిన సమీక్షా వ్యాసం 

మొదటి భాగం ఆంధ్ర ప్రభ దినపత్రిక 12-6-2022 ఆదివారం సంచిక లో ... 

ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ తొలి నవల అన్‌టచబుల్‌కు  స్ఫూర్తి ఏమిటి?

 

అంటరానితనం హిందూమతానికి ఒక మాయని మచ్చగా భావించేవారు గాంధీజీ. భారత దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలంటే నిమ్నకులాలూ అగ్రకులాలూ అన్న తేడా లేకుండా హిందువులందరినీ ఏకం చేయడం, ముస్లింలకూ హిందువులకూ మధ్య సామరస్యాన్నీ, సహోదరభావాన్నీ పెంపొందించడం చాలా అవసరమని బలంగా నమ్మేవారు. ఈ దృష్ట్యానే ఆయన స్వాతంత్య్రోద్యమానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో అంటరానితనం నిర్మూలనకూ, హిందూ ముస్లిం ఐక్యతకూ అంతటి ప్రాధాన్యత నిచ్చారు.

విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలుగా...ఐదువందలకు పైబడిన సంస్థానాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఒకవిధంగా దుర్బలస్థితిలో వున్న ఆనాటి భారతావనిని గాంధీజీ ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశారు. సత్యాగ్రహం, శాంతి, అహింసలనే తన ఆయుధాలుగా మలచుకున్నారు. పంచములుగా పరిగణించబడుతూ దారుణమైన వివక్షను ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు. వారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించడం, అన్ని రకాల వృత్తుల పట్ల - ముఖ్యంగా పారిశుధ్య పనులపట్ల శ్రమ గౌరవాన్నిపెంపొందించడం,’ ‘ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌ ` సబ్‌కో సన్మతి దే భగవాన్‌అంటూ మతసామరస్య భక్తిభావనను ప్రచారం చేయడం వంటి అనేక కార్యక్రమాలను భారత స్వాతంత్య్రోద్యమంతో జోడిరచి మరీ ముందుకు తీసుకెళ్లారు.

           గాంధీజీ ప్రబోధాలూ, వినూత్నమైన ఆయన ఆలోచనలూ, కార్యాచరణా దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అలా ప్రభావితమైన వారిలో ప్రముఖ రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ (1905-2004) ఒకరు. ఆయన ఇంగ్లీషులో కథలూ కవితలూ రాసేవారు. ఆ రచనలలో ఎక్కువగా సామాన్య ప్రజల జీవితం ప్రతిబింబిస్తుండేది.

గాంధీయిజం పట్ల ఆయనకి విశేషమైన అభిమానం వుండేది. ముఖ్యంగా హిందూ సమాజం నుంచి అంటరానితనం అనే రుగ్మతను పారదోలేందుకు మహాత్ముడు చేస్తున్న కృషి బాగా ఆకట్టుకునేది. అందుకే ఆయన తన తొలి నవలకు అంటరానితనాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. తన సొంత పిన్నికి ఎదురైన ఒక చేదు అనుభవం కూడా ఈ అంశంపై దృష్టి సారించేట్టు చేసింది. అభ్యుదయ భావాలున్న ఆమె ఒకరోజు ఓ ముస్లిం మహిళతో కలసి సహపంక్తి భోజనం చేస్తుంది. దానిని ఆనాటి ఛాందస సమాజం ఘోరమైన నేరంగా పరిగణిస్తుంది. సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమెను మైలపడినట్టు, అంటరానిదైపోయినట్టు బహిష్కరణకు గురిచేస్తారు. అప్పుడామె పడ్డ క్షోభ ఇంతాఅంతా కాదు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ లేని అమానుషమైన అంటరానితనం అనే జబ్బు గురించి, దుర్మార్గమైన కుల వ్యవస్థ గురించి ఏదో ఒకటి రాయకుండా వుండలేని పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి తోడు అంటరానితనం గురించి తన చిన్నప్పటి ఒక అనుభవాన్ని వివరిస్తూ 'యంగ్‌ ఇండియా' పత్రికలో గాంధీజీ రాసిన ఒక వ్యాసం ఆయనను బాగా కదిలిస్తుంది.

గాంధీజీ ఇంట్లో ఊకాఅనే కుర్రవాడు మరుగుదొడ్లు శుభ్రపరిచే పని చేస్తుండేవాడు. అతనితో మాట్లాడినా, పొరపాటున అతడిని తాకినా తల్లిదండ్రులు గట్టిగా మందలించేవారు. మైలపడిపోయినట్టు ప్రాయశ్చితం చేయించేవారు. తమ మరుగుదొడ్లను శుభ్రంచేస్తూ తమకు ఎంతో ఉపకారం చేస్తున్న వ్యక్తితో మాట్లాడితే, అతనిని తాకితే తప్పేమిటో బాలగాంధీకి అర్థమయ్యేది కాదు. ఆ విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో ఘర్షణ పడేవాడు. గాంధీజీ చెప్పిన ఈ ఉదంతం అందులోని ఊకాపాత్రే అన్‌టచబుల్‌ నవలలో ప్రధాన పాత్ర బాఖాకు జీవం పోసింది. నవల రాస్తున్నకాలంలో ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తుండేవారు. తను రాస్తున్న నవల గురించి గాంధీజీకి ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వివరిస్తూ ఆయన సలహాలు తీసుకునేవారు.

అన్‌టచబుల్‌రచన పూర్తయినప్పటికీ గాంధీజీ పలు సూచనలు చేయడంతో ప్రచురణకు వెళ్లకుండా దానిని తిరగరాయాలని నిర్ణయించుకుంటారు. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశం వచ్చాక నేరుగా అహ్మదాబాద్‌లో వున్న గాంధీజీని కలుసుకుంటారు. ఆయన సూచనలకు అనుగుణంగా తన నవలను తిరగరాయాలనుకుంటున్నట్టు చెప్తారు. అందుకుగాను  కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో వుండేందుకు అనుమతి కోరతారు. అందుకు గాంధీజీ అంగీకరించడంతో దాదాపు మూడు నెలల పాటు సబర్మతి ఆశ్రమంలో వుంటారు. ఆశ్రమ నియమాల ప్రకారం ప్రతి రోజూ ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు కడగడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేస్తూ గాంధీజీ ఆదర్శాల ఆచరణను చవిచూస్తారు. 

అయితే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ పట్ల వున్నది గుడ్డి అభిమానం కాదు. ఆయన ప్రధానంగా సోషలిస్టు, నాస్తికుడు. గాంధీజీతో పలు అంశాలలో బేధాభిప్రాయాలు కూడా వుండేవి. అదేసమయంలో మహత్తరమైన ఆయన ఆశయాలను, ఆదర్శాలను, కృషిని ఆరాధించేవారు. అహ్మదాబాద్‌లో తొలిసారి గాంధీజీని ప్రత్యక్షంగా కలిసిన తరువాత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ గాంధీజీతో ఒకరోజుఅన్న శీర్షికతో తమ మధ్య జరిగిన సంభాషణని ముఖాముఖిగా రాశారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సంపాదకత్వంలో 1968లో వెలువడిన ఒక పుస్తకంలో ఆ ముఖాముఖి చోటుచేసుకుంది. విజయవాడ అన్నపూర్ణ పబ్లికేషన్స్‌ వారు గాంధీ మహాత్ముడు నూరేళ్లుఅనే పేరుతో దీనిని 1970లో  తెలుగులో ప్రచురించారు. కాగా పొత్తూరు పుల్లయ్య తెలుగు అనువాదం చేశారు.

           అందులో ఒక చోట గాంధీజీ అస్పృశ్యులు అన్న పదాన్ని వాడకుండా వారిని మేం హరిజనులుఅంటాంఅని అభ్యంతరం చెప్పినప్పుడు ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం. కానీ మన సమాజం వారికి అలాంటి స్థానం ఏమీ ఇవ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా నాకు భగవంతుడి మీద విశ్వాసంలేదుఅని నిర్ద్వంద్వంగా చెప్తారు. అంటే మీరు హిందువులు కాదన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానించగా కాదు. కులవ్యవస్థను సమర్థించే... సహించే మతం మీద నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు కుల వ్యవస్థకు స్థానంలేని క్రైస్తవ మతం స్వీకరిద్దామనుకున్నాను కానీ ఆ మతాన్ని అనుసరించాలన్నా కూడా భగవంతుడి మీద విశ్వాసం వుండాలి కదా అని మానేశానుఅంటారు ముల్క్‌ రాజ్‌. అయితే మీకు నాస్తికుడిని అనిపించుకోవడమే ఇష్టమన్నమాటఅని గాంధీజీ వ్యాఖ్యానిస్తే లేదు నేను సోషలిస్టునిఅని అంటారు ముల్క్‌రాజ్‌.

 

 ‘కుల వ్యవస్థను హిందూమతం సమర్థించడంలేదు, సహించడం అంతకన్నా లేదు. కొందరు సనాతనపరాయణులైన హిందువులు కింది కులాల పట్ల వివక్ష చూపుతారు, కానీ సజ్జనులైన హిందువులు మాత్రం ఎన్నడూ వివక్షను ప్రదర్శించరుఅని గాంధీజీ వివరించబోతే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌  మీరు హిందూ మతం పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదిక. ఈ విషయాన్ని మీరు గుర్తించడంలేదుఅని నిర్మొహమాటంగా అంటారు. హిందూ మతానికి కుల వ్యవస్థ ప్రాతిపదిక అయినట్టయితే అలాంటి హిందూమతంతో నాకు సంబంధంలేదుఅని గాంధీజీ అంటారు. అయినా ముల్క్‌రాజ్‌ నేను మాత్రం హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదికని నమ్ముతాను, అందుకే కుల వ్యవస్థకు నిరసనగా ఈ నవల రాశానుఅని నిర్మొహమాటంగా  సమాధానం ఇస్తారు.

     ‘ఈ నవలను ఇంగ్లీషులో రాయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయేమో తప్ప దీనిని సామాన్య ప్రజలు  ఎలా చదివి ఆనందించగలరు?’ అని గాంధీజీ అన్నప్పుడు నేను పంజాబీలో రాస్తే ముద్రించడానికి ఒక్క ప్రచురణకర్త కూడా ముందుకురారు, అందుకే విధి లేక ఇంగ్లీష్‌లో రాస్తున్నాను, అయితే కొందరు భారతదేశంలోని లోపాలను బయటి ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నానంటూ తనని విమర్శిస్తున్నారనివాపోతారు. అప్పుడు గాంధీజీ  ఎవరికి వీలయిన భాషలో వారు రాయడం తప్పుకాదు, ఎవరికి బాధ కలిగించినా లెక్కచేయకుండా సత్యాన్ని చాటిచెప్పాల్సిందే. ఎవరికి నొప్పి కలిగించినా సత్యం సత్యమే అవుతుందిఅంటారు. ఈవిధంగా కొన్ని అంశాలలో విభేదాలు వున్నప్పటికీ ముల్క్‌రాజ్‌ ఆనంద్‌కు గాంధీజీ ఆలోచనల పట్ల అపారమైన అభిమానం వుండేది.

            సబర్మతి ఆశ్రమంలో సమయం దొరికినప్పుడల్లా తను ఎడిట్‌ చేస్తున్న 'అన్‌టచబుల్‌' నవలను గాంధీజీకి వినిపించేవారు. మన సమాజంనుంచి ఏ రుగ్మతనైతే తాను సమూలంగా నిర్మూలించాలనుకుంటున్నారో ఆ రుగ్మతపై రాసిన రచన కాబట్టి గాంధీజీని అది చాలా ఆకట్టుకుంటుంది. అయితే నవల మధ్యలో కథానాయకుడు బాఖా ప్రేమలో పడటం వంటి సంఘటనలు వుండటం వల్ల అసలు సమస్య అయిన అంటరానితనం పక్కదారి పట్టినట్టు అనిపిస్తోందంటూ పలు సూచనలు చేస్తారు గాంధీజీ. ఆయన సూచనలతో ఏకీభవించిన ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ సబర్మతీ ఆశ్రమంలోనే తన నవలను పూర్తిగా తిరగ రాస్తారు. మొదట మూడు వందల పేజీలకు పైగా వచ్చిన నవల చివరకు 148 పేజీలకు తగ్గిపోతుంది. అయితే రాశి తగ్గినా వాసి పెరిగి అంటరానితనం సమస్యను మరింత బలంగా ప్రొజెక్ట్‌ చేస్తుంది. 1935లో మొదటి ముద్రణ వెలువడ్డ తర్వాత దేశ విదేశాలలో అన్‌టచబుల్‌ పెద్ద సంచలనాన్నే సృష్టించింది. 

(ముగింపు వచ్చేవారం)

- ప్రభాకర్‌ మందార

Friday, February 18, 2022

భారత దేశంలో కుంభమేళ తర్వాత రెండవ అతిపెద్దజాతర : మేడారం సమ్మక్క జాతర

మేడారం సమ్మక్క,  సారలమ్మ జాతర 

 






(దాదాపు ఏడు శతాబ్దాల క్రిందటి చరిత్ర. ఒక రోజు వేటకు వెళ్ళిన కొందరు ఆదివాసీలకు ఓ చెట్టుకింద ధగ ధగ మెరిసిపోతున్న ఒక నవజాత శిశువు  చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. వాళ్ళు ఆ పాపను తీసుకెళ్ళి తమ నాయకుడికి ఇస్తే ఆయన ఆ పాపకి సమ్మక్క అని పేరుపెట్టి అపరూపంగా పెంచుకుని పెద్ద చేసి యుక్తవయసు వచ్చాక పగిడిద్ద రాజుకు ఇచ్చి పెళ్లి చేసాడు.

 

పగిడిద్ద రాజు కాకతీయులకు ప్రతిసంవత్సరం కప్పం కడుతూ వుండే మేడారం గిరిజన ప్రాంతానికి చెందిన ఒక సామంత గిరిజన కోయ రాజు. ఒకసంవత్సరం వర్షాలు పడక తీవ్రమైన కరువు రావడంతో ఆయన  కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు. కానీ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి దానిని తన అధికారం మీద తిరుగుబాటుగా భావిస్తాడు. ఆ రాజు మీదకు సైన్యాన్ని పంపిస్తాడు.

ఆత్మాభిమానంతో పగిడిద్ద రాజు ఎంతో వీరోచితంగా కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొంటాడు. హోరాహోరీగా సాగిన ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు అమరుడవుతాడు. అదితెలిసిన సమ్మక్క ఆగ్రహంతో రగిలిపోతూ తన కుమారుడు జంపన్నని, కూతురు సారలమ్మ (సారమ్మ)ని తీసుకుని యుద్ధరంగంలో అడుగుపెడుతుంది. కాకతీయ సైనికులతో  వీరోచితంగా పోరాడుతుంది. అయితే చిట్ట చివరికి తీవ్రంగా గాయపడుతుంది. శత్రువుకు చిక్క కూడదని ఒక గుట్టపైకి అధిరోహిస్తుంది. కాకతీయ సైనికులు ఆమెను వెంబడిస్తూ వస్తారు కానీ ఆమె ఒక చెట్టు వద్ద మాయమై పోవడం, ఆ చెట్టు వద్ద పసుపు కుంకుమలు గాజులు కనిపించడంతో వాళ్ళు  దిగ్భ్రాంతి చెందుతారు.

 

ఆ యుద్ధంలో అనేకమంది ఆదివాసీ వీరులతో పాటు సారాలమ్మ కూడా అశువులు బాస్తుంది. జంపన్న శత్రువులకు చిక్కకూడదని అక్కడి వాగులో దూకి మరణిస్తాడు. అప్పటి నుండి ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది.

 

సమ్మక్క పసుపుకుంకుమలు లభించిన రోజు నాడు ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో గిరిజనులు జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం ఆసియాలోనే ఇది అతి పెద్ద గిరిజన జాతరగా, భారత దేశంలో కుంభమేళా తర్వాత రెండవ అతిపెద్ద జన జాతరగా పేరుగాంచింది. మిగతా వివరాలు ఫేస్ బుక్ లో మధు పెరుమాళ్ళు గారు సమర్పించిన ఈ కింది వ్యాసంలో....)


వరంగల్ నగరానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. గిరిజనులు అరణ్యమంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. నాగవక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న భరిణె కనిపించింది. ఈ భరిణే సమ్మక్కగా గిరిజనులు జాతర చేసుకుంటున్నారు.

సారలమ్మ..

సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధం లో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్ల్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు ఇలవేల్పు గా కొలుస్తున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. కాలినకడన సారలమ్మను మేడారానికి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది.

జంపన్న ..

సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధం లో శుత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న పక్కనే సంపెంగవాగులో దూకి చని పోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వన దేవతలకు మొక్కులు సమర్పిస్తారు.

పగిడిద్దరాజు..

సమ్మక్క భర్త పగిడిద్దరాజు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజు కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర శత్రువుల చేతిలో చనిపోయాడు. మేడారం జాతర జరిగే మాఘశుద్ధ పౌర్ణమి నాడే పగిడిద్దరాజు చనిపోయారు.

చందా వంశీయులు..

మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలో జరిపేవారు. ఇది మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేట లోనే జన్మించినట్లు చెప్తారు. కాకతీయులతో జరిగిన యు ద్ధం అనంతరం అదృశ్యమైన సమ్మక్కను, ఆమె బిడ్డ సారలమ్మ ను బయ్యక్కపేట గ్రామస్తులు దేవతలుగా ప్రతిష్ఠించుకుని కొ లిచారు. ఊళ్లో కరువుకాటకాలతో జాతర చేయలేక పోయారు. అప్పటికే ఆదివాసీ సిద్దబోయిన వంశస్తులు బయ్యక్కపేటలో జాతర నిర్వహించేవారు. కరువుతో తాము జాతర చేయలేమని, మేడారంలోనే జరుపుకోండని బయ్యక్కపేట వాసులు చెప్పారు. దీంతో ఆ జాతరను మేడారంలో జరుపుతున్నారు.

సంపెంగ వాగులో స్నానాలు

జంపన్నవాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. నాటి సంపెంగ వాగే నేటి జంపన్నవాగు. కాకతీయ సైనికులతో పోరాడి న సమ్మక్క కొడుకు జంపన్న ఈ వాగులో వీరమరణం పొందడంతో దానికా పేరు వచ్చింది. జంపన్న నెత్తుటితో తడిసిన ఈ వాగులో స్నానం ఆచరిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. గద్దెల చుట్టుపక్కల ఎంత రద్దీ ఉం టుందో.. జంపన్నవాగు పరిసరాలు కూడా అంతే కిటకిటలాడుతాయి. వాగులో స్నానాలు చేసేందుకు భక్తులు ఆరాటపడతారు.. పూ నకాలతో ఊగిపోతూ.. ఇక్కడా పూజలు చేస్తారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు ఈ వాగులో స్నానం చేసిన త ర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. తలనీలాలను సమర్పిస్తారు.

చిలకలగుట్ట

మేడారానికి ఈశాన్యంలో జంపన్నవాగు ఒడ్డున చిలకలగుట్ట ఉంటుంది. ఈ గుట్టపైనే ఓ రహస్య స్థలంలో సమ్మక్క తల్లి ఉంటుందంటారు. జాతర జరిగే మూడు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సమ్మక్క ఈ గుట్టపైనే ఉంటుంది. దానితో గిరిజనులు ఈగుట్టను పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ గుట్టపైకి గిరిజన పూజారులు (వడ్డెలు) తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ఈ గుట్ట పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం రూ కోటి వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తోంది.

పూనుగొండ్ల..

కొత్తగూడ మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశ పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చిరామయ్య అనే వడ్డె(పూజారి) పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. పూనుగొండ్ల నుంచి మేడారం వరకు నలభై కిలోమీటర్లు పగిడిద్దరాజును కాలినడకన వడ్డెలు తీసుకొస్తారు.

కన్నెపల్లి..

తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. సారలమ్మ ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను వడ్డెలు(ఆదివాసీ పూజారులు) తీసుకు వస్తారు. మొత్తం ఈ ఊరి జనాభా 242 మాత్రమే ఉంది. ఈ గ్రామం ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి తీసుకుంటుంటారు. మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే.. అమ్మో.. మేం ఏం సేయాలన్నా.. మా సారక్కకు సెప్పి సేత్తంఅంటారు ఇక్కడి ఆదివాసీలు.

లక్ష్మీదేవర మొక్కులు..

లక్ష్మీ దేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుంది. ఈ ప్రతిమను ధరించి నాయకపోడులు జాతరలో సందడి చేస్తారు. నాయకపోడులకు ఇది ఆరాధ్య దైవం. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడవునా నృత్యాలు చేస్తూ గద్దెలకు వస్తారు. ఈక్రమంలో వారికి గద్దెల వద్ద డోలు చప్పుళ్లు గజ్జెల మోతతో సందడి చేస్తారు. ఆ తదుపరి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఇలా చేస్తేనే తమను ఆ తల్లి సల్లంగ చూస్తదని నాయకపోడుల విశ్వాసం. మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో లక్ష్మీదేవర మొక్కులు సందడి సందడిగా ఉంటాయి.

కొండాయి..

ఏటూరునాగారం మండలం కొండాయిలో సారలమ్మ భర్త గోవిందరాజులు ఆలయం ఉంది. జాతర సందర్భంగా వడ్డెలు, తలపతి, వర్తోళ్లు కలసి డోలు చప్పుళ్లతో కాలినడకన పన్నెండు కిలోమీటర్లు నడిచి మేడారం చేరుకుంటారు.

గోవిందరాజులు..

సారలమ్మ భర్త గోవిందరాజులు. దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజులు... మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజులు యుద్ధంలోనే వీరమరణం పొందారు.

ట్రాఫికర్..

ములుగు దాటిన తర్వాత పస్రా, తాడ్వాయి, మేడారంలో ఆర్టీసీ బస్‌స్టేషన్, నార్లాపూర్‌లలో ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ జాం అయితే క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఇక్కడ క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నారు. 23 పార్కింగ్ ప్లేస్‌లను సిద్ధం చేశారు.

జాతరలో జర పైలం

హా జాతరకు వస్తున్న భక్తులు తమ పిల్లలను, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అపరి చితుల మాటలను నమ్మరాదు.

హా కొత్త వ్యక్తులను నమ్మి.. వారికి వస్తువులను అప్పగించరాదు. వారు మోసం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దు.

హా మేడారం జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారి సమస్యలను పరిష్కరించడానికిగాను మేడారంలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బం దులు ఎదురైనప్పటికీ వెంటనే పోలీసులకు తెలియజేయాలి. అన్ని ప్రాంతాల్లో 24 గంటలపాటు పోలీసుల గస్తీ, నిఘా ఉంటుంది.

హా పోలీసుల సూచనలను పాటిస్తూ భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, సంతోషంగా తిరుగు ప్రయాణం చేయాలి.

హా జాతర పరిసర ప్రాంతాల్లో, జంపన్నవాగులో ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, ప్లేట్ల వాడకం నిషేధించడమైంది.

హా భక్తులు, వివిధ శాఖల సిబ్బంది, దుకాణాదారులు మేడారం, దాని పరిసర గ్రామాల్లో మాత్రమే విడిది చేయాలి. అడవిలో విడిది కాని, రోడ్ల వెంబడి విడిది చేయడం మంచిదికాదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన మేడారంలో ఉండరాదు. అడవికి నిప్పు పెట్టరాదు.

హా వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరం. వాటిని వేధించడం చేయరాదు. ఎక్కడైనా అటవీ జంతువులు దొరికితే సంబంధితశాఖ వారికి అప్పగించాలి.

హా చెట్లు, మొక్కలు, వెదురు నరికిన పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.

హా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుని విధిగా వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి.

హా జాతర సమయంలో యాత్రికులు ఆరుబయట మల విసర్జన చేయరాదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లనే వినియోగించుకోండి.

హా కలుషితమైన నీటిని సేవించరాదు. మంచినీటిని సేవించే సమయంలో ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసే క్లోరిన్ బిళ్లలను నీటిలో వేసుకోవాలి.

హా నల్లాల వద్ద, చేతిపంపుల వద్ద, నీళ్లట్యాంకుల వద్ద స్నానాలు, మల, మూత్ర విసర్జనలు చేయరాదు. వేడి ఆహారాన్ని తీసుకోండి.

హా మత్తు పానీయాలు, గుట్కాలు తీసుకోకండి. నోస్ ప్యాడ్‌లను వాడండి.

హా భక్తులకు వాంతులు, విరేచనాలు, జ్వరం వస్తే వెంటనే జాతరలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను సంప్రదించండి. సకాలంలో వైద్యచికిత్సలను పొందండి.

హా కేశఖండన కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే తలనీలాలను సమర్పించాలి. ఈ సందర్భంగా భక్తులు కొత్త బ్లేడ్లనే వాడకం చేయాలి.

హా వాహనాలను విధిగా పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలి.

గట్టమ్మ..

ములుగు సమీపంలో ఎతై ్తన గుట్ట కలిగి రహదారి ప్రమాదకరంగా ఉండడంతో తరచు ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. వాటిని నిరోధించేందుకోసం గుట్టపైన గట్టమ్మను నెలకొల్పినట్లు చెప్పుకుంటున్నారు. సమ్మక్క జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ గట్టమ్మకు మొక్కులను అప్పజెప్పుతూనే ఉన్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకొని వెళితే క్షేమంగా తిరిగి వస్తామని నమ్మకం.గట్టమ్మను నెలకొల్పి దశాబ్ధాలు గడిచిపోయిందని ఇ క్కడి పూజారులు చెప్పుకుంటారు. తమ తాతముత్తాల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నామని ఈప్రాంత ప్రజలను తన చల్లని చూపులతో రక్షిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం.

పొరుగు రాష్ట్రాల భక్తులు.. చుట్టాలు

మేడారం జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వివిధ మార్గాల్లో వస్తారు. గోదావరి మీదుగా వేకువజామునే తెప్పలపై, మరబోట్లు, నాటపడవల మీదుగా పిల్లాజెల్లలతో, జాతర సంరంజామాతో ఏటూరునాగారం మండలంలోని తాళ్లగూడెం రేవుకు జట్లు జట్లుగా వస్తారు. ఎన్నోఏళ్లుగా వీరు ఊరట్టం, కన్నెపల్లి పరిసర ప్రాంతాల్లోనే తమ బసను ఏర్పాటు చేసుకుని జాతర సంబురాల్లో పాల్గొంటారు. ఇక్కడి స్థానిక గిరిజనులను పేర్లు పెట్టి పిలిచేంత చనువు ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు ఉంది.

జువ్విచెట్టు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమ గలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమీయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారు.

ఎదురుకోళ్లు..

సమ్మక్క- సారలమ్మల వీరత్వానికి ఎదురుకోళ్లు ప్రతీకగా నిలుస్తాయి. తల్లులను గద్దెలకు తీ సుకువచ్చే క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో ఆహ్వా నం పలుకుతారు.. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎదురుగా వేస్తూ మనసారా మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలని వేడుకుంటారు. జాతర సమయంలో ఎటు చూసినా ఈ ఎదురుకోళ్ల సందడే కన్పిస్తుంది. గద్దెల వద్ద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.. ఎదురుకోడి వేసిన అనంతరం దాన్ని వండుకుని ఆరగిస్తారు.

నిలువెత్తు బంగారం

ఎక్కడా లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో కన్పిస్తుంది.. తమ వద్దకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని..కానుకలు వేయాల్సిన అవసరంలేదని ఆ తలు ్లలే చౌక గాఉండే బెల్లం మొక్కులను ఇష్టపడతారని ఆదివాసీలంటా రు. సమ్మక్క తల్లికి బెల్లం ఎక్కువ ఇష్టమని దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లాన్నే తినేదని చెప్తారు. అందుకే ఆమెకిష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుని తప్పనిసరిగా చెల్లిస్తారు. దీంతో మే డారం జాతర సమయంలో బెల్లం గిరాకీ భలేగా ఉంటుంది. గద్దెల వద్ద టన్నుల కొద్దీ బంగారం పేరుకుపోతుంది.

శివసత్తులు..

జంపన్నవాగుల్లో అబ్బియా.. నా తల్లీ సమ్మక్కా అబ్బియా అంటూ శివసత్తుల పూనకాలు..పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. జాతరలో శివసత్తుల విన్యాసాలు ఓ విశేషం. ఎక్కడ చూసినా వీరకోలా పట్టుకుని చేసే హంగామా భక్తులను సంబరానికి గురిచేస్తుంది. ఆడవారే కాదు..మగవారు కూడా శివాలు ఊగుతూ జాతరకు వస్తారు. తల్లుల సేవకు అంకితమైన వారు మేడారం ప్రతీ జాతరకు వస్తారు. వీరంతా జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించిన తదుపరి పసుపుతో అలంకరించుకుంటారు. వీరకోలాను చేతబట్టి పూనకాలతో ఊగిపోతూ గద్దెల వద్దకు వస్తారు.. భక్తి భావంతో వీరు చేసే తల్లుల స్మరణలు అందరినీ ఆకర్షిస్తాయి.

ఒడిబియ్యం..

భక్తులు సమ్మక్క-సారలమ్మ తల్లులను ఆడపడుచులుగా భావించి ఒడి బియ్యం మొక్కులు చెల్లిస్తారు. 5 సోళ్ల బియ్యంలో పసుపుకుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు. దర్శనమయ్యాక తల్లులకు ఈ బియ్యం సమర్పిస్తారు.

వరం పట్టడం..

సంతానం లేని భక్తులు జంపన్నవాగులో స్నానమాడి కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద వరం పట్టి, ముడుపులు కడతారు. వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుకుంటారు. పూజారులు వీరిపై నుంచి దాటుతూ వెళతారు.

వరంగల్‌లో బస్ పాయింట్‌లు

మేడారం జాతరకు తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం వరంగల్ నగరంలోని హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానం, వరంగల్‌లో పాత గ్రెయిన్ మార్కెట్, కాజీపేట్‌లోని ైరె ల్వే స్టేషన్ సమీపంలో బస్సు పాయింట్‌లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

బస్సు, రైల్వే రూట్లు

రైలు మార్గాల ద్వారా వచ్చే భక్తులు వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో దిగాలి. ఈ రెండు స్టేషన్ల దగ్గర నుంచి ఆర్టీసీ మేడారం వరకు బస్సులను నడిపిస్తోంది.

మేడారం జాతరకు వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా వివిధ రూట్లలో వచ్చే ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా మేడారం వెళ్తాయి. ప్రైవేటు వాహనాలు పస్రా మీదుగా మళ్లిస్తారు.

వరంగల్ మీదుగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు ములుగు, పస్రా మీదుగా తాడ్వాయి చేరుకుని అక్కడి నుంచి మేడారం వస్తారు. మేడారంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఆర్టీసీ బస్ స్టేషన్ ఉంది.

ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఇల్లందు, నర్సంపేటల మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు మల్లంపల్లి, ములుగు, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు పెద్దపల్లి, మంథని, కాటారం, బోర్లగూడెం, బయ్యక్కపేటల మీదుగా మేడారం చేరుకుంటారు.

కోస్తాంధ్ర, భద్రాచలం, కొత్తగూడెంల మీదుగా వచ్చే భక్తులు మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయిల మీదుగా మేడారం చేరుకోవాలి

హుజురాబాద్, పరకాల మీదుగా వచ్చే బస్సులు గణపురం, జంగాలపల్లి మీదుగా తాడ్వాయి చేరుకుని మేడారం వస్తాయి.

హైదరాబాద్ మీదుగా వచ్చే అన్ని బస్సులు, ప్రైవేటు వాహనాలు వరంగల్ చేరుకుని ములుగు మీదుగా మేడారం వస్తాయి.

సిద్దిపేట నుంచి వచ్చే వారు జనగామ, హన్మకొండ మీదుగా మేడారం చేరాలి.

పెట్రోలు బంకుల వివరాలు

ప్రధానమైన వరంగల్-మేడారం దారిలో వరంగల్ నగరం దాటిన తర్వాత వచ్చే ముఖ్యమైన పెట్రోలు బంకుల వివరాలు... ఆరేపల్లి వద్ద రెండు, ఓగ్లాపూర్ వద్ద ఒకటి, గూడెప్పాడ్ వద్ద 2 , మల్లంపల్లి వద్ద 1, ములుగు వద్ద 1, జంగాలపల్లి -1, పస్రా వద్ద ఒకటి ఉన్నారుు. వివిధ కంపెనీల పెట్రోలు బంకులు అందుబాటులో ఉన్నాయి.

వైద్య సేవలు

వరంగల్-మేడారం రోడ్డులో వైద్యసేవలకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దామెర, ఆత్మకూరు, ప్రసా, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేటలలో ఉన్నాయి. ములుగు, ఏటూరునాగారంలలో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. మేడారంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ప్రత్యేక వైద్య నిపుణులు 18, వైద్యులు 300, పారామెడికల్ సిబ్బంది 600 మంది జాతర విధుల్లో పాల్గొంటున్నారు. గద్దెల సమీపంలో ఉన్న టీటీడీ కళ్యాణమంటపంలో 60 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదుగురు గైనకాలజిస్టులు, ఐదుగురు మత్తు డాక్టర్లు, ఎనిమిది మంది మెడికల్ ఆఫీసర్లు, ఆరుగురు పిల్లల వైద్యులు, ఇద్దరు ఆర్థోపెడిక్ నిపుణులు, ఇద్దరు జనరల్ మెడిసిన్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వీరితో పాటు 20 మంది స్టాఫ్‌నర్సులు, 20 మంది ఫార్మసిస్టులు సేవలందిస్తారు. జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, నార్లాపూర్‌లో 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి, మేడారంలలో పది పడకలతో ఎమర్జెన్సీ సెంటర్లున్నాయి. 108, 104లతో ఇతర ప్రైవేటు అంబులెన్సులు కలిపి 30 అంబులెన్సులు వరంగల్ నగరం నుంచి మేడారం వరకు ప్రతీ పది కిలోమీటర్లకు ఒకటి 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం

సమ్మక్క తల్లిని నిష్టగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకుంటారు. చీరసారె కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు.

కోళ్లు.. మేకల బలి

మేడారం జాతరలో కోళ్లు.. మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. తల్లుల ప్రసాదంగా దీనిని భావిస్తారు.. మాంసానికి మద్యం, కల్లు కూడా తోడు చేసుకుంటారు. జాతరంటేనే..మందు మజా అంటారు. ఇంటిల్లిపాదీ గుడారాల వద్ద మందు చుక్క మాంసం ముక్కతో ఆనందంగా గడుపుతారు.

కొబ్బరికాయలు

వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులకు రెండు కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు, కుంకుమలతో పాటు అగరొత్తులు చెల్లించి దేవతలకు మొక్కుకుంటారు.

ఊయలలు

అమ్మలను మొక్కుకుంటే సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయలతొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుకుంటారు.

సమ్మక్క-సారలమ్మ మండలంగా తాడ్వాయి

మేడారం గ్రామం తాడ్వాయి మండల పరిధిలో ఉంది. గిరిజనులు ఎప్పటి నుంచో మండలం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 2013 డిసెంబర్‌లో తాడ్వాయి మండలం పేరును సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చుతూ గెజిట్ విడుదలైంది.

 

-         - మధు పెరుమాండ్ల , వరంగల్