Wednesday, December 5, 2012

కాలం మారింది !


కాలం మారింది


ఔను
కాలం మారింది
పులులు పులుగా ఉండే కాలం పోయి
మేకవన్నె పులులుగా మారే కాలం వచ్చింది!

ఇప్పుడు జనం 
అధికార గబ్బిలాలకు అదరడంలేదు
ఇప్పుడు జనం 
దొరల గాండ్రింపులకు బెదరడంలేదు!

అందుకే 
పులులన్నీ మేకతోళ్లు కప్పుకున్నాయి
గుంటనక్కలన్నీ 'సోషలిజం' (సంక్షేమం/అభివృద్ధి) ఊళలు నేర్చుకున్నాయి!
గండుపిల్లులు 'అహింసా' సూక్తులు బోధిస్తున్నాయి
భల్లూక శార్దూలాలన్నీ 'శాంతి' మంత్రాలు జపిస్తున్నాయి
కాలం మారింది మరి!

పీడకుల రక్షకులు
ఎర్ర పెయింట్‌ వందిమాగధులు
అదేపనిగ ఓండ్ర పెడుతున్నారు...
.....

వందిమాగధుల పక్కల్లో బల్లెం
వర్గ శత్రువుల డొక్కల్లో బాణం...
చైతన్యంతో విప్పారుతున్న అరణ్యాలు 
అన్నిరకాల ముసుగుల్నీ దహించి వేస్తున్నయ్‌!

ఔను!
కాలం మారింది
సమస్త శ్రామిక ద్రోహుల కాలం మూడింది!!



(ఈ కవిత కూడా 40 ఏళ్ల కిందటి ''సమరం'' కవితా సంకలనం లోనిదే. విక్రమ్‌ అన్న కలం పేరుతో రాశాను)