Showing posts with label తెలంగాణా. Show all posts
Showing posts with label తెలంగాణా. Show all posts

Wednesday, September 24, 2014

" ఊరు వాడ బతుకు " ఆంగ్లానువాదం " Life in Anantaaram " ఉచిత పీడీఎఫ్

" ఊరు వాడ బతుకు " ఆంగ్లానువాదం " Life in Anantaaram " ఉచిత పీడీఎఫ్

దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథాత్మక నవల "ఊరు వాడ బతుకు" తెలుగు పాఠకుల విశేషాదరణను పొందింది. పోలీసు యాక్షన్ పేరిట  ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో జరిగిన సైనిక చర్య ముందరి  తన బాల్యం , అనంతారం, సూర్యాపేటల్లో కొనసాగిన తన చదువు, ఆనాటి గ్రామీణ జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం , రజాకార్ల ఆగడాల నేపధ్యంతో  సరళమైన తెలంగాణా భాషలో ఒక అద్భుతమైన డాక్యుమెంటరీలా సాగుతుందీ రచన.   తెలంగాణా ప్రజా జీవనం లో అంతర్భాగమైన పాటలు, సామెతలు, జాతీయాలు పుస్తకం నిండా పరచుకుని ఆనాటి తెలంగాణా బతుకులోని విలక్షనతను, ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి. ఏలె లక్ష్మణ్ చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
తెలంగాణా సామాన్య జన జీవితాన్ని అసామాన్యంగా ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ప్రపంచ పాఠకుల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో కొన్నాళ్ళ క్రితం గీతా రామస్వామి గారు ఇంగ్లిష్ లోకి అనువదించారు. కానీ పుస్తక రూపంలో తీసుకు రావడానికి వీలుపడక " మిషన్ తెలంగాణా " వారి ద్వారా పీడీఎఫ్ రూపం లో అందుబాటులో వుంచారు. దీనిని కింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్  ఇంకా పూర్తి  కాలేదు కనుక పాఠకులు తమ దృష్టికి వచ్చిన లోపాలను, సూచనలను, తమ స్పందనను ఈ కింది మెయిల్ ఐడీకి పంపించవచ్చు . 

For Free PDF of Life in Anantaram:
http://missiontelangana.com/life-in-anantharam/

Mail ID: gita.ramaswamy@gmail.com

For Ooru Vaada Batuku:
http://hyderabadbooktrust.blogspot.in/2009/06/blog-post_8887.html

Wednesday, April 3, 2013

1948 లో హైదరాబాద్ రాజ్యం పతన మయింది. కానీ ప్రజలు ఓడిపోయారు. ప్రజాకంటకులే గెలిచారు.




1948 లో  హైదరాబాద్ రాజ్యం పతన మయింది.
కానీ ప్రజలు ఓడిపోయారు.
ప్రజాకంటకులే  గెలిచారు.
కిరీటం కోల్పోయినా నిజాం రాజు స్వతంత్ర భారత దేశం లో  రాజ ప్రముఖుడయ్యాడు
దున్నేవాళ్ళు స్వాధీనం చేసుకున్న  భూములన్నీ తిరిగి భూస్వాముల, జమిందార్ల, దోపిడీదార్ల పరమయ్యాయి

కొన్నాళ్ళు హైదరాబాద్ రాష్ట్రం కొద్ది పాటి స్వేచ్చా వాయువులనైనా ఆస్వాదించిందో లేదో ...
1956 లో మళ్ళీ వలసాంధ్ర పెత్తందార్ల  దురాక్రమణకు గురయ్యింది.
తన అస్తిత్వాన్నే కోల్పోయింది
ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడిది, తెలంగాణా ఎక్కడిది అంతా  మాదే అంటున్నారు దురాక్రమణ దార్లు
మీ నీళ్ళు మీకు ఇవ్వం,
మీ నిధులు మీకు దక్కనివ్వం
ఎం చేస్తారో చేసుకోండి అని హూంకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన అన్యాయాలను
మరోసారి పునరావలోకనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ మన ముందుకు వస్తోంది
అప్పటి ఉస్మానాబాద్ కలక్టర్ మహమ్మద్ హైదర్ రాసిన "1948: హైదరాబాద్ పతనం"

ఈ ఆదివారం (7 ఏప్రిల్ 2013) ఉదయం 10 గంటలకు
సారస్వత పరిషత్ హాల్ లో ఈ పుస్తకం పై జరిగే చర్చలో అందరూ పాల్గొనండి

వివరాలకు సంప్రదించండి :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్ నెం. 040 2352 1849
అన్వేషి ఫోన్ నెం. 040 2742 3168

Sunday, January 20, 2013

" నువ్వు జై తెలంగాణా అంటే - నేను సై తెలంగాణా అంటాను" - డాక్టర్ సి. నారాయణ రెడ్డి ...

ఇవాళ (20జనవరి 2013) ఏవీ కాలేజ్, హైదరాబాద్ లో జరిగిన తెలంగాణా రచయితల వేదిక ' సాహిత్య యుద్ధభేరి '  సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ  
స్వయంగా నిలదోక్కుకోగలిగే వనరులు కలిగివున్న చిన్న రాష్ట్రాలు బాగా అభివృద్ది చెందుతాయని, ఈ దృష్ట్యానే భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనతో నిమిత్తం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం మూడు హిందీ మాట్లాడే రాష్ట్రాలను విభజించి చత్తీస్స్ ఘర్, జార్ఖండ్, ఉత్తరాంచల్ అనే మూడు కొత్త రాష్టాలను ఏర్పాటు చేసిందని అన్నారు.

 హిందీ మాట్లాడే వారికి ఏడు రాష్ట్రాలు వున్నప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వుంటే తప్పేమీ లేదని చెప్పారు.
తెలంగాణా రచయితలను ఉత్తేజ పరుస్తూ " నువ్వు  జై తెలంగాణా అంటే - నేను సై  తెలంగాణా అంటాను" అని హర్షద్వానాల మధ్య  ప్రకటించారు.

Monday, October 29, 2012

సీమాంధ్ర నగరాల్లో బతుకమ్మ ఎందుకు కనిపించదు ?





తెలంగాణా లో సరే...

డల్లాస్ లో బతుకమ్మ...
కాలిఫోర్నియాలో బతుకమ్మ...
న్యూ జెర్సీ లో బతుకమ్మ ...
అట్లాంటాలో బతుకమ్మ ...
డెట్రాయిట్ లో బతుకమ్మ ...
చికాగోలో బతుకమ్మ ...
బోస్టన్ లో బతుకమ్మ ...
వాషింగ్టన్ లో బతుకమ్మ ...
టోరంటో లో బతుకమ్మ
సిడ్నీ లో బతుకమ్మ ...
లండన్ లో బతుకమ్మ...
బెర్లిన్ లో బతుకమ్మ ...
దుబాయ్ లో బతుకమ్మ ..

కానీ .....
విజయవాడలో నో బతుకమ్మ ....
విశాఖపట్నం లో నో బతుకమ్మ ...
రాజమండ్రి లో నో బతుకమ్మ ...
కడపలో నో బతుకమ్మ ...
తిరుపతి లో నో బతుకమ్మ ...

ఎందుకు?
సీమాంధ్ర నగరాల్లో ఎక్కడా
పట్టుమని పదిమంది
తెలంగాణా ఆడ పడచులే లేరా ??????

ఆరు దశాబ్దాల సమైక్యత ఫలితంగా
తెలంగాణలో ఏ నగరం లో చూసినా
వేలకు వేల సంఖ్యలో
ఆంద్ర ఆడపడచులు కనిపిస్తారు కదా

ఆంద్ర నగరాల్లో తెలంగాణా ఆడపడచులు
లేకపోవడం ఏమిటి?!
కారణాలు ఎవరైనా విశ్లేషించ గలరా ...?



Wednesday, October 17, 2012

" తెలంగాణా కలం పై కత్తి " - అల్లం నారాయణ ...


వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు
నేను కార్మిక నాయకుడిని కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు
నేను ప్రొటెస్టెంట్‌ను కాబట్టి మాట్లాడలేదు

చివరకు వాళ్లు నా కోసం వచ్చారు
అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు.

- మార్టిన్‌ నీమోల్లర్‌
(జర్మినీలో నాజీల పాలన గురించి)

ఇవాల్టి (17 10 2012 ) నమస్తే తెలంగాణా సంపాదకీయం
" తెలంగాణా కలం పై కత్తి " చదవండి 


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76911&boxid=96896896


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76921&boxid=96918792



Sunday, October 14, 2012

నందిని అధిరోహించిన రెండు తెలంగాణా పోరాట పాటలకు వందనం !



నందిని అధిరోహించిన రెండు తెలంగాణా పోరాట పాటలకు వందనం !

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా //రాతి//

తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో... //రాతి//

పువ్వులో పూవునై నీ పూజ చేశాను
నీరై నీ అడుగు పాదాలు కడిగాను
ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను
దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను
నా కన్నకొడుకుపై ఈశ్వరా...ఆ...
నా కన్న కొడుకుపై ఈశ్వరా
నీ కరుణ ఏమైందిరా శంకరా
నీ సతికి గణపతిని ఇచ్చావురా
నీ సతికి గణపతిని ఇచ్చావురా
ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ... //రాతి//

శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను
దీప మారాకుండ పడిగాపు లున్నాను
నీ కళ్లలో వేకువ దీవెననుకున్నాను
కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు
తొలుసూరు కొడుకనీ ఈశ్వరా... ఆ...
తొలుసూరు కోడుకనీ ఈశ్వరా
నీ పేరు పెట్టుకుంటీ శంకరా
అందుకే వేశావా ఈ శిక్షనూ
అందుకే వేశావా ఈ శిక్షనూ
అమరవీరుణ్ని చేశావా నా కొడుకును ... // రాతి//

ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికాను
అమ్మా అనె పిలుపుకై అల్లాడిపోయాను
చిననోట నా కొడుకు అమ్మని పలికితే
ఆడజన్మని నేను గెలిచెననుకున్నాను
పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ...
పురిటినొప్పుల బాధ ఈశ్వరా...
నీ పార్వతిని అడగరా శంకరా
తల్లిగా పార్వతికి ఒక నీతినా
ఈ తల్లి గుండెల మీద చితిమంటలా... //రాతి//

-మిట్టపల్లి సురేందర్ ( పోరు తెలంగాణా)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పొడుస్తున్న  పొద్దుమీద  నడుస్తున్న  కాలమా 
పోరు  తెలంగాణమా 

అదిగో  ఆ  కొండల నడుమ  తొంగి  చూసే ఎర్రని  భగవంతు డెవడు  ... సూర్యుడు ఆ  ఉదయించే  సూర్యునితో  పొడుస్తున్న  పొద్దుతో
పోటీ పడి  నడుస్తుంది  కాలం , అలా  కాలంతో  నడిచినవాడే  కదిలిపోతాడు , ఓ  పొడుస్తున్న  పొద్దు  వందనం...  వందనం

ఆ .. పొడుస్తున్న ..బలే  బలే  బలే  బలే  బలే  బలే ...
పొడుస్తున్న  పొద్దుమీద  నడుస్తున్న  కాలమా
పోరు  తెలంగాణమా - పోరు  తెలంగాణమా
కోట్లాది  ప్రాణమా... కోట్లాది  ప్రాణమా...  //పొడుస్తున్న  పొద్దుమీద //

ఓ  భూతల్లి  సూర్యుడిని  ముద్దాడిన  భూతల్లి , అదిగో  చిన్నారి  బిడ్డల్ని  జన్మనిచ్చింది , అమ్మా  నువ్వు  త్యాగాల  తల్లివి  త్యాగాల  గుర్తువు

భూతల్లి  బిడ్డలు  చిగురించే  కొమ్మలు
చిదిమేసిన  పువ్వులు  త్యాగాల  గుర్తులు
హా... మా  భూములు  మాకేనని ...  బలే  బలే  బలే  బలే  బలే హా.
మా  భూములు  మాకేనని  మర్లబడ్డ  గానమ
తిరగబడ్డ  రాగమా  మర్లబడ్డ  రాగమా  తిరగబడ్డ  రాగమా
పోరు  తెలంగాణమా  .. కోట్లాది  ప్రాణమా. //పొడుస్తున్న  పొద్దుమీద //


అమ్మా  గోదావరి  నీ  వొడ్డున  జీవించే కోట్లాది  ప్రజలకు  జీవనాధారము , అమ్మా  కృష్ణమ్మా  కిల  కిల నవ్వే  కృష్ణమ్మా
అమ్మా  మీకు  వందనం

గోదావరి  అలలమీద  కోటి కలల  గానమా
కృష్ణమ్మా  పరుగులకు  నురుగుల  హారమా
హా...  మా  నీళ్ళు  ... బలే  బలే  బలే  బలే  బలే బలే
మానీళ్ళు  మాకేనని  కత్తుల  కోలాటమా
కన్నీటి  గానమా  కత్తుల  కోలాటమా  కన్నీటి  గానమా ... // పోరు  తెలంగాణమా//

అదిగో  ఆ ప్రక్రుతిని  చూడు  అలా  అలుముకుంటుంది , ఆ  కొమ్మలు  గాలితో  ముద్దడుతాయి , ఆ  పువ్వులు  అలా  ఆడుతాయి
అదిగో  పావురాలజంట  నేనెప్పుడు  విదిపోనంటాది

విడిపోయిన  బంధమా    చెదిరిపోయిన  స్నేహమా
ఎడబాసిన  గీతమా  ఎదలనిండా  గాయమ
పూవులు   పుప్పోడిలా    బలే  బలే  బలే  బలే  బలే
పువ్వు  పుప్పోడిల  పవిత్ర బంధమా  పరమాత్మునిరూపమా  
పవిత్ర బంధమా    పరమాత్ముని  రూపమా  // పోరు  తెలంగాణమా//
//పొడుస్తున్న  పొద్దుమీద //

అదిగో  రాజులు దొరలు వలస దొరలు , భూమిని  నీళ్ళని  ప్రాణుల్ని  సర్వస్వాన్ని  చెరబట్టారు , రాజుల  ఖడ్గాల కింద    తెగిపోయిన  శిరస్సులు

రాజరికం  కత్తిమీద   నెత్తుర్ల   గాయమా
దొరవారి  గడులల్లో  బలే  బలే  బలే  బలే  బలే  బలే
దొరవారి  గడులల్లో  నలిగిపోయిన  న్యాయమా
ఆంద్ర వలస    తూటాలకు  ఆరిపోయిన  దీపమ
మా  పాలన  బలే  బలే  బలే  బలే  బలే  బలే
మా  పాలన  మాకేనని  మండుతున్న  గోళమ
అమరావేరుల  స్వప్నమా  మండుతున్న  గోళ మా అమరవీరుల   స్వప్నమా
మండుతున్న  గోళమ  అమరవీరుల  స్వప్నమా
అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా

- గద్దర్ (జై బోలో తెలంగాణా ) 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,




Saturday, September 29, 2012

ఆత్మబలిదానాలకు చరమగీతం పాడేందుకే ఈ తెలంగాణా మార్చ్‌


అన్యాయాలకు
అక్రమాలకు
అవహేళనలకు
అబద్ధాలకు
ఆధిపైత్యపు అహంకారాలకు
అవకాశవాదుల నక్కజిత్తులకు
కాగితం పులుల ప్రేలాపనలకు
ఆత్మన్యూనతకు
ఆత్మబలిదానాలకు
చరమగీతం పాడేందుకే
ఈ తెలంగాణా మార్చ్‌


Sunday, September 23, 2012

ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ 'లోపలి మనిషి' ...



భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. 
అవసరమా?
అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌లో మరాఠీ, కన్నడ, తెలుగు మూడు భాషలుండె. 
ఆ మూడింటినీ అధికార భాషలుగా గుర్తిస్తూ హైదరాబాద్‌ స్టేట్‌ను అలాగే ఉంచితే ఏమయ్యేది?
స్విట్జర్లాండ్‌లాంటి దేశానికి ఆరు అధికార భాషలున్నప్పుడు 
హైదరాబాద్‌ రాష్ట్రానికి మూడు ఉంటే తప్పేంటి?

....
అప్పటి హైదరాబాద్‌ జనరల్‌ జి.ఎన్‌.చౌదరి (బెంగాలీ వ్యక్తి). 
ఇక్కడి వారికి ఇంగ్లీష్‌ రాదని ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మద్రాసీ, బెంగాలీ, ఉత్తర భారతీయులను వేల సంఖ్యలో తీసుకువచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. 
అది ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా కొనసాగింది. 
ఇక్కడి వాళ్లకు ఇంగ్లీష్‌ రాదు అని ఆంధ్రులను ఉద్యోగాల్లో భర్తీ చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం.

నాకు ఒక విషయం అర్థం కాలే... 
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తెలుగు అర్థమవుతుంది. 
తెలుగు రాయగలరు. చదవగలరు. 
అట్లాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్‌ ఇంగ్లీష్‌లో ఎందుకు సాగాలి?
అంతా ఇంగ్లీష్‌లోనే సాగాలి అనుకున్నప్పుడు 
భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం ఏమిటి మరి ????

- ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌

...

చదవండి ఇవాళ్టి (23 సెప్టెంబర్‌ 2012) - నమస్తే తెలంగాణా - దిన పత్రికలోని జిందగీ శీర్షిక కింద (Page No.10) ప్రచురించిన ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ లోపలి మనిషి : 'అది అత్యంత విషాదం' ను పూర్తిగా ఇక్కడ:
 ... ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ ...

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=9/23/2012%2012:00:00%20AM&querypage=10




.

Sunday, September 16, 2012

విమోచనమా విద్రోహమా !?



విమోచనమా విద్రోహమా !?

సెప్టెంబర్‌ 17
విమోచన దినమా
ఎవరినుంచి ఎవరికి విమోచనం
తిరగబడ్డ ప్రజల నుండి జమీందార్లకూ, దొరలకా
ఎర్రదండు ప్రభంజనంనుండి 
నిజాము నవాబుకూ ఆయన తాబేదార్లకా
ఎవరికి విమోచనం?

సెప్టెంబర్‌ 17 
విద్రోహ దినమా
ఎవరిది విద్రోహం
పోరాటాన్ని సగంలో వదిలేసిన కామ్రేడ్లదా
అధికార తుపాకీ అంది ఏడాదైనా కాకముందే
పాముని రాజప్రముఖున్ని చేసి 
చీమల్ని చీల్చిచెండాడిన నల్లదొరలదా
ఎవరిది విద్రోహం?

ఈనాటి తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా
వారి అస్తిత్వ పోరాటంలో పాలుపంచుకోకుండా 
ఏ దినాలనైనా జరుపుకునే అర్హత వుంటుందా
తమ 'దినాలను' తప్ప!



Wednesday, March 16, 2011

ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణే అమర జీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి!





ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణే అమర జీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి!

ఈరోజు (2011 మార్చి 16) అమరజీవి పొట్టి శ్రీరాములు 110వ పుట్టిన రోజు.
ప్రతి సంవత్సరం మార్చ్‌ 16న జయంతినీ, డిసెంబర్‌ 16న వర్థంతినీ యాంత్రికంగా జరపడమే తప్ప - ఏ ఆశయంకోసం ఆయన ఆత్మార్పణ చేశారని ఆలోచించేవాళ్లే నేడు కరువయ్యారు.

నిజంగా ఈనాటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితిని చూస్తే ఆయన ఆత్మ ''ఇది కాదు నేను ఆశించిన స్వరాష్ట్రం'' అని ఎంత క్షోభిస్తుందో అనిపిస్తుంది.
మద్రాస్‌ ప్రెసిడెన్సీలో తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయాన్నీ, తమిళుల దాష్టీకాన్నీ చూసి సహించలేక - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగారు.
మద్రాసు రాజధానిగా తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ఆయన ప్రగాఢమైన ఆకాంక్ష.
(చారిత్రకంగా చెన్నడు అనే తెలుగు రాజు పాలించడం వల్లనే ఆ నగరానికి చెన్నై అనే పేరొచ్చిందంటారు.)
''మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తలకాయ లేని మొండెంతో సమానం'' అని ఆయన స్వయంగా ప్రకటించారు.
అయితే మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న పొట్టి శ్రీరాములు కల మాత్రం నెరవేరనే లేదు. ఆయన అభీష్టానికి విరుద్ధంగా ఏ వసతులూ లేని కర్నూలు రాజధానిగా 1 అక్టోబర్‌ 1953 నాడు ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

నిజానికి అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహూృ సహా చాలామంది జాతీయ నాయకులు వ్యతిరేకించేవాళ్లు.
ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడదీయడం అంటే దేశ సమగ్రతకు భంగం కలిగించడమే అని కొందరు ఇవాళ ఎలా వాదిస్తున్నారో -
ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్ర భావన దేశ సమైక్యతకు, జాతీయ భావనకు విఘాతం కలిగిస్తుంది అని ఎంతో మంది వాదించేవాళ్లు.

స్వాతంత్య్రం సిద్ధించి కొద్ది కాలమే అయింది కాబట్టి - అందరం ముందు జాతి ఐక్యతపై దృష్టిని కేంద్రీకరించాలనీ, కొంతకాలం తరువాతనే భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి ఆలోచించాలనీ జవహర్‌లాల్‌ నెహూృ కూడా గట్టిగా చెప్పేవారు. అయితే ప్రజోద్యమానికి, మెజారిటీ అభిప్రాయానికి తలొగి -్గ తన కిష్టంలేకపోయినా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకరించారు.

మద్రాసును సాధించుకోలేకపోయిన ఆంధ్ర నాయకులు అప్పటికే సకల సౌకర్యాలున్న హైదరాబాద్‌ మహానగరం మీద దృష్టిని కేంద్రీకరించి విశాలాంధ్ర నినాదంతో మళ్లీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.

అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో మరాఠీ మాట్లాడే ఔరంగాబాద్‌ డివిజన్‌, కన్నడ మాట్లాడే గుల్బర్గా డివిజన్‌లతో కలిపి మొత్తం 16 జిల్లాలుండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ఊపందుకోవడం వల్ల హైదరాబాద్‌ రాష్ట్రంలోని ఆయా భాషా ప్రాంతాల నేతలు అటు మహరాష్ట్రలో, ఇటు కర్ణాటకలో విలీనమయ్యేందుకు ఉత్సాహపడుతుండేవారు. మిగతా తెలుగు, ఉర్దూ మాట్లాడే తెలంగాణా ప్రాంతంలో - కొందరు విశాలాంధ్ర వైపు మొగ్గు చూపితే, మరికొందరు హైదరాబాద్‌ రాష్ట్రం స్వతంత్రంగా కొనసాగాలని అభిలషించారు.

ఈ నేపథ్యంలో ఫజల్‌ అ లీ కమిషన్‌ (మొదటి ఎస్‌ఆర్‌సి) నియమాకం జరిగింది. ఆ కమిషన్‌ హైదరాబాద్‌ రాష్ట్ర పరిస్తితులను కూలంకషంగా పరిశీలించి హైదరాబాద్‌ రాష్ట్రాన్ని విడిగానే వుండనిచ్చి 1961 సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత ఆ అసెంబ్లీ గనక 3/2 వంతు మెజారిటీ ఆమోదంతో తీర్మానం చేస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని స్పష్టంగా సూచించింది.

అయితే 1961 వరకు ఆగితే హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రంతో కలవడానికి అంగీకరించరని ఆంధ్ర రాష్ట్ర నాయకులు లాబీయింగ్‌ ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలున్న 16 జిల్లాల హైదారాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించి ఒత్తిడి పెంచారు. ఈ డిమాండ్‌ సామ్రాజ్య వాద విస్తరణ లాంటిదని బాహాటంగా విమర్శిస్తూనే నెహూృ కొన్ని షరతులతో, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. సరిపడకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని ఆయన అప్పుడే చెప్పారు.

ఈవిధంగా తమిళుల పెత్తనం నుంచి పోరాడి బయటపడ్డ ఆంధ్ర ప్రాంత నేతలు, అనేక బూటకపు హామీలు, ఒప్పందాలతో తెలంగాణా ప్రాంతంపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణా అస్తిత్వాన్ని, ఆకాంక్షలనీ, కాల రాశారు. విలీనమై 60 సంవత్సరాలైనా కూడా ఆంధ్ర తెలంగాణా ప్రజల మధ్య ఆత్మీయతలు తరిగి, అగాధాలు పెరగడం ఒక విషాదం.

ఒక ప్రాంత దాష్టీకాన్ని ఎదిరించిన అమర జీవి పొట్టి శ్రీరాములు మరో ప్రాంతంపై అదే దాష్టీకాన్ని కొనసాగించడాన్ని ఇష్టపడతారని అనుకోలేం.
ఆయన కోరుకున్నది తమిళుల పెత్తనం నుంచి విముక్తి తప్ప తెలంగాణా ప్రజల మీద అజమాయిషీ కానే కాదు. ఆయన మద్రాసు రాజధానిగా గల ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నారే తప్ప హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణా పై పెత్తనాన్ని కాదు. ఒప్పందాలను ఉల్లంఘించడం, హామీలను తుంగలో తొక్కడం, ముందు ఒకటి చెప్పి తరువాత ఒకటి చేయడం, 'తొండి'కి దిగడం అమర జీవి పొట్టి శ్రీరాములు స్వభావానికి ఏమాత్రం సరిపడని అంశాలు. ఆయన ఈ బూటకపు మాటలను, బలవంతపు కాపురాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించి వుండేవారు కాదు గాక కాదు.

కాబట్టి 1956 కు ముందరి ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను గౌరవించడమే నేడు పొట్టి శ్రీరాములుకు మనం అర్పించే నిజమైన నివాళిగా భావించాలి.

Thursday, February 4, 2010

ఉస్మానియా యునివర్శిటీ క్యాంపస్‌లో మరణించిన వేణుగోపాల్‌ది ఆత్మహత్యే అని నిర్ధారించిన ఫోరెన్సిక్‌ నివేదిక

.


.

జనవరి 19 రాత్రి ఎంసిఎ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి కొండేటి వేణుగోపాల్‌రెడ్డి ఉస్మానియా యునివర్శిటీ క్యాంపస్‌లో ఆత్మాహుతి చేసుకున్న సంఘటన తెలంగాణా ఉద్యమాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. ఆ మరునాడు వేణు భౌతిక కాయాన్ని ఉస్మానియా యునివర్సిటీ నుంచి నాంపల్లిలోని తెలంగాణా మృతవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు అనుమతించక నానా భీభత్సం సృష్టించిన సంఘటన మన ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోయింది.

దీనికి తోడు అసలు వేణుగోపాల్‌ది ఆత్మహత్య కాదు ఎవరో కావాలని ఆయనను హత్యచేసి ఆత్మహత్యగా సృష్టించారు అన్న దుష్ప్రచారం తెలంగాణా గుండెను మరింత గాయపరిచింది.

సిద్దాంతాలనూ నీతి నిజాయితీలనూ గాలికి వదిలేసి పరమ రోతగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల, నేతల తీరును, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఇప్పటికే తెలంగాణాలో దాదాపు 250 మంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

అయినా మన వ్యవస్థకు చీమకుట్టినట్టయినా లేకపోవడం, ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, నేతలు నిర్థిష్టమైన చర్యలేమీ తీసుకోకపోవడం దారుణం.
పైగా పుండు మీద కారం చల్లినట్టు వేణుది ఆత్మహత్య కాదు హత్య అనే దుర్మార్గపు ప్రచారానికి ఒడిగట్టడం నిజంగా రాక్షసత్వమే.

కాగా, ఇవాళ వేణుగోపాల్‌రెడ్డిది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్‌ వర్గాలు నిర్ధారించాయి. మృతదేహంతో పాటు లభించిన సూసైడ్‌ నోట్‌లోని చేతిరాత వేణుగోపాల్‌దేనని కాలిగ్రఫీ నిపుణులు నిర్థారించారు.
ఈమేరకు ఈ రోజు దినపత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.

వేణూ నీ విషయంలో నిజం నిప్పులాంటిది, సత్యమేవ జయతే అని మరోసారి నిరూపితమయింది.
వృధా కాదు నీ మరణం !
తెలంగాణా రాష్ట్ర సాధనే నీకు నిజమైన నివాళి !









.

Thursday, January 28, 2010

''రాజకీయ నాయకులు తెలంగాణా వాదం అనే తెప్పను ఎక్కి అవసరం తీరిపోగానే తెప్పను తగుల బెట్టేరకంగా తయారవుతున్నారు!'' - చిరంజీవి (జగిత్యాలలో )

.





2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల లో ప్రత్యేక తెలంగాణా అంశంపై తమ పార్టీ స్టాండును వివరిస్తూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ఇది:

.




.

''జగిత్యాలలో నేను చెప్తున్న మాట - మరొక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాను.
ప్రజారాజ్యం ఈ ప్రజల అభిష్టానికి అనుకూలంగా, అనుగుణంగా స్పందిస్తుంది.
సానుకూలంగా వుంటుంది.

నా వెనకాల ప్రజలున్నారు.
నా ఉద్దేశంలో ప్రజాభివృద్ధి చేయాలి.
వాళ్లందరినీ అభివృద్ధి పథం వైపు నడపాలి.
స్వార్థ రాజకీయాలు ఉండకూడదు.
ఇక్కడ అన్ని రకాల వనరులుండి .. వాటిని అనుకూలంగా మనం మలచుకోవాలి.
మన రాష్ట్ర సంపద ఈ ప్రాంత అభివృద్ధి కోసంగా ఈ ప్రాంతం సంపదని పెంపొందించాలి.
అది చివరకు మీ అందరికి లబ్దిచేకూర్చాలి. అందుకని మరొక్కసారి చెప్తున్నాను. మీరు ...

కేంద్రం గనక ప్రతిపాదించి అది ముందుకు తీసుకురావాలి అని మనందరం అడుగుదాం.
కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీమరీ చెప్తున్నాను.
ఇంతకంటే ఇంకేమి ''క్లారిటీ'' కావాలి?
ఇంతకంటే ఇంకేమి చెప్పాలి?
చెప్పండి మీరు. మీరు అడగండి నన్ను.
ప్రజా ప్రతినిధులో, రాజకీయ నాయకులో వాళ్లు కాదు మీరు చెప్పండి.
మీరు ఏమంటే దానికి స్వాగతిస్తాను. దానికి సానుకూలంగా స్పందిస్తాను.
మీ అభీష్టమే నా అభీష్టంగా చెప్తాను.
మీరు చెప్పాలి. మీ మధ్యనుండి అడుగుతున్నాను. చెప్పండి.
(జై తెలంగాణా...జైజై తెలంగాణా నినాదాల హోరు).

నిజంగా మనందరికీ ఆ తెలంగాణా కావాలి అని అందరూ అనుకుంటే గనక
కేంద్రం దగ్గర పెద్ద ''సౌండ్‌'' చేద్దాం.
పెద్ద ''శబ్ధం'' చేద్దాం.
మీ గొంతు అక్కడ వినపడేలాగా చేద్దాం.

కేంద్రం నిర్ణయం ... కేంద్రం నిర్ణయించాలి. అది మీ దాకా చెప్పక - ఇక్కడి వాళ్లేదో చేయడం లేదు ... చేయడం లేదు అంటే ... కేంద్రం నిజంగా -
వాళ్లకి చిత్తశుద్ధి వుంటే ... మన అభీష్టానికి అనుకూలంగా వాళ్లు నిర్ణయం తీసుకుని... వాళ్లు ప్రతిపాదిస్తే గనక మనం సానుకూలంగా స్పందిస్తాం...!
మనం అడ్డుగా వుండం!! మనం స్వాగతిస్తాం!
ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని!
మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!!


అందుకని మరొక్కసారి -
జన సమక్షంలో వుండి ...
జనం మధ్యలో వుండి ...
జగిత్యాల నడిబొడ్డులో వుండి ...
జనం మధ్యలో వుండి ... చెప్తున్నాను....
చిరంజీవి ... ప్రజారాజ్యం కేంద్రం ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితిలో అడ్డుగా వుండదు!
వుండదు!! వుండదు!!!


ఈ రోజున సామాజిక న్యాయం కావాలి !
సామాజిక తెలంగాణా కావాలి !!

ఎక్కడైతే గనక సామాజిక ఉద్యమం మొదలయిందో ఇక్కడ జగిత్యాలలో మళ్లీ చెప్తాను ...
సామాజిక తెలంగాణా రావాలి!
దానికోసం మనందరం పాటుపడదాం!!

మీ అభీష్టాన్ని మనం అక్కడ తెలియజేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నిద్దాం.
కానీ దానికి కావలసింది మీ చేతుల్లో వుంది.
మీరు దానికోసం అత్యధికంగా మన గొంతు అక్కడిదాకా వినిపించేలాగా ఇక్కడి నుంచి మీ ప్రజాభీష్టానికి అనుకూలంగా ప్రజా ప్రతినిధులు కావాలి.
ప్రజా ప్రతినిధుల్ని మీరు ఎన్నుకోండి.
ప్రజారాజ్యంకు అత్యధిక ప్రజా ప్రతినిధుల్ని మీరు ఇవ్వగలిగితే ఆ రకంగా ఢిల్లీ దాకా మనం ప్రతిపాదిద్దాం...!
మీ అభీష్టానికి అనుకూలంగా వుందాం!

కానీ
తుది నిర్ణయం మాత్రం కేంద్రందే!
కేంద్రం దానికి సానుకూలంగా స్పందించాలి!!
కేంద్రం స్పందించి ప్రతిపాదిస్తే మాత్రం
ఈ చిరంజీవి .... మీ చిరంజీవి.... మీ ప్రజారాజ్యం ...
దానిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోదు ...!
అడ్డుకోదు...!!
అడ్డుకోదు...!!! అని చెప్తున్నాను.


కానీ
తమాషా ఏమిటంటే...
రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారు అంటే ... పూర్వం నుంచి వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు అంటే ...
కొంతమంది ఈ తెలంగాణా వాదం అనే ఓడను... తెప్పను ఎక్కి
అవసరం తీరిపోగానే తెప్ప తగలబెట్టే రకంగా తయారవుతున్నారు!!

మరికొంతమంది ఓడ ఎక్కిని తరువాత ఓడ మల్లన్న అంటున్నారు.
ఓడ దిగిన తరువాత బోడి మల్లన్న అంటున్నారు !!


ఇలాంటి అవమానాలకు గురయ్యే కదా మీ ''ఆత్మ గౌరవం'' దెబ్బతింది?!
కనుక- మీ ఆత్మగౌరవానికి ప్రథమ పీట వేస్తాం!
సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణాకి ప్రథమ పీఠం వేస్తాం!!

ప్రజల అభీష్టానికి మేం ... ప్రజారాజ్యం... మన ప్రజారాజ్యం ముందుంటుందని మీ అందిరి సమక్షంలో మళ్లీ మళ్ళీ చెప్తున్నాను.

- - -

... పూర్తి ప్రసంగం వీడియోను ఈ కింది యూట్యూబ్‌ లింక్‌లో చూడవచ్చు.

CHIRANJEEVI'S JAGITYAL SPEECH VIDEO CLIPPING



.

Wednesday, January 27, 2010

గణాంకాల మాటున గడసరి తనం - ప్రొ. లక్ష్మణ్ , ఉస్మానియా విశ్వవిద్యాలయం . వ్యాసం ...

.
.
ఇవాళ్టి " ఆంద్ర జ్యోతి " దినపత్రికలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొ. లక్ష్మణ్ రాసిన "గణాంకాల మాటున గడసరి తనం" అనేక వాస్తవాలను వెల్లడించింది. చదవని వారి కోసం దానిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆంద్ర జ్యోతికి , ప్రొ. లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు.


దీనితో పాటు ఈ కింది లింకును కూడా చదివితే మరింత ఉపయుక్తంగా వుంటుంది.
తెలంగాణా ఆకాంక్షల చరిత్ర

.

Wednesday, January 20, 2010

తెలంగాణా ఉద్యమ కవుల రణన్నినాదం ''జాగో.. జగావో...!''


తెలంగాణా తరతరాలుగా ప్రాంతీయ, ప్రాంతేతర నేతల మోసాలకూ, దోపిడీకీి, అణిచివేతకూ, అన్యాయానికీ గురవుతూ వస్తున్న గడ్డ. అందుకే అది ప్రజా ఉద్యమాలకు, త్యాగాలకూ అడ్డా అయింది.
తెలంగాణా నేలలోంచి గుప్పెడు మట్టిని చేతిలోకి తీసుకుని పలకరిస్తే అది పాటై ఎన్నో పోరాట గాధల్ని వినిపిస్తుంది.
తెలంగాణాలో అక్షరంముక్కరాని మట్టిమనిషి కూడా పోరాటాలకు పాఠాలు నేర్పిస్తాడు.
ఉద్యమాలచేత ఓనమాలు దిద్దిస్తాడు. పాటకోసం ప్రాణాలిస్తాడు.
కృష్ణా గోదావరి నదులు రెండు పక్కలా రెండు బాహువుల్లా వున్నప్పటికీ న్యాయమైన నీటి పంపకానికి నోచుకోక అత్యధిక తెలంగాణా నేలలు బీడుబడ్డాయి. అందుకే ఆ నేలల్లో అలజడులూ, ఆందోళనలూ ఎప్పుడూ మొలకెత్తుతాయి. పాటలూ, కవితలూ విస్తారంగా పండుతాయి. ఉద్యమాల తొలకరి జల్లులు కురిసినప్పుడు వాటి దిగుబడి చెప్పనక్కరలేదు.

1946 నుంచి 1951 వరకూ సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటకాలంలోనూ, 1968-69 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమకాలంలోనూ ప్రజల్ని చైతన్యపరచడంలో కవులూ కళాకారుల పాత్ర అపూర్వం.
ఇదిగో ఇవాళ మళ్లీ అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలంగాణా పోరాట పాటలు పల్లవిస్తున్నాయి. ఉద్యమ కవితలు కొత్త చిగుళ్లు తొడుగుతున్నాయి.

2009 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్‌డేగా పాటిస్తూ తెలంగాణా కవులూ కళాకారులూ హైదారాబాద్‌లో పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఉద్యమ జలపాతంలా సాగిన ఆ కవిసమ్మేళనంలో వెల్లువెత్తిన పాటలను, కవితలను ఏర్చికూర్చి తీసుకొచ్చిన సంకలనమే ఈ ''జాగో జగావో''.

ఇందులో లబ్దప్రతిష్టులు మొదలుకుని కొత్త తరం కవులు కలిసి రాసిన 117 కవితలూ, పాటలూ, పద్యాలూ వున్నాయి.
ఈ ఒక్క పుస్తకం చదివితే చాలు తెలంగాణా ప్రాంతేతరులకు తెలంగాణా ప్రజల ఆకాంక్ష, ఆవేదన, ఆక్రోశం, వారికి జరుగుతున్న అన్యాయం ఏమిటో అర్థం అవుతుంది..
అదేవిధంగా నైరాశ్యంతో కొట్టుమిట్టాడే తెలంగాణా మూలవాసులు చదివితే వారికి నూతనోత్తేజం, భళ్లున తెల్లవారు నింక భయంలేదు అన్న భరోసా కలుగుతుంది.

''కన్రెప్పలు తెరిచుండంగనే శత్రువు మన ఇంటిని, ఒంటిని వేలం పాటకు పెడుతున్నడు. నిద్రపోయిన కాడికి చాలు. లేవండి. లేపండి (జాగో, జగావో)'' అంటూ చురుకు పుట్టిస్తుంది.
తొలి పేజీలో పుస్తక సంపాదకులు ప్రకటించుకున్నట్టు నిజంగానే ...

'' బిగిసిన వంద కలాల పిడికిళ్లివి.
గొంతెత్తిన వంద కొడవళ్లివి.
వలసాంధ్రాధిపత్యం మీద ఎగరేసిన నిరసన జెండాలివి. ...''

ఈ సంకలనంలో చాలా కవితలు హైదరాబాద్‌ చుట్టే పరిభ్రమిస్తాయి.
మాయల ఫక్కీరు ప్రాణం చెట్టు తొర్రలోని చిలుకలో వున్నట్టు సమైక్యాంధ్ర లోగుట్టంతా హైదరాబాద్‌ నగరంలోనే వుంది.
హైదరాబాద్‌ను ... నిన్నటి హైదరాబాద్‌ రాష్ట్రం నుంచీ, రేపటి తెలంగాణా రాష్ట్రం నుంచీ వేరుచేయడం గురించే మల్లగుల్లాలు పడుతున్నారు. 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌కు డాంటే' తీరులో చరిత్ర వక్రీకరణకు కత్తులు నూరుతున్నారు.
నిజానికి అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచెంది, యావద్దేశంలోనే ఐదో మహానగరంగా అ లరారుతున్న హైదరాబాద్‌ నగరమే తెలంగాణాలో లేకుంటే ఒక్క ఆంధ్ర నేతైనా తెలంగాణా మొహం చూసివుండేవాడా?
కర్నూలు కాదని తెలంగాణాలోని ఒక పట్టణాన్ని రాజధానిగా అభివృద్ధి చేసుకుంటూ కూర్చుని వుండేవాడా?
ఆనాడు ఆత్మాభిమానం, దూరదృష్టి లేని తెలంగాణా నేతల అసమర్థత వల్లనే శకుని పాచికలకు తెలంగాణా బలయ్యింది.
ఇప్పటికీ అనేకమంది తెలంగాణా నేతలు తమ చవటాయితనాన్ని, తమ బానిస మనస్తత్వాత్వాన్ని చాటుకుంటూ తమ స్వార్థం కోసం హైదరాబాద్‌కు సరికొత్త వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా వున్నారు.
అందుకే కాబోలు ఈ సంకలనంలో ఎక్కువ కవితలు హైదరాబాద్‌ చుట్టే అల్లుకున్నాయి.

''ఆదాబ్‌ హైదరాబాద్‌'' అనే కవితలో సుప్రసిద్ధ కవి 'లోచన'్‌ ఇలా అంటారు..."
....
మక్దూమ్‌ మల్లె పందిరి కింద మంట పెట్టేవాడికి
మనసు మమకారాల మాటేమి తెలుసు?
ఇక్కడి జీవధారలు తరలించుకుపోయిన పైరేట్లెవ్వరు?
సహజ సంపన్న తెలంగాణ తల్లిని
చింపిరి గుడ్డల్లో నిలిపిన వంచనా శిల్పులెవరు?
ప్రాణాన్ని మించిన ఆమె అభిమానాన్ని అవహేళన చేసిందెవ్వరు?
నీవు తిన్నింటి వాసాలు లెక్క పెట్టవు ... ... తగుల బెడతావు!
....
మనసున్న నగరమిది
మొహబ్బత్‌కి దునియా యిది
ఇక్కడి చౌరస్తాలో నిలబడి ధృతరాష్ట్రుని చేతులు చాచకు
...
అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు
అమ్మను కూడా నమ్మడు కదా
అవును తెలంగాణా తెర్లయింది
దొంగలు పడ్డ ఇల్లయింది
తెలంగాణా వాడు
నీకు దివానా గాడు
...
హైదరాబాద్‌ నీకు అతిపెద్ద ఆర్థిక మండలి కదా
నీ వేమైనా కొనగలవేమో గానీ
తెలంగాణాకి వెలకట్టలేవు''
- లోచన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌)

తన ప్రియురాలికోసం ప్రాణాలిచ్చి వాలెంటైన్స్‌ అమరుడయ్యాడు. తను ప్రాణాధికంగా ప్రేమించే భార్య మరణిస్తే షాజాహాన్‌ తాజ్‌మహల్‌ని నిర్మించి చరిత్రకెక్కాడు. కానీ తన

కులం, మతం గాని ఒక నిరుపేద నెచ్చెలి (మాదిగ కులస్తురాలైన భాగమతి) కోసం ఒకరాజు ఏకంగా మహానగరాన్నే నిర్మించడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా, ఒక్క భాగ్యనగరంలో తప్ప. అంతటి గొప్ప నగరం ఇవాళ కన్నీరు కారుస్తోంది అంటారు గుడిపల్లి రవి తన ప్రేమనగరం పాటలో.

'' దేఖో దేఖో భాయీ - మేరా హైదారాబాద్‌ రోయీ..
జెర దోఖో సునో భాయీ తుమ్‌ హైదరాబాద్‌ రోయీ..
భాగమతి పేరున కట్టిన భాగ్యనగరమూ // దేఖో దేఖో //
ప్రేమికుల గలుపనీకె వాలెంటైన్స్‌ ప్రాణమిచ్చె
షాజహాన్‌ ప్రేమ కొరకు తాజ్‌మహల్‌ బంగ్ల గట్టె
దునియాల లేనె లేదు - ప్రేమ కొరకు గట్టిన నగరం'' // దేఖో దేఖో //
...
- గుడిపల్లి రవి (ప్రేమ నగరం హైదరాబాద్‌ - పాట)

హైదరాబాద్‌ ఎలాంటి నగరం? ఎటు చూసినా పచ్చని చెట్లతో, బాగ్‌లతో, అనాబ్‌షాహీ ద్రాక్ష, పూల తోటలతో పరిమళ భరితంగా విలసిల్లుతుండే నగరం. ఇవాళ మురికి కూపంగా, కాలుష్య కాసారంగా, రియల్‌ ఎస్టేట్‌ దందాలకు అడ్డాగా మారింది. ఇప్పుడు దానిని తెలంగాణా నుంచే శాశ్వతంగా వేరు చేయాలనే కుట్రలు కుతంత్రాలు సాగుతున్నాయి.ఇదంతా ఎవరి పుణ్యం?

''ఇది అత్తర్‌ నగరం
కంపు రాజకీయాలతో
బీమార్‌ చేయకు!
దోస్తీ చేసిన వాళ్లను
ధోకా చెయ్యకు!
ఇక్కడి జనాలది భోళా గుణం
నా గిన్నెలనే తిని
నీ ఎంగిలి నీళ్లని
నా ముఖం మీద కొట్టకు!
కరచాలనం చేసిన చేతిని
కపటంతో నరకకు!
...
నన్ను నెట్టివేస్తూ నెట్టివేస్తూ
నేను నిలుచున్న నీడను లాక్కున్నావు
జరుగుతూ జరుగుతూ
చివరిమెట్టుదాకా జారాను
ఇప్పుడు ఉల్టా తిరుగకపోతే
నాకు బతుకు తెరువు లేదు
- ఆశారాజు ( నా భాగ్య నగరం తెలంగాణా వజ్ర కిరీటం)

మతసామరస్యానికి, మమతానురాగాలకు పెట్టింది పేరైన హైదరాబాద్‌కు వందనాలు చెబుతూ షాజహానా రాసిన కవిత ఆర్ద్రతను కలిగిస్తుంది.

''ఇరానీ చాయ్‌ కమ్మదనపు రుచి
ఇరుమతాల దోస్తానాను గుర్తు చేస్తుంది
హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమల ధూమాలు
భూమి చుట్టూ సాంబ్రాణి పొగలై అ లుముకుంటాయి
రాత్రి కూడా పగలై విచ్చుకునే
రాత్రీ పగలూ తేడాలేని కష్టజీవి ఈ నగరం

ఈ చార్‌ సౌ సాల్‌ షహర్‌ బిడ్డలు
సంపాయించడానికే బతకడంలేదు
భూమిని చాపలా చుట్టి చంక కింద పెట్టుకునే
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కాదు వాళ్లు
నగర జీవనానికి నాడి వాళ్లు
షహర్‌ వాళ్లకు అమ్మ
నగరానికి నిజమైన వారసులు వాళ్లు
...
కడుపు చేతుల పట్టుకునొస్తే
కన్నీరు పెట్టిన నగరం మీకింత చోటిచ్చింది
గిరిగీసుకుని లేదుపొమ్మని
మీ మొఖాన తలుపెయ్యలేదు చూడూ..
అ లాంటి అమ్మను లంజ అంటారా?
మీ లాంటి లక్షలాది కృతఘ్నుల్ని
ఒడిలో మోస్తున్న నా హైదరాబాద్‌
అ ల్లావుద్దీన్‌ చేతిలో ఎన్నటికీ ఆరని అద్భుత దీపం
మేరా హైదరాబాద్‌
తుఝే సౌ బార్‌ సలాం!!''
- షాజాహానా (మేరా హైదరాబాద్‌)

హైదరాబాద్‌ను ప్రీజోన్‌ చేయాలనే వాదనపై ఆగ్రహం వెళ్లగక్కుతూ వఝల శివకుమార్‌ సంధించిన వ్యంగాస్త్రాలు ...

'ఔను మరి
మీకు నగరం ఫ్రీ జోనే!
వడ్డించిన విస్తరి
తేరగా ఆరగించడానికి
పరిచి పెట్టిన పక్వాన్నాల భోజనం!
...
ఇంక ఆడుండ్రి
ఫిలిం నగర్ల నుంచి ఫిలిం సిటీల దాంక
జూపార్కుల నించి జూబిలీ గుట్టల దాంక
సేట్లు మీరు, కార్పోరేట్లు మీరు
రూట్లు మీరు, పర్మిట్లు మీరు
సినిమా వాళ్లు మీరు
సినిమా హాళ్లు మీరు
మా రక్తాన్ని జనిగెల్లా పీల్చే
బళ్లు మీరు పెట్టుబళ్లు మీరు
ఔను మరి ...
నగరం మీకు ఫ్రీ జోనే...!

కబ్జాలు కబ్జాలై రియలెస్టేటులై
గ్రేటర్‌ బోర్డులై ఔటర్‌ రింగ్‌ రోడ్డులై
చుట్టుముట్టు పల్లెల్ని
ఎవుసం భూముల్ని
ఆంబుక్క పెట్టవచ్చు
పోద్దెక్కితే దిల్‌సుఖ్‌నగర్‌ నించి కూకట్‌పల్లి దాంక
మీ ఫాక్షన్‌ కక్షల ప్రతీకారాల్ని
నిరాటంకంగా తీర్చుకోవచ్చు
మీ కోస్తా ద్రోహాల మార్కెట్లు తెరిచి
మసిబూసి మారేడు కాయ జెయ్యొచ్చు
పొద్దు గూకితే నారాయణగూడల్ని, నెక్లెస్‌ రోడ్లని
తెనాల్జెయ్యొచ్చు, పెద్దాపురాల్జెయ్యొచ్చు
నమ్మినోల్లని నట్టేట ముంచే తీరుల్ల
ఆరితేరినోళ్లు గదా
ఔను మరి నగరం మీకు ఫ్రీ జోనే...!''
- వఝల శివకుమార్‌ (ఫ్రీ జోన్‌)

ఇదే వాదనపై రాసిన మరోకవితలో జూపాక సుభద్ర ఇలా అంటారు-

''వారీ వలస రాబందూ...
నీ వల్లనే హైద్రాబాదు సీరె రైక గట్టిందని
బొట్టు బోనం బెట్టిందని
నేను రాకముందు గీడ జిల్లేల్లు పల్లేర్లని
గబ్బిలాల దుబ్బులుండేయని
రాజిర్కములున్నవని
నీ నాలికెకు నరమే లేకపాయె!
నోరున్నదని కిందాకు మీద
మీదాకు కింద జేస్తె యెట్లయితది?!
...
వామ్మో తుర్క దేశమని
బాబోయ్‌ నక్సలై టేరియాని దొంగ బుగుల్లు
కేంద్ర పాలితం జెయ్యాలన్న ఆంధ్ర ట్రిక్కులు
మా హైద్రాబాద్‌ పాదాలకాడ పానసరం బడనీకె
యిప్పుడు ఫ్రీ జోన్‌ పడగలూదినా
నీ వూదు గాలది పప్పుడకది బిడ్డా...
బాజాప్తుగ భాగ్యనగరం మాదే
గీ అవ్వల్‌ దర్జా హైద్రాబాద్‌
మా వీర తెలంగాణది
పోరు తెలంగాణది,
మా వేరు తెలంగాణది.
- జూపాక సుభద్ర ( తెలంగాణ సెమట పువ్వే అవ్వల్‌ దర్జా హైద్రాబాద్‌)

మరెన్నో కవితల్లో కూడా ఇదే తరహాలో ఆవేదన ఆక్రోశం వ్యక్తమయింది.

''ఎవడి నోటికొచ్చినట్టు వాడు మాట్లాడుతున్నడు
హైదరాబాద్‌ ఎవడబ్బ సొమ్మని తేల్చమంటుండ్రు?
మా మూసీ నదిని మురికిగా మార్చినందుకా?
మీరు పరిశ్రమలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తి
కాలుష్యాన్ని మాకు మిగిల్చినందుకా?
మా భూగర్భ జలాల్ని విషంగా మార్చినందుకా?
హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంట...!
బతుకమ్మ కుంటలో బతుకమ్మలాడకుండ చేసినందుకా?
మా టాంక్‌బండ్‌ను సచ్చి గూడా మీ పెద్దలు ఆక్రమించినందుకా?
- శీలం రామ్మూర్తి (హైదరాబాద్‌ ఎవల్ది?)

మదరాసాంధ్రుల జిట్టికండ్లు శిమ శిమన్నయి
భాషా రాష్ట్రాల సమైక్యత చీడ బుట్టింది
ఆంధ్ర హైదరాబాద్‌ విష విలీన మంత్రం
బట్టపులికి మ్యాక పిల్లకు పొత్తు కలిపిండ్రు
పెద్ద మనుషుల ఒప్పందం గద్దల పాలైంది
భుజాల మీదెక్కి సవారి చేస్తండ్రు
- అన్నవరం దేవేందర్‌ (దోఖా)

హైదరాబాద్‌ పేదకొడుకుల ప్రేమగల తల్లి
ఒక్క బన్‌ రొట్టెను చెరిసగం తినిపిస్తుంది
తాను పస్తులున్న సంగతి తన ప్రాణానికే తలియనివ్వదు
కొడుకుల్ని చూస్తే చాలు ఆమె కడుపు నిండుతుంది
- అమ్మంగి వేణుగోపాల్‌ (కన్నతల్లి)

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ పాట ఆనాడు మదరాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరయ్యేందుకు, సీమాంధ్రలోని తెలుగు వాళ్లలో ఆత్మాభిమానాన్ని ప్రేరేపించేందుకు ఎంతగానో దోహదం చేసింది. కానీ అదే పాటను ప్రయోగించి తెలంగాణా ప్రజల్ని వంచించేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం తెలంగాణా ప్రజలు హర్షించలేకపోయారు. మా ఇంటిని కొల్లగొట్టేందుకు కన్నం వేసిన వాడిది మా భాషైతేంది, మా కులమే ఐతేంది?

''వందేమాతరం, బందీ మాతరం
నిర్జలాం నిష్ఫలాం
రోజూ ప్రార్థన చేస్తనే వున్నం వినేదెవరు?
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
గలగలా గోదారి కదలిపోతుంటేను
విలవిలా మానేల 'ఎండి పోతుంటేను'
బిరబరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
కటకటా 'కరువమ్మ వచ్చి నిలుచుంటేను'
...
మా భూమి మా నీళ్లు దక్కి తీరేదాక
మా ఆటలే ఆడుతాం
మా పాటలే పాడుతాం
జై తెలంగాణా జైజై తెలంగాణా !!
- తైదల అంజయ్య (తెలంగాణ స్కూల్‌ అసెంబ్లీ)


" తెలంగాణ గొంతు పెగలంగనే
తెలుగు భాష తియ్యగైతదెందుకు?
...
ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్న కొడుకుల్లారా
అమ్మని తాకట్టు బెడుతున్న బిడ్డలారా సల్లగ బతుకురి
ఆంధ్రోల్ల ఎంగిలి మెతుకులు తిని
ఆల్ల మోచేతి నీల్లు తాగి ఎయ్యేండ్లు వర్దిల్లురి
ఆల్లెప్పటికీ పడుసోల్లే ఇప్పటికింకా పదహారే
ఆల్ల కాళ్లు బట్టుకోరి - కాలనీల సుట్టు తిరుగురి
ఆపార్టుమెంట్లు గట్టియిరి - హైద్రాబాద్‌ రాసియ్‌రి
ఆమ్మ ఆడుక్క తింటేంది - కన్నబిడ్లల్ని అమ్ముకుంటేంది
ఉన్న ఉద్యోగాలు ఊడితేంది - అన్నదమ్ములు దుబాయ్‌ల సస్తేంది?
ఏమన్నగానీ... ఎట్టనన్నబోనీ...
ఆల్లని పల్లెత్తు మాటనకురి
మీ పదవులు బోతయ్‌- పానాలు బోతయ్‌''
- అంబటి వెంకన్న (తెలుగు మాది - తెలంగాణ మాది)

ఆట పాటలతో తెలంగాణా పల్లెలు ఆనాడు ఎలా వుండేవి. ఈనాడు ఎలా వున్నాయి, ఆ సందడంతా ఏమైపోయింది అని గుండెలు కరిగేలా ప్రశ్నిస్తారు నిస్సార్‌ ఈ పాటలో -

''పండూ వెన్నెల్ల లోన - వెన్నెల్ల లోన
పాడేటి పాటలేమాయె?
మన పల్లెటూరి లోన ఆడేటి ఆట లేమాయె...?
...
స్టేజి కరెంటు మైకు ఏదీ లేకున్న గాని
తెల్లార్లు ఆడి పాడేది
మన పల్లె గుండెలోన మోగేటి కంచుగొంతులేవీ?
...
ఢిముకు, ఢిముకు డోలు దరువు
ఘల్లు ఘల్లు గజ్జెల్ల
ఒగ్గోల్ల కత లెటుబాయె?
మన ఢిల్లెం కల్లెం - చిల్లం కల్లం ఆయే!
...
వాడకట్టు అమ్మలక్క లొక్కతాన గూడి
సుట్టు కాముడాడే టోల్లు
మన పల్లెటూరినంత ఉయ్యాలలూపెటోల్లు

ఇద్దరక్క చెల్లెల్ల ఉయ్యాలో - వొక్కూరికిచ్చిరి ఉయ్యాలో
వొక్కూరికిచ్చిరి ఉయ్యాలో - వొక్కనికే ఇచ్చిరి ఉయ్యాలో
వొక్కడే మాయన్న ఉయ్యాలో - వొచ్చన్న పోడాయె ఉయ్యాలో
సక్కని మాయన్న ఉయ్యాలో - సూసన్న పోడాయె ఉయ్యాలో

చిన్నారి చెల్లెండ్లు, చెంగు చెంగు నెగురుకుంట
చెమ్మ చెక్కలాటలాడేది - మన వాకిల్లలోన ఆడపిల్లల లొల్లేది?
- నిసార్‌ (పండు వెన్నెల్లలోన)

తెలంగాణాలో ఇవాళ ప్రతి రోడ్డూ ఉద్యమ వేదికయి ఆటపాటలతో, పాదయాత్రలతో, నినాదాలతో మారు మ్రోగిపోతోంది. రోడ్డు మీదనే మహిళలు బతుకమ్మలు ఆడుతున్నారు. బడి పిల్లలు రోడ్ల మీదనే పరీక్షలు రాస్తున్నారు. కుల వృత్తుల వాళ్లు రోడ్ల మీదనే క్షౌరాలు చేస్తున్నారు, బట్టలుతుకుతున్నారు, కుండలు చేస్తున్నారు. వంటలు వండి వడ్డిస్తున్నారు.

''నేను మళ్లీ రోడ్డు మీదికొచ్చాను
భగాయించి నువ్వు ఇంట్లో నక్కినవ్‌
రోడ్డు ఇవాళ నినాదమైంది
రోడ్డు ఇవాళ ర్యాలీ ఐంది
రోడ్డు ఇవాళ రాస్తారోకో ఐంది
రోడ్డు ఇవాళ బంద్‌కి ప్రతిరూపమైంది
రోడ్డు అసెంబ్లీ ముట్టడికి దారి చూపింది
...
మాకు ఉద్బోధలు చేస్తావా?
రారా! నీకో నాలుగు నినాదాలు నేర్పిస్తా
నా రక్తంలో సోడా కలుపుకొని తాగి జోగుతున్నవాడా!
మత్తు దిగి తెరుచుకున్న నీ కన్ను మీద
తెలంగాణ పటం ప్రతిబంబమవుతుంది
అందులో నా హైదరాబాద్‌
కోహినూరై మెరుస్తుంది
- స్కై బాబ (రోడ్డు ఉద్యమం అడ్డా)

రెండు విడి రాష్ట్రాలు 1956లో ఒక జెంటిల్‌మెన్‌ అగ్రిమెంటు కుదుర్చుకుని ఒకటిగా విలీనమయ్యాయి. ఆ తరువాత ఆ అగ్రిమెంటులో ఒక్క నిబంధనని కూడా అమలు పరిచిన పాపాన పోలేదు. అగ్రిమెంటు అమలు కానప్పుడు ఇంకా పొత్తుల బేరం ఎలా చెల్లుతుంది.
1969లో తెలంగాణా ప్రజలు ఉవ్వెత్తున ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తే దాదాపు 400 మందిని పోలీసు కాల్పుల్లో చంపి, ఉద్యమ నేతలను మంత్రిపదవులతో లొంగదీసుకుని అత్యంత హేయంగా, అప్రజాస్వామికంగా, ఆన్యాయంగా ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. ఇవాళ మళ్లీ అదే సామ దాన భేద దండోపాయాలతో పాత మోసాన్నే పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
1956 తరువాత దేశంలో ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయి. అవి ఆంధ్ర తెలంగాణా మాదిరిగా అవేవీ మొదటినుంచీ విడి రాష్ట్రాలు కూడా కావు. ఆ విభజనలన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ తెలంగాణా విషయం వచ్చేసరికి ఇండియా పాకిస్థాన్‌ల మాదిరిగా ఏదో విపత్తు సంభవిస్తుందనే గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. దేశ విభజన సమయంలో ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి తమ ఇళ్లనీ, ఆస్తిపాస్తుల్నీ వదిలేసి కట్టుబట్టలతో పారిపోవాల్సి వచ్చినట్టు పోవాల్సి వస్తుందనీ, ఒక ప్రాంతం వాళ్లు మరో ప్రాంతం వెళ్లాలంటే పాస్‌పోర్టులు, వీసాలు అవసరం అవుతాయనీ దుర్మార్గ, కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారు. కృత్రిమ అపోహలను సృష్టిస్తున్నారు. అందుకే ఆనాడు కాళోజీ ...
తెలంగాణా వేరైతే
దేశానికి ఆపత్తా
తెలంగాణా వేరైతే
తెలుగు భాష మరుస్తారా ?
అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు గోరటి వెంకన్న అదే తరహాలో ప్రశ్నిస్తున్నారు.

''ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా
ఇండియా పాకిస్థానోలె ఇనుపకంచె పడుతుందా
......
మీ ఇడ్లి బండి అడ్డాజాగ మీరె నిలుపుకోవచ్చు
మీ కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డుల మీరే కులుకుతుండొచ్చు
మీ వనస్థలిపురంలోన వుండచ్చు, పండచ్చు
ఆ అమీర్‌పేట అడ్డాజేసుక అధికారం నెరుపుకోండ్రి
గా సెక్రటేరియట్‌ల మాత్రం నీ చక్రం తిప్పుతె గాదు
పొమ్మంటె పోవేందిర పోరా ఓ వలస దొర
...
తెలుగు జాతి ఒక్కటని తెగుల బడిపోతున్నవ్‌
అన్నదమ్ములిద్దరుంటే ఆస్తి పంచుకోర చెప్పు
భాష ఒక్కటైతె నన్ను బాధ పెట్టాలనుందా
జాతి ఒక్కటైతె నన్ను గోతిల ఎయ్యాలనుందా
....
ఊరిలోన అరెకురం భూమున్న దమ్ముకొచ్చి
ఈడి కొచ్చి హీరోలై విర్ర వీగ బడ్తిరి
త్యాగాలు మా చరిత్ర - భోగాలు మీ చరిత్ర
విశాలాంధ్ర గిశాలాంధ్ర జాంతానై సమైక్యాంధ్ర
విషాదాల కింక స్వస్తి తెలంగాణ కొరకు కుస్తీ
- గోరటి వెంకన్న (ఇద్దరం విడిపోతే)

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికీ ఇప్పటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికీ మధ్య ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆనాటి ఉద్యమంలో దాదాపు నాలుగు వందల మంది అమరులైతే వాళ్లలో ఒక్కరు కూడా ఆత్మ హత్య చేసుకున్న వాళ్లు లేరు. ఆందరూ పోరాటంలో, పోలీసుల తుపాకులకు బలయినవారే. కానీ ఇవాళ నీతి నిజాయితీలేని దివాళాకోరు రాజకీయ నాయకుల వల్ల... రాజకీయ పార్టీల దుర్మార్గమైన రెండు నాల్కల ధోరణి వల్ల... క్రమశిక్షణ, ఒక సిద్ధాంతం, చిత్తశుద్ధి , ప్రజలకు సరైన మార్గం చూపగలిగే సత్తా లేని నేతల వల్ల ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగి ఇప్పటికే దాదాపు 200 మంది వరకు తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకున్నారని/గుండెలాగి చనిపోయారని అంచనా. ఒకే పార్టీవాడు అక్కడ సమైక్యత అని నినదిస్తూ, ఇక్కడ ప్రత్యేక తెలంగాణా అంటూ నడిబజార్లో న్యాయం వలువలు ఊడదీసి అపహాస్యం చేస్తుంటే ఆమాయక జనం ఆగమైపోతున్నారు. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మన ప్రజాస్వామ్య వ్యవస్థకే, తెలుగువాళ్ల ప్రతిష్టకే మాయని మచ్చ. నిరాశానిస్పృహలతో అసువులు బాసిన అమరులకు కవులు అశృవులతో నివాళులర్పిస్తున్నారు.

తెలతెలవారంగా తెలిరేఖలై విచ్చి
తెలంగాణ కోసమై ప్రాణాలు ఒడ్డిన
వీరులారా మీకు జోహార్లు
మా బిడ్డలారా మీకు జోహార్లు
- వరవరరావు (తెలంగాణ అమరులు)

జోహార్‌ శ్రీకాంతన్నా
అగ్నికి ఆహుతి అవుతూ జంకుగొంకు లేకుండా
తెలంగాణ కోసమని తెగువ జూపి
అమర వీరుడవయ్యావా
కాలిన శరీరంతో మైకుల ముందు
జైతెలంగాణ అని చెప్పిన ధీరుడవయ్యావా..
- ముస్కు రాము (జోహార్‌ శ్రీకాంతన్నా)

ఇందులోని నిప్పుకణికెల్లాంటి 117 కవితల్నీ ఇక్కడ సమీక్షించడం సాధ్యం కాదు. వాటిలోని ఒకటో రెండో వాక్యాలని ఉటంకిస్తే వాటికి న్యాయం జరుగదు. పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివినప్పుడే దాని నాడి అందుతుంది.

''మేం చెమటోడ్చి కట్టుకున్న పుట్టల
నువ్వు బుస్సు... మంట పడగెత్తతే
చీమల్లెక్క అగ్గం బగ్గమై చెదిరిపోతున్నం.
...
దొంగలు దొంగలు వూళ్లు పంచుకున్నట్టు
ఫిరీజోన్‌ ముసుగులో దొడ్డిదారంట
మూటలు దాటేత్తుంటే
మాటలు రా కామోష్‌గ తండ్లాడుతున్నం
- దిలావర్‌ (ముల్కీ)
...
నవంబర్‌ ఒకటిని మా నెత్తిమీద గుది బండను చేస్తవు
దింపుకుందామంటే దినమొక వేషమేస్తవు
నీతిలేదు నియ్యతు లేదు
పోరా నాయనా ఫో
- కాసుల ప్రతాపరెడ్డి (మాట)
....
వంగుతె మాయం చేద్దమని వీడు
పెయ్యి మీది అంగిని దొబ్బినా
సోయిలేనోడు వాడు
మరె... ఇగేం కల్సుంటరు బిడ్డా ...
... ఇదివరకు ఇంటి దొంగలు దోసి తినిరి
ఇప్పుడు బైటి దొంగలు బరిబాత జేత్తాండ్రి
తెలంగాణ దొంగలుపడ్డ ఇల్లయింది బిడ్డా
- రామా చంద్రమౌళ్లి (ఇల్లంత తెర్లయింది కొడ్కా...)
....
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం
ఆంధ్ర రాష్ట్రం నిర్మాణంకై అక్కరకు వస్తే
నాలుగు వందల మంది
విద్యార్థి పోరగాండ్ల పానాలు తీసినా
తెలంగాణా ఇయ్యడానికి అక్కరకు రాలేదేంది?
... బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలు మీకు
బంజరు భూములు మాకు!
- దొంత భద్రయ్య (తెలంగాణ కావాల్నని మంకుపట్టు పడతం)
...
ముల్కీ రూల్లను పెద్ద మనుషుల ఒప్పందాన్ని
బుర్దల తొక్కి విశాలాంధ్ర ఆక్టోపస్‌ అయింది
పచ్చల్ల నమ్ముకుంట అగ్గసగ్గ భూముల బ్యారం బెట్టుకుంట
మా భూములను గుంజుకున్నరు
అసెంబ్లీ పార్లమెంటు జుడీషియరీ, మీడియాల
దురాక్రమణ చేసిన పేరాసైట్స్‌ ఒకటి రెండు కులాలే
మూలవాసులను జినోసైడు చేస్తున్నవి ఈ కులాలే
- గోగు శ్యామల (తెలంగాణ జాతి)
....
క్యా బద్‌నసీబీ హై హమారీ
మా నేల మాక్కాకుండా పోయింది
మా కళ్ల ముందే పేకముక్కల్లా పంపిణీ జరుగుతోంది
మా నీళ్లు - మా బీళ్లకు దూరమైనాయి
- సయ్యద్‌ ఖుర్షీద్‌ (పాకే రహేంగే తెలంగాణా)
.....
అణచివేత, ఆధిపత్యం ఒక రాక్షస క్రీడే
అందువల్లే కదా
మా మట్టి మానభంగానికి గురైంది
మాంసం కొనుక్కుపోయేంత సహజంగా
మా నేలతల్లిని అంగట్లో పెట్టి కాజేస్తుంటే
మేము యేం చేయాలో చివరకు అదే చేస్తున్నాం కదా!
- నాళేశ్వరం శంకరం (భూమి భవిష్యత్తు)
.......
పోలవరాలు, పోతిరెడ్డిపాడులు, ఓపెన్‌కాస్ట్‌లు, సిక్స్‌టెన్‌లు
ఫ్రీజోన్లు తెలంగాణా తల్లికి ఉరితాళ్ళైతుంటే
తెలుగు తల్లీ నీ పాటనే పాడలేను
తెలంగాణా తల్లి గుండె గాయాల్ని మరిచిపోలేను
- సహచరి (తల్లీ ... నీ పాట పాడలేను)

ఇంకా ఈ ఉద్యమ కవితా సంకలనానికి తెలంగాణా రాష్ట్ర గీతంగా పేరు గాంచిన
అందశ్రీ ''జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం '',
గూడ అంజయ్య రాసిన ''ఎనక ముందు సూసుడేంది రాజన్న ఓ రాజన్న ఎత్తుకో తెలంగాణ జండ రాజన్న ఓ రాజన్న'' పాట,
నందిని సిధారెడ్డి రాసిన ''నాగేటి సాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా''
పాట అదనపు ఆకర్షణగా నిలిచాయి.

జాగో ... జగావో
తెలంగాణా ఉద్యమ కవిత్వం


ప్రధాన సంపాదకులు:
స్కై బాబ
సంపాదకులు:
పసునూరి రవీందర్‌, షాజహానా, గోగు శ్యామల, అన్వర్‌, వేముగంటి మురళీ కృష్ణ, అన్నవరం దేవేందర్‌


187 పేజీలు, వెల: రూ.30/- (ముఫ్ఫై రూపాయలు)

ప్రతులకు:

స్కై బాబా
10-1-639, చింతల్‌ బస్తీ,
ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ 400 004

ఇమెయిల్‌:
skybaba@ymail.com
hcuravinder@gmail.com



...

Monday, January 11, 2010

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి నోట ప్రత్యేక తెలంగాణా పాట ....!



డాక్టర్‌ సి.నారాయణరెడ్డి నోట ప్రత్యేక తెలంగాణా పాట...
నమ్మలేకపోతున్నాను.

1969లో తెలంగాణా అంతటా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యతకు ఊపునిచ్చే ... '' తెలుగు జాతి మనదీ - నిండుగ వెలుగు జాతి మనదీ...'' అనే గీతం రాసి తెలంగాణా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న డాక్టర్‌ 'సినారె' నేడు '' ..తెలంగాణా ఏర్పడి తీరుతుంది, తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా వుంటే నష్టమేమీ లేదు '' అన్నారంటే...

నిజంగానే నమ్మలేకపోతున్నాను.

ఇవాళ్టి ఆంధ్ర జ్యోతిలో వచ్చిన ఆ వార్త చదవగానే ముక్కోటి రతనాల వీణలు ఒక్కసారి లయబద్ధంగా మ్రోగినంత ఆనందం కలిగించింది.

సినారే గారూ,
తెలంగాణా పై జాతి జనులు నిత్యం పాడుకునే మరో పాట రాసి ఆనాటి పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలి. మీకు జన్మనిచ్చిన తెలంగాణా తల్లి రుణం తీర్చుకోవాలి. ఇది మీకు మా వినయపూర్వక అభ్యర్ధన .
.......................

ఇదిగోండి ఆ వార్త

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి ... తెలంగాణా ఏర్పడి తీరుతుంది : సినారె

వేములవాడ, జనవరి 10 (ఆన్‌లైన్‌)

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌ జిల్లా వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ ఈనాటిది కాదనీ, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా వుండాలన్న ప్రతిపాదనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేశారని, అయితే తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా వుంటే నష్టమేమీ లేదన్నారు.

ఎన్‌డిఎ హయాంలో కొత్తగా ఏర్పడిన మూడు చిన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా స్వయం సమృద్ధికి అవకాశం వుంటుందని చెప్పారు.

ప్రాంతాల మధ్య వైషమ్యాలు అవసరం లేదని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దూషించడం సరైంది కాదని అన్నారు.
'' తెలంగాణ నాది, రాయలసీమ నాది, కోస్తా నాది....'' అన్న పాట ఎన్టీఆర్‌ కోరిక మేరకు రాశానని, నాటి పరిస్థితులు నేడు లేవని, ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం కోరుకుంటున్నారని సినారె అన్నారు.

- ఆంధ్రజ్యోతి 11 జనవరి 2010 సౌజన్యంతో

....................................................

జయహో తెలంగాణా జయహో!


.

Tuesday, January 5, 2010

'' జై సమైక్యాంధ్ర! '' నినాదంలో సీమాంధ్రలు తప్ప తెలంగాణా ఎక్కడుంది?

.


'' జై తెలంగాణా'' నినాదానికి - పోటీగా - గత డిసెంబర్‌ 10 నుంచి ''జై సమైక్యాంధ్ర'' నినాదం హాడావిడిగా తెరమీదకు వచ్చింది!

లోగడ ''జై ఆంధ్ర!'',
''జై గ్రేటర్‌ రాయలసీమ!''
నినాదాలు విన్నాం కానీ ఎప్పుడూ ఈ '' జై సమైక్యాంధ్ర! '' నినాదం వినలేదు.

1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తప్ప సమైక్యాంధ్ర పేరుతో ఎప్పుడూ ఏ ఉద్యమమూ జరుగలేదు.

ఇంతకీ ''జై సమైక్యాంధ్ర'' అంటే అర్థం ఏమిటి?
ఆంధ్ర - రాయలసీమ ప్రాంతాలు సమైక్యంగా వుండాలనేనా?
ఆ నినాదంలో అదే ధ్వనిస్తోంది!

1953లో పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది ఆంధ్ర రాయల సీమ ప్రాంతాలతో కూడిన '' ఆంధ్ర '' రాష్ట్రమే కదా!

అందువల్ల ''జై ఆంధ్ర'' అన్నా, ''జై సమైక్యాంధ్ర'' అన్నా ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాలే ధ్వనిస్తాయి తప్ప తెలంగాణా మాత్రం కాదు.

1956లో ఆంధ్ర - తెలంగాణా ప్రాంతాలు కలిసి ''ఆంధ్ర ప్రదేశ్‌'' రాష్ట్రంగా అవతరించాయి.
దరిమిలా చేస్తే గీస్తే ''జై సమైక్యాంధ్రప్రదేశ్‌'' అంటూ నినాదం చేయాలి గానీ జై సమైక్యాంధ్ర అని నినదించడం వల్ల ఆశించిన భావం రాదు.

ఎన్‌టివీ వారు నిన్న రాత్రి విద్యార్థులతో నిర్వహించిన చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి అజయ్‌ వేసిన ప్రశ్న ఇది.

నిజానికి 1956లో ఈ రెండు రాష్ట్రాలూ విలీనమవుతున్నప్పుడు కొత్త సమైక్య రాష్ట్రానికి ముందుగా అనుకున్న పేరు ''ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం''

ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టే లోపే ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఆంధ్రా నాయకులకు ఈ సంకరజాతి పేరే బాగా నచ్చింది. తెలంగాణా పేరంటేనే వారికి అప్పటినుంచే చిన్నచూపు.

''ప్రదేశ్‌ '' అనేది తెలుగు పదం కాదు.
హిందీ పదం.
ప్రదేశ్‌ అన్న ఆ దిక్కుమాలిన పదాన్ని అరువు తెచ్చుకోవడంతోనే మనం తెలుగుదనాన్ని, తెలుగు స్వాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని కోల్పోయాం.

మొదట్లో ఆంధ్ర రాయలసీమ రాష్ట్రాలతో కలిసి ఏర్పడిన ''ఆంధ్ర రాష్ట్రం'' లో చక్కని తెలుగుదనం వుంది !
తెలంగాణా అన్న పేరులో తేనెలొలికే చిక్కని తెలుగుదనం వుంది !!
తెలంగాణము అంటే తెలుగు వాళ్లు నివసించే ప్రాంతం అని అర్థం (ఆణెము=నివాసము).

కానీ ఆ రెండూ కాదని "ఆంధ్రప్రదేశ్‌" అన్న హైబ్రీడ్‌ పేరు ఎవరికి ఎందుకు నచ్చిందో తెలియదు.
తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా వంటి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలకు లేని హిందీ/ఢిల్లీ బానిసత్వం మనకెందుకో అర్థంకాదు.

తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా గొప్పలు చెప్పుకోవడమే గానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో అధికార భాషగా తెలుగును మనమే పూర్తిగా అమలు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో వున్నాం. మన నేతలకు మెక్కడం మీద వున్న యావ తెలుగు భాషను అభివృద్ధిపరచడం మీద లేదు గాక లేదు.
తమిళనాడును చూసైనా మన పెద్దలకు బుద్ది తెచ్చుకోరు.

ఇంకెందుండీ భాష పేరిట ఈ మేడిపండు సమైక్యత?

మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడే -
మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఔన్నత్యం రెండు రాష్ట్రాల్లో పోటీ పడి దేదీప్యమానంగా వెలుగొందుతాయి. ఇది తథ్యం.

అందుకే సామరస్యంగా, మనస్ఫూర్తిగా అర్థవంతంగా నినదిద్దాం....

జై సమైక్యాంధ్ర (సీమాంధ్ర) !!
జై తెలంగాణా !!

Saturday, January 2, 2010

తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు



ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించినంత వరకు 2010 కచ్చితంగా "తెలంగాణా నామ" సంవత్సరమే !

స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం ,
స్వయం పాలన కోసం ,
ఆత్మ గౌరవం కోసం ,
అస్తిత్వం కోసం తెలంగాణా ప్రజలు శతాబ్దాలుగా పరితపిస్తున్నారు .

1947 ఆగస్ట్ 15 తొలి స్వాతంత్ర్య దినోత్సవ తీపి అనుభూతి తెలంగాణా ప్రజలకు తెలియదు. అప్పుడు వారు నిరంకుశ నిజాం సైన్యంతో , రజాకార్లతో జీవన్మరణ సాయుధ పోరాటం చేస్తున్నారు .

1948 సెప్టెంబర్ సైనిక చర్య నిజంగా తెలంగాణాను విముక్తం చేసిందో , వారు సాధించిన విజయాలను , వారి ఆకాంక్షలను చిదిమేసిందో ఇంకా చర్చనీయాంశమే .

అటు -
ప్రజల చేతుల్లో శత్రువుగా చావాల్సిన లేదా దేశం విడిచి పారిపోవాల్సిన "తర తరాల బూజు నిజం రాజు " హిజ్ ఎక్సలెన్సీ హై నెస్ గా " రాజ ప్రముఖ్ " గా గౌరవాన్నీ , భారత ప్రభుత్వ రక్షణను , రాజ భరణాలనూ పొందుతూ దర్జాగా బతికితే .

ఇటు -
తెలంగాణా పోరాట యోధులు జైళ్ళల్లో మగ్గాల్సి వచ్చింది . వారు పేద రైతులకు పంచిన లక్షలాది ఎకరాల భూమి తిరిగి జాగిర్దార్ల పరమైంది . రాష్ట్రం తిరిగి ప్రజా వ్యతిరేకుల హస్తగతమైంది.

1948 నుంచీ 1952 వరకూ తెలంగాణలో సాగింది స్వపరిపాలన కాదు దాదాపు పరాయి మిలిటరీ పాలన .

ఆ తరువాత తెలంగాణలో తొలిసారిగా (1952) ప్రజాస్వామిక ఎన్నికలు జరిగి, ప్రజా ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణా ప్రజలు పట్టుమని నాలుగేళ్లయినా స్వపరిపాలన , స్వేచ్చా స్వాతంత్ర్యాల రుచి చూడక ముందే మళ్ళీ వారి నోట్లో దుమ్ము కొట్టారు .

1956 లో "మీది తెలుగే - మాది తెలుగే " అనే జిత్తులమారి నినాదం తో ,
దగాకోరు ఒప్పందాలతో రెండు రాష్ట్రాల విలీనం జరిగి తెలంగాణా తిరిగి తన అస్తిత్వాన్ని కోల్పోయింది .

తెలంగాణా ప్రజలు తమ నేలమీద తామే కాన్దీశీకుల్లా ... ఇంకొకరి దయధర్మాలతో బిక్కు బిక్కు మంటూ బతుకీడ్వాల్సిన దుస్తితి ఏర్పడింది .

విలీనమప్పుడు కుదుర్చు కున్న దగుల్భాజీ ఒప్పందాలన్నీ ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో , తెలంగాణా నిధులూ , నీళ్ళూ , వనరులూ , ఉద్యోగాలూ ఎలా దోపిడీకి గురయ్యాయో , తెలంగాణా ప్రజల భాషా సంస్కృతులు , చరిత్ర ఏవిధంగా అవహేళనకు గురయ్యాయో మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు .

తెలంగాణా ఇప్పుడు
స్వాతంత్ర్యం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం , న్యాయం కోసం , అస్తిత్వం కోసం పరితపిస్తోంది . అణువణువునా జ్వలిస్తోంది .

తెలంగాణా ప్రజలు "తమ రాష్ట్రం తమకు కావాలని , తమ నిధులు , తమ వనరులు , తమ ఉద్యోగాలు తమకు దక్కాలని ...నీళ్ళలో తమ వాటా తమకు సక్రమంగా రావాలని , తమ భాషా సంస్కృతులకూ చరిత్రకూ సముచిత గౌరవం వుండాలని కోరుకుంటున్నారు ... తప్ప ఇతర్ల సొమ్మును ఏమీ ఆశించడం లేదు .

న్యాయం తెలంగాణా ప్రజల పక్షాన వుంది .

తెలంగానాది ధర్మ యుద్ధం . ధర్మం చర ... సత్యం వద ...!

తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరుతుంది .

ప్రాంతాలకు , పక్షపాతాలకు , స్వార్ధానికి , అవకాశవాదానికి అతీతంగా నీతీ నిజాయితీ పరులైన తెలుగువాల్లంతా తెలంగాణా పోరాటానికి సంఘీభావం తెలపాలి .

సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ




...

Friday, December 25, 2009

తెలంగాణా, ఆంధ్ర లకూ - తూర్పు, పశ్చిమ జర్మనీ లకూ మధ్య నున్న తేడా ...



తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సమస్య గురించిన చర్చల్లో తరచూ తూర్పు పశ్చిమ జర్మనీల ప్రస్తావన విన వస్తోంది. రెండు జర్మనీల మధ్య నిర్మించిన దుర్భేధ్యమైన బెర్లిన్‌ గోడను కొన్నాళ్ల క్రిందట కూల్చేశారు. అవి రెండూ తిరిగి ఒకే దేశంగా మారిపోయాయి. దేశాలే కలసి పోతుంటే రాష్ట్రాలను విడదీయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలు మొదటి నుంచీ ఒకే (జర్మనీ) దేశంగా వుండేవి. ఇతర దేశాలను కబళించాలని ఉవ్విళ్లూరిన ఆ దేశం రెండో ప్రపంచ యుద్ధంలో తనే మట్టి కరచి నిట్టనిలువునా చీలిపోయింది. ఒక ముక్క అమెరికా ఆధిపత్యంలోకి, మరో ముక్క సోవియట్‌ రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. సొవియట్‌ రష్యా పతనం తరువాత ఆ రెండు ముక్కలూ తిరిగి ఒక్కటయ్యాయి.

జర్మనీ పరిస్థితి వేరు, ఆంధ్ర తెలంగాణాల పరిస్థితివేరు.
ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు ఆది నుంచీ వివిధ రాజుల ఏలుబడిలో... విభిన్న రాజ్యాలుగా వున్నాయే తప్ప సంపూర్ణంగా ఒకే దేశంగాగానీ, ఒకే రాష్ట్రంగా గానీ ఎన్నడూ లేవు.

మరీ ముఖ్యంగా గత మూడునాలుగు వందల సంవత్సరాలు ... ఆంధ్ర ప్రాంతం - బ్రిటీషు పరిపాలన కింద,
తెలంగాణా ప్రాంతం - మహ్మదీయ పరిపాలన కింద వుండటంతో ఈ ఇరు ప్రాంతాల భాషా సంస్కృతులు భిన్నంగా మారిపోయాయి. అభివృద్ధి, చదువు సంధ్యలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, పండుగలు పబ్బాలు, నాగరికత అన్నింటిలో ఎన్నో తేడాలు చోటుచేసుకున్నాయి.

పైకి తెలుగు భాష ఒక్కటే అయినా ఒక ప్రాంతపు యాస మరొక ప్రాంతానికి అర్థంకానంత జటిలంగా తయారైంది. పరస్పర సంబంధాలను పటిష్టపరిచేందుకు భాష ఏమాత్రం దోహదం చేయలేదు. పైగా ఒక ప్రాంతపు యాస అంటే మరొక ప్రాంతానికి ఎంతో చులకన. సినిమాల్లో తమ భాషని కేవలం విలన్లకీ, బఫూన్లకీ పరిమితం చేసి అవహేళన చేస్తుంటే తెలంగాణా ప్రజలు మండిపోవడం, లేదా ఆత్మన్యూనతతో కృంగిపోవడం తెలిసిందే.

ఈ కారణాలవల్ల భాష పేరిట ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలను బలవంతంగా ఏకం చేసినా రెండు ప్రాంతాలూ మానసికంగా ఒకటి కాలేకపోయాయి.
దానికి తోడు ఉద్యోగాలు, వనరులు, నీరు, నిధులు మొదలైన వాటి పంపిణీలో జరిగిన అన్యాయం, వివక్ష; రాజకీయ నాయకుల స్వార్థం, అవకాశవాదం, పక్షపాత ధోరణి, అట్లాగే పత్రికలూ, మీడియా, విద్యారంగం మీద ఒకే ప్రాంతపు గుత్తాధిపత్యం రెండు ప్రాంతాలు ఒక్కటి అ య్యేందుకు వీలు లేకుండా కనిపించని ఇనుప గోడల్ని నిర్మించాయి.

ఇవి ఏకమై అర్థ శతాబ్ధం గడచినా ఆంధ్ర ఆంధ్ర గానే తెలంగాణా తెలంగాణా గానే మిగిలిపోయాయి తప్ప ఒక్కటి కాలేకపోయాయి. పరస్పర అనుమానాలు, అవమానాలు, అవహేళనలు, వివక్ష అట్లాగే కొనసాగుతున్నాయి.

ఈ వాస్తవాలన్నీ విస్మరించి తెలుగు జాతి అనే భావనని ఎంత రాజేసినా ఇవాళ తెలంగాణా ప్రాంతం ఏమాత్రం స్పందించే స్థితిలో లేదు.

ఒక ప్రాంతం మాత్రమే కోరుకుంటే సమైక్యత సాకారం కాదు.
ఉభయ జర్మనీలు రెండూ కోరుకున్నాయి కాబట్టే అక్కడ బెర్లిన్‌ గోడ కూలిపోయింది.

ఇక్కడ భౌతికంగా ఏ గోడా లేకపోయినా రెండు ప్రాంతాలూ ఒకటి కాలేకపోతున్నాయి.
ఈ కనిపించని గోడను కూల్చడం ఇక సాధ్యమయ్యే పనికాదు.

తెలంగాణా తెలుగు జాతిగా కంటే తెలంగాణా జాతిగా మారిపోయింది.
తెలుగు జాతి పేరిట ఆంధ్ర ఆధిపత్యం కింద నలిగిపోవడం కంటే స్వతంత్ర జాతిగా తన ఉనికిని తను, తన అస్తిత్వాన్ని తను, తన ఆత్మగౌరవాన్ని తను కాపాడుకోవాలని తెలంగాణా తహతహలాడుతోంది.

ఈ పరిస్థితిని జర్మనీతో పోల్చడం కంటే, రష్యాలోంచి విడిపోయిన ఉజ్భెకిస్థాన్‌, తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, ఉక్రేనియా, జార్జియా వంటి దేశాలతో పోల్చడం సబబుగా వుంటుంది.
అరవై సంవత్సరాలు అవన్నీ సొవియట్‌ రష్యా పేరిట ఒకే గొడుగు కింద వున్నప్పటికీ ఒకే జాతిగా మాత్రం మారలేక పోయాయి. 60 సంవత్సరాల అనంతరం వేటికవిగా విడిపోయాయి.

జాతులు విముక్తిని కోరుకుంటాయి.
తెలంగాణా కూడా విముక్తిని కోరుకుంటోంది.

కాబట్టి ఆంధ్ర తెలంగాణాలు కూడా విడిపోయి మానసికంగా కలసి వుండేందుకు ప్రయత్నిస్తేనే రెండు ప్రాంతాలకూ మంచిది.
కలసి వుంటే ఒక ప్రాంతానికే సుఖం రెండో ప్రాంతానికి తీరని దుఃఖమే.

కేవలం ఒక్క ప్రాంతం మాత్రమే ఎంత బలంగా కోరుకున్నా అది సమైక్యత కాదు కాక కాదు.
యాసిడ్‌ సీసా చూపించి, దౌర్జన్యం చేసి ఎవరైనా ఎదుటి వ్యక్తి ప్రేమను ఎలా పొందగలరు?

కాబట్టి ఉభయ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం శాశ్వతంగా నెలకొనాలంటే ఆంధ్ర తెలంగాణాలు తక్షణమే విడిపోవాలి.
కావలిస్తే మరో వంద సంవత్సరాల తరువాత ... ఉభయ ప్రాంతాలూ సర్వతోముఖ అభివృద్ధి సాధించిన అనంతరం సంతోషంగా, సమఉజ్జీలుగా మమేకం కావొచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు.
జై తెలంగాణా! జై ఆంధ్రా!

Tuesday, December 22, 2009

తెలంగాణా : గాంధీ, నెహూృల ఆత్మఘోష !



తెలంగాణా : గాంధీ, నెహూృల ఆత్మఘోష !


(... మహాత్మా గాంధీ హఠాత్తుగా నిరాహార దీక్షకు దిగారన్న వార్తతో అంతవరకూ ప్రశాంతంగా వున్న స్వర్గలోకంలో ఒక్కసారిగా అ లజడి చెలరేగింది.
జవహర్‌లాల్‌ నెహూృ హడావిడిగా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని ఇక్కడ కూడా ఇదేం రామాయణమని గాంధీజీని మందలించబోయారు.
'నిరాహార దీక్షే' కాదు ''మౌనవ్రతం'' కూడా చేస్తున్నానని గాంధీజీ సైగ చేయడంతో చేసేదేంలేక ఆయన పక్కనే చేతులు కట్టుకుని కూర్చున్నారు.
ఇరవైనాలుగు గంటల అనంతరం ఆవేశం చల్లారి, మనసు కుదుటపడ్డ తరువాత తనంతటతానుగా దీక్ష విరమించారు గాంధీజీ.
''జవహర్‌'' అని ఆప్యాయంగా పిలుస్తూ నెహూృ భుజం మీద చేయివేశారు. ఆ చల్లని స్పర్శకు పరవశించిపోయారు నెహూృజీ. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది:)

గాంధీ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గొడవను చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది జవహర్‌.

నెహూృ: రాష్ట్ర విభజన తప్పంటారా బాపూ?

గాంధీ:
లేదు జవహర్‌. రాష్ట్ర విభజన అనే అతి చిన్న సమస్యకు - దేశ విభజన స్థాయిలో రెచ్చిపోయి ఇలా దెబ్బలాడుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే కదా!

నెహూృ:
నిజమే బాపూ.

గాంధీ:
కూర్చుని చర్చించుకుంటే - ఒక్క పూటలో తేలిపోయే చిన్న సమస్యకు ఇంత గొడవ దేనికి జవహర్‌? మూర్ఖుల్లా, మొండిగా ప్రవర్తిస్తున్నారేమిటి తెలుగువాళ్లు? ఈ నిరాహార దీక్షల తంతేమిటి? ఈ బందులూ, ఆస్తుల విధ్వంసాలూ, దహనకాండలూ దేనికోసం? ఒకరు విడిపోతామంటుంటే మరొకరు టాఠ్‌ వీల్లేదు సమైక్యంగా మా కింద పడివుండాల్సిందే అనడమేమిటి?

నెహూృ:
అవును బాపూ.

గాంధీ:
మన దేశం పరిథిలో ఎన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడితే మాత్రం ఎవరికేం నష్టం జవహర్‌? ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని సంతోషించాల్సింది పోయి ఇట్లా తన్నుకు చస్తున్నారెందుకు?

నెహూృ: నాకు కూడా అదే అర్థం కావడంలేదు బాపూ. అయితే ఇందులో నా తప్పు కూడా వుంది.

గాంధీ:
నీ తప్పా?!

నెహూృ:
అవును బాపూ! ప్రజల ఆకాంక్షలు విస్మరించి ''తెలంగాణా'' విషయంలోనూ, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోబోయి ''కశ్మీర్‌'' విషయంలోనూ నేను రెండు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. వాటి ఫలితమే ఈ రావణ కాష్టాలు!

గాంధీ: బాధపడకు జవహర్‌. ఆ మాట కొస్తే తెలంగాణా విషయంలో నీతో పాటు నేనూ తప్పు చేశాను.

నెహూృ:
?!

గాంధీ: నిజాం సంస్థానాన్ని భారత జాతీయోద్యమం నుంచి మినహాయించి మనం తెలంగాణా ప్రజలకు దూరంగా వుండటం ఘోరమైన చారిత్రక తప్పిదం కదా.

నెహూృ: నిజమే బాపూ.

గాంధీ: పాపం తెలంగాణా ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో, దొరల రజాకార్ల దుర్మార్గాలకు విలవిల లాడుతున్నా కూడా మనం ఎన్నడూ పట్టించుకోలేదు. వారికోసం ఏ పోరాటమూ చేయలేదు. కనీసం తెలంగాణాలో నేరుగా ఒక్క స్వాతంత్య్రోద్యమ సభ అయినా నిర్వహించలేదు. 1947లో మనం ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నప్పుడు కూడా పాపం తెలంగాణా ప్రజలు తమ విముక్తి కోసం తామే ఒంటరిగా జీవన్మరణ సాయుధపోరాటం చేస్తుండిపోయారు.

నెహూృ:
అవును బాపూ. తెలంగాణా ప్రజలకు మనం మొదటినుంచీ ద్రోహం చేస్తూనే వచ్చాం. వాళ్లు జాగిర్దార్లను, భూస్వాముల్ని ఊళ్లల్లోంచి తరిమేసి లక్షలాది ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుని బడుగు వర్గాలకు చక్కగా పంచిపెడితే మనం సైనిక చర్య పేరిట నిజాంను లొంగదీసుకుని ఆ భూములన్నీ తిరిగి భూస్వాములకే అప్పగించాం. తెలంగాణా ప్రజలను శాశ్వత బానిసత్వంలోకి నెట్టివేశాం.

గాంధీ: తెలంగాణా ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాం నవాబుకు మాత్రం భారత ప్రభుత్వం తరపున ''రాజ్‌ప్రముఖ్‌'' అన్న బిరుదునూ, అతని ఆస్తులకు రక్షణనూ, ఏడాదికి కోట్లాది రూపాయల రాజభరణాన్నీ ఇచ్చి సత్కరించాం. వాడు చచ్చేవరకూ ఊడిగం చేశాం.

నెహూృ: దాస్య విముక్తి అనంతరం కనీసం స్వతంత్ర భారతంలో వాళ్ల హైదరాబాద్‌ రాష్ట్రాన్ని అట్లాగే కొనసాగనివ్వకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో వాళ్లని దెబ్బతీశాం.

గాంధీ: ఇది మాత్రం నువ్వు పూర్తిగా తెలిసి చేసిన తప్పు జవహర్‌.

నెహూృ: ఒప్పుకుంటున్నాను బాపూ. అందుకు నేను కుమిలిపోని రోజంటూ లేదు. ఆంధ్ర నాయకులు చాలా చాల్‌బాజ్‌గాళ్లని నాకు మద్రాస్‌ రాష్ట్ర విభజనప్పుడే తెలిసింది. ఆంధ్ర రాష్ట్రంతో పాటు మాకు మద్రాస్‌లో కూడా భాగం కావాలంటూ పట్టుబట్టి పొట్టి శ్రీరాములును వాళ్లే బలితీసుకుని నన్ను బదనాం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమలోని కర్నూలును రాజధాని చేయడం, దానిని అభివృద్ధిపరచడం కోస్తా నేతలకు ఇష్టంలేకుండేది. వాళ్ల కన్ను అప్పటికే అన్నివిధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం మీద పడింది. దాంతో నానా హంగామా చేసి, మాయమాటలు చెప్పి తెలంగాణా నేతల్నే కాదు నన్ను కూడా బుట్టలో పడేసుకున్నారు.

గాంధీ: వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు కావాలి కదా జవహర్‌. తెలంగాణా నిజాం పాలనలో భూస్వాములు, పటేల్‌ పట్వారీలు, అగ్రకులాల దాష్టీకంలో నలిగి పోయివుంది. సామాన్య జనం సర్వభ్రష్టులై పోయి వున్నారు. చదువు సంధ్యలు లేక, ఆర్థికంగా కుంగిపోయి తెలంగాణా ప్రజలు అ ల్లాడుతున్నారు. అట్లాంటి వాళ్లకు ఎదిగేందుకు చేయూత నివ్వాల్సిందిపోయి ...

నెహూృ:
తప్పు చేశాను బాపూ, తప్పు చేశాను. ఫజల్‌ అ లీ కమిషన్‌ మొత్తుకుంటూనే వుంది. అయినా పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ రూల్స్‌, ముఖ్యమంత్రి - ఉపముఖ్యమంత్రి పదవులు అంటూ నానా నక్కవినయాలూ ప్రదర్శించి నన్నే మోసం చేశారు. ఆనాడే అన్నాను బాపూ ... ''ఒక కొంటె కుర్రాడి చేతిలో అమాయకురాలైన అమ్మాయిని పెడుతున్నాం. వాళ్ల సంసారం ఎలా సాగుతుందా అని భయంగా వుంది. ఒకవేళ పొరపొచ్చాలొస్తే సామరస్యంగా విడిపోవాలి.'' అని కానీ వింటేనా. 1969లో పెద్ద ఎత్తున గొడవ చేసినా 370 మందిని చంపి మరీ తెలంగాణా ప్రజల ఆకాంక్షని, అస్తిత్వ ఆరాటాన్ని అణిచివేశారు. తిరిగి ఇవాళా అదే పని చేస్తున్నారు.

గాంధీ:
కాంగ్రెస్‌ పార్టీ 2004 నుంచీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి మరీ తెలంగాణాకు అనుకూలంగా వాగ్దానాలు చేస్తూనే వుంది. తెలుగుదేశం కూడా తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రజారాజ్యం పార్టీ కూడా సామాజిక తెలంగాణా అంది. మీరు తీర్మానం పెట్టండి మేం బలపరుస్తాం అంది. అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలూ బాహాటంగా హామీలు గుప్పించాయి. సోనియా గాంధీకి నిర్ణయాధికారాన్ని అప్పగించాయి. తీరా నిర్ణయం ప్రకటించగానే అన్ని పార్టీలూ రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించి సమైక్య రాగాలాపన చేయడం నయవంచన కదా జవహర్‌. నేను ఆనాడు సత్యం కోసం ఎంత తపించాను.

నెహూృ: ఇప్పుడు సత్యం ఎక్కడ వుంది బాపూ. దేశం అంతా స్వార్థంతో, లంచగొండి తనంతో అన్యాయాలతో లుకలుక లాడుతోంది. రాజకీయాలు లత్తకోరు వ్యాపారంగా మారాయి. ఎవ్వడూ మాట మీద కట్టుబడి వుండడం లేదు. జెండాలు వేరైనా అందరి ఎజెండాలు ఒక్కటే అదే స్వార్థం.

గాంధీ: మరి ప్రజలు ఈ అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని ఎందుకు ఎదిరించడంలేదు? నిన్నటి వరకు తెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలు చేసి ఇప్పుడు సమైక్యత గురించి చిలుకు పలుకులు పలుకుతుంటే ఎందుకు నిలదీయడం లేదు?

నెహూృ: ఈ విష సంస్కృతికి చాలామంది బానిసలై పొయారు బాపూ. అందుకే చెడు అని తెలిసినా తమ స్వార్థానికి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు సిగ్గుఎగ్గులేకుండా సమర్థిస్తున్నారు. మొండి వాదనలు చేస్తున్నారు. గుండాయిజమే నేటి నిజంగా మారిపోతోంది. మీరు చూపిన నిరాహార దీక్షలు దుర్మార్గుల, మూర్ఖుల, అవినీతిపరుల, అక్రమార్కుల చేతుల్లో శకుని పాచికల్లా మారి అపహాస్యం పాలవుతున్నాయి.

గాంధీ:
అవును జవహర్‌. నిన్న ఖద్దరు ధరించి జాతీయ జండా పట్టుకుని విజయవాడలో హైక్లాస్‌ నిరాహారదీక్షా ప్రహసనాన్ని కొనసాగించి... ఇవాళ హఠాత్తుగా జండా లేకుండా జర్కిన్‌ ధరించి దొంగలా నిమ్స్‌లో దూరిన లావుపాటి నా అనుచరుణ్ని చూసిన తరువాత నా మనసు వికలమయ్యే నేను ఇందాక దీక్ష చేశాను. అట్లాంటి వ్యక్తులకు కూడా జనం జై కొట్టడం, అతని తరపున సిగ్గులేకుండా నిలబడటం, వాదించడం చాలా మనస్తాపం కలిగిస్తోంది.

నెహూృ: ఆనాడు మీరు హింసా మార్గం అవలంభించాడని భగత్‌ సింగ్‌ అంతటి వాణ్నే ఖండించారు. కానీ ఇప్పుడు ఎవ్వరిలోనూ అట్లాంటి నిజాయితీ, ధైర్యం లేవు బాపూ.

గాంధీ: ఇలా అయితే నా దేశం ఏమైపోతుంది జవహర్‌.

నెహూృ:
ఇంక మీరు అటు వైపు తొంగి చూడకండి బాపూ. నేను కూడా చూడను. చూస్తే అక్కడి అమాయక జనంలా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే గుండె ఆగి అర్థంతరంగా చావాల్సి వస్తుంది!

గాంధీ:
అంతేనంటావా జవహర్‌.

నెహూృ: అంతే బాపూ.

...........

ఈశ్వర్ అల్లా తేరే నామ్
సబ్ కో సన్మతి దే భగవాన్
సారా జగ తేరీ సంతాన్
ఇస్ ధర్తీ పర బస్ నే వాలే
సబ్ హై తేరీ గోద్ కే పాలే
కో ఈ నీచ కో ఈ మహాన్
సబ్ కో సన్మతి దే భగవాన్ ...



......................

Sunday, December 20, 2009

ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులంతా కలిసి పాల్గొన్న అపూర్వ ఉద్యమం!


ఒకప్పుడు సామాజిక సమస్యల పట్ల విద్యార్థిలోకం ఎంతో చురుకుగా స్పందించేది. ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించినా, పాల ధరను పెంచినా, సమాజంలో ఇంకే సమస్య తలెత్తినా ముందుగా విద్యార్థులే ఉద్యమించేవారు. 1960లలో, 1970లలో ఈ పరిస్థితి ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కనిపించేది. ఫ్రాన్స్‌లో 1968లో ప్రజా వ్యతిరేక చార్లెస్‌ డిగాల్‌ ప్రభుత్వాన్ని గద్దె దించిన ఫ్రెంచి విద్యార్థుల ఘనత అందరికీ తెలిసిందే.

ఆ తరువాత క్రమేణా ప్రైవేటీకరణ, సాఫ్ట్‌వేర్‌ రంగం, కెరీరిజం పెరుగుతూ పోవడంతో విద్యార్థులలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత స్థానంలో స్వార్థం, వ్యక్తిగత అభివృద్ధిపై ఆసక్తి పెరిగిపోయాయి. దాంతో బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, కాలేజీ ఫీజులు ఎన్నిసార్లు ఎంతగా పెరిగినా విద్యార్థుల నుంచి చెప్పుకోతగిన స్థాయిలో ప్రతిఘటనలు చోటు చేసుకోవడం లేదనే చెప్పాలి.

విచిత్రంగా ఇన్నాళ్ల తరువాత విద్యార్థులు మళ్లీ ఇప్పుడు ''ప్రత్యేక తెలంగాణా'', ''సమైక్య ఆంధ్ర'' ఉద్యమాల్లో తమ చదువులను పణంగా పెట్టి మరీ పాల్గొంటున్నారు. అనేక త్యాగాలు చేస్తున్నారు. అయితే విద్యార్థులు ప్రాంతాల వారిగా రెండు వర్గాలుగా విడిపోయి చేస్తున్న ఉద్యమాలివి.

ఉమ్మడి ఉద్యమం


1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్టం ఏర్పడిన తరువాత మొత్తం అన్ని ప్రాంతాల విద్యార్థులు కలసికట్టుగా చేసిన ఉద్యమం ఏదైనా వుందా?
వుంది.
అది 1966 లో సాగిన ''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు'' ఉద్యమం.
అందులో ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులు, వరంగల్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన తీరు అపూర్వమైనది.

ఆ తరువాత 1969లో ''ప్రత్యేక తెలంగాణా'' ఉద్యమం, 1972లో ''జై ఆంధ్ర'' ఉద్యమం వచ్చాయి. వాటిలోనూ విద్యార్థులే
కీలక పాత్ర పోషించారు... కానీ ప్రాంతాల వారిగా విడిపోయి!
ఇవాళ కూడా మళ్లీ అదే పరిస్థితి.

1966లో విద్యార్థులంతా ఉమ్మడిగా చేసిన ''విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'' ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. ఆ
తరువాత ప్రాంతాల వారిగా సాగిన పై రెండు ఉద్యమాలూ రాజకీయ నాయకుల స్వార్థం, మోసం కారణంగా విఫలమయ్యాయి.

ఇప్పుడు కూడా రెండు ప్రాంతాల ఉద్యమాల్లోనూ రాజకీయ అవకాశ వాద పోకడలు ఆదినుంచే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోతారా లేక వారికి బుద్ధి చెబుతారా వేచి చూడాల్సిందే.

ఒకే సమస్యపై సాగుతున్న రెండు భిన్న ఉద్యమాలివి.
ఒక ప్రాంత ఉద్యమ లక్ష్యం - మరో ప్రాంత ఉద్యమ లక్ష్యానికి పూర్తిగా వ్యతిరేకం!
న్యాయం ఏదో ఒక వైపే వుంటుంది!
రెండు పక్షాల వాదనలూ న్యాయమైన వయ్యేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. సెంటిమెంట్లు సమస్యను జటిలం చేస్తాయి తప్ప పరిష్కరించలేవు.
మరి ఎవరి వాదన... ఎవరి డిమాండు సరైనది?
ఎవరిది కాదు??
ఒక పక్షం వాదన న్యాయమైనదని తేలితే మరో పక్షం ఆ తీర్పును అంగీకరించి హుందాగా ఉద్యమాన్ని విరమించుకుంటుందా?

ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ఎవరు తేలుస్తారు?
నీతి నిజాయితీ లేని, నిలకడలేని, మాటకు కట్టుబడతారన్న నమ్మకంలేని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులా?
లేదు. వారి వల్ల ఏ సమస్యకూ న్యాయమైన పరిష్కారం లభించదు.
మరి ఎవరు?
ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థులే ఈ సమస్యకు స్వయంగా ఎందుకు పరిష్కారం కనుగొనకూడదు?

రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, అతీతంగా మూడు ప్రాంతాల విద్యార్థి (జెఎసి) నాయకులే ముందుకు వచ్చి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకుని లోతుగా చర్చించి న్యాయాన్యాయాలు తేల్చవచ్చు కదా.

విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మేం కేవలం వారిని అనుసరిస్తున్నాం అని దొంగ మాటలు చెబుతున్నారు కొందరు రాజకీయ నాయకులు.

వారి మాటలను నిజం చేస్తూ - అన్ని ప్రాంతాల విద్యార్థులు విజ్ఞతగా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన వచ్చు కదా?

విద్యార్థుల తలచుకుంటే ఇదేమంత అసాధ్యమైన విషయం కాదు.
రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్రాల పునర్విభజన అనేది దేశ విభజనంత జఠిలమైన సమస్య కాదు కదా!

స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి.
అవి సామరస్యంగా కలిసి ముందుకు సాగుతున్నాయి కూడా.
మన కెందుకు సాధ్యం కాదు?
తప్పకుండా సాధ్యమవుతుంది.

ఇరుపక్షాల వద్ద కావలసినంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ వుంది.
విశాల హృదయంతో, నిష్పక్షపాతంతో, విజ్ఞతతో చర్చించ గలిగితే ఒక వారంలో, లేదంటే ఒక మాసంలో ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన సమస్యను విద్యార్థులే కనుగొని చరిత్ర సృష్టించవచ్చు!
ఉద్యమాలతో, బందులతో, విద్వేషాలతో, రాజకీయ కుట్రలతో కుతకుత లాడుతున్న రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు శాంతిసౌభాగ్యాలను ప్రసాదించవచ్చు.
ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులారా ఆలోచించండి.
ఫ్రాన్స్‌ విద్యార్థుల్లా మరో చరిత్ర సృష్టించండి!