Thursday, January 5, 2012

ధ్వంసమైన స్వప్నం - బ్రోకెన్‌ రిపబ్లిక్‌ ... అరుంధతీ రాయ్‌ ...

అరుంధతీ రాయ్‌ రాసిన 'బోకెన్‌ రిపబ్లిక్‌' ను మలుపు, హైదరాబాద్‌ వారు తెలుగులో 'ధ్వంసమైన స్వప్నం' పేరుతో ప్రచురించారు. గత సంవత్సరం ఆగస్ట్‌ 20న హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సభలో, అరుంధతీ రాయ్‌ సమక్షంలో ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ డిప్యూటీ ఎడిటర్‌ బెర్నార్డ్‌ డిమెల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీక్షణం సంపాదకులు ఎన్‌.వేణుగోపాల్‌ పుస్తకపరిచయం చేశారు. 

ఈ పుస్తకం ముందుమాట ('తొలి మలుపు')లోంచి కొన్ని భాగాలు:

ఒక్క నెత్తుటి చ్కు కూడా నేలరాలకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు తేగలిగే శక్తి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే ఉంది అంటారు ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరైన డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌. అది ఆయన స్వప్నం కూడా. 

భిన్న జాతులు, తెగలు, మతాలూ కులాలు, సంస్కృతులు వాటి ప్రాతిపదికన ఏర్పడ్డ అసమానతల దొంతరలతో ఉన్న భారతీయ సమాజానికి ప్రజాస్వామ్యం ఒక్కటే శరణ్యమని ఆయన గట్టిగా భావించారు. ఆ మేరకు ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగంలో అనేక రక్షణలను పొందుపరిచారు. కానీ గడిచిన అరవై ఏళ్లలో మన పాలకులు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా చేసారు.

ఇప్పుడు ఆ స్వప్నం ధ్వంసమైపోయింది.

ఇవాళ ప్రజలు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం నెత్తురోడి పోరాడవలసి వస్తోంది. ప్రజలకు ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వం మీద ప్రాణాలకు తెగించి పోరాడవలసివస్తోంది. అదీ ఇప్పటి విషాదం!

...

... ఇలాంటి సందర్భంలో కూడా మొక్కవోని ధైర్యంతో పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడుతోన్న అరుదైన మేధావి అరుందతీ రాయ్‌. ఆమె ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో పరిణామాలపై ఇంగ్లీషులో రాసిన ''చిదంబరం'స్‌ వార్‌,  వాకింగ్‌ విత్‌ కామ్రేడ్స్‌,  ట్రికిల్‌డౌన్‌ రెవొల్యూషన్‌''  వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ''ధ్వంసమైన స్వప్నం.'' 

ఇందులో వున్న మూడు వ్యాసాలు ప్రస్తుతం దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టి చూపిస్తాయి.



.....

ధ్వంసమైన స్వప్నం


చిదంబర రహస్యం. కారడవిలో కామ్రేడ్స్‌తో. మానవజాతి మనుగడకోసం విప్లవం.
- అరుంధతీ రాయ్‌


ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickledown Revolution.


అనువాదం : ప్రభాకర్‌ మందార. పి.వరలక్ష్మి. కడలి.


208 పేజీలు, వెల: రూ. 75

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌
ఇ మెయిల్‌ : malupuhyd@gmail.com

ప్రతులకు:
2-1-1/5/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044

.

Tuesday, January 3, 2012

హిందూ మతానంతర భారతదేశం ... పోస్ట్‌ హిందూ ఇండియా ... కంచ ఐలయ్య ...



ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రచించిన ''పోస్ట్‌ హిందూ ఇండియా''ను ఎమెస్కో హైదరాబాద్‌ వారు ''హిందూ మతానంతర భారతదేశం'' పేరిట తెలుగులో ప్రచురించారు. 28 డిసెంబర్‌ 2011న హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఈ పుస్తకాన్ని ఒక ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలిక ఎం. ఝాన్సీ ఆవిష్కరించింది. నాటి కార్యక్రమంలో రచయితతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ కాకి మాధవరావు, ఎమెస్కో సంపాదకులు శ్రీ డి. చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఆ పుస్తకం లోని ఉపోద్ఘాతం నుంచి కొన్ని భాగాలు:
...
భారతజాతి అంతర్యుద్ధ ప్రమాదం అంచున వుందన్న గాఢమైన భావనలోంచి ఈ పుస్తకం పుట్టింది.
హిందూమతం అనేక శాతాబ్దాల నుంచి పెంచి పోషిస్తూ వస్తున్న కుల వ్యవస్థ లోలోపల కుతకుతలాడుతోంది. హిందూ సంస్కృతి తనలోని స్వీయ వినాశక వైరుధ్యాలను తనే ఒక్కటొక్కటిగా బయటపెట్టుకుంటోంది. కుల సమాజమంతటా అది ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. ఈ పుస్తకం దళితబహుజనుల సాంస్కృతిక, శాస్త్రీయ, ఆర్థిక జ్ఞాన వ్యవస్థలను లోతుగా పరిశీలిస్తుంది. దళితబహుజనుల పరస్పర సంబంధాలనూ, అ లాగే వారికి

హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థతో వున్న సంబంధాలనూ సమగ్రంగా విశ్లేషిస్తుంది.
దళితబహుజన సమాజాలు ఎన్నో సంవత్సరాలుగా శాస్త్ర, సాంకేతిక, ఉత్పత్తి జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి పరుస్తూ వస్తే - బ్రాహ్మణీయ హిందూమతం ఉత్పత్తి వ్యతిరేక, అశాస్త్రీయ, అనైతిక విధానాలను అనుసరిస్తూ వచ్చిందనే వాస్తవాన్ని చాటిచెప్తుంది.
...
నిమ్నకులాలకూ - అగ్రకులాలకూ మధ్య వున్న విభేదాలు నిత్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. ఒకపక్క చారిత్రకంగా అణగారిన కులాల ఆధ్యాత్మిక, రాజకీయ ఆశలూ, ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. క్రైస్తవ, బౌద్ధ, ఇస్లాం తదితర ఆధ్యాత్మిక ప్రజాస్వామిక మతాల విస్తరణకు అవి  దోహదం చేస్తున్నాయి. మరోపక్క  అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నూతన రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి.

ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక అధికారం కోసం దళితబహుజన కులాలు ముందుకు కదులుతూ యుద్ధభేరీలు మ్రోగిస్తున్నాయి.
....
ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో ఒకటైన హిందూ మతం - తను అనుసరించే విధానాల వల్ల  ఎలా  మరణశయ్యమీదకు చేరుతోందో వివరించే ప్రయత్నమిది. హిందూమత మరణం ప్రపంచ సంస్కృతులను పెద్ద ఎత్తున పునస్సమీకరిస్తుంది. హిందూ మతానంతర భారతదేశం ఎలా వుంటుందో ఊహించి చెప్పడం సాధ్యం కాదు. అయితే,  హిందూ దేహాన్ని చీల్చి (డిసెక్ట్‌ చేసి)  అది స్వయంగా సృష్టించుకున్న కుల కేన్సర్‌ యొక్క ప్రాణాంతక స్వభావాన్ని ఈ పుస్తకం చూపిస్తుంది. ఆ కేన్సర్‌ని ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకునేందుకు అంగీకరించకుండా హిందూమతం తన చావును తనే ఏవిధంగా కోరి తెచ్చుకుంటోందో వివరిస్తుంది.
...
ప్రధానమైన నాలుగు మత ప్రపంచాల్లో మార్పునకు వీలులేని ఆధ్యాత్మిక పునాదిపై ఏర్పడ్డ హిందూ ప్రపంచమే అతి చిన్నదీ, కడు బీదదీ.
హిందూ మత ప్రపంచానికి చెందిన ఆధునిక వ్యాఖ్యాతలందరూ ఇదెంతో గొప్ప మతం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. నిజానికి వాళ్లంతా హిందూమత అపరిపక్వ మనసుకు ప్రతీకలు. ఆదిశంకరాచార్య మొదలుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకూ బ్రాహ్మణీయ వ్యాఖ్యాతలంతా బ్రాహ్మణీయ ప్రాతిపదికతనీ, కుల సంస్కృతినీ కీర్తించారు. ప్రతికూలతే వారికి ధర్మంగా తోచింది. ఈ దేశంలో కులతత్వానికీ, అంటరానితనానికీ హిందూమతమే కారణ మన్న విషయాన్ని వాళ్లసలు పట్టించుకోలేదు.
...
జనాన్ని ప్రభావితం చేసే శక్తిని మిగతా మతాలు కోల్పోవడానికంటే ఎంతో ముందే హిందూ మతం చచ్చిపోతుందని వారు గ్రహించడంలేదు.
ఇవాళ ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విస్తరణకు మరెక్కడాలేనంత జనం కేవలం భారతదేశంలో మాత్రమే అందుబాటులో వున్నారు. జాతీయ జనాభాలో అత్యధిక సంఖ్యలో వున్న దళితబహుజన ప్రజలు క్రమక్రమంగా హిందూ ఆధ్యాత్మిక నిరంకుశత్వానికి దూరంగా వెళ్లిపోతున్న వైనాన్ని హిందూ పండితులు గమనించలేకపోతున్నారు.
...
భారత, నేపాల్‌ దేశాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి మాత్రమే హిందూమత గుర్తింపు వుంది. అయితే, హిందూమతానికి మూలమైన బ్రాహ్మణిజం మాత్రం ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఉనికిలో వుంది.
ప్రాచీన బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక వ్యవస్థకు అల్‌బెరూనీ వంటి ముస్లిం మేధావులు ''హిందూ'' గుర్తింపును ప్రసాదించారు. తన సుప్రసిద్ధ గ్రంథం ''అల్‌  హింద్‌'' లో అల్‌ బెరూనీ తొలిసారిగా 'హిందూ' అన్న పదాన్ని ఉపయోగించాడు. ఆతరువాతే హిందూ పాలకులూ, ఆధ్యాత్మిక శక్తులూ ఆ పదాన్ని ఆమోదించి, సొంతం చేసుకున్నాయి.
క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం మతాల్లో మాదిరిగా హిందూయిజం అన్న మాట మత ప్రవక్త పేరు మీదుగానో లేక ఆధ్యాత్మిక కృషిలోంచో రూపుదిద్దుకున్నది కాదు. క్రైస్తవం, బౌద్ధమతం అన్న పేర్లు ఆ మతాల మూలపురుషులైన జీసస్‌ క్రీస్తు, గౌతమ బుద్ధుడి జీవితాల్లోంచి వచ్చాయి. ఇక ఇస్లాం అన్న మాటకి 'దేవుడి లోకం' అని అర్థం. ముస్లింలను వాళ్ల మూలపురుషుడూ, ప్రవక్తా అయిన మహమ్మదు పేరుమీదుగా 'మహమ్మదీయులు' అని వ్యవహరించడం తెలిసిందే.
కానీ మన బ్రాహ్మణ మేధావులకు తెలివి లేకపోవడం వల్ల ''హిందూయిజం'' అన్న పేరును సైతం పరాయి వాళ్లనుంచి అరువు తెచ్చుకోవలసి వచ్చింది. మధ్య యుగాల నాటి ముస్లిం మేధావులు మనకా పేరు పెట్టారు. వారి దృష్టిలో హిందువులంటే సింధ్‌ (హింద్‌) ప్రాంతంలో నివసించేవారు, ఆదిమ కాలపు అనాగరికులు, ఆధ్యాత్మిక ఐక్యత లేనివాళ్లు. బ్రాహ్మణ, వైశ్య సామాజిక వాణిజ్య శక్తులు కులాలూ, ఆదిమ లక్షణాలూ, మూఢనమ్మకాలూ, అనాగరికతతో కూడిన మతాన్ని రూపొందించాయన్నది ముస్లిం మేధావుల అంచనా. ఈ దృష్ట్యానే వారు ఆ మతానికి ప్రతికూల పద్ధతిలో నామకరణం చేశారు. అదే పేరును సానుకూలమైనదిగా భావించి మన బ్రాహ్మణ మేధావులు నెత్తిన పెట్టుకున్నారు.
...
భారతీయ భాషల సంస్కృత మూలాన్ని ఇంగ్లీషు విచ్ఛిన్నం చేయగలుగుతుంది కాబట్టి ఇంగ్లీషు విద్య విస్తరించడానికీ, క్రైస్తవ మత ప్రచారానికీ మధ్య సన్నిహిత సంబంధం వుంటుంది. దళితబహుజనులలో ఇంగ్లీషు విద్యను నేర్చుకునే ధోరణి కొనసాగుతోంది. బ్రాహ్మణ హిందువులకు ఇంగ్లీషు విద్యను అడ్డుకునే శక్తి లేదు. ఎందుకంటే స్వయంగా వాళ్లే ఇంగ్లీషులో మునిగి తేలుతున్నారు.
...
బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఎలా సయోధ్యను సాధించాయో గ్రహించడం చాలా ముఖ్యం. తొలి శాస్త్రీయ ఆవిష్కరణలు బౌద్ధ ప్రపంచంలో చైనా, జపాన్‌ దేశాల్లో చోటు చేసుకున్నాయి. దిక్సూచి, గన్‌పౌడర్‌ (తుపాకి మందు), కాగితం, ముద్రణా యంత్రాలను కనుగొన్నది చైనా బౌద్ధులే. అదేవిధంగా జపాన్‌ బౌద్ధులు కూడా ప్రాచీన కాలం నుంచీ అనేక చిన్న సాంకేతిక పరికరాలను కనుగొంటూ వచ్చారు.
తొలినాళ్ల క్రైస్తవం సామూహిక చర్చి వ్యవస్థకు ఇంకా రూపురేఖలను తీర్చిదిద్దుకుంటున్న నాటికే బౌద్ధమతం విశ్వాసానికీ సైన్సుకూ మధ్య సయోధ్యను సాధించింది. బౌద్ధ మత ఆధ్యాత్మిక దృక్పథంలోని విధివాద వ్యతిరేక  భావజాలం, హేతువాదంల మూలంగానే చైనా, జపాన్‌ దేశస్థులు సైన్సుకీ నమ్మకానికీ మధ్య సయోధ్యను సాధించగలిగారు.
రోమన్‌ క్యాథలిక్‌ చర్చి వ్యవస్థ ఏర్పడిన తరువాత కారణానికీ (రీజన్‌), విశ్వాసానికీ (ఫెయిత్‌) మధ్య శత్రుపూరిత ధర్మబోధనా విధానాన్ని అనుసరించింది. అది శాస్త్రీయ పరిశోధనలకూ, సాంకేతిక ఆవిష్కరణలకూ కొత్త పరిస్థితులను సృష్టించింది. తొలినాళ్లలో కోపెర్నికస్‌, గెలీలియో వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలను చర్చి  ఆమోదించలేదు. అంతేకాదు వాళ్లను అణిచివేయాలని కూడా చూసింది. ఆ తరువాత క్రమక్రమంగా శాస్త్రీయ ఆలోచన మీద తన పట్టును సడలించుకుంటూ వచ్చింది. తత్ఫలితంగానే న్యూటోనిక్‌ విప్లవం రూపుదిద్దుకోగలిగింది. భూమి బల్లపరుపుగా వుందన్న క్రైస్తవ విశ్వాసం అట్లా వుండగానే సైన్స్‌ చెప్పిన భూమి గుండ్రంగా వుందనే, భూమికి ఆకర్షణ శక్తి వుందనే సిద్ధాంతాలకు అనుగుణంగా తన విశ్వాసాన్ని సవరించుకుంది.
...
క్రైస్తవ ప్రపంచం విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతంతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాల్లో కూడా గొప్ప మేధావులను సృష్టించింది. మాచియావెల్లీ నుంచి కారల్‌ మార్క్స్‌ వరకూ క్రైస్తవ ప్రపంచం నుంచి వచ్చిన మేధావులు చర్చినే సవాలు చేశారు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యం చర్చి కంటే గొప్పదని నిరూపించారు.
...
ఒకపక్క మడీ-మైల అనే సిద్ధాంతాన్ని కఠోరంగా పాటించిన కారణంగా బాల్య వివాహాలూ, సతీ సహగమనాలూ పుట్టుకురాగా, మరోపక్క హిందూ దేవుళ్ల విశృంఖల శృంగారం పౌర జీవితం మీద నైతికంగా తీవ్రమైన ప్రభావం చూపింది. కామసూత్ర విన్యాసాలను హిందూ దేవాలయాలమీద శిల్పాలుగా చెక్కి స్త్రీలపై సాగించే సకల వేధింపులకు ఆధ్యాత్మిక ఆమోదాన్ని కల్పించారు.
ఇంకోపక్క అదే మతం బ్రాహ్మణ జీవితం అతి పవిత్రమైనదనీ, బ్రహ్మచర్యం పూజ్యనీయమైనదనీ ప్రబోధాలు చేసింది.
ఇలాంటి సాంస్కృతిక వాతావరణంలో చాలామంది జనానికి ఏ పైశాచిక లైంగిక సంబంధాలూ, ఏ చెడు నైతిక సూత్రాలూ లేని ఇస్లాం మతమే విముక్తిని ప్రసాదించగలదనిపించింది.
అందుకే కులం, అంటరానితనం, నయవంచనలతో కూడిన హిందూమతంలోని లక్షలాది దళితబహుజనులు ఇస్లాం మతంలోకి మారారు.
ఐరోపాలో సైతం ఇస్లాం ప్రబోధించిన నూతన వివాహ నీతి నియమాలూ, ఇస్లామిక్‌ ఆధ్యాత్మికతతో వాటి సంబంధం క్రైస్తవమత పరిధిలో సంక్షోభాన్ని సృష్టించింది. మార్టిన్‌ లూథర్‌ వయసు మళ్లిన తరువాత తన సుదీర్ఘ బ్రహ్మచర్య జీవితానికి స్వస్తిచెప్పి పెళ్లి చేసుకోవడం... ''నేనూ రక్త మాంసాలున్న మనిషినే, నాకూ లైంగిక వాంఛలుంటాయి (నేనేం రాయీరప్పను కాను)'' అని బాహాటంగా ప్రకటించడం క్రైస్తవ లైంగిక నీతి పునరాలోచనలో పడేట్టుచేసింది.
...
హిందూ ఆధ్యాత్మిక ప్రపంచం తన ప్రజానీకాన్ని మూఢనమ్మకాల ఉక్కు పిడికిలిలో బంధించింది. ఋగ్వేదం మొదలుకుని రామాయణం (దళితబహుజనులను అణగదొక్కే పథకంలో భాగంగా వెలువడిన చిట్ట చివరి గ్రంథం) వరకూ, భగవద్గీతతో సహా ఏ గ్రంథమూ కులాలనీ, మూఢనమ్మకాలనీ నిర్మూలించే సృజనాత్మక ఆలోచనలకు ఏమాత్రం అవకాశాన్నివ్వలేదు. వాటిని నిర్మూలించలేకపోయినా కనీసం ఒక శాస్త్రీయ భారతదేశం ఆవిర్భవించేందుకు అనువైన మార్గాన్ని కూడా ఏర్పరచలేదు. ఈనాడు భారతదేశం వినియోగించుకుంటున్న విజ్ఞాన శాస్త్రమంతా మిగతా మూడు ప్రపంచాలనుంచి, అందులోనూ మరీ ఎక్కువగా క్రైస్తవ ప్రపంచం నుంచి అరువు తెచ్చుకున్నదే.
...
హిందూ మతం ఉత్పత్తిని కాలుష్యం (మైల) గా, ఉత్పత్తి ప్రక్రియలో పాలుపంచుకునే వాళ్లని అంటరానివాళ్లుగా పరిగణించడంతో వారిలోని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, చొరవా దెబ్బతిన్నాయి.
ఇక రెండో అంశం చదవడం, రాయడం అనేవి కేవలం ద్విజులు  మాత్రమే చేయాల్సిన పనులుగా నిర్దేశించింది. దానివల్ల ఉత్పత్తి వర్గానికి చదువు సంధ్యలు లేకుండా పోయాయి.
విద్య నేర్చుకోవడం, గ్రంథాలు చదవడం, రాయడం కొందరికే పరిమితమవడం వల్ల హిందూ సమాజంలో విజ్ఞానం వికసించేందుకు, విజ్ఞానాన్ని ఇతర్లతో కలిసి పంచుకునేందుకు వీలులేకుండాపోయింది. తత్ఫలితంగా భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర ఎదుగుదలకు అవకాశాలను చిదిమేసినట్టయింది. ఇది ఏవిధంగా జరిగిందో ఒక్కో కులం అనుభవాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ పుస్తకం వివరిస్తుంది.
...
సైన్సును ఎదగనివ్వకుండా కుల అడ్డుగోడలు నిర్మించబడటానికి సైన్సు వ్యతిరేక హిందూ మతానిదే ప్రధాన బాధ్యత. తన మతధర్మశాస్త్రాన్ని అది సరైన రీతిలో ఏనాడూ  సమీక్షించుకోకపోవడం వల్లనే మానవ ఆచరణను, లిఖిత గ్రంథాలను విశ్లేషించే జ్ఞాన వ్యవస్థను నిర్మించలేదు. ఏమాత్రం ప్రతిస్పందనలకు వీలులేకుండా ఆధ్యాత్మిక గ్రంథాలను  వల్లెవేసే, చదివే (బట్టీపట్టే) పద్ధతిని అది అనుసరించింది. నైతిక విలువలతో కూడిన ఒక్క ఆధ్యాత్మిక గ్రంథాన్ని అయినా అది అభివృద్ధిపరచలేదు. హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ యుద్ధం గురించీ, శృంగారం గురించీ రాసినవే. హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణించిన యుద్ధాలలో అత్యధికం దురాక్రమణదారులు మూలవాసుల మీద చేసిన యుద్ధాలు (అన్నీ వైదిక యుద్ధాలు) లేదంటే అంతర్గత అంతర్యుద్ధాలు (రామాయణ, మహాభారతాలు).
కాకపోతే కొన్ని గ్రంథాలు మాత్రం హిందూ దేవతల, కథానాయకుల శృంగార ప్రయోగాల మీద రాయబడ్డాయి. అ లాంటి వాటిలో వాత్సాయన కామసూత్రం తొలి బృహగ్రంథం. దురదృష్టవశాత్తూ ప్రపంచ పుస్తకాల మార్కెట్‌లో భారతదేశానికి ఈ పుస్తకమే ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇది హిందూమత బలహీనతను చాటుతోంది తప్ప బలాన్ని కాదు.
...
భారతదేశంలోని దళితబహుజనులు అన్ని జీవనరంగాలలో క్రియాశీలక పాత్రను పోషించేలా చేయడానికి ఈ పుస్తకం ఉద్దేశించబడింది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం - ఆధ్యాత్మిక నియంతృత్వం ఎంత పరస్పర విరుద్ధమైన వ్యవస్థలో చూపడం, అవి మన జీవితంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయో నిర్వచించేందుకు కూడా ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది
...

హిందూ మతానంతర భారతదేశం
సామాజిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ రంగాల్లో దళిత బహుజన విప్లవం
రచన : కంచ ఐలయ్య


ఆంగ్ల మూలం : Post Hindu India
తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార
391 పేజీలు, వెల: రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
ఎమెస్కో బుక్స్‌,
1-2-7, బానూ కాలనీ, గగన్‌ మహల్‌ రోడ్‌, దోమల్‌గూడ,
హైదరాబాద్‌ - 500 029
ఫోన్‌/ఫాక్స్‌: 040-23264028
E Mail :  emescobooks@yahoo.com


పంపిణీదారులు:
సాహితీ ప్రచురణలు
29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యాపేట, విజయవాడ-2
ఫోన్‌: 0866-2436643, 0866-6460633
E Mail : sahithi.vja@gmail.com

Sunday, January 1, 2012

తెలుగు బ్లాగర్ల రచనలకు 'ఆదివారం ఆంధ్రజ్యోతి' నీరాజనం!


ఈ కొత్త సంవత్సరం తెలుగు బ్లాగులు మరింత ఉజ్వలంగా వెలిగిపోనున్నాయా? 


ఆరోగ్యకరమైన చర్చలతో, ఆలోచింపజేసే రచనలతో, జీవితానుభవాలనూ వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పంచే పోస్టులతో మరింత విస్తృతంగా నెటిజనులను ఆకర్షించనున్నాయా?


అవుననే అనిపిస్తోంది ఇవాళ్టి (1-1-12) ఆదివారం ఆంధ్రజ్యోతిని చూస్తుంటే!


మొత్తం సంచికను తెలుగు బ్లాగర్ల రచనలకు అంకితం చేయడం నిజంగా అద్భుతమనిపించింది. 
నూతన సంవత్సరం తొలి ఉదయమే మహదానందం కలిగించింది.


ఇందులో పొందుపరచిన బ్లాగర్ల రచనలు, బ్లాగుల వివరాలు ఇలా వున్నాయి:


1. లుంగి - వీజె : golisoda.in
2. పందిరాజము - అనిల్‌.ఎస్‌.రాయల్‌ : anilroyal.wordpress.com
3. మగపిల్లాడు పిల్లమగాడు - డి.ఎస్‌.గౌతమ్‌ : thotaramudu.blogspot.com
4. డెమ్మ డెక్కడాలి - యర్రపు రామనాధరెడ్డి : yarnar.blogspot.com
5. అసూబా'ల ఆహార్యం - వై.ఎ.రమణ : yaramana.blogspot.com
6. వెజిటెబుల్‌ సలాడ్‌ - పద్మార్పిత : padma4245.blogspot.com
7. చిన్న గీత - సుస్మిత : kothavakaya.blogspot.com
8. పాడమని నన్నడగవలెనా - నేస్తం : jaajipoolu.blogspot.com
9. నాకు ప్రేమించి పెళ్లి చేసుకునే యోగ్యత లేదా? - బులుసు సుబ్రహ్మణ్యం : bulususubrahmanyam.blogspot.com
10. సుత్తి! సుతిమెత్తగా!! - లలిత : naaspandhana.blogspot.com
11. ఐ యామ్‌ ఓకె, యు ఆర్‌ నాట్‌ ఓకె - కృష్ణప్రియ : krishna-diary.blogspot.com
12. చుక్కల మొక్కు - మధురవాణి : madhuravani.blogspot.com


పై బ్లాగర్లకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు !


తప్పక చదవండి ఆదివారం ఆంద్ర జ్యోతి
 http://www.andhrajyothyweekly.com/ 




..

నూతన సంవత్సర శుభాకాంక్షలు



గతం అనే గొంగళి పురుగులోంచి 

    ఆవిర్భవించింది వర్తమాన సీతాకోక చిలుక 

    అది ఆస్వాదించేందుకు ఈ  సువిశాల  ప్రపంచంలో 

    ఎన్నెన్ని అందమైన పుష్పాలో ...

   మీ అందరికీ ఆనందమయమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ...




.