Sunday, December 20, 2009
ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులంతా కలిసి పాల్గొన్న అపూర్వ ఉద్యమం!
ఒకప్పుడు సామాజిక సమస్యల పట్ల విద్యార్థిలోకం ఎంతో చురుకుగా స్పందించేది. ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించినా, పాల ధరను పెంచినా, సమాజంలో ఇంకే సమస్య తలెత్తినా ముందుగా విద్యార్థులే ఉద్యమించేవారు. 1960లలో, 1970లలో ఈ పరిస్థితి ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కనిపించేది. ఫ్రాన్స్‌లో 1968లో ప్రజా వ్యతిరేక చార్లెస్ డిగాల్ ప్రభుత్వాన్ని గద్దె దించిన ఫ్రెంచి విద్యార్థుల ఘనత అందరికీ తెలిసిందే.
ఆ తరువాత క్రమేణా ప్రైవేటీకరణ, సాఫ్ట్‌వేర్ రంగం, కెరీరిజం పెరుగుతూ పోవడంతో విద్యార్థులలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత స్థానంలో స్వార్థం, వ్యక్తిగత అభివృద్ధిపై ఆసక్తి పెరిగిపోయాయి. దాంతో బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, కాలేజీ ఫీజులు ఎన్నిసార్లు ఎంతగా పెరిగినా విద్యార్థుల నుంచి చెప్పుకోతగిన స్థాయిలో ప్రతిఘటనలు చోటు చేసుకోవడం లేదనే చెప్పాలి.
విచిత్రంగా ఇన్నాళ్ల తరువాత విద్యార్థులు మళ్లీ ఇప్పుడు ''ప్రత్యేక తెలంగాణా'', ''సమైక్య ఆంధ్ర'' ఉద్యమాల్లో తమ చదువులను పణంగా పెట్టి మరీ పాల్గొంటున్నారు. అనేక త్యాగాలు చేస్తున్నారు. అయితే విద్యార్థులు ప్రాంతాల వారిగా రెండు వర్గాలుగా విడిపోయి చేస్తున్న ఉద్యమాలివి.
ఉమ్మడి ఉద్యమం
1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్టం ఏర్పడిన తరువాత మొత్తం అన్ని ప్రాంతాల విద్యార్థులు కలసికట్టుగా చేసిన ఉద్యమం ఏదైనా వుందా?
వుంది.
అది 1966 లో సాగిన ''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు'' ఉద్యమం.
అందులో ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులు, వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన తీరు అపూర్వమైనది.
ఆ తరువాత 1969లో ''ప్రత్యేక తెలంగాణా'' ఉద్యమం, 1972లో ''జై ఆంధ్ర'' ఉద్యమం వచ్చాయి. వాటిలోనూ విద్యార్థులే
కీలక పాత్ర పోషించారు... కానీ ప్రాంతాల వారిగా విడిపోయి!
ఇవాళ కూడా మళ్లీ అదే పరిస్థితి.
1966లో విద్యార్థులంతా ఉమ్మడిగా చేసిన ''విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'' ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. ఆ
తరువాత ప్రాంతాల వారిగా సాగిన పై రెండు ఉద్యమాలూ రాజకీయ నాయకుల స్వార్థం, మోసం కారణంగా విఫలమయ్యాయి.
ఇప్పుడు కూడా రెండు ప్రాంతాల ఉద్యమాల్లోనూ రాజకీయ అవకాశ వాద పోకడలు ఆదినుంచే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోతారా లేక వారికి బుద్ధి చెబుతారా వేచి చూడాల్సిందే.
ఒకే సమస్యపై సాగుతున్న రెండు భిన్న ఉద్యమాలివి.
ఒక ప్రాంత ఉద్యమ లక్ష్యం - మరో ప్రాంత ఉద్యమ లక్ష్యానికి పూర్తిగా వ్యతిరేకం!
న్యాయం ఏదో ఒక వైపే వుంటుంది!
రెండు పక్షాల వాదనలూ న్యాయమైన వయ్యేందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. సెంటిమెంట్లు సమస్యను జటిలం చేస్తాయి తప్ప పరిష్కరించలేవు.
మరి ఎవరి వాదన... ఎవరి డిమాండు సరైనది?
ఎవరిది కాదు??
ఒక పక్షం వాదన న్యాయమైనదని తేలితే మరో పక్షం ఆ తీర్పును అంగీకరించి హుందాగా ఉద్యమాన్ని విరమించుకుంటుందా?
ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ఎవరు తేలుస్తారు?
నీతి నిజాయితీ లేని, నిలకడలేని, మాటకు కట్టుబడతారన్న నమ్మకంలేని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులా?
లేదు. వారి వల్ల ఏ సమస్యకూ న్యాయమైన పరిష్కారం లభించదు.
మరి ఎవరు?
ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థులే ఈ సమస్యకు స్వయంగా ఎందుకు పరిష్కారం కనుగొనకూడదు?
రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, అతీతంగా మూడు ప్రాంతాల విద్యార్థి (జెఎసి) నాయకులే ముందుకు వచ్చి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకుని లోతుగా చర్చించి న్యాయాన్యాయాలు తేల్చవచ్చు కదా.
విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మేం కేవలం వారిని అనుసరిస్తున్నాం అని దొంగ మాటలు చెబుతున్నారు కొందరు రాజకీయ నాయకులు.
వారి మాటలను నిజం చేస్తూ - అన్ని ప్రాంతాల విద్యార్థులు విజ్ఞతగా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన వచ్చు కదా?
విద్యార్థుల తలచుకుంటే ఇదేమంత అసాధ్యమైన విషయం కాదు.
రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్రాల పునర్విభజన అనేది దేశ విభజనంత జఠిలమైన సమస్య కాదు కదా!
స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి.
అవి సామరస్యంగా కలిసి ముందుకు సాగుతున్నాయి కూడా.
మన కెందుకు సాధ్యం కాదు?
తప్పకుండా సాధ్యమవుతుంది.
ఇరుపక్షాల వద్ద కావలసినంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వుంది.
విశాల హృదయంతో, నిష్పక్షపాతంతో, విజ్ఞతతో చర్చించ గలిగితే ఒక వారంలో, లేదంటే ఒక మాసంలో ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన సమస్యను విద్యార్థులే కనుగొని చరిత్ర సృష్టించవచ్చు!
ఉద్యమాలతో, బందులతో, విద్వేషాలతో, రాజకీయ కుట్రలతో కుతకుత లాడుతున్న రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు శాంతిసౌభాగ్యాలను ప్రసాదించవచ్చు.
ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులారా ఆలోచించండి.
ఫ్రాన్స్ విద్యార్థుల్లా మరో చరిత్ర సృష్టించండి!
Subscribe to:
Post Comments (Atom)
మంచి సూచన .మేధావులుగా తయారవవలసిన విద్యార్థులు ఆవేశపరులుగా మిగలకూడదు
ReplyDeleteనిజమే! మీరు చెప్పినట్టుగా విధ్యార్ధులంతా కలసి ఉధ్యమించి స్వార్ధ రాజకీయనాయకులను అన్ని వెనకపడిన (ఆంధ్ర, రాయలసీమ,తెలంగాణ ) ప్రాంతాలను ఇన్నేళ్ళుగా ఏలుతూ అభివృద్ధి చేయలేకపోయారెందుకని నిలదీస్తే ఇప్పుడు జరుగుతున్న ఉధ్యమానికి ఓ అర్ధం!
ReplyDelete