.
2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కరీంనగర్ జిల్లా జగిత్యాల లో ప్రత్యేక తెలంగాణా అంశంపై తమ పార్టీ స్టాండును వివరిస్తూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ఇది:
.
.
''జగిత్యాలలో నేను చెప్తున్న మాట - మరొక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాను.
ప్రజారాజ్యం ఈ ప్రజల అభిష్టానికి అనుకూలంగా, అనుగుణంగా స్పందిస్తుంది.
సానుకూలంగా వుంటుంది.
నా వెనకాల ప్రజలున్నారు.
నా ఉద్దేశంలో ప్రజాభివృద్ధి చేయాలి.
వాళ్లందరినీ అభివృద్ధి పథం వైపు నడపాలి.
స్వార్థ రాజకీయాలు ఉండకూడదు.
ఇక్కడ అన్ని రకాల వనరులుండి .. వాటిని అనుకూలంగా మనం మలచుకోవాలి.
మన రాష్ట్ర సంపద ఈ ప్రాంత అభివృద్ధి కోసంగా ఈ ప్రాంతం సంపదని పెంపొందించాలి.
అది చివరకు మీ అందరికి లబ్దిచేకూర్చాలి. అందుకని మరొక్కసారి చెప్తున్నాను. మీరు ...
కేంద్రం గనక ప్రతిపాదించి అది ముందుకు తీసుకురావాలి అని మనందరం అడుగుదాం.
కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీమరీ చెప్తున్నాను.
ఇంతకంటే ఇంకేమి ''క్లారిటీ'' కావాలి?
ఇంతకంటే ఇంకేమి చెప్పాలి?
చెప్పండి మీరు. మీరు అడగండి నన్ను.
ప్రజా ప్రతినిధులో, రాజకీయ నాయకులో వాళ్లు కాదు మీరు చెప్పండి.
మీరు ఏమంటే దానికి స్వాగతిస్తాను. దానికి సానుకూలంగా స్పందిస్తాను.
మీ అభీష్టమే నా అభీష్టంగా చెప్తాను.
మీరు చెప్పాలి. మీ మధ్యనుండి అడుగుతున్నాను. చెప్పండి.
(జై తెలంగాణా...జైజై తెలంగాణా నినాదాల హోరు).
నిజంగా మనందరికీ ఆ తెలంగాణా కావాలి అని అందరూ అనుకుంటే గనక
కేంద్రం దగ్గర పెద్ద ''సౌండ్'' చేద్దాం.
పెద్ద ''శబ్ధం'' చేద్దాం.
మీ గొంతు అక్కడ వినపడేలాగా చేద్దాం.
కేంద్రం నిర్ణయం ... కేంద్రం నిర్ణయించాలి. అది మీ దాకా చెప్పక - ఇక్కడి వాళ్లేదో చేయడం లేదు ... చేయడం లేదు అంటే ... కేంద్రం నిజంగా -
వాళ్లకి చిత్తశుద్ధి వుంటే ... మన అభీష్టానికి అనుకూలంగా వాళ్లు నిర్ణయం తీసుకుని... వాళ్లు ప్రతిపాదిస్తే గనక మనం సానుకూలంగా స్పందిస్తాం...!
మనం అడ్డుగా వుండం!! మనం స్వాగతిస్తాం!
ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని!
మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!!
అందుకని మరొక్కసారి -
జన సమక్షంలో వుండి ...
జనం మధ్యలో వుండి ...
జగిత్యాల నడిబొడ్డులో వుండి ...
జనం మధ్యలో వుండి ... చెప్తున్నాను....
చిరంజీవి ... ప్రజారాజ్యం కేంద్రం ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితిలో అడ్డుగా వుండదు!
వుండదు!! వుండదు!!!
ఈ రోజున సామాజిక న్యాయం కావాలి !
సామాజిక తెలంగాణా కావాలి !!
ఎక్కడైతే గనక సామాజిక ఉద్యమం మొదలయిందో ఇక్కడ జగిత్యాలలో మళ్లీ చెప్తాను ...
సామాజిక తెలంగాణా రావాలి!
దానికోసం మనందరం పాటుపడదాం!!
మీ అభీష్టాన్ని మనం అక్కడ తెలియజేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నిద్దాం.
కానీ దానికి కావలసింది మీ చేతుల్లో వుంది.
మీరు దానికోసం అత్యధికంగా మన గొంతు అక్కడిదాకా వినిపించేలాగా ఇక్కడి నుంచి మీ ప్రజాభీష్టానికి అనుకూలంగా ప్రజా ప్రతినిధులు కావాలి.
ప్రజా ప్రతినిధుల్ని మీరు ఎన్నుకోండి.
ప్రజారాజ్యంకు అత్యధిక ప్రజా ప్రతినిధుల్ని మీరు ఇవ్వగలిగితే ఆ రకంగా ఢిల్లీ దాకా మనం ప్రతిపాదిద్దాం...!
మీ అభీష్టానికి అనుకూలంగా వుందాం!
కానీ
తుది నిర్ణయం మాత్రం కేంద్రందే!
కేంద్రం దానికి సానుకూలంగా స్పందించాలి!!
కేంద్రం స్పందించి ప్రతిపాదిస్తే మాత్రం
ఈ చిరంజీవి .... మీ చిరంజీవి.... మీ ప్రజారాజ్యం ...
దానిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోదు ...!
అడ్డుకోదు...!!
అడ్డుకోదు...!!! అని చెప్తున్నాను.
కానీ
తమాషా ఏమిటంటే...
రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారు అంటే ... పూర్వం నుంచి వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు అంటే ...
కొంతమంది ఈ తెలంగాణా వాదం అనే ఓడను... తెప్పను ఎక్కి
అవసరం తీరిపోగానే తెప్ప తగలబెట్టే రకంగా తయారవుతున్నారు!!
మరికొంతమంది ఓడ ఎక్కిని తరువాత ఓడ మల్లన్న అంటున్నారు.
ఓడ దిగిన తరువాత బోడి మల్లన్న అంటున్నారు !!
ఇలాంటి అవమానాలకు గురయ్యే కదా మీ ''ఆత్మ గౌరవం'' దెబ్బతింది?!
కనుక- మీ ఆత్మగౌరవానికి ప్రథమ పీట వేస్తాం!
సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణాకి ప్రథమ పీఠం వేస్తాం!!
ప్రజల అభీష్టానికి మేం ... ప్రజారాజ్యం... మన ప్రజారాజ్యం ముందుంటుందని మీ అందిరి సమక్షంలో మళ్లీ మళ్ళీ చెప్తున్నాను.
- - -
... పూర్తి ప్రసంగం వీడియోను ఈ కింది యూట్యూబ్ లింక్‌లో చూడవచ్చు.
CHIRANJEEVI'S JAGITYAL SPEECH VIDEO CLIPPING
.
Thursday, January 28, 2010
Wednesday, January 27, 2010
గణాంకాల మాటున గడసరి తనం - ప్రొ. లక్ష్మణ్ , ఉస్మానియా విశ్వవిద్యాలయం . వ్యాసం ...
.
.
ఇవాళ్టి " ఆంద్ర జ్యోతి " దినపత్రికలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొ. లక్ష్మణ్ రాసిన "గణాంకాల మాటున గడసరి తనం" అనేక వాస్తవాలను వెల్లడించింది. చదవని వారి కోసం దానిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆంద్ర జ్యోతికి , ప్రొ. లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు.
దీనితో పాటు ఈ కింది లింకును కూడా చదివితే మరింత ఉపయుక్తంగా వుంటుంది.
తెలంగాణా ఆకాంక్షల చరిత్ర
.
.
ఇవాళ్టి " ఆంద్ర జ్యోతి " దినపత్రికలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొ. లక్ష్మణ్ రాసిన "గణాంకాల మాటున గడసరి తనం" అనేక వాస్తవాలను వెల్లడించింది. చదవని వారి కోసం దానిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆంద్ర జ్యోతికి , ప్రొ. లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు.
దీనితో పాటు ఈ కింది లింకును కూడా చదివితే మరింత ఉపయుక్తంగా వుంటుంది.
తెలంగాణా ఆకాంక్షల చరిత్ర
.
Wednesday, January 20, 2010
తెలంగాణా ఉద్యమ కవుల రణన్నినాదం ''జాగో.. జగావో...!''
తెలంగాణా తరతరాలుగా ప్రాంతీయ, ప్రాంతేతర నేతల మోసాలకూ, దోపిడీకీి, అణిచివేతకూ, అన్యాయానికీ గురవుతూ వస్తున్న గడ్డ. అందుకే అది ప్రజా ఉద్యమాలకు, త్యాగాలకూ అడ్డా అయింది.
తెలంగాణా నేలలోంచి గుప్పెడు మట్టిని చేతిలోకి తీసుకుని పలకరిస్తే అది పాటై ఎన్నో పోరాట గాధల్ని వినిపిస్తుంది.
తెలంగాణాలో అక్షరంముక్కరాని మట్టిమనిషి కూడా పోరాటాలకు పాఠాలు నేర్పిస్తాడు.
ఉద్యమాలచేత ఓనమాలు దిద్దిస్తాడు. పాటకోసం ప్రాణాలిస్తాడు.
కృష్ణా గోదావరి నదులు రెండు పక్కలా రెండు బాహువుల్లా వున్నప్పటికీ న్యాయమైన నీటి పంపకానికి నోచుకోక అత్యధిక తెలంగాణా నేలలు బీడుబడ్డాయి. అందుకే ఆ నేలల్లో అలజడులూ, ఆందోళనలూ ఎప్పుడూ మొలకెత్తుతాయి. పాటలూ, కవితలూ విస్తారంగా పండుతాయి. ఉద్యమాల తొలకరి జల్లులు కురిసినప్పుడు వాటి దిగుబడి చెప్పనక్కరలేదు.
1946 నుంచి 1951 వరకూ సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటకాలంలోనూ, 1968-69 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమకాలంలోనూ ప్రజల్ని చైతన్యపరచడంలో కవులూ కళాకారుల పాత్ర అపూర్వం.
ఇదిగో ఇవాళ మళ్లీ అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలంగాణా పోరాట పాటలు పల్లవిస్తున్నాయి. ఉద్యమ కవితలు కొత్త చిగుళ్లు తొడుగుతున్నాయి.
2009 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్‌డేగా పాటిస్తూ తెలంగాణా కవులూ కళాకారులూ హైదారాబాద్‌లో పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఉద్యమ జలపాతంలా సాగిన ఆ కవిసమ్మేళనంలో వెల్లువెత్తిన పాటలను, కవితలను ఏర్చికూర్చి తీసుకొచ్చిన సంకలనమే ఈ ''జాగో జగావో''.
ఇందులో లబ్దప్రతిష్టులు మొదలుకుని కొత్త తరం కవులు కలిసి రాసిన 117 కవితలూ, పాటలూ, పద్యాలూ వున్నాయి.
ఈ ఒక్క పుస్తకం చదివితే చాలు తెలంగాణా ప్రాంతేతరులకు తెలంగాణా ప్రజల ఆకాంక్ష, ఆవేదన, ఆక్రోశం, వారికి జరుగుతున్న అన్యాయం ఏమిటో అర్థం అవుతుంది..
అదేవిధంగా నైరాశ్యంతో కొట్టుమిట్టాడే తెలంగాణా మూలవాసులు చదివితే వారికి నూతనోత్తేజం, భళ్లున తెల్లవారు నింక భయంలేదు అన్న భరోసా కలుగుతుంది.
''కన్రెప్పలు తెరిచుండంగనే శత్రువు మన ఇంటిని, ఒంటిని వేలం పాటకు పెడుతున్నడు. నిద్రపోయిన కాడికి చాలు. లేవండి. లేపండి (జాగో, జగావో)'' అంటూ చురుకు పుట్టిస్తుంది.
తొలి పేజీలో పుస్తక సంపాదకులు ప్రకటించుకున్నట్టు నిజంగానే ...
'' బిగిసిన వంద కలాల పిడికిళ్లివి.
గొంతెత్తిన వంద కొడవళ్లివి.
వలసాంధ్రాధిపత్యం మీద ఎగరేసిన నిరసన జెండాలివి. ...''
ఈ సంకలనంలో చాలా కవితలు హైదరాబాద్ చుట్టే పరిభ్రమిస్తాయి.
మాయల ఫక్కీరు ప్రాణం చెట్టు తొర్రలోని చిలుకలో వున్నట్టు సమైక్యాంధ్ర లోగుట్టంతా హైదరాబాద్ నగరంలోనే వుంది.
హైదరాబాద్‌ను ... నిన్నటి హైదరాబాద్ రాష్ట్రం నుంచీ, రేపటి తెలంగాణా రాష్ట్రం నుంచీ వేరుచేయడం గురించే మల్లగుల్లాలు పడుతున్నారు. 'ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే' తీరులో చరిత్ర వక్రీకరణకు కత్తులు నూరుతున్నారు.
నిజానికి అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచెంది, యావద్దేశంలోనే ఐదో మహానగరంగా అ లరారుతున్న హైదరాబాద్ నగరమే తెలంగాణాలో లేకుంటే ఒక్క ఆంధ్ర నేతైనా తెలంగాణా మొహం చూసివుండేవాడా?
కర్నూలు కాదని తెలంగాణాలోని ఒక పట్టణాన్ని రాజధానిగా అభివృద్ధి చేసుకుంటూ కూర్చుని వుండేవాడా?
ఆనాడు ఆత్మాభిమానం, దూరదృష్టి లేని తెలంగాణా నేతల అసమర్థత వల్లనే శకుని పాచికలకు తెలంగాణా బలయ్యింది.
ఇప్పటికీ అనేకమంది తెలంగాణా నేతలు తమ చవటాయితనాన్ని, తమ బానిస మనస్తత్వాత్వాన్ని చాటుకుంటూ తమ స్వార్థం కోసం హైదరాబాద్‌కు సరికొత్త వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా వున్నారు.
అందుకే కాబోలు ఈ సంకలనంలో ఎక్కువ కవితలు హైదరాబాద్ చుట్టే అల్లుకున్నాయి.
''ఆదాబ్ హైదరాబాద్'' అనే కవితలో సుప్రసిద్ధ కవి 'లోచన'్ ఇలా అంటారు..."
....
మక్దూమ్ మల్లె పందిరి కింద మంట పెట్టేవాడికి
మనసు మమకారాల మాటేమి తెలుసు?
ఇక్కడి జీవధారలు తరలించుకుపోయిన పైరేట్లెవ్వరు?
సహజ సంపన్న తెలంగాణ తల్లిని
చింపిరి గుడ్డల్లో నిలిపిన వంచనా శిల్పులెవరు?
ప్రాణాన్ని మించిన ఆమె అభిమానాన్ని అవహేళన చేసిందెవ్వరు?
నీవు తిన్నింటి వాసాలు లెక్క పెట్టవు ... ... తగుల బెడతావు!
....
మనసున్న నగరమిది
మొహబ్బత్‌కి దునియా యిది
ఇక్కడి చౌరస్తాలో నిలబడి ధృతరాష్ట్రుని చేతులు చాచకు
...
అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు
అమ్మను కూడా నమ్మడు కదా
అవును తెలంగాణా తెర్లయింది
దొంగలు పడ్డ ఇల్లయింది
తెలంగాణా వాడు
నీకు దివానా గాడు
...
హైదరాబాద్ నీకు అతిపెద్ద ఆర్థిక మండలి కదా
నీ వేమైనా కొనగలవేమో గానీ
తెలంగాణాకి వెలకట్టలేవు''
- లోచన్ (ఆదాబ్ హైదరాబాద్)
తన ప్రియురాలికోసం ప్రాణాలిచ్చి వాలెంటైన్స్ అమరుడయ్యాడు. తను ప్రాణాధికంగా ప్రేమించే భార్య మరణిస్తే షాజాహాన్ తాజ్‌మహల్‌ని నిర్మించి చరిత్రకెక్కాడు. కానీ తన
కులం, మతం గాని ఒక నిరుపేద నెచ్చెలి (మాదిగ కులస్తురాలైన భాగమతి) కోసం ఒకరాజు ఏకంగా మహానగరాన్నే నిర్మించడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా, ఒక్క భాగ్యనగరంలో తప్ప. అంతటి గొప్ప నగరం ఇవాళ కన్నీరు కారుస్తోంది అంటారు గుడిపల్లి రవి తన ప్రేమనగరం పాటలో.
'' దేఖో దేఖో భాయీ - మేరా హైదారాబాద్ రోయీ..
జెర దోఖో సునో భాయీ తుమ్ హైదరాబాద్ రోయీ..
భాగమతి పేరున కట్టిన భాగ్యనగరమూ // దేఖో దేఖో //
ప్రేమికుల గలుపనీకె వాలెంటైన్స్ ప్రాణమిచ్చె
షాజహాన్ ప్రేమ కొరకు తాజ్‌మహల్ బంగ్ల గట్టె
దునియాల లేనె లేదు - ప్రేమ కొరకు గట్టిన నగరం'' // దేఖో దేఖో //
...
- గుడిపల్లి రవి (ప్రేమ నగరం హైదరాబాద్ - పాట)
హైదరాబాద్ ఎలాంటి నగరం? ఎటు చూసినా పచ్చని చెట్లతో, బాగ్‌లతో, అనాబ్‌షాహీ ద్రాక్ష, పూల తోటలతో పరిమళ భరితంగా విలసిల్లుతుండే నగరం. ఇవాళ మురికి కూపంగా, కాలుష్య కాసారంగా, రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారింది. ఇప్పుడు దానిని తెలంగాణా నుంచే శాశ్వతంగా వేరు చేయాలనే కుట్రలు కుతంత్రాలు సాగుతున్నాయి.ఇదంతా ఎవరి పుణ్యం?
''ఇది అత్తర్ నగరం
కంపు రాజకీయాలతో
బీమార్ చేయకు!
దోస్తీ చేసిన వాళ్లను
ధోకా చెయ్యకు!
ఇక్కడి జనాలది భోళా గుణం
నా గిన్నెలనే తిని
నీ ఎంగిలి నీళ్లని
నా ముఖం మీద కొట్టకు!
కరచాలనం చేసిన చేతిని
కపటంతో నరకకు!
...
నన్ను నెట్టివేస్తూ నెట్టివేస్తూ
నేను నిలుచున్న నీడను లాక్కున్నావు
జరుగుతూ జరుగుతూ
చివరిమెట్టుదాకా జారాను
ఇప్పుడు ఉల్టా తిరుగకపోతే
నాకు బతుకు తెరువు లేదు
- ఆశారాజు ( నా భాగ్య నగరం తెలంగాణా వజ్ర కిరీటం)
మతసామరస్యానికి, మమతానురాగాలకు పెట్టింది పేరైన హైదరాబాద్‌కు వందనాలు చెబుతూ షాజహానా రాసిన కవిత ఆర్ద్రతను కలిగిస్తుంది.
''ఇరానీ చాయ్ కమ్మదనపు రుచి
ఇరుమతాల దోస్తానాను గుర్తు చేస్తుంది
హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమల ధూమాలు
భూమి చుట్టూ సాంబ్రాణి పొగలై అ లుముకుంటాయి
రాత్రి కూడా పగలై విచ్చుకునే
రాత్రీ పగలూ తేడాలేని కష్టజీవి ఈ నగరం
ఈ చార్ సౌ సాల్ షహర్ బిడ్డలు
సంపాయించడానికే బతకడంలేదు
భూమిని చాపలా చుట్టి చంక కింద పెట్టుకునే
రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదు వాళ్లు
నగర జీవనానికి నాడి వాళ్లు
షహర్ వాళ్లకు అమ్మ
నగరానికి నిజమైన వారసులు వాళ్లు
...
కడుపు చేతుల పట్టుకునొస్తే
కన్నీరు పెట్టిన నగరం మీకింత చోటిచ్చింది
గిరిగీసుకుని లేదుపొమ్మని
మీ మొఖాన తలుపెయ్యలేదు చూడూ..
అ లాంటి అమ్మను లంజ అంటారా?
మీ లాంటి లక్షలాది కృతఘ్నుల్ని
ఒడిలో మోస్తున్న నా హైదరాబాద్
అ ల్లావుద్దీన్ చేతిలో ఎన్నటికీ ఆరని అద్భుత దీపం
మేరా హైదరాబాద్
తుఝే సౌ బార్ సలాం!!''
- షాజాహానా (మేరా హైదరాబాద్)
హైదరాబాద్‌ను ప్రీజోన్ చేయాలనే వాదనపై ఆగ్రహం వెళ్లగక్కుతూ వఝల శివకుమార్ సంధించిన వ్యంగాస్త్రాలు ...
'ఔను మరి
మీకు నగరం ఫ్రీ జోనే!
వడ్డించిన విస్తరి
తేరగా ఆరగించడానికి
పరిచి పెట్టిన పక్వాన్నాల భోజనం!
...
ఇంక ఆడుండ్రి
ఫిలిం నగర్ల నుంచి ఫిలిం సిటీల దాంక
జూపార్కుల నించి జూబిలీ గుట్టల దాంక
సేట్లు మీరు, కార్పోరేట్లు మీరు
రూట్లు మీరు, పర్మిట్లు మీరు
సినిమా వాళ్లు మీరు
సినిమా హాళ్లు మీరు
మా రక్తాన్ని జనిగెల్లా పీల్చే
బళ్లు మీరు పెట్టుబళ్లు మీరు
ఔను మరి ...
నగరం మీకు ఫ్రీ జోనే...!
కబ్జాలు కబ్జాలై రియలెస్టేటులై
గ్రేటర్ బోర్డులై ఔటర్ రింగ్ రోడ్డులై
చుట్టుముట్టు పల్లెల్ని
ఎవుసం భూముల్ని
ఆంబుక్క పెట్టవచ్చు
పోద్దెక్కితే దిల్‌సుఖ్‌నగర్ నించి కూకట్‌పల్లి దాంక
మీ ఫాక్షన్ కక్షల ప్రతీకారాల్ని
నిరాటంకంగా తీర్చుకోవచ్చు
మీ కోస్తా ద్రోహాల మార్కెట్లు తెరిచి
మసిబూసి మారేడు కాయ జెయ్యొచ్చు
పొద్దు గూకితే నారాయణగూడల్ని, నెక్లెస్ రోడ్లని
తెనాల్జెయ్యొచ్చు, పెద్దాపురాల్జెయ్యొచ్చు
నమ్మినోల్లని నట్టేట ముంచే తీరుల్ల
ఆరితేరినోళ్లు గదా
ఔను మరి నగరం మీకు ఫ్రీ జోనే...!''
- వఝల శివకుమార్ (ఫ్రీ జోన్)
ఇదే వాదనపై రాసిన మరోకవితలో జూపాక సుభద్ర ఇలా అంటారు-
''వారీ వలస రాబందూ...
నీ వల్లనే హైద్రాబాదు సీరె రైక గట్టిందని
బొట్టు బోనం బెట్టిందని
నేను రాకముందు గీడ జిల్లేల్లు పల్లేర్లని
గబ్బిలాల దుబ్బులుండేయని
రాజిర్కములున్నవని
నీ నాలికెకు నరమే లేకపాయె!
నోరున్నదని కిందాకు మీద
మీదాకు కింద జేస్తె యెట్లయితది?!
...
వామ్మో తుర్క దేశమని
బాబోయ్ నక్సలై టేరియాని దొంగ బుగుల్లు
కేంద్ర పాలితం జెయ్యాలన్న ఆంధ్ర ట్రిక్కులు
మా హైద్రాబాద్ పాదాలకాడ పానసరం బడనీకె
యిప్పుడు ఫ్రీ జోన్ పడగలూదినా
నీ వూదు గాలది పప్పుడకది బిడ్డా...
బాజాప్తుగ భాగ్యనగరం మాదే
గీ అవ్వల్ దర్జా హైద్రాబాద్
మా వీర తెలంగాణది
పోరు తెలంగాణది,
మా వేరు తెలంగాణది.
- జూపాక సుభద్ర ( తెలంగాణ సెమట పువ్వే అవ్వల్ దర్జా హైద్రాబాద్)
మరెన్నో కవితల్లో కూడా ఇదే తరహాలో ఆవేదన ఆక్రోశం వ్యక్తమయింది.
''ఎవడి నోటికొచ్చినట్టు వాడు మాట్లాడుతున్నడు
హైదరాబాద్ ఎవడబ్బ సొమ్మని తేల్చమంటుండ్రు?
మా మూసీ నదిని మురికిగా మార్చినందుకా?
మీరు పరిశ్రమలు పెట్టుకొని కోట్లకు పడగలెత్తి
కాలుష్యాన్ని మాకు మిగిల్చినందుకా?
మా భూగర్భ జలాల్ని విషంగా మార్చినందుకా?
హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంట...!
బతుకమ్మ కుంటలో బతుకమ్మలాడకుండ చేసినందుకా?
మా టాంక్‌బండ్‌ను సచ్చి గూడా మీ పెద్దలు ఆక్రమించినందుకా?
- శీలం రామ్మూర్తి (హైదరాబాద్ ఎవల్ది?)
మదరాసాంధ్రుల జిట్టికండ్లు శిమ శిమన్నయి
భాషా రాష్ట్రాల సమైక్యత చీడ బుట్టింది
ఆంధ్ర హైదరాబాద్ విష విలీన మంత్రం
బట్టపులికి మ్యాక పిల్లకు పొత్తు కలిపిండ్రు
పెద్ద మనుషుల ఒప్పందం గద్దల పాలైంది
భుజాల మీదెక్కి సవారి చేస్తండ్రు
- అన్నవరం దేవేందర్ (దోఖా)
హైదరాబాద్ పేదకొడుకుల ప్రేమగల తల్లి
ఒక్క బన్ రొట్టెను చెరిసగం తినిపిస్తుంది
తాను పస్తులున్న సంగతి తన ప్రాణానికే తలియనివ్వదు
కొడుకుల్ని చూస్తే చాలు ఆమె కడుపు నిండుతుంది
- అమ్మంగి వేణుగోపాల్ (కన్నతల్లి)
మా తెలుగు తల్లికీ మల్లె పూదండ పాట ఆనాడు మదరాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరయ్యేందుకు, సీమాంధ్రలోని తెలుగు వాళ్లలో ఆత్మాభిమానాన్ని ప్రేరేపించేందుకు ఎంతగానో దోహదం చేసింది. కానీ అదే పాటను ప్రయోగించి తెలంగాణా ప్రజల్ని వంచించేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం తెలంగాణా ప్రజలు హర్షించలేకపోయారు. మా ఇంటిని కొల్లగొట్టేందుకు కన్నం వేసిన వాడిది మా భాషైతేంది, మా కులమే ఐతేంది?
''వందేమాతరం, బందీ మాతరం
నిర్జలాం నిష్ఫలాం
రోజూ ప్రార్థన చేస్తనే వున్నం వినేదెవరు?
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
గలగలా గోదారి కదలిపోతుంటేను
విలవిలా మానేల 'ఎండి పోతుంటేను'
బిరబరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
కటకటా 'కరువమ్మ వచ్చి నిలుచుంటేను'
...
మా భూమి మా నీళ్లు దక్కి తీరేదాక
మా ఆటలే ఆడుతాం
మా పాటలే పాడుతాం
జై తెలంగాణా జైజై తెలంగాణా !!
- తైదల అంజయ్య (తెలంగాణ స్కూల్ అసెంబ్లీ)
" తెలంగాణ గొంతు పెగలంగనే
తెలుగు భాష తియ్యగైతదెందుకు?
...
ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్న కొడుకుల్లారా
అమ్మని తాకట్టు బెడుతున్న బిడ్డలారా సల్లగ బతుకురి
ఆంధ్రోల్ల ఎంగిలి మెతుకులు తిని
ఆల్ల మోచేతి నీల్లు తాగి ఎయ్యేండ్లు వర్దిల్లురి
ఆల్లెప్పటికీ పడుసోల్లే ఇప్పటికింకా పదహారే
ఆల్ల కాళ్లు బట్టుకోరి - కాలనీల సుట్టు తిరుగురి
ఆపార్టుమెంట్లు గట్టియిరి - హైద్రాబాద్ రాసియ్‌రి
ఆమ్మ ఆడుక్క తింటేంది - కన్నబిడ్లల్ని అమ్ముకుంటేంది
ఉన్న ఉద్యోగాలు ఊడితేంది - అన్నదమ్ములు దుబాయ్‌ల సస్తేంది?
ఏమన్నగానీ... ఎట్టనన్నబోనీ...
ఆల్లని పల్లెత్తు మాటనకురి
మీ పదవులు బోతయ్- పానాలు బోతయ్''
- అంబటి వెంకన్న (తెలుగు మాది - తెలంగాణ మాది)
ఆట పాటలతో తెలంగాణా పల్లెలు ఆనాడు ఎలా వుండేవి. ఈనాడు ఎలా వున్నాయి, ఆ సందడంతా ఏమైపోయింది అని గుండెలు కరిగేలా ప్రశ్నిస్తారు నిస్సార్ ఈ పాటలో -
''పండూ వెన్నెల్ల లోన - వెన్నెల్ల లోన
పాడేటి పాటలేమాయె?
మన పల్లెటూరి లోన ఆడేటి ఆట లేమాయె...?
...
స్టేజి కరెంటు మైకు ఏదీ లేకున్న గాని
తెల్లార్లు ఆడి పాడేది
మన పల్లె గుండెలోన మోగేటి కంచుగొంతులేవీ?
...
ఢిముకు, ఢిముకు డోలు దరువు
ఘల్లు ఘల్లు గజ్జెల్ల
ఒగ్గోల్ల కత లెటుబాయె?
మన ఢిల్లెం కల్లెం - చిల్లం కల్లం ఆయే!
...
వాడకట్టు అమ్మలక్క లొక్కతాన గూడి
సుట్టు కాముడాడే టోల్లు
మన పల్లెటూరినంత ఉయ్యాలలూపెటోల్లు
ఇద్దరక్క చెల్లెల్ల ఉయ్యాలో - వొక్కూరికిచ్చిరి ఉయ్యాలో
వొక్కూరికిచ్చిరి ఉయ్యాలో - వొక్కనికే ఇచ్చిరి ఉయ్యాలో
వొక్కడే మాయన్న ఉయ్యాలో - వొచ్చన్న పోడాయె ఉయ్యాలో
సక్కని మాయన్న ఉయ్యాలో - సూసన్న పోడాయె ఉయ్యాలో
చిన్నారి చెల్లెండ్లు, చెంగు చెంగు నెగురుకుంట
చెమ్మ చెక్కలాటలాడేది - మన వాకిల్లలోన ఆడపిల్లల లొల్లేది?
- నిసార్ (పండు వెన్నెల్లలోన)
తెలంగాణాలో ఇవాళ ప్రతి రోడ్డూ ఉద్యమ వేదికయి ఆటపాటలతో, పాదయాత్రలతో, నినాదాలతో మారు మ్రోగిపోతోంది. రోడ్డు మీదనే మహిళలు బతుకమ్మలు ఆడుతున్నారు. బడి పిల్లలు రోడ్ల మీదనే పరీక్షలు రాస్తున్నారు. కుల వృత్తుల వాళ్లు రోడ్ల మీదనే క్షౌరాలు చేస్తున్నారు, బట్టలుతుకుతున్నారు, కుండలు చేస్తున్నారు. వంటలు వండి వడ్డిస్తున్నారు.
''నేను మళ్లీ రోడ్డు మీదికొచ్చాను
భగాయించి నువ్వు ఇంట్లో నక్కినవ్
రోడ్డు ఇవాళ నినాదమైంది
రోడ్డు ఇవాళ ర్యాలీ ఐంది
రోడ్డు ఇవాళ రాస్తారోకో ఐంది
రోడ్డు ఇవాళ బంద్‌కి ప్రతిరూపమైంది
రోడ్డు అసెంబ్లీ ముట్టడికి దారి చూపింది
...
మాకు ఉద్బోధలు చేస్తావా?
రారా! నీకో నాలుగు నినాదాలు నేర్పిస్తా
నా రక్తంలో సోడా కలుపుకొని తాగి జోగుతున్నవాడా!
మత్తు దిగి తెరుచుకున్న నీ కన్ను మీద
తెలంగాణ పటం ప్రతిబంబమవుతుంది
అందులో నా హైదరాబాద్
కోహినూరై మెరుస్తుంది
- స్కై బాబ (రోడ్డు ఉద్యమం అడ్డా)
రెండు విడి రాష్ట్రాలు 1956లో ఒక జెంటిల్‌మెన్ అగ్రిమెంటు కుదుర్చుకుని ఒకటిగా విలీనమయ్యాయి. ఆ తరువాత ఆ అగ్రిమెంటులో ఒక్క నిబంధనని కూడా అమలు పరిచిన పాపాన పోలేదు. అగ్రిమెంటు అమలు కానప్పుడు ఇంకా పొత్తుల బేరం ఎలా చెల్లుతుంది.
1969లో తెలంగాణా ప్రజలు ఉవ్వెత్తున ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తే దాదాపు 400 మందిని పోలీసు కాల్పుల్లో చంపి, ఉద్యమ నేతలను మంత్రిపదవులతో లొంగదీసుకుని అత్యంత హేయంగా, అప్రజాస్వామికంగా, ఆన్యాయంగా ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. ఇవాళ మళ్లీ అదే సామ దాన భేద దండోపాయాలతో పాత మోసాన్నే పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
1956 తరువాత దేశంలో ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయి. అవి ఆంధ్ర తెలంగాణా మాదిరిగా అవేవీ మొదటినుంచీ విడి రాష్ట్రాలు కూడా కావు. ఆ విభజనలన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ తెలంగాణా విషయం వచ్చేసరికి ఇండియా పాకిస్థాన్‌ల మాదిరిగా ఏదో విపత్తు సంభవిస్తుందనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. దేశ విభజన సమయంలో ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి తమ ఇళ్లనీ, ఆస్తిపాస్తుల్నీ వదిలేసి కట్టుబట్టలతో పారిపోవాల్సి వచ్చినట్టు పోవాల్సి వస్తుందనీ, ఒక ప్రాంతం వాళ్లు మరో ప్రాంతం వెళ్లాలంటే పాస్‌పోర్టులు, వీసాలు అవసరం అవుతాయనీ దుర్మార్గ, కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారు. కృత్రిమ అపోహలను సృష్టిస్తున్నారు. అందుకే ఆనాడు కాళోజీ ...
తెలంగాణా వేరైతే
దేశానికి ఆపత్తా
తెలంగాణా వేరైతే
తెలుగు భాష మరుస్తారా ?
అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు గోరటి వెంకన్న అదే తరహాలో ప్రశ్నిస్తున్నారు.
''ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా
ఇండియా పాకిస్థానోలె ఇనుపకంచె పడుతుందా
......
మీ ఇడ్లి బండి అడ్డాజాగ మీరె నిలుపుకోవచ్చు
మీ కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డుల మీరే కులుకుతుండొచ్చు
మీ వనస్థలిపురంలోన వుండచ్చు, పండచ్చు
ఆ అమీర్‌పేట అడ్డాజేసుక అధికారం నెరుపుకోండ్రి
గా సెక్రటేరియట్‌ల మాత్రం నీ చక్రం తిప్పుతె గాదు
పొమ్మంటె పోవేందిర పోరా ఓ వలస దొర
...
తెలుగు జాతి ఒక్కటని తెగుల బడిపోతున్నవ్
అన్నదమ్ములిద్దరుంటే ఆస్తి పంచుకోర చెప్పు
భాష ఒక్కటైతె నన్ను బాధ పెట్టాలనుందా
జాతి ఒక్కటైతె నన్ను గోతిల ఎయ్యాలనుందా
....
ఊరిలోన అరెకురం భూమున్న దమ్ముకొచ్చి
ఈడి కొచ్చి హీరోలై విర్ర వీగ బడ్తిరి
త్యాగాలు మా చరిత్ర - భోగాలు మీ చరిత్ర
విశాలాంధ్ర గిశాలాంధ్ర జాంతానై సమైక్యాంధ్ర
విషాదాల కింక స్వస్తి తెలంగాణ కొరకు కుస్తీ
- గోరటి వెంకన్న (ఇద్దరం విడిపోతే)
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికీ ఇప్పటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికీ మధ్య ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆనాటి ఉద్యమంలో దాదాపు నాలుగు వందల మంది అమరులైతే వాళ్లలో ఒక్కరు కూడా ఆత్మ హత్య చేసుకున్న వాళ్లు లేరు. ఆందరూ పోరాటంలో, పోలీసుల తుపాకులకు బలయినవారే. కానీ ఇవాళ నీతి నిజాయితీలేని దివాళాకోరు రాజకీయ నాయకుల వల్ల... రాజకీయ పార్టీల దుర్మార్గమైన రెండు నాల్కల ధోరణి వల్ల... క్రమశిక్షణ, ఒక సిద్ధాంతం, చిత్తశుద్ధి , ప్రజలకు సరైన మార్గం చూపగలిగే సత్తా లేని నేతల వల్ల ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగి ఇప్పటికే దాదాపు 200 మంది వరకు తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకున్నారని/గుండెలాగి చనిపోయారని అంచనా. ఒకే పార్టీవాడు అక్కడ సమైక్యత అని నినదిస్తూ, ఇక్కడ ప్రత్యేక తెలంగాణా అంటూ నడిబజార్లో న్యాయం వలువలు ఊడదీసి అపహాస్యం చేస్తుంటే ఆమాయక జనం ఆగమైపోతున్నారు. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మన ప్రజాస్వామ్య వ్యవస్థకే, తెలుగువాళ్ల ప్రతిష్టకే మాయని మచ్చ. నిరాశానిస్పృహలతో అసువులు బాసిన అమరులకు కవులు అశృవులతో నివాళులర్పిస్తున్నారు.
తెలతెలవారంగా తెలిరేఖలై విచ్చి
తెలంగాణ కోసమై ప్రాణాలు ఒడ్డిన
వీరులారా మీకు జోహార్లు
మా బిడ్డలారా మీకు జోహార్లు
- వరవరరావు (తెలంగాణ అమరులు)
జోహార్ శ్రీకాంతన్నా
అగ్నికి ఆహుతి అవుతూ జంకుగొంకు లేకుండా
తెలంగాణ కోసమని తెగువ జూపి
అమర వీరుడవయ్యావా
కాలిన శరీరంతో మైకుల ముందు
జైతెలంగాణ అని చెప్పిన ధీరుడవయ్యావా..
- ముస్కు రాము (జోహార్ శ్రీకాంతన్నా)
ఇందులోని నిప్పుకణికెల్లాంటి 117 కవితల్నీ ఇక్కడ సమీక్షించడం సాధ్యం కాదు. వాటిలోని ఒకటో రెండో వాక్యాలని ఉటంకిస్తే వాటికి న్యాయం జరుగదు. పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివినప్పుడే దాని నాడి అందుతుంది.
''మేం చెమటోడ్చి కట్టుకున్న పుట్టల
నువ్వు బుస్సు... మంట పడగెత్తతే
చీమల్లెక్క అగ్గం బగ్గమై చెదిరిపోతున్నం.
...
దొంగలు దొంగలు వూళ్లు పంచుకున్నట్టు
ఫిరీజోన్ ముసుగులో దొడ్డిదారంట
మూటలు దాటేత్తుంటే
మాటలు రా కామోష్‌గ తండ్లాడుతున్నం
- దిలావర్ (ముల్కీ)
...
నవంబర్ ఒకటిని మా నెత్తిమీద గుది బండను చేస్తవు
దింపుకుందామంటే దినమొక వేషమేస్తవు
నీతిలేదు నియ్యతు లేదు
పోరా నాయనా ఫో
- కాసుల ప్రతాపరెడ్డి (మాట)
....
వంగుతె మాయం చేద్దమని వీడు
పెయ్యి మీది అంగిని దొబ్బినా
సోయిలేనోడు వాడు
మరె... ఇగేం కల్సుంటరు బిడ్డా ...
... ఇదివరకు ఇంటి దొంగలు దోసి తినిరి
ఇప్పుడు బైటి దొంగలు బరిబాత జేత్తాండ్రి
తెలంగాణ దొంగలుపడ్డ ఇల్లయింది బిడ్డా
- రామా చంద్రమౌళ్లి (ఇల్లంత తెర్లయింది కొడ్కా...)
....
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం
ఆంధ్ర రాష్ట్రం నిర్మాణంకై అక్కరకు వస్తే
నాలుగు వందల మంది
విద్యార్థి పోరగాండ్ల పానాలు తీసినా
తెలంగాణా ఇయ్యడానికి అక్కరకు రాలేదేంది?
... బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలు మీకు
బంజరు భూములు మాకు!
- దొంత భద్రయ్య (తెలంగాణ కావాల్నని మంకుపట్టు పడతం)
...
ముల్కీ రూల్లను పెద్ద మనుషుల ఒప్పందాన్ని
బుర్దల తొక్కి విశాలాంధ్ర ఆక్టోపస్ అయింది
పచ్చల్ల నమ్ముకుంట అగ్గసగ్గ భూముల బ్యారం బెట్టుకుంట
మా భూములను గుంజుకున్నరు
అసెంబ్లీ పార్లమెంటు జుడీషియరీ, మీడియాల
దురాక్రమణ చేసిన పేరాసైట్స్ ఒకటి రెండు కులాలే
మూలవాసులను జినోసైడు చేస్తున్నవి ఈ కులాలే
- గోగు శ్యామల (తెలంగాణ జాతి)
....
క్యా బద్‌నసీబీ హై హమారీ
మా నేల మాక్కాకుండా పోయింది
మా కళ్ల ముందే పేకముక్కల్లా పంపిణీ జరుగుతోంది
మా నీళ్లు - మా బీళ్లకు దూరమైనాయి
- సయ్యద్ ఖుర్షీద్ (పాకే రహేంగే తెలంగాణా)
.....
అణచివేత, ఆధిపత్యం ఒక రాక్షస క్రీడే
అందువల్లే కదా
మా మట్టి మానభంగానికి గురైంది
మాంసం కొనుక్కుపోయేంత సహజంగా
మా నేలతల్లిని అంగట్లో పెట్టి కాజేస్తుంటే
మేము యేం చేయాలో చివరకు అదే చేస్తున్నాం కదా!
- నాళేశ్వరం శంకరం (భూమి భవిష్యత్తు)
.......
పోలవరాలు, పోతిరెడ్డిపాడులు, ఓపెన్‌కాస్ట్‌లు, సిక్స్‌టెన్‌లు
ఫ్రీజోన్లు తెలంగాణా తల్లికి ఉరితాళ్ళైతుంటే
తెలుగు తల్లీ నీ పాటనే పాడలేను
తెలంగాణా తల్లి గుండె గాయాల్ని మరిచిపోలేను
- సహచరి (తల్లీ ... నీ పాట పాడలేను)
ఇంకా ఈ ఉద్యమ కవితా సంకలనానికి తెలంగాణా రాష్ట్ర గీతంగా పేరు గాంచిన
అందశ్రీ ''జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం '',
గూడ అంజయ్య రాసిన ''ఎనక ముందు సూసుడేంది రాజన్న ఓ రాజన్న ఎత్తుకో తెలంగాణ జండ రాజన్న ఓ రాజన్న'' పాట,
నందిని సిధారెడ్డి రాసిన ''నాగేటి సాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా''
పాట అదనపు ఆకర్షణగా నిలిచాయి.
జాగో ... జగావో
తెలంగాణా ఉద్యమ కవిత్వం
ప్రధాన సంపాదకులు:
స్కై బాబ
సంపాదకులు:
పసునూరి రవీందర్, షాజహానా, గోగు శ్యామల, అన్వర్, వేముగంటి మురళీ కృష్ణ, అన్నవరం దేవేందర్
187 పేజీలు, వెల: రూ.30/- (ముఫ్ఫై రూపాయలు)
ప్రతులకు:
స్కై బాబా
10-1-639, చింతల్ బస్తీ,
ఖైరతాబాద్, హైదరాబాద్ 400 004
ఇమెయిల్:
skybaba@ymail.com
hcuravinder@gmail.com
...
Monday, January 11, 2010
డాక్టర్ సి.నారాయణరెడ్డి నోట ప్రత్యేక తెలంగాణా పాట ....!
డాక్టర్ సి.నారాయణరెడ్డి నోట ప్రత్యేక తెలంగాణా పాట...
నమ్మలేకపోతున్నాను.
1969లో తెలంగాణా అంతటా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యతకు ఊపునిచ్చే ... '' తెలుగు జాతి మనదీ - నిండుగ వెలుగు జాతి మనదీ...'' అనే గీతం రాసి తెలంగాణా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న డాక్టర్ 'సినారె' నేడు '' ..తెలంగాణా ఏర్పడి తీరుతుంది, తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా వుంటే నష్టమేమీ లేదు '' అన్నారంటే...
నిజంగానే నమ్మలేకపోతున్నాను.
ఇవాళ్టి ఆంధ్ర జ్యోతిలో వచ్చిన ఆ వార్త చదవగానే ముక్కోటి రతనాల వీణలు ఒక్కసారి లయబద్ధంగా మ్రోగినంత ఆనందం కలిగించింది.
సినారే గారూ,
తెలంగాణా పై జాతి జనులు నిత్యం పాడుకునే మరో పాట రాసి ఆనాటి పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలి. మీకు జన్మనిచ్చిన తెలంగాణా తల్లి రుణం తీర్చుకోవాలి. ఇది మీకు మా వినయపూర్వక అభ్యర్ధన .
.......................
ఇదిగోండి ఆ వార్త
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి ... తెలంగాణా ఏర్పడి తీరుతుంది : సినారె
వేములవాడ, జనవరి 10 (ఆన్‌లైన్)
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఈనాటిది కాదనీ, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా వుండాలన్న ప్రతిపాదనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని, అయితే తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా వుంటే నష్టమేమీ లేదన్నారు.
ఎన్‌డిఎ హయాంలో కొత్తగా ఏర్పడిన మూడు చిన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా స్వయం సమృద్ధికి అవకాశం వుంటుందని చెప్పారు.
ప్రాంతాల మధ్య వైషమ్యాలు అవసరం లేదని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దూషించడం సరైంది కాదని అన్నారు.
'' తెలంగాణ నాది, రాయలసీమ నాది, కోస్తా నాది....'' అన్న పాట ఎన్టీఆర్ కోరిక మేరకు రాశానని, నాటి పరిస్థితులు నేడు లేవని, ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం కోరుకుంటున్నారని సినారె అన్నారు.
- ఆంధ్రజ్యోతి 11 జనవరి 2010 సౌజన్యంతో
....................................................
జయహో తెలంగాణా జయహో!
.
Tuesday, January 5, 2010
'' జై సమైక్యాంధ్ర! '' నినాదంలో సీమాంధ్రలు తప్ప తెలంగాణా ఎక్కడుంది?
.
'' జై తెలంగాణా'' నినాదానికి - పోటీగా - గత డిసెంబర్ 10 నుంచి ''జై సమైక్యాంధ్ర'' నినాదం హాడావిడిగా తెరమీదకు వచ్చింది!
లోగడ ''జై ఆంధ్ర!'',
''జై గ్రేటర్ రాయలసీమ!''
నినాదాలు విన్నాం కానీ ఎప్పుడూ ఈ '' జై సమైక్యాంధ్ర! '' నినాదం వినలేదు.
1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తప్ప సమైక్యాంధ్ర పేరుతో ఎప్పుడూ ఏ ఉద్యమమూ జరుగలేదు.
ఇంతకీ ''జై సమైక్యాంధ్ర'' అంటే అర్థం ఏమిటి?
ఆంధ్ర - రాయలసీమ ప్రాంతాలు సమైక్యంగా వుండాలనేనా?
ఆ నినాదంలో అదే ధ్వనిస్తోంది!
1953లో పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది ఆంధ్ర రాయల సీమ ప్రాంతాలతో కూడిన '' ఆంధ్ర '' రాష్ట్రమే కదా!
అందువల్ల ''జై ఆంధ్ర'' అన్నా, ''జై సమైక్యాంధ్ర'' అన్నా ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాలే ధ్వనిస్తాయి తప్ప తెలంగాణా మాత్రం కాదు.
1956లో ఆంధ్ర - తెలంగాణా ప్రాంతాలు కలిసి ''ఆంధ్ర ప్రదేశ్'' రాష్ట్రంగా అవతరించాయి.
దరిమిలా చేస్తే గీస్తే ''జై సమైక్యాంధ్రప్రదేశ్'' అంటూ నినాదం చేయాలి గానీ జై సమైక్యాంధ్ర అని నినదించడం వల్ల ఆశించిన భావం రాదు.
ఎన్‌టివీ వారు నిన్న రాత్రి విద్యార్థులతో నిర్వహించిన చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి అజయ్ వేసిన ప్రశ్న ఇది.
నిజానికి 1956లో ఈ రెండు రాష్ట్రాలూ విలీనమవుతున్నప్పుడు కొత్త సమైక్య రాష్ట్రానికి ముందుగా అనుకున్న పేరు ''ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం''
ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టే లోపే ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఆంధ్రా నాయకులకు ఈ సంకరజాతి పేరే బాగా నచ్చింది. తెలంగాణా పేరంటేనే వారికి అప్పటినుంచే చిన్నచూపు.
''ప్రదేశ్ '' అనేది తెలుగు పదం కాదు.
హిందీ పదం.
ప్రదేశ్ అన్న ఆ దిక్కుమాలిన పదాన్ని అరువు తెచ్చుకోవడంతోనే మనం తెలుగుదనాన్ని, తెలుగు స్వాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని కోల్పోయాం.
మొదట్లో ఆంధ్ర రాయలసీమ రాష్ట్రాలతో కలిసి ఏర్పడిన ''ఆంధ్ర రాష్ట్రం'' లో చక్కని తెలుగుదనం వుంది !
తెలంగాణా అన్న పేరులో తేనెలొలికే చిక్కని తెలుగుదనం వుంది !!
తెలంగాణము అంటే తెలుగు వాళ్లు నివసించే ప్రాంతం అని అర్థం (ఆణెము=నివాసము).
కానీ ఆ రెండూ కాదని "ఆంధ్రప్రదేశ్" అన్న హైబ్రీడ్ పేరు ఎవరికి ఎందుకు నచ్చిందో తెలియదు.
తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా వంటి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలకు లేని హిందీ/ఢిల్లీ బానిసత్వం మనకెందుకో అర్థంకాదు.
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా గొప్పలు చెప్పుకోవడమే గానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో అధికార భాషగా తెలుగును మనమే పూర్తిగా అమలు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో వున్నాం. మన నేతలకు మెక్కడం మీద వున్న యావ తెలుగు భాషను అభివృద్ధిపరచడం మీద లేదు గాక లేదు.
తమిళనాడును చూసైనా మన పెద్దలకు బుద్ది తెచ్చుకోరు.
ఇంకెందుండీ భాష పేరిట ఈ మేడిపండు సమైక్యత?
మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడే -
మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఔన్నత్యం రెండు రాష్ట్రాల్లో పోటీ పడి దేదీప్యమానంగా వెలుగొందుతాయి. ఇది తథ్యం.
అందుకే సామరస్యంగా, మనస్ఫూర్తిగా అర్థవంతంగా నినదిద్దాం....
జై సమైక్యాంధ్ర (సీమాంధ్ర) !!
జై తెలంగాణా !!
'' జై తెలంగాణా'' నినాదానికి - పోటీగా - గత డిసెంబర్ 10 నుంచి ''జై సమైక్యాంధ్ర'' నినాదం హాడావిడిగా తెరమీదకు వచ్చింది!
లోగడ ''జై ఆంధ్ర!'',
''జై గ్రేటర్ రాయలసీమ!''
నినాదాలు విన్నాం కానీ ఎప్పుడూ ఈ '' జై సమైక్యాంధ్ర! '' నినాదం వినలేదు.
1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తప్ప సమైక్యాంధ్ర పేరుతో ఎప్పుడూ ఏ ఉద్యమమూ జరుగలేదు.
ఇంతకీ ''జై సమైక్యాంధ్ర'' అంటే అర్థం ఏమిటి?
ఆంధ్ర - రాయలసీమ ప్రాంతాలు సమైక్యంగా వుండాలనేనా?
ఆ నినాదంలో అదే ధ్వనిస్తోంది!
1953లో పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది ఆంధ్ర రాయల సీమ ప్రాంతాలతో కూడిన '' ఆంధ్ర '' రాష్ట్రమే కదా!
అందువల్ల ''జై ఆంధ్ర'' అన్నా, ''జై సమైక్యాంధ్ర'' అన్నా ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాలే ధ్వనిస్తాయి తప్ప తెలంగాణా మాత్రం కాదు.
1956లో ఆంధ్ర - తెలంగాణా ప్రాంతాలు కలిసి ''ఆంధ్ర ప్రదేశ్'' రాష్ట్రంగా అవతరించాయి.
దరిమిలా చేస్తే గీస్తే ''జై సమైక్యాంధ్రప్రదేశ్'' అంటూ నినాదం చేయాలి గానీ జై సమైక్యాంధ్ర అని నినదించడం వల్ల ఆశించిన భావం రాదు.
ఎన్‌టివీ వారు నిన్న రాత్రి విద్యార్థులతో నిర్వహించిన చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి అజయ్ వేసిన ప్రశ్న ఇది.
నిజానికి 1956లో ఈ రెండు రాష్ట్రాలూ విలీనమవుతున్నప్పుడు కొత్త సమైక్య రాష్ట్రానికి ముందుగా అనుకున్న పేరు ''ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం''
ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టే లోపే ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఆంధ్రా నాయకులకు ఈ సంకరజాతి పేరే బాగా నచ్చింది. తెలంగాణా పేరంటేనే వారికి అప్పటినుంచే చిన్నచూపు.
''ప్రదేశ్ '' అనేది తెలుగు పదం కాదు.
హిందీ పదం.
ప్రదేశ్ అన్న ఆ దిక్కుమాలిన పదాన్ని అరువు తెచ్చుకోవడంతోనే మనం తెలుగుదనాన్ని, తెలుగు స్వాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని కోల్పోయాం.
మొదట్లో ఆంధ్ర రాయలసీమ రాష్ట్రాలతో కలిసి ఏర్పడిన ''ఆంధ్ర రాష్ట్రం'' లో చక్కని తెలుగుదనం వుంది !
తెలంగాణా అన్న పేరులో తేనెలొలికే చిక్కని తెలుగుదనం వుంది !!
తెలంగాణము అంటే తెలుగు వాళ్లు నివసించే ప్రాంతం అని అర్థం (ఆణెము=నివాసము).
కానీ ఆ రెండూ కాదని "ఆంధ్రప్రదేశ్" అన్న హైబ్రీడ్ పేరు ఎవరికి ఎందుకు నచ్చిందో తెలియదు.
తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా వంటి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలకు లేని హిందీ/ఢిల్లీ బానిసత్వం మనకెందుకో అర్థంకాదు.
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా గొప్పలు చెప్పుకోవడమే గానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో అధికార భాషగా తెలుగును మనమే పూర్తిగా అమలు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో వున్నాం. మన నేతలకు మెక్కడం మీద వున్న యావ తెలుగు భాషను అభివృద్ధిపరచడం మీద లేదు గాక లేదు.
తమిళనాడును చూసైనా మన పెద్దలకు బుద్ది తెచ్చుకోరు.
ఇంకెందుండీ భాష పేరిట ఈ మేడిపండు సమైక్యత?
మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడే -
మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఔన్నత్యం రెండు రాష్ట్రాల్లో పోటీ పడి దేదీప్యమానంగా వెలుగొందుతాయి. ఇది తథ్యం.
అందుకే సామరస్యంగా, మనస్ఫూర్తిగా అర్థవంతంగా నినదిద్దాం....
జై సమైక్యాంధ్ర (సీమాంధ్ర) !!
జై తెలంగాణా !!
Saturday, January 2, 2010
తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు
ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించినంత వరకు 2010 కచ్చితంగా "తెలంగాణా నామ" సంవత్సరమే !
స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం ,
స్వయం పాలన కోసం ,
ఆత్మ గౌరవం కోసం ,
అస్తిత్వం కోసం తెలంగాణా ప్రజలు శతాబ్దాలుగా పరితపిస్తున్నారు .
1947 ఆగస్ట్ 15 తొలి స్వాతంత్ర్య దినోత్సవ తీపి అనుభూతి తెలంగాణా ప్రజలకు తెలియదు. అప్పుడు వారు నిరంకుశ నిజాం సైన్యంతో , రజాకార్లతో జీవన్మరణ సాయుధ పోరాటం చేస్తున్నారు .
1948 సెప్టెంబర్ సైనిక చర్య నిజంగా తెలంగాణాను విముక్తం చేసిందో , వారు సాధించిన విజయాలను , వారి ఆకాంక్షలను చిదిమేసిందో ఇంకా చర్చనీయాంశమే .
అటు -
ప్రజల చేతుల్లో శత్రువుగా చావాల్సిన లేదా దేశం విడిచి పారిపోవాల్సిన "తర తరాల బూజు నిజం రాజు " హిజ్ ఎక్సలెన్సీ హై నెస్ గా " రాజ ప్రముఖ్ " గా గౌరవాన్నీ , భారత ప్రభుత్వ రక్షణను , రాజ భరణాలనూ పొందుతూ దర్జాగా బతికితే .
ఇటు -
తెలంగాణా పోరాట యోధులు జైళ్ళల్లో మగ్గాల్సి వచ్చింది . వారు పేద రైతులకు పంచిన లక్షలాది ఎకరాల భూమి తిరిగి జాగిర్దార్ల పరమైంది . రాష్ట్రం తిరిగి ప్రజా వ్యతిరేకుల హస్తగతమైంది.
1948 నుంచీ 1952 వరకూ తెలంగాణలో సాగింది స్వపరిపాలన కాదు దాదాపు పరాయి మిలిటరీ పాలన .
ఆ తరువాత తెలంగాణలో తొలిసారిగా (1952) ప్రజాస్వామిక ఎన్నికలు జరిగి, ప్రజా ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణా ప్రజలు పట్టుమని నాలుగేళ్లయినా స్వపరిపాలన , స్వేచ్చా స్వాతంత్ర్యాల రుచి చూడక ముందే మళ్ళీ వారి నోట్లో దుమ్ము కొట్టారు .
1956 లో "మీది తెలుగే - మాది తెలుగే " అనే జిత్తులమారి నినాదం తో ,
దగాకోరు ఒప్పందాలతో రెండు రాష్ట్రాల విలీనం జరిగి తెలంగాణా తిరిగి తన అస్తిత్వాన్ని కోల్పోయింది .
తెలంగాణా ప్రజలు తమ నేలమీద తామే కాన్దీశీకుల్లా ... ఇంకొకరి దయధర్మాలతో బిక్కు బిక్కు మంటూ బతుకీడ్వాల్సిన దుస్తితి ఏర్పడింది .
విలీనమప్పుడు కుదుర్చు కున్న దగుల్భాజీ ఒప్పందాలన్నీ ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో , తెలంగాణా నిధులూ , నీళ్ళూ , వనరులూ , ఉద్యోగాలూ ఎలా దోపిడీకి గురయ్యాయో , తెలంగాణా ప్రజల భాషా సంస్కృతులు , చరిత్ర ఏవిధంగా అవహేళనకు గురయ్యాయో మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు .
తెలంగాణా ఇప్పుడు
స్వాతంత్ర్యం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం , న్యాయం కోసం , అస్తిత్వం కోసం పరితపిస్తోంది . అణువణువునా జ్వలిస్తోంది .
తెలంగాణా ప్రజలు "తమ రాష్ట్రం తమకు కావాలని , తమ నిధులు , తమ వనరులు , తమ ఉద్యోగాలు తమకు దక్కాలని ...నీళ్ళలో తమ వాటా తమకు సక్రమంగా రావాలని , తమ భాషా సంస్కృతులకూ చరిత్రకూ సముచిత గౌరవం వుండాలని కోరుకుంటున్నారు ... తప్ప ఇతర్ల సొమ్మును ఏమీ ఆశించడం లేదు .
న్యాయం తెలంగాణా ప్రజల పక్షాన వుంది .
తెలంగానాది ధర్మ యుద్ధం . ధర్మం చర ... సత్యం వద ...!
తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరుతుంది .
ప్రాంతాలకు , పక్షపాతాలకు , స్వార్ధానికి , అవకాశవాదానికి అతీతంగా నీతీ నిజాయితీ పరులైన తెలుగువాల్లంతా తెలంగాణా పోరాటానికి సంఘీభావం తెలపాలి .
సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
...
Subscribe to:
Posts (Atom)