Monday, February 23, 2009

చరిత్ర సృష్టించిన స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌! ఎఆర్‌ రహమాన్‌, రసూల్‌ ఫూకుట్టీ లకు జేజేలు!!

...

ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా ఎనిమిది ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుని స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చరిత్ర సృష్టించింది.
ఆధునిక భారతీయ సంగీత మాంత్రికుడు ఎ.ఆర్‌. రహమాన్‌ (బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఒరిజనల్‌ స్కోర్‌) రెండు అవార్డులతో, రసూల్‌ ఫూకుట్టి (బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌) అవార్డుతో ఆస్కార్‌ వేదికమీద భారతీయ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశారు..

దీనికి తోడు స్మైల్‌ పింకీ అనే లఘు చిత్రానికి కూడా ఆస్కార్‌ అవార్డు రావడం మరో విశేషం.

ముంబయి మురికివాడల దరిద్రాన్ని తెరకెక్కించి మన పరువు తీశారని ఒకవైపు ఈ సినిమాను చూసిన, చూడని విమర్శకులు తిట్టిపోస్తుండగానే ...
సినీరంగపు నోబుల్‌ ప్రైజులాంటి ఆస్కార్‌ అవార్డులను (ఏకంగా ఎనిమిదింటిని) గెలుచుకుని సంచలనం సృష్టించిందీ చిత్రం!

ఈ చిత్రాన్ని తెగడినవాళ్లూ పొగిడినవాళ్లూ అందరూ తమ తమ అభిప్రాయాలను పునస్సమీక్షించుకోవాల్సిన సమయం ఇది.

ఈ చిత్రం మన ఔన్నత్యాన్ని, మన ప్రతిభను లోకానికి చాటిందా లేక
మన దరిద్య్రాన్ని పంచరంగుల్లో చూపించి పరువుతీసిందా... మళ్లీ మరోసారి చర్చించుకోక తప్పదు.

ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసే, చూసే వాళ్లున్న మన దేశానికి
ఆలస్యంగా నైనా ఈ గౌరవం లభించడం సంతోషదాయకం.

ఎంత దరిద్రపుగొట్టు సినిమాలను తీసినా ఫరవాలేదు కానీ వున్న దారిద్య్రాన్ని మాత్రం తెరకెక్కించకూడదు అనడంలో అసలు అర్థంవుందా?
గాంధీ కూడా గోచీతో తిరిగి మన పరువు తీశాడని వాదించడం సబబేనా?

ఈ వాదనలమాట ఎలా వున్నా ఈ అపూర్వ, చారిత్రాత్మక శుభ సందర్భంలో మన మంతా నిండుమనసుతో వేడుకలు చేసుకోవాలి. ఎ.ఆర్‌.రహమాన్‌కు, రసూల్‌ ఫూకుట్టీ లకు, స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చిత్ర దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, రచయితకు జేజేలు పలకాలి.

జయహో ... స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌!
జయహో ... ఎ.ఆర్‌.రహమాన్‌, రసూల్‌ ఫూకుట్టీ !!
...............

Monday, February 9, 2009

బొంత పురుగును ముద్దు పెట్టుకుంటె... కుష్టు రోగిని కౌగలించుకుంటె తెలంగాణ వస్తదా??

...
...
...
''తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ...
అవసరమైతె బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం...
కుష్టురోగినైనా కౌగిలించుకుంటాం...!''


బేత్రీన్‌గున్నది డైలాగు!

మొదటిసారి విన్నప్పుడు నేను సుత ''వారెవ్వా...'' అని సప్పట్లు కొట్టిన!!

కాని ''పాడిందె పాటరా పాసిపండ్ల దాసుడా'' అన్నట్టు గీ డైలాగు వినీ వినీ బేజారైంది.

గిప్పుడు సప్పుట్లు కొట్టుడు ఆపి సోంచాయించుడు షురు చేసిన.

ఔ...!
బొంత పురుగును ముద్దు పెట్టుకుంటె ...
కుష్టు రోగిని కౌగలించుకుంటె ... తెలంగాణ ఎట్ల వస్తది?!

అసెంబ్లీల తెలంగాణ మాట ఎత్తితె చెమ్డా వలిచేస్తా ఖబడ్దార్‌ అన్న మనిషితోని...
తెలంగాణా ద్రోహుల పార్టీ అని దుమ్మెత్తి పోసిన పార్టీతోని...
సమైక్య రాష్ట్రానికే ఇప్పటికీ కట్టుబడివున్నాం అని ఢంకా బజాయించి చెప్పే పార్టీతోని...
తోక పార్టీలని చీదరించుకున్న పార్టీలతోని ...
''రాత్రి బారు పగలు దర్బారు'' అని ఎక్కిరించినోళ్లతోని ...
చేతులు కలిపేది గిందుకేనా...????

నిన్న కాంగ్రెస్‌ పార్టీని కౌగలించుకున్నది...
ఇప్పుడు ఇంకో పార్టీని ముద్దుపెట్టుకునేది గిందుకేనా?
ఇండ్ల ఎవరు బొంతపురుగులు? ...
ఎవరు కుష్టు రోగులు...??

కడుపుల సల్ల కదలకుంట గింత వీజీగా తెలంగాణాను సాధించుకోవచ్చా..!
వార్నీ...ఎంత ఇచిత్రం !
గీ ఫార్మూలా తెల్వక 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమంల ఫుజూల్‌గ ...
ఉత్తపుణ్యానికి దగ్గరదగ్గర నాలుగువందల మంది పోరగాండ్లు సచ్చిపోయిండ్లు కదా పాపం!!

అయితె అప్పుడు సుత తెలంగాణా నేతలు గీ ఫార్మూలను పాటించిండ్లనుకొండ్రి.
కాకపోతె జెర ఆలస్యంగ పాటించిండ్లు.
తెలంగాణ పేరు చెప్పి ... తెలంగాణా ప్రజాసమితి తరపున గెలిచినంక ...
చెన్నారెడ్డితో సహా 10 మది ఎంపీలు
తెలంగాణకు లాత్‌ కొట్టి కాంగ్రెస్‌ను కౌగలించుకున్నరు!!!

మొన్నటికి మొన్న పది మంది ఎం ఎల్ ఏ లు ... టి ఆర్ ఎస్ తరపున గెల్చి ...
అటెంక టి ఆర్ ఎస్ ని లాత్ గొట్టి ఎవర్నో కావలించుకుంట ,
ఎవర్నో ముద్దు పెట్టుకుంట కూసున్నరు కదా !!

ఎవరు ఎప్పుడు ఎవర్ని కౌగలించుకున్నా ...
ఎవర్ని ముద్దుపెట్టుకున్నా...
అమాయక జనం నోరెళ్లబెట్టుకోని తమాష సూసుకుంట కూసోవాల్సిందె కద?!
అంతకంటె చేసేడ్ది ఏముంటది?!

ఒక దిక్కు ఆంధ్ర నేతలు ... అటు అదిలాబాద్‌ నుంచి ఇటు వరంగల్‌ దాక ...
మొత్తం తెలంగాణాను దున్నిపారేస్తున్నరు.
మీటింగుల మీద మీటింగులు పెడ్తున్నరు,
రోడ్డు షోల మీద రోడ్డు షోలు చేస్తున్నరు.

ఇగ, మన తెలంగాణా నాయకులకు ఆంధ్రను దున్నే దమ్ము ఎట్లైనా లేదు గని...
కమ్‌సె కం సొంత నేలనన్న దున్నుకునెందుకు చాతనైతలేదాయె...!!!
చాన బాదయితాంది.
కడుపుల రగిలిపోతాంది బిడ్డా!

అయినా ప్రపంచంల ఎక్కడలేని బేత్రీన్‌ ఫార్మూలా
( గదె...బొంతపురుగును ముద్దు పెట్టుకోవడం... కుష్టురోగిన కౌగలించుకోవడం )
మన దగ్గరున్నంక గీ ఎండలల్ల చెమటలు కక్కుకుంట ఎందుకు తిర్గాలె...
ఎడ్డి జనాన్ని ఎందుకు చైతన్య వంతుల్ని చేయాలె....!

జనం టైముకు ఓట్లేసి కడుపుల సల్ల కదలకుంట ఇంట్ల కూసుంటె సాలు.
ఎవర్ని ఎప్పుడు ముద్దుపెట్టుకోవాల్నో,
ఎవర్ని ఎప్పుడు కౌగలించుకోవాల్నో మన లీడర్లు సూసుకుంటరు.

మనం ''దొరా నీ కాల్మొక్త బాంచెన్‌'' అనుకుంట వాళ్లకు జై కొడ్తె సాలు.
ఏమంటరు?

జై తెలంగాణ! జైజై తెలంగాణ !!

Friday, February 6, 2009

వాలంటైన్ డే నాడు ప్రేమికులకు పెళ్లిల్లు చేయడంతో పాటు ... అదే చేత్తో వాళ్లకి ఉద్యోగాలు కూడా ఇప్పించి పుణ్యం కట్టుకోండి !!!

ఆడవాళ్లు బురఖా లేకుండా బయటకు వస్తే ...
తాట వలిచేస్తామని ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఫర్మానా జారీ చేశారు.
స్త్రీలు ఉద్యోగాలు చేయడం, బడికి వెళ్లి చదువుకోవడం యహా చల్తానై ...
వాళ్లు ఇంట్లో నాలుగు గోడల మధ్య పతిసేవ చేసుకుంటూ బుద్ధిగా పడుండాలని తాఖీదు ఇచ్చారు.
ఆ తాఖీదును ఉల్లంఘించిన కొందరు మహిళల తాట వలిచేసినట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ మధ్య మన పత్రికల్లో కూడా అప్పుడప్పుడు ...
అట్లాంటి ఫర్మానాలే జారీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అయితే-
మన దేశంలో విడుదలవుతున్నవి అంత అమానుషమైన ... అంత ప్రమాదకరమైన తాఖీదులేం కాదనిపిస్తోంది.

లోతుగా ఆలోచిస్తే మన తాఖీదులవెనక
మహిళల భద్రత, ఔన్నత్యం, వారి సంక్షేమం పట్ల ఎనలేని ఆవేదన వున్నట్టు అర్థమవుతుంది.

పబ్బులకు వెళ్లి చెడిపోకండి...
మన సంస్కృతిని అప్రదిష్టపాలు చేయకండి అంటున్నారు... అంతేకదా !

వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది?

చెప్పినా వినకుండా మొండికేస్తున్న మహిళామణుల వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తున్నారు.
బస్‌ ... అంతే కదా.
చెప్పిన మాట వినకపోతే మన చెల్లెల్ని మాత్రం మనం కొట్టుకోమా ఏంటి?

కొట్టింది మన అన్నయ్యలేగా.
అదీ మన మంచి కోసమేగా?
ఎందుకు అంత ఉక్రోషపడాలి.

పబ్బులకు వెళ్లని వాళ్లని కొట్టడం లేదుగా.
పబ్బులను నడిపేవాళ్లనీ కొట్టడం లేదు. పబ్బులకు అనుమతినిచ్చే ప్రభుత్వాలనీ పడగొట్టడంలేదు.

కాబట్టి ఆఫ్ఘనిస్థాన్‌తో పోల్చుకుని మనం నానా హైరానా పడాల్సిన పనిలేదు.

నిన్ననే మరో ఫర్మానా జారీ అయింది.

రేపు ఫిబ్రవరి 14న
'' వాలెంటైన్‌ డే '' రోజునాడు

రోడ్ల మీద ప్రేమికులెవరైనా కనిపిస్తే అప్పటికప్పుడు అదే రోడ్డు మీద వాళ్ల పెళ్లి చేసిపారేస్తారట.
నిజం పెళ్లేనండి బాబూ. వేరేగా పొరబడకండి.
పైగా అది అ ల్లా టప్పా పెళ్లి కాదు. పక్కాగా రిజిష్టరు కూడా చేయిస్తారట.
ఇందు నిమిత్తం వేల సంఖ్యలో మంగళ సూత్రాలు, దస్తావేజులు సైతం సిద్ధం చేశారట కూడాను.

ఆహా...
ఎంత మంచి తాలిబన్లండీ మన వాళ్లు!

అనవసరంగా భయపడుతున్నారు గానీ ఆడ పిల్లల పెళ్లి సమస్యను చిటికెలో పరిష్కరించే
మా మంచి అన్నయ్యలు కాదూ మనవాళ్లు.
నిజంగా దేవుడిచ్చిన అన్నయ్యలు.

అయితే ఆ చేత్తోనే ఈ ప్రేమికులకు ఉద్యోగాలు కూడా చూసిపెడితే ఎంత బాగుంటుందో కదా.
ఉద్యోగం లేక, నికరమైన ఆర్థిక వనరు లేకపోతే కాపురాలు సజావుగా సాగేందుకు ఆస్కారం లేదు కదా.

ప్రేమికులకు కుల గోత్రాల పట్టింపు వుండదు.
కాబట్టి ఈ తరహా పెళ్లిల్లలో నూటికి తొంభై కులాంతర వివాహాలే అయివుంటాయి.
వాళ్లలో నూటికి తొంభైతొమ్మిది మందికి తల్లిదండ్రుల ఆమోదం వుండదు.

ఇటు ఉద్యోగమూ లేక అటు తల్లిదండ్రుల సపోర్టూ లేక కాపురాలు సజావుగా ఎలా సాగుతాయి చెప్పండి.
అందువల్ల ఈ మా మంచి అన్నయ్యలు వాళ్లకి పెళ్లిల్లు చేయడంతో పాటు ఉద్యోగాలు కూడా చూసిపెడితే దివ్యంగా వుంటుంది.

ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా ఈ ప్రేమలేంటి...
ఈ వాలెంటైన్‌ డే లేంటి... ఈ విదేశీ సంస్కృతేంటీ అంటారా?

నిజమే కానీ,
ప్రేమకు సరిహద్దులు లేవు.
కొలమానాలు లేవు.
కొందరు ఆకర్షణనే ప్రేమ అనుకోవచ్చు.
మరికొందరు అవసరం కోసం ప్రేమించవచ్చు.
మరికొందరు స్పష్టమైన జీవిత లక్ష్యంతో, జీవిత భాగస్వామి గురించిన నిర్దిష్ట అవగాహనతో ప్రేమించవచ్చు.
అందరికీ ప్రేమించడం చాతకాదు.
అందరూ ప్రేమించే సాహసం చేయలేరు.
ఇంకొందరుంటారు ... పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న తరువాత ఇంటికొచ్చిన పెళ్లాన్ని కూడా ప్రేమించలేరు.!!!

చాలామంది ప్రేమికులు రేపెప్పుడో ఉద్యోగాలు దొరికిన తరువాత పెళ్లి చేసుకుందామనుకుంటారు.
అంతవరకు నిగ్రహంగా వుండాలని నిర్ణయించుకుంటారు.

పెళ్లికి ఉద్యోగం తప్పనిసరి కానీ ప్రేమకు కాదు కదా.

మీరు తొందరపడి పెళ్లి చేస్తున్నారు కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకోవాలి.
వాళ్లకి ముందు ఉద్యోగాలు చూసిపెట్టి ఆ తరువాతే పెళ్లి చేయాలి.

మంచి అన్నయ్యలు కదూ. కాస్త దయగా ఆలోచించండి.
ఆ పుణ్యం కూడా మీరే మూటట్టుకోండి.

ద్వాపర యుగంలో
ఇలాంటి అన్నయ్యలు, అన్నయ్యల దండు లేకపోబట్టి కానీ ...
రాధా కృష్ణులు ...
మన ఆదర్శ ప్రేమికులు ...
ప్రేమతత్వానికే ప్రతీకలు ...
అట్లా శాశ్వతంగా పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవారు కాదేమో...!!!

Wednesday, February 4, 2009

మంత్రాలు ... చింతకాయలు ... గాలి మేడలు ...!

...నా చిన్నతనంలో కంప్యూటర్లు లేవు.
సాఫ్ట్‌వేరులూ కాడలూ కొమ్మలూ ఏమీ లేవు. అమెరికా వుండేది(ట) కానీ డాలర్‌ డ్రీమ్స్‌ లేవు.

ఇప్పుడైతే సగటు విద్యార్థులు సైతం - ఏదో ఒకవిధంగా జిఆర్‌ఇ, టోఫెల్‌ రాసేసి ... వీసా సంపాదించేసి... అమెరికా ఫ్లయిటెక్కేసి ... సకల భోగభాగ్యాలు సొంతచేసుకోవాలని కలలు కంటున్నారు. (ఆ కలలకు ''తాత్కాలిక'' విఘాతం కలిగిందనుకోండి అది వేరే విషయం).

అప్పుడు మాకు కెరీర్‌గురించి ఇంత స్పృహ వుండేది కాదు.

ఏదో డిగ్రీ పూర్తి చేయడం, ప్రభుత్వ కార్యాలయంలోనో, బ్యాంకులోనో ఓ గుమస్తా ఉద్యోగం సంపాదించుకోవడం ఆతర్వాత - ''పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకుని - హాయిగ కాలం గడపడం'' ... బస్‌ అంతే...! అంతకు మించిన కలలకు ఆస్కారమే వుండేది కాదు.

బీదరికం నుంచి బయటపడాలన్న తహతహ మాత్రం మెండుగానే వుండేది.
బీదరికంలో శాశ్వతంగా మగ్గిపోవాలని ఎవరికుంటుంది?
అందుకే అప్పుడప్పుడు రంగుల కలలు కనేవాళ్లం.

హఠాత్తుగా - భారీ స్థాయిలో నోట్ల కట్టలు... బంగారు బిస్కెట్లు... లంకెబిందెలు వంటివి దొరికినట్టు ... ఏ లాటరీయో తగిలినట్టు ... జీవితమే మారిపోయినట్టు తరచుగా రాత్రి కలలూ - పగటి కలలూ గిలిగింతలు పెడ్తుండేవి. వాస్తవాన్ని కాసేపు మరిపించి మురిపిస్తుండేవి.

అట్లాంటి నేపథ్యంలో -

పదకొండో తరగతి చదువుతుండగా ఒక విచిత్రం జరిగింది...

నా క్లాస్‌మేట్‌ ఒకరు తాళ పత్ర గ్రంథంలాంటి ఓ పురాతన పుస్తకం పట్టుకొచ్చాడు.
దాని పేరు ''అపూర్వ తాంత్రిక విద్యలు'' అనుకుంటా సరిగా గుర్తులేదు.


అందులో రకరకాల మంత్ర తంత్రాలు వాటి మహత్యాలు, వశీకరణం, గుప్తనిధులు, చేతబడి, బాణామతి వంటివి చాలా వున్నాయి. చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

అత్యంత అరుదైన ఆ పుస్తకం ద్వారా మేం అద్భుత శక్తులను సొంతం చేసుకోబోతున్నట్టు... మా భవిష్యత్తు అనూహ్యమైన మలుపు తిరగబోతున్నట్టు ఎంతో ఉద్వేగానికి గురయ్యాం!

ఆ మంత్ర శక్తులను సాధించేందుకు చేయాల్సిన సాధన, తంతు మాత్రం చాలా క్లిష్టమనిపించింది..

శ్మశానాలకు వెళ్లడం,, అమావాస్య నాడు ఏవో హోమాలు చేయడం, శవపూజలు, రక్తమాంసాల నైవేద్యాలు, ఎముకలు, బొమికలు, బలులు వంటివి ఆ వయసులో మేం చేయగలిగేలా లేకపోవడంతో తీవ్ర నిరాశ కలిగింది.

అయితే ఆ పుస్తకాన్ని తిరగేయగా మరగేయగా అందులో ఒక్క మంత్ర శక్తిని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని తేలింది. దాంతో మళ్లీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

అదొక మహిమాన్విత తావీజు తయారీకి సంబంధించిన కిటుకు.
- ముందుగా ఒక తొండ యొక్క కుడి ముంజేతి ఎముకను (ఏమాత్రం విరగకుండా, దెబ్బతినకుండా) సంపాదించాలి.
దానిని పంచ లోహాలలో చుట్టి తాయత్తుగా చేసుకోవాలి.
అమావాస్యనాడు అర్థరాత్రి పన్నెండు గంటలకు ఏదో ముగ్గు వేసి మధ్యన కూచుని దానిని కుడి చేతికి కట్టుకుని ఓం..హ్రీం...క్రీం... వంటి మంత్రమేదో 108 సార్లు ఏకాగ్రతతో కళ్లు మూసుకుని పఠించాలి.

అంతే
ఇక అప్పటినుంచి మనం మనసులో ఏం తలచుకుంటే అది వెంటనే జరిగిపోతుంది!
ఆ తాయెత్తు చేతికి వున్నంత కాలం దేనిలోనూ అపజయం అన్నది వుండదు!!

ఫస్ట్‌ రావాలనుకుంటే ఫస్ట్‌ వచ్చేస్తాం.
ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది.
లాటరీ తగలాలనుకుంటే లాటరీ తగులుతుంది. అంతేకాదు కోరుకున్న అమ్మాయి మన దగ్గరకొచ్చి సిగ్గులొలకబోస్తూ తనంతట తను ఐ లవ్యూ చెప్తుంది. వావ్‌... అంతకంటే వైభోగం ఇంకేం కావాలి ఈ జన్మకి!

ఇక అక్కడినుంచి ఓ వారం పది రోజులు మాకు చదువు సంధ్యల మీద బొత్తిగా ధ్యాస లేకుండా పోయింది.
ఇరవైనాలగు గంటలు దాని గురించిన ఆలోచనలే.
ఒక విధమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాం.

తొండ ముంజేతి ఎముకను ఎట్లా సంపాదించాలి?

పంచలోహాలను ఎట్లా సిద్దం చేయాలి?

పంచలోహాలు అంటే ఇనుము, రాగి ఇత్తడి, వెండి, బంగారం ఫరవాలేదు సులువుగానే దొరుకుతాయి.
మేం వున్న సువిశాలమైన లేబర్‌ కాలనీలో తొండలకేం కొదవలేదు.
కానీ వాటిని ఎట్లా పట్టుకోవాలి. ముంజేతి ఎముకను ఎట్లా సేకరించాలి అన్నదే సమస్య. పైగా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. తెలిస్తే ఎక్కడ అభాసుపాలవుతామోనని భయం.

కర్రతోనో, రాళ్లతోనో కొడితే తొండ కాలు విరిగి పోవచ్చు.
మరెట్లా?
ఆలోచించగా ఆలోచించగా ఒక అవిడియా తట్టింది.

ఓ సీతాఫలం చెట్టు కింద గొయ్యి తీశాం. చెట్టు మీద తొండ కనిపించినప్పుడు కొమ్మలు ఊపి అది గొయ్యిలో పడేట్టు చేయాలి. పడగానే మట్టితో కప్పెయ్యాలి. దాంతో తొండ చచ్చూరుకుంటుంది.
దాని కాళ్లు చెక్కుచెదరకుండా వుంటాయి.
ఓ రెండు రోజులపోయాక తొండ శవాన్ని బయటకు తీసి జాగ్రత్తగా ముంజేతి ఎముకను తీసేసుకోవాలి.

బస్‌ ఇక మన పంట పండినట్టే.

అట్లా తయారు చేసిన మొదటి తావీజును నేను ధరించేట్టు, ఆతరువాత మరొకటి తయారు చేసి మిత్రుడికిచ్చేట్టు మా మధ్య ఒప్పందం కుదిరింది.

అనుకున్నట్టే ఒక రోజు ఓ తొండను మేం తవ్విన గోతిలో పడేలా చేయగలిగాం.
వెంటనే దానిని మట్టితో కప్పేశాం.
సగం పని పూర్తయినట్టే.
మిగతా కార్యమ్రం అంత కష్టమైనదేంకాదు.
అంటే తాయెత్తు తయారైపోయినట్టే.
కొండెక్కినంత ఆనందం. లోపలినుంచి కోరికల లిస్టు తన్నుకురావడం మొదలయింది.

ఆ ఊహలు, కలలు తలచుకుంటే ఇప్పటికీ నవ్వుతాలుగా వుంటుంది.

మొత్తం మీద ఆ రెండ్రోజులు నిమిషమొక యుగంగా గడిచాయి.

ఆరోజు చెప్పలేనంత ఉద్వేగంతో గొయ్యి దగ్గరకు వెళ్లాం.

మొదటి తావీజు నాదే కనుక తొండ శవాన్ని వెలుపలికి తీసేందుకు నేనే ఉత్సాహంగా రెండు చేతులతో మట్టి తొలగించడం మొదలు పెట్టాను.

నా ప్రండు పక్కన నిలబడి చూస్తున్నాడు.

నాలుగు దోసిళ్ల మట్టి తీశానో లేదో ఎప్పుడో చచ్చిపోయి వుంటుందనుకున్న తొండ మట్టిని దులుపుకుంటూ గంపెడు నోరు తెరిచి బిరబిరా నా మీదకు వచ్చింది.

ఊహించని ఆ పరిణామానికి కెవ్వున అరచి వెల్లకిలా పడ్డాను.

నా మిత్రుడు ఎప్పుడో పారిపోయాడు.

నాకది తొండలా కాక నా మీదకు పగతో దూసుకొచ్చిన డైనొసార్‌లా అనిపించింది.

అంతే. ఆతరువాత ఏం జరిగిందో తెలియదు.

ఆ దెబ్బకి నేను వారం రోజులు హై ఫివర్‌తో మంచం నుంచి దిగలేదు.

మూడనమ్మకాలు, చేతబడులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడల్లా ఆనాటి సంఘటన ఇప్పటికీ గుర్తుకొస్తుంటుంది. మట్టిలో కప్పెట్టినా ఆ తొండ ఎట్లా బతికిందో ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఏది ఏమైనా ఒక్క ఎదురుదెబ్బకే అట్లా బెంబేలు పడిపోకుండా ... మరింత పట్టుదలగా, మరింత పకడ్బందీగా ప్రయత్నించి - అపూర్వమైన తాయెత్తును సాధించి - నా మాతృదేశానికి ... ఒంటి చేత్తో అనేక ఒలంపిక్‌ గోల్డ్‌ మెడళ్లు ... ఆస్కార్‌ అవార్డులు ... నోబెల్‌ ప్రైజులు ... సంపాదించిపెట్టగలిగే సూపర్‌ మేన్‌ను ప్రసాదించలేకపోయినందుకు అప్పుడప్పుడు నాకు చాలా బాధగా వుంటుంది. ప్చ్‌.
..............