Wednesday, August 15, 2018

విమానం మోత




విమానం మోత

వరంగల్‌ ఎ.వి.హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ అమితాబచ్చన్‌లా సన్నగా, ఆరడుగుల ఎత్తున్న ఓ తెలుగు టీచర్‌ వుండేవారు. తెల్లని పంచె కట్టుకుని, పొడుగు చేతుల కమీజు వేసుకుని, నుదుట నిలువు నామం దిద్దుకుని చక్కగా పెళ్లికొడుకులా తయారై స్కూల్‌కి వచ్చేవారు. పాఠాలు కూడా అరటి పండు వొలచి చేతిలో పెట్టినట్టు బాగా చెప్పేవారు. అంత సాత్వికంగా కనిపించినా ఆయనంటే చాలామంది పిల్లలకు 'హడల్‌'గా వుండేది. ఎందుకంటే పిల్లల్ని ఆయన దండించే పద్ధతి అలాంటిది. ఆయన అసలు పేరు గుర్తులేదు, కానీ సీనియర్లు ఆయనకు పెట్టిన ముద్దుపేరు మాత్రం గుర్తుంది. అది ''కొత్తిమీర కట్ట సార్‌!'' బహుశా ఆయన చేతిలో తరచూ దెబ్బలు తిన్న అల్లరి పిల్లలే ఆయనకు ఆ పేరు పెట్టి వుంటారు. తరువాత తరువాత అదే పాపులర్‌ నేమ్‌ అయిపోయింది.   

విద్యార్థిని నించోబెట్టి, మెడను తన ఎడమ చేతితో తొంభై డిగ్రీల కోణంలో కిందకు వంచి, కుడి చేయిని నిటారుగా పైకెత్తి, కొన్ని క్షణాలపాటు 'స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ'లా అలా ఆగిపోయేవారు. తుఫాను ముందరి ప్రశాంతతలా తరగతి గదిలో 'పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌' ఏర్పడేది. అదిగో అప్పుడు ఆ హస్తం ఒక్కసారిగా తొమ్మిది అడుగుల ఎత్తు మీదనుంచి ఆ విద్యార్థి వీపు మీదకు 'క్రాష్‌ లాండ్‌' అయ్యేది.

'ధభిళ్‌ల్‌ల్‌్‌...' మనే ఆ శబ్దం పక్క గదిలోని పిల్లలకు కూడా వినిపించేది. దానిని ఆయన 'విమానం మోత' అనేవారు. నిజానికి మాకు విమానం ఎలా వుంటుందో కూడా తెలియని రోజులవి. ''వీపు విమానంలా మోగుతుంది జాగ్రత్త'' అనే మాటని ఆయన తరచూ ప్రయోగిస్తుండేవారు.

ఇదీ ఆనాటి విమానం మోత కథ. దాదాపు యాభై ఐదేళ్ల తరువాత ఎందుకో ఇప్పుడు గుర్తుకొచ్చింది.

...       ...         ...

అమెరికాకు వచ్చి అప్పుడే మూడువారా లవుతోంది. అయినా నా చెవుల్లో మారుమోగుతున్న ఈ విమానం మోత మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎప్పుడు తగ్గుతుందో, ఎలా తగ్గుతుందో, అసలు తగ్గుతుందోలేదో ఏమీ తెలియడం లేదు. మొదటిసారి అమెరికాకు 2016లో వచ్చాను. జీవితంలో  విమానం ఎక్కింది కూడా అదే తొలిసారి. అయినా అప్పుడిలాంటి సమస్య ఎదురుకాలేదు. బహుశా  అప్పుడు జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు పాటించడం, ఇప్పుడు పాటించకపోవడమే కారణం అయ్యుంటుంది.

ప్రపంచంలో ఇవాళ ప్రతి రోజూ లక్షల సంఖ్యలో జనం విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇండియా అమెరికాల మధ్య అయితే చెప్పక్కరలేదు. రోజుకు ఇంతమంది ప్రయాణం చేస్తున్నా ఈ విమానం మోత మాత్రం ఏ కొద్ది మంది అదృష్టవంతులనో వరిస్తుంటుందట.

ముఖ్యంగా షష్టిపూర్తి చేసుకున్నవాళ్లని, బి.పి., షుగర్‌, థైరాయిడ్‌, సైనసైటిస్‌ మొదలైనవి వున్నవాళ్లని, యాంటీబయాటిక్‌ మందులు ఎక్కువగా వాడేవాళ్లని ఇది లైక్‌ చేస్తుందట. ఎందుకంటే వాళ్ల కర్ణభేరీలు అప్పటికే సున్నితంగా, వల్నెరబుల్‌గా తయారై వుంటాయి కాబట్టి.

ఈ విమానం మోత శాస్త్రీయ నామం ''టిన్నిటస్‌'' (TINNITUS ).

దీని ప్రధాన లక్షణం ఏమిటంటే చెవుల్లో ఎడతెరిపి లేకుండా ఒకటే హోరు వినిపిస్తుండటం. ఓ పది మందితో కూడిన ఆర్కెస్ట్రా బృందం మన చెవుల్లో తిష్టవేసుక్కూచుని నిర్విరామంగా ఏ వయొలిన్లనో మోగిస్తున్నట్టుగా వుంటుంది. ఇలా ఈ మోత ఎడతెరిపి లేకుండా మోగుతున్నప్పటికీ చెవులు బాగానే పనిచేస్తుంటాయి. అంటే ఎదుటివాళ్లుమాట్లాడే మాటలు, ఇతర శబ్దాలు అన్నీ మామూలుగానే వినిపిస్తుంటాయి. కాకపోతే ఈయొక్క అసందర్బమైనÛ బాగ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం చాలా చికాకుపరుస్తుంటుంది.

మన చెవులు 60 డెసిబల్స్‌ లోపు ధ్వనులను భరిస్తాయి. అంతకు మించిన ధ్వనిని భరించడం వాటికి కష్టంగా వుంటుంది. దీపావళి రోజుల్లో భారీ ఆటం బాంబుల శబ్దం విన్నప్పుడు చెవులు కాసేపు గింగురుమనడం అందరికీ తెలిసిందే. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంజన్‌ నుంచి వెలువడే ధ్వని 80 డెసిబల్స్‌ పైనే వుంటుంది. టేకాఫ్‌ అవుతున్నప్పుడు, లాండింగ్‌ అవుతున్నప్పుడు ఆ శబ్దం 100 డెసిబల్స్‌ దాటుతుంది.

అందుకే విమానం ఎక్కగానే ప్రయాణికులందరికీ ఫ్లైట్‌ సిబ్బంది దిండు, శాలువా, టూత్‌ బ్రష్షు, పేస్టు, ఐ గార్డ్‌ మొదలైనవాటితో పాటు 'ఇయిర్‌ ప్లగ్స్‌' ని కూడా సరఫరా చేస్తారు. ఆ ఇయర్‌ ప్లగ్గులను చెవుల్లో దూర్చుకుంటే శబ్దం ప్రభావం సగానికి సగం తగ్గిపోతుంది. కనీసం విమానం టేకాఫ్‌ అవుతున్నప్పుడు, లాండింగ్‌ అవుతున్నప్పుడు అయినా వాటిని తప్పనిసరిగా వాడాలి. కానీ ఈసారి ఎందుకోగాని నేను వాటిని చెవుల్లో కాకుండా జేబులో పెట్టుకుని ఆతరువాత వాటి సంగతే మరచిపోయాను.

మధ్యలో ఒకసారి చెవులు గడలు పడ్డట్టు, ఏమీ వినిపించకుండా, హఠాత్తుగా చెవుడు గానీ వచ్చిందా అన్నట్టు అంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడైనా జాగ్రత్త పడి వుండాల్సింది. కానీ కాసేపటి తరువాత మళ్లీ చెవులు వినిపించడం మొదలయ్యే సరికి తేలిగ్గా తీసుకున్నాను.

చిన్నప్పుడు వర్షాకాలంలో పిడుగులు పడుతున్న శబ్దం వినిపిస్తున్నప్పుడు ''అర్జునా, ఫల్గుణా...'' అంటూ గట్టిగా అరవాలని, అలా అరిస్తే పిడుగులు ఆమడదూరం పారిపోతాయని పెద్దవాళ్లు చెప్పేవారు. దానివెనకాల వున్న మూఢ నమ్మకాన్ని పక్కనపెట్టి సైంటిఫిక్‌గా ఆలోచిస్తే తేలేది ఏమిటంటే భారీ శబ్దం బారిన పడుతున్నప్పుడు అలా నోరు తెరవడం వల్ల ధ్వని ప్రభావం చాలావరకు తగ్గుతుంది. ''చెప్పుడు మాటల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి'' అన్న సామెత ఒకటి వుంది కదా. అలాగే కర్ణకఠోరమైన శబ్దాలను రెండు చెవులతో విని నోటితో వదిలేయాలన్నమాట!

గంటలతరబడి విమానం మోతను వింటూ ప్రయాణం చేస్తున్నప్పుడు మన కర్ణభేరిని రక్షించుకునేందుకు తప్పనిసరిగా చెవుల్లో ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోవడంతో పాటు ఆవులింతలు రాకపోయినా అప్పుడప్పుడు నోరు తెరచి ఆవులింతలు తీయాలి. ఏదో మింగుతున్నట్టు, ఏదో తింటున్నట్టు నోటికి పనికల్పిస్తుండాలి. చూయింగ్‌ గమ్‌ నమిలినా పర్లేదు. పెదాలకు ప్లాస్టర్‌ అంటించుకున్నట్టు కూర్చోకుండా పదో మాట్లాడుతూనో, తరచూ నోరు తెరుస్తూనో వుండాలి.

విమానంలోకి వాటర్‌ బాటిళ్లను అనుమతించరు. వాళ్లని అడిగితే చిన్న ప్లాస్టిక్‌ గ్లాసుతో లేదా కప్పుతో మంచినీళ్లను అందిస్తారు. నిజానికి నీళ్లను ఎక్కువగా తాగుతూ శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకుంటే చెవులకు కూడా ఎంతో మేలట. అందుకని మొహమాట పడకుండా ఒకటికి రెండు సార్లు వాళ్లను అడిగి తీసుకుని మరీ మంచినీళ్లను పుష్కళంగా తాగాలి.

సీట్ల మధ్య పాసేజీ ఇరుకుగా వుంటుంది. అయినా సరే వీలైనప్పుడల్లా లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి. కనీసం మన సీటు దగ్గరైనా కాసేపు నిలబడుతుండాలి. సీట్లో కూర్చునే పాదాలను ముందుకూ వెనక్కీ, అటూ ఇటూ కదిలిస్తూ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేసుకోలి.

ఈ జాగ్రత్తలన్నీ తెలిసినవే. పిల్లలూ, పెద్దలూ చెప్పినవే. మొదటిసారి యుఎస్‌ వెళ్లినప్పుడు తు.చ. తప్పక పాటించినవే. కానీ ఈసారి మాత్రం ప్చ్‌...!

హైదరాబాద్‌ - వాషింగ్‌టన్‌ డీసీ ల మధ్య దూరం దాదాపు 14,000 కిలోమీటర్లు. మేం అబూదాభీ మీదుగా వెళ్లాం. శంషాబాద్‌ నుంచి అబూదాభీ చేరుకోడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది., మళ్లీ అక్కడి నుంచి వాషింగ్‌టన్‌ డీసీకి మరో 15 గంటలు. అబూదాభీలో ఫ్ల్రైట్‌ మారడానికి  అయ్యే వెయిటింగ్‌ టైమ్‌ని పక్కనపెడితే ఆకాశవీధిలో... మనం దాదాపు 19 గంటలపాటు విమానం మోతతో... సహజీవనం చేయాల్సి వుంటుంది.

ఎవరెస్టు శిఖరం ఎత్తు 29,000 అడుగులు. కానీ మనం ప్రయాణం చేసే ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ 30,000 అడుగుల కంటే ఎంతో ఎత్తులో వెళ్తుంది. 550 ఎం.పి.హెచ్‌. అంటే గంటకి 900 కిలో మీటర్ల వేగంతో పయనిస్తుంది. కాంకర్డ్‌ విమానాలైతే 60,000 అడుగుల కంటే ఇంకా ఎక్కువ ఎత్తులో ఇంకా ఎక్కువ వేగంతో వెళ్తాయట. విమానాలు ఎంత ఎత్తులో వెళ్తే వాటిపై వాతావరణ ఒత్తిడి అంత తక్కువగావుండి ఇంధనం ఆదా అయ్యేందుకు, వేగంగా వెళ్లేందుకు వీలవుతుందట. అదే సమయంలో వాటిలో ప్రయాణం చేస్తున్న వారిపై తగ్గిన ఆ వాతావరణ పీడన ప్రభావం కూడా ఎంతో కొంత వుంటుందట. 

మన ఫ్లైట్‌ ఎంత ఎత్తులో, ఎంత వేగంతో వెళ్తోంది... బయలుదేరి ఎంత సేపయింది... గమ్యం చేరడానికి ఇంకా ఎంత సమయం పతుడుంది... గమ్యం ఇంకా ఎంత దూరంలో వుంది... వంటి వివరాలన్నింటినీ మన పదురుగా వుండే మానిటర్‌లో ఎప్పటికప్పుడు చూసుకుంటుండవచ్చు. ఈసారి నేను హెడ్‌ ఫోన్లు పెట్టుకుని బహుశా సౌండ్‌ కూడా పెంచేసుకుని నాకు ఇష్టమైన న్యూటన్‌ వంటి రెండు మూడు హిందీ సినిమాలు చూస్తూ, సిఎన్‌ఎన్‌ వార్తలు వింటూ పై జాగ్రత్తలు తీసుకోవడమే మరచిపోయాను. అటు విమానం మోత ఇటు హెడ్‌ఫోన్‌ మోత నా చెవులను ఎడాపెడా వాయించేసి వుంటాయి.

ముఖ్యంగా శంషాబాద్‌ నుంచి అబుదాభీ వరకు వచ్చిన ఓ సహ ప్రయాణికుడి ప్రభావం కూడా ఈ నిర్లక్ష్యానికి కొంత కారణమై వుంటుంది. అతనిది కిటికీ పక్క సీటు. ఒక వరుసలో మూడు సీట్లున్నాయి. నేను మధ్యలో మా ఆవిడి పాసేజివైపు చివరి సీటులో కూర్చున్నాం. విమానం టేకాఫ్‌ అయ్యేటప్పుడు బయటి దృశ్యం చూద్దామంటే అతను తన తలకాయను పూర్తిగా ఆ కిటికీలో పెట్టి కూర్చున్నాడు. విమానం కిటికీలు మనిషి తలకాయ సైజును మించి వుండవు. టేకాఫ్‌ అయిపోగానే తన సీట్లో వెనక్కి వాలి ఆ విండో షటర్‌ను క్లోజ్‌ చేసేవాడు. షటర్‌ ఎందుకు మూస్తావు ఓపెన్‌ చేసి వుంచు అంటే ఏమున్నది చూస్తందుకు అంటాడు.

ఎయిర్‌ హోస్టెస్‌లు ప్రతి సీటు దగ్గరకు వచ్చి బెల్టు పెట్టుకొమ్మని చెప్తూ చెక్‌ చేస్తుంటారు. వాళ్లు అలా చెప్పినప్పుడల్లా అతను సర్లే సర్లే అని బెల్టు పెట్టుకున్నట్టు నటించి ఆ తరువాత దానిని తీసిపారేసి వెకిలిగా నవ్వేవాడు. వాతావరణం బాగా లేనప్పుడు విమానం కుదుపులకు గురవుతుంటుంది. అప్పుడు కూడా బెల్టు పెట్టుకొమ్మని చెప్తుంటారు. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. అయినా అతను ఒక్కసారి కూడా బెల్టు పెట్టుకోలేదు. పైగా భువి నుంచి దివికి దిగివచ్చిన అప్సరసల్లా వుండి ఎంతో వినయంగా నవ్వుతూ మాట్లాడే ఎయిర్‌ హోస్టెస్‌ల మీద వెకిలి కామెంట్లు. వాళ్లిచ్చిన దిండుని, శాలువాని కిందపడేసి వాటిపై కాళ్లు పెట్టి కూర్చుంటాడు. ఒకోసారి ఓ కాలును పైకెత్తి తన సీటు మీద పెట్టుకుని కూచుంటాడు. తను అబుదాభీలో ఏదో హెల్పర్‌గా పనిచేస్తున్నాని చెప్పాడు. చాలా రెగ్యులర్‌గా ట్రావెల్‌ చేస్తుంటాడట. ఆ చేష్టలన్నీ గమనించాక చికాకు పెరిగి అతను మాట్లాడటానికి ప్రయత్నించినా స్పందించకుండా వుండేందుకు నేను టీవీ మానిటర్‌లో కూరుకుపోయాను. ఈవిధంగా నా అజాగ్రత్తకి అతని బేపర్వా యాటిట్యూడ్‌ కూడా కొంత దోహదం చేసిందేమో అనుకుంటున్నాను. 

నాకు కిటికీ పక్క సీటంటే చాలా ఇష్టం. బస్సులోనైనా, ట్రైన్‌లోనైనా చివరికి ఇంట్లో అయినా కిటికీ పక్క సీట్‌నే ప్రిఫర్‌ చేస్తాను. అది తెలిసి కూడా నాకు పందుకు కిటికీ పక్క సీటు తీయలేదని అడిగితే మా పిల్లలు చెప్పిందేమిటంటే ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ పక్క సీటు కంటే పాసేజి పక్కనుండే సీటే మంచిదని చెప్పారు. ఎందుకంటే మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టటకుండా ఎప్పుడంటే అప్పుడు లేచి అటూ ఇటు తిరిగేందుకు, వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చేందుకు, అవసరమైనప్పుడు కాళ్లు చాపుకునేందుకు చాలా సౌకర్యంగా వుంటుందన్నారు.

అలాగే మా ఆవిడకు మామూలు హిందూ మీల్‌ని, నాకు డయాబెటిక్‌ మీల్‌ని ఎంపిక చేశారు.  ఏ  గడ్డి పెడతారో ఏమో అని నేను మొదట భయపడ్డాను. కానీ మంచి పోషకవిలువలున్న డిలిషియస్‌ ఫుడ్‌నే సరఫరా చేశారు. పైగా మధుమేహం వున్న వాళ్లు ఆకలికి ఆగలేరనో ఏమో  మిగతా ప్రయాణికులందరి కంటే ముందు డయాబెటిక్‌ ఫుడ్‌ని సర్వ్‌ చేసేవారు. ఎయిర్‌ హోస్టెస్‌లు ట్రాలీని తోసుకుంటూ, ఆ మూలనుంచి ఒక్కొక్కరికి ఫుడ్‌ సర్వ్‌ చేసుకుంటూ వచ్చే సరికి నా భోజనం పూర్తయిపోయేది. అలాగే అబుదాభీ, వాషింగ్‌టన్‌ డీసీ ఎయిర్‌పోర్టుల్లో మేం ఇబ్బంది పడకుండా 'వీల్‌ ఛైర్‌'లను కూడా బుక్‌ చేశారు. అంటే మనం దర్జాగా వీల్‌ చైర్‌లో కూర్చుంటే వాళ్లే ఇమిగ్రేషన్‌ కౌంటర్‌కి, టర్మినస్‌కి, బ్యాగేజి క్లెయిమ్‌ దగ్గరకి తీసుకువెళ్తారన్నమాట. మా పిల్లలు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే నేను మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడమే మరచిపోయాను.

నాకు 'టిన్నిటస్‌' వచ్చిందని జెట్‌లాగ్‌ నుంచి బయటపడే వరకూ స్పష్టంగా తెలియలేదు. పందుకంటే బాల్టిమోర్‌ దగ్గర హైవేకి పక్కన వున్న అపార్ట్‌మెంట్‌లో ఫస్ట్‌ ఫ్లోర్‌లో (ఇక్కడ గ్రౌండ్‌ ఫ్లోర్‌నే  ఫస్ట్‌ ఫ్లోర్‌ అంటారు) వుంటాడు మా రెండో అబ్బాయి. రాత్రింబవళ్లు వాహనాలు దూసుకెళ్తున్న శబ్దం ఇంట్లోకి లీలగా వినిపిస్తూ వుంటుంది. అమెరికాలో కార్లకూ, ట్రక్కులకూ అసలు హారన్లు వుండవా అన్నట్టు అన్నీ నిశ్శబ్దంగా వెళ్తుంటాయి. అయితే  టైర్లకూ రోడ్డుకూ మధ్య అయ్యే ఫ్రిక్షన్‌ శబ్దం మాత్రం రయ్యిమంటూ ఒక హోరు లా వినిపిస్తుంది. నేను మొదట ఆ శబ్దమే కాబోలు అనుకున్నాను.

మా అపార్ట్‌మెంట్‌ పక్కన రోడ్డు వారగా గడ్డీ, చిన్న మొక్కలూ, పెద్ద చెట్లూ చాలా ఎక్కువగా వున్నాయి. వాటిలోంచి వచ్చే కీచురాళ్ల శబ్దమైనా కావచ్చని భావించాను. ఎటు చూసినా పచ్చదనమే అమెరికా ప్రత్యేకత కదా. మేం చూసినంత మేర ఎక్కడా మట్టినేల కనిపించలేదు. ఎక్కడ చూసినా రోడ్లకు రెండు వైపులా చెట్లూ లేదా గడ్డి మైదానాలు.  వీటికి తోడు మేం బాల్టిమోర్‌లో అడుగుపెట్టిన దగ్గరనుంచీ వరుసగా ఎడతెరిపిలేని వర్షాలు. ఈ కారణంగానే నాకు టిన్నిటస్‌ వచ్చిందని గ్రహించడానికి నాలుగైదు రోజులు పట్టింది.

తెలిసిన తరువాత ఒకటే ఆందోళన. వాడకుండా వెంట తెచ్చుకున్న ఇయర్‌ ప్లగ్‌లని చెవుల్లో గట్టిగా దూర్చుకున్నాను. ఆవులింతలు రాకపోయినా పదే పదే ఆవులింతలు తీశాను. వీలైనప్పుడల్లా పళ్లు పటపట కొరికాను. ఇష్టం లేకపోయినా చూయింగ్‌ గమ్‌ నమిలాను, నా చెవులను నేనే లాక్కున్నాను... పీక్కున్నాను... మెలేసుకున్నాను. అయినా ప్రయోజనమేమీ కనిపించలేదు. ''చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం?''  రెస్ట్‌లెస్‌గా  బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ చెవుల్లో మోగుతూనే వుంది.

టిన్నిటస్‌కి చికిత్స లేదట. కొందరికి నెల రోజులకు గానీ తగ్గదట. మరికొందరికి ఆరునెలల వరకూ మోగుతుందట. ఇంకొందరిలో పర్మినెంట్‌గా వుండిపోతుందట. నేను ఏ కేటగిరీలోకి వస్తానో నాకు తెలియయదు. కాకపోతే ''తినగ తినగ వేము తీయనుండు'' అన్నట్టు ... వినగ వినగ ఆ మోత నాకిప్పుడు అలవాటైపోయింది!

- ప్రభాకర్‌ మందార

ఆగస్ట్‌ 2018 


1 comment:

  1. మీ విమాన ప్రయాణ అనుభవం వివరించిన తీరు చాలా బాగుంది సార్. అలాగే అమెరికాలో అనుభవాల గురించి కొన్ని పంచుకోండి. Your subtle sense of humour is likeable.

    ReplyDelete