అరుంధతీ రాయ్ రాసిన 'బోకెన్ రిపబ్లిక్' ను మలుపు, హైదరాబాద్ వారు తెలుగులో 'ధ్వంసమైన స్వప్నం' పేరుతో ప్రచురించారు. గత సంవత్సరం ఆగస్ట్ 20న హైదరాబాద్‌లో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సభలో, అరుంధతీ రాయ్ సమక్షంలో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ డిప్యూటీ ఎడిటర్ బెర్నార్డ్ డిమెల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ పుస్తకపరిచయం చేశారు.
ఈ పుస్తకం ముందుమాట ('తొలి మలుపు')లోంచి కొన్ని భాగాలు:
ఒక్క నెత్తుటి చ్కు కూడా నేలరాలకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు తేగలిగే శక్తి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే ఉంది అంటారు ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరైన డా.బి.ఆర్.అంబేడ్కర్. అది ఆయన స్వప్నం కూడా.
భిన్న జాతులు, తెగలు, మతాలూ కులాలు, సంస్కృతులు వాటి ప్రాతిపదికన ఏర్పడ్డ అసమానతల దొంతరలతో ఉన్న భారతీయ సమాజానికి ప్రజాస్వామ్యం ఒక్కటే శరణ్యమని ఆయన గట్టిగా భావించారు. ఆ మేరకు ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగంలో అనేక రక్షణలను పొందుపరిచారు. కానీ గడిచిన అరవై ఏళ్లలో మన పాలకులు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా చేసారు.
ఇప్పుడు ఆ స్వప్నం ధ్వంసమైపోయింది.
ఇవాళ ప్రజలు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం నెత్తురోడి పోరాడవలసి వస్తోంది. ప్రజలకు ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వం మీద ప్రాణాలకు తెగించి పోరాడవలసివస్తోంది. అదీ ఇప్పటి విషాదం!
...
... ఇలాంటి సందర్భంలో కూడా మొక్కవోని ధైర్యంతో పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడుతోన్న అరుదైన మేధావి అరుందతీ రాయ్. ఆమె ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో పరిణామాలపై ఇంగ్లీషులో రాసిన ''చిదంబరం'స్ వార్, వాకింగ్ విత్ కామ్రేడ్స్, ట్రికిల్‌డౌన్ రెవొల్యూషన్'' వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ''ధ్వంసమైన స్వప్నం.''
ఇందులో వున్న మూడు వ్యాసాలు ప్రస్తుతం దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టి చూపిస్తాయి.
.....
ధ్వంసమైన స్వప్నం
చిదంబర రహస్యం. కారడవిలో కామ్రేడ్స్‌తో. మానవజాతి మనుగడకోసం విప్లవం.
- అరుంధతీ రాయ్
ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickledown Revolution.
అనువాదం : ప్రభాకర్ మందార. పి.వరలక్ష్మి. కడలి.
208 పేజీలు, వెల: రూ. 75
ప్రచురణ: మలుపు, హైదరాబాద్
ఇ మెయిల్ : malupuhyd@gmail.com
ప్రతులకు:
2-1-1/5/5, నల్లకుంట, హైదరాబాద్ - 500 044
.
No comments:
Post a Comment