Friday, August 28, 2009

దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?....2 ...

''దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?'' పోస్టుపై వచ్చిన స్పందనల్లో కొన్నింటికి వివరణ ఇద్దామని చేసిన ప్రయత్నమిది. నిడివి పెరగడంతో దానికి కొనసాగింపుగా 2వ టపాగా పొందు పరుస్తున్నాను.

@ Praveen Sarma, @ Indian Minerva, @ Venkata Ramana, @ Viswamitra, @ Bolloju Baba, @ Katti Mahesh Kumar, @ Ravi, @ Malakpet Rowdy, @ Anonymous @ Sharat @ Punarvasu

స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

వెటకారాలు, వ్యక్తిగత విమర్శలు, బిలో ది బెల్ట్ పంచ్ లు, దూషణలు తగ్గించుకుని సబ్జెక్ట్ కే పరిమితమై సభ్య పదజాలంతో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోగలిగితే మన బ్లాగులు ఆరోగ్యకరమైన ఆలోచనలకు వేదికలవుతాయి. మరెందరో ఆలోచనాపరులను ఆకర్షించ గలుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కొందరు ఉద్దేశ పూర్వకంగా సంయమనాన్ని కోల్పోతున్నారు అనిపిస్తోంది.. సరే దీనిని ఆయా వ్యక్తుల విజ్ఞతకు వదిలేయడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు.

ఇక్కడ కొందరు లేవనెత్తిన ప్రశ్నలకు మహేష్ కుమార్ గారు సమాధానాలు చెప్పారు. వాటితో నేను ఎకీభవిస్తున్నందువల్ల తిరిగి వాటిని ప్రస్తావించడం లేదు.

అదేవిధంగా రిజర్వేషన్ల అమలులో లోపాలు, అవకతవకలు వంటి అంశాల జోలికి వెళ్లి అసలు సమస్యను గందరగోళ పరచ దలచుకోలేదు. (ఎందుకంటే మనదేశంలో తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య వంటి ఏ కార్యక్రమాన్ని పరిశీలించినా వాటి అమలులో ఘోరమైన వైఫల్యాలూ, అక్రమాలే కనిపిస్తాయి. ఆడలేక మద్దెల వోడన్నట్టు అమలులో చిత్తశుద్ధి లేక పథకాలనే తప్పుపట్టలేం కదా) .

కాబట్టి ముఖ్యంగా ఈ కింది వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని నా అభిప్రాయాలను మీతో పంచుకునేందుకు ప్రయత్నిస్తాను.


1) >>>>> ఇప్పుడు కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించటం వల్ల, ఇతర మత వ్యాప్తి అవుతుంది అన్నది ఒక valid argument గా పరిగణించాలి.<<<< (@ Ravi) 2) >>>>> the constitution says that the Dalits who want reservations must remain Hindus. Since Christianity/Islam doesnt have caste system in place, they are NOT dalits once they get converted.<<<<< (@ Malakpet Rowdy) 3) >>>>> He wanted the government to increase reservation under the BC-C quota, now being given to Dalit Christians. It was the only way to uplift Dalit Christians, he suggested.<<<<< (@ Malakpet Rowdy)

''కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించడం వల్ల ఇతర మత వ్యాప్తి అవుతుంది'' అనడం లేని ''బూచి'' ని చూపించి పిల్లల్ని భయపెట్టడం లాంటిదే. ఈ వాదనలో పక్షపాతవైఖరి, పరమత ద్వేషం తప్ప వాస్తవికత లేదు. రిజర్వేషన్లు లేనప్పటినుంచీ మన దేశంలో మతమార్పిడులు వున్నాయి. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా మునుముందు కూడా వుంటాయి.

కొందరు వ్యక్తుల మత విశ్వాసాలు మారినంత మాత్రాన మన దేశానికి వాటిల్లే నష్టమేమీ లేదు. మతం, దేవుడు వంటి వ్యక్తిగత విశ్వాసాలను ఎవరూ నియంత్రించలేరు. మతానికీ, దేశభక్తికీ / దేశద్రోహానికీ ఏమాత్రం సంబంధం లేదు. 'పృథ్వీరాజ్‌'లు/ 'జయచంద్రులు' అన్ని మతాల్లోనూ వుంటారు.

ఇక ఎవరైనా ఎందుకు మతం మారతారన్నది అసలు ప్రశ్న.

మహాత్మాగాంధీ 1925 లో కేరళలోని శివగిరిని సందర్శించినప్పుడు ఆయనకూ, నాటి కేరళ సామాజిక తత్వవేత్త శ్రీనారాయణ గురుకూ మధ్య జరిగిన ఈ కింది సంభాషణ చూడండి:
....
మహాత్మా గాంధీ: అంటరానితనాన్ని నిర్మూలించడం కాకుండా ఇంకా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి మనం ఏం చేయాలంటారు?

శ్రీ నారాయణ గురు: వాళ్లను విద్యావంతుల్ని చేయాలి. తమ అవసరాలకు సరిపడినంత ఆదాయాన్ని సంపాదించుకోగలిగేలా చేయాలి. కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు వంటివి తక్షణమే చేపట్టాలని నేను భావించడం లేదు. ముందుగా వాళ్లు ఇతరులతో పాటు సమానంగా ఎదిగేందుకు తగిన అవకాశాలు కల్పించాలి.

మహాత్మా గాంధీ: నిమ్న కులాల వాళ్లు పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి మారడం చాలా దురదృష్టకరమైన విషయం కదా?

శ్రీ నారాయణ గురు: కొత్త నమ్మకం వారికి ఆనందాన్నిస్తున్నట్టయితే, అది వారికి ఫలసిద్ధినిస్తున్నట్టయితే తమ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ వారికి సంపూర్ణంగా వుంటుంది. కాబట్టి వాళ్లని అందుకు అనుమతించక తప్పదు.

మహాత్మా గాంధీ: కానీ వాళ్లు మత మార్పిడి చేసుకుంటున్నది అందుకు కాదు. ఏవో కొన్ని సౌకర్యాలు, హక్కులు పొందేందుకు మాత్రమే వాళ్లు వెళ్లిపోతున్నారు.

శ్రీ నారాయణ గురు: అ లాంటప్పుడు ఆ సౌకర్యాలూ హక్కులూ ఏవో వాళ్లకి మీరే కల్పించండి. అప్పుడు వాళ్లు హిందువులుగానే వుండిపోతారు కదా.
....

శ్రీనారాయణ గురు (1856-1928) మరో సందర్భంలో ఇలా అన్నారు:

''హిందూ మతం అనేది అసలు లేదు. (సింధూ నదే ఇందూ నదిగా మారి అందులోంచే హిందూ, హిందుస్థాన్‌, ఇండియా, ఇండియన్స్‌ అనే పదాలు ఆవిర్భవించాయని అంటారు). విదేశీయులు ఈ దేశాన్ని హిందూ దేశమనీ, ఇక్కడి మూలవాసులను హిందువులనీ వ్యవహరించేవారు. అంతే తప్ప హిందూ మతం అనేదే లేదు. హిందూ దేశంలో నివాసమేర్పరచుకున్న విదేశీయ క్రైస్తవ, ఇస్లాం మతాలకు చెందిన వాళ్లను కాక ఇతర్లను సంబోధించేందుకు ఈ పదాన్ని వాడేవారు. ఈ కారణంగానే కొందరు బౌద్ధ, జైన మతాలు కూడా హిందూమతంలో అంతర్భాగమని భావిస్తారు.''
.....

హిందూ మతంలో అగ్ర కులాలు ఎంత సుఖసంతోషాలతో, సౌలభ్యాలతో వున్నాయో మాల మాదిగ తదితర నిమ్నకులాలు అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంటూ, అనాదరణకు గురవుతూ అంత అసౌకర్యంగా వున్నాయి. అందుకే వాళ్లు తమ ఆత్మ గౌరవంకోసం, మానసిక శాంతికోసం మరో మతం వైపు చూడాల్సి వస్తోంది. హిందూ మతంలో ఈ కాలానికి తగిన విధంగా సంస్కరణలు జరిగితే ఈ సమస్య వుండేది కాదు.

ఇక దళిత క్రైస్తవులకు ప్రస్తుతం ఇస్తున్న బి.సి. (సి) కోటా పట్ల ఎవరికీ ఏ ఆక్షేపణ లేనట్టు కనిపిస్తోంది. వారికి ఎస్‌.సి. కోటా యివ్వడంను మాత్రం కొందరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి క్రైస్తవ మతంలో (ఫార్వర్డ్‌ రిలిజియన్‌) బి.సి.లు కూడా వుండకూడదు కదా మరి. దాని నెలా ఒప్పుకుంటున్నారో అర్థం కాదు.

ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం ఒక దళితుడు (ఎస్‌సి) క్రైస్తవ మతం స్వీకరిస్తే వెంటనే అతని ఎస్‌సి హోదా రద్దయిపోతుంది. అతడిని బిసి సి గానో ఎఫ్‌సి గానో పరిగణిస్తారు. అతనే మళ్లీ కొన్నాళ్ల తరువాత తిరిగి హిందూ మతంలో చేరితే అతని ఎస్‌సి హోదా పునరుద్ధరించబడుతుంది.
ఎంత విచిత్రమిది.
అసలు రిజర్వేషన్లు వేల సంవత్సరాల అన్యాయానికి గురైన దళితులను ఉద్ధరించడానికా లేక హిందూ మతాన్ని, కుల వివక్షను కాపాడడానికా తెలియడం లేదు.

క్రైస్తవ మతం అభివృద్ధిచెందిన (ఫార్వర్డ్‌) మతం కావచ్చు. అంతమాత్రాన అందులో చేరీ చేరగానే ఒక్కసారిగా నిరుపేద దళితులంతా ఫార్వర్డ్‌ అయిపోరు. బట్ట, పొట్టకు సంబంధించి చిన్న చిన్న సౌకర్యాలు సమకూడుతున్నాయేమో గానీ క్రైస్తవులుగా మారిన బీద దళితులు పెద్దగా బావుకుంటున్నదేమీ లేదు. మన సమాజంలో వారి స్టేటస్‌ ఏమాత్రం మారడంలేదు. ఎల్లయ్యను చూసినట్టే ఏసుపాదాన్నీ చూస్తోంది మన సమాజం.

దళితులను సృష్టించింది హైందవ సమాజమే కావచ్చు
కానీ ఆ దళితులను ఉద్ధరించేందుకు రిజర్వేషన్ల ద్వారా నడుం కట్టింది మాత్రం కేవలం స్వతంత్ర భారత ప్రభుత్వం తప్ప హిందూ మతం కాదు.
మనది మత ప్రమేయం లేని లౌకిక ప్రజాస్వామ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా మతం గురించి ఆలోచించడంలో ఔచిత్యంలేదు. మనమిప్పుడు వేలాది సంవత్సరాలుగా సాగిన అన్యాయాన్ని సరిదిద్దడం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి తప్ప వారి వారి మత విశ్వాసాల మీద కాదు.

హిందూ మతంలో దళితుల పట్ల చిన్నచూపు ఇంకా అట్లాగే కొనసాగుతున్నా కూడా వారిని చచ్చినట్టు అదే మతంలో పడివుండాలనడం, లేకపోతే రిజర్వేషన్లు ఇవ్వమని బెదిరించడం... నిజంగా దళితుల మేలు కాంక్షించేవారు చేయాల్సిన పనికాదు.

దానికి బదులు హిందూ మతంలో తగిన మార్పు తీసుకురావడం, సర్వ కుల సమానత్వం కోసం ప్రయత్నించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇతర మతాల్లో మాదిరిగా హిందూ మతంలో కూడా కులాల ప్రాధాన్యత తగ్గి, సమానత్వం సహోదరత్వం, పర్సపర ప్రేమాభిమానాలు పెరిగితే ఎవ్వరూ హిందూమతాన్ని వీడి పోయే పరిస్థితే వుండదు.



......

Thursday, August 27, 2009

దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?!

భారతదేశంలో దళితులను నిన్న మొన్నటి వరకు దేవాలయాల్లోకే అడుగుపెట్టనివ్వలేదు. వాళ్లని తాకితేనే కాదు వాళ్ల నీడ సోకినా చాలు మైలపడిపోతామ్నన్నట్టు ప్రవర్తించారు. వాళ్లను గుడుల్లోకే కాదు బడుల్లోకీ రానివ్వలేదు. ప్రధాన వీధుల్లోకీ అడుగుపెట్టనివ్వలేదు. ఊరి చివరన వెలివేసినట్టు వుండనిచ్చారు తప్ప ఊళ్లో అందరితో కలవనివ్వలేదు. వాళ్ల మీద అంటరానివాళ్లు అనే ముద్రవేసి పరమ కిరాతకంగా అణగదొక్కారు. సాటి మానవులన్న స్పృహలేకుండా జంతువుల కంటే హీనాతి హీనంగా చూశారు. (ఇప్పటికీ ఈ వివక్ష అనేక గ్రామీణ ప్రాంతల్లో కొనసాగుతూనే వుంది).

ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా హిందూమతమే (మను ధర్మమే) ఇష్టారాజ్యంగా పాలించింది. మతమూ అదే, ప్రభుత్వమూ అదే. చట్టమూ అదే. శాసనమూ అదే. అందుకే దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా అన్నివిధాలా అణగారిపోయారు. చదువుకూ, చైతన్యానికీ, అభివృద్ధికీ దూరంగా వుండిపోయారు.

ఈ అన్యాయాన్ని సరిచేసేందుకే ... హిందూమతం/హిందూ పాలక వర్గాలు దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో తరతరాలుగా చేసిన అన్యాయాన్ని కొంతైనా సరిదిద్దేందుకే రిజర్వేషన్లు వచ్చాయి. అంతే తప్ప రిజర్వేషన్లు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినవి కావు. రిజర్వేషన్లకీ హిందూ మతానికీ సంబంధంలేదు. దళితులు ఏ మత ధర్మాన్ని పాటించాలి, ఏ దేవుణ్ని పూజించాలి, అసలు ఏ దేవుణ్నయినా తప్పనిసరిగా పూజించాలా, వద్దా అనే వాటితో రిజర్వేషన్లకు నిమిత్తం లేదు.

ఈ రిజర్వేషన్ల వల్ల హిందూ మతంలో దళితుల హోదా ఏమీ పెరగదు. ఈ రిజర్వేషన్ల వల్ల దళితులు అమాంతం బ్రాహ్మణులతో సమానులైపోరు. ఈ రిజర్వేషన్ల వల్ల హిందూమతంలో సర్వ కుల సమానత్వం యేమీ ఏర్పడదు. నిజంగా హిందూ మతంలోని లోపాలను సరిదిద్దాలనుకుంటే అందుకు వేరే కార్యక్రమం పెట్టుకోవాలి.

అట్లాగే చాలామంది తెలిసో తెలియకో ఈ రిజర్వేషన్లను ఆర్థిక చట్రంలో బిగించాలని చూస్తున్నారు. తద్వారా రిజర్వేషన్ల అసలు స్ఫూర్తినే దెబ్బతీయాలనుకుంటున్నారు. రిజర్వేషన్ల లక్ష్యం భారతదేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడం కానే కాదు. రిజర్వేషన్ల వల్ల భారత దేశంలో సమసమాజమేమీ రాదు. సమసమాజ స్థాపనకు వేరే కార్యక్రమం చేపట్టాల్సి వుంటుంది

నిజానికి హిందూ మతం అనేది ఊహల్లోనే తప్ప వాస్తవికంగా ఎన్నడూ లేదు. హిందూ ధర్మం, మను ధర్మంలనే మతంగా పరిగణిస్తున్నారు. ఈ దేశంలో వున్నవి కులాలు మాత్రమే. మతం మనకి ఊహాజనితం. కులాలే వాస్తవం. అన్ని కులాల వాళ్ళూ ఒకేరకం దేవుళ్లకి దండం పెట్టుకోవడంలో మాత్రమే సారూప్యత వుంటుంది తప్ప ఇతరత్రా కాదు. ఒక్కొక్క కులం ఒక్కో మతంలా తనదైన ప్రత్యేకతను, తనదైన గుర్తింపును కలిగి వుంటుంది. ఒక కులం వాళ్ళు మరో కులం వాళ్లను పెళ్లిల్లు చేసుకోడానికి వీలు లేదు. ఈ కులాల మధ్య అనేక హెచ్చుతగ్గులు. చిన్నచూపులు. అహంభావాలు. ద్వేషాలు, అనుమానాలు, అవహేళనలు ఎన్నెన్నో వివక్షలు.

మన దేశం మీద మహ్మదీయుల, ఆంగ్లేయుల పాలన మొదలైన తర్వాతే, అంటే ఇక్కడిి అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి పడిన తర్వాతే ఈ పెద్దమనుషులకి మతం ముసుగు కావలసి వచ్చింది. అప్పటినుంచే ఒకపక్క కుల వ్యవస్థ చెక్కుచెదరకుండా జాగ్రత్తపడుతూనే మరోపక్క హిందుత్వ, హిందూమత భావనను జనంలో రగిలించడం మొదలుపెట్టారు. గతంలో తాము చేసిన పొరపాట్లను ఇప్పుడైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఎవడి కులం పరిథిలో వాడు మగ్గిపోతూనే వుండాలి కాకపోతే ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు, జండాలు మోయాల్సి వచ్చినప్పుడు మాత్రం మాలమాదిగలతో సహా అన్ని కులాలవాళ్లూ హిందువులం అన్న భ్రమతో మూకుమ్మడిగా అగ్రవర్ణాలవారికి జైకొట్టాలి. రాజ్యాధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే వుంటుంది. అంతే.

ఇలాంటి నేపథ్యంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పుణ్యమాని రిజర్వేషన్‌ విధానం కారు చీకటిలో కాంతి కిరణంలా ముందుకొచ్చింది. అది కొంతమంది దళితుల జీవితాల్లో నైనా మార్పునకు దోహదం చేస్తోంది. వెనుక బడిన కులాల్లో చైతన్యాన్ని పెంచుతోంది. దాని వల్ల కొందరు దళితులైనా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నత పదవులను, శాసనసభ, లోకసభల్లో కనీస ప్రాతినిధ్యాన్ని పొందగలుగుతున్నారు. ముందే చెప్పినట్టు రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసమో, సమసమాజ నిర్మాణం కోసమో లేక హిందూమతంలోని లోపాలను సవరించి దానిని పటిష్టం చేయడం కోసమో వచ్చినవి కాదు. కేవలం తరతరాల అన్యాయానికి గురైన దళితులకు న్యాయం చేసేందుకు వచ్చినవి మాత్రమే.

దళితులు హిందూ దేవతలనే పూజించాలి, ఇతర దేవతల వంక కన్నెత్తి చూడకూడదు, నాస్తికులుగా మారకూడదు అట్లా అయితేనే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి వంటి నిబంధనలు పెట్టాలనుకోవడం అర్థ రహితం, అప్రస్తుతం. ఆమాటకొస్తే రిజర్వేషన్లను ప్రవేశ పెట్టిన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కరే '' నేను హిందువుగా చచ్చిపోను '' అని చాలా కసిగా ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించి ఒక గొప్ప బౌద్ధుడిగా చనిపోయారు.

కాబట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తింప చేయడం ఏవిధంగానూ ఆక్షేపణీయం కాదు. ఏ మతాన్ని స్వీకరించినా, ఏ దేవుడ్ని ఆరాధించినా లేక పరమ నాస్తికులుగా మారినా దళితులు దళితులే. తరతరాల వివక్షకు ప్రతీకలే. వారి ప్రస్తుత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరికీ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే. ఈ దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు పూనుకోవడం, ఆ ప్రతిపాదనను తెలుగుదేశం, ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌, సిపిఐ, సిపిఎం, తదితర పక్షాలు సమర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

Saturday, August 22, 2009

కూలని గోడలు (కథ) ...

కూలని గోడలు (కథ) ...

తలుపుల మీద దబదబ బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడి నిద్రలేచాను.
అప్రయత్నంగా నా చూపు గోడ గడియారం వైపు మళ్లింది.
పన్నెండు పది!
ఇంత అర్థరాత్రి ఎవరబ్బా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను.
ఎదురుగా అభిలాష్‌. ఎనిమిదేళ్ల కుర్రాడు. ఆర్టీసీ డ్రైవర్‌ బలరాం కొడుకు.
సంశయంగా వాడి భుజం పట్టుకుని 'ఏంట్రా' అన్నాను.
''నాన్నకు గుండెనొప్పొచ్చింది. అమ్మ, మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మంది''
నేను నిర్ఘాంత పోయాను.

ఆర్నెళ్ల క్రితమే బలరాంకి మైల్డ్‌గా హార్ట్‌ అటాక్‌ వచ్చింది. అప్పుడు అతణ్ని నేనే హైదరాబాద్‌ తార్నాక లోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లాను. వాళ్లు వెంటనే నిమ్స్‌కి డైరెక్ట్‌ చేశారు. నెల రోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చాడు బలరాం. అప్పుడు లక్షన్నర వరకు ఖర్చయింది. అయితే ఆ ఖర్చంతా ఫూర్తిగా ఆర్టీసీయే భరించింది.
అప్పుడే మళ్లీ ఇదేమిటి!

అసలు బలరాంను చూస్తే ఎలాటి జబ్బులైనా ఆమడ దూరం పారిపోతాయనిపిస్తుంది.

పేరుకు తగ్గ పర్సనాలిటీ. ఉక్కు మనిషిలా వుంటాడు. పైగా వయసు ముఫ్ఫై ఐదేళ్లు కూడా దాటలేదు. అతనికి గుండెపోటేమిటి కాల వైపరీత్యం కాకపోతే.

నేను గబగబా బట్టలు మార్చుకుంటుండగా ''ఎక్కడికండీ'' అంటూ ప్రశ్నించింది మా ఆవిడ.
''బలరాంకు మళ్లీ గుండె నొప్పొచ్చిందట.''

''అయ్యయ్యో. నేనూ వస్తానుండండి'' అంటూ లేచింది ఆందోళన పడిపోతూ.

''ఆలస్యమవుతుంది. నువ్వు తర్వాత రా'' అంటూ అభిలాష్‌తో వాళ్లింటివేపు నడిచాను.

బలరాం మా బంధువేం కాదు. నా ప్రియ శిష్యుల్లో ఒకడు. చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నా వద్దే చదువుకున్నాడు. స్కూలు అయిపోయిన తరువాత కూడా మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు.

బలరాం అంటే నాకూ, మా ఆవిడకూ ఎంతో అభిమానం. అతని వినయవిధేయతలూ, చదువు మీది శ్రద్ధా చూడ ముచ్చటగా వుండేవి. ఒక దశలో మేం బలరాంని మా అ ల్లుడిని చేసుకోవాలని కూడా అనుకున్నాం.

బలరాం పదోతరగతిలో ప్రవేశించేనాటికే మా పెద్దమ్మాయి అరవింద, రెండో అమ్మాయి అనుపమల వివాహాలు అయిపోయాయి. మా చిన్నమ్మాయి అపూర్వ బలరాం కంటే ఏడాది చిన్నది. వాళ్లిద్దరికీ ఈడూ జోడూ సరిపోతుందనుకున్నాం.

నిజానికి బలరాంది మా అంతస్తుకు తగ్గ కుటుంబమేమీ కాదు. బలరాం తండ్రి రాఘవులు ఒక ప్రైవేట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కంపోజిటర్‌గా పనిచేసేవాడు. చాలీ చాలని జీతం. ఐదుగురు పిల్లలు, ఊళ్లో ఎక్కడ చూసినా అప్పులు. ఇంటిలో పిలవకపోయినా పలికే దారిద్య్రం. అయినా సరే మాకు బలరాం అంటే చాలా ఇష్టంగా వుండేది. పిల్లవాడు బుద్ధిమంతుడు. చదువు మీద శ్రద్ధాసక్తులున్నవాడు. అతనికి మంచి భవిష్యత్తు వుంటుంది, మా అపూర్వ తప్పక సుఖపడుతుంది అనేది మా నమ్మకం.

అందుకు బలమైన కారణం కూడా వుంది. మా అరవింద, అనుపమలను గొప్పిళ్లకే ఇచ్చాం. అయితే మాత్రం ఏం లాభం, అనుక్షణం గొడవలే. వాళ్ల గొప్పతనమంతా ఆస్తికే పరిమితం. మిగతా అన్నిట్లోనూ అ లగాతనమే. ఎంత ఆస్తి వుంటే ఏం లాభం మా అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకోని రోజు, మేం ఆందోళన పడని రోజు లేదు.

అందుకే ఆడపిల్ల సుఖంగా వుండాలంటే పెళ్లికొడుకు ఆస్తిపాస్తులనూ డాబు దర్పాలనీ కాకుండా అతని మంచితనాన్నీ, సంస్కారాన్నీ చూడాలని అనుభవపూర్వకంగా తెలుసుకన్నాం. అందుకే బలరాం మీద అంత అభిమానం ఏర్పడింది. నా ప్రతిపాదనను మా ఆవిడకు చెబితే ఆమె కూడా నిస్సంకోచంగా ఒప్పుకుంది. కళ్ల ముందు పెరిగిన పిల్లవాడు. నాలుగిళ్లవతలే వుండేవాడు. రేపు పెళ్లయినా మన అమ్మాయి ఎప్పుడూ మన కళ్ల ముందే వుంటుంది అని తను కూడా ఎన్నో కలలు కంది.

అయితే ఈ విషయం మా ఇద్దరి మనసుల్లోనే వుండిపోయింది తప్ప అప్పుడూ ఇప్పుడూ మా ఆమ్మాయితో సహా మరెవరికీ చెప్పలేదు. మాకు ఆ అవసరమూ రాలేదు.

బలరాం పదో తరగతి చదువుతుండగానే అతని తండ్రి రాఘవులు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఆ రోజు అర్థరాత్రి వరకూ ప్రింటింగ్‌ ప్రెస్సులో పనిచేసి అ లసి సొలసి సైకిల్‌ మీద ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహన మేదో అతణ్ని ఢీకొట్టి వెళ్లిపోయింది.

అంతే. ఒక్కసారిగా ఆ కుటుంబం పరిస్థితి తుపానులో చిక్కుకున్న పడవలా అయిపోయింది.

పాతికేళ్లుగా తన రక్తాన్ని ధారపోసినప్పటికీ ఆ ప్రింటింగ్‌ ప్రెస్సు యజమాని రాఘవులు కుటుంబానికి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. అంతవరకు వడ్డీ రూపంలో రాఘవులు మూలుగల్ని పీల్చిన వడ్డీ వ్యాపారస్తులు ఒక్కసారిగా తమ అసలు ఇచ్చేయమంటూ ఆ ఇంటి మీదపడ్డారు. దాంతో వున్న చిన్నపాటి ఇంటిని అమ్మేయక తప్పలేదు వాళ్లకి. అయినా అప్పులు పూర్తిగా తీరనే లేదు. పిల్లలంతా తలోదిక్కు అయిపోయారు. ఒకరు హోటళ్లో, ఇంకొకరు సైకిల్‌ షాపులో, ఆడపిల్లలు బీడీల కార్ఖానాల్లో పనులకు కుదిరారు. బలరాం కూడా ఓ మోటార్‌ కంపెనీలో హెల్పర్‌గా చేరాడు.

ఎంతో చక్కని భవిష్యత్తు వుందనుకున్న బలరాం అ లా అయిపోవడం నా మనసును కలిచి వేసింది. నేను వాళ్ల అమ్మను కలిసి బలరాం చదువు ఖర్చులన్నీ నేను భరిస్తాను వాణ్నొక్కడినైనా చదివించమని కోరాను. కానీ ఆవిడ ''నా కొడుకు మీద మీకు అంత ప్రేమ వున్నందుకు నాకు సంతోషమేనండి. కానీ పెద్దోడిని చదివిస్తూ చిన్నపిల్లల్ని కూలిపనికి పంపించడం న్యాయమవుతుందా మీరే చెప్పండి'' అంది.

నేనా ప్రశ్నకి సమాధానం చెప్పలేక నిస్సహాయంగా వుండిపోయాను. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఆతర్వాత బలరాం మా ఇంటికి రావడమే మానేశాడు. మరకల దుస్తులతో నా కంటపడటానికే ఇష్టపడేవాడు కాదు. కొన్నాళ్లకి వాళ్ల కుటుంబం పట్నానికి వలస పోయింది. బలరాం మెకానిక్‌ నుంచి లారీ డ్రైవర్‌గా మారాడు. ఆ తదనంతరం ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌ అయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతకుముందే మంచి సంబంధం కుదిరితే మా అపూర్వకి కూడా వివాహం చేసేశాము.

ఆవిధంగా మా కల కల్లగా మిగిలిపోయినప్పటికీ బలరాం మీద మాకున్న వాత్సల్యం కానీ, వాడికి నా మీద వున్న గురుభక్తిగానీ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడైనా కనిపిస్తే ఎంతో అభిమానంగా మాట్లాడుతాడు. తన కష్టసుఖాలన్నీ అరమరికలు లేకుండా చెప్తాడు.

ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం, గుణవంతురాలైన అమ్మాయితో పెళ్లి బలరాం జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు అతనికి సిగరెట్లు, గుట్కా, తాగుడు వంటి దురలవాట్లు అంటుకున్నాయి. కానీ ఇప్పుడు అట్లాంటివేమీ లేవు. చదువుకునే రోజుల్లో మాదిరిగా తిరిగి హుందాగా తయారయ్యాడు. జీవితానికి మళ్లీ ఒక లక్ష్యమంటూ ఏర్పడింది.

ఆర్టీసీ వాళ్లిచ్చిన గృహనిర్మాణ రుణం సహాయంతో అతను గతంలో అమ్మేసిన తమ పెంకుటిల్లునే తిరిగి కొని అక్కడే చక్కని డాబా ఇల్లు కట్టించాడు. అతని కుటుంబ మంతా ఇప్పుడు ఆ ఇంట్లోనే వుంటున్నారు. ఊళ్ళో బలరాంకి మంచి పేరుంది. బస్టాపుల్లోనే కాదు మార్గమధ్యంలో ప్రయాణికులు కనపడ్డా బస్సాపి పిలిచి మరీ బస్సెక్కించుకుంటాడు. ప్రయాణికులందరితో మర్యాదగా, కలుపుగోలుగా మాట్లాడతాడు. వారు కోరిన చోట విసుక్కోకుండా బస్సాపి దింపుతాడు. బలరాం బస్సంటే పిల్లలకీి, పెద్దలకీ ఎంత ఇష్టమో. బలరాం బస్సు వుందంటే ఆటోల మీద వెళ్లేవాళ్లు కూడా ఎంతసేపైనా ఎదురుచూస్తూ నిలబడతారు. డ్రెవింగ్‌ కూడా ఎంత బాగా చేస్తాడో. గతుకుల రోడ్డుమీద సైతం కుదుపులు లేకుండా నడపగలిగే నైపుణ్యం అతనిది.

అట్లాంటి బలరాంకి ఇంత చిన్న వయసులో గుండెపోటేమిటో తలచుకుంటే మనసు విలవిలలాడిపోతోంది.

నేను బలరాం ఇంటికి చేరుకునే సరికే అక్కడ ఇరుగుపొరుగు వాళ్లు చాలామంది గుమికూడి వున్నారు. బలరాం తల్లి, భార్య పెడ్తున్న శోకాలు దూరంనుంచే వినపడసాగాయి.

ఒక్కసారిగా ఏదో వణుకు, భయం ఆవహించాయి నన్ను. నో. అ లా జరగి వుండదు! అ లా జరగ కూడదు! బలరాంకి ఏం కాకూడదు. భగవంతుడు అంత దుర్మార్గుడు కాదు. అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాను.

కానీ ఏదీ మనం అనుకున్నట్టు జరుగదు కదా. అప్పటికే బలరాం విగతజీవుడయ్యాడు. అతని శరీరంలో కదలికలు లేకపోయినా అతని కళ్లు మాత్రం ఇంకా ఏ భవిష్యత్తులోకో తొంగిచూస్తున్నట్టు అ లా తెరిచే వున్నాయి. ఆ కంటి రెప్పలను మూసే ప్రయత్నం చేస్తూ కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుండగా నేను కూడా బలరాం కళేబరం మీద వాలిపోయాను.

--- --- ---

బలరాం చనిపోయి ఏడాది కావస్తోంది.

ఇప్పటికీ వాడు చనిపోయాడంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడంలేదు. అందుకే ఏ బస్సుని చూసినా డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నది బలరామే నేమో అనిపిస్తుంటుంది. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు హారన్‌ మోగిస్తూ వచ్చి నా పక్కనే ఆగినట్టు... బలరాం నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నారు సార్‌. రండి అని ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది.

వాడికి ఏమీ కాని నాకే ఇలా వుంటే వాడి కన్నతల్లికి, భార్యకి, పిల్లలకి ఎలా వుంటుందో. బలరాం తండ్రి అకాల మృత్యువు పాలవడం, బలరాం చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం... ఏమిటో ఆ కుటుంబం చేసుకున్న పాపం అని మనసు విలవిలలాడుతుంది.

అయితే రాఘవులు చనిపోయినప్పుడు మాదిరిగా ఆ కుటుంబం ఇప్పుడు వీధిన పడలేదు. అప్పులవాళ్ల బాధ పడలేక ఉన్న ఇంటిని అమ్ముకుని కుటుంబమంతా ఛిన్నాభిన్నమైపోయే ఆనాటి దుస్థితి వీరికి రాలేదు.

ఆర్టీసీ వాళ్లు ఇంటి నిర్మాణంకోసం తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేశారు. ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాచ్యుటీ, ఎస్‌బిటి, ఎస్‌ఆర్‌బిఎస్‌, ఇడిఎల్‌ఐఎఫ్‌, అడిషనల్‌ మానిటరీ బెనిఫిట్‌ స్కీం, పెన్షన్‌ స్కీం ఇట్లా అనేక రకాల కార్మిక సంక్షేమ పథకాల వల్ల, దానికితోడు బలరాం ముందు చూపుతో చేసిన ఎల్‌ఐసి పాలసీ వల్ల ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక ఆసరా లభించింది. వచ్చిన డబ్బుని అధిక భాగం సిసిఎస్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. దానిపై వచ్చే ఇంట్రెస్ట్‌, పిఎఫ్‌ పెన్షన్‌ డబ్బులు కలిపితే బలరాం నెలజీతం కన్నా రెట్టింపు ఆదాయం వస్తోంది వాళ్లకి.

ఇవాళ బలరాం భార్య అనాథ కాదు.
తన తండ్రి చనిపోయినప్పటిలాగా ఇప్పుడు బలరాం పిల్లలు చదువు మానేయనవసరంలేదు.

రాఘవులు తాను చనిపోతూ తన పిల్లలకు మంచి భవిష్యత్తనేది లేకుండా చేశాడు.

బలరాం తాను చనిపోతూ తన పిల్లల ఆలనాపాలనకు, ఉజ్వల భవిష్యత్తుకు అన్ని ఏర్పాట్లు చేసిపోయాడు.

ప్రైవేట్‌ రంగంలో పనిచేసే కార్మికుడి పరిస్థితికీ ... ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికుడి పరిస్థితికీ మధ్య ఎంత తేడా.

బలరాం నువ్వు లేవు. నీ ఆశాసౌధం వుంది.

అది ఎప్పటికీ కూలిపోదు!
.....

(ఆర్టీసీ ప్రస్థానం మాస పత్రిక మే 1994 సంచికలో ప్రచురించబడిన కథ స్వల్ప మార్పులతో)


...