Monday, June 22, 2009
వైతరణి మీద వంతెన కోసం
వైతరణి మీద వంతెన కోసం
యంత్ర నాగరికత నిశ్వాస తాకిడికి
చంద్రుడు సైతం పొగచూరిపోయాడు
'జాబిల్లి రావే జాజిపూలు తేవే' అని
పాడేందుకు అమ్మ గొంతెలా పెగులుతుంది?
మేఘాల్లోంచి రాలే ముత్యపు చినుకులు
నేలను తాకే సరికి కాలుష్యపు కోరల్లో చిక్కి మసిబొగ్గుల్లా మారుతున్నాయి
'వానా వానా వల్లప్పా' అంటూ గంతులు వేసేందుకు
కాగితం పడవలతో కేరింతలు కొట్టేందుకు వీలెక్కడుంటుంది?
కాన్వెంటు సంస్కృతి పసిపిల్లల్ని
'బాల ఏసులు' గా మారుస్తుంటే ...
వంగిన వెన్నెముకలు మళ్లీ నిటారుగా ఎలా అవుతాయి?
శరీరం సంగతి సరే
మెదళ్లను మాత్రం కుదురుగా వుండనిస్తున్నారా!
అన్నా చెల్లెళ్లను సైతం నిర్మలంగా చూడలేని
విదేశీ విష సంస్కృతి ... గోడల మీది పోస్టర్లుగా,
కదిలే బొమ్మలుగా, రంగుల చానెళ్లుగా, నీలి చిత్రాలుగా
కాలకూటాన్ని విరజిమ్ముతున్నాయి!
షష్టిపూర్తి చేసుకున్న స్వాతంత్య్రం
మూర్తీభవించిన స్వార్థంలా, ముంచెత్తే వైతరణిలా మారిపోతుంటే
మన మనుగడ మాట సరే
మన పిల్లలు ఆవలి తీరం చేరేదెలా?
(ఎపిఎస్‌ఆర్‌టిసి ఆర్ట్స్‌కో 1998లో నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నా కవిత)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment