Thursday, June 4, 2009

సొంత చిరునామా ... కథ


సొంత చిరునామా ... కథ

''మమ్మీ...ఎందుకేలుత్తున్నావ్‌?''

దొడ్లో బావిగట్టుమీద కూచుని అంట్లుతోముతున్న తల్లిని తదేకంగా చూస్తూ అడిగింది భవిత.

కూతురు రాకను గమనించకపోవడంవల్ల ఆ ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కిపడింది భవాని. తన ఉలికిపాటును పైకి కనబడనివ్వకుండా భుజాలతో కళ్లు తుడుచుకుని 'నేనేం ఏడవడం లేదే' అన్నట్టు నవ్వింది. బాధ అడ్డుపడటం వల్ల ఆ మాట గొంతుదాటి బయటకు రాలేకపోయింది.

భవిత వయసు మూడేళ్లే కానీ ఎంతో ఆరిందాలా మాట్లాడుతుంది. వయసుకు మించిన తెలివి తేటల్ని ప్రదర్శిస్తుంటుంది.

జీవంలేని తల్లి నవ్వును ఏమాత్రం పట్టించుకోకుండా ''తాతయ్య నిన్ను తిట్టాలు. అందుకే ఏడుత్తున్నావ్‌ కదూ?'' అంది తిరిగి.

''అబ్బే లేదమ్మా! కంట్లో ఏదో నలక పడితేనూ తుడుచుకుంటున్నా...'' సూటిగా కూతురి కళ్లల్లోకి చూడలేకపోయింది భవాని.

''అంతా అబ్‌దం''

''లేదే నిజం... ఒట్టు'' కుడిచేయి పిడికిలి బిగించి అంట్లు అంటకుండా మణికట్టును తలమీద పెట్టుకుంటూ అంది.

తల్లి ఒట్టు పెట్టుకునేసరికి ఆ చిన్నారి క్షణకాలం సంశయంలో పడిపోయింది. ఆ వెంటనే ''తాతయ్య మంచాడు కాదు. ముచ్చలి, బూచి..''అంది కసిగా.

''అవేం మాటలే. పెద్దవాళ్లను అ లా అనొచ్చా? తప్పుకదూ!'' కూతుర్ని మందలించింది భవాని.

''మరి మరి నేను చని గహమా? డాడీని నేను చంపానా??'' తల ఎగరేస్తూ ఆక్రోశంగా అడుగుతున్న కూతుర్ని చూసి తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకోలేకపోయింది. చప్పున చేతుల్ని కడుక్కుని కూతుర్ని ఒళ్కోకి లాక్కుని భోరు మంది.

తండ్రి మాటలు తననే కాక ఆ పసి హృదయాన్ని కూడా అంతగా గాయపరిచి వుంటాయని ఏమాత్రం ఊహించలేకపోయింది.

అసలు తప్పంతా తనదే!

ఇల్లు తుడవబోతూ 'కాస్త ఆ ఫ్యాను ఆపు చెయ్యమ్మా' అంటూ తనే పాపను పురమాయించింది. ఎప్పుడూ తన కూడా వుంటూ తనకు ఏదో ఒక సాయం చెయ్యాలని ఉబలాటపడే కూతురి ముచ్చట తీర్చాలనే చెప్పింది తప్ప మరో ఉద్దేశంతో కాదు.

తన నోట్లోంచి ఆ మాట వచ్చిందో లేదో పాప గబగబా వెళ్లి తాతయ్య పడుకున్న మంచం ఎక్కి స్విచ్‌ ఆఫ్‌ చేయబోయింది. ఆయన తలగడ పక్కనే వున్న కళ్లజోడును పాపా చూడలేదు తనూ చూడలేదు పాప కాలుతగిలి కిందపడిపోయేవరకూ!

గాఢ నిద్రలో వున్నాడనుకున్న నాన్నగారు గభాల్న లేచి ''వెధవ సంత.. వెధవ సంతాని'' అంటూ పాప వీపు మీద ఒక్కటిచ్చారు. అంతటితో ఆగకుండా శనిగ్రహం అదీ ఇదీ అంటూ సణగడం మొదలుపెట్టారు.

తీరా చూస్తే కిందపడ్డ కళ్లజోడు నిక్షేపంగానే వుంది!

అభం శుభం తెలీని పసిపిల్లను పట్టుకుని అంతంత మాటలు అంటుంటే తను సహించలేకపోయింది.
''ఎందుకు నాన్నా గారూ ఊరికే నోరు పారేసుకుంటారు? దానికేం తెలుసని? అయినా మీ కళ్లజోడు కేం కాలేదుగా?'' అంది ఆక్రోశంగా.

''ఇది పుట్టిన ఘడియే అ లాంటిదమ్మా. నేనేం ఊరికే అనడం లేదు. మూడు పంచాగాలు ముఫ్పైసార్లు తిరగేసి చెప్తున్నాను. దీనంత నష్ట జాతకురాలు ఈ లోకంలో ఎవత్తీ వుండదు'' అంటూ ఏదేదో వాగారు.

ఆ క్షణంలో ఇంట్లో వున్న పంచాంగం పుస్తకాలన్నీ కుప్పపోసి తగలేద్దామా అన్నంత కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా గుడ్ల నీరు కక్కుకుంటూ దొడ్లోకి పారిపోయి వచ్చేసింది.

కొద్ది రోజుల కిందట ఆయన చేసిన గాయం ఇంకా పచ్చిగానే వుంది అప్పుడే ఇది మరో గాయం!

ఆ రోజు భవిత పేరిట అర్చన చేయించాలని తను గుడికి వెళ్లింది. భర్త చనిపోయిన తరువాత ఈ ఏడాదికాలంలో తను ఒక్కసారైనా గుడికి వెళ్లలేదు. ఏం మొహం పెట్టుకుని వెళ్తుంది? ఏం కోరిక కోరుకుంటుంది?

నాల్రోజులుగా భవిత జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ తనకి దేవుడు గుర్తుకు రాలేదు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా నాన్న గారు అప్పుడే ఇంట్లోంచి ఏదోపనిమీద బయటికి వెళ్తున్నారు. తను ఎదురుపడగానే ఒక్కసారి మొహంమీదే ''ఛిఛీ!'' అనేసి గిరుక్కున వెనుతిరిగారాయన.

ఆ పూట తన ప్రయాణమే మానుకున్నారు. ''పైగా అప్పుడే వీధిన పడాలేమిటి? అంతగా నీ కూతురి పేరిట అర్చన చేయించాలనుకుంటే ఎవర్నో ఒకర్ని అడగొచ్చుకదా. నువ్వే వెళ్లాలా?'' అంటూ నానామాటలన్నారు.

తను నిర్ఘాంతపోయింది.

ఒకప్పుడు ఏ పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చినా అక్కయ్యల్ని కాదని ఎక్కడున్నా తననే ఎదురు రమ్మనేవారాయన. తను వచ్చే వరకూ ఎదురుచూస్తూ కూచునే వారు?! అట్లాంటి నాన్నగారికి కూడా ఇవాళ తను అపశకున పక్షి అయిపోయిందా?

ఎంత కుమిలిపోయిందో తను ఆరోజంతా!

తన భర్త భానుమూర్తికి ఇట్లాంటి నమ్మకాలేమీ లేవు. పూజా పునస్కారాలు కూడా ఏమీ చేసేవారు కాదు. పెళ్లయిన కొత్తలో వీలు చిక్కినప్పుడల్లా నాన్న గారి మూఢనమ్మకాలనీ, శకునాలనీ, జోస్యాలనీ అవహేళనచేసేవారు. ''సీతారామయ్య కూతురిగా కాదు భానుమూర్తి భార్యగా ఆలోచించడం అ లవాటు చేసుకో భవానీ'' అంటూ కవ్వించే వాడు. తనకప్పుడు ఆయన మీద ఎంత కోపం వచ్చేదో. ఒక పూటంతా మాటలు మానేసేది. ఎందుకంటే నాన్న గారి కున్న నమ్మకాలన్నీ తనకూ వుండేవి మరి.

ఇప్పుడు ఆలోచిస్తుంటే తన భర్త ఆలోచనలే కరెక్టు అనిపిస్తోంది. ఇవన్నీ అర్థం లేని మూఢనమ్మకాలే అనిపిస్తోంది. తన భర్త భావాల ఔన్నత్యాన్ని ఆయన బతికున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ అర్థం చేసుకోగలుగుతోంది తను.

ఒకసారి పండక్కి పుట్టింటికి వచ్చి తామిద్దరం తిరుగు ప్రయాణం అవుతున్నాం. భానుమూర్తి సూట్‌కేసు పట్టుకుని నాన్నగారితో ''వస్తాం మామయ్యా'' అని చెప్పి ముందుకు కదిలారు. తనూ అమ్మానాన్నల వద్ద సెలవు తీసుకుని ఆయనను అనుసరించింది. కానీ అంతలో నాన్నగారు ఒక్కసారిగా ''ఆగండాగండి'' అంటూ అరిచారు. ''వెధవ ముండ ఎదురొస్తోంది. ఒక నిమిషం కూచుని వెళ్లండి'' అన్నారు.

చూస్తే వీధిలోంచి దూరంగా గంగాభాగీరధీ సమానురాలైన పక్కింటి వెంకాయమ్మ ఇటువేపే వస్తోంది.
సీతారామయ్య మాటల్ని భానుమూర్తి ఖాతరు చేయలేదు.

''నాన్నగారు పిలుస్తున్నారు వెనక్కొచ్చేయండి'' అంది తను. ఆయన చిరాకు పడిపోతూ ''ఏంటా మూఢనమ్మకాలు? నోర్మూసుకుని వచ్చేయ్‌'' అంటూ ముందుకు సాగారు. తను నిస్సహాయంగా భర్తను అనుసరించక తప్పలేదు.

అప్పుడు తన మాట కాదన్నందుకు నాన్నగారు ఎంత బాధపడిపోయి వుంటారో అని ఆలోచించిందే తప్ప- భర్త అన్నట్టు అ లా చేస్తే వెంకాయమ్మ మనసు ఎంత కుమిలిపోయి వుండేదో అని ఆలోచించలేదు.

ఇవాళ నాన్నగారు తనని కూడా ఆరోజు వెంకాయమ్మని చూసినట్టు చూస్తే తప్ప తన కళ్లు తెరుచుకోలేదు.

భానుమూర్తికి జాతకాలమీదా, జోస్యాల మీదా ఏమాత్రం నమ్మకం వుండేది కాదు. నాన్నగారిని ఏవిషయంలోనూ సంప్రదించేవాడు కాదు. ఆయన ఏం చెప్పబోయినా వినిపించుకునేవాడూ కాదు.

''అంతా నుదుటి రాత ప్రకారమే జరుగుతుందని అనుకున్నప్పుడు ... ఆ రాత గురించి తెలుసుకోడానికి ప్రయత్నించడంవల్ల ఏమిటి ఉపయోగం? తలరాతల్ని మార్చడం ఎవరితరమైనా అవుతుందా? ఏంటీ పిచ్చి నమ్మకాలు?'' అని తనతో వాదించేవారు.

అయినే సరే ఆయనకి తెలియకుండా ఆయన పుట్టిన తేదీ, సమయమూ కనుక్కుని నాన్నగారికి అందించింది. నాన్నగారు అతి కష్టం మీద పాత పంచాంగాన్ని సేకరించి మరీ ఆయన జాతకం చూశారు.

భానుమూర్తిది మహర్జాతకమట. జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారట. త్వరలో ఆఫీసరు అయ్యే యోగం వుందట. ఎంతో డబ్బు సంపాదిస్తాడట కానీ ఆయన చేతిలో డబ్బు నిలవదట. రెండు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఖర్చు చేస్తాడట.

తను ఉత్సాహంగా నాన్నగారు చెప్పిన జాతకం గురించి చెప్పబోతే భర్త ఎంత తేలిగ్గా కొట్టి పాడేశారో.

''ఇట్లాంటి జాతకాలు నాకే కాదు మన సమాజంలో నూటికి తొంభై మందికి సరిగ్గా అతికినట్టు సరిపోతాయి భవానీ. మన జీతభత్యాలు పెరుగుతున్న జీవన ప్రమాణాలకు, అవసరాలకు అనుగుణంగా లేవు. ఒకప్పుడు కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే చాలు పదిమంది కూర్చుని తినగలిగే వారు. కానీ ఇప్పుడు ఒక జీతం మీద ఇద్దరు కూడా సరిగా బతకలేక పోతున్నారు. ధరలు గుర్రాల మీదా జీతాలు గాడిదల మీదా దౌడు చేస్తున్నాయి మరి'' అంటూ తనకు క్లాసు తీసుకున్నారు.

''ఈయనెప్పుడూ ఇంతే'' అని విసుక్కుందే తప్ప ఆ మాటల లోతును అర్థం చేసుకోవాలని ప్రయత్నించలేదు తను.

తన భర్త గొప్పవాడవుతాడు. దుబారా ఖర్చు మాట ఎలా వున్నా బాగా సంపాదిస్తాడు కదా అని పొంగిపోయింది.

తన కలల వంతెన కూలిపోయినప్పుడు కానీ నాన్నగారు చెప్పిన జోస్యంలోని డొల్లతనం బోధపడలేదు.

''పిల్లలు పుట్టిన వేళావిశేషాన్ని బట్టి ఒకోసారి మన జాతకాలు తారుమారవుతాయమ్మా. దీని కంతటికీ కారణం నీ కూతురే...'' అంటూ ఎదో వివరించబోయినప్పుడు తను భగ్గున మండిపోయింది. అప్పటినుంచీ ''తన కూతురు నష్టజాతకురాలనీ, పుడుతూనే తండ్రిని పొట్టనపెట్టుకుందని'' ఎవరైనా అంటే సహించలేకపోతోంది. జాతకాలంటేనే ఏవగింపు కలుగుతోందిప్పుడు. ఆ మాటలు తనను నిలువునా రంపపు కోత కోస్తున్నాయి.

''మీకో మీ జోస్యాలకూ, మీ జాతకాలకూ ఓ నమస్కారం మా మానాన మమ్మల్ని ఇలా బతకనీయండి'' అని అరవాలనిపిస్తోంది.

ఎంత మార్పు. ఈ మార్పును తనలో తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించేవాడో భానుమూర్తి.

ఆడపిల్ల పెద్ద మనిషి అయితే చాలు ఇహ గడపదాటి వీధిలో అడుగుపెట్టకూడదు అరిష్టం అనేది నాన్నగారి సిద్ధాంతం. అందుకే తన ముగ్గురి అక్కయ్యలతో పాటు తన చదువూ ఏడో తరగతి దాటి ముందుకు సాగలేదు.

''కూతుళ్లంటే సీతారామయ్య గారి కూతుళ్లేనమ్మా. అసలు ఇంట్లో వున్నట్టే తెలియదు'' అని ఎవరైనా అంటూంటే ఎంత పొంగిపోతారో నాన్నగారు. పై చదువులకు వెళ్లి తప్పటడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకున్న ఆడపిల్లల ఉదంతాలు విన్నప్పుడు నాన్నగారి పాలసీయే రైటు అనితృప్తిపడేది తను.

''మీ నాన్న ఉత్త మూర్ఖుడు భవానీ. వెయ్యేళ్ల కిందట పుట్టవలసినవాడు.'' అని భర్త నిందిస్తుంటే భరించలేకపోయేది. ''ఆడ పిల్లల్ని కూడా మగ పిల్లల్లాగే పెంచాలి. అసలు ఆడామగా తేడానే తెలియనివ్వకూడదు పిల్లలకి. చదువు అందరికీ తప్పనిసరి. తప్పు చేస్తారేమో, అన్యాయమైపోతారేమో అనే భయంతో గదిలో బంధించడం కాదు... ఏది తప్పో ఏది ఒప్పో వాళ్లే స్వయంగా గ్రహించేలా చేయాలి'' అనేవాడు భానుమూర్తి.

చలం రాసిన ''బిడ్డల శిక్షణ'' యిచ్చి పదే పదే చదవమని తనని ఒత్తిడి చేసేవారు.

తనను మానసికంగా ఎదగకుండా చేశారని నాన్నగారి మీద ఎంత కసో ఆయనకి. అట్లాగే మిగతా అ ల్లుళ్లలాగా తన మాటలనీ, జాతకాలనీ గౌరవించడం లేదని నాన్నగారికి కూడా భానుమూర్తి మీద కినుక వుండేది.

అటు తండ్రి మార్గం అనుసరించాలో, ఇటు భర్త మార్గం అనుసరించాలో తెలీక సతమతమైపోతుండేది
తను. ఉత్తరోత్తరా తండ్రి పక్షమే వహించేది.

కానీ ఇప్పుడు ...

చేయి పట్టుకుని నడిపించేందుకు భర్త లేడు.

తండ్రి అవాక్కులని వేద వాక్యాల్లా భావించే స్థితిలో తను లేదు.

''భవానీ... భవానీ...!'' తల్లి రాఘవమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిందామె.

''ఏమిటే ఇది? ప్రతి చిన్న విషయానికీ నువ్విట్లా కుమిలిపోతూ కూచోడం బాగాలేదమ్మా'' అంది రాఘవమ్మ.

''నా కూతుర్ని పదే పదే శనిగ్రహం, నష్ట జాతకురాలు అని తిట్టడం, నన్ను అపశకునపక్షిలా చీదరించుకోవడం నీకు చిన్న విషయాల్లా కనిపిస్తున్నాయా అమ్మా?'' ఆక్రోశంగా అడిగింది భవాని.



''అబ్బబ్బ. నీతో ఏం మాట్లాడాలన్నా కష్టమేనే. నాన్నగారి తత్వమే అంతకదా. నీకేమైనా కొత్తా ఏమిటి? ఆయన మాటల్ని ఎందుకంత పట్టించుకుంటావు? ముందు ఏదోఒకటి అనేయడం ఆ తరువాత బాధపడటం ఆయనకలవాటు. అదిగో పిలుస్తున్నారు వెళ్లు'' అంటూ కూతుర్ని లేపి అంట్ల ముందు తను కూర్చుంది రాఘవమ్మ.

ఇష్టం లేకపోయినా భవితను భుజాన వేసుకుని తండ్రి గదిలోకి వెళ్లింది భవాని.

''బాధ పడుతున్నావుట. అమ్మ చెప్పింది. నేను అనాలని అనలేదు చిన్నీ. ఏదో కోపంలో వచ్చేశాయి'' అనునయంగా అన్నారు సీతారామయ్య.

భవానీ ఏం మాట్లాడలేదు.

''ఏం విఘ్నేశ్వరీ దేవీ నీక్కూడా కోపమొచ్చిందా ఈ తాతయ్య మీద?'' అంటూ మనవరాల్ని మాటల్తో ప్రసన్నం చేసుకోబోయారాయన.

భవిత చుర చురా చూస్తూ ''నాపేరు విగ్గేశ్వరి కాదు బవిత'' అంది.

''అబ్బో'' అని ఊరుకున్నారు సీతారామయ్య. మరో సందర్భంలో అయితే వాదనకు దిగేవారే ఆయన.

పాపకు ఆయన సూచించిన పేరు విఘ్నేశ్వరి. జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ పేరు పెడితేనే మంచిదని ఆయన ఖరాకండీగా చెప్పారు. కానీ భానుమూర్తి అందుకు ఒప్పుకోలేదు. తమ ఇద్దరి పేర్లకు సరిపోయేలా భవిత అని తనే పేరు పెట్టాడు. పాప భవిష్యత్తు గురించి ఆయనకి ఎన్నో ఆలోచనలుండేవి.

మొదట్లో భవిత అన్న పేరు తనకీ ఇష్టమనిపించేది కాదు. కానీ రాను రాను అదే అ లవాటైపోయింది. అయితే పుట్టింట్లో మాత్రం నాన్నగారితో పాటు అందరూ పాపని విఘ్నేశ్వరీ అనే పిలుస్తుంటారు. ఆ సంబోధన చెవినపడితే సహించలేకపోయేవారు భానుమూర్తి.

''నాపేరు విగ్గేశ్వరి కాదు బవిత'' అని కూతురు అరిచేసరికి అదంతా గుర్తుకొచ్చింది భవానీకి. ప్రేమగా కూతురి బుగ్గ గిల్లింది.

వాతావరణం కాస్త తేలికపడ్డట్టయింది.

''చిన్నీ, ఈ కాగితాల మీద సంతకం పెట్టివ్వమ్మా'' అన్నారు సీతారామయ్య.

''ఏం కాగితాలు నాన్నగారూ'' పాపను దించి కాగితాలను అందుకుంటూ అడిగింది భవాని.

''ఆస్తిలో భాగం పంచివ్వమని మీ మామగారికి పంపే పార్టిషన్‌ నోటీసు.'' అన్నారాయన.

భవానీ చప్పున ఆ కాగితాలని తండ్రికి తిరిగి అందించి ''నేను వద్దని అప్పుడే చెప్పాను కదా నాన్నగారూ. ఆయన పోయి ఏడాది కాలేదు అప్పుడే ఆస్తిలో వాటా కోసం దావా వేయాలా?''అంది.

సమాధానం కోసం ఎదురుచూడకుండా కూతుర్ని ఎత్తుకుని వేరే గదిలోకి విసవిసా వెళ్లిపోయింది.

అహం దెబ్బతిన్న సీతారామయ్య ''మాట్లాడుతుంటే అ లా వెళ్లిపోతావేమిటే తలతిక్కా?'' అంటూ తిరిగి తన సహజ ధోరణిలోకి వెళ్లిపోయారు.

భవానీకి మళ్లీ దుఃఖం తెర్లుకొచ్చింది.

పుట్టింటి కంటే మెట్టినిల్లే కాస్త మెరుగేమో అనుకుంది ఒక్క క్షణం. కానీ అంతలోనే అక్కడ జరిగిన అవమానాలు గుర్తుకొచ్చాయి.

తమ పెళ్లయిన నెెల రోజులకే భానుమూర్తికి హైదరాబాదుకు బదిలీ అయింది. తనే కావాలనే హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నానని చెప్పాడు భానుమూర్తి.

''ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వుండవనీ, అడుగడుగునా ఆంక్షల్ని తను తట్టుకోలేడనీ, తన మనస్తత్వానికి అది సరిపడదనీ'' చెప్పాడు భానుమూర్తి.

ఆ ఇంట్లో భానుమూర్తే చిన్నవాడు. ఇద్దరు అన్నయ్యలూ వ్యవసాయం చేసేవారు. భానుమూర్తి ఒక్కడే ఉద్యోగం చేసేవాడు. తోటి కోడళ్లు ఎప్పుడూ ఒకరిమీద ఒకరు చెవులు కొరుక్కునేవారు. వాళ్ల పిల్లలు కూడా ఎప్పుడూ పరస్పరం పోట్లాడుకుంటూ చాడీలు చెప్పుకుంటూ రభస సృష్టించేవారు. తను కాసేపు ఖాళీగా కూర్చుంటే అత్తగారు ఓర్చుకోలేక పోయేది. అయినా అక్కడ వున్నన్ని రోజులూ ఎవరూ వేలెత్తి చూపకుండా జాగ్రత్తపడుతూ అన్నిటికీ సర్దుకుపోతూ గడిపింది తను. అయినా తన పోరువల్లే భానుమూర్తి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడని ఆడిపోసుకున్నారు అందరూ.


హైదరాబాద్‌లో కొత్త కాపురం మొదలుపెట్టిన తరువాత కానీ తనకి అసలు ప్రపంచం అంటే ఏమిటో, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అంటే ఎమిటో తెలియలేదు.

కొత్తలో భానుమూర్తి ఆఫీసుకు వెళ్లేక బిక్కుబిక్కు మంటూ ఒంటరిగా గడపడం ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇరుగూ పొరుగు వాళ్లతో స్నేహం ఏర్పడ్డాక అ లవాటైపోయింది.

అట్లా నెల రోజులు గడిచాయో లేదో తనని ప్రైవేటుగా ఎస్‌ఎస్‌సి పరీక్ష రాయమంటూ పోరడం మొదలుపెట్టాడు భర్త. ''బాబోయ్‌ ఈ వయసులో మళ్లీ చదువేమిట''ి తనవల్ల కాదు అని ఎంత అభ్యంతరపెట్టబోయినా ఆయన వినిపించుకోలేదు. అదేవీధిలో వున్న ట్యుటోరియల్‌ కాలేజీలో బలవంతంగా చేర్పించాడు. మొదట్లో ఎంత సిగ్గుగా వుండేదో. అంతా తనని చూసి నవ్వుకుంటారని ఊహించుకునేది. కానీ అసలు ఒకరి గురించి ఒకరు పట్టించుకునే తీరికెవరికుంటుంది పట్నంలో. పైగా తనలాగే చదవుకునే పెద్దవాళ్లు అక్కడ మరికొందరు కూడా కనిపించేసరికి ఎంతో ధైర్యం వచ్చింది. ఆ తరువాత భర్త మాటలతో పట్టుదల పెరిగింది.

అంతే ఆశ్చర్యంగా మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్‌సి అన్ని సబ్జెక్టుల్లోనూ పాసైంది తను. ఆ తరువాత టైపు కూడా నేర్చుకుంది.

పెళ్లయిన తరువాత రెండేళ్ల పాటు భర్త కోరిక మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేవాళ్లు. ఆ రోజులు ఎంత మధురంగా వుండేవో. భానుమూర్తి తన పట్ల చూపిన ప్రేమానురాగాలు అనుభవిస్తున్నప్పటికంటే ఇప్పుడు ఎంతో గొప్పగా అనిపిస్తున్నాయి. అప్పుడు అదంతా సర్వసాధారణమైన విషయంగానే అనుకుంది తను. ఇప్పుడు మనుషుల్ని తరచి చూడటం అ లవాటైన తరువాత గానీ తన భర్త వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలీడంలేదు.

మూడేళ్ల కాపురంలో మూడు జన్మలకు సరిపడేంత తీయని అనుభూతుల్ని మిగిల్చి వెళ్లాడు భానుమూర్తి.

దేవుడ్నీ దయ్యాలనీ నమ్మడన్న ఒక్క విషయం తప్ప ఆయనలో అన్నీ గొప్పగుణాలే. ఆయన కూడా తనలాగే దేవుడికి దండం పెట్టుకుంటే మరింత బాగుండేది కదా అనిమాత్రం అప్పుడప్పుడూ అనుకునేది. అయితే తనను దండం పెట్టుకోవద్దని మాత్రం ఆయన ఎన్నడూ ఆంక్షలు విధించలేదు. ప్రసాదం ఇస్తే తన తృప్తికోసం చక్కగా కళ్లకద్దుకుని తినేవాడు. పండగలప్పుడు వద్దనకుండా హారతి కూడా తీసుకునేవాడు.

ఆ రోజు ...

ఆఫీసు నుంచి ఇంటికొస్తూ స్కూటర్‌ ఏక్సిడెంటుకు గురై ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా తన గురించీ, తమ బిడ్డ గురించీ ఎంతగా పరితపించాడో... కేవలం తమకోసం మృత్యువును జయించేందుకు ఆయన విఫలయత్నం చేశాడు. అది తలచుకుంటే కన్నీళ్లు ఆగలేదు భవానీకి.

ఏదో ఒకరోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసేమో. అందుకే తన చదువు పట్ల అంతగా పట్టుపట్టాడేమో.

భర్త చనిపోయిన తరువాత హైదరాబాద్‌ నుంచి మకాం ఎత్తేసి నెల రోజుల పాటు అత్తవారింట్లో వుంది భవాని. కానీ అందరూ భర్త చావుకి తనే కారకురాలన్నట్టుగా ఆడిపోసుకోవడం. భానుమూర్తిని తనే బలవంతంగా బదిలీచేయించి పచ్చని ఉమ్మడి కుటుంబంలో చిచ్చుపెట్టినట్టు అందుకు తగిన శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నట్టు సూటిపోటి మాటలు అనడం తను భరించలేకపోయింది. ఆ ఇంట్లో తనకు ఏ ఒక్కరితో కూడా ఆత్మీయ అనుబంధం ఏర్పడలేదు. అందుకే అక్కడ ఉండలేకపోయింది.

పుట్టింటికి వస్తే మాత్రం తన సమస్య తీరిందా? లేదు. ఒకప్పుడు పంచవటిలా కనిపించిన ఇల్లు ఇప్పుడు పంజరంలా అనిపిస్తోంది.

నాన్నగారికి తన మీద కంటే తన వెంట వచ్చిన, రాబోతున్న ఆస్తి మీదే ప్రేమ ఎక్కువ అని ఇట్టే గ్రహించింది భవాని. భర్త ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాచ్యుటీ డబ్బు మీద అడగకుండా ఆయనే పెత్తనం చెలాయిస్తున్నారు. పనీపాటా లేని అన్నయ్య చేత వ్యాపారం పెట్టించడానికని యధేచ్చగా ఆ డబ్బుని వాడేస్తున్నారు. కాకపోతే ఆ వ్యాపారానికి భవానీ అన్న పేరు పెట్టి తనను మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేమో భర్త ఆస్తిలో వాటాకోసం దావా వేసి మరింత డబ్బును కూడగట్టాలని పథకం వేశారు.

ఛీ ఛీ ఏం మనుషులు? వీళ్ల మధ్య తన శేష జీవితం ఎలా గడుస్తుంది? తన బిడ్డ భవిష్యత్తు ఎలా భద్రంగా వుంటుంది?

భవానీ ఒక స్థిర నిశ్చయానికొచ్చేసింది. తన భర్త చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చిన ఆఫీసర్‌ గుర్తుకొచ్చాడు. ''అమ్మా నువ్వు ఉద్యోగం చెయ్యాలనుకుంటే మా ఆఫీసులో నీ భర్త స్థానం ఎప్పుడూ నీకోసం ఖాళీగా వుంటుందమ్మా. పరిస్థితులు నెమ్మదించాక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా'' అన్నాడాయన.

భర్త బలవంతంమీద టెంత్‌ పరీక్ష రాయడం, టైపు నేర్చుకోవడం ఎంత మేలైందో. ఇందుకే అప్పుడాయన అంత పట్టుపట్టి తనచేత చదివించాడేమో.

భవానీకి ఒక్కసారిగా ఎక్కడలేని ధైర్యం, శక్తీ వచ్చినట్టనిపించాయి.

బాల్యంలో తండ్రి చాటున, యవ్వనంలో భర్త చాటున, వృద్ధాప్యంలో కొడుకు చాటున అణిగిమణిగి వుండాలే తప్ప ఆడది స్వేచ్ఛగా ఎదిగేందుకు వీల్లేదు అన్న తండ్రి తాలూకు భావజాలం పట్టునుంచి ఆమె పూర్తిగా బయటపడింది.

''నాకు ఇంకా ఈ కేరాఫ్‌ బతుకు అక్కరలేదు. నా కాళ్ల మీద నేను నిలబడతాను. నాకంటూ ఒక సొంత చిరునామాను ఏర్పరచుకుంటాను. నా బిడ్డను భానుమూర్తి భావాలకు అనుగుణంగా పెంచి పెద్ద చేస్తాను'' స్థిరంగా అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది భవానీ.





( ఆంధ్రప్రభ అనుబంధం మహిళ 02 మార్చి 1995 సంచికలో ప్రచురించబడిన కథ )


...........

3 comments:

  1. మీరు రాసిన కధేనా? కధనం చాలా బాగుంది. భవానీ గతాన్ని సందర్భోచితంగా అక్కడక్కడా చెప్పుకొచ్చిన తీరు బాగుంది.

    ReplyDelete
  2. ప్రభాకర్ సర్ ! కధ బావుంది ముగింపు ఉత్తేజపూర్వకంగా ఉంది . మీరు కధలో చెప్పిన ఆచారాలు పట్టణాలలో కూడా పాటించేవారు ఉన్నారు .అదృష్టవశాత్తూ మా అమ్మగారు పల్లెటూరైనా వాళ్ల నాన్నమ్మ ఇటువంటివి నమ్మద్దని చెప్పేవారట.పైగా గంగా భాగీరధీ సమానురాలైన ఆవిడతోనే అమ్మమ్మ తన ఐదుగురు కూతుళ్ళ సూత్రాలు పేని కట్టించే వారట ! ఆరోజుల్లోనే అలా ఉండేవారంటే అమ్మ చెపుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది.

    ReplyDelete
  3. @ అబ్రకదబ్ర గారూ
    ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.
    నా బ్లాగులో వేరే వాళ్ళు రాసిన కథలు వేస్తే ఆ వివరం తప్పక పేర్కొంటాను.
    ఈ కథ మాత్రం నిజంగా నేను రాసిందే .
    మీరు ప్రశ్నించారు కనుక ... పత్రికలో ఆర్టిస్ట్ వేసిన చిత్రాన్ని కూడా పొందుపరిస్తే అందంగానూ , అర్ధవంతంగానూ వుంటుందనిపించింది.
    అందుకే ఇప్పుడు ఆ చిత్రాన్ని జతపరిచాను . ధన్యవాదాలు.

    @ పరిమళం గారూ
    కథ పై మీ స్పందన స్ఫూర్తిదాయకంగా వుంది.
    మీరన్నట్టు మూఢ నమ్మకాలకు పల్లె - పట్నం అనే తేడా ఏమీ వుండదు. ఆ మాటకొస్తే పల్లెల్లో కనిపించే ఆత్మీయతలు, నిజాయితీ పట్నాల్లో ఎక్కడుంటాయి. పట్నాల్లో అంతా పైనపటారమే.కదా.
    ప్రజా కవి వేమన కూడా పురుష పక్షపాతేమో "లేకపోతె పురుషులందు పుణ్య పురుషులు వేరయా " అన్నాడే తప్ప స్త్రీ ల సంగతి ప్రస్తావించ లేదు. మీ అమ్మమ్మ నిజంగా ఆదర్శ వంతురాలు. ఆరోజుల్లో అంత తెగువ విశాల భావాలు కనబరచడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. అభినందనలు.

    ReplyDelete