Monday, April 27, 2009

ప్రేమిస్తే పెళ్లవుతుందా?







ప్రేమిస్తే పెళ్లవుతుందా?...(పాతికేళ్ల కిందటి మినీ కథ) ....


''ఎక్కడికే ముస్తాబవుతున్నావు?'' జడవేసుకుంటున్న కూతుర్ని కటువుగా ప్రశ్ని�ంచింది పార్వతి.

''కాలేజీకి'' నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది సౌమ్య.

''ఏమిటా తలబిరుసు? ఇవాళ పెళ్లివస్తున్నారు, కాలేజీకి సెలవుపెట్టమని చెప్పలేదూ?!''

''....''

''ఏం మాట్లాడవేం?''

''అబ్బబ్బబ్బ... చంపకమ్మా నన్ను...! ఆ బేరగాళ్లు వచ్చేది సాయంత్రం కదా. అంతవరకూ ఊరికే ఇంట్లో కూర్చునుండటం దేనికి? సాయంత్రం త్వరగా వస్తాలే!''

''చదవేస్తే వున్న మతి పోయినట్టు... పెళ్లి చూపులకు వచ్చే వాళ్లని పట్టుకుని బేరగాళ్లంటావేమిటే?''

''కాకపోతే ఏమిటి? వస్తువుల్నో, జంతువుల్నో పరీక్షించినట్టు పరీక్షించడం... ఆతరువాత కట్నకానుకలంటూ బేరమాడటం ... ఇంతేకదా పెళ్లి చూపులంటే...''

పక్క గదిలోంచి తల్లీ కూతుళ్ల సంభాషణని వింటున్న నారాయణరావు మధ్యలో కల్పించుకుని ''పార్వతీ! అమ్మాయిని కాలేజీకి వెళ్లనివ్వు. సాయంత్రం త్వరగానే వస్తానంటోందిగా!'' అన్నాడు.

పార్వతి విసురుగా భర్తముందుకు వచ్చి ''మీరిట్లా ప్రతిదానికీ వెనకేసుకొస్తుండబట్టే అది రోజురోజుకూ మొండిగా తయారవుతోంది. ఆడపిల్లకు అణకువ నేర్పకపోతే తండ్రినేమీ అనరండీ... కన్న తల్లిని నన్నాడిపోసుకుంటారు!'' తన ఉక్రోషాన్ని వెళ్లగక్కి కోపంగా వంటింట్లోకి వెళ్లిపోయింది పార్వతి.

తండ్రికి కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోంచి బయటపడింది సౌమ్య.

సౌమ్యకి తమ ఇంటి పరిస్థితులు బాగా తెలుసు. తండ్రి రిటైరైన బడిపంతులు. ఆయన కొచ్చే పెన్షన్‌ డబ్బు, ఆయన చెప్పే టూషన్లు తప్ప వేరే ఆదాయం ఏమీ లేదు. అప్పటికే ఇద్దరు అక్కయ్యల పెళ్లిళ్లు చేసివుండటంతో వున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులూ తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకా తనూ తన చెల్లెలూ పెళ్లికెదిగి వున్నారు.

చెల్లెలికి మేనరికం వుంది కాబట్టి పెద్ద సమస్యకాదు. అయితే ఎలాగూ పెళ్లి చేసుకో బోతున్నాం కదా అని తొందరపడటంతో చెల్లెలికి నెలతప్పి తన ప్రాణం మీదకు వచ్చింది. చెల్లెలికి పెళ్లి చేయాలంటే ముందు తనకి పెళ్లి చేయాలి. అందుకే ఈ గొడవ. ఈ హడావిడి.

తనేమో తన క్లాస్‌ మేట్‌ రమేష్‌ని ప్రేమిస్తోంది. పెద్దలతో చెబుదామంటే తమ ఇద్దరి కులాలూ వేరు. పెద్దలు కులాంతర వివాహాలకి ఎప్పుడూ వ్యతిరేకమే కదా!

అందుకే చదువు పూర్తయ్యేవరకూ బయటపడకుండా ఆగాలనుకున్నారు. స్వంత కాళ్లమీద నిలబడగల ఆర్థిక స్థోమత వుంటే ఈ కులగోత్రాలూ, కట్టుబాట్లూ ఏమీ చేయలేవు.

కానీ...

చెల్లెలు చేసిన పని తన భవిష్యత్తును అయోమయంలో పడవేసింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. తను కాలేజీకి బయలుదేరింది కూడా అందుకే. వారం రోజులుగా రమేష్‌ కనిపించడం లేదు. ఇవాళైనా కనిపిస్తాడో లేదో. ఎలాగైనా తనని కలిసి అర్జంటుగా మాట్లాడాలి.

పరిపరివిధాల ఆలోచిస్తూ వెళ్తున్న సౌమ్యకి రిక్షాలో వెళ్తున్న రమేష్‌ కనిపించాడు!
వెదకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో.

రమేష్‌ పక్కన మరెవరో కూర్చుని వున్నారు. అయినా లక్ష్యపెట్టకుండా ''రమేష్‌... రమేష్‌...'' అని పిలుస్తూ రిక్షా వేపు వడివడిగా నడిచింది.

ఆమె కేకలకు రిక్షాలో కూర్చున్న ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. కొంచెం దూరం వెళ్లి ఆగింది రిక్షా. అందులోంచి రమేష్‌ ఒక్క ఉదుటున దిగి దూకుడుగా సౌమ్యవైపు వచ్చాడు .

''ఏంటి? నడిరోడ్డు మీద ఈ గావుకేకలేంటి? ఆ..'' కళ్లెర్ర జేస్తూ ఉరిమినట్టు అన్నాడతను.

అతని అకారణ కోపానికి ఒక క్షణం నిర్ఘాంతపోయింది సౌమ్య. ''అది కాదు రమేష్‌...నేనూ... నాకూ ...ఏం చెప్పాలో తోచక తత్తరపడింది.

''చాల్లే... రోడ్డు మీద ఏమిటీ న్యూసెన్స్‌. నా పక్కన కూర్చున్నది మా నాన్నగారు. రేపు సాయంత్రం పార్కులో మాట్లాడుకుందాం. ఇప్పుడేమీ యాగీ చేయకు. వస్తా...''అని వచ్చినంత దూకుడుగా వెళ్లిపోయాడు రమేష్‌.

చాలాసేపు చేష్టలుడిగిన దాన్లా రోడ్డుమీద అట్లాగే నించుండి పోయింది. ఆ తరువాత కాలేజీకి వెళ్లకుండా ఇంటిముఖం పట్టింది.

ఆ రోజు సాయంత్రం యధావిధిగా పెళ్లి చూపుల తతంగం జరిగింది.

అబ్బాయి పేరు శ్రీకాంత్‌. పట్నంలో బ్యాంకు ఆపీసర్‌గా పనిచేస్తున్నాడట. సౌమ్య నిర్లిప్తంగా చూసింది అతనివేపు. 'బాగానే వున్నాడు' అనుకుంది. కానీ ఆమె మనసంతా రమేషే మెదలసాగాడు.

శ్రీకాంత్‌కి సౌమ్య నచ్చింది. సౌమ్య నమ్మకాలకి విరుద్ధంగా కట్నకానుకలేమీ వద్దన్నాడు. పైగా పెళ్లి కూడా ఆడంబరాలు లేకుండా సింపుల్‌గా జరగాలన్నాడు. సంబంధం ఖాయమైనట్టే.

సౌమ్య తల్లిదండ్రుల సంతోషానికి అంతేలేదు.

''ఏమ్మా అబ్బాయి నీకు నచ్చినట్టేనా?'' యదాలాపంగా అడిగాడు సౌమ్య తండ్రి. ఔననీ కాదనీ స్పష్టం చేయనట్టు నిర్లిప్తంగా తల ఊపింది సౌమ్య.

ఈ సంబంధం తప్పి పోవాలని ఆమె మనసంతా తహతహలాడింది. ఈ పెళ్లి ఉచ్చులోంచి ఎలాగైనా బయటపడాలి. రమేష్‌ని కలిసి అర్జంటుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతులేని సంఘర్షణ. చివరగా ఆమెకో ఆలోచన తట్టింది. వెంటనే కలం తీసుకుని ఇలా రాసింది:

డియర్‌ ఫ్రండ్‌
సౌమ్యని వివాహం చేసుకుంటే దగా పడతావు. సౌమ్య క్యారెక్టర్‌ మంచిది కాదు. ఆమె పేరూ ఆమె క్లాస్‌మేట్‌ రమేష్‌ పేరూ కాలేజి గోడల మీదకెక్కాయి. ఆ తర్వాత మీ ఇష్టం...
ఇట్లు
మీ శ్రేయోభిలాషి

ఎవ్వరి కంటా పడకుండా పక్కింటి అబ్బాయి చేత ఆ ఆకాశరామన్న ఉత్తరాన్ని పెళ్లి చూపులు ముగించుకుని వెళ్తున్న శ్రీకాంత్‌కు అందేట్టు చేసింది. దాంతో ఇక గ,డం గడిచినట్టే షని హాయిగా ఊపిరి పీల్చుకుంది.

మర్నాడు సాయంత్రం ముందు అనుకున్నట్టుగా తనూ, రమేష్‌ తరచూ కలుసుకునే పార్క్‌కు వెళ్లి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది సౌమ్య.

కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేందుకు తను చేసిన పనిని గురించి చెప్తే అతను అర్థం చేసుకుంటాడనీ, హర్షిస్తాడనీ అనుకుంది. తాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోక తప్పదని ఒప్పించాలి. పెళ్లి చేసుకున్నా చదువు పూర్తయి ఉద్యోగం దొరికే వరకు కాపురం పెట్టకుండా ఎవరింట్లో వాళ్లు వుండేట్లు ఒప్పందం కుదుర్చుకోవాలి అని ఏవేవో ఊహించుకోసాగింది.

అప్పటికే చీకటి పడిపోయింది. పార్కులో ఎప్పుడో లైట్లు వెలిగాయి. జనం పలచబడ్డారు. ఆమెలో ఆందోళన మొదలయింది.

అంతలో పక్కన ఎవరిదో నీడ పడేసరికి ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది.

వచ్చింది రమేష్‌ కాదు, శ్రీకాంత్‌.

అదిరిపోయింది సౌమ్య.

''రమేష్‌ కోసం ఎదురు చూస్తున్నారా?'' అడిగాడు శ్రీకాంత్‌.

ఆ ప్రశ్నకి మరింత బిత్తరపోయిందామె.

''నేను రమేష్‌ ఇంటి దగ్గరనుంచే వస్తున్నాను. ఎవరో రాసిన ఆకాశ రామన్న ఉత్తరం చూసి నిజమేమిటో తెలుసుకుందామని వాళ్లింటికి వెళ్లాను. అతణ్ని కలిసి మాట్లాడాను. ఈ ఆదివారమే అతని పెళ్లి. చాలా బిజీగా వున్నాడు. ఏదో సరదాకోసం నీతో క్లోజ్‌గా వున్నాడట. కులాంతర వివాహం చేసుకుని కులభ్రష్టుణ్నయ్యే ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నాడు. నువ్విక్కడ తనకోసం వెయిట్‌ చేస్తుంటావని తనే చెప్పాడు. ఇదిగో తన పెళ్లి ఇన్విటేషన్‌ కూడా ఇచ్చాడు.'' అంటూ ఓ శుభ లేఖ అందించాడు శ్రీకాంత్‌.

వణుకుతున్న చేతుల్తో దానిని అందుకుంది సౌమ్య.

అది రమేష్‌ వెడ్డింగ్‌ కార్డే. వధూ వరుల పేర్లతో పాటు అనుమానం లేకుండా వారి ఫొటోలు కూడా అచ్చువేయబడి వున్నాయి.

ఒక్కసారి కళ్లు బైర్లు కమ్మినట్టయింది సౌమ్యకు.

తలవంచుకుని వెళ్లిపోతున్న శ్రీకాంత్‌ని కన్నీటి పొరల్లోంచి అచేతనంగా చూస్తుండిపోయింది.

....



(ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక 07-3-1986 సౌజన్యంతో)





(ఈ కథలోని ప్రధాన సంఘటన నిజంగా జరిగిందే. ఇందులోని 'సౌమ్య' నిజజీవితంలో మరిన్ని విషాద సంఘటనలు తోడై అవివాహితగా వుండిపోయింది. తన పేరూ, నా పేరూ తెలియకుండా వుండేందుకు అప్పుడు ఈ కథను ''అశాంత్‌'' అన్న పేరుతో ఆంధ్ర జ్యోతికి పంపాను. అదే పేరుతో ఇది అచ్చయింది. అశాంత్‌ అన్న కలం పేరుతో మరికొన్ని రచనలు చేశాను కానీ అవేమీ ఇప్పుడు నా దగ్గర లేవు.)

8 comments:

  1. వచ్చింది రమేష్‌ కాదు. శ్రీకాంత్‌.

    అదిరిపోయింది సౌమ్య.

    ''రమేష్‌ కోసం ఎదురు చూస్తున్నారా?'' అడిగాడు రమేష్‌.
    indulo oka mistake vundi


    ''రమేష్‌ కోసం ఎదురు చూస్తున్నారా?'' అడిగాడు శ్రీకాంత్‌.

    change this

    ReplyDelete
  2. ప్రభాకర్ సర్ ! ఎప్పటిలాగే కధ బావుంది .

    ReplyDelete
  3. సాగర్ గారూ,
    ముద్రా రాక్షసాన్ని సవరించాను. ఫన్నీ మిస్టేక్.
    ధన్యవాదాలు.

    పరిమళం గారూ
    మీకున్నూ ఎప్పటిలాగే మరో మారు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. మీ అభిప్రాయం తెలిపినందుకు 'పాలవెల్లి' పక్షాన ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఈ కథ ను నేను ఇటీవలే ఒక మాస పత్రికలో చదివాను. రచయిత పేరు మీదేనా ఇంకెవరిదైనానా అన్న విషయం నాకు గుర్తు రావటం లేదు. మీదే ఐతే పర్లేదు కానీ కాకపోతే మాత్రం ఒక సారి చూసుకోండి. ఈ కథ నాకు చాలా నచ్చింది, ఆ పుస్తకం లో చదివినప్పుడే అనుకున్నా ఎంత బాగుందో అని

    ReplyDelete
  6. లక్ష్మి గారూ
    దయచేసి ఆ మాస పత్రిక పేరు , నెల తెలియజేయండి. ఇది ఎప్పుడో 1986 లో రాసిన కథ. ఆంద్ర జ్యోతిలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎ మాస పత్రికైనా ఎలా ప్రచురిస్తుంది. బహుశా ఎవరైనా కాపీ చేసారేమో.

    ReplyDelete
  7. I'm in Delhi for the moment, and I'll search the magazines once I go back and let you know the details. But I read this story already, and I'm dure about it

    ReplyDelete
  8. థాంక్ యూ లక్ష్మి గారూ
    ఎదురుచూస్తుంటాను.

    ReplyDelete