గుజ్జన గూళ్లు
అశ్వత్థామా హతః కుంజర... అంటూ నిజంలాంటి అబద్ధం చెప్పిం తరువాత ధర్మరాజు కూడా అంత బాధపడివుండడు!
ఎవడో కోన్‌కిస్కాగాడు ఏదో వాగాడన్న ఆవేశంలో అర్థాంగిని అడవికి పంపించిన తరువాత శ్రీరామచంద్రుడు కూడా అంత కుమిలిపోయి వుండడు!!
కానీ, వీర్రాజు మాత్రం తన అనాలోచిత చర్యకి పశ్చాత్తాపంతో నిలువునా దహించుకుపోయేడు. జీవితంలో మొట్టమొదటిసారి తన మీద తనకే అసహ్యం వేసింది.
ఇంట్లో కాలు నిలవక, వికలమైన మనసుతో వీధిన పడ్డాడు. ఒక గమ్యం లేకుండా ఊరంతా తిరిగి తిరిగి చివరకి ఓ సిగరెట్ పెట్టె కొనుక్కుని పార్క్‌లో దూరాడు.
అతను సిగరెట్ మానేసి ఎనిమిదేళ్లవుతోంది!
అతని కొడుకు సూర్యం వయసు కూడా ఎనిమిదేళ్లే! సూర్యం పుట్టిన కొద్దిరోజులకే వీర్రాజు సిగరెట్‌కి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసేడు.
సిగరెట్ కాల్చిన తరువాత చేతులూ నోరూ కడుక్కోకుండా కొడుకుని ముట్టుకోనిచ్చేది కాదు అతని భార్య. ''ముందు నోరు కడుక్కుని రండి. వీడికి సిగరెట్ వాసన పడదు.'' అంటూ ఎప్పుడూ అడ్డుకునేదామె.
పెళ్లయిన కొత్తలో భర్త సిగరెట్ వ్యసనంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. అయితే, తరవాత్తరవాత అదే అ లవాటైపోయిందామెకు. కానీ, తన కొడుక్కి కూడా పసితనంలోనే ఆ వాసన అ లవాటైతే ఇంకేమైనా వుందా..! తండ్రి కాలేజీ రోజుల్లో ప్రారంభిస్తే... కొడుకు స్కూలు లెవెల్లోనే సిగరెట్ కాల్చడం మొదలు పెడతాడు. పాతికేళ్లొచ్చేసరికి వాడి సగం ఊపిరితిత్తులు పాడై పోతాయి. ఇదీ ఆమె భయం.
సిగరెట్‌కంపు కొట్టే పెదాలతో కొడుకు మొహంలో మొహం పెట్టి ముద్దాడాలంటే వీర్రాజుకు కూడా ఇష్టముండేది కాదు. ఎంత పుక్కిలించినా తన నోటినీ, శ్వాసనీ సిగరెట్ వాసన పూర్తిగా వదలనట్టే అనిపించేది ఎప్పుడూ.
సిగరెట్ పొగ ఎంత హానికరకమో ప్రతి వ్యసనపరుడికీ తెలుసు. అందులోనూ పాసివ్ స్మోకింగ్ అ లవాటు పసిపిల్లలకు ఎంత ప్రాణాంతకమో వీర్రాజుకు మరింత బాగా తెలుసు. అందుకే సిగరెట్ కాల్చినప్పుడు వాడిని దగ్గరకు తీసుకోవాలంటే గిల్టీగా వుండేది. తన దుర లవాటు వల్ల తను ఎంతో మిస్ అవుతున్నట్టనిపించేది.
దాంతో వున్నట్టుండి ఒక రోజు తాగుతున్న సిగరెట్‌ని నేలకు విసిరికొట్టి, ఏ జెర్రినో నలిపినట్టు బూటుకాలితో నలిపేసి 'ఇదే ఆఖరు సిగరెట్' అని తనకుతనే ప్రకటించుకున్నాడు.
అంతే!
మళ్లీ ఇప్పటివరకూ దాని జోలికెళ్లలేదు. ఎనిమిదేళ్ల తరువాత అతను సిగరెట్ కాల్చడం ఇదే ప్రథమం.
''వీర్రాజూ, నువ్వేదో గొప్పోడివనీ, నీకేదో ఆదర్శాలు వున్నాయనీ ఇన్నాళ్లూ భ్రమల్లో వున్నావు గానీ... నువ్వూ అందర్లాటోడివే. నీకూ దిక్కుమాలిన బలహీనతలున్నాయి...'' తన అంతరాత్మ తనని వెక్కిరిస్తున్నట్టనిపించింది. ఆ అంతరాత్మను పొగతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు పార్కులో కూచుని సిగరెట్ మీద సిగరెట్ కాల్చసాగాడు వీర్రాజు.
'కొత్తగా వచ్చిన ఆఫీసరును తలచుకుంటేనే ఒళ్లు మండిపోతుంది. తనను తానొక జమిందారుగా భావిస్తాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ బొత్తిగా తెలియదు. తన కింది ఉద్యోగులను బానిసల్లా చూస్తాడు. అతనికి కావలసింది పని కాదు అణిగిమణిగి వుండటం. చెంచాగిరి చేయని వాళ్లంతా శత్రువుల్లా కనిపిస్తారతనకి. '
తన పనేదో తను చేసుకుపోతూ ఆత్మాభిమానంతో బతకాలనుకునే మనస్తత్వం వీర్రాజుది. తమవి పరస్పర విరుద్ధ దృక్పథాలవడం వల్ల తరచూ తమ మధ్య ఘర్షణ చోటుచేసుకుంటోంది. ఆఫీసరు ఏం చేసినా చెల్లుతుంది కాబట్టి వీర్రాజే మనస్తాపానికి గురికావలసి వస్తోంది.
ఇవాళ తమ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎవరో చేసిన తప్పుకు తనను నిందించబోతే సహించలేక ఎదురు తిరిగాడు. మాటామాటా పెరిగింది. ఆఫీసునుంచి అదే చికాకుతో ఇంటికి వస్తున్న వీర్రాజుకి వాననీటిలో కేరింతలు కొడుతూ ఆడుతున్న కొడుకు కనిపించాడు. వాడి బట్టలే కాదు, పుస్తకాల సంచీ కూడా బురదకొట్టుకు పోయి వుంది. పుస్తకాలు బాగా తడిచిపాడైపోయి వుంటాయి. అదేమీ పట్టించుకోకుండా నీళ్లల్లో ఎగురుతున్నాడు వాడు.
మరొకప్పుడైతే ''ఏం పనిరా కన్నా యిది? పుస్తకాలు తడిస్తే రేపు ఎలా చదువుకుంటావు?'' అంటూ సున్నితంగా మందలించి, మట్టి దులిపి ఆ పుస్తకాల బ్యాగును భుజానికి తగిలించుకుని మరీ ఇంటికి తీసుకెళ్లేవాడు. కానీ, ఆఫీసులో జరిగిన గొడవ కారణంగా మనసంతా రగిలిపోతూ వుండటం వల్ల అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
''సూర్యం...'' గట్టిగా అరిచేడు వీర్రాజు.
ఆ అరుపునకు సూర్యం కన్నా ఇతర పిల్లలే ఎక్కువగా బెదిరిపోయారు. సూర్యం మాత్రం ఎప్పటిలా నవ్వుతూ చూశాడు. తను అంత కోపంగా అరిచినా పట్టించుకోకుండా నవ్వుతూ నించున్న కొడుకులో ఎందుకో ఒక్క క్షణం శాడిస్ట్ ఆఫీసర్ కనిపించాడు.
అంతే! మరుక్షణంలో సూర్యం చెంప ఛెళ్లుమంది.
ఆ దెబ్బకి సూర్యం అంత దూరం ఎగిరి నీళ్లలో పడ్డాడు. అంతవరకు కొద్దిగానే తడచివున్న అతని బట్టలు, పుస్తకాలు పూర్తిగా తడచిపోయాయి.
అయినా అతని కోపం తగ్గలేదు. కొడుకు చేయిపట్టుకుని విసురుగా లేపి మరి నాలుగు అంటించాడు.
ఆ దృశ్యం గుర్తుకు రాగానే వీర్రాజు మనసు వికలమైపోయింది. ''ఛిఛీ నేను మనిషిని కాను. పశువుని. ఉత్త స్కౌండ్రల్‌ని'' నూరోసారి తనని తాను తిట్టుకుంటూ జుట్టు పీక్కున్నాడు. అప్పటికి సిగరెట్ పెట్టె ఖాళీ అయిపోయింది. బాగా పొద్దు పోవడం వల్ల పార్కంతా నిర్మానుష్యంగా మారిపోయింది.
వీర్రాజు నిస్సత్తువగా లేచి తప్పదన్నుట్టు గృహోన్ముఖుడయ్యాడు.
ఇంటిముందు నిలబడి 'సూర్యం' అని పిలువబోయాడు. కానీ ఎందుకో గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. తలుపు తెరిచేది భార్యే అయినా ఎప్పుడూ కొడుకు పేరుతో పిలవడమే అ లవాటతనికి. కొడుకు ఇంట్లో లేని సమయంలో కూడా తనకి బాత్‌రూంలో ఏ సబ్బో, టవలో అవసరమైనప్పుడు సూర్యం అనే కేక వేస్తాడు. ఆ పిలుపు తననుద్దేశించేనని అతని భార్యకు తెలుసు కాబట్టి 'ఆ వస్తున్నానండీ' అంటూ వెంటనే స్పందిస్తూ వుంటుంది. ఇప్పుడు అపరాధ భావనవల్ల అతనికి కొడుకు పేరును ఉచ్ఛరించలేకపోయాడు. తలుపు మీద చేత్తో చిన్నగా శబ్దం మాత్రం చేయగలిగాడు.
ఎప్పుడూ చిరునవ్వుతో స్వాగతం పలికే తన శ్రీమతి చాలా ముభావంగా కనిపించింది.
యాంత్రికంగా బట్టలు మార్చుకుని వచ్చేసరికి టేబుల్ మీద భోజనం వడ్డించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లి మంచం మీద వాలిందామె.
ఆ మౌనం తన గాయాన్ని మరింత కెలికినట్టయింది.
''కమలా!'' అసహనంగా పిలిచాడు.
ఆమె పలకలేదు.
''నిన్నే'' తిరిగి రెట్టించేడు.
''ఉ'' సన్నగా మూలిగినట్టంది.
''నువ్వు వడ్డించుకోలేదేం?''
''.......''
''మాట్లాడవేం?''
''నేను తినేశాను!''
''ఎప్పుడు?''
''ఇందాకే!''
''ఈ అబద్ధాలు ఎప్పటినుంచి?''
మళ్లీ మౌనం.
ఆమె తినలేదని వీర్రాజుకి తెలుసు. ఆ విషయం అతనికి తెలుసని ఆమెకూ తెలుసు.
పెళ్లయి పదేళ్లు కావస్తున్నా ఆమె ఏ రోజూ భర్తకంటే ముందు ఒంటరిగా భోంచేసి ఎరగదు. ఆమె కదో సెంటిమెంటు.
ఇంట్లో భార్య ఆకలితో తన రాక కోసం ఎదురు చూస్తూ వుంటుందన్న స్పృహ లేకపోతే భర్తలు మరీ బొత్తిగా అదుపులో వుండరని చాలా మంది ఆడవాళ్ల లాగే ఆమె కూడా నమ్ముతుంది.
అయితే ఏ వ్యసనాలూ లేని వీర్రాజు మాత్రం ఎప్పుడో తప్ప ఇంటికి ఆలస్యంగా రావడం జరగదు. ఘర్షణలు లేని అన్యోన్య దాంపత్యం వాళ్లది.
''కమలా, నిన్నే అడిగిందానికి సమాధానం చెప్పవేం?'' చిరాకు పడిపోయేడు వీర్రాజు.
''నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయండి'' విసుగ్గా అంది కమల.
సూర్యాన్ని కొట్టినందుకు ఆమె అ లిగిందని అతనికి తెలుసు . కానీ తన పొరపాటును అంగీకరించాలంటే అహం అడ్డొస్తోంది.
''సూర్యం తిన్నాడా?'' ప్రశ్నించేడు.
''ఉహూ'' కనబడకుండా కన్నీరు తుడుచుకుంది కమల.
''కొంచెం తినిపించకపోయేవా?''
తన్నుకొస్తున్న దుఖాన్ని ఇక ఆపుకోలేక భోరుమందామె.
''ఎంత బలవంతం చేసినా తిన్లేదు. అ లాగే ఏడుస్తూ పడుకున్నాడు. వాడి మనసెంత గాయపడిందో, పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.''
భారంగా నిట్టూర్చాడు వీర్రాజు.
కొడుకు కప్పుకున్న దుప్పటిని నెమ్మదిగా తొలగించాడు. ఒక్కసారి షాక్ తగిలినట్టయింది. వాడి ఎడమ చెంప ఎర్రగా కందిపోయి వుంది. నాలుగు వేళ్ల అచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దెబ్బకి చెవి డయాఫ్రం కొంచెమైనా దెబ్బతిని వుంటుంది.
గుండెను ఎవరో పిండేసినట్టయింది. అంత గట్టిగా కొట్టాడా తను. అసలు వాడేమంత పెద్ద తప్పు చేశాడని. తనకి చేతులెట్లా వచ్చాయి. తనకు తాను శిక్ష విధించుకుంటున్నట్టు కసిగా తన కుడి చేతిని గట్టిగా గోడమీద చరిచాడు.
భర్త పశ్చాత్తాప ధోరణిని చూసేక అంతవరకు అతని మీదున్న కోపం పోయి జాలి కలిగింది కమలకు.
''ఏంటండీ యిది?!'' అంటూ దగ్గరకు వెళ్లి అతని చేయి పట్టుకుంది.
భార్య భుజం మీద తలవాల్చి చిన్నపిల్లాడిలా రోదించేడు వీర్రాజు.
''ఇవాళ మా ఆఫీసులో పెద్ద గొడవైంది కమలా! నేనూ మా ఆఫీసరూ మాటా మాటా అనుకున్నాం. నేను ఫూలిష్‌గా వాడి మీది కోపాన్నంతా మన బాబు మీద చూపించాను. చూడు ఎంత రాక్షసంగా కొట్టానో.''
''పోన్లెండి. జరిగిందేదో జరిగిపోయింది. వాణ్ని మీరెంత ప్రేమగా చూసుకుంటారో నాకు తెలీదా'' అనునయించింది కమల.
ఆమెకు గత సంఘటనొకటి గుర్తుకొచ్చింది. సూర్యం ఒకసారి ఇంట్లోనే క్రికెట్ ఆడబోయి టేబుల్ గడియారాన్ని బద్దలు కొట్టాడు. అది చూసి తను కోపంతో వెళ్లి వాడి వీపు మీద ఒక్క చరుపు చరిచింది. అంతే వీర్రాజు ఎంత రాద్దాంతం చేశాడో. ''వెధవ గడియారం పోతే పోయింది కొడితే తిరిగొస్తుందా?'' అంటూ పెద్ద క్లాసే తీసుకున్నాడు.
తను ఎప్పుడైనా సూర్యం బాగా అ ల్లరి చేస్తున్నాడని ఫిర్యాదు చేయబోతే మధ్యలోనే అడ్డుకుని ''అది వాళ్ల జన్మహక్కు. వాళ్లు అ ల్లరి చేస్తుంటేనే అందం. అ ల్లరి చేయడం లేదంటే ఆ పిల్లల్లో ఏదో లోపం వుందని అనుమానించాలి. పిల్లల్ని కొడితే వాళ్ల సహజ శక్తి సామర్థ్యాలు దెబ్బతింటాయి'' అంటూ ఉపన్యాసాలు యిచ్చేవాడు.
అ లాంటి భర్త ఇవాళ తనే కొడుకును అంత గట్టిగా దండించాడంటే ఏదో పెద్ద కారణమే వుండివుంటుంది అనుకుంది కమల.
భార్య ఓదార్పుతో కొంచెం కుదుటపడ్డాడు వీర్రాజు.
''భోంచేయండి'' అంది కమల.
''నా ఆకలి చచ్చిపోయింది కమలా. ఇప్పుడేం వద్దు.'' అన్నాడు.
''పోనీ సూర్యాన్ని లేపమంటారా? మీరు అడిగితే కాస్తన్నా ఎంగిలిపడతాడేమో... ముగ్గురం కలిసి తినొచ్చు'' అంది.
''వద్దు కమలా. లేపితే వాడు అన్నం తినకపోగా నిద్రకు కూడా దూరమవుతాడు.'' అన్నాడు కొడుకు పక్కన నడుం వాలుస్తూ.
''సరే మీ ఇష్టం'' అంటూ లేచి గిన్నెలన్నీ సర్దేసి, లైటార్పి వచ్చి కొడుకు అవతలి పక్కన పడుకుంది.
ఆ రాత్రి అతి భారంగా గడిచింది వాళ్లకి.
తెల్లవారిం తరువాత సూర్యం సీరియస్‌గా పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. తండ్రి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తల్లితోనూ మాట్లాడలేదు.
వీర్రాజు తన కొడుకు ప్రతి కదలికనూ గమనించసాగాడు. కొడుకును పలకరించాలంటేనే గిల్టీగా, భయంగా వుంది అతనికి.
ప్రతిరోజూ వీధి మలుపు తిరిగే వరకూ టాటా చెబుతూ వెళ్లే కొడుకు తన ఉనికినే గమనించనట్టు స్కూలుకు వెళ్లిపోవడం వీర్రాజు మనసును చివుక్కు మనిపించింది.
''ఏమండీ! ఆఫీసుకు వెళ్లరా, తాపీగా కూర్చున్నారు?'' కొడుకును స్కూలుకు పంపేక అడిగింది కమల.
''వెళ్లను కమలా, మనసేం బాగాలేదు.'' అన్నాడు వీర్రాజు.
''రేపు మరో దెబ్బలాటవుతుందేమో మీ ఆఫీసర్తో''
''అవనీ. ఈసారి అత్త మీద కోపం దుత్త మీద చూపించనులే. భయపడకు'' అన్నాడు.
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భోజనం చేసిన తరువాత స్కూలు నుంచి వచ్చే కొడుకు కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు. మూడింటికి స్కూలు అయిపోతుంది. మూడున్నర ప్రాంతంలో వాడు ఇల్లు చేరతాడు. అప్పటికి వాడి కోపం తగ్గిపోతుందా? ఉద్వేగంతో కూడిన ఎదురు చూపు...
చూస్తుండగానే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మొదలయ్యాయి. చూరునుంచి కారుతున్న నీటి చుక్కల్ని అరచేత్తో పట్టుకోసాగాడు వీర్రాజు. అతనికి తన బాల్యం గుర్తుకొచ్చింది.
వర్షమంటే తనకి చిన్నప్పటినుంచీ ఎంతిష్టమో. కానీ జలుబుచేస్తుందని అమ్మ వర్షంలోకి వెళ్ల నిచ్చేది కాదు. నాన్న ఉంటే మాత్రం ఏం కాదులే ఆడుకో అని ప్రోత్సహించేవాడు. మంచి పుస్తకాలను చించి కాగితం పడవలు చేసుకున్నా మందలించేవాడు కాదు.
క్రమ శిక్షణ మంచిదే కానీ దానిని దెబ్బలతో, తిట్లతో నేర్పకూడదు. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని మరబొమ్మల్లా మార్చకూడదు. మంచీ చెడూ వాళ్లే తెలుసుకునేట్టు చేయాలి అనేవాడు నాన్న. తనకూ అవే ఆదర్శాలు అబ్బాయి. కానీ ఎప్పుడూ లేనిది ఇవాళే ఇలా అయింది.
''పోస్ట్'' అన్న కేకతో ఇహంలోకి వచ్చాడు వీర్రాజు.
''మీకు బేరింగ్ కవర్ వుంది సార్''అన్నాడు పోస్ట్‌మాన్.
''బేరింగా ఎక్కడి నుంచి?'' ఆశ్చర్యపోతూ అడిగాడు.
''లోకలే సార్. కానీ ఫ్రం అడ్రస్ లేదు. ఎవరో మన పోస్టాఫీస్ బాక్స్‌లోనే వేశారు. తీసుకుంటారా?''
''బేరింగ్ చార్జీ ఎంత?''
''రెండ్రూపాయలు''
''సర్లే రెండ్రూపాయలేకదా. ఇటివ్వు చూద్దాం'' అంటూ కవర్ అందుకున్నాడు.
చిరునామా అస్పష్టంగా వుంది కానీ తన పేరు మాత్రం సరిగానే రాశారెవరో.
''ఎక్కడినుంచండీ లెటర్?'' అంటూ వచ్చింది కమల.
''తెలీదు'' అంటూ కవర్ చించాడు.
చేతి రాత చూడగానే అర్థమైపోయింది. లెక్కల పుస్తకంలోని గళ్ల పేజీలో పెన్సిల్ రాత, తుడుపులు కొట్టివేతలతో అస్తవ్యస్తంగా వుంది.
గబగబా చదివి స్తాణువైపోయాడు వీర్రాజు.
గాభరాపడిపోతూ భర్తచేతుల్లోంచి ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివింది కమల. ఆమె పరిస్థితీ అట్లాగే అయింది. ... ...
''వీరజు గరికి
నీ కొడుకు సూర్యం చలా మచి వడు.
బాగ చదవుతడు.
క్లాసులో అదరికంటే ఫసుటు వసత్తడు.
చాలా మచి వడు. వాల టీచర్ గుడ్ బయ్ అంటుది.
గుడ్ బయ్‌ని కొటవద్దు. తపు.
నిన నెనె వరసం కురిపిచిన. సూర్యం ఆడుకుటె నువు కొటినవు.
నకు కొపం వసుతుంది. ఇంకసారి కొటను అని చెపు.
ఇట్లు
దెవుడు.''
...
అమ్మా మన్ను తినంగ నే శిశువునో, ఆకొంటినో... అంటూ నోరు తెరచిన బాలృష్ణుడిని చూసి నిర్ఘాంతపోయిన యశోదలా వుంది కమల పరిస్థితి.
ఇద్దరి కళ్లలో దు:ఖాశ్రువులు, ఆనంద బాష్పాలు ఏకకాలంలో పొంగి పొర్లాయి.
''నా కన్నా, నా తండ్రీ నీ కెంత తెలివిరా.... నీ సున్నితమైన మనసెంత గాయపడిందిరా...''
''కమలా నేను స్కూలు వరకు వెళ్లొస్తాను. వెంటనే వాణ్ని చూడాలి.'' అంటూ రివ్వున బయటికి వెళ్లిపోయాడు వీర్రాజు.
''నేను వస్తానుండండి...'' అన్న భార్య మాటల్ని ఆ హడావిడిలో వినిపించుకోలేదు.
గబగబా ఇంటికి తాళం వేసి ఆ వెనకే తనూ బయలుదేరింది కమల.
సూర్యం స్కూల్లో లేడు...!
అసలు ఇవాళ స్కూలుకే రాలేదు...!!
వీర్రాజు గుండెలు దడదడలాడాయి. తనకు ఉత్తరం రాసి... స్కూలుకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లినట్టు? కొంపదీసి ఏదైనా అఘాయిత్యం...
నో.. అరుస్తూ బయటికి పరుగెత్తాడు. పిచ్చిగా వీథులన్నీ సర్వే చేశాడు. చివరికి నీళ్ల ట్యాంకు దగ్గర ఓ రాతి గుండుమీద దిగులుగా కూర్చుని వున్న సూర్యం కనిపించాడు.
వీర్రాజుకు ఒక్కసారి ప్రాణం లేచివచ్చినట్టయింది. ''సూర్యం బాబూ'' ఆప్యాయంగా పిలుస్తూ దగ్గరకు వెళ్లాడు.
తండ్రిని హఠాత్తుగా చూసేసరికి సూర్యానికి భయం వేసింది. వణుకుతూ లేచి నుంచున్నాడు. స్కూలు ఎగ్గొట్టి ఇక్కడ కూచున్నందుకు మళ్లీ కొడతాడేమో అని బెదిరిపోయాడు.
''భయపడకు నాన్నా. సారీ రా. నిన్ను అన్యాయంగా కొట్టాను. ఇక ఎప్పుడూ కొట్టను. దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు నాన్నా. దేవుడు నాకు ఉత్తరం రాశాడు. నిన్నెప్పుడైనా మళ్లీ కొడితే ఊరుకోనన్నాడు. నా దేవుడివి నువ్వే నాన్నా. నువ్వే నా దేవుడివి...'' అంటూ కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు వీర్రాజు.
వర్షపు జల్లులు అప్పటికే ఆగిపోయాయి.
ఆకాశంలో ఏ అదృశ్య దేవతో వేసిన రంగుల ముగ్గులా ఇంద్రధనసు వెలిసింది. అక్కడక్కడా మబ్బుతునకలు గొబ్బిళ్లలా పొందికగా వున్నాయి. బరువు దిగిన వీర్రాజు మనసులాగే వాతావరణం ఎంతో ఆహ్లాదంగా వుంది.
మరికాసేపటికి వాళ్లని వెతుక్కుంటూ కమల రొప్పుతూ అక్కడికి చేరుకుంది.
అప్పటికి తండ్రీ కొడుకులిద్దరూ తడిచిన మట్టిని కూడదీసి మహోత్సాహంగా గుజ్జన గూళ్లు కడుతున్నారు.
ఇద్దరి బట్టలూ మట్టి కొట్టుకుని బురదబురదగా మారి వున్నాయి.
వాళ్లని ఆస్థితిలో చూసిన కమల తేలికపడ్డ మనసుతో గుండెల మీద చేయి వేసుకుని తృప్తిగా నిట్టూర్చింది.
...
(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక 28-9-1988 సౌజన్యంతో)
ప్రభాకర్ సర్ ! చాలా రోజుల తర్వాత ....మీ గుజ్జన గూళ్ళు బావుందండీ !
ReplyDeleteథాంక్సండి పరిమళం గారూ !
ReplyDelete