Saturday, January 10, 2009

డాడీ... నాకో పిస్తోల్‌ కావాలి! ....



డాడీ... నాకో పిస్తోల్‌ కావాలి!

ఎగ్జిబిషన్‌ నుంచి బయటపడ్డాం!

ఏమీ కొన్లేదు - లోపలికెళ్ళేందుకు అవసరమైన టికెట్లు తప్ప!!

మా ఆవిడ మౌనంగా వుంది. ఆ మౌనంలో ఏ భావమూ లేదు. అదంతే. 'ఫేస్‌ ఈజ్‌ ద ఇండెక్స్‌ ఆఫ్‌ మైండ్‌' అన్న సామెతకు అతీతమైన వదనం ఆమెది.

అదీ ఒకందుకు మంచిదే అయింది. లేకపోతే పెళ్లయిన ఈ ఎనిమిదేళ్లలో నేను ఎన్నిసార్లు అసహనంతో జుట్టు పీక్కోవలసి వచ్చేదో!

ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది మా ఆవిడ ముఖం గురించికాదు. మా పెద్దబ్బాయి నిశాంత్‌ గురించి! మా ఆవిడ గురించి ఇవాళ కొత్తగా ఆలోచించవలసిందేమీ లేదు. మా వైవాహిక జీవితం యాంత్రికంగా తయారై చాలాకాలమే అయింది.

అసలామెకు ఈరోజు ఎగ్జిబిషన్‌కు రావడమే ఇష్టంలేదు.
''ఏం వుంటుంది ఎగ్జిబిషన్‌లో? కిక్కిరిసిన షాపులూ, ఇసకపోస్తే రాలనంత జనం, దుమ్మూ ధూళీ గోల తప్ప! మనమేమైనా కొనేదుందా చచ్చేదుందా! ఖర్చు పెట్టే స్థోమత లేనప్పుడు అదేదో తద్దినంలా ప్రతియేడూ ఎందుకు వెళ్లడం ఎగ్జిబిషన్‌కు?'' అంది ముందే.

అయినా నేనే బలవంతం చేశాను. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య వుండటం కంటే అట్లా ఊరికే వెళ్లొస్తే పిల్లలకైనా కాస్త రిలీఫ్‌గా, సరదాగా వుంటుంది కదా అని నా ఉద్దేశం. ఏం కొన్నా కొనక పోయినా ఊరికే చూసొస్తే ఏం పోతుంది?

సరే మధ్య మా ఆవిడ గొడవెందుకులెండి. మా పెద్దబ్బాయి నిశాంత్‌ ఎగ్జిబిషన్‌కు బయల్దేరేముందు ఎంత ఉత్సాహంగా కనిపించాడో, అందులోంచి బయటికొచ్చేటప్పుడు అంత డీలా పడిపోయాడు.

అసలు వాడి మొహం వంక చూడాలంటేనే భయంగా వుంది నాకు. ఫేస్‌ రీడింగ్‌ నేర్చుకోడానికి పిల్లల మొహాలెంత అనువైనవో! నేను వాడు కోరిన చిన్న కోరికను తీర్చలేదనీ...నమ్మించి తనని మోసం చేశాననీ వాడి అంతరంగం ఆక్రోశిస్తోంది!

నిజంగా వాడు కోరింది ఏమంత పెద్ద కోరికేం కాదు.

''డాడీ! నాకో పిస్తోల్‌ కొనివ్వవా?'' అన్నాడు.

కొత్తగా ఇవ్వాళ కాదు, ఎప్పుడో రెండు మూడు నెలలకిందటి నుంచీ అడుగుతున్నాడు.

''ఎగ్జిబిషన్‌ వస్తుంది కదా బాబూ, అప్పుడు కొనిస్తాలే! అందులో ఆయితే బోలెడు వెరైటీలుంటాయి. చక్కగా మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. మామూలు షాపుల్లో అయితే ఒకటి రెండు రకాలే వుంటాయి. అవైనా అంత బాగోవు!'' అంటూ ఏదో ఒకటి చెప్తూ ఇన్నాళ్లుగా వాడి కోరికను వాయిదా వేస్తూ వస్తున్నాను.

తీరా ఎగ్జిబిషన్‌ వచ్చాక కూడా వాడి చిన్న కోరికను తీర్చలేకపోయాను.
దాంతో వాడి ఆక్రోశం తారాస్థాయికి చేరుకుంది.

వాస్తవానికి ఏ పదో పదిహేనో అయితే కొందామనే అనుకున్నాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఇరవై రూపాయలు జేబులో వేసుకునే బయల్దేరాను.
కానీ వాడికి నచ్చిన పిస్తోలు ధర డెబ్భై రూపాయలని నా గుండె ఠారు మంది.

''ఇంకోసారి వచ్చినప్పుడు కొందాంలేరా'' అంటే ఎందుకు వింటాడు. వినడు. విన్లేదు. ఆ క్షణం నుంచీ అ లక.

వాడికి తెలుసు ఏడాదికి ఒకసారి ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లడమే గొప్ప. రెండుసార్లు వెళ్లడం అనేది జరగనిపని. అథవా వెళ్లినా ఇప్పుడు లేని డబ్బు అప్పుడెక్కడినుంచి వస్తుంది?

జనంలో ఎక్కడ తప్పిపోతాడో అని వాడి చేయి పట్టుకో బోతే విదిలించుకుంటాడు...భుజం మీద చేయివేస్తే విసుక్కుంటాడు... దూరదూరంగా నడుస్తాడు.

నేను ఆడినమాట తప్పానన్న ఆక్రోశం తప్పితే... నాబోటి సగటు తండ్రి ఆవేదనా, ఆర్థిక ఇబ్బందులూ వాడికి ఎలా అర్థమవుతాయి!?
నిజం చెప్పాలంటే వాడికంటే నా మనసే ఎక్కువగా గాయపడింది.

కన్నకొడుకు నోరువిప్పి అడిగిన అతి చిన్న కోరికను కూడా తీర్చలేని నా దౌర్భాగ్య స్థితికి నామీద నాకే జాలేసింది. నామీద నాకే వెగటు కలిగింది. కానీ కొన్ని బతుకులింతే అని సర్దుకుపోక చేయగలిగిందేముంది?!

ఇక మా చిన్నబ్బాయి నిఖిల్‌... వాడికింకా నాలుగేళ్లు నిండలేదు. ఎగ్జిబిషన్‌లో వున్నంత సేపూ కనపడ్డ ప్రతీదీ కావాలంటూ మారాం చేశాడు. జెయింట్‌ వీల్‌ ఎక్కుదామనీ, బుల్లి ట్రైన్‌లో తిరుగుదామనీ ఒకటే గోలచేశాడు. వాటి ముందేమో పొడగాటి క్యూలు. అదీకాక అప్పటికే నాలో ఆసక్తి అఃతరించింది. ఎలాగోలా వాడి దృష్టిని మళ్ళిస్తూ ఎగ్జిబిషన్‌ బయటపడ్డాం.

ఎగ్జిబిషన్‌ లోపల ఎంత సందడిగా వుందో బయట అంతకంటే ఎక్కువ గోలగా వుంది. చిల్లర వర్తకులు ''ఏక్‌ రూప్యా ... దో రూప్యా...'' అంటూ నీటి బంతుల్ని, గాలి బుడగల్నీ, టిక్‌ టిక్‌లనీ వచ్చే పోయే జనం మొహంలో పెట్టి మరీ అమ్ముకుంటున్నారు.

సరే మేం కూడా ఎగ్జిబిషన్‌ చూసొచ్చాం అని నలుగురికి చాటుకునేందుకు వీలుగా నేను రెండు ''టిక్‌ టిక్‌''లు కొన్నాను. దానికే మా చిన్నాడు ఎంతో పొంగిపోయాడు.

రెండో టిక్‌ టిక్‌ని మా పెద్దాడికి ఇవ్వబోతే వాడు దాన్ని కోపంతో విసిరికొట్టాడు. అది ఎక్కడో జనం కాళ్లకింద పడి నలిగిపోయింది.

నాలో ఒక్కసారిగా ఆగ్రహం, అసహనం పెల్లుబికాయి. కానీ వాటిన లోలోనే అణిచేసుకున్నాను.

మొత్తం మీద మా విహార యాత్రని ఆవిధంగా ముగించుకుని సిటీ బస్సులో వేలాడుతూ ఇల్లు చేరాం.

ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే మా పెద్దాడు రెండు చెప్పుల్నీ రెండు వైపులకు గిరాటేసి, గబగబా వెళ్లి మంచమెక్కి, చేతుల్లో మొహం దాచుకుని బోర్లా పడుకున్నాడు.

కొంచెం అన్నం తిని పడుకోరా అని నేనూ, మా ఆవిడా ఎంత బతిమిలాడినా ససేమిరా వినిపించుకోలేదు.
నేను హతాషుణ్నయిపోయాను. ఏం చేయాలో తోచక కుర్చీలో జారగిలపడ్డాను.
ఈలోగా మా ఆవిడ చిన్నాడిని చంకనేసుకుని అన్నం తినిపించింది. బాగా అ లసిపోయాడేమో తినగానే మంచమెక్కి నిద్రలోకి జారుకున్నాడు.

ఇల్లంతా నిశ్శబ్దంగా తయారైంది.
మా ఆవిడ నా ఎదుటికొచ్చి అటెన్షన్‌లో నిలబడి ''భోజనం వడ్డించమంటారా?'' అంది.
నేను ఒక్క క్షణం ఆమె కళ్లల్లోకి సూటిగా చూసి '' వాడు ఆకలితో పడుకున్నా నీకు తినాలనిపిస్తోందా?!'' అన్నాను.

అంతే...

మారుమాట్లాడకుండా సీరియస్‌గా వెళ్లి చిన్నాడి పక్కన తనూ ముసుగుతన్ని పడుకుంది.

నా మనసు చివుక్కు మంది.

ఆమె తరహాయే అంత. మనసు ఆవేదనతో తల్లడిల్లుతున్నప్పుడు కాస్త అనునయించడం కానీ, సానుభూతి చూపడం కానీ వుండదు.

డబ్బునే కాదు మాటల్ని కూడా మహా పొదుపుగా వాడుతుంది. ఆ పొదుపు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.

ఆ రాత్రి నేను భయంకరమైన ఒంటరితనంలో కూరుకుపోయాను. భార్యాపిల్లలు వుండి కూడా ఏకాకిలా ఫీలయ్యే పరిస్థితి ఎంత దుర్భరంగా వుంటుందో అనుభవిస్తే కానీ తెలియదు.

ఒక్కసారి నా బాల్యం గుర్తుకొచ్చింది.

మా నాన్న ఓ పెద్ద బట్టల మిల్లులో చిన్న కార్మికుడు. మా అమ్మ బట్టలు కుడుతూ నాన్నకు చేదోడు వాదోడుగా వుండేది. వాళ్లు ఏమాత్రం చదువుకోకపోయినా నన్ను మాత్రం బాగా చదివించాలని తాపత్రయపడేవారు. అందుకే తమ ఆర్థిక స్థోమతను లెక్కచేయకుండా నన్ను ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించారు. ప్రైవేటు స్కూల్లో అయితే పాఠాలు బాగా చెబుతారనీ, చదువు బాగా అబ్బుతుందనీ వాళ్ల ఆశ.

ఆ స్కూల్లో నూటికి తొంభైమంది పిల్లలు డబ్బున్న కుటుంబాలనుంచి వచ్చినవాళ్లే.
అదృష్టవశాత్తూ అందరూ ఒకే యూనిఫాం ధరించాలి కాబట్టి వేషంలో ఆ తేడా తెలిసేది కాదు.

కానీ ఇంట్రవెల్లో, లంచ్‌ టైంలో వాళ్లు బయటికెళ్లి ఐస్‌క్రీంలూ, చాక్లెట్లు కొనుక్కుని తింటున్నప్పుడు, తండ్రుల స్కూటర్ల మీదో, ప్రత్యేక రిక్షాల్లోన్నో వెళ్తున్నప్పుడు తన బీదరికం వెల్లడయ్యేది.

నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఇంటి నుంచి స్కూలుకు కాలినడకన వచ్చేవాడు తను. పుస్తకాలు పెట్టుకునేందుకు సరైన బ్యాగు కూడా వుండేదికాదు. ఆలస్యమైపోతుందని వేగంగా నడిచినప్పుడు ఒకోసారి పుస్తకాలు రోడ్డుమీద పడిపోయేవి. స్లిప్పర్లు తరచూ తెగిపోతూ మరింత ఇబ్బంది పెడ్తుండేవి.

ఎందుకో చిన్నప్పటినుంచీ డబ్బున్నవాళ్లంటే ఈర్ష్యగా వుండేది. అదేసమయంలో తమకు కూడా బాగా డబ్బుంటే ఎంతబాగుండేదో అన్న దురాశా వుండేది.

దీపావళి పండుగప్పుడు డబ్బున్న వాళ్లకీ డబ్బు లేనివాళ్లకీ మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపించేది.

నాన్న ఏదో నామకార్థం ఒకటి రెండు కాకరపువ్వొత్తుల డబ్బాలు, కాసిన్ని పిస్తోలు పువ్వులు కొనుక్కొచ్చి మమ అనిపించేవాడు. తనకు మాత్రం చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, మతాబులు, బాంబులు కాల్చాలని ఎంతో ఉబలాటంగా వుండేది.

ఎప్పుడైనా నాన్నని అడిగితే ''ఎందుకురా డబ్బు దండగ'' అంటూ నిరుత్సాహపరిచేవాడు. తను మొహం మాడ్చుకు కూచుంటే ''పదరా అట్లా వెళ్లొద్దాం.'' అంటూ బయటకు తీసుకెళ్లేవాడు.

తమ ఇంటి దగ్గర్లోనే వున్న ఓ డబ్బున్న కుటుంబం దీపావళికి వేల రూపాయల టపాకాయలు కాల్చేది. వాళ్ల ఇంటి దగ్గర నిల్చోబెట్టి వాళ్లు ఓ చిచ్చుబుడ్డి అంటించగానే...నాన్న ''ఐదు రూపాయలు తుస్సు..'' అనేవాడు. ఓ బాంబు పేల్చగానే ''నాలుగు రూపాయలు ఢాం'' అని వ్యాఖ్యానిస్తూ నవ్వించేవాడు. ఎవరు కాలిస్తే ఏమిటి చూసేది అదే వెలుతురు, వినేది అదే శబ్దం. ఆమాత్రానికి డబ్బులు తగలెయ్యడం దేనికి అని ఆయన ఉద్దేశం.

కొందరికి డబ్బు వుండటానికీ, ఎందరికో డబ్బు లేకపోవడానికీ కారణం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడేదికాదు. అయితే ఎంతో మంది బాగా డబ్బున్న వాళ్ల పిల్లలకంటే చదువులో ముందుండటం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా గొప్పగా అనిపించేది.

అప్పట్లో పాఠశాలల్లో ఒక చిత్రమైన సాంప్రదాయం వుండేది. ప్రతి పిరియెడ్‌లో టీచర్లు ముందుగా అంతకు ముందురోజు చెప్పిన పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. సమాధానాలు చెప్పని విద్యార్థులను నించోబెట్టేవారు. సమాధానం చెప్పిన విద్యార్థిచేత వాళ్లకి చెంపదెబ్బలు కొట్టించేవారు.

తను ప్రతి ప్రశ్నకు ఠకీమని జవాబు చెప్పేవాడు. ఆ తరువాత ఉత్సాహంగా ఎడమ చేత్తో ముక్కు పట్టుకుని కుడిచేత్తో ఒక్కొక్కరి చెంపలు వాయిస్తూ వెళ్లేవాడు. నిజం చెప్పాలంటే ఆ అవకాశం కోసమే తను శ్రద్ధగా ఏరోజు పాఠం ఆరోజు చదివేవాడు. ఆ చర్య తనకు వెర్రి ఆనందాన్ని, ఎనలేని సంతృప్తిని యిచ్చేది. ''చదవడం చాతకాదు కానీ డబ్బులు తేరగా వచ్చాయని ఇంట్రవెల్లో ఐస్‌క్రీంలు, చాక్లెట్టు తెగ మెక్కుతారా'' అని మనసులోనే అనుకుంటూ ఒక్కో చెంప వాయిస్తుంటే ప్రపంచంలో తనను మించిన ధనవంతుడు లేడనిపించేది.

నాకు ఇష్టమైనవాడి చెంపమీద మెల్లిగానూ, ఇష్టంలేనివాడి చెంపమీద గట్టిగానూ కొడుతుండేవాణ్ని. ఒకసారి ఒకడి చెంప మీద ఈడ్చి కొడితే ధడేలుమని కిందపడిపోయాడు. చెంప మీద ఐదువేళ్ళూ అచ్చుతేలాయి. వాడసలే ఊళ్లో ఎంతో పేరున్న బడా వ్యాపారవేత్త కొడుకు. దాంతో టీచర్‌ బెంబేలు పడిపోయాడు. అంత గట్టిగా కొడతావా అంటు నన్ను చితకబాదాడు. ఇక ఆరోజు నుంచి మా క్లాసులో ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పారు.

మా పెద్దబ్బాయి నిద్రలో కలవరిస్తుంటే నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను. వాడు నిద్రలోనే మొహం చిట్లించి ''నా కేమొద్దు...నాకేమొద్దు ఫో..''అంటున్నాడు.

బహుశ ఎగ్జిబిషన్‌లో డెబ్భై రూపాయల పిస్తోలుకు బదులు అర్థ రూపాయి 'టిక్‌ టిక్‌' కొనిచ్చిన సందర్భం గుర్తొచ్చి వుంటుంది.

నేను కుర్చీలోంచి లేచివెళ్లి నెమ్మదిగా వాడి పక్కన పడుకున్నాను. వాడి వీపు మీద ఆప్యాయంగా నిమిరాను. వాడు లేక లేక కోరిన చిన్న కోరిక తీర్చలేకపోయిన నా నిస్సహాయ స్థితికి కుమిలిపోతూ కళ్లు మూసుకున్నాను.

పిస్తోలు మీద వాడికింత మోజు ఏర్పడటం వెనక బలమైన కారణమే వుంది.

మేం అద్దెకున్న ఇంట్లో నాలుగైదు వాటాలున్నాయి. ఒక్కో వాటాలో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలున్నారు. తీరిక సమయాల్లో వాళ్లంతా కలిసి ఏ బంతాటో, దాగుడుమూతలో ఆడుకుంటుంటారు. అయితే మూన్నెళ్ల కిందట మా ఇంటి యజమాని తన కొడుక్కి ఓ ఆటొమేటిక్‌ గన్‌ ఏదో కొనిచ్చాడు. దాంతో వాడు పెద్ద పోలీసు ఆఫీసరో, ఆర్మీ కమాండరో అయినట్టు పోజుకొట్టడం, మిగతా పిల్లల్ని దొంగలు, శతృవులు అన్నట్టు చూడటం మొదలెట్టాడు. తన గన్‌ను ఎవరినీ కనీసం తాకనివ్వడం లేదు. దాంతో సహజంగానే చాలా మంది పిల్లలకి తమకు కూడా అట్లాంటి గన్నో పిస్తోలో వుంటే బాగుండునన్న కోరిక కలిగింది.

ఆటలో ఎప్పుడూ దొంగ పాత్రనే పోషించాలంటే మావాడికి అవమానంగా వుంది! మరి పోలీసాఫీసర్‌ పాత్ర వేయాలంటేే సొంతంగా పిస్తోలు సమకూర్చుకోవాలి!! అక్కడినుంచి వాడికి పిస్తోలు మీద యావ మళ్లింది.

మా ఇంటి యజమానికేం తక్కువ. తల్లిదండ్రులు కట్టిచ్చిన లంకంత కొంపమీద బోలెడు ఆద్దెలొస్తాయి. ఏ కష్టం చేయకుండా కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేస్తున్నాడు. ఇవాళ తన కొడుక్కి పిస్తోలు కొనిచ్చాడు రేపు మరింకేదైనా కొనివ్వగలడు..

కానీ, చాలీ చాలని జీతంతో బతుకుబండిని లాగడమే కష్టమైపోతున్న నాకు అదెలా సాధ్యం. అతన్తో నేనెలా పోటీ పడగలను? ఈ విషయాన్ని ఆ పసి హృదయానికి అర్థం అయ్యేట్టు చెప్పడమెలా?!

మా నాన్న నా కంటే మరీ తక్కువ జీతంతో మమ్మల్నందరినీ ఎలా పెంచి పెద్ద చేశాడా అని ఒకోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆరోజు ఆయన ఎలాగోలా చదివించబట్టే ఈరోజు నాకు ఈ మాత్రం గుమస్తా ఉద్యోగమైనా దొరికింది.

ఏమాత్రం అక్షరజ్ఞానం లేని నాన్న తనని డిగ్రీ వరకు చదివిస్తే తను పిల్లల్ని కనీసం ఏ పోస్ట్‌ గ్రాడ్యుయేషనో, ఇంజనీరింగో చదివించకపోతే నా బతుక్కి అర్థం వుండదుకదా.

ఈ ఆలోచనతోనే నేను నా పిల్లల్ని నా స్థోమతకు మించి పేరున్న ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చేర్పించాను.

అయితే నేను చదువుకున్నప్పటి చదువులకీ ఇప్పటి చదవులకీ మధ్య ఎంతో తేడా వుంది. అప్పుడు ఇంతలా డొనేషన్లు, ఫీజుల, పుస్తకాల ఖర్చు లేదు. ఐదేళ్లు నిండిన తరువాతే పిల్లలు బడి మొహం చూసేవారు. కానీ ఇప్పుడు నర్సరీలు, ఎల్‌కేజీలూ, యూకేజీలూ అంటూ మూడేళ్ల వయసులోనే బడికి పంపాలి. వందలకు వందల ఫీజులుకట్టాలి.

అసలు ఆ రోజుల్లో మా ఇంట్లో రేడియో కూడా వుండేది కాదు!

ఇంట్లో అందరం నేలమీద పడుకునేవాళ్లం! ఏ ఫర్నీచరూ లేక ఇల్లంతా బోసిగా వుండేది.

అయినా అందరం ఎప్పుడూ సంతోషంగా వుండేవాళ్లం. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినిపిస్తూ వుండేవి.
కానీ, ఇప్పుడు...

మా ఇంట్లో ఒక్క రేడియోనే కాదు పెద్ద టూ ఇన్‌ వన్‌ వుంది. టీవీ వుంది. మిక్సీ వుంది. గ్యాస్‌ స్టౌ వుంది. ఫ్రిజ్‌ వుంది. డబుల్‌ కాట్‌ మంచాలున్నాయి. ఇవన్నీ ఎవరో పెడితే తేరగా వచ్చినవి కావు. పొదుపు చేసి, లోన్లు తీసి, వాయిదాల పద్ధతులు పాటించి, సొంతంగా... ఒక్కటొక్కటిగా కొనుక్కున్నవి. ఈమాత్రం లేకపోతే ఈ రోజుల్లో గుమస్తా బతుక్కి విలువుండదు.

ఇన్ని వున్నా జీవితంలో ఆనాటి సంతోషం మాత్రం మచ్చుకు కూడా కనిపించదు. ఎప్పుడూ దిగులూ, భారమైన ఆలోచనలే.

ఆర్థికంగా చూస్తే కార్మికుడికీ గుమాస్తాకీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. కానీ మానసికంగా మాత్రం కార్మికుడు కింది తరగతికిందకూ, గుమస్తా మధ్యతరగతి కిందకూ వస్తారు. వైట్‌ కాలర్‌ ఉద్యోగం కనుక పైన పటారం లోన లొటారం ఎక్కువ.

అట్లా అని నేనేమీ వృధా ఖర్చులు చేయను. నా జీతాన్ని మూడు భాగాలు చేస్తే ఒక భాగం ఇంటి అద్దెకీ, రెండో భాగం పిల్లల చదువులకీ పోతాయి. మూడోభాగంతో ఇల్లు గడుపుకోవాలి.

ఛిఛిఛీ...

ఒక చిన్న పిస్తోలు కొనడానికి ఇంత తర్జన బర్జనా?!

ఒక్కసారి నామీద నాకే అసహ్యం కలిగింది.

''నో...! రేపు ఎలాగైనా పిస్తోలు కొనాల్సిందే. ఇంకా తాత్సారం చేసి ఈ పసి మనసును మరింత గాయపర్చను'' అని దృఢంగా తీర్మానించుకున్నాను. అప్పుడు గానీ నా కంటి మీద కునుకు రాలేదు.

అయితే, తెల్లవారిన తరువాత మళ్లీ నాలో ఊగిసలాట మొదలయింది.

''సరే ఇప్పుడు పిస్తోలు కొంటాను. డెబ్భై కానీ వంద కానీ కొని పారేస్తాను! మరి ఇంతటితో వీడు ఆగిపోతాడా? రేపు ఇంకెవడో ఇంకేదో కొన్నాడని అదీ కొనివ్వమంటే...?! చదువు మీద కంటే ఈ షోకుల మీద మోజు పెరిగిపోతే...?! అప్పుడు వీడి భవిష్యత్తు ఏమైపోతుంది...?!''

అంతే సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

ఇదిలా వుంటే ఎగ్జిబిషన్‌కు వెళ్లొచ్చిన మర్నాటినుంచీ మా వాడి ప్రవర్తనలో ఏదో మార్పొచ్చింది.

చాలా ముభావంగా వుంటున్నాడు. ఆడుకోడానికి అస్సలు వెళ్లడం లేదు.. పిస్తోలు మాట మళ్లీ ఎత్తలేదు. మా ఇంటి యజమాని కొడుకు కిటికీలోంచి తొంగి చూస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తూ, చివరికి తన గన్‌ ఇస్తాను రారా అన్నప్పటికీ స్పందించడం లేదు.

వాడి పరిస్థితి చూస్తే నాకే చాలా జాలేసింది.


ఓ రోజు వాడితో అన్నాను ''బాబూ నిశాంత్‌! పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా నాన్నా! ముందు బాగా చదువు! నువ్వు ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నావంటే ఈసారి తప్పకుండా పిస్తోలు కొనిస్తాను. నవీన్‌ వాళ్ల పిస్తోలు కంటే మంచిది, ఖరీదైనది కొనిస్తాను. దాంతో వేసవి సెలవల్లో హాయిగా ఆడుకోవచ్చు. ఊరికే అనడం లేదురా ఈసారి నిజంగా కొంటాను. గాడ్‌ ప్రామిస్‌. సరేనా?''

''సరే డాడీ!'' అంటూ తల ఊపాడు వాడు.

వాడి మొహంలో కనిపించిన ప్రసన్నత నాకు చాలా రిలీఫ్‌ నిచ్చింది. వాడు నన్ను అర్థం చేసుకున్నాడు, నా మాటను నమ్మాడు. నా సమస్యకొక పరిష్కారం కూడా దొరికినట్టనిపించింది. ఇకనుంచీ వాడు ఏది కోరినా చదువుతో ముడిపెట్టాలి. దాని వల్ల వాడికి చదువుమీద మరింత శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలై పోగానే ఫస్ట్‌ ర్యాంకు సెకండ్‌ ర్యాంక్‌తో నిమిత్తం లేకుండా ఈసారి వాడికి ఖచ్చితంగా పిస్తోలు కొనివ్వాలని తీర్మానించుకున్నాను. మనసులోనే దానికి బడ్జెట్‌ కెటాయించేశాను.

రోజులు మామూలుగా దొర్లసాగాయి.

వాడు రోజూ సీరియస్‌గా చదువుకుంటున్నాడు.

పరీక్షలు అయిపోయాయి. రిజల్ట్స్‌ కూడా వచ్చేశాయి. వాడు నిజంగానే ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చాడు.

నేనా రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చీ రాగానే ''డాడీ, నేను స్కూల్‌ ఫస్టొచ్చాను'' అంటూ గర్వంగా ప్రోగ్రస్‌ రిపోర్ట్‌ అందించాడు.

మార్కులు చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలిగింది. అన్ని సబ్జెక్టుల్లో తొంభైలపైనే, లెక్కల్లో అయితే వందకు వంద! ''వెరీ గుడ్‌ ... శభాష్‌...'' అంటూ వాడి భుజం తట్టాను.

అప్పటికే వాడు నా వంక రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. వాడి రెండు కళ్లల్లో రెండు పిస్తోళ్లు మెరుస్తూ కనిపించాయి నాకు!

ఒక్కసారి నా గుండె గతుక్కు మంది!

అది నెలాఖరు కాకపోతే సత్యప్రమాణంగా వాడికి అప్పటి కప్పుడు పిస్తోలు కొనిచ్చేవాణ్నే. కానీ నెలాఖరవడంతో ఇంట్లో చేతి ఖర్చులకు కూడా ఇబ్బందిగా వుంది. అప్పటికే రెండు మూడు చోట్ల చిన్న చిన్న అప్పులు కూడా చేశాను. ఎట్లాగబ్బా అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను. షరా మామూలే. భావరహితమైన మొహంపెట్టి తనో నిమిత్త మాత్రురాలినన్నట్టు నిలబడివుంది. కష్టంలో వున్నప్పుడు కనీసం చిన్న మాట సాయమైనా చేయొచ్చు కదా...ఛ ఛ అనుకుంటూ-

గత్యంతరం లేక ''చూడు నాన్నా! నాల్రోజుల్లో ఫస్ట్‌...నాకు జీతం దొరుకుతుంది. ఆరోజు తప్పకుండా నీకు పిస్తోలు కొనిస్తాను సరేనా?'' అన్నాను. వాడు సరే అన్నట్టు తల ఊపాడు. పెద్దగా డిజప్పాయింట్‌ అయినట్టు కనిపించలేదు. వాడికి మరింత భరోసా కల్పించేందుకు నేను మా ఆవిడతో ''ఇదిగో ఫస్ట్‌నాడు సాయంత్రం నిశాంత్‌ని తీసుకుని నువ్వు మా ఆఫీస్‌ దగ్గరకు వచ్చేసెయ్‌. మనం అట్నుంచి అటే కోఠీకి వెళ్దాం. ఏమంటావు?'' అన్నాను. అప్పటికీ ఆవిడ నోరు విప్పకుండా సరేనని తల మాత్రం ఊపింది. అదే మహాభాగ్యం అనుకున్నాను.
''డాడీ రేపు మా స్కూల్‌ డే! పేరెంట్స్‌ని తప్పకుండా తీసుకుని రావాలన్నారు మా క్లాస్‌ టీచర్‌. ఇదిగో ఇన్విటేషన్‌ కూడా ఇచ్చారు'' అంటూ కార్డు అందించాడు.

వాడి చేతుల్లోంచి ఇన్విటేషన్‌ కార్డు అందుకున్నాను.

స్కూల్‌ డేకి మేం సకుటుంబంగా తరలి వెళ్లాం.

ఆడిటోరియం అంతా పిల్లలతో పెద్దలతో కళకళలాడుతోంది. ముందు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, జరిగాయి. ఆ తరువాత సభా కార్యక్రమం మొదలయింది. ఆటలపోటీల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో విజేతలకు, క్లాసులో ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంకులు తెచ్చుకున్న పిల్లలకు సర్టిఫికెట్లతో పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు.

పిల్లలంతా పేర్లు పిలవగానే ఉరుకులు పరుగులమీద వెళ్లి స్టేజి ఎక్కి బహుమతులు తెచ్చుకుంటున్నారు. అంతా కోలాహలంగా వుంది.
ఉన్నట్టుండి '' మాస్టర్‌ నిశాంత్‌! సెకండ్‌ క్లాస్‌... ఫస్ట్‌ ర్యాంక్‌ '' అంటూ మావాడి పేరు మైకులో ప్రతిధ్వనించింది.

అంతవరకూ మా పక్కన స్తబ్దుగా కూచున్న వాడల్లా దిగ్గున లేచి స్టేజివైపు చకచకా పరుగులాంటి నడకతో వెళ్లాడు. మాకు చాలా గర్వంగా అనిపించింది. వాడు సర్టిఫికెట్‌ని, బహుమతిని అందుకుంటుంటే అందరితో పాటు నేనూ మా ఆవిడా చాలా గట్టిగా చప్పట్లు కొట్టాం. మా చిన్నాడైతే వాళ్ల అన్నయ్య సీటు దగ్గరకు తిరిగి వచ్చేంత వరకు రెండు చేతులూ ఆడిస్తూనే వున్నాడు.

నిశాంత్‌ తనకొచ్చిన బహుమతిని వాళ్ల అమ్మకీ, సర్టిఫికెట్‌ని నాకూ అందించాడు. నేను సంతోషంగా వాడితో కరచాలనం చేశాను. వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను.

ఇంటికి చేరీ చేరగానే అందరం ఆదుర్దాగా బహుమతి ఏమై వుంటుందా అని గబగబా బాక్స్‌ని ఓపెన్‌ చేశాం.

దాన్ని చూసే సరికి నాకు ఒక్కసారి షాక్‌ తగిలినట్టయింది!

మా బాబు ఎన్నాళ్లుగానో కోరుతున్న బొమ్మ పిస్తోలు!!

''హాయ్‌... డాడీ...పిస్తోలు...!'' అనందం పట్టలేక గట్టిగా కేక వేశాడు నిశాంత్‌. ''సరిగ్గా నాకు ఇలాంటిదే కావాలనుకున్నాను..'' అన్నాడు.


నాకంతా 'కలయో వైష్ణవ మాయయో..' అన్నట్టుగా వుంది. నేను ఆ థ్రిల్‌ నుంచి తేరుకోకముందే... మా చిన్నాడు హఠాత్తుగా ఆ పిస్తోలును అందుకుని ''అమ్మా... నాది..' అంటూ లోపలికి పరుగు తీశాడు.


''ఒరేయ్‌ నిఖిల్‌! ఒక్క సారి చూడనీరా.. ప్లీజ్‌రా..'' అని ప్రాధేయపడుతూ తమ్ముడి వెంటపడ్డాడు నిశాంత్‌.

అయినా మా చిన్నాడు పిస్తోల్‌ని ఇవ్వకుండా రెండుచేతులా తన గుండెకు అదిమి పట్టుకున్నాడు. ఆ వెంటనే మా ఆవిడ కోపంతో వెళ్లి మా చిన్నాడి వీపు మీద ఒక్కడి చరచి వాడి చేతుల్లోంచి బలవంతంగా పిస్తోలు లాక్కుని మా పెద్దాడికిచ్చింది. ''అన్నయ్య కష్టపడి చదివి సంపాదించుకుంటే నాదంట నాది. బుద్ధిలేకపోతే సరి...'' అంటూ వాడిమీద కేకలేసింది.

దాంతో మా చిన్నాడు ఒక్కసారి ఏడుపు లంకించుకున్నాడు.

తన మూలంగా తమ్ముడి వీపు చిట్లడంతో మా పెద్దాడి మనసు కరిగిపోయింది. వాడు జాలిగా ''పోన్లే మమ్మీ, ఇది తమ్ముడికే ఇచ్చేయ్‌... నేను థర్డ్‌ క్లాస్‌లో కూడా ఫస్ట్‌ ర్యాంక్‌లో పాసవుతాను.... అప్పుడు నాకు ఇంకో పిస్తోల్‌ ఇస్తారు కదా.... దాన్ని నేను వుంచేసుకుంటాలే...'' అంటూ తన చేతిలోని పిస్తోలును తమ్ముడికి అందించాడు.

వాడి మాటలు నాకు శరాఘాతాల్లా తగిలాయి. ఎక్కడో గుండెలోతుల్లో కలుక్కుమన్నట్టయింది.

అది అంతులేని సంతోషమో...నా అసమర్ధత వల్ల కలిగిన దుఃఖమో తెలీదు కానీ ఈసారి భోరుమనడం నా వంతయింది!

---

( ఆర్టీసీ ప్రస్థానం, మాస పత్రిక మార్చి 1991 సౌజన్యంతో )

(ఎపిఎస్‌ఆర్‌టిసి ఆర్ట్స్‌కో నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథఇది. ఆతదనంతరం ఇదే పేరుతో ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం నుంచి రేడియో నాటికగా కూడా ప్రసారమైంది.) ....

5 comments:

  1. మధ్య తరగతి జీవితాలను ఎంత చక్కగా చూపించారు. పరిష్కారం ఉందేమో అన్న ఆశ, కాని అది కనిపించదేమో కనిపించినా అందుకోలేని నిరాశా. చాలా చక్కగా చూపారు. ఎప్పటికైనా మార్పు వసుందేమో వేచి చూద్దాం

    ReplyDelete
  2. మీకో సూచన ఏమిటంటే ఇంత పెద్ద మేటర్ స్క్రీన్‌మీద చదవడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న చిన్న పారాగ్రాప్ లు గా విభజించి గ్యాప్ ఇస్తే బాగుంటుంది .

    ReplyDelete
  3. @ శృతి గారు
    మీ స్పందనకు కృతజ్ఞతలు.
    @ శివ గారు
    మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. prabhakar gaaru,
    thank u so much..
    it is a nice story.......
    infact represents most of the m..clas families life...

    ReplyDelete
  5. రమణ గారూ
    "డాడీ నాకో పిస్తోల్ కావాలి" కథ మీకు నచ్చినందుకు సంతోషం.
    మీ స్పందనను తేలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete