Saturday, January 31, 2009
సృష్టి
( .... ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురైనా,ఎవరైనా తుమ్మినా కొందరు ప్రయాణాలు మానేస్తారు. అట్లాంటి మూఢనమ్మకాల వల్ల ఇతర్లకు ఇబ్బందేం లేదు. అది వాళ్ల వ్యక్తిగత బలహీనత అనుకుని వదిలేయొచ్చు. కానీ మరికొన్ని నమ్మకాలు ఇతర్లకి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.
మా శివరామయ్య తాతకు (పేరు, వరుస మార్చాను) అనేక నమ్మకాలుండేవి. శుభకార్యం మీద వెళ్లేటప్పుడు విధవరాలు ఎదురుపడితే ఆయనకు పూనకం వచ్చినట్టయ్యేది. మంచి చెడు విచక్షణ లేకుండా ఆమె మొహం మీదనే తిట్లవర్షం కురిపించేవాడు. ఆయన నోటి దురుసు వల్ల అందరికీ చచ్చే చావయ్యేది. ఆయన నోటికి భయపడి చాలా మంది ఆయనని చూడగానే పారిపోతుండేవారు. దుశ్శకునం అంటే ఆయనకు చెడ్డ భయం. ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్తున్నా తన మనవరాళ్లలో ఒకరిని ఎదురు రమ్మనేవాడు. అట్లా ప్రతిసారీ ... శుభశకునాన్ని ... స్వయంగా ఏర్పాటుచేసేవాడు.
జాతకాలు, ముహుర్తాలు అంటే ఆయనకు మహా పిచ్చి. ఆ పిచ్చి వల్ల ఒకసారి తన కూతురి ప్రాణాలమీదకు వచ్చింది. ఆ వాస్తవ సంఘటనపై ఆధారపడి రాసిన కథ ఇది)
సృష్టి (కథ)
సున్నం కొట్టిన రాతి బంతిలా వున్నాడు చంద్రుడు!
దండలోంచి జారిపోయిన ముత్యాల్లా అక్కడొకటి ఇక్కడొకటిగా మిణుకు మిణుకు మంటున్నాయి నక్షత్రాలు!
సూర్యుడు పొద్దంతా భూమ్మీద చల్లిన నిప్పులు ఎప్పుడో బూడిదగా మారిపోయాయి!
చేతులు చాచి తిరుగుతున్న సీలింగ్ ఫాన్‌కు జడిసి కిటికీ దగ్గరే తచ్చాడుతోంది పిల్లతెమ్మెర!
రెప్పలతో కళ్లని ఎంతసేపు బంధించినా రాజ్యానికి కునుకు రావడం లేదు. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు తనకూ నిద్ర రావడంలేన్న విషయాన్ని కాళ్లతో తంతూ తెలియజేస్తోంది!
ఆ లేత కాళ్లని సున్నితంగా దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నించింది రాజ్యం. అవి చిక్కినట్టే చిక్కి బుడుంగున జారిపోయాయి. లోపల బిడ్డ పల్టీలు కొడుతున్నప్పుడల్లా తీయని నొప్పి కలుక్కుమంటోంది.
పొట్టను గోముగా నిమురుకుంటూ ''ఇది మహాగడుసుదయ్యేలా వుందే'' అనుకుంది. ఆ మరుక్షణమే ఒక్కసారి ఉలిక్కిపడింది.
పుట్టబోయేది ఖచ్చితంగా ఆడపిల్లే అన్నట్టు ఊహించుకుంటోందేమిటి తను?!
కొంపదీసి ఈసారి కూడా ఆడపిల్లే పుడితుందా...?
అమ్మో వద్దు వద్దు..! తనకు బాబే కావాలి.... బాబే కావాలి...!
''ఒరేయ్ నువ్వు బాబువే కదూ...? అవును బాబువే...! అందుకే ఈ తల్లిని అంత బలంగా తన్న గలుగుతున్నావు!! ఆడపిల్లవైతే నీకు ఇంత శక్తి ఎలా వుంటుంది?... నువ్వు బాబువే...కచ్చితంగా బాబువే! కానీ ఒరే కన్నా ... నా చిట్టి తండ్రీ...అందరు మగాళ్లలా నవ్వు మాత్రం పెద్దయ్యాక కఠినాత్ముడివి కాకూడదు నాన్నా...! నీ మనసు నవనీతంలా వుండాలి... నీది జాలిగుండె కావాలి...నా రక్తం పంచుకు పుడుతున్నావు ... నా గుణాల్ని కొన్నైనా అ లవర్చుకోవూ..?!
రాజ్యం మనసంతా అదోలా అయిపోయింది!
ఆమెకిది నాలుగో కాన్పు. ముందరి మూడు కాన్పుల్లో ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారు. ఈసారి కూడా ఆడపిల్లే పుడితే పరిణామాలు ఎలా వుంటాయో తలచుకుంటేనే భయమేస్తోందామెకు.
భర్తా, అత్తమామలూ ఈసారి మగపిల్లవాడే పుడతాడని ఎంతో ధీమాగా వున్నారు!
మామ శ్రీమన్నారాయణ జ్యోతిష్య శాస్త్రంలో పండితుడు. 'జ్యోతిష్య రత్న' అన్న బిరుదుకూడా వుందాయనకు. (ఎవరిచ్చారో తెలియదు). జ్యోతిష్యం ఆయనకు వ్యాపకమేకాదు, వ్యాపారం కూడా! వాళ్లకీ వీళ్లకీ జాతకాలు చెప్పి ఇంతో అంతో డబ్బు సంపాదిస్తుంటారు.
తన తొలికాన్పు ఆడపిల్లేనని మూడో నెలలోనే ప్రకటించేశారాయన. మలికాన్పు కూడా ఆడపిల్లేనని ముందుగానే చెప్పేశారు. మూడో కాన్పు సమయంలో మాత్రం ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. గ్రహగతుల లెక్కల్లో ఏదో తేడా వస్తోందనీ... అయితే ఆడపిల్ల ... లేకుంటే మగపిల్ల ... అన్నట్టు సందిగ్ధంగా చెప్పారు.
కానీ, ఇప్పుడు... ఆరు నూరైనా, నూరు ఆరైనా తమ వంశాంకురమే జన్మించబోతున్నట్టు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆయన జోస్యం ఇంట్లో అందరికీ ఎనలేని ఆనందాన్ని కలిగిస్తే రాజ్యంలో మాత్రం అంతులేని భయాన్ని రగిలించింది.
పొరపాటున మళ్లీ ఆడపిల్లే పుడితే తనకు ఏ గతిపడ్తుందో?!
ఆమె తన మనసులోని భయాన్ని భర్త పార్వతీశం వద్ద ఒకసారి జంకుతూనే ప్రస్తావించింది. దానికతను ఇంతెత్తున ఎగిరిపడ్డాడు.
''నాన్న గారి జోస్యాన్నే శంకిస్తావా? బుద్ధుందా నీకు..? యేం.. ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావు. ఇంకా తనివి తీరలేదా? ఈసారి కూడా ఆడపిల్లనే కనాలనుందా?'' అంటూ ఛడామడా దులిపేశాడు.
అసలు మొదటి సారి ఆడపిల్ల పుట్టిందని తెలిసినప్పుడే అతని మొహం ముడుచుకుపోయింది. రెండోసారి, మూడోసారి కూడా వరుసగా కూతుళ్లే పుట్టేసరికి దాదాపు పిచ్చెక్కినంతపనయింది.
కూతుళ్లని చూస్తే అప్పులవాళ్లని చూసినట్టుగా వుంటుంది పార్వతీశానికి.
''రేపు ఈ ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయడం ఎలాగ? ఎంత తలకు మాసిన సంబంధాలకైనా ఒక్కో పెళ్లికి ఒక్కో లకారమైనా కావాలి. ముగ్గురికీ మూడు లక్షలంటే ఎక్కడినుంచి తేగలడు తను? ఆడపిల్లల వల్ల అంతా నష్టమే తప్ప దమ్మిడీ లాభం లేదుకదా...'' ఇవీ అతని ఆలోచనలు.
దీనికి తోడు ఒక్క కొడుకైనా లేకపోతే ఎలాగ? పున్నామ నరకం సంగతటుంచి... తమ వంశం ఏమైపోవాలి అన్న బెంగ కూడా వుందతనికి. కారణం తల్లితండ్రులకి తనొక్కడే సంతానం. తనకి కొడుకులు పుట్టకపోతే తమ ఇంటిపేరు తనతోనే అంతరించిపోతుంది!
'భార్య అపశకునం పలుకులు పొరపాట్న నిజమైతే?! అమ్మో... ఇంకేమైనా వుందా. తను తట్టుకోలేడు. పెళ్లిళ్ల సంగతి దేముడెరుగు..నలుగురు ఆడపిల్లల్ని పెంచి పెధ్ద చేయడం కూడా తనవల్లకాదు. బడిపంతులిగా తన బొటాబొటి జీతం వాళ్ల గాజులకీ, రిబ్బన్లకీ, కొబ్బరి నూనెకీ, పౌడర్లకే చాలదు.'
తండ్రి జోస్యం మీద ఎంత గురీ గౌరవం వున్నప్పటికీ ... అతని మనసులో కూడా ఏదో మూల చిన్న అనుమానం తొలుస్తూనే వుంది.
ఆలోచించిగా ఆలోచించగా ఆ సమస్యకు ఓ పరిష్కార మార్గం తట్టిందతనికి.
గర్భస్థ శిశువు ఆడో మగో తేల్చిచెప్పే వైద్యకేంద్రాలు హైదరాబాద్‌లో బోలెడు వుంటాయట. అక్కడికి రాజ్యాన్ని తీసుకెళ్ళి పరీక్షచేయిస్తే సరి. పుట్టబోయేది మగపిల్లవాడైతే సరేసరి. లేదంటే గుట్టు చప్పుడు కాకుండా అక్కడే అబార్షన్ చేయిస్తే పీడాపోతుంది అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు.
నిజం చెబితే ''నా కొడుకువై వుండి నా జోస్యాన్నే శంకిస్తున్నావుట్రా'' అని నాన్న బాధ పడతాడు. కోపగించుకుంటాడు. అందుని దగ్గరి స్నేహితుడి పెళ్లనీ, తప్పనిసరిగా వెళ్లాలనీ తండ్రితో అబద్ధం చెప్పి భార్యతో సహా హైదరాబాదుకు పయనమయ్యాడు పార్వతీశం.
అప్పటికే రాజ్యానికి మూడోనెల దాటింది. భర్తతో బయలుదేరుతున్నప్పుడు రాజ్యానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదటి కాన్పు అయినప్పటినుంచీ ఎప్పుడూ పట్టుమని పావలా మల్లెపూలు కూడా తేని భర్త ఏకంగా తన మిత్రుడి పెళ్లికి తనని హైదరాబాదుకు తీసుకెళ్లడం చిత్రంగా అనిపించింది. పుత్రోత్సాహం అంటే ఇదే కాబోలు అనుకుంది.
హైదరాబాదులో వైద్య పరీక్షా కేంద్రంలో అడుగుపెట్టిన తరువాత గానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. నిజం తెలిసిం తరువాత గుండెలో కలుక్కుమన్నట్టయింది. దుఃఖం ముంచుకొచ్చింది. అబల, అందులోనూ తల్లీ తండ్రీ లేని అనాథ తను చేయగలిగేదేముంది.
ఆ పరీక్షా కేంద్రంలోని లేడీ డాక్టర్ ''ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు? మీలో ఎవరికైనా జన్యుపరమైన సమస్యలు, దీర్ఘ వ్యాధులు ఏమైనా వున్నాయా? ఇంతకు ముందు పుట్టిన పిల్లల్లో లోపాలేమైనా వున్నాయా? మీది మేనరికం వివాహమా?'' అంటూ ఎన్నో ప్రశ్నలు వేసింది.
పార్వతీశం మొదట ఖంగు తిన్నాడు. డాక్టర్ల వద్ద అబద్ధాలు దాగవన్న ఉద్దేశంతో తన మనసులోని ఉద్దేశాన్ని ఉన్నదున్నట్టు చెప్పేశాడు.
దయామయిలాంటి ఆ డాక్టర్‌కు పరిస్థితి క్షుణ్ణంగా అర్థమైపోయింది. రాజ్యం కళ్లలో కదలాడే భావాలని, భయాలని కూడా గమనించింది. పరీక్ష చేయాలన్న నెపంతో పార్వతీశాన్ని బయటకు పంపించి-
''ఏమ్మా! నీకీ పరీక్ష ఇష్టం లేదు కదూ?'' అంటూ అనునయంగా అడిగింది.
ఆమెవంక బేలగా చూసింది తప్ప ఔననీ కాదనీ ఎటూ చెప్పలేకపోయింది రాజ్యం.
''భయపడకమ్మా! నువ్వు చెప్పకపోయినా నిన్ను చూడగానే పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మేము ఈ పరీక్షలు చేస్తోంది నీలాంటి... నాలాంటి ఆడపిల్లల్ని ఈ లోకంలోకి రాకుండా చిదిమెయ్యడానికి కాదమ్మా'' అందావిడ.
రాజ్యం విస్మయంగా చూసింది.
''నిజమమ్మా! అసలీ పరీక్షలు ఎందుకు చేస్తారో తెలుసా? గర్భస్థ శిశువులో జన్యుపరమైన లోపాలేమైనా వుంటే కనుక్కోడానికి. అట్లా కనుక్కుంటే పిండదశలోనే వాటిని సరిచెయ్యడానికి వీలవుతుంది. అంతే తప్ప పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలుసుకుని ఆడయితే ఆ పిండాన్ని గర్భంలోనే విచ్ఛిన్నం చేసెయ్యడానికి కాదు. ఈ పరీక్ష ఎవరికి పడితే వారికి చెయ్యరు'' అంది.
డాక్టర్ మాటలు ఆమెకు కర్ణపేయంగా తోచాయి. అనిర్వచనీయమైన ఆత్మీయతకు ఎంతో స్వాంతన లభించినట్టయింది.
''పురుషుడు తన పుట్టుకకు కారణమైన తల్లిని గౌరవిస్తాడు! తనకు స్వర్గ సుఖాలందించే భార్యను ప్రేమిస్తాడు! కానీ, కూతురు పుట్టిందంటే మాత్రం గింజుకు చస్తాడు. ఇది ఒక్క నీ భర్త విషయంలోనే కాదమ్మా లోకంలో ఎక్కువమంది పురుషుల ఆలోచనా ధోరణి ఇలాగే వుంటుంది. అందుకని నువ్వేం బాధ పడనవసరం లేదు. అసలు రెండో బిడ్డ పుట్టగానే నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'' అందామె.
''ఇంట్లో ఎవరూ ఒప్పుకోకుండా ఎలా సాధ్యపడుతుందండీ?!'' అంటూ పెదవివిప్పింది రాజ్యం.
''నిజమేలే. నిన్నొక పిల్లల్ని కనే యంత్రంలా చూసేవాళ్లు ఎలా ఒప్పుకుంటారు! ఒప్పుకోరు. కొడుకు పుట్టే వరకూ కంటూనే వుండమని శాసిస్తారు. కావాలని ఆడపిల్లల్ని కంటున్నావని ఆడిపోసుకుంటారు. ఈసడించుకుంటారు.'' అంటూ నిట్టూర్చిందా లేడీ డాక్టర్.
''నువ్వు చాలా బలహీనంగా వున్నావమ్మా. పైగా ఆడపిల్ల పుడుతుందో, మగపిల్లవాడు పుడతాడో అన్న బెంగతో అనుక్షణం కుంగిపోతున్నట్టున్నావు. బాధపడుతూ కూచోవడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు సృష్టి అనేది నీ చేతిలో వుందా... నా చేతిలో వుందా చెప్పు?!''
రాజ్యం కళ్లలో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి. తన మనసులోని ఆవేదనని తను చెప్పకుండానే ఎంత బాగా కనిపెట్టిందీ డాక్టర్' అనుకుంది.
''చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు ఒప్పుకుంటానంటే నేనొక చిన్న నాటక మాడతాను. నాకోసం కాదు. నీ కోసమే... నీ శ్రేయస్సు కోసమే. సమ్మతమేనా మరి?'' అనునయంగా అడిగిందామె.
రాజ్యం అప్రయత్నంగా సరేనన్నట్టు తలాడించింది.
ఆ లేడీ డాక్టర్ సంతృప్తిగా నవ్వి ''ఇప్పుడు నీ గర్భంలో పెరుగుతున్నది మగ శిశువేనని నీ భర్తకు చిన్న అబద్ధం చెబుతాను. ఈ పరీక్షలవీ నీకిప్పుడు అనవసరం. పైగా అవి నీ ఆరోగ్యానికి కూడా హానిచేస్తాయి. కాబట్టి రేపు ఆడపిల్ల పుట్టినా, మగ పిల్లవాడు పుట్టినా నువ్వేం బాధ పడకూడదు. అంతా విధి లీల అనుకో. అయినా ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్ల మగపిల్ల అంటూ విచక్షణ చూపడంలో అర్థంలేదు. నువ్వు నిశ్చింతగా, ధైర్యంగా వుండు. బాబు పుడుతున్నాడంటే మీ ఇంట్లో వాళ్లు నిన్ను బాగా చూసుకుంటారు. పుష్టికరమైన ఆహారం అందిస్తారు. అది నీకు చాలా అవసరం. ఎలాగూ బాబు పుడుతున్నాడు కాబట్టి ఇప్పుడే ఆపరేషన్ చేయించుకొమ్మని నీ భర్తకు గట్టిగా చెబుతాను... సరేనా?!''
రాజ్యం మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఈవిడెవరు...తనెవరు?! ఏ జన్మ అనుబంధమో తమది. ఈవిడ మనిషి కాదు దేవత... మనసులోనే చేతులెత్తి నమస్కరించింది.
డాక్టర్ చెప్పిన తీయని అబద్ధం విన్న పార్వతీశానికి హిమాలయా పర్వతాల్ని అధిరోహించినంత మధురానుభూతి కలిగింది.
మగపిల్లవాడు పుడతాడని తన తండ్రి ప్రవచించినప్పుడు కలిగిన ఆనందానికి... ఇప్పుడు అదేమాట డాక్టర్ నోట విన్నప్పుడు కలిగిన ఆనందానికి మధ్య పోలికేలేదు.
ఎందుకంటే అది కేవలం విశ్వాసం. ఇది శాస్త్రీయ విజ్ఞానం.
హైదరాబాదు నుంచి తిరిగొచ్చిన వారం రోజుల్లోనే పార్వతీశం వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. ముగ్గురు పిల్లల తరువాత ఆపరేషన్ చేయించుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఇస్తారు. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత చేయించుకుంటే ఇవ్వరు. అన్న ప్రలోభం కూడా అందుకో కారణం.
తన జోస్యం మీద తన కొడుక్కి వున్న అచంచలమైన విశ్వాసానికి శ్రీమన్నారాయణ కూడా ఎంతో పొంగిపోయాడు. ఆ క్షణం నుంచీ కొడుకు జాతకాన్ని, కోడలు జాతకాన్ని, పంచాగాల్ని ముందేసుకుని ఒకటే లెక్కలు వేయడంలో మునిగిపోయాడు.
భర్త వేసక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం, మామయ్య ఎప్పుడూ తమ జాతకాలతో అదేపనిగా కుస్తీపడ్తుండడం రాజ్యంలో రోజురోజుకి భయాన్ని, బెదురుని పెంచేశాయి. భర్త తన మీద ఎన్నడూ లేనంత అనురాగాన్ని కురిపిస్తున్నా ఆమెకు ఏమాత్రం అది నిజమైన సంతోషాన్ని అందింరీచడం లేదు.
... ... ... ...
కడుపులో శిశువు బలంగా తన్నడంతో ఆలోచనలనుంచి తేరుకుని 'అబ్బ ఏమిటే ఇది' అంటూ పైకి అనేసింది. అంతలోనే తన పొరపాటు తెలుసుకుని ''ఒరే ఏమిట్రా బాబూ ఈ పని' అని తన తప్పును తనే సరిదిద్దుకుంది.
ఫ్యాన్ ఎంత స్పీడ్‌గా తిరుగుతున్నా ఆమెకు ఉక్కపోస్తున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా మంచం దిగింది.
భర్త ఆద మరచి నిద్రపోతున్నాడు. మరో మంచం మీద ముగ్గురు కూతుళ్ళూ అస్తవ్యస్తంగా పడుకుని వున్నారు. వాళ్లని చూస్తే చాలా జాలిగా అనిపించింది. ఇంట్లో ఎవరికీ వీళ్ల మీద ఇప్పుడే ప్రేమ లేదు. రేపు నిజంగానే కొడుకు పుడితే వీరి పరిస్థితి ఇంకెంత దయనీయంగా తయారువుతుందో.
కూతుళ్లనందరినీ సరిగా పడుకోబెట్టి, దుప్పటి కప్పింది.
నెమ్మదిగా కిటికీ వద్దకు వెళ్లి నిలబడింది. బయటి నుంచి వీచిన చల్లని గాలి శరీరానికి తగిలి ప్రాణం లేచొచ్చినట్టయింది. కిటికీ లోంచి చంద్రుడు ఆకాశంలో వేలాడదీసిన సిరిమల్లె చెండులా కనిపిస్తున్నాడు. కాసేపు ఆరుబయట చల్లని నిండుపున్నమి వెన్నెలలో కూచోవాలనిపించింది రాజ్యానికి.
భారంగా అడుగులు వేసుకుంటూ తలుపు దగ్గరకు నడచి గొళ్లెం తీసేందుకు చేయి పైకెత్తింది. అంతే కడుపులో ఎక్కడో గట్టిగా కలుక్కుమన్నట్టయింది.
''అమ్మా..!'' అంటూ పొట్టను పట్టుకుని బాధతో విలవిలలాడిపోయింది.
ఆమె అరుపు విని దిగ్గున లేచాడు పార్వతీశం. ''ఏమిటి రాజ్యం? ఏమైంది?'' ఆందోళనగా అడిగాడు.
''అబ్బే ఏం లేదండీ. కాస్త అత్తయ్యని పిలవండి.'' అంది రాజ్యం పంటి బిగువన బాధను అణచిపెట్టుకుంటూ.
పార్వతీశం బెంబేలు పడిపోతూ వెళ్లి తల్లినీ, తండ్రినీ నిద్రలేపాడు.
రాజ్యాన్ని పరిశీలించిన పార్వతీశంతల్లికి అవి పురిటి నొప్పులేనని బోధపడింది. ఆ విషయమే చెప్పి త్వరగా మంత్రసానిని పిలుచుకురమ్మని కొడుకుని పురమాయించింది.
ఆ ఊళ్లో నాటు మంత్రసాని తప్ప మెటర్నిటీ డాక్టరెవరూ లేరు. దేనికైనా పాతిక కిలోమీటర్ల దూరంలో వున్న పట్నం వెళ్లాల్సిందే.
పార్వతీశం లుంగీ బనీను మీదే పరుగు లంకించుకున్నాడు.
విషయం తెలిసిన శ్రీమన్నారాయణ పంచాగాన్ని, జాతకాల పుస్తకాలని పట్టుకుని వరండాలోని వాలు కుర్చీలో కూర్చున్నారు. కళ్ల జోడు సవరించుకుని, సీరియస్‌గా తిథి, వార, నక్షత్రాల్ని, గ్రహగతుల్ని గణించడం ప్రారంభించారు.
హఠాత్తుగా ఆయన భృకుటి ముడిపడింది.
ఎంత తరచి చూసినా ఇది భయంకరమైన దుర్ముహూర్తం!
మరో రెండు ఘడియల తరువాత అయితే పుట్టేవాడు మహర్జాతకుడు అవుతాడు. లేక లేక పుడుతున్న తమ వంశాకురం పరమ దురదృష్టకరమైన ఘడియల్లో పుడితే ఎట్లా?!
ఆయన మనసు విలవిలలాడసాగింది.
ఇదే పట్నంలో అయితే నొప్పులు కొంచెం ముందుగా రావలన్నా ... లేదా కాన్పు కొంచెం ఆలస్యంగా కావాలన్నా ఏవో ఇంజక్షన్లూ అవీ వుంటాయి. అవసరమైతే చెప్పిన టైంకి సిజేరియన్ చేస్తారు.
యాత్రలు, పండుగలు, పబ్బాలప్పుడు బహిష్టులను వాయిదా వేయడానికి ఇంట్లోని ఆడంగులకు టాబ్లెట్లు వాడటం మామూలే.
కానీ ఈ పల్లెటూర్లో, ఇంత రాత్రి వేళ ఇప్పుడు ఏం చేయగలడు?!
పెద్ద చిక్కే వచ్చిపడిందే.
ఒకరోజు ముందే పట్నం తీసుకెళ్లి ఏ నర్సింగ్ హోంలోనో చేర్పిస్తే ఎంత బాగుండేది. అయినా డాక్టర్ చెప్పిన డేట్‌న కాకుండా ఇంత త్వరగా నొప్పులు రావడం ఏమిటి?
శ్రీమన్నారాయణ అంతర్మథనంలో వుండగానే పార్వతీశం వీధిగేటు తీసుకుని లోనికి వచ్చాడు.
''మంత్రసాని ఏదిరా?!''
''వస్తోంది !'' అంటూ ఆగిపోయాడు. అతని దృష్టి తండ్రి తిరగేస్తున్న పంచాంగం మీద పడింది. ''గ్రహ స్థితి ఎలా వుంది నాన్నగారూ?'' అనడిగాడు పార్వతీశం ఆసక్తిగా.
శ్రీమన్నారాయణ తిథి, నక్షత్రాల పరిస్థితి అంతా వివరించారు.
''ఇప్పుడెలా మరి?!'' అయోమయంగా అడిగాడు పార్వతీశం.
అంతలో దండాలు పెట్టుకుంటూ మంత్రసాని వచ్చింది. శ్రీమన్నారాయణ ఆమెను ఆపి సంగతి చెప్పి ''కాన్పు రెండు గంటలు ఆలస్యం చేయడానికి వీలవుతుందా?'' అని అడిగాడు.
మంత్రసాని రెండు క్షణాలు తటపటాయించింది.
ఆమెకు ఆయన జాతకాల పిచ్చి బాగా తెలుసు. ''మీ కోడలు తలచుకుంటే అదెంతపని అయ్యగారూ?'' అంది.
''అయితే దానికి నువ్వే నచ్చ చెప్పు. ఎలాగైనా సరే కనీసం రెండు గంటలు గడిచేదాకా కాన్పు కాకుండా చూడు. నీకు మంచి ప్రతిఫలం ఇస్తాలే.'' అన్నాడాయన.
మంత్రసాని లోపలికి వెళ్లే సరికి రాజ్యం పిడికిళ్లు బిగించి తల అటూ ఇటూ విదిలిస్తూ బాధతో మెలికలు తిరిగిపోతోంది.
''కాన్పుకి ఇంకా వారం రోజుల టైం వుందని చెప్పారట కదమ్మా పట్నం డాక్టరు. అప్పుడే తొందరపడిపోతున్నారేమిటి మీ కోడలు?'' అందామె.
పార్వతీశం తల్లి ఏమీ మాట్లాడలేదు.
ఆవిడకు అప్పటికే గుండెదడగా వుంది. ఆమెకు హైబీపీ వుంది. పైగా రక్తం చూస్తే తట్టుకోలేదు. కళ్లు తిరుగుతాయి.
అందుకే ఆవిడ కావలసినవన్నీ మంత్రసానికి అందించి పక్కగదిలోకి తప్పుకుంది.
''ముగ్గుర్ని కన్నావు. ఇదే మొదటి కాన్పు అయినట్టు ఇట్లా బెంబేలు పడిపోతున్నారేటమ్మా'' అంటూ పరిహాసాలాడింది మంత్రసాని.
''అవతల మీ మాంగారు రెండు గంటలు ఆలస్యంగా కనమంటున్నారు. ఇక్కడ మీరేమో ఓ తొందరిపడిపోతున్నారేటి?'' అంటూ చీర తొలగించి పరీక్షించిందామె.
మంత్రసాని మాటల్ని వినే స్థితిలో గానీ, ఆమె చేష్టల్ని గమనించే స్థితిలో గానీ లేదు రాజ్యం.
పుట్టబోయేది ఆడపిల్లా - మగపిల్లాడా అన్న దిగులుతో ఆమె అప్పటికే చిక్కి శల్యమయింది. ఆమె ఒంట్లో నొప్పుల్ని భరించే శక్తి కూడా ఏమాత్రంలేదు.
మంత్రసానికి శిశువు మాడు కొద్దిగా కనిపించింది.
అబ్బో కాన్పు ఈ క్షణమో మరుక్షణమో అన్నట్టుగా వుంది ఇప్పుడెలాగబ్బా అని గాభరాపడిపోయింది. శిశువు మాడు మీద తన బొటనవేలు ఆన్చి నెమ్మదిగా లోనికి నెట్టింది.
రాజ్యం ఒక్కసారి కెవ్వుమని అరిచింది.
పొత్తి కడుపులో గునపాలు దించినట్టు విలవిలలాడిపోయింది. మంత్రసాని అదేం పట్టించుకోకుండా రాజ్యం రెండు మోకాళ్లని దగ్గరకని పట్టుకుంది.
ఒకటి రెండు నిమిషాల్లోనే శిశువు తల మళ్లీ మరింత స్పష్టంగా బయటకు అగుపించింది.
''వామ్మో ఈ దూకుడేంటి బాబో... ఇక్కడ ఏమంత కొంపలంటుకుపోతున్నాయనీ..'' అంటూ తిరిగి ఒడుపుగా బిడ్డను లోనికి నెట్టింది.
రాజ్యం ఆ రంపపు కోతను భరించలేక గొంతు చిట్లేలా అరుస్తోంది.
ఏదో చెప్పాలని ప్రయత్నించింది... కానీ, దుర్భరమైన బాధవల్ల మాటలు గొంతు దాటి వెలుపలికి రావడం లేదు.
బయట పార్వతీశం అటూ ఇటూ కాలు గాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు.
''కొడుకే పుడ్తాడు కదా.. నిజంగా కొడుకే కదా..'' అని అతనికి ఎంతో ఉద్వేగంగా వుంది.
వాలు కుర్చీలో కూర్చున్న శ్రీమన్నారాయణ ఇంకా పంచాంగంతో కుస్తీపడుతూనే వున్నాడు. మరికొన్ని క్షణాలు గడిస్తే దివ్యమైన ముహూర్తం వుంది. ఆ నక్షత్రాన పుట్టేవాడు మహర్జాతకుడు అవుతాడు....!
లోపల పరిస్థితి మరోరకంగా వుంది.
శిశువు తల మరింతగా బయటకు పొడుచుకువచ్చింది. ''వారినాయనో ఈ దూకుడేంటి బాబో...'' అని ఆందోళనపడిపోతూ మంత్రసాని బిడ్డ తలమీద అరచేయి ఆన్చి ఒకింత బలంగా మళ్లీ లోనికి అదిమింది.
దిక్కులు పిక్కటిల్లేంత బిగ్గరగా గావుకేక పెట్టింది రాజ్యం.
ఆ మరుక్షణమే ఆమెలో కదలికలు ఆగిపోయాయి.
ఒక్కసారి భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది అక్కడ.
గట్టిగా తోయడం వల్ల శిశువు అడ్డం తిరిగిపోయింది.
''అమ్మయ్య కాసేపు అట్లా ఏ గొడవా చెయ్యకుండా మిన్నకుండిపొండలాగ..'' అంటూ మంత్రసాని తాపీగా ఒక పక్కన కూచుని బొడ్లోంచి చుట్ట తీసి వెలిగించుకుంది.
బాధ వల్ల రాజ్యం సొమ్మసిల్లి వుంటుంది అనుకొందామె.
లోపల ఏం జరుగుతోందో బయటి వాళ్లకు తెలియదు. ఎవరి గొడవలో, ఎవరి ఆలోచనల్లో, ఎవరి నమ్మకాల్లో వాళ్లు మునిగి తేలుతున్నారు.
దుర్ముహూర్తం దాటేక నెమ్మదిగా తిరిగి తన పని ప్రారంభించబోయింది మంత్రసాని.
అప్పుడు గానీ తెలియలేదు ఆమెకు ... రాజ్యం పంచ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయని!
మంత్రసాని కళ్లు ఒక్కసారిగా బైర్లు కమ్మినట్టయ్యాయి. ఆమె చేతులు వణికి పోసాగాయి. గుండెల్లో దడ మొదలయింది. ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి.
''అయ్యో... అయ్యో...ఎంత గోరం జరిగిపోయిందిరా దేవుడో... నేనేం చేయాలిరా దేవుడో...'' అని మనసులోనే వాపోయింది. కనీసం చిన్న ప్రాణాన్నయినా బయటపడేద్దామనుకుని ధైర్యం కూడదీసుకుంది. అతి కష్టం మీద బయటకు లాగేసింది.
చూస్తే మగ బిడ్డే...!
కానీ... మృత కళేబరం...!!
బయటినుంచి శ్రీమన్నారాయణ కేకవేశాడు ''ఏమే కాన్పయిందా? సరిగ్గా టైం చూశావా? మగబిడ్డా... ఆడబిడ్డా?''
సమాధానం చెప్పేందుకు మంత్రసాని గొంతెలా పెగులుతుంది?
పెగలదు.
పెగలలేదు...!
---
(ఈనాడు ఆదివారం అనుబంధం, 11 ఆగస్టు 1991 సౌజన్యంతో)
(ఈ కథ కన్నడంలోకి అనువాదమై కన్నడ ప్రభ పత్రికలో ప్రచురించబడింది.)
Tuesday, January 27, 2009
ఇక ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఆంధ్ర నాయకులే దిక్కేమో...!
..... 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో దాదాపు నాలుగు వందల మంది ప్రాణాలు బలయ్యాయి. ఎన్ని వీపులు చిట్లిపోయాయో, ఎంత మంది జైలు పాలయ్యారో, ఎంతమంది విద్యార్థుల చదువులు దెబ్బ తిన్నాయో ఎందరు ఎన్నిరకాలుగా కష్టనష్టాలకు గురయ్యారో లెక్కేలేదు.
అసలు ఆ ఉద్యమాన్ని నడిపింది విద్యార్థులు. ఖమ్మంలో ఒక విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్షతో మొదలయి మొత్తం తెలంగాణా జిల్లాలకు వ్యాపించింది.
మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి వంటి విద్యార్థి నాయకుల నేతృత్వంలో, కాళోజీ వంటి పెద్దల అండదండలతో సాగుతున్న నాటి ఉద్యమంలో క్రమంగా కొండాలక్ష్మణ్ బాపూజీ, వందేమాతరం రామచంద్రరావు వంటి రాజకీయ నాయకులు వచ్చిచేరారు.
అందరికంటే ఆఖరున ఉద్యమంలోకి వచ్చి మొత్తం ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నవాడు మర్రి చెన్నారెడ్డి. (తెలంగాణా నాయకులను ఉద్యమంలోకి ఆహ్వానించే క్రమంలో విద్యార్థులు పాడిన... "రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి... ఇకనైన రావోయి వెర్రి చెన్నారెడ్డి..." అనే పాట అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది).
ఆ ఉద్యమ కాలంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్) ఒంటరిగా పోటీ చేసి తెలంగాణాలోని 15 ఎంపి సీట్లకు గాను 10 సీట్లను గెలుచుకుంది.
అయితే అప్పుడు అధికారంలో వున్న అపర చాణిక్యురాలైన ఇందిరమ్మ ...ఛూమంతర్... అనగానే ఆ పది మందీ తెలంగాణా జెండాను అవతల పారేసి ఖద్దరు టోపీలు పెట్టుకున్నారు.
మర్రి చెన్నారెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి పీఠం మీద ఓ రెండేళ్లు "పొన్ను కర్ర" తిప్పుకుంటూ కూర్చుని తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు.
ప్రజలు ఆ నయవంచనను నిస్సహాయంగా చూస్తుండిపోయారు.
ఆ తరువాత తెలుగుదేశం హయాంలో "తెలంగాణా జనసభ" అనేక ప్రతికూల పరిస్థితులను, నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించింది. ఆశించిన మంత్రి పదవి దక్కని కల్వ కుంట చంద్రశేఖరావు తెలంగాణా రాష్ట్ర సమితిని స్థాపించి తాజా ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
తెలుగుదేశం బూచిని చూపి... గతంలో ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు కుదుర్చుకుని, మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూ రెండో ఎస్సార్సి వేయడం అనే ఒక జంతర్‌మంతర్ అగ్రిమెంట్ కుదుర్చుకుని మొత్తం తెలంగాణా ప్రజల భవిష్యత్తును సోనియమ్మ చేతిలో పెట్టాడు.
సోనియమ్మ భజన చేసుకుంట తెలంగాణా వచ్చే దాక కూడా ఆగలేక తెలంగాణా రాష్ట్ర సమితి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు తీసుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం కొంతకాలం పక్షపాతం లేకుండా కృషి చేసి పునీతమైంది.
ఆదిలోనే హంసపాదులా టిఆర్‌ఎస్ తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అప్పుడే శతృపక్షంలో చేరిపోయారు.
ఉద్యమం అంటే ఉన్న గుప్పెడు మంత్రి పదవులకు, ఎంపి, ఎంఎల్‌ఎ పదవులకు రాజినామాలు చేయడం ... మళ్లీమళ్లీ బై ఎలక్షన్లకు వెళ్లడం ... అనే వింత తంతు కింద మార్చి పారేసి చివరికి కెసిఆర్ అభాసు పాలయ్యాడు.
ఇక ఇప్పుడు...
నిన్నటి దాకా తెలంగాణా ద్రోహుల పార్టీ అని దుమ్మెత్తి పోసిన టిడిపి తో.... అట్లాగే - ఒక భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలు వుండటానికి వీలు లేదు గాక వీలులేదని మనసా వాచా కర్మనా నమ్మే సిపిఎంతో .....(వాళ్లు కాంగ్రెస్ పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడంటె అప్పుడు తమ విశ్వాసాన్ని మార్చుకుంటరు గని తెలంగాణా మీద మాత్రం చచ్చినా మార్చుకోరు. సాక్షాత్తు కారల్ మార్క్స్ వచ్చి తెలుగోళ్లకి రెండు రాష్ట్రాలు వున్నా తప్పులేదురభై అని చెప్పినా ఒప్పుకోరు) అట్లాంటి సిపిఎంతో పొత్తుకు సై అంటున్నాడు. వాళ్లు (సిపిఎం) ఒక దిక్కు తెలంగాణా వద్దనుకుంట తెలంగాణా ప్రజాసమితి తోని అప్పుడు కాంగ్రెస్‌తో కలిసి, ఇప్పుడు టిడిపితో కలిసి ఎట్ల పొత్తుకు సై అంటున్నరో బ్రహ్మ దేవునికి కూడా అర్థం కాదు.
ఈ సిపిఎం ఒప్పుకోకపోవడం వల్లనే ...(కం...చెం...చ...ష్ రాక)... ప్రత్యేక తెలంగాణా మీద తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని కాంగ్రెస్ మొన్నటిదాకా పాటపాడుతూ వచ్చింది.
అట్లాగే అప్పుడు తెలుగు దేశం మోకాలడ్డడం వల్లనే తామ హయాంలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయలేకపోయామని, లేకపొతే మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణాను కూడా అప్పుడే ఏర్పాటు చేసివుండేవాళ్లమని బిజెపి వాపోతోంది.
గీ ముచ్చట గిట్లుంటె .......
నిన్న మొన్నటి దాకా సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో వుంటూ వచ్చిన దేవేందర్ గౌడ్ జెర ఆలస్యంగనైనా తెలంగాణా పల్లవి అందుకుని నవతెలంగాణా ప్రజా పార్టీని తెరిచిండు. ఇప్పుడు గాయన ప్రజారాజ్యం పార్టీతోని చేతులు కలుపుతుండు.
మరోపక్క పాపం తెలుగుదేశం పార్టీ సుత ... ప్రజల సెంటిమెంటును గౌరవించి ప్రత్యేక తెలంగాణాకు (రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడానికి) అనుకూలంగా తీర్మానం చేసింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అయితె ... రేపు అధికారంలోకి రాంగనె ఫౌరెన్ ... అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేస్తానని ఢంక బజాయించి చెప్తోంది. పవన్ కళ్యాణ్ తెలంగాణా నడిబొడ్డున నిలబడి తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పటివరకు ఏం వెలగబెట్టిందని గల్ల పట్టుకుని నిలదీస్తుండు.
తెలుగు దేశం అధికారంలో వున్నప్పుడు తెలంగాణాకు ప్రత్యేక పిసిసి కావాలని.... రాజశేఖర రెడ్డిని సైమన్ గోబ్యాక్ అని ... నానా హడావిడి చేసిన చాలీస్ తెలంగాణా కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు తెలంగాణా సమస్యను నాలుగున్నరేళ్ల కిందట సోనియమ్మ చేతులపెట్టి సప్పుడు చెయ్యకుంట, ఫరాకతుగా ... తమ పని తాము చేసుకుంట పోతున్నారు.
ఏందిర భై గీ పాలిటిక్స్ గింత లత్తకోరుగున్నయి అని సోంచాయించే వాళ్లకి ఏమనిపిస్తాందంటే ...........
ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఇక ఆంధ్ర నాయకులే నడుపుతరేమో అని !!!
తెలంగాణా నాయకులకు తెలంగాణా ఉద్యమాన్ని నడపడం చాతనైతలేదు.
తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకులకు జైకొడ్తే సాలు తెలంగాణా వచ్చినట్లె.
అందరు బే ఫికర్‌గ వుండుండ్రి....!
తెలుగు దేశం అధికారంలోకి వచ్చిందనుకోండ్రి......
ప్రత్యేక తెలంగాణాకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితడు.
ప్రత్యేక ఆంధ్రకు బాలకృష్ట ముఖ్యమంత్రి అయితడు.
ఆ దెబ్బతోని ఏ పరేశాన్లు గిరేశాన్లు లేకుండ నందమూరి కుటుంబం మొత్తం సమైక్యంగ వుంటది.
అట్లగాక........
ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చిందనుకోండ్రి...
ప్రత్యేక ఆంధ్రకు చిరంజీవి ముఖ్యమంత్రిగ వుంటడు,
ప్రత్యేక తెలంగాణాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితడు.
సర్వేజనా సుఖినోభవంతు.
ఏమంటరు ?????

Friday, January 23, 2009
మనిషికి ఎంత భూమి కావాలి సత్యం / సిఎం గారూ ??????
అనగనగా ఒక రైతు.
అతనికి ఓ రెండెకరాల పొలంవుండేది. ఆరుగాలం శ్రమిస్తూ అందులో బంగారం పండించేవాడు. తిండిగింజలకు లోటు లేకుండా అతని కుటుంబం నిశ్చింతగా జీవిస్తుండేది.
అయితే అతని కో అన్న వున్నాడు. ఆయన పట్నంలో ఏదో ఉద్యోగం చేస్తూ వీళ్లకంటే కాస్త ఉన్నతంగా బతుకుతున్నాడు. వాళ్లని చూసినప్పుడల్లా రైతు భార్య తమ మట్టి బతుకు పట్ల, అరకొర సౌకర్యాలపట్ల తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండేది.
దరిమిలా - ' మరో పదెకరాల పొలం వుంటేనా...' అనే ఆలోచన ఆ రైతును తొలవడం ప్రారంభించింది.
ఇలా వుండగా ఊళ్లోని దొరసానమ్మ తన పొలం మొత్తం అమ్ముకుని పట్నం వెళ్లిపొతోందన్న వార్త వెలువడింది. అందరితో పాటు ఆ రైతు కూడా అప్పోసప్పో చేసి ఓ పదెకరాలు కొనేశాడు.
దాంతో ఆతని ఆదాయం పెరిగింది. పరపతి పెరిగింది. వైభోగం పెరిగింది.
ఇలా అతనూ అతని కుటుంబం దర్జాగా జీవిస్తుండగా ఒక బాటసారి మరో తీయని కబురు చెవిలో వేశాడు.
దూరంగా ఓ ప్రాంతంలో .....రూపాయికి ఎకరం చొప్పున ....కారు చవగ్గా భూములు అమ్ముతున్నారట. తను అదే పనిమీద వెళ్తున్నానని చెప్పాడతను.
ఒక్కసారిగా రైతు కళ్ల ముందు మరో అద్భుతమైన రంగుల ప్రపంచం ప్రత్యక్షమయింది.
మొత్తం తన పన్నెండెకరాల పొలాన్ని, ఇంటినీ తెగనమ్మి భార్యాపిల్లలతో ఆ ప్రాంతానికి వలసపోయాడు.
అక్కడ రెండొందల ఎకరాల పొలాన్ని, చక్కని భవంతిని సొంతం చేసుకున్నాడు.
ఇప్పుడు రైతు కాస్తా భూస్వామిగా మారాడు.
పట్నంలోని తన అన్న కన్నా అతని అంతస్తు వెయ్యి రెట్లు పెరిగింది.
ఇట్లా వుండగా మళ్లీ మరో బాటసారి మరో వింతైన కబురు తెచ్చాడు. పొరుగు రాజ్యంలో భూములను ..... పైసాకి ఎకరం .... చొప్పున అమ్ముతున్నారట!!
వారి నాయనోయ్! ... తన రెండొందల ఎకరాల భూమిని అమ్మితే ... ఆ రాజ్యంలో రెండు వేల ఎకరాల భూమిని సొంతం చేసుకోవచ్చు!!!.
అంతే
తక్షణమే తన భూమి మొత్తాన్ని అమ్మేసి కుటుంబంతో ఆ రాజ్యం పయనమయ్యాడు.
అక్కడ రాజావారు ఆ రైతు తెచ్చిన డబ్బును పుచ్చుకుని మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదన చేశాడు.
''నువ్వు ఉదయం ఒక చోటు నుంచి బయలు దేరి నీకు కావలసినంత భూమికి హద్దులు పెట్టుకుంటూ సూర్యాస్తమయం అయ్యేలోపు బయలు దేరిన చోటుకు చేరుకోవాలి. అప్పుడు నువ్వు తిరిగినంత నేల నీ సొంతమవుతుంది. ఒక వేళ సూర్యాస్తమయం అయ్యే లోపు బయలు దేరిన చోటుకు రాలేక పోతే మాత్రం నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వడం జరగదు'' అన్నాడు రాజు.
మన రైతుకు ఆ ప్రతిపాదనతో కళ్ళు బైర్లు కమ్మాయి.
ఈ దెబ్బతో ... రెండువేల ఎకరాలేం ఖర్మ .... ఒక చిన్నపాటి రాజ్యాన్నే సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు.
మర్నాడు సూర్యోదయం కాగానే నిర్ణీత ప్రదేశం నుంచి బయలు దేరాడు. నెమ్మదిగా నడిస్తే ఎక్కువ ఏరియాని కవర్ చేయలేనని పరుగులు తీయడం మొదలు పెట్టాడు.
పరుగెత్తాడు... పరుగెత్తాడు.. పరుగెత్తాడు...
ఆయాసాన్ని లెక్కచేయకుండా కొండలు కోనలు దాటుతూ మధ్యాహ్నం కల్లా చాలా మైళ్ల దూరం వచ్చేశాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని ఈ నేలంతా నాదే కదా అని మహదానంద పడిపోయాడు.
అంతలో అతనికి రాజుగారు పెట్టిన షరతు గుర్తుకు వచ్చింది.
సూర్యుడు అప్పుడే నడినెత్తి మీద వున్నాడు.
అమ్మో సూర్యాస్తమయం అయ్యేలోగా బయలు దేరిన చోటుకు చేరుకోవాలి కదా ... సంపాదించుకున్న భూమి ఇక చాల్లే అని వెనుతిరగాడు.
అప్పటికి అతని ఒంట్లో శక్తి చాలావరకు హరించుకుపోయింది. నీరసం, కాళ్ల నొప్పులు.. అడుగు తీసి అడుగువేయాలంటే కష్టంగా వుంది.
లేని ఓపికను తెచ్చుకుంటూ నడకను కొనసాగించాడు.
ఎట్టకేలకు సూర్యాస్తమయం కాబోతున్న వేళ ... అతనికి తను బయలుదేరిన చోటు, అక్కడ రాజుగారి బిడారం కనుచూపు దూరంలో కనిపించింది.
అప్పటికి చెప్పులు తెగిపోయి, కాళ్లు వాచిపోయి రక్తం కారుతున్నాయి.... నోరు దాహంతో పిడచట్టుకు పోతోంది.... కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి....
దూరంగా జనం “ వచ్చేయ్...” “ ఇంకా త్వరగా నడువు ...” అంటూ కేకలు వేస్తున్నారు.
కానీ పాపం రైతు నడవలేకపోయాడు.
అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు.
చివరికి ఒక్కసారిగా దభీల్మని బయలుదేరిన చోటును పూర్తిగా చేరుకోకుండానే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
అంతా అయ్యో పాపం అనుకున్నారు.
అతడి శవాన్ని అక్కడే .... ఆరడుగుల .... గొయ్యితవ్వి పూడ్చేశారు !
ఇది మహా రచయిత టాల్ స్టాయ్ 1886లో ''ఎంత భూమి కావాలి'' అన్న పేరుతో రాసిన కథ తాలూకు (ఇష్టానుసారంగా చేసిన) సారాంశం.
ఇవాళ ఈనాడులో ......''రామలింగ రాజు భూదాహం'' ......అన్న శీర్షికతో వచ్చిన వార్త చదివిన తరువాత నాకు ఈ కథ గుర్తుకు వచ్చింది.
http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm
దురాశ ఎంత వాడినైనా ఎంత పతనం చేస్తుందో, పరువు ప్రతిష్టలను ఏవిధంగా మంటకలుపుతుందో కదా అనిపించింది.
మైటాస్ కంపెనీకి అనుబంధంగా మరో 240 బినామీ సంస్థలను పుట్టించి 3500 ఎకరాలను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో దొరికిన పత్రాల ద్వారా గుర్తించారట. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములున్నాయో.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ భూదందా వెర్రితలలు వేస్తోంది.
భూసంస్కరణలు, సీలింగ్ చట్టం ఎక్కడ చచ్చాయో ఏమో.
పేదవాడికి గుడిసె వేసుకునేందుకు 25 గజాల స్థలం దొరకదు కానీ ఒక్కక్కడు ఎక్కడపడితే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు, ఏ పేరుతో అంటే ఆ పేరుతో గుటకాయస్వాహా చేస్తున్నాడు.
రాబోయే రోజుల్లో ఇక చచ్చిన పేదల శవాల్ని పూడ్చేందుకు కూడా జాగా దొరకదేమో!!!!
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేంత వరకు ప్రత్యేక తెలంగాణాకు సానుకూలంగా వుండి....
(ఇప్పటికీ మేం తెలంగాణాకు వ్యతిరేకం కాదు, తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తాం, సరైన సమయంలో సరైన నిర్ణయం, సమస్య పరిష్కారం బాధ్యతను అధిష్టానం చేతిలో పెట్టాం వంటి సొల్లు కబుర్లు కొనసాగిస్తూనే వున్నారనుకోండి)
... అధికారం చేజిక్కాక ఇప్పుడు తెలంగాణాకు బద్ధ వ్యతిరేకంగా మారడానికి కారణం కూడా ఈ భూదందాయే.
ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్న భూములను ఎక్కడ వదులుకోవలసి వస్తుందో, లేదా వాటి ధరలు ఎక్కడ తగ్గిపోతాయో అన్న భయం వల్లనే ఈ మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది.
అసత్యమేవ జయతే
సత్యం వధ, ధర్మం చెఱ!
కొస మెరుపు :
సత్యం రామ లింగ రాజు మీద మన యువ సాఫ్టు వేర్ ఇంజనీర్లు ఇటీవల కసితో ఒక వీడియో గేం ని రూపొందించారు. అందులో మీరు చేయవలసింది ఆయన మొహం మీద కుళ్ళిన కోడి గుడ్లు విసరడం . ఒక నిమిషం లో ఎన్ని గుడ్లు అయన మొహానికి కొడితే అన్ని పాయింట్లు వస్తాయి. .మీరు ఇంకా చూడక పొతే ఇదిగో ఆ గేం చిరునామా:
http://nailthethief.com/
...............................

Wednesday, January 21, 2009
ఉత్తరం
( వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవలసిన బాధ్యత తప్పనిసరిగా పిల్లలదే. కానీ మానవ సంబంధాలన్నీ యాంత్రికంగా మారిపోతున్న ఈ కాలంలో ఏవో సాకులు చెబుతూ చాలామంది తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో వున్న తల్లిదండ్రులు సైతం ఇవాళ పిల్లల ఆప్యాయతకోసం అ లమటిస్తున్నారు. ఒంటరితనంతో కుంగి పోతున్నారు. ఈ సబ్జెక్ట్ మీద రాసిన కథ ఇది.
ఇందులో ఉత్తరం సంఘటన యథార్థంగా జరిగింది. ఒకసారి చిక్కడపల్లి పోస్టాఫీసుకు వెళ్లినప్పుడు ఒక చిత్తుకాగితాలు ఏరుకుని బతికే కుర్రాడు తారస పడి నాచేత ఈ ఉత్తరం రాయించుకున్నాడు. అతని పేరు అన్వర పాషానే. అందులోని వాక్యాలన్నీ అతనివే. నన్ను తీవ్రంగా స్పందింపచేశాయవి. అతను నాకు మళ్లీ కనిపించలేదు.)
ఉత్తరం (కథ)
''ఏం గురూ గారూ? ఇంకా బిజీ తగ్గినట్టులేదే!'' స్టూల్ లాక్కుని పక్కనే కూర్చుంటూ వెటకారంగా అన్నాడు శాస్త్రి.
అతను మా డిపార్ట్‌మెంట్‌లోనే మరో సెక్షన్‌లో పనిచేస్తాడు.మా పెళ్లిళ్లవక ముందు మే మిద్దరం రూం మేట్స్‌మి కూడా.
''బిజీయా పాడా! నాన్న గారికి లెటర్ రాస్తున్నాను. అంతే...!'' అన్నాను పెదవి విరుస్తూ.
''ఏంటి విశేషాలు?''
''ఏముంది, ఇక్కడ నేనేదో వేలకు వేలు సంపాదించి పోగేస్తున్నట్టు డబ్బు పంపమని కబురు చేశాడు. అందుకు సమాధానమే ఈ ఉత్తరం...''
''అరే, చిత్రంగా వుందే! సరిగ్గా మా నాన్నగారి దగ్గరి నుంచి నాక్కూడా ఇట్లాంటి లెటరే వచ్చింది. దానికి ఇప్పుడే రిప్లై రాశాను. ఇదిగో...'' అని జేబులోని ఉత్తరాన్ని తీసి చూపించాడు. ''మళ్లీ జన్మలో డబ్బు పంపమని అడక్కుండా ఘాటుగా రాశాను. మనం చేసేది గుమస్తాగిరి అనుకుంటున్నారో... కలెక్టర్‌గిరీ అనుకుంటున్నారో అర్థం కాదు''.
''ఈ మహానగరంలో ఒక్క జీతంతో బతకడం ఎంత కష్టమో పల్లెటూర్లోని వాళ్లకెలా తెలుస్తుంది. చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ల గోల వాళ్లదే కదా.'' అన్నాను.
''ఇవాళ నా మూడేం బాగోలేదు సూర్యం. నీ పరిస్థితీ అదే కాబట్టి ఓ పనిచేద్దామా?'' అడిగాడు.
''ఏంటి''అన్నాను.
''అ లా బార్ కెళ్లి ఓ పెగ్గేసుకుందామా? కాస్త శిరోభారమైనా తగ్గుతుంది.''
''నెలాఖర్లో... బారుకి...'' నిరాశగా నవ్వాను.
''డబ్బు దేముంది? మన ఆఫీసులో అప్పులిచ్చే ఐరావతాలు బోలెడు. అది నేను చూసుకుంటాన్లే కానీ ఐదు నిమిషాల్లో దుకాణం కట్టేసి రెడీగా వుండు.'' అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు.
మేమేమీ రెగ్యులర్ తాగుబోతులం కాదు. ఏ రెండుమూడు నెలలకోసారో... ఎరియర్స్ లాంటి అదనపు ఆదాయం చేతికందినప్పుడు ఏ బార్‌కో హోటల్‌కో వెళ్తుంటాం అంతే.
మేం ఇద్దరం నడుచుకుంటూ ముందు పోస్టాఫీసుకెళ్లాం. ఎటు వెళ్లాలన్నా కాలినడకే... లేదంటే ఆర్టీసీ బస్సే గతి.
మా ఆఫీసులో అటెండర్లకి సైతం బైకులున్నాయి. కానీ మా ఇద్దరికే లేవు. అసలు మాకు డ్రైవింగ్ కూడా రాదు. ఎలాగూ కొనే స్థోమత లేదు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
ఉత్తరాలని పోస్టుబాక్సులో పడేశాక సగం బరువు దిగినట్టనిపించింది!
వెనుదిరుగుతుంటే ''నమస్తె సార్'' అన్న పిలుపు వినిపించింది.
తైల సంస్కారం లేని జుట్టు... నల్లగా మాసిపోయిన దుస్తులు...పదిహేనేళ్లుకూడా లేని ఆ కుర్రాడి అవతారం చూసి బిచ్చగాడనే అనుకున్నాను.
దేశం నిండా బిచ్చగాళ్లే.
పొద్దున లేచింది మొదలు అర్థరాత్రి వరకు ఎక్కడి కెళ్లినా వీళ్లే ప్రత్యక్షమవుతారు. దేశం రోజురోజుకీ ఎంత అభివృద్ధి చెందుతోందో మరి.
''చిల్లర లేదు ఫో...'' అని చీదరించుకున్నాను.
''సార్ నేను బిచ్చగాణ్ని కాదు సార్!'' అన్నాడు వాడు నొచ్చుకుంటూ.
నేను వాడివంక ఎగాదిగా చూశాను.
''కొంచెం ఈ ఉత్తరం రాసిపెట్టండి సార్!'' అంటూ నలిగిన ఓ ఇన్ లాండ్ లెటర్‌ని అందించబోయాడు.
వాడిని బిచ్చగాడని పొరబడిన నా తొందరపాటుకు సిగ్గనిపించింది.
''వెధవ గోల పదండి గురూ గారూ! టైం లేదు. ఒరే నువ్వు వేరే ఎవర్నైనా చూసుకో..''అంటూ నా చేయిపట్టుకుని లాగాడు శాస్త్రి.
''గంట సేపట్నుంచీ అందర్నీ అడుగుతుండాను సార్. ఎవరూ రాయడం లేదు. మీరైనా రెండు ముక్కలు రాసిపెట్టండి సార్ నాకు చదువు రాదు సార్!'' నా పాదాలకు నమస్కరించబోయాడు వాడు.
ఎందుకో వాడిమీద సానుభూతి కలిగింది. వాడి చేతిలోని ఇన్‌లాండ్ లెటర్‌ని అందుకున్నాను.
శాస్త్రి అసహనంతో నిట్టూర్చి ''సరే త్వరగా కానివ్వండి...నేను ఈ లోగా సిగరెట్లు తెస్తా'' అని పాన్ షాప్ వైపు వెళ్లాడు.
ఫొస్టాఫీసు ముందున్న బెంచీపై కూర్చుంటూ ''ఎవరికి?'' అని అడిగాను.
''మా యమ్మకి సార్'' అన్నాడు వాడు.
నేను గబగబా రాయడం మొదలుపెట్టాను.
ప్రియమైన అమ్మకి
నమస్కరించి వ్రాయునది-
ఇక్కడ నేను క్షేమంగానే వున్నాను. అక్కడ మీరంతా క్షేమంగా వున్నారని తలుస్తున్నాను.' అని ముందుమాట రాసేసి ఊ చెప్పు'' అన్నాను.
''అమ్మా ... నేను ఈడ బాగానే వుండాను. మీరు బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.'' అని చెప్పాడు.
వీడికి ఉత్తరాల ఛందస్సు బాగానే తెలిసినట్టుందే అని నవ్వుకున్నాను. ''ఊ.. రాశాలే... ఆ తర్వాత ఏం రాయమంటావో చెప్పు...''
''నాకు ఒంట్లో బాగా లేక రెణ్నెళ్ల కాన్నించి పనికి పోటం లేదు. అందు గురించే నీకు పైసలేమీ పంప లేక పోయినాను. ఏమీ అనుకో బాకు. ఇప్పుడు నా ఒంట్లో బాగానే వుండాది. మళ్లీ పనిలోకి పోతున్నాను. నాలుగైదు దినాలల్ల ఎట్టాగైనా చేసి ఎంతో కొంత డబ్బు పంపిస్తాను.
ఇంట్లో ఎంత కష్టంగా వుండాదో అని నాకు చానా బెంగగా వుండాది. నిన్న రేత్రి చాంద్ బీ కలలోకొచ్చింది. అప్పటినుంచి నాకు అన్నం సయించటం లేదు. దానికి పోలియో రాకుంటే ఎంత బాగుండేదో అని ఎప్పుడూ అనుకుంటాను. తమ్ముళ్లు ఎలా వున్నారు. చెప్పిన పని చేస్తున్నారా ఊరికే జులాయిగా తిరుగుతున్నారా?
బాబూ సేఠ్ తన బాకీ డబ్బుల గురించి ఊరికే బాధ పెడ్తున్నాడా? ఒక్క ఆరు నెలలు ఓపికపట్టమని చెప్పు. ఆయన బాకీ మొత్తం నేను తీర్చేస్తాను. నేను ఇప్పుడు వేరే సోట పనిలో చేరాను. మునపటికన్నా నాలుగు డబ్బులు ఎక్కువ దొరుకుతున్నాయి. పాత అడ్రసుకు ఉత్తరం రాయించబోకు. కొత్త అడ్రసు తర్వాత తెలియజేస్తాను. తమ్ముళ్లను అడిగానని చెప్పు. చాంద్‌బీకి మరీ మరీ ముద్దులు.
ఇట్లు మీ కొడుకు అన్వర్ పాషా.''
వాడు ప్రవాహంలా చెప్పుకుంటూ పోయాడు... నేను మంత్రముగ్ధుణ్నై అదే వేగంతో రాస్తూ పోయాను. వాడి నోటి నుంచి వెలువడిన వాక్యాలు నాలోని సుషుప్త మనసును చురుక్కు మనిపించాయి.
ఇంకా చెప్పాలంటే ఆ వాక్యాలు నాకు శరాఘాతాల్లా తగిలాయి.
కొద్ది క్షణాలకిందట మా నాన్నకు రాసి పోస్ట్ చేసిన ఉత్తరానికీ, వీడు తన తల్లికి నా చేత రాయించిన ఉత్తరానికీ మధ్య ఎంత తేడా వుంది!
సిగ్గుతో నాలో నేనే కుంచించుకు పోయాను.
''ఏం పని చేస్తావు అన్వర్ పాషా?'' అనడిగాను వాడివంక వాత్సల్యంగా చూస్తూ
''కాగితాలు ఏరుకుంటాను సార్'' అన్నాడు.
''ఏంటీ...?!''
''గల్లీలు తిరిగి చెత్తకాగితాలు ఏరి అమ్ముకుంటాను సార్!''
''రోజుకి ఎంత సంపాదిస్తావు?''
''ఐదు, పది ఒక్కో రోజు ఒక్కో లాగ సార్! మొన్నటి వరకు హోటల్లో పనిచేశాను సార్. నా చేతులకు పుళ్లయితే సేఠ్ నన్ను పనిలోంచి తీసేసి మరొకర్ని పెట్టుకున్నాడు.... ఆకాడ్నుంచీ ఈ పని చేస్తావున్నాను. మా యమ్మకు తెలిస్తే బాధ పడతాదని ఈ మాట రాయించలేదు సార్...''
నా మనసు మరింత భారమైపోయింది.
సిగరెట్ కాలుస్తూ దూరంగా నించున్న శాస్త్రి 'ఇంకా ఏంటీగోల. పద పద' అన్నట్టు సైగ చేశాడు.
ఒక్క ఐదు నిమిషాలు ఆగు అన్నట్టు నేను కూడా సైగద్వారానే చెప్పాను. అరచేత్తో తలను కొట్టుకుంటూ మరో సిగరెట్ వెలిగించాడు.
''హోటల్లో పనిచేస్తే చేతులకు పుళ్లవుతాయా అన్వర్?'' అని అడిగాను.
''పొద్దున లేచిన కాడ్నుంచి రేత్రి పడుకోపోయే వరకు అంట్లు కడుగుతూ, తడిబట్టతో బండలూ బల్లలూ తుడుస్తూ వుంటే చేతులు కాళ్లు నాని నాని పుళ్లుకాక మరేమవుతాయి సార్'' అన్నాడు.
నాకు వాడిని చూస్తుంటే ఏదో తెలియని మమకారం కలుగసాగింది. ఇంత చిన్న వయసులో వీడికి ఎన్ని కష్టాలు... వీడి మాటల్లో ఎంత విజ్ఞత.
''మీ ఇల్లెక్కడ అన్వర్?'
'
''ఇల్లా...'' అంటూ నవ్వి ''ఇదివరకు హోటల్లోనే వుండేవోడ్ని. ఇప్పుడు ఫుట్‌పాతే నా ఇల్లు. పగలంతా గల్లీలు తిరుగుతూ కాగితాలు ఏరుకోడం, అమ్ముకోడంతోటే సరిపోతుంది. రేత్రి ఏడోకాడ తొంగుంటాను''
''మరి నీ సామాను?!''
మళ్లీ నవ్వాడు. ఆ నవ్వు కూడా ఎంత కమ్యూనికేటివ్‌గా వుందో!
''నాకు సామానేముంటాది సార్. అదిగో ఆ సంచే నా సామాను. అందులోనే ఓ ప్లేటు, గ్లాసు, జత బట్టలు వున్నాయి.'' అంటూ దూరంగా పడేసినట్టున్న గోనె సంచీని చూపించాడు.
నాకు నోట మాటరాలేదు. భారంగా చూస్తూ ''అడ్రస్ చెప్పు'' అన్నాను.
''ఖమ్రున్నీసా బేగం, సత్తయ్య సైకిల్ షాపు పక్కన, భవాని పురం, బనగానపల్లి.''
''ఎక్కడి బనగాన పల్లి ఎక్కడి హైదరాబాదు! అక్కడే పని చూసుకోక ఒక్కడివీ ఇంత దూరం ఎందుకొచ్చావు అన్వర్?'' కుతూహలంగా అడిగాను.
''మా నాయిన యాక్సిడెంటులో చచ్చిపోయాడు సార్. బాబు సేఠ్ దగ్గర ఎప్పుడో అప్పు చేశాడంట. నేను ఆయన దగ్గిరే పనిచేసేవోణ్ని. వడ్డీ కింద జీతం చెల్లు అంటూ ఒక్క పైసా కూడా యిచ్చేవాడు కాదు. అక్కడుంటే ఇంక అప్పు ఎప్పటికీ తీరదని ఇటు పారిపోయొచ్చాను.'' అన్నాడు.''నెల నెలా మా యమ్మకి నలభై ... యాభై ఎంత కూడితే అంత పంపిస్తావుంటాను. మా బాకీ తీరినాక అక్కడికే యెల్లిపోతాను సార్''.
నా మనసంతా దేవినట్టయిపోయింది. తమాయించుకుంటూ ''ఒకసారి ఉత్తరం చదివి వినిపించమంటావా అన్వర్?'' అని అడిగాను.
''మీ దయ సార్'' అన్నాడు. తాపీగా చదివాను. నేనే రాసినప్పటికీ ఒక్కో వాక్యం చదువుతుంటే నాకే కొత్తగా వింతగా అనిపించింది.
చాలా శ్రద్ధగా ఉత్తరాన్ని అంటించి వాడికిచ్చాను.
వాడు రెండు చేతులూ జోడించి దాన్ని తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో వేసి వెళ్లిపోయాడు.
నేను మాత్రం శిలావిగ్రహంలా బెంచీ మీద అట్లాగే కూర్చుండిపోయాను.
వాడి ఉత్తరానికీ, నా ఉత్తరానికీ మధ్య ఎంత భయంకరమైన తేడా!
అక్షరం ముక్కరాని అన్వర్...తిండికీ, ఠికాణాకూ కూడా దిక్కు లేని అన్వర్... ఇంకా సరిగా ముక్కపచ్చలారని వయసులో వున్న అన్వర్.. తన కన్న తల్లిని ఆదుకోడానికి ఎంత తహ తహలాడుతున్నాడు!
వాడి తల్లిదండ్రులు వాడికి జన్మను తప్ప యిచ్చిందేమీ లేదు!!
అయినా వారిమీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత కృతజ్ఞత...!!
మరి నేను...
మానాన్న తన కోరికలను చంపుకుని, ఒకపూట తినీ ఒక పూట తినక నానా ఇబ్బందులు పడుతూ నన్ను డిగ్రీ వరకు చదివించాడు. నాకు ఇరవై రెండేళ్ల వయసు వచ్చేవరకు తనే పెంచి పోషించాడు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బ తిని కాస్త డబ్బు సాయం చేయమని అడిగితే ఎంత నిర్దయగా, ఎంత ఘాటుగా జవాబు రాశాడు తను!
రోజూ పెట్టెడు సిగరెట్లు కాలుస్తూ, కాఫీ టీలకి డబ్బులు తగలేస్తూ, అప్పుడప్పుడు సినిమాలూ, షికార్లు, పార్టీలు ఏదీ వదులుకోకుండా, ఏ త్యాగమూ చేయకుండా ఒకింత నిశ్చింతగానే బతుకుతూ అట్లా ఉత్తరం రాయడం ఎంత దుర్మార్గం.
అక్షర జ్ఞానం లేని అన్వర్ నాలోని హిపోక్రసీ ముసుగును తొలగించి వెళ్లిపోయాడు.
''ఏంటి దీర్ఘాలోచనలో పడ్డావు. వాడు నీ మూడ్‌ను ఇంకా పాడు చేసినట్టున్నాడే...'' అంటూ నా భుజం తట్టి అన్నాడు శాస్త్రి.
''లేదు శాస్త్రీ. వాడు నా కళ్లు తెరిపించాడు.'' అన్నాను.
''ఇంత సెన్సిటివ్‌గా ఆలోచిస్తే ఈ లోకంలో బతకలేం సూర్యం. ఇట్లాంటివాటిని పట్టించుకోకూడదు. పదపదా..'' అన్నాడు శాస్త్రి చాలా తేలిగ్గా తీసుకుంటూ.
''సారీ శాస్త్రీ. నేనిప్పుడు మందు తాగలేను. ఈ రోజే కాదు ఇంకెప్పుడూ తాగను. సిగరెట్లు కూడా ఈ క్షణం నుంచే మానేస్తున్నాను. అర్జంటుగా ఊరెళ్లి నాన్నను పరామర్శించిరావాలి. గత్యంతరం లేని స్థితిలో తప్ప నన్ను ఎప్పుడూ ఆయన డబ్బు అడగడు. ఇట్లాంటి సమయంలో కూడా సాయం చేయకపోతే కొడుకునని చెప్పుకునే అర్హత ... అసలు మనిషినని చెప్పుకునే అర్హత కూడా నాకు వుండదు.'' అన్నాను.
ప్రతిస్పందన కోసం అతనివంక చూడకుండానే గబగబా ఇంటివైపు అడుగులువేశాను.
---
(పల్లకి సచిత్ర వార పత్రిక, డిసెంబర్ 26, 1985 లో ప్రచురించ బడింది)
.................................

Sunday, January 18, 2009
చెమ్మగిల్లిన కళ్లు
''డాక్టర్‌గారు ఆపరేషన్ థియేటర్‌లో వున్నారు. బయటకు రావడానికి గంటన్నా పడుతుంది..!''
సిస్టర్ సమాధానంతో రామ్మూర్తికి ఒక్కసారి నీరసం ఆవహించినట్టయింది.
కూతురి పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. ఎక్కడి పనులు అక్కడే వున్నాయి.
తర్వాత వద్దామంటే డాక్టర్ గారు చాలా బిజీ మనిషి ... మళ్లీ దొరుకుతారో దొరకరో.
చేతిలో వున్న శుభలేఖల వంక చూసుకుంటూ ఎటూ పాలుపోక కాసేపు అట్లాగే నించుండిపోయాడు రామ్మూర్తి. చేయవలసిన ఇతర పనులకంటే ముందు డాక్టర్‌గారిని కలవడమే ముఖ్యమనిపించింది.
ఆసుపత్రి వరండాలో ఖాళీగా వున్న బెంచీ మీద అసహనంగా చతికిలపడ్డాడు.
అక్కడ అప్పటికే మరో ఐదారుగురు కూచుని వున్నారు. వాళ్లంతా లోపల ఆపరేషన్ జరుగుతున్న పేషెంట్ తాలూకు మనుషులని వారి మొహాలే చెబుతున్నాయి. అందరూ దిగులుగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నట్టున్నారు.
ఆపరేషన్ థియేటర్ తలుపు మీద ఎర్రలైటు వెలుగుతోంది.
వెచ్చని రక్తంలో అప్పుడే ముంచి తీసినట్టుందది.
గోడలమీద కంటి జబ్బులకు సంబంధించిన రకరకాల చార్టులు వేలాడుతున్నాయి.
'కళ్లను జాగ్రత్తగా సంరక్షించుకోవడం ఎలా?',
'ఎ విటమిన్ లోపం - పసిపిల్లల పాలిటి శాపం',
'కంటి జబ్బులు - వాటి లక్షణాలు'
కంజెక్టివైటిస్, ఐరిస్, ట్రకోమా, గ్లూకోమా, కాటారాక్ట్, కార్నియల్ అ ల్సర్, టెరీజియమ్....
అబ్బ ఇన్ని రకాల కంటి జబ్బులా?! ఆ బొమ్మల్ని చూస్తుంటే గుండెలో కెలికినట్టయింది.
గట్టిగా కళ్లు మూసుకున్నాడు. కంటిముందున్న సమస్త ప్రపంచం ఒక్క క్షణంలో అదృశ్యమైపోయింది. చీకటి... కారు చీకటి... అంతులేని శూన్యం...
హడలిపోతూ చప్పున కళ్లు తెరిచాడు.
పంచరంగుల లోకం కళ్ల ముందు తిరిగి ప్రత్యక్షమయింది.
రెప్పలు మూస్తే కరంటు పోయినట్టు అంధకారం... రెప్పలు తెరిస్తే స్విచ్ వేసినట్టు భళ్లున పరచుకునే వెళుతురు! తనకా సౌలభ్యం వుంది.
కానీ కళ్లకు శాశ్వతంగా ఇనుప తెరలున్నవాళ్ల పరిస్థితి ఏమిటి?
ఇరవైనాలుగు గంటలూ చీకటిని భరించాలంటే ఎంత దుర్భరంగా వుంటుందో.
అందుకే అన్నారు... సర్వేంద్రియానాం నయనం ప్రధానం!
రామ్మూర్తి ఆలోచనలు ఎక్కడెక్కడో పరిభ్రమిస్తుండగానే ఎర్రలైటు ఆరిపోయింది.
డాక్టర్ రావు గారు డోరు తెరచుకుని బయటికొచ్చారు. అంతవరకు శిలా విగ్రహాల్లా కూచున్న వాళ్లంతా దిగ్గున లేచినిలబడ్డారు.
'చూచితిన్ సీతన్' అని హనుమంతుడు రాముడికి సమాచారం అందించినట్టు ''గుడ్ లక్. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ వాడికి చూపు వచ్చినట్టే'' ఉల్లాసంగా చెప్పారు డాక్టర్ రావు.
అందరి మొహాలూ ఒక్కసారి హండ్రెడ్ క్యాండిల్ బల్బుల్లా వెలిగిపోయాయి.
''మీ మేలు జన్మలో మరిచిపోలేం డాక్టర్ గారూ... మీరు మా పాలిటి దేవుడేనండీ...'' వంగి కాళ్లమీద పడబోయినవ్యక్తిని సున్నితంగా అడ్డుకుంటూ ముందుకు కదిలారు డాక్టర్ రావు.
రామ్మూర్తి ఎదురెళ్లి రెండు చేతులూ జోడించాడు.
డాక్టర్ రావు చిరునవ్వుతో తలపంకిస్తూ అతని భుజంమీద చేయి వేసి ''రండి. నా గదిలో కూచుని మాట్లాడుకుందాం'' అన్నారు.
రామ్మూర్తి ఆయనను మౌనంగా అనుసరించారు.
బాటిళ్లో వున్న మంచినీళ్లని గ్లాసులోకి వంపుకుని తాగి ''మీకూ కావాలా?'' అనడిగారు డాక్టర్ రావు.
వద్దన్నట్టు తల ఊపాడు రామ్మూర్తి.
కాస్త రిలాక్సయి, గొంతు సవరించుకుని '' రెండ్రోజుల క్రితమే మీ అభ్యర్థనని మా మెడికల్ అసోసియేషన్ ముందుంచాను.'' అన్నారు.
''ఏమన్నారు సార్?... ఒప్పుకున్నారా!''
''లేదు, బ్లంట్‌గా తిరస్కరించారు.''
''సా...ర్...!''
''ఇందులో వాళ్ల తప్పేంలేదు. రూల్సే అలా వున్నాయి. రక్త దాతల పేర్లు గానీ, నేత్ర దాతల పేర్లు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోగికి వెల్లడించకూడదు. వారి పేర్లను గోప్యంగా వుంచాలి అనేది మా ప్రాథమిక సూత్రం. కళ్లను ఎవరు ఇచ్చారు... వాటిని ఎవరికి అమర్చారు వంటి విషయాలు వెల్లడిస్తే న్యాయపరంగానూ, సామాజికంగానూ కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం వుంటుంది.''
రామ్మూర్తి ఒక్కసారిగా హతాశుడైపోయాడు.
చేతులు జోడించి ఎంతో ఆవేదనగా ''మా వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా రాదు సార్. మాకు ఇందులో ఎలాంటి స్వార్థమూ, ఏ దురుద్దేశమూ లేదు. ప్రమాణం చేసి చెబుతున్నాను సార్. నా మాట నమ్మండి. కావాలంటే మీరు ఎలాంటి హామీ రాసివ్వమన్నా రాసిస్తాను. చచ్చినా మరెవ్వరికీ ఈ విషయం చెప్పం సార్. దయచేసి నా కూతురు కోరిన ఈ చిన్న కోరికను కాదనకండి సార్. అది అప్సెట్ అయిపోతుంది. ప్లీజ్ సార్..'' అన్నాడు.
డాక్టర్ రావు అతని వంక నిశితంగా చూశాడు.
రామ్మూర్తే తిరిగి కొనసాగించాడు. ''అమ్మ సెంటిమెంటు ఎంత బలమైనదో మీకు తెలియంది కాదు కదా సర్. అమ్మ చనిపోయినా- నేత్ర దానం వల్ల ఆమె కళ్లు మరో వ్యక్తిలో జీవించేవున్నాయన్న భావన... అమ్మ కళ్లు తన పెళ్లిని చూడాలి, తనని ఆశీర్వదించాలి అన్న కోరిక నా కూతురిలో బలంగా ఏర్పడింది. దయచేసి ఆ వ్యక్తిని ఎలాగైనా ఈ పెళ్లికి వచ్చి, నా కూతురి తల మీద నాలుగు అక్షింతలు వేసి వెళ్లేట్టు చేయండి సార్. మళ్లీ ఎప్పుడూ వాళ్లని కానీ, మిమ్మల్ని కానీ ఇబ్బందిపెట్టం సార్. ఇది పిచ్చితనమో, అర్థంలేని సెంటిమెంటో ఏదైనా అనుకోండి. కానీ నా కూతురి తృప్తికోసం ఈ చిన్న కోరికను కాదనకండి సార్''.
కడుపులోంచి తన్నుకొచ్చిన దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.
''రామ్మూర్తిగారూ, ప్లీజ్ కూల్‌డౌన్. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మాయిది అర్థం లేని కోరికేం కాదు. అదొక ఉదాత్తమైన ఆలోచన. ఆ భావన నిజంగా నన్ను కూడా కదిలించింది. అందుకే నేను స్వయంగా వెళ్లి మా మెడికల్ అసోసియేషన్‌లో గట్టిగా వాదించాను. చివరికి నా పర్సనల్ రిస్క్‌పై అసోసియేషన్ అనుమతిని కూడా సాధించగలిగాను. కానీ...''
''కానీ... ఏం జరిగింది సార్?'' సంభ్రమంగా, ఆందోళనగా అడిగాడు రామ్మూర్తి.
''ఏంలేదు. మీ శ్రీమతి కళ్లను ఎవరికైతే ట్రాన్స్‌ప్లాంట్ చేశామో వాళ్లు ఇల్లు మారారు. ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఎంత ప్రయత్నించినా తెలియలేదు.''
రామ్మూర్తిలో అప్పుడే చిగురించిన ఆశ కాస్తా పాలపొంగు మీద నీళ్లు చిలకరించినట్టు చప్పున చల్లారిపోయింది.
''మీరేం వర్రీ అవకండి. ఎలాగైనాసరే వాళ్ల అడ్రస్ కనుక్కునేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తాను. సరేనా'' అనునయించారు డాక్టర్ రావు.
''ఏమో సార్. నా కూతురికి మంకు పట్టు ఎక్కువ. దాన్ని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు.''
''నా మాటగా చెప్పండి. ఇప్పుడిది నా సమస్య. మీరిక ఈ విషయం గురించి ఆలోచించకండి. నిశ్చింతగా మీ పనులు చూసుకోండి.'' ధైర్యం చెప్పారాయన.
చేసేదేం లేక భారంగా లేచాడు.
''అంతా మీ దయ సార్. మా అమ్మాయి పెళ్లికి కనీసం మీరైనా తప్పకుండా రావాలి.'' అంటూ చేతి సంచీలోంచి ఒక శుభలేఖ తీసి అందించాడు రామ్మూర్తి.
''ఓ ష్యూర్'' అంటూ కరచాలనం చేశారు డాక్టర్ రావు.
ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఏడాది క్రితం జరిగిన సంఘటన అతని మనసులో మెదిలింది.
ఆరోజు...
తను పనిచేసే స్కూల్లో డిఇఓ ఇన్‌స్పెక్షన్ జరుగుతోంది. తను చాలా బిజీగా వున్నాడు. అట్లాంటి సమయంలో అటెండర్ పరుగెత్తుకుని వచ్చి ''అమ్మగారికి సీరియస్‌గా వుందట సార్ మిమ్మల్ని అర్జంటుగా రమ్మని కబురొచ్చింది.'' అని చెప్పాడు.
తనకి గుండె ఆగినంతపనయింది.
డిఇఓ గారు ''మీరు వెళ్లండి ఫరవాలేదు'' అనడంతో ఆఘమేఘాల మీద ఇల్లు చేరాడు.
కానీ అప్పటికే తన అన్నపూర్ణ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తనకి చివరి చూపు కూడా దక్కలేదు.
అన్నపూర్ణకి పెద్దగా జబ్బేమీ లేదు. అప్పుడప్పుడు కడుపు నొప్పి, నడుం నొప్పి అని మాత్రం బాధపడేది. ఆమెకి అ ల్లోపతీ మందులు పడేవికావు. అందుకే ఎప్పుడూ హోమియో మందులు తీసుకుంటుండేది. కానీ ఇంత హఠాత్తుగా ప్రాణాల మీదికి ఎట్లా ముంచుకొచ్చిందో తెలియదు.
కొండంత బాధనైనా పంటి బిగువన దిగమింగుకునే ఓర్పు ఆమెకుండేది. మొదటినుంచి ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకూడదు అనుకునే మనస్తత్వం ఆమెది. అందుకే తన బాధలని, సమస్యలని ఎవరికీ చెప్పుకునేది కాదు. బహుశా ఆ అతి మంచితనమే ఆమె ప్రాణం మీదికి తెచ్చిందేమో.
అప్పటికీ తన కూతురు సౌమ్య తల్లి బాధను చూసి ఆసుపత్రికి వెళ్దాం పదమ్మా అని ఎంత బలవంతం చేసినా ఆమె ''ఏం ఫరవాలేదు సౌమ్యా, మామూలు నొప్పే ఇది'' అంటూవచ్చిందట. అంతలోనే ఆమె గుండె ఆగిపోయింది.
దాదాపు పాతిక సంవత్సరాలు తనతో జీవితం పంచుకున్న అన్నపూర్ణ, తన ప్రాణంలో ప్రాణమైన అన్నపూర్ణ తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా వెళ్లిపోయింది.
అన్నపూర్ణని అట్లా నిర్జీవంగా చూడవలసివస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. ఆమె శవం మీద పడి చిన్నపిల్లాడిలా భోరున ఏడ్చాడు.
సౌమ్యనైతే ఎవరూ పట్టుకోలేకపోయారు.
ఎందుకో అంత దు:ఖంలోనూ హఠాత్తుగా తనూ, అన్నపూర్ణా నేత్రదానం చేయాలంటూ అంతకు కొద్దిరోజుల క్రితమే తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఓ ఐ బ్యాంకు వాళ్లు తమ స్కూలుకు వస్తే ఇతర్లతో పాటు తను కూడా మరణానంతర నేత్రదాన హామీ పత్రంపై సంతకం చేశాడు.
ఇంటికి వెళ్లింతరువాత ఐ బ్యాంకు వాళ్లిచ్చిన కార్డు చూపించినప్పుడు తను కూడా నేత్రదానం చేస్తానంటూ పట్టుబట్టింది. వెంటనే మరో పాం తీసుకొచ్చి నింపి ఇచ్చేవరకూ ఊరుకోలేదు.
అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదేమో అనిపిస్తుంది. తను త్వరలో వెళ్లిపోతున్నట్టు అన్నపూర్ణకు తెలుసేమో... తన నేత్రాలను త్వరగా దానం చేసేందుకే తను ఇంత అర్థంతరంగా తనువు చాలించిందేమో...
తను గుండె రాయి చేసుకుని ఐ బ్యాంకు వాళ్లకి కబురు పంపించాడు.
అరగంటలో ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగింది.
విషయం తెలిసిన సౌమ్య ఒక్కసారి హిస్టీరిక్‌గా మారిపోయింది. ''మా అమ్మ కళ్లను తీసుకుపోతారా? వీల్లేదు.. మా అమ్మ కళ్లను పెరికేసేందుకు వీల్లేదు. నేను ఒప్పుకోను..'' అంటూ పెద్ద గొడవచేసింది.
''మీ అమ్మ చివరి కోరిక కదమ్మా. తీర్చకపోతే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుందా? మేమేమీ మీ అమ్మ కనుగుడ్లను పూర్తిగా పెరికించట్లేదమ్మా. కేవలం సన్నని పొరల్లాంటి ............ కార్నియాలను మాత్రమే తొలగిస్తాం.
వాటితో మరొకరికి చూపు వస్తుంది. మీ అమ్మ కళ్లు మరో జీవితకాలం సజీవంగా వుంటాయి.
శరీరంతో పాటు వాటిని కూడా అగ్నికి ఆహుతిచేస్తే ఏమొస్తుంది చెప్పు. పైగా మీ అమ్మ స్వయంగా కోరుకున్న ఆఖరు కోరిక కదా ఇది..'' అంటూ డాక్టర్ రావుగారే సౌమ్యకు ఎన్నోరకాలుగా నచ్చజెప్ప చూశారు.
అయినా సౌమ్య వినిపించుకోకుండా తన మంకుపట్టును వీడకపోవడంతో ఆమెను బలవంతంగా మరో గదిలోకి లాక్కెళ్లవలసి వచ్చింది.
అప్పుడు అంతగా వ్యతిరేకించిన సౌమ్యే ఇప్పుడు తన తల్లి కళ్లు తన పెళ్లిని చూడాలని, తనను ఆశీర్వదించాలని పట్టుపడుతోంది.
... ... ...
తండ్రి చెప్పిన వృత్తాంతం విన్న సౌమ్య ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయింది.
తన తల్లి లేకపోయినా ఆమె సజీవమైన కళ్లు ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తూనే వున్నాయన్న భావన ఆమెలో అ లౌకిక ఆనందా న్నిస్తోందామెకు. తన తల్లి కళ్లతో ఈ లోకాన్ని చూస్తున్న వ్యక్తి పాదాలకు ఒక్కసారి నమస్కరించాలని, ఆ కళ్లలో అమ్మ ప్రతిరూపాన్ని తనివితీరా చూసుకోవాలని ఎంతగానో అశపడిందామె.
దిగాలుపడిపోతున్న తన కూతురి తలమీద చేయి వేసి నిమురుతూ ''పెళ్లికి ఇంకా చాలా రోజుల టైం వుంది కదమ్మా. ఈ లోగా వాళ్ల చిరునామా దొరుకుతుందిలే. డాక్టర్ గారు గట్టిగా ప్రయత్నిస్తానని మాటిచ్చారుగా.'' అంటూ అనునయించాడు రామ్మూర్తి.
చూస్తుండగానే పెళ్లిరోజు వచ్చేసింది.
డాక్టర్ రావుగారి నుంచి మాత్రం ఎలాంటి కబురూ రాలేదు. తమకా అదృష్టం లేదని ఆశ వదులుకున్నాడు
రామ్మూర్తి.
పెళ్లిపనులు, డబ్బు సర్దుబాటు గొడవల్లో ఒక విధంగా ఆ విషయాన్ని పక్కనపెట్డాడాయన.
సౌమ్యకు మాత్రం ఇంకా ఎక్కడో ఏమూలో ఆశ మిణుకుమిణుకు మంటోంది. తల్లి చిత్రపటం వేపు చూసినప్పుడల్లా ఆమెకు కేవలం కళ్లే కనపడేవి.
ఆరోజు మంగళ వాయిద్యాల హోరు మొదలయింది. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా వరుడు వధువు మెడలో కట్టేందుకు మంగళసూత్రం పట్టుకుని లేచాడు.
అంతే...! సరిగ్గా అదే సమయంలో ''ఆగరా.. ఆగు'' అనే అరుపు వినిపించింది.
పెళ్లిపందిరిలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ అరిచింది ఎవరోకాదు పెళ్లికొడుకు తల్లి రాఘవమ్మ. ఆమె గబగబా వచ్చి తన కొడుకు చేయిపట్టుకుని మంటపం బయటకు లాగింది.
''ఒప్పుకున్న కట్నం పూర్తిగా ఇవ్వందే ఈ పెళ్లి జరగదు'' అందావిడ.
''అదేమిటండీ అ లా అంటారు. అణాపైసలతో పూర్తిగా ముందే ఇచ్చేశాం కదా మీకు'' అన్నాడు రామ్మూర్తి.
'' స్కూటర్ డబ్బు ఎక్కడిచ్చారు? మాకే ఠోకరా వేయాలని చూస్తున్నారా?''
అసలు స్కూటర్ విషయం ముందు అనుకోనేలేదనీ, కావలిస్తే పండక్కి ఇస్తాననీ, ఇప్పుడంటే ఇప్పుడు తన దగ్గర అంత డబ్బులేదనీ ప్రాధేయపడ్డాడు రామ్మూర్తి.
ఈ వాదోపవాదాలతో వియ్యం కాస్తా కయ్యంగా మారిపోయింది. అంతా గందరగోళంగా వున్న అదే సమయంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు డాక్టర్ రావుగారు.
అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి ''నమస్కారం రాఘవమ్మగారూ'' అన్నారు.
రాఘవమ్మ ఆయనను చూసి అవాక్కయిపోయింది.
''గుర్తుపట్టారా నన్ను? ఏడాది క్రితం యాక్సిడెంట్‌లో మీకు చూపుపోతే ఆపరేషన్ చేసి చూపు తెప్పించిన డాక్టర్‌ని.....''
''...ఏమయ్యా పెళ్లికొడుకా నీకైనా గుర్తున్నానా? మీ అడ్రస్ కనుక్కోవడం ఆలస్యమైనా సరిగ్గా సమయానికి ివచ్చానన్నమాట ఇక్కడికి.'' అన్నారు డాక్టర్ రావు.
పెళ్లికొడుకూ పెళ్లికొడుకు తల్లీ నిర్ఘాంతపోతూ మొహమొహాలు చూసుకున్నారు. వాళ్లు ఆయననేమీ మరచిపోలేదు. అయితే ఆ సమయంలో ఆయన అక్కడికి రావడం, ఆయన మాటలు వాళ్లను విస్మయానికి గురిచేశాయి.
పెళ్లి పందిరిలో కలకలం తగ్గి క్రమంగా నిశ్శబ్దం అ లముకుంది.
''రాఘవమ్మగారూ, మీరు ఏ కళ్లతో ఇవాళ తిరిగి లోకాన్ని చూడగలుగుతున్నారో ఆ కళ్లు ఎవరివో తెలుసా?'' నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఖంగున మోగింది ఆయన కంఠం.
''ఇదిగో మీ కాబోయే కోడలి కన్నతల్లివే... అంటే మీ వియ్యపురాలివేనమ్మా ఆ కళ్లు.''
డాక్టర్ రావు మాటలు బాంబులా పేలాయి. ఒక్కసారిగా మళ్లీ కలకలం చెలరేగింది.
''అన్నపూర్ణమ్మ తన కూతురి పెళ్లికి కట్నంగా ఎంతో అమూల్యమైన తన కళ్లని మీకు ముందే ప్రసాదించింది కదమ్మా ..... ఇంకా ఎందుకమ్మా ముష్టి స్కూటర్ కోసం పాకులాడతావు?'' అన్నాడాయన.
రాఘవమ్మకు ఒక్కసారిగా ఏదో షాక్ తగిలినట్టు ... మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది. ఆమె అప్రయత్నంగా, దిగ్భ్రాంతిగా సౌమ్యవైపు చూసింది.
క్షణం కిందటి వరకు భగ్గున మండినట్టున్న ఆ చూపుల్లో ఇప్పుడు మచ్చుకు కూడా కాఠిన్యం లేదు.
సౌమ్య పెళ్లిపీటలమీదనుంచి మంత్రముగ్దలా లేచి ''అమ్మా'' అంటూ పరుగున వచ్చి రాఘవమ్మను పెనవేసుకుపోయింది.
ఆ దృశ్యం చూసిన అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.
----
( స్వాతి సపరివార పత్రిక, 09-05-1997 సౌజన్యంతో )
Saturday, January 10, 2009
డాడీ... నాకో పిస్తోల్ కావాలి! ....
డాడీ... నాకో పిస్తోల్ కావాలి!
ఎగ్జిబిషన్ నుంచి బయటపడ్డాం!
ఏమీ కొన్లేదు - లోపలికెళ్ళేందుకు అవసరమైన టికెట్లు తప్ప!!
మా ఆవిడ మౌనంగా వుంది. ఆ మౌనంలో ఏ భావమూ లేదు. అదంతే. 'ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్' అన్న సామెతకు అతీతమైన వదనం ఆమెది.
అదీ ఒకందుకు మంచిదే అయింది. లేకపోతే పెళ్లయిన ఈ ఎనిమిదేళ్లలో నేను ఎన్నిసార్లు అసహనంతో జుట్టు పీక్కోవలసి వచ్చేదో!
ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది మా ఆవిడ ముఖం గురించికాదు. మా పెద్దబ్బాయి నిశాంత్ గురించి! మా ఆవిడ గురించి ఇవాళ కొత్తగా ఆలోచించవలసిందేమీ లేదు. మా వైవాహిక జీవితం యాంత్రికంగా తయారై చాలాకాలమే అయింది.
అసలామెకు ఈరోజు ఎగ్జిబిషన్‌కు రావడమే ఇష్టంలేదు.
''ఏం వుంటుంది ఎగ్జిబిషన్‌లో? కిక్కిరిసిన షాపులూ, ఇసకపోస్తే రాలనంత జనం, దుమ్మూ ధూళీ గోల తప్ప! మనమేమైనా కొనేదుందా చచ్చేదుందా! ఖర్చు పెట్టే స్థోమత లేనప్పుడు అదేదో తద్దినంలా ప్రతియేడూ ఎందుకు వెళ్లడం ఎగ్జిబిషన్‌కు?'' అంది ముందే.
అయినా నేనే బలవంతం చేశాను. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య వుండటం కంటే అట్లా ఊరికే వెళ్లొస్తే పిల్లలకైనా కాస్త రిలీఫ్‌గా, సరదాగా వుంటుంది కదా అని నా ఉద్దేశం. ఏం కొన్నా కొనక పోయినా ఊరికే చూసొస్తే ఏం పోతుంది?
సరే మధ్య మా ఆవిడ గొడవెందుకులెండి. మా పెద్దబ్బాయి నిశాంత్ ఎగ్జిబిషన్‌కు బయల్దేరేముందు ఎంత ఉత్సాహంగా కనిపించాడో, అందులోంచి బయటికొచ్చేటప్పుడు అంత డీలా పడిపోయాడు.
అసలు వాడి మొహం వంక చూడాలంటేనే భయంగా వుంది నాకు. ఫేస్ రీడింగ్ నేర్చుకోడానికి పిల్లల మొహాలెంత అనువైనవో! నేను వాడు కోరిన చిన్న కోరికను తీర్చలేదనీ...నమ్మించి తనని మోసం చేశాననీ వాడి అంతరంగం ఆక్రోశిస్తోంది!
నిజంగా వాడు కోరింది ఏమంత పెద్ద కోరికేం కాదు.
''డాడీ! నాకో పిస్తోల్ కొనివ్వవా?'' అన్నాడు.
కొత్తగా ఇవ్వాళ కాదు, ఎప్పుడో రెండు మూడు నెలలకిందటి నుంచీ అడుగుతున్నాడు.
''ఎగ్జిబిషన్ వస్తుంది కదా బాబూ, అప్పుడు కొనిస్తాలే! అందులో ఆయితే బోలెడు వెరైటీలుంటాయి. చక్కగా మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. మామూలు షాపుల్లో అయితే ఒకటి రెండు రకాలే వుంటాయి. అవైనా అంత బాగోవు!'' అంటూ ఏదో ఒకటి చెప్తూ ఇన్నాళ్లుగా వాడి కోరికను వాయిదా వేస్తూ వస్తున్నాను.
తీరా ఎగ్జిబిషన్ వచ్చాక కూడా వాడి చిన్న కోరికను తీర్చలేకపోయాను.
దాంతో వాడి ఆక్రోశం తారాస్థాయికి చేరుకుంది.
వాస్తవానికి ఏ పదో పదిహేనో అయితే కొందామనే అనుకున్నాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఇరవై రూపాయలు జేబులో వేసుకునే బయల్దేరాను.
కానీ వాడికి నచ్చిన పిస్తోలు ధర డెబ్భై రూపాయలని నా గుండె ఠారు మంది.
''ఇంకోసారి వచ్చినప్పుడు కొందాంలేరా'' అంటే ఎందుకు వింటాడు. వినడు. విన్లేదు. ఆ క్షణం నుంచీ అ లక.
వాడికి తెలుసు ఏడాదికి ఒకసారి ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లడమే గొప్ప. రెండుసార్లు వెళ్లడం అనేది జరగనిపని. అథవా వెళ్లినా ఇప్పుడు లేని డబ్బు అప్పుడెక్కడినుంచి వస్తుంది?
జనంలో ఎక్కడ తప్పిపోతాడో అని వాడి చేయి పట్టుకో బోతే విదిలించుకుంటాడు...భుజం మీద చేయివేస్తే విసుక్కుంటాడు... దూరదూరంగా నడుస్తాడు.
నేను ఆడినమాట తప్పానన్న ఆక్రోశం తప్పితే... నాబోటి సగటు తండ్రి ఆవేదనా, ఆర్థిక ఇబ్బందులూ వాడికి ఎలా అర్థమవుతాయి!?
నిజం చెప్పాలంటే వాడికంటే నా మనసే ఎక్కువగా గాయపడింది.
కన్నకొడుకు నోరువిప్పి అడిగిన అతి చిన్న కోరికను కూడా తీర్చలేని నా దౌర్భాగ్య స్థితికి నామీద నాకే జాలేసింది. నామీద నాకే వెగటు కలిగింది. కానీ కొన్ని బతుకులింతే అని సర్దుకుపోక చేయగలిగిందేముంది?!
ఇక మా చిన్నబ్బాయి నిఖిల్... వాడికింకా నాలుగేళ్లు నిండలేదు. ఎగ్జిబిషన్‌లో వున్నంత సేపూ కనపడ్డ ప్రతీదీ కావాలంటూ మారాం చేశాడు. జెయింట్ వీల్ ఎక్కుదామనీ, బుల్లి ట్రైన్‌లో తిరుగుదామనీ ఒకటే గోలచేశాడు. వాటి ముందేమో పొడగాటి క్యూలు. అదీకాక అప్పటికే నాలో ఆసక్తి అఃతరించింది. ఎలాగోలా వాడి దృష్టిని మళ్ళిస్తూ ఎగ్జిబిషన్ బయటపడ్డాం.
ఎగ్జిబిషన్ లోపల ఎంత సందడిగా వుందో బయట అంతకంటే ఎక్కువ గోలగా వుంది. చిల్లర వర్తకులు ''ఏక్ రూప్యా ... దో రూప్యా...'' అంటూ నీటి బంతుల్ని, గాలి బుడగల్నీ, టిక్ టిక్‌లనీ వచ్చే పోయే జనం మొహంలో పెట్టి మరీ అమ్ముకుంటున్నారు.
సరే మేం కూడా ఎగ్జిబిషన్ చూసొచ్చాం అని నలుగురికి చాటుకునేందుకు వీలుగా నేను రెండు ''టిక్ టిక్''లు కొన్నాను. దానికే మా చిన్నాడు ఎంతో పొంగిపోయాడు.
రెండో టిక్ టిక్‌ని మా పెద్దాడికి ఇవ్వబోతే వాడు దాన్ని కోపంతో విసిరికొట్టాడు. అది ఎక్కడో జనం కాళ్లకింద పడి నలిగిపోయింది.
నాలో ఒక్కసారిగా ఆగ్రహం, అసహనం పెల్లుబికాయి. కానీ వాటిన లోలోనే అణిచేసుకున్నాను.
మొత్తం మీద మా విహార యాత్రని ఆవిధంగా ముగించుకుని సిటీ బస్సులో వేలాడుతూ ఇల్లు చేరాం.
ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే మా పెద్దాడు రెండు చెప్పుల్నీ రెండు వైపులకు గిరాటేసి, గబగబా వెళ్లి మంచమెక్కి, చేతుల్లో మొహం దాచుకుని బోర్లా పడుకున్నాడు.
కొంచెం అన్నం తిని పడుకోరా అని నేనూ, మా ఆవిడా ఎంత బతిమిలాడినా ససేమిరా వినిపించుకోలేదు.
నేను హతాషుణ్నయిపోయాను. ఏం చేయాలో తోచక కుర్చీలో జారగిలపడ్డాను.
ఈలోగా మా ఆవిడ చిన్నాడిని చంకనేసుకుని అన్నం తినిపించింది. బాగా అ లసిపోయాడేమో తినగానే మంచమెక్కి నిద్రలోకి జారుకున్నాడు.
ఇల్లంతా నిశ్శబ్దంగా తయారైంది.
మా ఆవిడ నా ఎదుటికొచ్చి అటెన్షన్‌లో నిలబడి ''భోజనం వడ్డించమంటారా?'' అంది.
నేను ఒక్క క్షణం ఆమె కళ్లల్లోకి సూటిగా చూసి '' వాడు ఆకలితో పడుకున్నా నీకు తినాలనిపిస్తోందా?!'' అన్నాను.
అంతే...
మారుమాట్లాడకుండా సీరియస్‌గా వెళ్లి చిన్నాడి పక్కన తనూ ముసుగుతన్ని పడుకుంది.
నా మనసు చివుక్కు మంది.
ఆమె తరహాయే అంత. మనసు ఆవేదనతో తల్లడిల్లుతున్నప్పుడు కాస్త అనునయించడం కానీ, సానుభూతి చూపడం కానీ వుండదు.
డబ్బునే కాదు మాటల్ని కూడా మహా పొదుపుగా వాడుతుంది. ఆ పొదుపు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఆ రాత్రి నేను భయంకరమైన ఒంటరితనంలో కూరుకుపోయాను. భార్యాపిల్లలు వుండి కూడా ఏకాకిలా ఫీలయ్యే పరిస్థితి ఎంత దుర్భరంగా వుంటుందో అనుభవిస్తే కానీ తెలియదు.
ఒక్కసారి నా బాల్యం గుర్తుకొచ్చింది.
మా నాన్న ఓ పెద్ద బట్టల మిల్లులో చిన్న కార్మికుడు. మా అమ్మ బట్టలు కుడుతూ నాన్నకు చేదోడు వాదోడుగా వుండేది. వాళ్లు ఏమాత్రం చదువుకోకపోయినా నన్ను మాత్రం బాగా చదివించాలని తాపత్రయపడేవారు. అందుకే తమ ఆర్థిక స్థోమతను లెక్కచేయకుండా నన్ను ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించారు. ప్రైవేటు స్కూల్లో అయితే పాఠాలు బాగా చెబుతారనీ, చదువు బాగా అబ్బుతుందనీ వాళ్ల ఆశ.
ఆ స్కూల్లో నూటికి తొంభైమంది పిల్లలు డబ్బున్న కుటుంబాలనుంచి వచ్చినవాళ్లే.
అదృష్టవశాత్తూ అందరూ ఒకే యూనిఫాం ధరించాలి కాబట్టి వేషంలో ఆ తేడా తెలిసేది కాదు.
కానీ ఇంట్రవెల్లో, లంచ్ టైంలో వాళ్లు బయటికెళ్లి ఐస్‌క్రీంలూ, చాక్లెట్లు కొనుక్కుని తింటున్నప్పుడు, తండ్రుల స్కూటర్ల మీదో, ప్రత్యేక రిక్షాల్లోన్నో వెళ్తున్నప్పుడు తన బీదరికం వెల్లడయ్యేది.
నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఇంటి నుంచి స్కూలుకు కాలినడకన వచ్చేవాడు తను. పుస్తకాలు పెట్టుకునేందుకు సరైన బ్యాగు కూడా వుండేదికాదు. ఆలస్యమైపోతుందని వేగంగా నడిచినప్పుడు ఒకోసారి పుస్తకాలు రోడ్డుమీద పడిపోయేవి. స్లిప్పర్లు తరచూ తెగిపోతూ మరింత ఇబ్బంది పెడ్తుండేవి.
ఎందుకో చిన్నప్పటినుంచీ డబ్బున్నవాళ్లంటే ఈర్ష్యగా వుండేది. అదేసమయంలో తమకు కూడా బాగా డబ్బుంటే ఎంతబాగుండేదో అన్న దురాశా వుండేది.
దీపావళి పండుగప్పుడు డబ్బున్న వాళ్లకీ డబ్బు లేనివాళ్లకీ మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపించేది.
నాన్న ఏదో నామకార్థం ఒకటి రెండు కాకరపువ్వొత్తుల డబ్బాలు, కాసిన్ని పిస్తోలు పువ్వులు కొనుక్కొచ్చి మమ అనిపించేవాడు. తనకు మాత్రం చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, మతాబులు, బాంబులు కాల్చాలని ఎంతో ఉబలాటంగా వుండేది.
ఎప్పుడైనా నాన్నని అడిగితే ''ఎందుకురా డబ్బు దండగ'' అంటూ నిరుత్సాహపరిచేవాడు. తను మొహం మాడ్చుకు కూచుంటే ''పదరా అట్లా వెళ్లొద్దాం.'' అంటూ బయటకు తీసుకెళ్లేవాడు.
తమ ఇంటి దగ్గర్లోనే వున్న ఓ డబ్బున్న కుటుంబం దీపావళికి వేల రూపాయల టపాకాయలు కాల్చేది. వాళ్ల ఇంటి దగ్గర నిల్చోబెట్టి వాళ్లు ఓ చిచ్చుబుడ్డి అంటించగానే...నాన్న ''ఐదు రూపాయలు తుస్సు..'' అనేవాడు. ఓ బాంబు పేల్చగానే ''నాలుగు రూపాయలు ఢాం'' అని వ్యాఖ్యానిస్తూ నవ్వించేవాడు. ఎవరు కాలిస్తే ఏమిటి చూసేది అదే వెలుతురు, వినేది అదే శబ్దం. ఆమాత్రానికి డబ్బులు తగలెయ్యడం దేనికి అని ఆయన ఉద్దేశం.
కొందరికి డబ్బు వుండటానికీ, ఎందరికో డబ్బు లేకపోవడానికీ కారణం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడేదికాదు. అయితే ఎంతో మంది బాగా డబ్బున్న వాళ్ల పిల్లలకంటే చదువులో ముందుండటం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా గొప్పగా అనిపించేది.
అప్పట్లో పాఠశాలల్లో ఒక చిత్రమైన సాంప్రదాయం వుండేది. ప్రతి పిరియెడ్‌లో టీచర్లు ముందుగా అంతకు ముందురోజు చెప్పిన పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. సమాధానాలు చెప్పని విద్యార్థులను నించోబెట్టేవారు. సమాధానం చెప్పిన విద్యార్థిచేత వాళ్లకి చెంపదెబ్బలు కొట్టించేవారు.
తను ప్రతి ప్రశ్నకు ఠకీమని జవాబు చెప్పేవాడు. ఆ తరువాత ఉత్సాహంగా ఎడమ చేత్తో ముక్కు పట్టుకుని కుడిచేత్తో ఒక్కొక్కరి చెంపలు వాయిస్తూ వెళ్లేవాడు. నిజం చెప్పాలంటే ఆ అవకాశం కోసమే తను శ్రద్ధగా ఏరోజు పాఠం ఆరోజు చదివేవాడు. ఆ చర్య తనకు వెర్రి ఆనందాన్ని, ఎనలేని సంతృప్తిని యిచ్చేది. ''చదవడం చాతకాదు కానీ డబ్బులు తేరగా వచ్చాయని ఇంట్రవెల్లో ఐస్‌క్రీంలు, చాక్లెట్టు తెగ మెక్కుతారా'' అని మనసులోనే అనుకుంటూ ఒక్కో చెంప వాయిస్తుంటే ప్రపంచంలో తనను మించిన ధనవంతుడు లేడనిపించేది.
నాకు ఇష్టమైనవాడి చెంపమీద మెల్లిగానూ, ఇష్టంలేనివాడి చెంపమీద గట్టిగానూ కొడుతుండేవాణ్ని. ఒకసారి ఒకడి చెంప మీద ఈడ్చి కొడితే ధడేలుమని కిందపడిపోయాడు. చెంప మీద ఐదువేళ్ళూ అచ్చుతేలాయి. వాడసలే ఊళ్లో ఎంతో పేరున్న బడా వ్యాపారవేత్త కొడుకు. దాంతో టీచర్ బెంబేలు పడిపోయాడు. అంత గట్టిగా కొడతావా అంటు నన్ను చితకబాదాడు. ఇక ఆరోజు నుంచి మా క్లాసులో ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పారు.
మా పెద్దబ్బాయి నిద్రలో కలవరిస్తుంటే నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను. వాడు నిద్రలోనే మొహం చిట్లించి ''నా కేమొద్దు...నాకేమొద్దు ఫో..''అంటున్నాడు.
బహుశ ఎగ్జిబిషన్‌లో డెబ్భై రూపాయల పిస్తోలుకు బదులు అర్థ రూపాయి 'టిక్ టిక్' కొనిచ్చిన సందర్భం గుర్తొచ్చి వుంటుంది.
నేను కుర్చీలోంచి లేచివెళ్లి నెమ్మదిగా వాడి పక్కన పడుకున్నాను. వాడి వీపు మీద ఆప్యాయంగా నిమిరాను. వాడు లేక లేక కోరిన చిన్న కోరిక తీర్చలేకపోయిన నా నిస్సహాయ స్థితికి కుమిలిపోతూ కళ్లు మూసుకున్నాను.
పిస్తోలు మీద వాడికింత మోజు ఏర్పడటం వెనక బలమైన కారణమే వుంది.
మేం అద్దెకున్న ఇంట్లో నాలుగైదు వాటాలున్నాయి. ఒక్కో వాటాలో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలున్నారు. తీరిక సమయాల్లో వాళ్లంతా కలిసి ఏ బంతాటో, దాగుడుమూతలో ఆడుకుంటుంటారు. అయితే మూన్నెళ్ల కిందట మా ఇంటి యజమాని తన కొడుక్కి ఓ ఆటొమేటిక్ గన్ ఏదో కొనిచ్చాడు. దాంతో వాడు పెద్ద పోలీసు ఆఫీసరో, ఆర్మీ కమాండరో అయినట్టు పోజుకొట్టడం, మిగతా పిల్లల్ని దొంగలు, శతృవులు అన్నట్టు చూడటం మొదలెట్టాడు. తన గన్‌ను ఎవరినీ కనీసం తాకనివ్వడం లేదు. దాంతో సహజంగానే చాలా మంది పిల్లలకి తమకు కూడా అట్లాంటి గన్నో పిస్తోలో వుంటే బాగుండునన్న కోరిక కలిగింది.
ఆటలో ఎప్పుడూ దొంగ పాత్రనే పోషించాలంటే మావాడికి అవమానంగా వుంది! మరి పోలీసాఫీసర్ పాత్ర వేయాలంటేే సొంతంగా పిస్తోలు సమకూర్చుకోవాలి!! అక్కడినుంచి వాడికి పిస్తోలు మీద యావ మళ్లింది.
మా ఇంటి యజమానికేం తక్కువ. తల్లిదండ్రులు కట్టిచ్చిన లంకంత కొంపమీద బోలెడు ఆద్దెలొస్తాయి. ఏ కష్టం చేయకుండా కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేస్తున్నాడు. ఇవాళ తన కొడుక్కి పిస్తోలు కొనిచ్చాడు రేపు మరింకేదైనా కొనివ్వగలడు..
కానీ, చాలీ చాలని జీతంతో బతుకుబండిని లాగడమే కష్టమైపోతున్న నాకు అదెలా సాధ్యం. అతన్తో నేనెలా పోటీ పడగలను? ఈ విషయాన్ని ఆ పసి హృదయానికి అర్థం అయ్యేట్టు చెప్పడమెలా?!
మా నాన్న నా కంటే మరీ తక్కువ జీతంతో మమ్మల్నందరినీ ఎలా పెంచి పెద్ద చేశాడా అని ఒకోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆరోజు ఆయన ఎలాగోలా చదివించబట్టే ఈరోజు నాకు ఈ మాత్రం గుమస్తా ఉద్యోగమైనా దొరికింది.
ఏమాత్రం అక్షరజ్ఞానం లేని నాన్న తనని డిగ్రీ వరకు చదివిస్తే తను పిల్లల్ని కనీసం ఏ పోస్ట్ గ్రాడ్యుయేషనో, ఇంజనీరింగో చదివించకపోతే నా బతుక్కి అర్థం వుండదుకదా.
ఈ ఆలోచనతోనే నేను నా పిల్లల్ని నా స్థోమతకు మించి పేరున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాను.
అయితే నేను చదువుకున్నప్పటి చదువులకీ ఇప్పటి చదవులకీ మధ్య ఎంతో తేడా వుంది. అప్పుడు ఇంతలా డొనేషన్లు, ఫీజుల, పుస్తకాల ఖర్చు లేదు. ఐదేళ్లు నిండిన తరువాతే పిల్లలు బడి మొహం చూసేవారు. కానీ ఇప్పుడు నర్సరీలు, ఎల్‌కేజీలూ, యూకేజీలూ అంటూ మూడేళ్ల వయసులోనే బడికి పంపాలి. వందలకు వందల ఫీజులుకట్టాలి.
అసలు ఆ రోజుల్లో మా ఇంట్లో రేడియో కూడా వుండేది కాదు!
ఇంట్లో అందరం నేలమీద పడుకునేవాళ్లం! ఏ ఫర్నీచరూ లేక ఇల్లంతా బోసిగా వుండేది.
అయినా అందరం ఎప్పుడూ సంతోషంగా వుండేవాళ్లం. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినిపిస్తూ వుండేవి.
కానీ, ఇప్పుడు...
మా ఇంట్లో ఒక్క రేడియోనే కాదు పెద్ద టూ ఇన్ వన్ వుంది. టీవీ వుంది. మిక్సీ వుంది. గ్యాస్ స్టౌ వుంది. ఫ్రిజ్ వుంది. డబుల్ కాట్ మంచాలున్నాయి. ఇవన్నీ ఎవరో పెడితే తేరగా వచ్చినవి కావు. పొదుపు చేసి, లోన్లు తీసి, వాయిదాల పద్ధతులు పాటించి, సొంతంగా... ఒక్కటొక్కటిగా కొనుక్కున్నవి. ఈమాత్రం లేకపోతే ఈ రోజుల్లో గుమస్తా బతుక్కి విలువుండదు.
ఇన్ని వున్నా జీవితంలో ఆనాటి సంతోషం మాత్రం మచ్చుకు కూడా కనిపించదు. ఎప్పుడూ దిగులూ, భారమైన ఆలోచనలే.
ఆర్థికంగా చూస్తే కార్మికుడికీ గుమాస్తాకీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. కానీ మానసికంగా మాత్రం కార్మికుడు కింది తరగతికిందకూ, గుమస్తా మధ్యతరగతి కిందకూ వస్తారు. వైట్ కాలర్ ఉద్యోగం కనుక పైన పటారం లోన లొటారం ఎక్కువ.
అట్లా అని నేనేమీ వృధా ఖర్చులు చేయను. నా జీతాన్ని మూడు భాగాలు చేస్తే ఒక భాగం ఇంటి అద్దెకీ, రెండో భాగం పిల్లల చదువులకీ పోతాయి. మూడోభాగంతో ఇల్లు గడుపుకోవాలి.
ఛిఛిఛీ...
ఒక చిన్న పిస్తోలు కొనడానికి ఇంత తర్జన బర్జనా?!
ఒక్కసారి నామీద నాకే అసహ్యం కలిగింది.
''నో...! రేపు ఎలాగైనా పిస్తోలు కొనాల్సిందే. ఇంకా తాత్సారం చేసి ఈ పసి మనసును మరింత గాయపర్చను'' అని దృఢంగా తీర్మానించుకున్నాను. అప్పుడు గానీ నా కంటి మీద కునుకు రాలేదు.
అయితే, తెల్లవారిన తరువాత మళ్లీ నాలో ఊగిసలాట మొదలయింది.
''సరే ఇప్పుడు పిస్తోలు కొంటాను. డెబ్భై కానీ వంద కానీ కొని పారేస్తాను! మరి ఇంతటితో వీడు ఆగిపోతాడా? రేపు ఇంకెవడో ఇంకేదో కొన్నాడని అదీ కొనివ్వమంటే...?! చదువు మీద కంటే ఈ షోకుల మీద మోజు పెరిగిపోతే...?! అప్పుడు వీడి భవిష్యత్తు ఏమైపోతుంది...?!''
అంతే సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ఇదిలా వుంటే ఎగ్జిబిషన్‌కు వెళ్లొచ్చిన మర్నాటినుంచీ మా వాడి ప్రవర్తనలో ఏదో మార్పొచ్చింది.
చాలా ముభావంగా వుంటున్నాడు. ఆడుకోడానికి అస్సలు వెళ్లడం లేదు.. పిస్తోలు మాట మళ్లీ ఎత్తలేదు. మా ఇంటి యజమాని కొడుకు కిటికీలోంచి తొంగి చూస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తూ, చివరికి తన గన్ ఇస్తాను రారా అన్నప్పటికీ స్పందించడం లేదు.
వాడి పరిస్థితి చూస్తే నాకే చాలా జాలేసింది.
ఓ రోజు వాడితో అన్నాను ''బాబూ నిశాంత్! పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా నాన్నా! ముందు బాగా చదువు! నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావంటే ఈసారి తప్పకుండా పిస్తోలు కొనిస్తాను. నవీన్ వాళ్ల పిస్తోలు కంటే మంచిది, ఖరీదైనది కొనిస్తాను. దాంతో వేసవి సెలవల్లో హాయిగా ఆడుకోవచ్చు. ఊరికే అనడం లేదురా ఈసారి నిజంగా కొంటాను. గాడ్ ప్రామిస్. సరేనా?''
''సరే డాడీ!'' అంటూ తల ఊపాడు వాడు.
వాడి మొహంలో కనిపించిన ప్రసన్నత నాకు చాలా రిలీఫ్ నిచ్చింది. వాడు నన్ను అర్థం చేసుకున్నాడు, నా మాటను నమ్మాడు. నా సమస్యకొక పరిష్కారం కూడా దొరికినట్టనిపించింది. ఇకనుంచీ వాడు ఏది కోరినా చదువుతో ముడిపెట్టాలి. దాని వల్ల వాడికి చదువుమీద మరింత శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలై పోగానే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్‌తో నిమిత్తం లేకుండా ఈసారి వాడికి ఖచ్చితంగా పిస్తోలు కొనివ్వాలని తీర్మానించుకున్నాను. మనసులోనే దానికి బడ్జెట్ కెటాయించేశాను.
రోజులు మామూలుగా దొర్లసాగాయి.
వాడు రోజూ సీరియస్‌గా చదువుకుంటున్నాడు.
పరీక్షలు అయిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. వాడు నిజంగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు.
నేనా రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చీ రాగానే ''డాడీ, నేను స్కూల్ ఫస్టొచ్చాను'' అంటూ గర్వంగా ప్రోగ్రస్ రిపోర్ట్ అందించాడు.
మార్కులు చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలిగింది. అన్ని సబ్జెక్టుల్లో తొంభైలపైనే, లెక్కల్లో అయితే వందకు వంద! ''వెరీ గుడ్ ... శభాష్...'' అంటూ వాడి భుజం తట్టాను.
అప్పటికే వాడు నా వంక రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. వాడి రెండు కళ్లల్లో రెండు పిస్తోళ్లు మెరుస్తూ కనిపించాయి నాకు!
ఒక్కసారి నా గుండె గతుక్కు మంది!
అది నెలాఖరు కాకపోతే సత్యప్రమాణంగా వాడికి అప్పటి కప్పుడు పిస్తోలు కొనిచ్చేవాణ్నే. కానీ నెలాఖరవడంతో ఇంట్లో చేతి ఖర్చులకు కూడా ఇబ్బందిగా వుంది. అప్పటికే రెండు మూడు చోట్ల చిన్న చిన్న అప్పులు కూడా చేశాను. ఎట్లాగబ్బా అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను. షరా మామూలే. భావరహితమైన మొహంపెట్టి తనో నిమిత్త మాత్రురాలినన్నట్టు నిలబడివుంది. కష్టంలో వున్నప్పుడు కనీసం చిన్న మాట సాయమైనా చేయొచ్చు కదా...ఛ ఛ అనుకుంటూ-
గత్యంతరం లేక ''చూడు నాన్నా! నాల్రోజుల్లో ఫస్ట్...నాకు జీతం దొరుకుతుంది. ఆరోజు తప్పకుండా నీకు పిస్తోలు కొనిస్తాను సరేనా?'' అన్నాను. వాడు సరే అన్నట్టు తల ఊపాడు. పెద్దగా డిజప్పాయింట్ అయినట్టు కనిపించలేదు. వాడికి మరింత భరోసా కల్పించేందుకు నేను మా ఆవిడతో ''ఇదిగో ఫస్ట్‌నాడు సాయంత్రం నిశాంత్‌ని తీసుకుని నువ్వు మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసెయ్. మనం అట్నుంచి అటే కోఠీకి వెళ్దాం. ఏమంటావు?'' అన్నాను. అప్పటికీ ఆవిడ నోరు విప్పకుండా సరేనని తల మాత్రం ఊపింది. అదే మహాభాగ్యం అనుకున్నాను.
''డాడీ రేపు మా స్కూల్ డే! పేరెంట్స్‌ని తప్పకుండా తీసుకుని రావాలన్నారు మా క్లాస్ టీచర్. ఇదిగో ఇన్విటేషన్ కూడా ఇచ్చారు'' అంటూ కార్డు అందించాడు.
వాడి చేతుల్లోంచి ఇన్విటేషన్ కార్డు అందుకున్నాను.
స్కూల్ డేకి మేం సకుటుంబంగా తరలి వెళ్లాం.
ఆడిటోరియం అంతా పిల్లలతో పెద్దలతో కళకళలాడుతోంది. ముందు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, జరిగాయి. ఆ తరువాత సభా కార్యక్రమం మొదలయింది. ఆటలపోటీల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో విజేతలకు, క్లాసులో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్న పిల్లలకు సర్టిఫికెట్లతో పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు.
పిల్లలంతా పేర్లు పిలవగానే ఉరుకులు పరుగులమీద వెళ్లి స్టేజి ఎక్కి బహుమతులు తెచ్చుకుంటున్నారు. అంతా కోలాహలంగా వుంది.
ఉన్నట్టుండి '' మాస్టర్ నిశాంత్! సెకండ్ క్లాస్... ఫస్ట్ ర్యాంక్ '' అంటూ మావాడి పేరు మైకులో ప్రతిధ్వనించింది.
అంతవరకూ మా పక్కన స్తబ్దుగా కూచున్న వాడల్లా దిగ్గున లేచి స్టేజివైపు చకచకా పరుగులాంటి నడకతో వెళ్లాడు. మాకు చాలా గర్వంగా అనిపించింది. వాడు సర్టిఫికెట్‌ని, బహుమతిని అందుకుంటుంటే అందరితో పాటు నేనూ మా ఆవిడా చాలా గట్టిగా చప్పట్లు కొట్టాం. మా చిన్నాడైతే వాళ్ల అన్నయ్య సీటు దగ్గరకు తిరిగి వచ్చేంత వరకు రెండు చేతులూ ఆడిస్తూనే వున్నాడు.
నిశాంత్ తనకొచ్చిన బహుమతిని వాళ్ల అమ్మకీ, సర్టిఫికెట్‌ని నాకూ అందించాడు. నేను సంతోషంగా వాడితో కరచాలనం చేశాను. వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను.
ఇంటికి చేరీ చేరగానే అందరం ఆదుర్దాగా బహుమతి ఏమై వుంటుందా అని గబగబా బాక్స్‌ని ఓపెన్ చేశాం.
దాన్ని చూసే సరికి నాకు ఒక్కసారి షాక్ తగిలినట్టయింది!
మా బాబు ఎన్నాళ్లుగానో కోరుతున్న బొమ్మ పిస్తోలు!!
''హాయ్... డాడీ...పిస్తోలు...!'' అనందం పట్టలేక గట్టిగా కేక వేశాడు నిశాంత్. ''సరిగ్గా నాకు ఇలాంటిదే కావాలనుకున్నాను..'' అన్నాడు.
నాకంతా 'కలయో వైష్ణవ మాయయో..' అన్నట్టుగా వుంది. నేను ఆ థ్రిల్ నుంచి తేరుకోకముందే... మా చిన్నాడు హఠాత్తుగా ఆ పిస్తోలును అందుకుని ''అమ్మా... నాది..' అంటూ లోపలికి పరుగు తీశాడు.
''ఒరేయ్ నిఖిల్! ఒక్క సారి చూడనీరా.. ప్లీజ్‌రా..'' అని ప్రాధేయపడుతూ తమ్ముడి వెంటపడ్డాడు నిశాంత్.
అయినా మా చిన్నాడు పిస్తోల్‌ని ఇవ్వకుండా రెండుచేతులా తన గుండెకు అదిమి పట్టుకున్నాడు. ఆ వెంటనే మా ఆవిడ కోపంతో వెళ్లి మా చిన్నాడి వీపు మీద ఒక్కడి చరచి వాడి చేతుల్లోంచి బలవంతంగా పిస్తోలు లాక్కుని మా పెద్దాడికిచ్చింది. ''అన్నయ్య కష్టపడి చదివి సంపాదించుకుంటే నాదంట నాది. బుద్ధిలేకపోతే సరి...'' అంటూ వాడిమీద కేకలేసింది.
దాంతో మా చిన్నాడు ఒక్కసారి ఏడుపు లంకించుకున్నాడు.
తన మూలంగా తమ్ముడి వీపు చిట్లడంతో మా పెద్దాడి మనసు కరిగిపోయింది. వాడు జాలిగా ''పోన్లే మమ్మీ, ఇది తమ్ముడికే ఇచ్చేయ్... నేను థర్డ్ క్లాస్‌లో కూడా ఫస్ట్ ర్యాంక్‌లో పాసవుతాను.... అప్పుడు నాకు ఇంకో పిస్తోల్ ఇస్తారు కదా.... దాన్ని నేను వుంచేసుకుంటాలే...'' అంటూ తన చేతిలోని పిస్తోలును తమ్ముడికి అందించాడు.
వాడి మాటలు నాకు శరాఘాతాల్లా తగిలాయి. ఎక్కడో గుండెలోతుల్లో కలుక్కుమన్నట్టయింది.
అది అంతులేని సంతోషమో...నా అసమర్ధత వల్ల కలిగిన దుఃఖమో తెలీదు కానీ ఈసారి భోరుమనడం నా వంతయింది!
---
( ఆర్టీసీ ప్రస్థానం, మాస పత్రిక మార్చి 1991 సౌజన్యంతో )
(ఎపిఎస్‌ఆర్‌టిసి ఆర్ట్స్‌కో నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథఇది. ఆతదనంతరం ఇదే పేరుతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రేడియో నాటికగా కూడా ప్రసారమైంది.) ....
Tuesday, January 6, 2009
సజీవ చిత్రం ... ( మినీ కథ )
(స్వాతి సపరి వార పత్రిక నిర్వహించిన మినీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ యిది.)
చక్రవర్తి గారికి-
గతవారం కళాభవన్‌లో మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూశాను. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అప్పుడు వీలుపడలేదు. అందుకే ఈ ఉత్తరం.
మీ చిత్రాలని చూసింతరువాత నాకు అనిపించిందేమిటంటే - మీ కుంచెకు నైపుణ్యం వుంది తప్ప లక్ష్యం లేదని!
కనీసం ఒక్క పెయింటింగ్‌లోనైనా సమకాలీన సమాజం చోటుచేసుకోకపోవడం విడ్డూరంగా తోచింది. ఆర్ట్ అంటే అందమనీ, ఆందమంటే ఆడవాళ్ల ఒంపుసొంపులనీ మీరు పొరబడుతున్నట్టున్నారు. మీరు చిత్రించిన ఆ అతివలైనా ఊహాలోకంలో తప్ప, వాస్తవిక ప్రపంచంలో ఎక్కడా కనిపించరు!
'ది వాల్యూ ఆఫ్ ఆర్ట్ ఈజ్ నాట్ బ్యూటీ, బట్ రైట్ యాక్షన్' అన్నాడు సోమర్‌సెట్ మామ్. అంచేత, ఇకనుంచైనా మీ చుట్టూ వున్న పరిసరాలని సునిశితంగా పరిశీలించండి. సజీవ చిత్రాలు వేసేందుకు ప్రయత్నించండి. అప్పుడే మీ ప్రతిభ సార్థకమవుతుంది! లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
శుభాకాంక్షలతో
-మీ శ్రేయోభిలాషి
ఆ ఉత్తరంలో ఒక్కో వాక్యం ఒక్కో డైనమైట్‌లా చక్రవర్తి గుండెల్లో పేలింది.
నిజానికి అతను ప్రొఫెషనల్ ఆర్టిస్టేం కాదు. చిన్నప్పటినుంచీ చిత్రకళని ఏదో హాబీగా ప్రాక్టీస్ చేశాడంతే. నాలుగు గోడలకే పరిమితమైన అతని కళని మిత్రులే బలవంతంగా నలుగురి మధ్యకు తీసుకెళ్లారు. ఆ మొట్టమొదటి ప్రదర్శనకే అనూహ్యమైన స్పందన వచ్చింది.
లబ్దప్రతిష్టులైన ఆర్టిస్టులు కూడా అతని టాలెంట్‌ని గుర్తించి మెచ్చుకున్నారు. పత్రికలు సచిత్ర వార్తా కథనాలు ప్రచురించి ప్రోత్సహించాయి. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కానీ ఇంతలోనే ఈ హఠాత్పరిణామం!
తను నిజంగా రాంగ్ రూట్‌లో వెళ్తున్నాడా? తనవి నిర్జీవ చిత్రాలా??
చక్రవర్తిలో అంతర్మథనం మొదలయింది. పూర్తి కావస్తున్న తన కొత్త పెయింటింగ్‌ని మరోసారి పరిశీలనగా చూసుకున్నాడు.
పచ్చని తివాచీ పరచినట్టున్న మైదానం...
ఆకాశంలో దట్టమైన మేఘాలు...
మైదానం రెండు చివర్లను తాకుతున్నట్టుగా ఇంద్ర ధనుస్సు...
ఆ ఇంద్ర ధనుస్సుపై ఒంటి మీద నూలు పోగైనా లేకుండా విద్యుల్లతలా వెనక్కి వంగి హొయలు చిందిస్తున్న ఓ పడుచు పిల్ల...!
సరిగ్గా ఆమె నాభి ప్రాంతంలో మబ్బుల్ని చీల్చు కుంటూ కొంటెగా తొంగి చూస్తున్న మీసాల సూర్యుడు...
నింగి నుంచి నేలకు రాలుతున్న కవచకుండలాలు...!!
ఆ పెయింటింగ్ పేరు ''కుంతి'' !!!
మొదలు పెట్టినప్పుడు ఎంతో గొప్పగా అనిపించిన ఐడియా ఇప్పుడు నిజంగానే అబ్సర్డ్‌గా అనిపిస్తోంది. ఇలాంటి చిత్రాల వల్ల ప్రయోజనం ఏమిటి? అజ్ఞాత విమర్శకుడు తన చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తున్నాడు. కుర్చీలోంచి అసహనంగా లేచాడు చక్రవర్తి.
కాసేపు డ్రాయింగ్ రూంలో అటూ ఇటూ పచార్లు చేశాడు. ఆ తరువాత సమాధానం వెతుక్కుంటూ రోడ్డెక్కాడు.
పిచ్చిగా వీధులన్నీ తిరిగాడు.
సైకిళ్లు, స్కూటర్లు, కార్లు, బస్సులు...వాటి హారన్ మోతలు. ఎవరో తరుముతున్నట్టు ఉరుకులు పరుగులు తీస్తున్న జనం... చిత్రించడానికి ఈ సమాజంలో ఏముందిగనక?!
కాళ్లు పీకుతుంటే నీరసంగా దారిపక్క బస్ షెల్టర్‌లోని సిమెంట్ చప్టాపై కూలబడ్డాడు.
అంతలో ఓ బిచ్చగాడి అరుపు వినిపించింది. '' బాబూ పది పైసలు ధర్మం చేయండి బాబూ..!''
అసలే అసహనంతో వున్న చక్రవర్తికి చిర్రెత్తినట్టయింది. ''వెళ్లెళ్లు...ఓ వేళాపాలా లేకుండా ఎక్కడపడితే అక్కడ తయారవుతారు.'' ఈసడించుకుంటూనే అప్రయత్నంగా ఆ బిచ్చగాడివంక చూశాడు.
అంతే...!
అతని చూపులు అట్లాగే నిలిచిపోయాయి.
చింపిరి జుట్టు ... బైరి గెడ్డం ... గుంట కళ్లు ... ముడతలు పడ్డ చర్మం ...వయో భారంతో, దారిద్య్రంతో కృశించిపోయిన శరీరం...
చాలా ''ఆర్టిస్టిక్'' గా వున్నాడు బిచ్చగాడు.
''హమ్మయ్య తనకు సమాధానం దొరికింది. ఈ దెబ్బతో తన శ్రేయోభిలాషి అదిరిపోవాల్సిందే...'' అనుకున్నాడు చక్రవర్తి. ''పది పైసలకు నీ ఆకలి తీరుతుందా తాతా?! మా ఇంటికి రా...నీకు కడుపునిండా భోజనం పెడతాను...'' స్వరం మార్చి ఆప్యాయంగా అన్నాడు.
బిచ్చగాడు అతని వంక అనుమానంగా చూశాడు.
''నిజం తాతా! నవ్వు భోజనం చేశాక ఓ గంట కూర్చున్నావంటే నీ బొమ్మ గీసుకుంటాను. రా..ఈ పక్కనే మా ఇల్లు..'' అతనికి భరోసా కల్పిస్తూ చేయిపట్టుకుని మరీ చెప్పాడు.
బిచ్చగాడిని సరాసరి ఇంట్లోకి తీసుకొస్తున్న భర్తని చూసి నిర్ఘాంతపోయింది చక్రవర్తి భార్య.
''నేను గీయబోయే సరికొత్త సజీవ చిత్రానికి మాడల్ ఈ తాతే...! టైం లేదు. త్వరగా భోజనం వడ్డించు...'' అన్నాడు చక్రవర్తి.
ఆమె ఒక క్షణం తటపటాయించినా ఆ తరువాత మారు మాట్లాడకుండా పళ్లెంవేసి వడ్డించింది.
తమ ఇద్దరి కోసం చేసిన కోడి పలావును ఆ ముసలివాడు ఒక్కడే ఆవురావురు మంటూ లాగించేశాడు.
ఆ తరువాత చక్రవర్తి ఆ ముసలివాడిని డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్లి ఓ బెంచి మీద యోగి వేమన టైపులో కూచో బెట్టాడు. మహోత్సాహంగా చిత్రరచనకు కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమైపోయాడు. అంతా పూర్తయ్యాక చూస్తే ఏముంది-
సుష్టుగా భోంచేసిన బిచ్చగాడికి నిద్రముంచుకొచ్చినట్టుంది. బెంచి మీద అ ట్లాగే గుర్రు పెడ్తున్నాడు.
''తాతా... తాతా...! లే..లే..'' అంటూ అసహనంతో తట్టిలేపాడు చక్రవర్తి.
బిచ్చగాడు విసుగ్గా లేచి ఆవులించి అంతలోనే సర్దుకుని వినయంగా ''వోరం దినాల నుంచీ కడుపుకు తిండీ, కంటికి కునుకు లేదు బావూ..! అందుకే నిద్రకు ఆగలేకపోతున్నాను. ఇయ్యాల్టికి నన్నొగ్గేయండి. రేపు పెందరాలే వస్తాను. మీరు ఎంతసేపంటే అంతసేపు కదలకుండా కూకుంటాను'' అన్నాడు.
చేసేదేంలేక ''సరే. రేపు మూడు పూటలూ నీ భోజనం ఇక్కడే...! ఇదిగో ఈ వంద వుంచు. నీ బొమ్మ గీయడం పూర్తయ్యాక ఇంకో వంద రూపాయలిస్తాను. సరేనా? పొద్దున్నే రావాలి మరి...'' అన్నాడు చక్రవర్తి వంద నోటు అందిస్తూ.
బిచ్చగాడు అబ్బురపడిపోతూ ఆ నోటుని అందుకున్నాడు. ''అ ట్లాగే బావూ. తెల్లవారగానే లగెత్తుకొస్తాను'' అని దండాలు పెడుతూ వెళ్లిపోయాడు.
ఆ మర్నాడు చక్రవర్తి ఉదయం నుంచే వాడు ఎప్పుడు వస్తాడా, సజీవ చిత్రాన్ని ఎప్పుడు మొదలెడదామా అని ఉబలాటపడిపోతూ వరండాలోనే కూర్చుండిపోయాడు.
తెల్లారి చాలాసేపయినా వాడి జాడ కనిపించకపోవడంతో చక్రవర్తిలో టెన్షన్ పెరిగిపోయింది.
ఎనిమిది కావస్తుండగా ఓ నడి వయస్సు వ్యక్తి ''దండాలు బావూ'' అంటూ గేటు తీసుకుని లోపలికి వస్తూ కనిపించాడు.
చక్రవర్తి అయోమయంగా చూస్తూ ''ఏయ్ ఎవరు నువ్వు?!'' అని అడిగాడు.
''అదేటి బావూ...నిన్న తమరు నా బొమ్మ గీత్తానని నాకు వంద రూపాయలు యిచ్చారు. అప్పుడే మర్చి పోయారా?
బొమ్మ బాగా రావాలని మీ రిచ్చిన డబ్బుతో సుబ్బరంగా చవరం చేయించుకుని, గెడ్డం గీయించుకుని, తానం చేసి కొత్త బట్టలు యేసుకుని ఇలాగొచ్చేను. అందుకే కూసింత ఆలస్యమైపోయింది. చమించండి బావూ....'' అంటూ ఆ బిచ్చగాడు చెప్పుకుపోతుంటే-
చక్రవర్తికి నోట మాట రాలేదు,,,!
(స్వాతి 21-3-1997 సౌజన్యంతో )
Saturday, January 3, 2009
నెట్జనుల 'ఉయ్యాల' లో మరో కొత్త బ్లాగు...!
ఎందరో మహానుభావులు ... అందరికీ వందనములు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2009 ఆగమన వేళ అందరి ఆశీస్సులను కోరుకుంటూ నా అక్షరాలకు అంతర్జాల ''డోలారోహణం'' చేస్తున్నాను. ఆశీర్వదించండి.
బ్లాగును ప్రారంభించడం అంటే 'పెట్టుబడి లేకుండా సొంతంగా ఒక పత్రికను పెట్టుకోవడం....
లేదా వ్యక్తిగత డైరీని బహిరంగంగా రాసుకోవడం' అనుకుంటున్నాను.
అప్పుడెప్పుడో 'ఈనాడు' ఆదివారం అనుబంధంలో వచ్చిన ప్రత్యేక కథనం ద్వారానే నాకు మొట్టమొదటి సారి తెలుగు బ్లాగుల ప్రపంచం గురించి, కూడలి, జల్లెడల గురించి తెలిసింది.
అంతర్జాలం అందుబాటులో లేక అడపాదడపా తెలుగు బ్లాగులను చూసేవాణ్ని.
ఆతరువాత బ్లాగులను నిర్వహించడం ఎలాగో, యునీకోడ్ అంటే ఏమిటో తెలియకపోయినా 'హైదరాబాద్ బుక్ ట్రస్ట్' వారి బ్లాగును నిర్వహించాల్సిరావడంతో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాను. (నాకు ఇప్పటికీ హెచ్‌టిఎంఎల్, జావా, ఆర్‌టిఎస్, లింకులు గట్రా బొత్తిగా తెలియవు).
ఖర్చులేని పని కాబట్టి పనిలో పనిగా నా ఈ బ్లాగును (వ్యక్తిగత పత్రిక అనొచ్చునేమో) కూడా ప్రారంభిస్తున్నాను.
తదుపరి టపాలు స్వాతి సపరివార పత్రికలో ప్రథమ బహుమతి పొందిన నా మినీ కథ ''సజీవ చిత్రం''తో శ్రీకారం చుడతాను.
అంతవరకు నా దృష్టిలోకి వచ్చిన ఈ పూతోటలో సరదాగా విహరించండి.
అన్నట్టు ఈ పూతోటను మీకు మీరే సృష్టించుకోవలసి వుంటుంది. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఓ పూల మొక్క ప్రత్యక్షమవుతుంది.
అట్లాగే దీనికి మాతృక అయిన ఈ వెబ్ సైట్‌లోని ''ఫ్లాష్ లాబరేటరీ''లోకి వెళ్తే మరెన్నో ఆసక్తికరమైన ఫ్లాష్ చిత్రాలను చూడవచ్చు.
మీ
ప్రభాకర్ మందార
Subscribe to:
Posts (Atom)